భారతదేశంలో నరనారాయణుల ఆరాధనకు కీర్తిగాంచిన రెండో పెద్ద పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట. ఇది ప్రధానంగా నారసింహ క్షేత్రం. నరనారాయణులు ఇక్కడ స్వయం భువులుగా వెలిశారు. నింబాచలం లేదా లింబాద్రిగుట్టగా వ్యవహరించే ఈ క్షేత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత ప్రకృతి రామణీయకత. ఇదొక కొండ. అది కూడా రెండు అంతస్తులను మరిపిస్తుంది. ప్రథమార్థంలో సువిశాల పుష్కరిణి, కల్యాణ మంటపం, రథం కనిపిస్తాయి. దీనిని మాడ వీధి అంటారు. కొండ ఎగువ అంటే ద్వితీయార్థంలో గుహలో నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు. గర్భగుడిలో లక్ష్మీదేవి, కృష్ణార్జునుల విగ్రహాలు ఉన్నాయి. ఇదే కూడిక బద్రీనాథ్‌లో మాత్రమే ఉంది. ఇక్కడ నరసింహస్వామి ప్రసన్నంగా దర్శనమిస్తాడు. అదీ కాకుండా గుహ లేదా ఆలయం చుట్టూ బిల్వ వృక్షాలు నిండి ఉంటాయి. సాధారణంగా శివపూజకు ఉపయోగించే బిల్వపత్రాలను ఇక్కడ నరసింహ స్వామి ఆరాధనకు ఉపయోగిస్తారు. వేపచెట్లు కూడా ఇక్కడ ప్రత్యేకమే. ఆ వేపచెట్ల పేరిట క్షేత్రానికి ఆ పేరు (నింబాచలం) వచ్చిందని చెబుతారు.

ఈ క్షేత్రానికి ఉన్న పౌరాణిక ప్రాధాన్యం ఘనమైనది. శ్రీరాముడి సూచన మేరకు మారుతి ఇక్కడ తపస్సు చేశాడని చెబుతారు. గోదావరి తీరంలోని ఈ క్షేత్రంలో బ్రహ్మ, ప్రహ్లాదుడు కూడా తపస్సు చేశారని ప్రతీతి. గర్భగుడిలో యోగరూపంలో ఎడమ తొడపై లక్ష్మీదేవితో కలసి లింబాద్రి లక్ష్మీ నరసింహుడు పూజలందుకొంటున్నాడు. మూల విరాట్టుకు ఎడమవైపున కృష్ణార్జునులు నరనారాయణ రూపాలతో వెలిశారు. ఇంకా ఆంజనేయస్వామి, మధ్వాచార్యులు, ప్రహ్లాదుడు ఇదే గర్భగుడిలో పరివార దేవతలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భగుడికి ఈశాన్యభాగంలో శంకరుడు జోడు లింగాల రూపంలో దర్శనమిస్తాడు. స్వామివారి ఆలయ మెట్లకు ఉత్తరాన కమల పుష్కరిణి పేరుతో కొనేరు ఉంది. స్వామివారి గుట్టకు వాయవ్య భాగంలో మెట్ల ప్రక్కన ఆంజనేయస్వామి అయోధ్యా ఆంజనేయుడు అనే పేరుతో దర్శనమిస్తాడు. అక్కడనే చింతామణి తటాకం ఒక చిన్న కుంటగా మిగిలింది. ఈ క్షేత్రంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పురాణ కథ ఉండడం కూడా విశేషమే.

బ్రహ్మవైవర్తిక పురాణంలో కనిపించే శ్రీమన్నింబాచల మహాత్మ్యం ప్రకారం విష్ణు స్మరణ చేతనే మోక్షం లభిస్తుందా లేదా చెప్పమని శౌనకాది రుషులు సూతుల వారిని కోరారు. అందుకు సూత మహాముని ఈ మాటలు చెప్పారని పురాణ కథనం.

