భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది

– రామా చంద్రమౌళి

మనిషికి రెండు ప్రపంచాలు. ఒకటి నీకు మాత్రమే చెందిన ప్రపంచం. సృష్టి ఎంతో గొప్పది.. అర్థం కానిది.. వింతైనదీ.. అత్యంత సరళమైనదీ ఐనా అతి సంక్లిష్టమై నిత్యనూతనమైనది కూడా. ఎప్పుడైనా అలా అలవోకగా కళ్లు మూసుకుంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచంనుండి చటుక్కున మాయమై నీ స్వంత ప్రపంచంలోకి ప్రవేశిస్తావు. అంటే కన్నుమూస్తే నీలోనే ఒక ప్రపంచం. కళ్లు తెరిస్తే ఈ విశాల ప్రపంచంలో ఒక నువ్వు.

ఏడాది క్రితం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఇంట ర్వ్యూకు హాజరై, హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూలో సీనియర్‌ ‌ప్రొఫెసర్‌గా ఎంపికైన తర్వాత వరంగల్లు నుండి నేనూ నా భార్య వచ్చి దగ్గర్లోనే ఒక త్రీ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌ను కిరాయికి తీసుకుని ఉంటున్న క్రమంలో.. మా ఎదురుగా రెండే గదులున్న ఒక చిన్న ఇండివిజ్యువల్‌ ఇం‌టిని చౌకగానే కొనుక్కుని దంపతులు దాంట్లో కాపురానికి దిగారుచకచకా కొన్ని అత్యవసర మరమ్మతులు చేయించుకుని. అది అతి చిన్న వీధి.. ఒకవేపు డెడ్‌ఎం‌డ్‌. ‌మొత్తం రెండు వైపులా కూడి పదిండ్లుంటా యేమో. ప్రతిరోజూ ఉదయం లేవగానే వాకింగ్‌కు తయ్యారౌతూ బయటి బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ అలా దూరపు కొండల్లోకి చూస్తూండడం అలవాటైంది. సరిగ్గా అదే సమయానికి ఇంటెదురుగా ఉన్న అతను.. అతని పేరు నరసింహం తన చిన్న పిట్టవంటి స్కూటీని తీసుకుని బయటికొస్తాడు. కిక్‌కొట్టి స్టార్ట్ ‌చేసి కూర్చుంటాడు. అప్పుడామె అందంగా, నీట్‌గా తయారై భుజాన ఒక లేడీస్‌ ‌బ్యాగ్‌ను తగిలించుకుని వచ్చి వెనుక కూర్చుంటుంది.

ఇక్కడ నరసింహం గురించి కొంచెం చెప్పాలి. అతనికి బహుశా అరవై ఆరు ఏళ్లుంటాయేమో. ఎప్పుడూ చాలా చిన్నగా కత్తిరించిన తెల్లని జుట్టు, బుగ్గ చెంపలు. నిరంతరం పాన్‌ ‌నములుతూండడం వల్ల గారపట్టిన పళ్లు, వాటిలో కొన్నిఊడిపోవడంతో బొక్కి నోరు, నొసట పసుపురంగు భస్మం లాంటి ఏదో పూత, శాశ్వతంగా ధుమధుమలాడే ముఖం.. బీద బీదగా వాలకం.. కావలసిన సైజ్‌కన్నా పెద్దగా జబ్బలపైనుండి జారుతున్న టి షర్ట్, ‌మోకాళ్ల దాకా లొడలొడ ఒక పెద్ద నిక్కర్‌.. ‌చూడగానే ఎవరిదైనా దృష్టిని ఆకర్షించే వింతరూపం. అతను ఏదో సెంట్రల్‌ ‌గవర్న్‌మెంట్‌ ‌సర్వీస్‌ ‌చేసి రిటైరై ఇంట్లోనే ఉంటాడు. ఆ మధ్యనే తెలిసిందేమిటంటే అతను జాతకాలూ, జ్యోతిశ్శాస్త్ర విషయాలూ చెబుతూ, దోషోపశమన క్రతువులూ చేస్తూంటాడనివిన్నాను నేను. ఆమె పేరు వసుధ. మా ఇద్దరి ఇళ్లలో పనిచేసే పనిమనిషి ఒక్కతే కావడంవల్ల ఆ పొరుగు కుటుంబం గురించి మా ఆవిడ చెవినబడ్డ సంగతులను నాతో పంచుకుంటుంది. అదీగాక ఇప్పటి జీవన విధానాన్ని బట్టి అందరూ పిల్లలను ఎక్కడో కోల్పోయి.. ప్రతి ఇంటిలోనూ వయసుమళ్లిన భార్యాభర్తలే మిగిలి.. అనారోగ్యాల సహవాసంతో.

అతని భార్య సౌందర్యస్పృహ ఉన్న మనిషే. యాభై ఎనిమిది ఏళ్లుండొచ్చు. పెద్ద అందగత్తె కాదుగాని ఫరవాలేదు టైప్‌. ‌నీట్‌గా పద్ధతి ప్రకారం వస్త్రధారణతో తయారై ఆ స్కూటీ మీద కూర్చోగానే సరిగ్గా ఆరూ ఇరవైకి బండి బయల్దేరుతుంది. తెలిసిందేమిటంటే ఆమె గీతం యూనివర్సిటీ, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇం‌గ్లిష్‌గా పని చేస్తోంది. ప్రతిరోజూ వాళ్ల కాలేజ్‌ ‌బస్సు ఒక పదినిముషాల దూరంలో ఉన్న పాయింట్‌ ‌మీదికి వస్తే.. దానికి ఈ నరసింహం వేళకు అందిస్తే ఆమె ఆరున్నరకుబస్సెక్కి, గంట ప్రయాణం చేసి.. మళ్లీ సాయంత్రం అదే బస్సులో తిరిగొచ్చి..ప్రతిదినం.. ఒక బస్తాలో పిండినినింపి ఉంచితే కుదించినట్టై.. శరీరం ఏడాది పొడుగునా ర్యామ్మింగ్‌.

‌పనిమనిషి సమ్మక్క చెప్పినదాన్ని బట్టి.. నరసింహం దంపతులకు ఒకే ఒక్క కొడుకు. సాఫ్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌. ‌హైటెక్‌ ‌సిటీలో ఉద్యోగం అసెంచ్యూర్కం పనీలో. కొత్తగా పెళ్ళై.. అమెకూడా సాఫ్ట్‌వేరే చేస్తూ.. గచ్చిబౌలీలో కిరాయి కొంప.. అపార్ట్‌మెంట్‌.

‌పొద్దున లేస్తే ఉదయం నుండి రాత్రి పడుకునే దాకా పరుగే పరుగు.. పెద్ద రేకుల షెడ్డులో తలుపులు మూసి పావురాల మందను గెదిమి గెదిమి తరుము తున్నట్టు..ఒకటే అలసట.

ఐతే.. ఈ నరసింహం.. వసుధ ఇద్దరివి రెండు వేర్వేరు ప్రపంచాలు. ఎవరి ప్రపంచంలో వారు బతుకుతూ.. ఒకరికి ఒకరు ఏ మాత్రం చెందని వ్యక్తులై.. ఎవరి జీవితాన్ని వాళ్లే జీవిస్తూ.. లోలోపల అది తృప్తా, అసంతృప్తా, సంతుష్టులుగానే ఉంటు న్నట్టా, లేనట్టా, ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి మసలుకుంటున్నట్టేనా లేదా. అతని పెన్షన్‌ ‌ప్లస్‌ ‌జాతకాల ఆదాయం.. ఇద్దరు కలిసి దాదాపు నెలకు రెండు లక్షలు సంపాదిస్తూ ఏ రకంగా జీవిస్తున్నారు.. అన్న దిశలో వాళ్లిద్దరు ఇప్పుడు మనతో మాట్లాడ్తారు. విందామా.

నరసింహం, రిటైర్డ్ ‌సెంట్రల్‌ ‌గవర్న్‌మెంట్‌ ఉద్యోగి..66 ఏళ్ళు.

ధనం మూలం ఇదం జగత్‌. ఈ ‌సమాజంలో అన్నింటికీ ధనమే మూలం అని ఉవాచ. ఇది నేను బుద్దెరుగుతున్న వయసు నుంచి అనేక అనుభవాలను క్రోడీకరించుకుని ఏర్పర్చుకున్న స్థిర అభిప్రాయం. ఈ నా అభిప్రాయం ఎన్నడూ మారదు. నాది అతి బీద బ్రాహ్మణ కుటుంబం. చాలా మంది సంతా నంతో కూడిన కుచేల కుటుంబం మాది. నేను అందరిలోకి పెద్దోణ్ణి. పైస పైసకు కటకట. అదృష్టవ శాత్తు ఒక కేంద్ర ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం దొరికింది నాకు ఇరవై ఏళ్లకే గ్రామీణ ప్రాంతాలలో ఊరూరు తిరిగి పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను రికార్డ్ ‌చేసి తెచ్చి ప్రభుత్వానికి దాఖలు చేయడం నా పని. ఎప్పుడూ క్యాంప్‌లు. ప్రయాణాలు. టిఏలు, డీఏల బిల్లులు చేసుకుని క్లెయిం చేసు కొని వచ్చినప్పుడు తీసుకోవాలె. దీంట్లో అవి ఎప్పుడు వస్తాయో చస్తా్త యో అని బిల్స్‌ను పై అధికారులకు అమ్యామ్యా ఇచ్చి ఎక్కువ రాసుకొనుడు. ఈ రకంగా దొరికినంతలో నీతో..అవినీతో నాల్గు పైసలు పోగు చేసుకు నుడు అలవాటైంది. అప్పుడు పెళ్లి. మా వాడలోనే ఒక బ్రాహ్మణ పిల్ల. మా అక్క రాయబారం చేసి వాళ్లింట్ల మాట్లాడింది. ఆమె అందంగా తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేట్టుండేది. అందాన్నేంచేసుకుంటం. కొరుక్కు తింటమా.. కడుక్కుతాగుతమా. పెళ్లినాడు ఆ పిల్ల ఒకటే కండిషన్‌ ‌పెట్టింది. ‘మధ్యల నా చదువునాపి పెళ్లి చేస్తాండ్లు. కాని నాకు చదువుకోవాలనుంది. నన్ను చదువుకోనివ్వాలె. మధ్యల ఆపొద్దు’ అంది. ఒప్పుకున్నం. నిజానికి ఆమె నాకు కాకిముక్కుకు దొండపండే. ఆ సంగతి నాకు తెలుసు. ఐనా ఆడదంటే మగానికి అణిగిమనిగి ఉంటూ మగన్ని దేవుని లెక్కచూచుకోవా అని బలమైన భావన. ఐనా కాలం గడవనీ దీన్ని నా దారికి తెచ్చుకుని నా తడాఖా చూపిస్త అనుకున్న. పెళ్లయి ఒక రాత్రి కూడా కానేలేదు. వారం పొడుగు క్యాంప్‌ ‌వచ్చింది. వెళ్తే నాల్గుడబ్బులొస్తై.ఇంట్లుండి ఏం చేస్త.. అందమైన పెండ్లాన్ని చూచుకుంటా కూర్చుంటె పైసలొస్తయా? అనుకున్న.. వెళ్లిపోయిన. అప్పుడు బంగారం తులం నూట ఎనభై ఉండె. జీతం మొత్తం వచ్చేది నూటా యాభై. అంతే. జీతం పడ్డనాడే ఒక దోస్త్ ‌దగ్గర ఒక నలభై రూపాయలు అప్పుజేసి ముందు బజారుకెళ్లి ఒక తులం బంగారం కొని మా అమ్మకిచ్చేది. అమ్మ మెచ్చుకుంటే పెళ్లాం గుణుగుడు. మరి నెల గడిచేదెట్లా.. ఆడ ఈడ మేనేజ్‌ ‌ద షో. వసుధ ‘నేను బి.ఎ ఫీజ్‌ ‌కట్టాలె’ అని గొడవ చేసేది. ఉహూ.. నా దగ్గర పైసల్లేవు పో మీ ఇంటికి అని కొట్టి పంపుడు. అక్కడ ఏం చేసేదో…! వాళ్ల నాన్నను బతిమాలి బి.ఎ.లో చేరింది. అప్పుడే కడుపు.. చదువు కోసం తన దోస్తులను వెంటపెట్టు కుని పోయి అబార్షన్‌. ‌నేను అరచిన గట్టిగ. చదువు ముఖ్యమా సంతానం ముఖ్యమా అని. ఉహూ. వినది. మొండి. నాకేమో నెలలకు నెలలు క్యాంప్‌లు. ఎప్పుడో వచ్చుడు ఎప్పుడో పోవుడు.. వసుధ వేడి చూపులు చూసేది. నాకు మాత్రం.. డబ్బు డబ్బు.. డబ్బు సంపాదించాలె అన్న స్పృహ. మరుసటేడు మళ్లీ గ•ర్భం. తల్లిగారింటికి పంపి ‘తొలి చూలు.. తల్లిగారిదే’ అన్న. ఖర్చు తప్పింది. మళ్లీ క్యాంప్‌. ఎన్ని క్యాంప్‌లుంటే అన్ని అదనపు డబ్బులు. పిల్లవాడు రెండేండ్లకొస్తూంటే.. ‘నేను ఎంఎ కట్టాలె’అంది వసుధ. దే•నికదే చదువులో వసుధ జెం. బి.ఎ. ఫస్ట్‌క్లాస్‌. ఎం.ఎ. ‌చేస్తూ గుంటూర్‌లోని ఒక ప్రైవేట్‌ ‌కాలేజ్‌లో ఫాకల్టీగా చేరింది. ‘‘జీతమెంత?’’ అనినేనడిగితే మరుసటేడు ఎం.ఫిల్‌ ‌చేసే పోగ్రాం చెప్పింది. పెళ్లప్పుడు’ నా చదువును ఆపరని మాటిచ్చిండ్రు.. ఇప్పుడు నక్రా చేస్తే పోత మా ఇంటికి’ అని పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోయేది. భయపెట్టాలని, లొంగదీసుకోవాలని ఎన్నిసార్లు కొట్టానో చెప్పలేను వసుధను. ఐతే ఆమె ఎంత సాహసి అంటే నేను ఒకటి కొడ్తే నన్ను ఎగబడి నాల్గుకొట్టేది. మొత్తం మీద వాళ్ల పుట్టింట్లో ఏం ఏడ్చిందో ఎవరెవర్ని ప్రాధేయపడ్డదో మొత్తానికి పెళ్లయి ఒక పిల్లాన్నికని స్థిరపడ్తున్న సమయానికి.. అప్పటికి గుంటూర్‌ ‌పి జి కాలేజ్‌లో లెక్చరర్‌గా స్థిరపడి విద్యార్థి లోకంలోకి అద్భుతంగా పిల్లలకు పాఠం చెప్పే ‘చదువుల తల్లిగా’ పేరు తెచ్చుకుంది. నిజయతీగా చెప్పాలంటే నాకు ఇప్పటికీ డబ్బంటేనే పిచ్చి. ఒక్కో రూపాయి పోగు చేసి 2002 నాటికి నానా సెమినార్లకూ, ఎక్స్‌టర్నల్‌ ‌యూనివర్సిటీ పరీక్షలకు హాజరౌతూ, ఎవరెవరో గైడ్‌లను బతిమాలుకుంటూ డాక్టరేట్‌ ‌పట్టాను సంపాదించింది వసుధ. ఒక గమ్మత్తు జరిగింది. ఆ రోజు రాత్రి నాగార్జున యూనివర్సిటీ కాన్వొకేషన్‌లో వసుధ వేలమంది సమక్షంలో డాక్టరేట్‌ ‌డిగ్రీతోపాటు బంగారు మెడల్‌ను పట్టుకొచ్చి నాకు చూపిస్తే నేను అదే రాత్రి అప్పటిదాకా అన్ని కోరికలనూ చంపుకుని, భార్యాపిల్లాడిని కూడ కాదని, బట్టా పొట్టా పట్టించుకోక జమచేసుకున్న డబ్బుతో గుంటూరు గుజ్జనగూళ్ల దగ్గర కొన్న రెండు వందల యాభై చదరపు గజాల జాగా బాపతు రిజిస్టర్డ్ ‌కాగితాల కట్టను చూపించాను వసుధకు.

‘‘నీకు కాగితాల విలువ తెలియదు నరసింహం. కరెన్సీ నోట్ల వంటి కొన్ని కాగితాలను మనం వాడుకొని వదిలేస్తాం. కాని ఈ నా డిగ్రీ సర్టిఫికేట్స్ ‌వంటి కాగితాలను జీవితాంతం వాడుకుంటూ పదిలంగా దాచుకుంటాం. ఈ తేడా నీకీ జీవితంలో అర్థం కాదు.’’ అంది. వసుధ ఆ మాటన్నప్పుడు నిజంగా నాకు గొండెల్లో తుపాకీ గుండు తాకినట్ట నిపించింది.’’ కాని నా మగ అహంకారం ‘‘పోవె.. దేనికీకొరగావు ఆ నీ దిక్కుమాలిన కాగితాలు’’ అని ఆమె చెంపలపై కొట్టించింది. guilty I was.

తెలుసు నాకు నేను పరమ లోభినని.

నాకు తెలిసిన నా సహ లోభులు కొందరున్నారు. ఇది ఒక రకమైన వ్యాధి. రుగ్మత. డబ్బు అనేది ఒక వ్యామోహం. నేను అన్నీ తెలిసి నా భార్య వసుధ నెలసరి లక్ష రూపాయల జీతాన్ని ప్రతినెలా ఖాతాలో జమ కాగానే అది నా కొడుకు కంట్రోల్‌లో ఉండేట్టు ఏర్పాటు చేసి వాటిని నా కొడుకు తెలివితో మ్యూచువల్‌ ‌ఫండ్స్‌లో పెట్టుబడి పెడ్తూ, RRR చుట్టూ అనేకానేక చోట్ల అనేక స్థలాలు కొంటూ వాటి విలువలను ఇంకా ఇంకా పెంచుకుంటూ, రెండ్రూపా యల వడ్డీకి లక్షల రూపాయలను తిప్పుకుంటూ ప్రతి నెలా వాటిని వసూలు చేసుకోలేక హార్ట్ అటాక్‌ ‌తెచ్చుకుంటూ, షుగర్‌ ‌లెవెల్స్‌ను కోట్ల డబ్బులా పెంచుకుంటూ.. చివరికి వీటన్నింటినీ మొన్న ఆరు నెలలక్రితం పుట్టిన నా మనుమరాలి పేర ట్రాన్స్‌ఫర్‌ ‌చేసి.. గత కొన్నేళ్లుగా ఒక ప్రొఫెసర్‌ ‌హోదాలో పనిచేస్తున్న నా భార్యకు ఒక మంచి దివ్య భవనాన్నీ, ప్రతిదినం స్వంత కార్‌లో ఒక డ్రైవర్‌ను పెట్టుకుని కాలేజ్‌కు వెళ్లి వచ్చే ఘనమైన జీవితాన్ని ఇవ్వగలిగి ఇవ్వకుండా అన్యాయం చేసి.. సరియైన నా నాత్మ గౌరవాన్ని నేనే కాపాడుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఈ నా బట్టలు, నా రూపురేఖలు, నా సామాజిక విలువలు.. నా సుఖాలు..అన్నింటినీ పోగొట్టుకుని.. సత్యం చెబుతున్నాను.. ఈ రోజు బెంగళూరు వంటి నగరంలోని నా తమ్ముల ఇంటికి పోవాలంటే నా భార్య ఒక ప్రొఫెసర్‌గా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ‌సెకండ్‌ ఎ.‌సి.లో పోతే నేను నా లోభిత్వంతో కాచిగుడా ఎక్స్‌ప్రెస్‌ ‌థర్డ్ ‌క్లాస్‌ ‌నాన్‌ ఎ.‌సి.లో వెళ్తున్నా.

ఈ లోభి మనస్తత్వంతో నా భార్య వసుధకు ఏదైనా జబ్బు చేసినా నేను డబ్బు ఖర్చవుతుందని ఆమెకు మందులు కూడా తీసుకు రాను. దవాఖానకు తీసుకుపోను. ఒకవేళ తీసుకుపోయినా నా ప్రొఫెసర్‌ ‌భార్యను తీసుకుని ఆర్‌ ‌టి సి బస్సులో ఆమెను ఫ్రీగా నాకు బస్‌ ‌టికెట్‌లో వెళ్తా.

అసలు నా దగ్గర రహస్యంగా కూడబెట్టిన ఈ కోట్లకొద్ది డబ్బు ఎవరికి? నాకూ నా భార్యకూచెంద నపుడు. ఈ ఆస్తులు, ఈ జాగలు, మ్యూచువల్‌ ‌ఫండ్‌లోని కోట్ల పెట్టుబడులు ఎవరికోసం. యుక్త వయసులో పెళ్లి చేసుకున్న అందగత్తె ఐన నా భార్యను సుఖపెట్టక, నేను సుఖపడక, పోగొట్టుకున్న ఏండ్ల పర్యంత జీవితపు విలువ ఎంత? నేను అతి పశ్చాత్తాపంతో ఈ రోజు ప్రకటిస్తున్నాను. money unspent is money unearned… ఎప్పుడు ఎలా జీవించలో అలా జీవించక భార్య మహోజ్జ్వల యవ్వనాన్ని హరిస్తూ నాకు నేను జీవితాన్ని నిరర్థకం చేసుకున్న స్వయంకృత పాపానికి సిగ్గుతో కుంచించుకుపోతున్నాను.

 ఇప్పుడు 66 సంవత్సరాల వయసున్న నేను ఎప్పుడూ జీవించనేలేదు. all these years I was leaving dead..

వసుధ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇం‌గ్లిష్‌.. 58 ఏళ్లు.

మనిషి జీవితం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుం దని నేననుకోను. దేవుణ్ణి నమ్మేదాన్ని కాబట్టి కొంత విధికూడా మన జీవితం వెనుక ఉండి కార్యకారణ తంతును ఏదో శక్తి కూడా నడిపిస్తుంటూందని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా భారతదేశంలో స్త్రీ ఎప్పుడూ సర్వస్వతంత్రగా లేదు . ఎప్పుడో గణరాజ్య కాలంలో మాతృస్వామ్య వ్యవస్థలో తప్ప. అందువల్ల ఈ 58 సంవత్సరాల జ్ఞాత అజ్ఞాత జీవితాన్ని జీవిస్తూ వస్తున్న నాకు ఎవరో ఒక కవి స్త్రీ గురించి రాసిన కవిత్వ పాదాలు ఎప్పుడూ గుర్తొస్తూంటాయి. అవి.,

అమ్మ చెప్పింది స్త్రీకి రెండు జీవితాలని

ఒకటి ఇక్కడ.. మరొకటి అక్కడ అని

కాని అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలెన్నో పుట్టినప్పటి నుంచి పురుషుని చేత కీలుబొమ్మలా ఆడించబడే స్త్రీ జీవితాన్ని ప్రధానంగా రెండు దశలుగా విభజించవచ్చు ఒకటి.. స్త్రీ వివాహపూర్వ జీవితం, రెండు.. వివాహానంతర జీవితం అని. (వి.పూ-వి.అ). నాకు కూడా అందరి స్త్రీలలాగే ఈ రెండు దశల జీవితం ఉంది. నా జీవితం ఏమంత విశాలమైందీ, విలక్షణమైందీ ఏమీ కాదు. కాని తప్పక నా జీవితం ప్రత్యేకమైందే. ఎందుకంటే అసలు ఏ స్త్రీ కూడా నా అంత రసహీనమైన ప్రేమ రాహిత్యంలో బ్రతకదు. అతి నిస్సారమైన బ్రతుకు నాది.

నాకు జన్మతః చదువుకోవడమంటే చాలా ఇష్టం. మా నాన్న నన్ను ‘చదువుల తల్లీ’ అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఆ పిలుపు నన్ను ఇంకా బలంగా సంధించిన బాణంలా గురిపెట్టి వదిలేది. నేను మెరుపు తీగలా ఉండే తెల్లని, బంగారు వన్నెతో మెరిసిపోయే, సన్నని వీణతీగ వంటి బ్రాహ్మణ అమ్మాయిని. చాలా చురుకైన, తెలివైనదాన్ని. మామూలుగానే రోజూ బడికి వెళ్తూ, ఇంటికి వస్తూ.. చక్కగా పాఠశాల మొత్తం మీద ఫస్ట్ ‌వస్తూ అందరిచేతా గుర్తింపు పొందిన నేను ఎస్సెస్సీలో జిల్లా స్థాయి మొదటి ర్యాంక్‌ను పొందాను. ఇంటర్‌లో మళ్లీ ప్రథమంగా వచ్చాను. బి.ఎ. ఇంగ్లిష్‌లో చేరవలసిన నాపై ఎండాకాలపు సంధి సమయంలో అనూహ్యమైన ‘పెళ్లి’ అనే పిడుగు పడింది. ఒక రోజు కాలేజ్‌ ‌నుంచి ఇంటికి రాగానే మా వీధిలోనే ఉండే ఒక నడివయసు స్త్రీ, ఆమె తమ్ముడు నరసింహం అనే వ్యక్తితో దర్శనమిచ్చి ఒక బాంబును సంధిం చింది. ఒక్కదాన్నే అమ్మాయిని నేను ఇంట్లో. అందువల్ల వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో అందరూ నా చుట్టూ చేరి నా ప్రాణం తిని.. ఒప్పించుట. అందువల్ల మర్నాడు.. ఆ పెళ్లి వాళ్ల సమక్షంలో ఒక కండిషన్‌తో పెళ్లికి ఒప్పుకున్న. ఆ కండిషన్‌ ఏమిటంటే.. ‘బలవంతంగా ఒప్పించి ఇప్పుడు మీరీ పెళ్లి చేస్తున్నారు. కాని నాకు చదువుకోవాలని ఉంది. కాబట్టి పెళ్లయినా నన్ను నేను కోరే స్థాయి వరకు చదువుకోనివ్వాలి.. ఎవ్వరూ నా చదువును ఆపకూడదు.’అని. వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా నరసింహంతో సహా సరే అని అందరూ తలూపి ఒప్పుకున్నారు. తర్వాత కొద్ది రోజులకు పెళ్లి జరిగిపోయింది. ఇక షురూ.. భర్త హింస. మొదట రాక్షసమైన సహజమైన సెక్స్ ‌హింస. తర్వాత ఉద్యోగ రీత్యా ఏ లోతట్టు గ్రామీణ ప్రాంతాలకో వెళ్లే నరసింహం.. మూడు రోజులిక్కడ.. వారం రోజులు క్యాంప్‌. ‌భార్యాభర్తల మధ్య ఉండవల సిన ప్రేమ, సున్నితమైన స్పర్శ.. వాత్సల్యంతో కూడిన అనునయింపు.. ఇవేవీ మచ్చుకైనా లేని మృగం వంటి మనిషి నరసింహం అని అతి చాలా తక్కువ సమయంలోనే నాకు బోధపడింది. ఇక మిగిలింది చదువుకోసం యుద్ధం. బి.ఎ. ఇంగ్లిష్‌లో చేరిన ఆరు నెలలకే.. కడుపు. ‘నా చదువు.. నా చదువు’ అని దుఃఖం. ఒకరోజు ధైర్యం చేసి ఒక క్లాస్‌మేట్‌ను తీసుకుని సిటీలో కాస్త అభ్యుదయ భావాలున్న ఒక గైనకాలజిస్ట్ ‌దగ్గరికి వెళ్లి అబార్షన్‌ ‌చేయించుకున్న. చాలా పెద్ద సాహసం అప్పుడది. దాని ఫలితం విపరీతమైన హింస నరసింహంతో. ‘చదువు ముఖ్యమా.. సంతానం ముఖ్యమా’ అని ప్రశ్న. కొట్టుడు. వాళ్ల కుటుంబం తిట్టుడు.

 అప్పుడే ఒక రాత్రంతా నిర్విరామంగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చాను.

 ఒకటి- ఎవరి జీవితాన్ని వారే స్వయంగా నిర్మించుకోవాలె. రెండు- ఎవరికైనా మనిషికి మనోధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చేది కేవలం చదువే. మరుక్షణమే రాతినేలలో నుంచి మొలకలా ఎదగడం, చదువు పట్ల ఏకాగ్రతతో అడుగులు వేయడం ప్రారంభించిన. బి.ఎ. ఐపోయి ఎం.ఎ. ఇంగ్లిష్‌లో సీట్‌ ‌తెచ్చుకుని ఫీజ్‌ ‌కట్టడం దగ్గర పెద్ద ప్రతిబంధకం ఎదురైంది నరసింహం దగ్గరినుండి. ‘ఇంకా చదువెందుకట’ అని ఒక వెక్కిరింత. అప్పుడు చదువును కొనసాగిస్తూనే ఒక ప్రైవేట్‌ ‌పి.జి. కాలేజ్‌లో ట్యూటర్‌గా చేరిన. అది ఒక మహత్తర•మైన మలుపు నా జీవితంలో. అ రోజే నా కాళ్ల మీద నేను నిటారుగా నిలబడ్డ అన్న ఆత్మ విశ్వాసం ఏర్పడింది. ఇక స్వంత నడకనూ, ప్రయాణాన్నీ కొనసాగించాలె. విద్యార్థులు, పాఠాలు, కాలేజ్‌ ‌యాజమాన్యం, చేదోడు వాదోడు.. నాన్‌ ‌కర్రిక్యులర్యాక్టివిటీస్‌, ఎగ్జాంస్‌ ‌బ్రాంచ్‌ ‌నిర్వహణ ఇత్యాది. అనతికాలంలోనే ఇటు మేనేజ్‌మెంట్‌తోనూ, విద్యార్థుల్లోనూ మంచి పేరు,ప్రశంసలు.

 ఈలోగా సంసారంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తూండడం. నరసింహం డబ్బు విషయంగా ఎవరినీ ఎప్పుడూ నమ్మడు. ప్రతి పైసా విషయంగా లెక్క..ఆరా.. ‘ నీ జీతం తే.. నా జీతం విషయం నువ్వు అడుగొద్దు’. నీ జీతంతో నువ్వు ఇల్లు నడిపియ్యి. నేను ఆదా చేసే పిసినారి డబ్బుతో చూస్తూండు ఏ మిరకిల్స్చేస్తానో’ అని హెచ్చులు. అంతా ఆర్థిక ఎమర్జన్సీ ఎప్పుడూ! నా ఆలోచన ‘పట్టించుకోవద్దుదేన్నీ.. శతకకారుడు చెప్పినట్టు.. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు’ అని.

 ఇక పి.హెచ్‌ .• ‌చేయాలి. ఎంట్రన్స్ ‌రాయాలి. ఏదైనా యూనివర్సిటీలో గైడ్‌ను వెదుక్కుని ఒప్పించుకోవాలె. మనసు లైట్‌ ‌హౌజ్బీకన్‌లా వెదుకుతోంది. నాగార్జున యూనివర్సిటీ, గుంటూర్‌.. ‌దొరికింది.

 ‘పి.హెచ్‌ ‌డి ఎందుకట ఎక్కడో అక్కడ ఒక ప్రైవేట్‌ ‌స్కూల్‌లో టీచరమ్మగా చేరక’ అని దీర్ఘాలు.. రాగాలు. ఇంట్లో శల్య సారథ్యం. పిల్లాడు పెరుగు తున్నాడు. లోకం తెలుస్తోంది వాడికి. ఇంట్లో సంస్కారవంతమైన వాతావరణం ఉండాలి. కాని ఎప్పుడూ కలహాలు.. డబ్బు పిసినారి ప్రతిఘటనలు. ప్రతి పైసకూ కటకట. అకడమిక్‌గా సెమినార్లకు పో. పేపర్లు ప్రజెంట్‌ ‌చేయి..’ లాంటి పురమా యింపులు. ఒత్తిళ్లు. నేషనల్‌ ‌సెమినార్లకు పోతనంటే.. ఎవరొస్తారు వెంట.. రక్షణ ఏది.. ఇప్పుడు పోవడం అవసరమా.. స్వేచ్ఛ లేదు. ప్రతిదానికీ ప్రశ్న. డబ్బు సర్దుడు చేయడు. నీ డబ్బుతోనే నువ్వు ఏడ్వు..అని ఉత్తర్వు. అప్పుడప్పుడు కొట్టుడు. ఏడ్పించుడు. హింస. అసలు పర్సనల్‌ ‌జీవితం మొత్తానికే బంద్‌. ఎప్పుడో ఒకప్పుడు గోడమీద బల్లి పాకినట్టు. నిజానికి సెక్స్ ఒక గొప్ప కళ. దాని లోతుపాతులసలే తెలియని మెకానికల్‌ ‌పర్ఫార్మెన్స్. ‌జస్ట్ ‌డు అండ్‌ ‌గో. అసలు జ్ఞాపకాలే లేని శుద్ధ శూన్యత.

పన్నెండేళ్లు..ఇక విజ్ఞాన్‌ ‌యూనివర్సిటీ.. అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌ ఆఫ్‌ ఇం‌గ్లిష్‌.

 ‌హమ్మయ్య బండి పట్టాలెక్కింది.

 ఇంట్లో గొడవలు.. నీ జీతం ఏది.. నా జీతం సంగతి చెప్పను. నీకు డబ్బు మల్టిప్లికేషన్‌ ‌తెలియదు. నేను చూడు ఏమేమి చేస్తనో.. జస్ట్ ‌సీ. అని బుకాయింపు.

 ‘అరే.. జీవితమంటే కేవలం డబ్బేనా’ అని ప్రశ్నిస్తే,

 ‘నన్నే ప్రశ్నిస్తావా’ అని హింస. స్త్రీని కొట్టే ప్రతి మగాడూ ఒట్టి వెధవ అని నా నికర భావన. ఇక కాస్త తెగింపు అవసరమై.. అకారణంగా హింసిస్తూ నువ్వు ఒకటి కొడ్తే నేను మూడు కొడ్తా..అని జవాబు.

 ప్రొఫెసర్‌ ఐన తర్వాత జీతం నెలకు లక్ష•. అప్పటిదాకా తన సంపాదనలో ఒక్క పైసా ఇవ్వని నరసింహం .. తన డబ్బుతో గుంటూరు గుజ్జనగూళ్ళ దగ్గర ఒక ప్లాట్‌ ‌కొన్నడు తన పేరనే. ఎవడికో పది లక్షలు రెండు రూపాయల వడ్డీకిచ్చి.. వాడి చుట్టూ తిరుగుడు. కొడుకు బి.టెక్‌కు వచ్చి ఎదుగు తున్నప్పుడు ‘ప్రతిదానికి అమ్మనడుగు’ అని పురమా యింపు. తల్లి పాత్ర, యూనివర్సిటీ ఉద్యోగ బాధ్యత. అన్‌సపోర్టెడ్‌ ‌జీవితం. అసలు వ్యక్తిగత జీవితం శూన్యమై.. ఏమిటో.. నిస్పృహ.

ఎడారిలో ప్రయాణం.. నిరంతర రసహీన యాత్ర.  జీవితమంతా.. అంతా ఉన్నట్టు అందరికీ భ్రమ కలుగుతున్న గమనిం పులో అసలు ఏమీ లేని వెలితి ఎవరికీ కనబడకుండా.. ఇక నాతోనే నేను ఒక దోబూచులాట.

 పిల్లవాడి బి.టెక్‌ ‌పూర్తై.. అద్భుతమైన కంప్యూటర్‌ ‌ప్రతిభతో ఒక పెద్ద్ద కంపనీలో హైదరా బాద్‌లో ఉద్యోగం దొరకగానే.. నరసింహం రిటైరై.. నీ ఉద్యోగం విడిచిపెట్టు.. పద హైదరాబాద్‌.. అని ఒకటే గోల. తన డబ్బును హైదరాబాద్‌లో RRR దగ్గర భూములు కొని వండర్స్ ‌చేశాడట. ఆస్తులు సంపాదించి తెలివి తేటలు చూపిస్తాడట. ఒక మంచి షర్ట్ ‌కొనుక్కోడు. చెప్పులు వేసుకోడు. కలిసి ఎక్కడికీ రాడు.. ఆటోలు, క్యాబ్‌లు ఎక్కడు. బస్సులు.. పిట్ట స్కూటీ నడక.

జంట కుదరదు.. హైదరాబాద్‌ ‌గీతం యూని వర్సిటీలో నా ఉద్యోగం. రోజూ గంట ప్రయాణం. కాలేజ్‌ ‌బస్సులో వెళ్లి బస్సులో రావాలని తాఖీద్‌. ‌రెండు గంటలు పోనూరానూ.

వేరే వాళ్లందరు.. ఒక కారు కొనుక్కుని రాకపోకలు. అరే.. ఒక డిగ్నిటీ.. ఒక డెకోరమా.. ఉహూ.. ఏదీ వద్దు.

జీవితమంతా బీద బీదగా.. బిక్కుబిక్కుగా.

ఇప్పటిదాకా మిగిల్చి పెట్టుబడులు పెట్టి.. భూముల మీద, మ్యూచువల్‌ ‌ఫండ్స్ ‌మీద, వడ్డీల మీద నువ్వూ, నీ కొడుకూ కలిసి చేస్తున్న మల్టి ప్లికేషన్స్.. ఏవి. ఒకవేళ ఎక్కడో ఉంటే అవి ఎందుకు.. అవి ఎవరికోసం.

అర్థవంతంగా, ఆత్మతృప్తితో జీవించని జీవితం అది నిరర్థకం.

వట్టి లోభి.

బతకడం చేతగాని ఒక పరమ పిసినారి కోట్లు సంపాదిస్తూ కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ.. భార్య ఐనందుకు ఉచ్చితార్థంగా నా జీవితాన్ని కూడా ధ్వంసం చేశాడుగదా. ఎవడు ఈ అమానుషమైన విధ్వంసానికి కారకుడు.

అన్నింటికి జవాబులుండవు. ముఖ్యంగా స్త్రీకి ఈ వివాహానంతర జీవిత భాగస్వామి ద్వారా సంభవించే అకారణ హింస ఒక శాపం.

వ్చ్.,

‌మళ్లీ సూర్యోదయం… ఎదురుగా ఎర్రగా.

నా భార్య అప్పుడే పొగలు కక్కే కాఫీ తెచ్చిచ్చి ఎదురుగా కూర్చుంది. నేను నరసింహం ఇంటి వైపు చూస్తూండగానే అప్పుడే ఆయన అదే పెద్ద టి-షర్ట్‌తో..నిక్కర్‌తో.. డుప్లికేట్‌ ‌క్రూక్స్ ‌రబ్బర్‌ ‌చెప్పులతో పిట్ట స్కూటీని బలవంతంగా లోపలినుండి బయటకు తెచ్చి స్టాండ్‌ ‌వేస్తూండగా.. అప్పటికే ఆలస్య మైందేమో పాపం ఆ ముసలి దేవతలా కనిపిస్తున్న ప్రొఫెసర్‌ ‌వసుధ గబగబా వచ్చి వెనుక సీట్లో చాలా జాగ్రత్తగా, ఒద్దికగా కూర్చుంది.

ఎందుకో నరసింహం ఎంత కిక్‌ ‌కొట్టినా ఆయన స్కూటీ అస్సలే స్టార్ట్ ‌కావడం లేదు.. ఆరోజు.

వచ్చేవారం కథ…

జీవితం ముఖ్యం – దాట్ల దేవదానం రాజు

About Author

By editor

Twitter
YOUTUBE