‘‌దాచేస్తే దాగని నిజం’ అన్న శ్రీశ్రీ మాట ఇప్పుడు అందరికీ గుర్తుకు రాక తప్పదు. భారతదేశం లేదా హిందూ దేశం ఏ ఇతర దేశం మీద సైనిక దాడి చేయలేదు. కానీ సాంస్కృతిక విజయాలు ఎన్నో సాధించింది. ఇదే విషయాన్ని చర్చిస్తూ ఇటీవల ప్రపంచ పాఠకలోకం ముందుకు వచ్చిన పుస్తకమే ‘ది గోల్డెన్‌ ‌రోడ్‌: ‌హౌ ఏన్షియెంట్‌ ఇం‌డియా ట్రాన్స్‌ఫార్మడ్ ‌ది వరల్డ్’. ‌ప్రపంచ ప్రసిద్ధ రచయిత విలియం డాల్‌రింపుల్‌ ‌తాజా రచన ఇది. ‘స్వర్ణపథం: పురాతన భారతదేశం ప్రపంచాన్ని ఎలా మార్చింది’ అన్న అర్ధంలో దీనిని చదువుకోవచ్చు. ఇప్పుడు కమ్యూనిస్టు చైనా రకరకాల మార్గాలలో, జీ జింగ్‌పింగ్‌ ‌నాయకత్వంలో ఆసియాకు తానే గుండెకాయ వంటిదానని ప్రచారం చేసుకోవచ్చు. ఈ వాదనకే ఒక పెద్ద వర్గం మీడియా కళ్లు మూసుకుని ప్రచారం కల్పిస్తున్నది. కానీ ఒకప్పుడు భారతదేశమే ఆ స్థానంలో ఉన్నదన్నదే డాల్‌రింపుల్‌ ‌రచన సారాంశం. ఈ వాస్తవమే ఇప్పుడు దాచేస్తే దాగని నిజం అంటారాయన.

కొన్ని భారతీయులందరికీ నచ్చే విధంగా, కొన్ని కొందరికి ఆగ్రహం కలిగించే విధంగా డాల్‌రింపుల్‌ ‌రచనలు ఉంటాయి. కానీ అవన్నీ ప్రధానంగా భారతదేశ చరిత్ర నుంచి స్వీకరించిన ఇతివృత్తాలతోనే సాగుతాయి. వైట్‌ ‌మొగల్స్, ‌రిటర్న్ ఆఫ్‌ ‌ది కింగ్‌, ‌ది అనార్కీ అలాంటివే. ఇటీవలి ఈస్టిండియా కంపెనీ అన్న రచన ఒకింత భారతీయుల ఆగ్రహానికి గురైనదే. వైట్‌ ‌మొగల్స్‌లో ప్రాచ్య పాశ్చాత్య సాంస్కృతిక సంఘర్షణలను ఆయన చిత్రించారు. ది అనార్కీలో వలసకాలం నాటి దోపిడీ గురించి రాశారు. అధిక సమాచారాన్ని సృజనాత్మక రచనల ఛాయలతో ఆందించడం ఆయన ప్రత్యేకతగా విమర్శకులు చెబుతారు. ఇప్పుడు స్వర్ణపథం కోసం స్వీకరించిన ఇతివృత్తం- ప్రపంచ పురోగమనానికి భారత ఉపఖండం అందించిన సేవ.

చరిత్రను వక్రీకరించడం అనేక రీతులుతో సాగుతుంది. అగ్రరాజ్యానికి అనుకూలంగా చరిత్ర రచన జరగడం ఇటీవలి ఒక విషాదం. వలస రాజ్యాలక• చరిత్ర రచన అంటే పాలితులను అవమానకరంగా చిత్రించడమే. దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎక్కడో చోట జరగాలన్న అభిప్రాయం బలపడుతున్నది. అందుకే డాల్‌రింపుల్‌ ‌రచన సరైన సమయానికి ప్రపంచ పాఠకుల ముందుకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మొగలులు, వలస పాలన అనంతర భారత దేశ వర్ణన నుంచి ఆయన పురాతన భారత వైభవం మీద ఒక్కసారిగా దృష్టి మరలించారు. భారతదేశం నుంచి యురేసియాకు తాత్విక, శాస్త్ర, ధార్మిక అంశాలు ఎలా ప్రయాణించాయో తెలియచేసే మంచి ప్రయత్నం చేశారాయన. బౌద్ధం, హిందూత్వం, ఖగోళ విజ్ఞానం, సున్న, చదరంగం ఇక్కడ నుంచి వెళ్లాయని ఆయన తన పుస్తకంలో రాశారు.