ఈ ప్రశ్నను ఇంతకు పూర్వమే జనమేజయ మహారాజు, నారదుడికి వేశారు. విష్ణుస్మరణ మాత్రం చేతనే ముక్తినిచ్చే మహా పుణ్యకరమైన పవిత్ర క్షేత్రం గౌతమీ నదికి దక్షిణ దిశగా రెండు యోజనాల దూరంలో ఉంది. అదే నింబాచలం. ఇది తపోక్షేత్రం, వృక్షాలు దేవతాంశ గలవి. హిరణ్యకశిపుని సంహారం తర్వాత క్రోధాయమానమైన నృసింహరూపాన్ని లక్ష్మీదేవి చూచి భీతురాలై ఇక్కడి పుష్కరిణిలో ఉన్న పద్మంలో ఘడియ కాలం దాగి ఉంది. అందుకే ఈ పుష్కరిణికి పద్మ సరోవరం / కమల పుష్కరిణి అని పేరు వచ్చింది.

శ్రీరామచంద్రుడు సీతాసమేతుడై ఈ క్షేత్రంలో సంచరించి రుషు

ల్ని పూజించాడు. శ్రీరాముడు నిర్యాణ సమయంలో ఆంజనేయస్వామి వరం కోరుకోవలసిందని చెప్పగా, ఆంజనేయుడు బ్రహ్మ పదవి ఇప్పించమని కోరాడు. నీవు నింబాచలం మీద తపమాచరించి నృసింహదేవుని అనుగ్రహం పొందమని చెప్పాడు. ఆంజనేయుడు తపమాచరించి దివ్యానుగ్రహం పొందాడు. పరమాత్ముని ఆజ్ఞతో ఈ క్షేత్రంలో మారుతి, అయోధ్య ఆంజనేయుడన్న రూపంతో కొలువై ఉన్నాడు.

శ్రీకృష్ణ నిర్యాణ సమయంలో ధర్మార్జునులు దుఃఖ సాగరంలో మునిగి పోయారు. కృష్ణుడు ధర్మరాజును ఓదార్చేందుకు, అర్జునుడు, తాను నరనారాయణ రూపంతో శ్రీన్నింబాచల క్షేత్రంలో నివసిస్తామని అభయమిచ్చాడు. శంకరుడు నారదుని ద్వారా ఈ క్షేత్ర మహిమను తెలుసుకొని, పార్వతీ  సమేతుడై ప్రమథ గణాలు సహా వచ్చి, బ్రహ్మ శిరః ఖండన పాప పరిహారార్థం  తపమాచరించాడు. పరమాత్ముని ఆజ్ఞతో శంకరుడు ఈ క్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చేందుకు జోడు లింగాల రూపంలో కొలువై ఉన్నాడు. భృగు మహర్షి ఇచ్చిన శాపం నుంచి విముక్తురాలు కావడానికి పార్వతీదేవి  శంకరుడిని ఉపాయం కోరింది. శ్రీమన్నింబాద్రి క్షేత్రంలో విరజానది ఒడ్డున చండికా రూపంలో నృసింహుని ఉపాసించుమని శంకరుడు చెప్పాడు. ఆవిధంగా పార్వతీదేవి శాపవిముక్తురాలైంది.

ఇంద్రుడు, నందీశ్వరుడు నింబాచలంనకు వచ్చి శాప విమోచన పొందారు. నంది నందీతటాకంలో తపమాచరించి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. పూర్వం నందీ తటాకంలోనే గద్ద పడి మరణించింది. ఆ క్షణమే స్త్రీ రూపం దాల్చి వెంటనే పురుషరూపం కూడా పొంది  శంఖ చక్రాది చిహ్నాలతో పుష్పకంపైన వైకుంఠానికి వెళ్లింది. నందీ తటాకం కృష్ణ భాగీరథిలతో సమానమైనది.

యమధర్మరాజు బ్రహ్మ ద్వారా ఈ క్షేత్ర మహాత్మ్యం విని తపమాచరించి పరమాత్ముని ఆజ్ఞతో తాను బిల్వవృక్షరూపమై ఈ క్షేత్రంలో నిలిచాడు.  ఆ బిల్వపత్రాలతోనే అర్చన జరిగేటట్లు  వరం పొందాడు. ఇక్కడ బిల్వ వృక్షాలకు అంత ప్రాశస్త్యం ఉంది.  తాను భూలోకంలో  సంచరించే విధంగా వరమివ్వమని విరజానది వరం కోరగా విష్ణుదేవుడు నింబాచల క్షేత్రంలో పశ్చిమ భాగంలో ప్రవహిస్తూ  జీవులనుద్ధరించుమని ఆజ్ఞాపించాడు.

విరజానది పరమ పవిత్రమైది. ఒకసారి ఈ నది ప్రవాహం పెరిగి ఒక కుక్క పడి చనిపోయింది. అటు విష్ణుదూతలు, ఇటు యమదూతలు కళేబరం కోసం వచ్చారు. యమదూతలను విష్ణుదూతలు అడ్డగించారు. ఈ జీవులు పాపకృత్యాలకు పాల్పడ్డారు కాబట్టి యమలోకానికి తీసుకువెళతామని యమ దూతలు, ఎంతటి పాపులైనా విరజానది స్నానం చేత ముక్తియోగ్యులౌతారు కాబట్టి వైకుంఠ ప్రాప్తి ఉంటుందని విష్ణుదూతలు వాదించుకున్నారు. దీనితో యమధర్మరాజు బ్రహ్మతో మొరపెట్టుకొన్నాడు. విరజానది జలస్పర్శ మాత్రం చేత ఏ జీవికైన ముక్తి కలుగుతుందని బ్రహ్మ  యమధర్మరాజుతో చెప్పాడు. చింతామణి నారాయణమూర్తి వక్షస్థలం మీద హారం. ఆ దేవత ఈ క్షేత్రంలో  తపస్సు చేసి తటాకరూపంలో వెలసింది.

భార్యా విక్రయదోషం పోవడానికి హరిశ్చంద్రుడు ఈ క్షేత్రంలోనే తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడ భైరవస్వామి శంకరుని ఆజ్ఞతో క్షేత్రపాలకు నిగా స్థిరపడ్డాడు. ఈ నృసింహమూర్తి కృత యుగంలో శ్వేతవర్ణంతో, త్రేతాయుగంలో లోహిత వర్ణంతో, ద్వాపరంలో పసుపు వర్ణంతో, కలియుగంలో మేఘవర్ణంతో ఉన్నాడని నమ్ముతారు.

ఇంతటి మహత్తర క్షేత్రం  తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో భీమ్‌గల్‌ ‌పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో లింబాద్రి గుట్ట మీద  ఉన్నది.

 ఆలయంలో సనాతనంగా పరంపరాగతంగా శ్రీమాన్‌ ‌మధ్వాచార్యుల మూల మహా సంస్థానమైన శ్రీమదుత్తరాది మఠాధీశుల పర్యవేక్షణలో తంత్రసార పద్ధతిలో నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.  సంవత్సరమంతా పూజలందుకొంటూ బ్రహ్మోత్సవ సమయంలో లింబాద్రిగుట్టపై ఉత్సవ కార్యక్రమాలలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తున్నాడు స్వామి.

నంది, నందీ తటాకం భీమగల్‌ ‌పట్టణంలో ఉన్నాయి. నందీ తటాకం కాలగర్భంలో కలసిపో యింది. భీమ్‌గల్‌, ‌పెద్దంగంటి (బడాభీమ్‌గల్‌) ‌మధ్యన ఎల్లమ్మ పేరుతో చండికాదేవి పూజలందు కొంటున్నది.

ప్రతి కార్తిక శుక్ల పంచమి మొదలుకొని కృష్ణపక్షం ద్వితీయ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పంచమి, అంటే మొదటిరోజు భీమగల్‌ ‌గ్రామాలయం నుంచి స్వామివారి పల్లకీ బయలు దేరుతుంది. ముత్తైదువుల మంగళహారతులతో, అమ్మవారి బోనంతో గుట్టకు చేరుతుంది. అప్పటి నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దశమినాడు స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. పౌర్ణమికి రథయాత్ర నిర్వహిస్తారు.

రథోత్సవానికి దాదాపు లక్షన్నర మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. ఆ మరునాడు డోల్సోవం, పుష్పయాగం, మూడో రోజు చివరిగా చక్కెర తీర్థం పూజలతో లింబాద్రి గుట్ట నుంచి భీమగల్‌ ఆలయానికి స్వామివారు చేరుకుంటారు. 12 రోజుల ఈ ఉత్సవాన్ని దాదాపు రెండున్నర లక్షల మంది దర్శించుకుంటారు. ఉత్తర తెలంగాణలో ఇది అతి పెద్ద జాతర. రాష్ట్రం నుంచే కాకుండా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు.

– యెన్ను శ్రీధర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE