నా పేరు వంశీధర్! అందరూ వంశీ అనీ పిలుస్తారు. సివిల్ ఇంజనీరింగ్‌లో జే•యేన్‌టీయూ నుంచి డిగ్రీ చేసాను. నా స్నేహితులందరూ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేస్తే నేను మాత్రం పాతకాలపు సివిల్ ఇంజనీరింగ్‌లో చెయ్యడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.
నేను మా ఊళ్లో పదవ తరగతి దాకా చదివి ఆ తరువాత దగ్గరలోని చిన్న పట్నంలో ఇంటర్ చదివాను. పదవ తరగతి చదువుతున్నప్పుడు నాకు నలుగురు స్నేహితులుండేవారు. వాళ్లు సమీర, మధు, శ్రీరామ్. సమీరది మా ఊరే. మా మేనమామ కూతురు. మధు, శ్రీరామ్‌లవి పక్క ఊళ్లు. మా నలుగురికీ పదవ తరగతిలో ప్రథమశ్రేణి రావడంతో మేమంతా కలిసి ఒకే కాలేజీలో ఇంటర్ చదివాం. అందరం ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాం.
పదవ తరగతి దాకా సాదాసీదాగా సాగిన మా జీవితం ఇంటర్లో చేరిన తరువాత ఒక నూతనత్వాన్ని సంతరించుకుంది. దానికి కారణం మా కాలేజీ లెక్చరర్లు. ముఖ్యంగా ఇంగ్లీషు లెక్చరర్ అనంతరాం గారు. ఆయన మాకు హీమాన్… హీరోలా కనిపించే వారు. ఎఫ్పుడు ఇస్త్రీ నలగని బట్టలతో, టక్, టైతో చాలా హుందాగా ఉండేవారు.
ఆయన ‘మర్చెంట్ ఆఫ్ వెనీస్’ నాటకాన్ని అద్భుతంగా చెప్పేవారు. టెనిసన్, వర్డస్‌వర్త్‌ల పోయిట్రీ కూడా అంతే బాగా చేప్పేవారు. అలాగే తెలుగు లెక్చరర్ సుబ్రహ్మణ్యశర్మ గారు. పద్యభాగాన్ని అద్భుతంగా చేప్పేవారు.
‘‘అటజని గాంచె భూమి సురుడంబర చుంబి
శ్విరస్సర జ్ఘరీ పటల ముహుర్ముహుర్లుట ధభంగ తరంగ
మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్లవ కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీత శైలమున్’’
అన్న మనుచరిత్రలోని పెద్దన పద్యాన్ని ఎంతో హృద్యంగా ఆలపిస్తూ వర్ణిస్తూ దాని అర్థ్ధాన్ని చెప్పేవారు. చిన్నప్పట్నుంచీ నాకు పద్యాలంటే బాగా ఇష్టం. దానికి కారణం మా ఊళ్లో చూసిన పౌరాణిక పద్య నాటకాలు. ప్రతి శివరాత్రికీ నాటకాలు పెట్టేవారు. పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు లాంటి గొప్ప నటులు శ్రీకృష్ణరాయబారం, హరిశ్చంద్ర, గయోపాఖ్యానం లాంటి నాటకాలాడే వారు. ఆ నాటకాలు చూడటం వల్ల మాకు పద్యాలు కంఠోపాఠం అయ్యేవి.
వేమన పద్యాలు, సుమతీ శతకం, రంగస్థల పద్యాలు, ఇలా మా నోటి వెంట చాలా పద్యాలు అలవోకగా పలికేవి. ఇంటర్లో సెలవులకు మా ఊరు వచ్చినపుడు చాలా ఆనందంగా గడిచేది.
ఇంతకీ మా పల్లె గురించి మీకు చెప్పలేదు కదూ! అది ఏటి ఒడ్డున ఒదిగి ఉండే ఓ అందమైన, అమాయకమైన పల్లె. అందులో మాది అగ్రహారం వీధి. మా పెరట్లోనే ఏరు. తూర్పు వాహినిగా పారుతుంటుంది.
తెల్లవారిందంటే మేమంతా ఏటి ఒడ్డునే ఉండేవాళ్లం. కబాడీ, కోకో, వాలీబాల్ ఆటలు ఆ ఒడ్డునే ఆడేవాళ్లం. ఆటల తరువాత ఏట్లో స్నానం చేసి ఇంటికి వచ్చేవాళ్లం. వర్షాకాలంలో ఏటికి బాగా నీరొచ్చేది. అప్పుడు గంటకి పైగా అందులో ఈత కొట్టేవాళ్లం. మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో మా నాన్న టీచర్‌గా పని చేసేవారు. పేరు శర్మ… మా మేనమామ రమణమూర్తి కూడా టీచరే.. ఆయన కూతురే సమీర… ఆమె పూర్తి పేరు మలయ సమీర.
ఆమె నా కన్నా సంవత్సరం చిన్న. తెలివైనదని నాలుగు నుంచి ఆరవ తరగతిలో చేర్పించాడు మా మామ. అందుకే నేనూ, సమీరా ఆమె చిన్నదైనా ఒకే క్లాసు చదివేవాళ్లం.
పదవ తరగతి దాకా మాకు చదువంటే పెద్దగా అవగాహన ఉండేది కాదు. ఏదో చదవాలి కాబట్టి చదివే వాళ్లం. వేసవి తరువాత పొలం పనులు మొదలయ్యేవి. నాకు చిన్నప్పట్నుంచీ వ్యవసాయం అంటే బాగా ఇష్టం. ప్రతీరోజూ మా రైతు నారాయణతో పొలానికి వేళ్లేవాణ్ణి.
మా పొలం దగ్గర పెద్ద చెరువు ఉండేది. దాన్నించే మా పొలాలకు పెద్ద బట్టి ద్వారా నీళ్లు వచ్చేవి. ఒక్కోసారి నేను ఆ చెరువు గట్టు మీదకు వెళ్లి అక్కడ చింతచెట్టు కింద చాలా సేపు కూర్చునే వాణ్ణి. బాగా వర్షాలు పడినప్పుడు చెరువు నిండు కుండలా ఉండేది. కనుచూపు మేరంతా నీరే. ఆ నీటి మీద తెల్లటి నీటి బాతులు, కొంగలు ఎగురు తుండేవి. అప్పుడప్పుడు మా రైతు నారాయణ చేపల కోసం అందులో దిగి వాటిని పట్టేవాడు.
అతడు, ‘బాబూ మీరు చేపలు తింటారా?’ అనీ నన్ను వెటకారం చేసేవాడు. వర్షాలు పడకపోతే చెరువు నిండేది కాదు. పంటలు పండేవి కావు. మేము జూలైలో వరి నారు, అంటే ఆకు పోసేవాళ్లం. అవి పెద్దదైన తరువాత నీరుంటే పొలాల్లో ఊడవాలి. వినాయక చవితి పండగప్పడు మా ఊరి రైతులంతా రోజూ వర్షం పడాలనీ దేముడికి దండాలు పెట్టేవారు. ఒక్కోసారి బాగా కరవొచ్చి వర్షాలు పడక పోతే బ్రాహ్మణులు ఏటి దగ్గర అభిషేకాలు చేసేవారు.
అభిషేకం చేసేరోజు మా చిన్నాన్న రామమూర్తి ఏటి ఒడ్డున ఉపవాసంతో విరాటపర్వం పారాయణ చేసేవాడు. అది పూర్తయ్యేసరికి, అంటే అర్జునుడి ఉత్తర గోగ్రహణం తరువాత వర్షాలు పడతాయనీ మా ఊరివాళ్ల నమ్మకం. ఒకోసారి యాదృచ్ఛికంగా వర్షం పడితే విరాటపర్వం పారాయణం, అభిషేకం వల్లే వర్షం పడిందనీ ఊళ్లో వాళ్లు చెప్పుకోవడం నాకు వింతగా తోచేది. చిన్నప్పట్నుంచీ నేను అలాంటి నమ్మకాలకు వ్యతిరేకం.
ఇంత ఏరు పారుతున్నా పొలాలకు నీళ్లు లేకపోవడం అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగేది… ఆ ఏటి నీటిని చెరువులోకి మళ్లిస్తే అన్న ఆలోచన కలిగేది. బహుశా ఇటువంటి ఆలోచనలే భవిష్యత్తులో నేను సివిల్ ఇంజనీరింగ్ చదవడానికి ప్రేరణ కలిగించాయేమో అన్న సంశయం నాకు కలుగు తుంటుంది.