1980 నుంచి ప్రపంచమంతటా విస్తరిస్తున్న సమాచారం ఒక్కటే- ఆధునిక ప్రపంచం ప్రస్థానాన్ని ప్రభావితం చేసినది చైనా అనేదే. సిల్క్‌రోడ్‌ అన్న రచన ఇందుకు ఉన్న అనేక కారణాలలో ఒకటి. ఇదే విషయం మీద దాదాపు నాలుగ వేల పుస్తకాలు వెలువడినాయని అంచనా. అచ్చుకు అవసరమైన కదిలే ములుకులు, కాగితం, తుపాకీ మందు, కాగిత రూపంలోని నగదు, తపాలా విధానం ఇవన్నీ చైనా ఘనతగా నమోదైనాయి. భారతదేశానికి ఇంత ప్రతిష్ఠ ఇవ్వడానికి విద్యావంతులకు మనసు ఒప్పదు. అయితే యోగా వంటి అద్భుత పక్రియకు ఆద్యురాలు భారతమేనన్న వాస్తవాన్ని దాచలేకపోయారు. వర్తమానంలోను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ అవతరించిన వాస్తవాన్ని కూడా మరుగున పరచడం సాధ్యం కావడం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా పురాతన భారతానికి ప్రపంచం కృతజ్ఞత చూపవలసిన అవసరం ఉందనే డాల్‌రింపుల్‌ అం‌టున్నారు.

నౌకాశ్రయాలు, విస్తృత విపణులతో భారతదేశం ప్రపంచ పటంలో వైభవోపేతంగా నిలబడిన కాలం చరిత్రలో ఒక వాస్తవం. అనేక మంది విదేశీ వ్యాపారులు ఇక్కడకు వచ్చారు. పురాతన కాలపు భారతీయులు కూడా విదేశాలకు వెళ్లి వాణిజ్యం సాగించారు. ఈజిప్ట్, ఇథియోపియా, వియత్నాం, చైనాలతో మన పూర్వికులు వ్యాపార వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నారు. బ్రాహ్మణ సంస్కృతి మీద తిరుగుబాటుగా ఆవిర్భవించిన బౌద్ధం తన అనుయాయును ఖండాంతర ప్రయాణాలకు ప్రేరేపించింది. అంతకంటే ముందే బౌద్ధం సాగరాలు దాటివెళ్లింది. దీనితో అపార సంపద సృష్టికి వాతావరణం ఏర్పడింది. బౌద్ధం మార్గంలో కాకున్నా రోమ్‌తో భారత్‌కు బలమైన వాణిజ్య బంధం ఉండేది. తాజాగా దొరికిన పురావస్తు ఆధారాలతో డాల్‌రింపుల్‌ ఇదే విషయాన్ని ఆవిష్కరించారు. ఎర్ర సముద్రం ద్వారా జరిగిన వాణిజ్యం ఇతోధికంగా సుంకాలు చెల్లించింది. ఆ ధనరాశి ఎంత అంటే రోమ్‌ ‌సామ్రాజ్య బడ్జెట్‌లో మూడో వంతు. భారత్‌ ‌నుంచి వెళ్లిన మూడు నౌకల సరుకు మీద వేసిన సుంకంతో తెచ్చిన ఆదాయం మూడునుంచి ఆరు వేలు ఉండే ఒక రోమన్‌ ‌సైనిక శ్రేణి నిర్వహణకు సంవత్సరం పాటు సరిపోయేది.

ఏమైనా క్రీస్తుపూర్వం 3 నుంచి క్రీస్తుశకం 12, 13 శతాబ్దాల కాలం వరకు భారత్‌ ‌సువర్ణాధ్యాయాన్ని లిఖించుకుంది అన్నదే డాల్‌రింపుల్‌ ‌వాదన. ఇది కొందరికి నచ్చలేదనుకోవాలి. ప్రధానంగా భారతీయ అన్న మాట వినిపిస్తే జడుసుకునే వారికి ఇది నచ్చలేదు. అలాగే భారత్‌ ‌విశ్వగురు స్థానానికి వెళుతుందని ఎవరు ఆశాభావం వ్యక్తం చేసినా వాళ్లని మోదీ వాదులుగా ముద్ర వేసే వారికి కూడా ఆ వాదన అసలు నచ్చలేదు. డాల్‌రింపుల్‌ ‌పుస్తకం మీద వెలువడిన సమీక్షలలో ఇదే వ్యక్తమయింది. ఇలాంటి సమీక్షకులకు లేదా మేధావులు బిరుదాంకితులకు నచ్చని విషయం కూడా ఉంది.

భారతీయ గణితశాస్త్రం, ఖగోళశాస్త్ర సూత్రాలు అరబ్‌ ‌దేశాలకు వెళ్లి అక్కడ నుంచి యూరప్‌ ‌ఖండాన్ని తాకిన క్రమం కూడా డాల్‌రింపుల్‌ ఇం‌దులో చెప్పారు. ప్రాచీన భారతం విశ్వగురు అనడానికి ఆయన వెనుకాడలేదు. ఆ మాటను ససేమిరా అంగీకరించరు మన మేధావులు. అక్కడితో ఆగలేదు. 12వ శతాబ్దంలో ముస్లిం పాలకులు నిజానికి దురాక్రమణదారులు భారతదేశానికి రావడంతో ఆ స్వర్ణయుగానికి అంతం ఆరంభమైందన్న వాదన కూడా ఆయన ప్రతిపాదించారు. కాబట్టి ఈ పుస్తకం హిందుత్వ వాదులకు నచ్చుతుందని కొందరు సమీక్షకులు పైత్యం ప్రదర్శించారు. పైత్యం అని ఎందుకు అనవలసి వస్తున్నదంటే, డాల్‌రింపుల్‌ ‌చేసిన పరిశోధన, ఇచ్చిన ఆధారాలను బట్టి కాకుండా, ముందు నుంచి స్థిరపడిపోయిన కొన్ని అభిప్రాయాలతోనే సదరు సమీక్షకులు రాశారు. చిరకాలంగా భారతీయత ఔన్నత్యాన్ని నమ్ముతున్నవారు చేస్తున్న వాదనను డాల్‌రింపుల్‌ ‌సరైనదని రుజువు చేశారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం, క్రీస్తుశకం 12,13 శతాబ్దాల మధ్య భారతదేశం ఏమిటి? ప్రపంచానికి వనరు.చైనాను మించినది. ఇదీ డాల్‌రింపుల్‌ ‌తేల్చిన విషయం. ఆ కాలం రోమ్‌కు తరువాత మధ్యధరా యూరప్‌లకు గ్రీస్‌ ఎటువంటిదో దక్షిణాసియా మధ్య ఆసియా ఆమాటకొస్తే చైనాకూ భారత్‌ అలాంటిది అన్నారు ది గోల్డెన్‌ ‌రోడ్‌ ‌రచయిత.ఇది గతంలోను వాస్తవమే. అయినా ఇప్పుడు చెప్పడం చైనా-భారత్‌ల మధ్య విరోధానికి దారి తీస్తుందికదా అని చిత్రమైన తర్కం లేవదీస్తున్నారు.

ప్రాచీన భారతదేశం సమకాలీన ప్రపంచంలో తీసుకువచ్చిన మార్పుల గురించి, చూపిన ప్రభావం గురించి డాల్‌రింపుల్‌ ‌తన పుస్తకంలో వివరించారు. ఇంకొక కీలక చారిత్రక వాస్తవం కూడా ఉంది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రబిందువుగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వాణిజ్య వ్యాపారాలు జరిగిన జాడలేవీ లేవని నిర్ధారించారు డాల్‌రింపుల్‌. అసలు పాశ్చాత్య దేశాల• చైనా గురించి వినడమే తప్ప, దాని గురించి తెలిసినది చాలా తక్కువ అన్నారాయన. అదే భారత్‌కూ, రోమ్‌కూ మధ్య విశేషమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇంతకు ముందు భారత్‌ ‌వాణిజ్య నౌకలు చెల్లించిన సుంకం పెద్ద ఎత్తున ఉండేదని ముందు చెప్పుకున్నాం. అంతకు మించి విస్తుపోయే మరొక ఆధారం ఇచ్చారు డాల్‌రింపుల్‌. ‌భారత ప్రదర్శనశాలల్లో రోమ్‌లోను, దాని సరిహద్దు దేశాలలోను కూడా లేనన్ని రోమన్‌ ‌నాణేలు ఉన్నాయి.

ఈ రచన ఏ తీరులో సాగింది? రోమ్‌తో ఘనమైన వాణిజ్యం డాల్‌రింపుల్‌ ‌కొత్త పుస్తకంలో ఒక విభాగం. చైనా, మధ్య ఆసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాలకు బౌద్ధం విస్తరణ మరొక విభాగం. అలాగే గణితం, ఖగోళశాస్త్రాల ప్రయాణం మరొక విభాగం. హిందూత్వం, సంస్కృత భాష దక్షిణ ఆసియాకు, కంబోడియాలకు వెళ్లిన తీరు కూడా ఆయన తీసుకున్నారు.  వీటిని ఆధారాలతో చెప్పారాయన. కానీ మార్క్సిస్టు చరిత్రకారులు, ఆ జాడలే ఉన్న ఇతర రచయితలు ఇది చైనాతో విరోధానికి దారి తీస్తుంది కదా అని వాదించడమే విడ్డూరం. చారిత్రక వాస్తవాలను మరుగు పరిచి ముస్లింలను సంతృప్తి పరచాలని ఎంతో చరిత్రను వక్రీకరించారు. ఆ పని ఇప్పుడు చైనా విషయంలో కూడా జరుగుతుంది కాబోలు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE