బిహార్‌లో కులగణన జరిగిందనిపించారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా కులగణన చేపడుతున్నది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ గతంలో ప్రస్తావించిన అంశాల ప్రాధాన్యం గుర్తించాలి. ‘మందిని బట్టి హక్కు’ అనే కాంగ్రెస్‌ ‌విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం ప్రస్తుతమున్న 129 స్థానాలనుంచి 100కు దిగువకు పడిపోతుందన్నారు. ఈ పరిణామాన్ని దక్షిణాది రాష్ట్రాలు అంగీకరిస్తాయా? కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ‘ఇండీ’ గ్రూపు దక్షిణాదికి జరిగే అన్యాయంపై ఏం సమాధానం చెబుతాయని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్‌ ‌చెబుతున్న కులగణన వల్ల ముస్లిం మైనారిటీలు తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన చేస్తున్న ఎదురుదాడికి విపక్షాల వద్ద స్పష్టమైన సమాధానం లేక గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా కిమ్మనడంలేదు. ఎంతసేపూ మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు, ఓటు రాజకీయాలు తప్ప అవి వెలగబెడుతున్నదేమీ లేదు. నిజంగా కాంగ్రెస్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే,  అత్యధిక కాలం అధికారంలో కూడా ఉన్నది ఈ పార్టీయే కాబట్టి, బీసీల అభివృద్ధికి పాటుపడి ఉండేది. కాంగ్రెస్‌ ‌మాట, చేతలు అన్నీ కేవలం రాజకీయాల కోసమే. ఇప్పుడు విభజన రాజకీయాలే పరమార్ధంగా ప్రతి మాట మాట్లాడుతున్నది.

ఇక్కడ గుర్తించాల్సిన అంశమేంటంటే ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా వెనుకబడిన వర్గాలవారున్నారు. హిందూ ఉన్నత కులాల నుంచి ముస్లింలుగా మారినవారిని అష్రాఫ్‌లని, హిందూ నిమ్న కులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారిని ‘అజ్లాఫ్‌’ అని వ్యవహరిస్తారు. అష్రాఫేతరులందరిని ముస్లింలలో వెనుకబడిన  తరగతుల వారిగా పరిగణిస్తారు. అజ్లాఫ్‌, అర్జాల్‌లను కలిపి ‘పస్మంద’ గ్రూపులుగా వ్యవహరించే విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా హిందూ నిమ్నకులాల నుంచి మత మార్పిడులకు గురైనవారు సామాజికంగా ఏవిధమైన ఉన్నత స్థితిని పొందడంలేదు. హిందువుగా ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో, అదే పరిస్థితి మతాంతరీ కరణ తరువాత కూడా కొనసాగుతోంది. మరి కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని విపక్షాలు చేస్తున్న వాదన ప్రకారం కులగణన చేపడితే, ఈ మతాల వారిలో కూడా దీన్ని అమలు చేయాల్సిందే. అప్పుడే మతాతీతంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.

హిందీబెల్ట్‌పై విపక్షాల దృష్టి

కులగణన వల్ల ముఖ్యంగా హిందీ బెల్ట్ ‌రాష్ట్రాల్లో, వెనుకబడిన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలన్నది విపక్షాల వ్యూహం. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ పార్టీలు సంప్రదాయికంగా వస్తున్న బీసీ ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవాలంటే సంక్షేమం కంటే, కులగణన అవసరమని భావిస్తున్నాయి. ఈ ఏడాది హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కూడా క్రిమీలేయర్‌ ‌పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షకు వార్షికాదాయ పరిమితిని పెంచక తప్పలేదు. ఒకరకంగా చెప్పాలంటే కులగణన వల్ల తేనెతుట్టెను కెలకడమే అవుతుంది. ఇప్పటివరకు నడుస్తున్న ‘సంక్షేమ రాజకీయాల’ నుంచి రాజకీయ పార్టీలు ‘కుల రాజకీయాల’వైపు మళ్లుతాయి. దీనివల్ల ప్రతికూల  ఫలితాలు తప్ప సానుకూలత ఉండే అవకాశాలు చాలా తక్కువ అనేది ఎవరైనా ఇట్టే చెప్పగలరు.

మండల్‌ ‌కమిషన్‌తో మొదలు

 1990 దశకంలో మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదిక నేపథ్యంలో భారత్‌లో కులరాజకీయాలకు పార్టీలు ప్రాధాన్యతనివ్వడం మొదలైంది. అంతకుముందే ఈ పద్ధతి ఉన్నప్పటికీ, మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదిక పుణ్యమాని సెక్యులర్‌ ‌పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌ ఇతర పార్టీలు కుల రాజకీయాలను ముమ్మరం చేశాయి. సరిగ్గా ఇదే సమయంలో హిందువుల ఐక్యత లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ ఈ కుల రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించింది.  ముస్లింలు, క్రైస్తవులు తదితర మతాలను వదిలిపెట్టి హిందువుల ఓట్లను మాత్రమే కులాల వారీగా విడగొట్టడం రాజకీయ లబ్ధి కోసమేనని బీజేపీ వాదిస్తూ వస్తోంది. సంప్రదాయికంగా వస్తున్న ఎస్సీ/ఎస్టీ జనాభా గణనను పక్కనబెట్టే విధంగా సామాజిక ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ) చేపడితే పరిపాలనా పరమైన అడ్డంకులు ఏర్పడతాయంటూ, కేంద్రం 2021లో ఈ ప్రతిపాదనను తిరస్కరించింది కూడా.

బిహార్‌లో కులగణన

2022లో నితిష్‌కుమార్‌ ‌ప్రభుత్వం రూ.5 బిలియన్‌ ‌ఖర్చుతో కులగణన చేపట్టింది. ఈ మొత్తాన్ని ఆగంతుక నిధి నుంచి ఖర్చు చేసింది. ఈ సమగ్ర సర్వే రాష్ట్రంలో 214కులాలను నమోదు చేసింది. దీని ప్రకారం ఓబీసీలు 27%, బాగా వెనుకబడిన కులాలు (ఈబీసీలు) 36% ఉన్నట్లు తేలింది. అంటే ఈ రెండు వర్గాలు కలిపి బిహార్‌ ‌జనాభాలో 63%. ఇక ఎస్సీలు 20%, ఎస్టీలు 1.6%గా తేల్చింది. 2023, నవంబర్‌ 9‌న బిహార్‌ అసెంబ్లీ ఈ అన్ని వర్గాలకు కలిపి ప్రస్తుతం అమలు చేస్తున్న 50% రిజర్వేషన్లను 65%కు పెంచుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కాగా అప్పటివరకు బీసీ మహిళలకు ఇస్తున్న 3% రిజర్వేషన్లను బుట్టదాఖలా చేయడం గమనా ర్హం. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) ‌విచారించిన పట్నా హైకోర్టు, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీ తీర్మానాన్ని కొట్టివేసింది. ప్రస్తుతం చేపట్టిన కులగణన ద్వారా, ఆయా వర్గాలకు ఉద్యోగాల్లో ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం లభిస్తున్న సంగతి స్పష్టమైనందున, రిజర్వేషన్ల పరిమితిని 50% కొనసాగిస్తూ, క్రిమిలేయర్‌ను రిజర్వేషన్ల పరిధినుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే నితిష్‌ ‌ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు గడపతొక్కింది. నిజం చెప్పాలంటే గత 50ఏళ్లుగా రిజర్వేషన్లను పొడిగించడమే తప్ప, ఆయా వర్గాలకు అనుకున్న స్థాయి సమానత్వ సాధన జరగలేదు. ఎందుకంటే గతంలో సామాజికంగా అట్టడుగున ఉన్నట్టుగా గుర్తించిన చాలా కులాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు.

హిందూ సమాజంపైనే దృష్టి

కేవలం హిందూ సమాజాన్ని విడగొట్టి రాజకీయ లబ్దిని పొందేందుకు కాంగ్రెస్‌ ‌చేస్తున్న రాజకీయాలు నేడు ప్రజలకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇటీవల ఇండియా టుడే కోసం సిఓటర్‌ ‌దేశవ్యాప్తంగా నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ‌ది నేషన్‌ (ఎంఓటీఎన్‌) ‌సర్వేలో 74శాతం మంది కులగణన జరపడం సముచితమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో 59 శాతం మంది మాత్రమే కులగణనకు మద్దతు పలికారు. అంటే కులగణనకు మద్దతిచ్చేవారి సంఖ్య పెరుగుతున్నదనే అర్థం. అతి స్వల్ప వ్యవధిలో ఈ మార్పు వెనుక ఉన్నది ఏమిటో ఊహించడం కష్టం కాదు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కులగణన ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాకూడదని స్పష్టం చేస్తోంది. కులాలన్నవి ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీ వర్గాల్లో కొనసాగుతున్నప్పుడు వాటిల్లో కూడా కులగణన చేపట్టాలన్న ప్రధాని మోదీ అభిప్రాయం సముచితం. సెక్యులర్‌ ‌దేశమని చెప్పినప్పుడు, అందరికీ అన్నీ వర్తించాలి. అంతేకాని కొందరికి కొన్ని మాత్రమే పరిమితం కాకూడదు. విపక్షాలు ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్లు గంపగుత్తగా పొందడమే కాకుండా, హిందూ సమాజంలోని వెనుకబడిన కులాలనుంచి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపాలన్న సంకుచిత ఉద్దేశం స్పష్టంగా వ్యక్తమవుతోంది. అదేమంటే ముస్లింల జనాభా చాలా తక్కువ అయినందున వారిని కేంద్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న వాదనలు అసంబద్ధం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, మతాలకు ఒక్కటే నిబంధన అమలవుతుంది. ముస్లింలు తమను తాము ప్రత్యేక వర్గంగా పరిగణించుకుంటూ, ఇతర సమాజంతో కలిసిపోవడానికి ఇష్టపడక పోవడం, ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం లేకపోవడం వల్ల సమస్య వస్తోంది. అంతేకాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సదుపాయాలను అనుభవిస్తూ, తమకోసం పనిచేసే ప్రభుత్వం కంటే, మతం నిర్దేశించిన వారికి మాత్రమే ఓటు వేయడం, సంకుచిత రాజకీయ పార్టీలకు వరంగా మారింది. వారిలోని బలహీనతను తమ రాజకీయాలకు అనుకూలంగా మలచుకుంటూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. తాము రాజకీయ పార్టీలకు పావులుగా మారుతున్నామన్న సంగతిని వారు గుర్తించడం లేదు. ఏ సమాజమైతే ఆధునిక విద్యను, ఆధునిక పోకడలను ఆహ్వానిస్తుందో ఆ సమాజం అభ్యున్నతి సాధిస్తుంది. అటువంటి పురోగామి లక్షణం లేని సమాజం తాను అభివృద్ధి చెందదు, ఇతరులను ప్రగతిపథంలో పయనించ నీయదు. ఇదే ప్రస్తుతం మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య!

-జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE