నవంబర్ 27 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి బ్రహోత్సవాలు
తిరుచానూరు నివాసిని అలమేలుమంగమ్మ భక్తులపాలిట వరదాయిని. వారి విన్నపాలను, ఇక్కట్లను విభునికి వినిపించి, ఒత్తిడి తెచ్చి వరాలు ఇప్పిస్తారని విశ్వాసం. అందుకే ‘మముగన్న మాయయ్మ అలమేలు మంగమ్మ / విభునికి మా మొరలు వినిపించవమ్మా’ అంటూ భక్తులు వేడుకుంటారు.‘కలౌ వేంకట నాయకః’ అని ఆనందనిలయుడు శ్రీనివాసుడు, భక్తుల పాలిట కల్పవల్లిగా ఆయన పట్టపురాణి, ‘శాంతినిలయ’వాసిని పద్మావతీదేవి పూజలు అందుకుంటున్నారు.
పావన స్వర్ణముఖీతీరంలో వ్యాసభగవానుడి తనయుడు శ్రీశుకమహర్షి ఆశ్రమమే (శుకపురి) నేటి తిరుచానూరు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస్ పెరుమాళ్ తపమాచరించిన పుణ్యప్రదేశం. దీనికి ‘తిరుచ్చికనూర్’, ‘తిరుచ్చొకనూర్’ అని నామాంతరాలు ఉన్నట్లు 8,9 శతాబ్దాల నాటి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు పేర్కొంటున్నాయి. కార్తిక శుక్ల పంచమి శుక్రవారం ఉత్తరాషాడ నక్షత్రంలో అమ్మ వారు ఆవిర్భవించారు. పద్మంలో అవతరించారు కనుక ‘పద్మావతి’ అని, పుష్పంపైన దేదీప్యమానంగా వెలుగులీనుతున్న దివ్యవనిత కనుక ‘అలర్ మేల్ మంగ’అని వ్యవహరిస్తారు. పద్మసరోవర మహాత్య్మాన్ని నారద వసిష్ఠ మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహక్రతు తదితర మహర్షులు ప్రస్తుతించారు. శ్రీవారు ప్రతిష్ఠించిన సరోవరంలో ఆవిర్భవించిన అలమేలుమంగ బ్రహ్మాదిదేవతల విన్నపం మేరకు భక్తజనులను తరింపచేసేందుకు అక్కడే ‘అర్చామూర్తి’గా స్థిరపడేందుకు అంగీకరించారు. అప్పటికే ‘వ్యూహలక్ష్మి’గా వక్షంలో నిలుపుకున్న శ్రీనివాసుడూ అందుకు ఆమోదించారు. ఆయన హృదయపీఠంలో వద్మాసనjైు ఉన్న లక్ష్మినే ‘వ్యూహలక్ష్మి’గా అర్చిస్తారు.
‘ద్విభుజా వ్యూహాలక్ష్మీః స్యాత్ బద్ధ పద్మాసన ప్రియా
శ్రీనివాసంగ మధ్యస్థా సుతరాం కేశవ ప్రియాః’
‘వ్యూహం’ అంటే ఊహించుకునేది, రహస్యం. అంటే ఆమె శ్రీనివాసుడి హృదయంలో విరాజిల్లుతూ భక్తులను ఆయన అనుగ్రహానికి పాత్రులను చేస్తుంది.
దేవేరి కోరినట్లు వేంకటాచల క్షేత్రంలో తరహాలోనే తిరుచానూరులోను బ్రహ్మోత్సవాలు జరిగేలా అనుగ్రహించా రట. విష్ణువు సేనాపతి విష్వక్సేనుల పర్యవేక్షణలో, సుదర్శన చక్రత్తాళ్వార్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగు తాయి. అందుకే ఆరంభంలో విష్వక్సేనారాధన, ముగింపులో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అసలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులోనే ప్రారంభ మయ్యాయని తిరుమల ఆలయంలోని తొలిశాసనం బట్టి తెలుస్తోంది. అప్పట్లో దుర్గమ ప్రాంతమైన తిరుమలలో సరైన ఆలయ ప్రాకారాలు, ఉత్సవాదులకు వీధులు లేకపోవడంతో అక్కడ ‘తిరుమల ఒళుగు’ అనే ఉత్సవాన్ని ఆరంభించి మిగిలిన వాహనసేవలు తిరుచానూరులోని వేంకటనాథుడి ‘తిరువిలన్ కోయిల్’లోని తిరువేంకట పెరుమాళ్‌కు నిర్వహించేవారట. తిరిగి ధ్వజావరోహణం తిరుమలలో ఉండేదట. అనంతర కాలంలో భగవద్రామానుజ యతీంద్రులు ఈ పద్ధతికి స్వస్తి పలికి శ్రీవారిబ్రహ్మోత్సవాలు తిరుమలలోనే జరిగేలా ఏర్పాట్లతో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాదులను స్థిరపరచి, కట్టుదిట్టం చేశారు. కొండపై ఉత్సవాలకు వెళ్లలేని వారికి స్వామివారి ప్రతిరూపాన్ని తిరుచానూరు ఆలయంలో ఉంచి ఉత్సవాలు జరపడం ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కలిగించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
పంచమి తీర్థానికి (మార్గశిర శుద్ధ పంచమి) పదిరోజుల ముందు, అంటే చాంద్రమానం ప్రకారం కార్తిక బహుళ ఏకాదశి రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. శేషవాహనంపై అనంత లక్ష్మిగా, హంస వాహనంపై సరస్వతిగా, కల్పవృక్షంపై కామితార్థప్రదాయినిగా, గజవాహనంపై గజలక్ష్మిగా, గరుడవాహనంపై శ్రీవేంకటాద్రి లక్ష్మిగా, హనుమ ద్వాహనంపై సీతాలక్ష్మిగా… ఇలా అనేక వాహనాలపై అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సుప్రభాతం అనంతరం సహస్రనామ నిత్యార్చనతో నిత్యకైంకర్యం అనంతరం, అమ్మవారిని శ్రీకృష్ణ ముఖమండపంలో ఆశీనులను చేసి, శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ తనిర్వహిస్తారు.
పంచమితీర్థం సారె
బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా పంచమి తీర్థం నాడు దేవదేవుడు దేవేరికి ఘనంగా సారె పంపుతారు. రెండు బంగారు నగలు, రెండు పట్టు చీరలు, రెండు పట్టు రవికల వస్త్రాలు, పచ్చి పసుపు చెట్టు, పసుపు, చందనం ముద్దలు, తులసి, పూలమాల లతో పాటు పిడివంటలు ఒక్కొక్క రకం ఒక్కొక్క పడి (51) చొప్పున పెద్ద లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు తదితరాలను ఏనుగు అంబారీపై తరలి స్తారు. దేవస్థానం సిబ్బంది, అమ్మవారి ఆలయ అర్చకులు, పరిచారకులు వాటిని వెదురుబుట్టలలో పెట్టుకొని తిరుమల నుంచి కాలినడకన అలిపిరి పద్మావతి పసుపు మండపానికి చేరతారు. అక్కడి నుంచి ఏనుగు అంబారీపైన వాటిని అధిష్ఠింపచేసి మేళతాళాలతో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామస్వామి ఆలయాల మీదుగా తిరుచా నూరు చేరుకుంటారు. అమ్మవారికి సారె సమర్పించి, పద్మసరోవరంలో పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. సుదర్శన చక్రంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పద్మసరోవరంలో పుణ్య స్నానాలు చేస్తారు.
ఆ మరునాడు అమ్మవారికి పుష్ఫయాగం నిర్వహి స్తారు.అనేక సుగంధ పుష్పాలతో భగవంతుడిని, భగవతిని అర్చించడాన్ని పుష్పయాగం అంటారు.
‘ధ్వజారోహణ తీర్థాంత
ప్రాయశ్చిత్తంతు యద్భవేత్
తస్యదోష విఘాతార్థం
పుష్పయాగం చ కారయేత్’ అని ఆర్యోక్తి. ఉత్సవా లలో ధ్వజారోహణం నుంచి అవభృత (చక్ర) స్నానం దాకా సాగిన కార్యకలాపాలలో చిన్నపాటి లోపాలు, దోషాలు చోటుచేసుకుంటే వాటి నివారణకు వేదసూక్తాలు, ఉపనిషత్తుల పఠనంతో ఈ విశేష క్రతువును నిర్వహిస్తారు.
– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి