భారతదేశం ఓ ధర్మసత్రమన్న భావన ఇంకా పాశ్చాత్య దేశాలకు పోలేదనే అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాలను భగ్నం చేయడం ఎలా అన్న సూత్రాన్ని అమలు చేసే విధంబెట్టిదనిన అనుకుంటూ భారతీయ వ్యవస్థ మీద ప్రయోగాలు చేయడం వాటికి అలవాటుగా మారింది. తాము కనుగొన్న కొత్త ఔషధాలను ప్రయోగించడానికి ఇక్కడి మనుషులను యథేచ్ఛగా వాడుకోవచ్చునని కొన్ని పాశ్చాత్య దేశాల నమ్మకం. మైనారిటీలను మెజారిటీ వర్గం మీదకు ఎలా రెచ్చగొట్టాలో మార్గాలు కనుగొనడానికి కూడా అవి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, సార్వభౌమాధికారం కలిగిన ఈ దేశంలో 2010లో జరిగిన ఒక సర్వే ఇందుకు ఒక రహస్య ఉదాహరణ.

ముస్లింలే కేంద్రంగా జరిగిన ఈ సర్వే ఉద్దేశం భారతదేశం గురించి వారి అంతరంగంలో నిగూఢంగా ఉన్న ప్రతికూలతను వెలికి తీయడమే. వేరొక మత విశ్వాసం ఉన్న వ్యక్తికి ఓటు వేయవలసి వస్తే మీ మనోభావాలు ఏమిటి? గతంతో పోలిస్తే ఇవాళ్టి ముస్లింలలో ఇస్లాం ఏ మేరకు ప్రభావాన్ని ప్రసరింప చేస్తున్నది? మీరు మొదట భారత పౌరుడిగా భావిస్తారా? ముస్లింగా చెప్పుకుంటారా? ఈ ప్రశ్నలతో సర్వే జరిపితే దానిని ఏమనాలి? అందుకే కేరళ హైకోర్టు గడ్డి పెట్టింది. ఇలాంటి సర్వేలు జరిగితే ఈ దేశ భద్రత మాటేమిటి? ఇలాంటి సర్వేలతో ఈ దేశంలో మత సామరస్యం భవితవ్యం ఏమవు తుంది? అని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సర్వేలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ తీర్పును వెలువరించింది. ఎంపిక చేసుకున్న 54 ప్రదేశాలలో ఈ సర్వే జరిగింది. అందులో కేరళలోని తిరువనంత పురం ఒకటి. ఈ సర్వే సమయంలో అక్కడ ఘర్షణలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది.

అమెరికాకి చెందిన ప్రిన్సటన్‌ సర్వే రిసెర్చ్‌ అసోసియేట్స్‌ (పీఎస్‌ఆర్‌ఏ) తరఫున టేలర్‌ నెల్సన్‌ సోఫ్రెస్‌ (టీఎన్‌ఎస్‌, హైదరాబాద్‌) అనే సంస్థ ఆ సర్వే జరిపింది. అంటే పీఎస్‌ఆర్‌ఏ ఇచ్చిన కిరాయి పుచ్చుకుని టీఎన్‌ఎస్‌ ఆ సర్వే చేసింది. పద్నాలుగు ఏళ్ల నాటి ఈ రగడకు సంబంధించి టీఎన్‌ఎస్‌ మీద చట్టప్రకారం చర్యలు మొదలయ్యాయి. దీనితో తన మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ ఈ సంస్థ కోర్టును ఆశ్రయించింది. టీఎన్‌ఎస్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడమే కాకుండా, ఇలాంటి సర్వేలు ఇకపై జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నవంబర్‌ 4న కేరళ హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి టీఎన్‌ఎస్‌ తాను చేసిన సర్వేకు కేంద్రం అనుమతి తీసుకోలేదు. ఇది నేరం. ఒక విదేశీ సంస్థ సర్వే జరిపితే అందుకు కేంద్ర అనుమతి అనివార్యం.

 రెండు తిరువనంతపురంలో ముస్లింలను అడిగిన ప్రశ్నలు మత సామరస్యాన్ని చెడగొట్టేవిగా ఉన్నాయి. ఇంత ఘాతుకానికి ఒడిగట్టినా తమ మీద క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ టీఎన్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ధర్మాసనం కొట్టివేయడమే కాకుండా, ఈ కేంద్రానికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేస్తూ విశిష్టమైన తీర్పును ప్రకటించింది. సీఎస్‌ఆర్‌ఏ వాషింగ్టన్‌ డిసి కేంద్రంగా పనిచేస్తున్నది. అది మాత్రం తన సర్వేను సమర్ధించు కున్నది. సర్వే ఎవరి కోసం చేశామో, వారి వాస్తవ పరిస్థితిని వారికే అర్ధమయ్యే టట్టు చెప్పడమే తమ ఉద్దేశమని తింగరి వాదన ముందుకు తెచ్చింది.

ఈ సర్వేలో అడిగిన ప్రశ్నల గురించి సాక్షాత్తు న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఈ ప్రశ్నలు సందేహాలు రేకెత్తించేవిగా ఉండడమే కాదు, దేశ సమగ్రతను ధ్వంసం చేయడానికి ఉద్దేశించి నట్టుగా ఉన్నాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి సర్వే ఎలా జరిగిందని కూడా న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసి, నిలదీసింది. ఈ సర్వేలో ప్రశ్నలు సందేహాస్పదంగా ఉండడమే కాదు, అసలు ఆ ప్రశ్నల ఉద్దేశమేమిటో కూడా అంతుపట్టకుండా ఉంది అని అన్నారు. ఈ వివాదంలో తాము తయారు చేసిన నివేదికను కేంద్ర హోం, విదేశ వ్యవహారాల శాఖలకు అందించాలని కూడా కోర్టు రాష్ట్ర పోలీసు దర్యాప్తు అధికారికి ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే జరపడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కోర్టు వెల్లడిర చింది. సర్వే పూర్వాపరాల మీద దర్యాప్తు చేయడానికి రాష్ట్ర పోలీసు విభాగం సామర్ధ్యం సరిపోదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి సర్వేలు జరగడానికి అవకాశం ఇస్తే దేశ భద్రతకే కాకుండా, ఇంకా ప్రధానంగా మత సామరస్యానికి ముప్పు వాటిల్లు తుందని కోర్టు హెచ్చరించింది. అందుకే కేంద్రం ఈ అంశం మీద దృష్టి కేంద్రీకరించాలని ఆదేశిస్తు న్నట్టు తెలియచేసింది.

ఈ సర్వే చేయడానికి ఎన్నుకున్న ప్రదేశాలు కూడా హిందూ ముస్లిం ఉద్రిక్తతలకు ఎక్కువ అవకాశం ఉన్నవే. అల్లర్లకు అవకాశం ఉన్నవే. ఆ ప్రశ్నలన్నీ ముస్లింల ఉద్వేగపూరిత మనోభావాలను గాయపరిచే విధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడిరది. తిరువనంతపురంలో ఈ సర్వే జరిపారు. అయితే అమెరికా సంస్థ తన సర్వేను సమర్ధించుకుంది. అంతర్జా తీయ స్థాయిలో చేపట్టిన ‘గ్రీన్‌ వేవ్‌ 12’ పేరుతో 20 దేశాలలో ఈ సర్వే చేపట్టారు. సంప్రదాయాలు, విలువలు, వైఖరుల గురించి (ఒక వర్గానివి) తెలుసుకోవడమే దీని ధ్యేయమని అమెరికా సంస్థ వివరించింది. కేరళ పోలీసులు మాత్రం ఒక వర్గం (ముస్లింలు) మనోభావాలు దెబ్బతీయడానికే ఈ సర్వే జరిగిందని ఇప్పుడు కూడా అంటున్నారు. తిరువనంత పురంలోని అట్టక్కులంగర్‌ అనే ప్రాంతంలో ఫ్రెండ్స్‌ నగర్‌లో నలుగురు ఉద్యోగులు ఈ సర్వే జరిపారు. తిరువనంతపురంతో పాటు దేశంలోని 54 ప్రదేశాలలో ఈ సర్వే చేశారు. టీఎన్‌ఎస్‌ ఇండియా సర్వే సంస్థను మన దేశం కోసం, ఇంకా ఇండో నేషయా, మలేసియా, థాయ్‌లాండ్‌లలో ఇలాంటి సర్వేల కోసం అమెరికా సంస్థే విభాగాలను ఏర్పాటు చేసింది. భారత్‌లోని ముస్లింలను అడిగినట్టే ఆ దేశాలలో కూడా అవే ప్రశ్నలు అడిగామని ఆ సంస్థ చెబుతున్నది. కానీ మా భారత్‌ సర్వసత్తాక ప్రజా స్వామిక దేశం. ఇక్కడ రాజ్యాంగం మేరకు అన్ని మతాలకు` హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మతాల వారికి సమాన స్థానం ఉంటుంది. స్త్రీపురుషులకు ఒకే చట్టం అమలు జరుగు తుంది. ఇలాంటి చోట సర్వేలో ఆ ప్రశ్నలు ఎందుకు వేశారన్నదే కేరళ హైకోర్టు ప్రశ్న.

సర్వేలో అడిగిన ప్రశ్నలు ఎలాంటివి?

ఇది చాలా ముఖ్యం.

*         నేటి ప్రపంచానికి ఇస్లాం చేస్తున్న ముఖ్య సేవ ఏమిటని మీరు చెబుతారు?

*        భారతదేశంలోని ముస్లింలకు ఎదురవుతున్న రెండో పెద్ద బెడద ఏమిటి?

*       ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చినవారు మహిళ అయితే ఆమె హిజాబ్‌ (తలకు కట్టుకునే గుడ్డ), నికాబ్‌ (మొత్తం శరీరాన్ని కప్పే వస్త్రం) ధరించి ఉన్నారా?

*     భారత రాజకీయ వ్యవస్థలో ఇస్లాం నిర్వహిస్తున్న పాత్ర ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం? చాలా పెద్ద పాత్ర, నిజంగానే పెద్ద పాత్ర, చిన్న పాత్ర, చాలా చిన్న పాత్ర?

*        షియా ఇస్లాంకీ, సున్నీ ఇస్లాంకీ మధ్య విభేదాలను మీరు ఎలా అర్ధం చేసుకుంటున్నారు?

*        షరియా అంటే మీ దృష్టిలో ఏమిటి?

*      నేను మొదట భారత పౌరుడిని అనుకుంటారా? లేదంటే నేను మొదట ఒక జాతికి చెందిన లేదా ఇస్లాంకు చెందిన వాడినని అనుకుంటారా?

*       కొంతమంది ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి వ్యక్తిని సమర్ధిస్తారు. బిన్‌ లాడెన్‌ వంటి వ్యక్తిని గురించి మీరు ఏమనుకుంటున్నారు?

*       మీరు బయటకు వెళ్లేటప్పుడు బుర్ఖా లేదా హిజాబ్‌ ధరిస్తారా?

*  మొత్తంగా చూస్తే భారత్‌ వ్యవహారాలు సరైన దిశగా నడుస్తున్నాయని అనుకుంటున్నారా? లేదా తప్పుడు మార్గంలో నడుస్తున్నవని భావిస్తున్నారా?

*       మీరు ఎవరు? అన్న ప్రశ్న వేసి, ఈ అంశాలలో మీ ప్రాధాన్యం దేనికని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? కులం, ప్రాంతం, జాతీయత, మతం.

*      భారత్‌లో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఏది ముస్లింలకు సరైన పక్షమని మీరు అనుకుంటున్నారు?

*    పాశ్యాత్య ఆర్థిక, వాణిజ్య పద్ధతులు ఇస్లాంకు అనుకూలమని కొందరు, ప్రతికూలమని కొందరు అంటారు. ఇందులో మీరు దేనితో ఏకీభవిస్తారు?

*  కొన్నేళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు ఇవాళ్టి భారతీయ ముస్లింలలో ఇస్లాం ఘనమైన పాత్ర నిర్వహిస్తున్నదా? లేక పరిమితమైన పాత్రను పోషిస్తున్నదా?

*    భారతీయ ముస్లింలలో ఇస్లాం ఘనమైన పాత్రను నిర్వహించగలగడానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏది? ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో వారికి ఉన్న అసంతృప్తి కారణమా? మన సమాజంలోని అనైతికత కారణమా? ఇతర ముస్లిం దేశాల ప్రేరణ కారణమా?

*       పాలన విషయంలో ఈ ముస్లిం దేశం నమూనాగా నిలుస్తుందని ఏ దేశం గురించి మీరు చెప్పగలరు?

*        మరొక విషయానికి వద్దాం. ఇవాళ ఇస్లాంకు ఎన్ని రకాల ముప్పులు పొంచి ఉన్నాయి?

*    ఈ కింద ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇవాళ్టి సమాజంలో ముస్లిం మత నాయకులు రాజకీయా లలో ఎలాంటి పాత్ర నిర్వహించాలని మీరు అభిప్రాయపడుతున్నారు?

*        భారత అధికారిక చట్టాలలో షరియాను ఏ మేరకు పునాదిగా ఉంచాలని మీరు విశ్వసిస్తున్నారు?

*     ఒక ముఖ్య రాజ్యాంగ పదవిలోకి వెళుతున్న ఒక వ్యక్తి ఇతర మత విశ్వాసం కలిగిన వాడైతే అతడిని ఎన్నుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది. కొంత సౌకర్యం. కొంత అసౌకర్యం. చాలా అసౌకర్యం.

దాదాపు 21 ప్రశ్నలు ఆ ప్రశ్నపత్రంలో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ప్రశ్నను గమనించినా ఒక మనిషి అంతరంగాన్ని వెలికి తీయడానికి, అతడిలోని అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తాయి. అందుకే వీటిని అటు పోలీసు యంత్రాంగం, ఇటు న్యాయ వ్యవస్థ కూడా సందేహాస్పద ప్రశ్నలుగా భావించాయి.

అక్టోబర్‌ 2, 2010లో తిరువనంతపురం ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించినప్పుడే ఉద్రిక్తతలు తలెత్తాయి. అప్పుడే టీఎన్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఫోర్ట్‌ పరిధి పోలీసులు కేసు నమోదు చేశారు. 6000 మందితో సర్వే నిర్వహించారు. ప్రశ్నలను ఒక చిరుపొత్తం రూపంలో ఇచ్చి పూర్తి చేయించారు.ఆ అక్టోబర్‌ 2న గొడవలు జరుగుతున్న సంగతి తెలిసి ఫోర్ట్‌ ప్రాంత పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రశ్నలు ఉన్న పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

ఒసామా బిన్‌ లాడెన్‌ గురించి ఇప్పుడు భారతీయ ముస్లింల అంతరంగం ఏమిటో తెలుసుకో వలసిన అవసరం అమెరికాకు ఏమొచ్చింది? ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ముస్లింలకు సౌకర్యంగా ఉంటుంది? ఒక సార్వభౌమాధికారం కలిగిన ప్రజాస్వామిక దేశంలో అమలయ్యే చట్టాలలో ముస్లింల పర్సనల్‌ ఏ మేరకు జోక్యం కల్పించు కోవాలి? వంటి ప్రశ్నలు అనుమానాన్ని రేకెత్తించ కుండా ఎలా ఉంటాయి? ఇంత వివాదాస్పద సర్వే ప్రభుత్వాలకు తెలియకుండా ఎందుకు చేసినట్టు? అమెరికా తన బుద్ధిని ఇప్పటికీ మార్చుకోవడం లేదు. ఇక్కడి ముస్లింలను ఏ తీరుకు తీసుకువెళ్లాలని ఆ దేశం అనుకుంటున్నది అన్నది ఎప్పటికీ ప్రశ్నే.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE