‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
– గన్నవరపు నరసింహమూర్తి
ఒకరోజు మేము కాలేజీకి వెళ్లేసరికి కాలేజ్‌లో బుక్ ఫెస్ట్ జరుగుతుండడం వల్ల సెలవిచ్చేసారు. మా ఊరు తిరిగి వెళ్లాలంటే మళ్లీ సాయంత్రమే బస్సు. అంతవరకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.. అప్పుడు సమీర ‘‘వంశీ… ఇక్కడకు దగ్గర్లో జలపాతం ఉందట… వెళదామా!’’ అని అడిగింది. నేను వెంటనే ఆటో పిలిచాను. ఇద్దరం అందులో జలపాతం దగ్గరకు బయలుదేరాము. అది అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో, అడవి మధ్యలో ఉంది. కొద్ది నిమిషాల తరువాత మేము ఆ జలపాతం దగ్గరకు చేరుకున్నాము. ఆటోవాడిని అక్కడే ఉండమని చెప్పి మేమిద్దరం జలపాతం దగ్గరకు వెళ్లాము.
చుట్టూ పచ్చటి అడవి. – మధ్యలో పాపిడిలా రహదారి..- దూరంగా జలపాతపు హోరు వినిపిస్తోంది. చెట్ల మీద వందల పక్షులు ఎగురుతూ కనిపిస్తున్నాయి. వాటి కిలకిలా రావాలతో అడవంతా సందడిగా ఉంది. దూరంగా కోకిల కలకూజితం ఆగి ఆగి వినిపిస్తోంది.. చూడటానికి అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తోంది.
‘‘ఆకాశం రాగ రంజితం
అడవి కోకిల కలకూజితం
కిలకిల రావాలు కీరవాణి రాగాలు’’ లా ఉంది అక్కడి వాతావరణం. కొద్దిసేపటికి జలపాతాన్ని చేరుకున్నాము. దూరంగా కొండ మీద నుంచి ఉరుకుతున్న జలధార తలమీద నుంచి నుదుటి మీదకు పడే పాపిడి చేరులా కనిపిస్తోంది. మీద నుంచి కిందకు పడుతున్నప్పుడు హోరుమన్న శబ్దం నేపథó్య సంగీతంలా వినిపిస్తోంది.
సమీర ఆ అందమైన దృశ్యాన్ని దూరం నుంచి చూసి ఆశ్చర్యానికి లోనైంది.
ఆమెను చూసి నేను కూడా ఆ జలధారని వీక్షించసాగేను. కాలేజీలకు సెలవు కావడంతో అప్పటికే అక్కడ చాలామంది విద్యార్థినీ విద్యార్థులు కేరింతలు కొడుతూ కనిపించారు. చాలా మంది జలపాతం కింద అరుస్తూ స్నానాలు చేస్తున్నారు…
ఇద్దరం దగ్గరకు చేరుకున్నాము. ఇప్పుడు జలధార హోరు జోరు పెరిగింది. ఎత్తు నుంచి రాళ్ల మీద పడుతున్న జలపాతం నురుగుగా రూపాంతరం చెంది ప్రవాహంగా పరిణామం చెందుతూ పరుగులు పెడుతోంది. సమీర ఒక్కసారిగా చిన్నపిల్లగా మారిపోయి జలకాలాటలు ఆడటం మొదలుపెట్టింది.
జలధార రాళ్లను ముద్దాడి నీటి తుంపరులుగా మారుతున్నప్పుడు సప్తవర్ష మిశ్రమ ఇంద్రధనుస్సు ఆ లోయలో ఆవిష్కారమవుతోంది. అంత ఎత్తు నుంచి లోయలోకి జారుతున్న జలపాతాన్ని చూస్తుంటే నాకు
‘‘ఆకాశంబు నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు / శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గం / గా కూలంకష! పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్’’
అన్న ఏనుగు లక్ష్మణ కవి పద్యం గుర్తుకు వచ్చింది.
సమీర ఆనందంగా ఆ ఎగిసిపడుతున్న జలధారలో తడుస్తూ నన్ను కూడా రమ్మనమని అడిగింది. కానీ సున్నిహితంగా తిరస్కరించాను. కొద్దిసేపటి తరువాత ఆమె నా దగ్గరకు వచ్చి ‘‘బట్టలు తడిసిపోయాయి, ఏం చెయ్యాలి?’’ అంది ముఖాన్ని తుడుచుకుంటూ…
‘‘మరి జలపాతం కిందకు వెళితే తడిసిపోవా? మనం ముందే అనుకొని ఇక్కడికి రాలేదు. మార్చుకోడానికి బట్టలు కూడాలేవు. పద.. దూరంగా ఆ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం. ఓ గంట తరువాత అవే ఆరిపోతాయి’’ అన్నాను ఆ చెట్టు వైపు నడుస్తూ. సమీర బట్టలు పిండుకుంటూ నా వెనకాలే వచ్చింది.. ఆమె మొహమాటపడుతుందనీ నేను ఆమె వైపు చూడకుండా చెట్టు కింద ఉన్న బండరాయి మీద కూర్చున్నాను. కొద్దిసేపటికి ఆమె కూడా వచ్చి ఎదురుగా ఉన్న రాయి మీద కూర్చుంది..-
దూరంగా జలపాతపు హోరు వినిపిస్తోంది. స్నానాలు చేస్తున్న కుర్రాళ్ల అరుపులు మధ్య మధ్యలో వినిపిస్తున్నాయి.
‘‘చలేస్తోందా?’’ అని అడిగానామెను.
‘‘కొద్దిగా … ఇప్పుడు తగ్గింది’’.
‘‘ఇలా మనం ఇక్కడికి వచ్చినట్లు మీ నాన్నకు తెలిస్తే కోప్పడతాడా?’’ అని అడిగాను.
‘‘ఎలా తెలుస్తుంది? చెబితే మనిద్దరమే చెప్పాలి. అది జరగదు కదా?’’ అంది నవ్వుతూ…
‘‘ఇంటర్ తరువాత ఏం చేద్దాం అనుకుంటు న్నావు?’’ మా ఇంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చెయ్యమంటున్నారు.
‘‘వాళ్లు సరే ..నీకేం చదవాలని ఉంది?’’
‘నాకైతే ఏ బి.ఏనో, బీకామో చదవాలని ఉంది కానీ నా మాట ఎవరు వింటారు చెప్పు?’
‘‘నువ్వు గట్టిగా నిలబడితే ఎందుకు వినరు? వాళ్లు చెప్పింది చదివితే ఎలాగ? నీకంటూ ఓ అభిప్రాయం ఉండొద్దా ? నీకు కావాలసింది చదువు. అప్పుడు చదువుని ఎంజాయ్ చెయ్యవచ్చు. లేకపోతే జీవితాంతం బాధపడాలి. అయినా మీ వాళ్ళు అదే ఎందుకు చదవమంటున్నారు?’’ అన్నాను.
‘‘ఈ కాలంలో అందరూ సాఫ్ట్‌వేర్ చదివి అమెరికాకు వెళ్లిపోతున్నారు కదా? మా వాళ్లు కూడా నన్ను అక్కడికి పంపిద్దామనుకుంటున్నారు’’…
‘‘వాళ్లకి సరే… నీకు ఇంట్రస్టు ఉందా?’’
‘వంశీ! అన్నీ తెలిసీ మళ్లీ ఇలా అడుగుతావేంటి? మా నాన్నను కాదనీ నేనేమైనా చెయ్యగలనా చెప్పు? నీలా నాకు ఇండివిడ్యుయాలిటీ లేదు..- అంత ధైర్యం కూడా నాకు లేదు’’ అంది… ఆమె మాట్లాడుతుంటే ఆ గొంతులో నిరాశ ధ్వనించింది’…
‘మరి నీకు అమెరికా వెళ్లి చదవడం ఇష్టమేనా?’
‘ఆ విషయం నేనింకా ఆలోచించలేదు..’
‘‘మరీ గిరి గీసుకొని కూర్చోడం కంటే ప్రపంచాన్ని తెలుసుకుంటే మంచిది… కేవలం చదువంటే పాఠ్య పుస్తకాలే కాదు. రకరకాల పుస్తకాలు చదవచ్చు. మన లైబ్రరీలో బోలెడు పుస్తకాలు. పేపర్లు ఉన్నాయి. వాటిని చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. హిందూ పేపరు రోజూ చదివితే ఇంగ్లీషు మీద మంచి పట్టుతో పాటు ప్రపంచంలోని అనేక విషయాలు తెలుస్తాయి. నేను పదవ తరగతికి వచ్చేసరికి మన తెలుగు సాహిత్యంలో బోలెడు మంచి పుస్తకాలు చదివాను. దానికి కారణం మానాన్నగారు. ఆయనకి పుస్తకాలంటే గొప్పిష్టం. నాకూ అదే అలవాటు చేశారు’’ అన్నాను.
‘‘ఇంట్లో క్లాసు పుస్తకాలు తప్ప ఏం చదివినా నాన్నగారూ కోప్పడతారు. మొన్నొకసారి పేపరు చదివితినే బాగా కోప్పడ్డారు’’ అంది.
‘‘మన స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ ఉపా ధ్యాయులు ఏం చెబుతున్నారు చెప్పు? ఎంతసేపూ పాఠాలు, సూత్రాలు, ముఖ్యమైన ప్రశ్నలు..ఇవే కదా? ఎవరైనా మూలాలు చెబుతున్నారా? మన చదువులు కేవలం మార్కుల కోసం, ఉద్యోగాలు సంపాదించ డానికే పనికొస్తాయి కానీ జ్ఞానం కోసం కాదు.. చదువైపోయిన తరువాత మన ఉద్యోగాల్లోనో, డబ్బు సంపాదన మీదో ధ్యాస పెడతాము. అప్పుడే జ్ఞానం కావాలన్నా రాదు. అందుకే ఇప్పడే మనం చదవాలి. పాఠ్య పుస్తకాలైనా మూలాలు చదవాలి. ఉదాహరణకు పైథాగరస్ సిద్ధాంతం, ట్రిగోనామెట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటివి. ఫార్ములాలు కాకుండా క్షుణ్ణంగా చదవాలి’’ అన్నాను…నా మాటలకు సమీర ముఖం చిన్నబోయింది.
‘‘నువ్వు ఏ పుస్తకాలు చదివావు’’
‘‘నేను విశ్వనాథవారి ‘వేయిపడగలు’, శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’… ఇలా కొన్ని మంచి పుస్తకాలు చదివాను. అలాగే ఖాళీ ఉన్నప్పుడు పొలంలో కూర్చొని మన టెక్స్టబుక్స్ క్షుణ్ణంగా చదువుతాను.. దానివల్ల నాకు చాలా మేలు జరిగింది’’ అన్నాను.
‘‘నేను కూడా వాటిని, పేపర్లు చదవటానికి ప్రయత్నిస్తాను, ముఖ్యంగా ఇంగ్లిష్ పేపరు చదువుతాను’’ అంది నవ్వుతూ,
‘‘సరే … పద! టైమైపోయింది. ఆలస్యం అయితే బస్సు దొరకదు’’ అంటూ లేచాను.
ఇద్దరం ఆటోలో బస్టాండుకి వచ్చాము. అప్పటికీ మా ఊరు బస్సు సిద్ధంగా ఉంది. మా ఊరు వెళ్లేసరికి 5 గంటలైంది.
(సశేషం)