పదవ తరగతిలో నేను, సమీర పోటీ పడేవాళ్లం. క్వార్టర్లీ పరీక్షల్లో ఆమెకు ఫస్ట్ వస్తే, హాఫ్ యర్లీలో నాకు వచ్చేది. అలా మా ఇద్దరి చదువు పోటా పోటీగా సాగేది. మధు, శ్రీరామ్‌లు కూడా బాగా చదివే వాళ్లు. ఎలాగైతేనేం పదవ తరగతిలో మేం నలుగురం ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యాము.
ఫలితాలొచ్చిన నాడు మా ఆనందం చూడాలి… మా అమ్మ లడ్లు చేసి ఊరందరికి పంచింది.
ఆ తరువాత మేం నలుగురం పక్కనే ఉన్న పట్నంలోని జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరాము. రోజూ అడ్డురోడ్డు దాకా నడిచి అక్కణ్ణుంచి నేను, సమీర బస్సులో కాలేజీకి వెళ్లేవాళ్లం.
ఒకరోజు కాలేజీకి వెళుతూ సమీరను పిలిచేందుకు వాళ్లింటికి వెళ్లాను. సమీర గాబరా పడుతూ బయటకు వచ్చింది. ఇద్దరం అడ్డురోడ్డుకి చేరుకున్నప్పుడు ‘మా ఇంటికి ఎప్పుడూ రావద్దు. నాన్నకిష్టం ఉండదు. నేను రోజూ నీతో కలిసి కాలేజీకి వెళుతున్నానని తెలిస్తే నాన్న కోప్పడతాడు’ అంది.
ఆమె మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఒకే స్కూల్లో మా నాన్న ,మా మేనమామ లిద్దరూ ఉపాధ్యాయులైనా బావ, బావమరుదిలిద్దరికీ పడేది కాదు. మా అమ్మనాన్నల పెళ్లిలో ఏదో గొడవొచ్చిం దిట. అప్పట్నుంచీ రెండు కుటుంబాల మధ్య ఎడం పెరిగింది. ఆ తరువాత నేనెప్పుడూ సమీర వాళ్లింటికి వెళ్లలేదు. ఒకే ఊళ్లో ఉంటున్నా మా అమ్మ ఎందుకు తమ్ముడింటికి వెళ్లదో నా కిప్పుడు అర్థం అయింది.
ఈ విషయం పక్కన పెడితే సమీర నాతో సన్ని హితంగానే ఉండేది. ఆమె అన్నింటికి నామీదే ఆధార పడేది. బస్సు పాసు దగ్గర్నుంచీ కాలేజీలో కట్టే ఫీజులు దాకా అన్నీ నేనే చెయ్యాలి… పుస్తకాలను నేనే కొనే వాడిని. ఇంక కాలేజీకి వెళుతున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు బస్సులో ఆమెకు అర్థం కాని లెక్కలు, సైన్స్ చెప్పేవాడిని.
నా పేరెప్పుడూ ఆమె పెదవుల మీద ఉండేది.- మాట్లాడిందంటే వంశీ అని వచ్చేది… అంతగా నాతో చనువు పెంచుకుంది. నేను మొదట్లో పట్టించుకోకపోయినా అప్పుడప్పుడు నాతో సన్నిహితంగా పక్కనే కూర్చున్నప్పుడు ఆమెని తేరిపారా చూస్తూండేవాడిని. సమీర స్వతహా చాలా అందగత్తె.. ముఖం తిప్పుకోలేనంతటి అందం ఆమెది. తెల్లటి మేను, పిరుదులు దాటే జడ, పెద్ద పెద్ద కళ్లు, బుగ్గ మీద పుట్టమచ్చ.. చూడటానికి అప్సరసలా ఉండేది. రాను రాను ఆమె యవ్వనంలోకి ప్రవేశిచండటంతో మరిన్ని అందాల్ని సంతరించుకొని ముగ్ధలాగా కనిపించసాగింది. మాటలాడుతుంటే సెలయేటి గలగలల్లా వినిపించేవి. నవ్వితే గుప్పెడు బొండు మల్లెలు జారినట్లుండేది. నడుస్తుంటే హంసలా కనిపించేది. ఆమెను అప్పుడప్పుడు చూస్తూంటే…
మాటేమో హోరైనది
హోరేమో ఏరైనది
ఏరేమో సమీరైనది…
అనీ అనిపించేది.
(సశేషం)
-గన్నవరపు నరసింహమూర్తి