‌ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారడం లేదు. ప్రధానంగా మెజారిటీ వర్గంగా ఉన్నవాళ్లకు రక్షణ కరవవుతోంది. మెజారిటీ పేరుతో ప్రాధాన్యత తగ్గిపోతోంది. చివరకు తమకు ఇష్టమైన దేవుళ్లను పూజించడం, దేవతల ఆలయాలు నిర్మించుకొని పూజలు చేయడం కూడా కంటగింపుగా మారుతోంది. మైనారిటీ పేరుతో సకల సదుపాయాలూ అనుభవిస్తున్నవాళ్లు.. ప్రభుత్వాల నుంచి  అన్ని సౌకర్యాలూ పొందుతున్న వాళ్లు.. ఇతర మతాలమీద అక్కసుతో, కుట్రలతో, సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతోనే దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మతసామరస్యంపై ఓ ప్రణాళిక  ప్రకారం కుట్రలు సాగుతున్నాయన్న ఆనవాళ్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం హయాంలో చూసినా పలు సందర్భాల్లో నవరాత్రుల సమయాల్లో హిందూ దేవుళ్లపై, హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయి.  ఆ దాడులకు  బాధ్యులపై పోలీసులు, విచారణాధికారులు, ప్రభుత్వ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోకపోగా.. మతిస్థిమితం సరిగా లేదన్న కారణంతో వారిని  వదిలేసిన సందర్భాలున్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోనూ ఇలాంటి దాడులకు ఫుల్‌స్టాప్‌ ‌పడలేదు. కుట్రలు, కుతంత్రాలు, దాడులు, వికృత చేష్టలు కొనసాగుతూనే ఉన్నాయి. నిందితుల కుట్రకోణం, వాళ్లు కావాలనే చేశారన్న ఆధారాలు దొరికినా.. సీసీ కెమెరాల దృశ్యాలు లభించినా.. చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న వాదనలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు.. తమ మనోభావాలు దెబ్బతీశారన్న ఆవేదనతో ఆందోళన చేపడుతున్న బాధితులపైనే లాఠీచార్జి వంటి ఘటనలు చోటు చేసుకోవడం మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. ప్రభుత్వ, పోలీసుల చర్యలు బాధను రెట్టింపు చేస్తున్నాయని హిందూ సంఘాలు మొత్తుకుంటున్నాయి. పైగా ప్రభుత్వ పెద్దల ప్రకటనల్లో వాళ్ల మానసిక స్థితులను అంచనా వేసి, ఆధారాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం హైందవ సంస్కృతి పరిరక్షణకు పాటుపడుతున్న సంఘాలు, సమూహాలను మరింత నీరు గార్చేలా చేస్తున్నాయి.

మొత్తానికి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని మరింతగా చర్చకు దారి తీస్తున్నాయి. దసరా నవరాత్రుల సమయంలో హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన అంశం మరువక ముందే.. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో అరాచకం సృష్టించిన మానవమృగం వ్యవహారం అమ్మవారి భక్తులందరి లోనూ ఆవేశాన్ని కలిగించింది. ఆలయంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ వీరావేశానికి గురిచేశాయి. కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో.. చట్టాన్ని గౌరవించి, ప్రభుత్వాలు, పోలీసులపై గౌరవంతో పెల్లుబికిన ఆగ్రహావేశాలను అణచుకున్నారు. అయితే, ఈ అకృత్యానికి పాల్పడిన వాడు కావాలనే చేశాడని, దీనికి సంబంధించి కొద్ది రోజులుగా శిక్షణ తరగతులు కూడా జరుగుతున్నాయన్న భయంకర వాస్తవాలు బయటపడ్డాయి. ఈ పరిణామాలు, ఆధారాలు ఎవరినీ కుదురుగా ఉండనీయలేదు. కానీ, వాళ్లపై చర్యలు తీసుకోవడంలో మాత్రం తాత్సారం జరుగుతూనే ఉండటం బాధిస్తోంది.

అక్టోబర్‌ 14‌వ తేదీన సికింద్రాబాద్‌ ‌మోండా మార్కెట్‌ ‌పరిధిలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అరాచకం చోటు చేసుకుంది. తెల్లవారు జామున ఆలయం గేటు బలవంతంగా తీసుకొని లోపలికి వెళ్లిన కొందరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి విషయంలో చెప్పుకోలేని విధంగా చేష్టలతో చెలరేగిపోయారు ఆ దుర్మార్గులు. ఆ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తెల్లవారే సరికి ఆ దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అత్యంత పవిత్రమైన అమ్మవారి ఆలయంలో ఇలా చేసిన కిరాతకులపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అయితే, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌చేసిన ఆ దృశ్యాలను తర్వాత తొలగించారు. ఆలయంలో ఆరాచకానికి పాల్పడుతున్న సమయంలో ఆ పరిసరాల్లో ఉన్నవాళ్లు ఓ దుండగుడిని పట్టుకున్నారు. మిగతా వాళ్లంతా స్థానికులను చూసి పారిపోగా.. ఒకడిని మాత్రం వెంటాడి బంధించి, పోలీసులకు అప్పగించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై మోండా మార్కెట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో 234/2024 కింద ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశారు.

అయితే, సంఘటన తర్వాత జరిగిన పరిణా మాలు ఆసక్తికర చర్చను లేవనెత్తాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చాడని, మత విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతోనే ఈ దురాగతానికి పాల్పడ్డాడని స్పష్టంగా వీడియోల ఆధారంగా తెలుస్తున్నప్పటికీ… దొంగతనానికి వచ్చాడని చెప్పి కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు జరిగాయన్న వాదనలు కూడా ఉన్నాయి. సల్మాన్‌.. ఆ ‌సమయంలో ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చాడని.. వెండి, ఇతర విలువైన వస్తువులు, విగ్రహాలను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడన్న ప్రచారానికి ఊతమిచ్చే సంకేతాలు వచ్చాయి. కానీ, అమ్మవారి విగ్రహాన్ని, గుడిని లక్ష్యంగా చేసుకొని ఆ మత విద్వేషకులు వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు, స్థానికులు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆలయ గర్భగుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత.. ఆలయం పైకి ఎక్కి అక్కడున్న విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో సల్మాన్‌ ‌సలీంతో పాటు.. మరో ఇద్దరిని కూడా చూసినట్లు స్థానికులు వాంగ్మూలం ఇచ్చారు.

అయితే, సంఘటన విషయం తెలియగానే హిందువులు, హిందూ సంఘాల వారు ముత్యాలమ్మ ఆలయానికి చేరి, బైఠాయించి శాంతియుతంగా నిరసనలు తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. మరుసటి రోజుకు కూడా కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో అమ్మవారి భక్తులు మళ్లీ ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై అసహనం ప్రదర్శించారు. భక్తులను నిరసనలు చేపట్టకుండా పోలీసులు నియంత్రించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కొందరు తమపైకి చెప్పులు విసిరారన్న కారణంతో పోలీసులు లాఠీచార్జ్ ‌చేశారు. ఆందోళనకారుల్లో కొందరి తలలకు, ఇతర శరీరభాగాలకు గాయాలయ్యాయి. చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. వాళ్లలో ఎక్కువమంది బీజేపీ, వీహెచ్‌పీ, హిందూ సంఘాలకు చెందిన వాళ్లు ఉన్నారు.

మరోవైపు.. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని ముంబయి సమీపంలోని ముంబ్రాకు చెందిన సల్మాన్‌ ‌సలీం ఠాకూర్‌ అలియాస్‌ ‌సల్మాన్‌గా పోలీసులు గుర్తించారు. విగ్రహారాధనపై వ్యతిరేకత, అతివాద మనస్తత్వం పెంచుకున్న అతను ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. కంప్యూటర్‌ ఇం‌జినీరింగ్‌ ‌పూర్తి చేసిన సల్మాన్‌ ‌సలీం.. సోషల్‌ ‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ ‌నాయక్‌ ‌సహా పలువురి ప్రసంగాలను ఫేస్‌బుక్‌, ‌యూట్యూబ్‌ ‌లలో వింటూ విగ్రహారాధనపై ద్వేషాన్ని పెంచుకున్నాడని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అంతేకాదు..ఆతనిపై మహారాష్ట్రలోనూ ఇలాంటి తరహాకు సంబంధించినవే రెండు కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు 6, 2022 న ముంబయిలో గణేశ్‌ ‌మండపంలోకి చెప్పులు వేసుకుని వెళ్లి పూజలను అపహాస్యం చేస్తూ స్థానికులతో వాదనకు దిగాడు. అలాగే, ఆగస్టు 1, 2024న మీరా రోడ్డులోని ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలపై సల్మాన్‌ ‌సలీంపై కేసులు నమోదయ్యాయని గుర్తించారు. అంటే.. సల్మాన్‌ ‌సలీం..పనిగట్టుకొని మరీ ఇలాంటి అపచారాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అయితే, అమ్మవారి ఆలయంలో వీడి పాపం పండింది. స్థానికులకు చిక్కి పోలీసులకు దొరికిపోయాడు.

 సల్మాన్‌ అక్టోబరు మొదటి వారంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ ‌రెజిమెంటల్‌ ‌బజార్‌ ‌సమీపంలోని మెట్రో పోలిస్‌ ‌హోటల్‌లో ఇంగ్లిష్‌ ‌హౌస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నెలరోజుల వ్యక్తిత్వ వికాస, ఇంగ్లిష్‌ ‌స్పీకింగ్‌ ‌వర్క్‌షాప్‌ ‌పేరుతో ఏర్పాటు చేసిన మత సంబంధ శిక్షణ తరగతులకు వచ్చాడు. హోటల్‌ ఆవరణను అద్దెకు తీసుకుని మునావర్‌ ‌జమా, ఎండీ ఖలీల్‌ అహ్మద్‌ ‌తదితరులు నిర్వహించిన వర్క్‌షాష్‌లో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి 151 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. హోటల్‌లోని మూడు, నాలుగో ఫ్లోర్‌లలో 50 గదులను అద్దెకు తీసుకొని మరీ మత విద్వేష పాఠాలు బోధిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి అనుమతులూ లేకుండా వర్క్ ‌షాప్‌ ‌నిర్వహించారనే ఆరోపణలపై హోటల్‌ ‌యాజమాన్యం, కార్యక్రమ నిర్వాహకులపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో పోలీసులు హోటల్‌ ‌లైసెన్స్ ‌రద్దు చేయడంతో పాటు సీజ్‌ ‌చేశారు.

 హిందువుల ఆందోళనలు, భక్తుల ఆగ్రహం మధ్య పోలీసులు ఆలస్యంగానైనా ముత్యాలమ్మ గుడిపై దాడి కేసులో కాస్త సీరియస్‌గా దృష్టి సారించారు. మోటివేషనల్‌ ‌స్పీకర్‌ ‌మునావర్‌ ‌జామ, మెట్రో పోలీస్‌ ‌హోటల్‌ ‌యజమాని అబ్దుల్‌ ‌రషీద్‌, ‌హోటల్‌ ‌మేనేజర్‌ ‌రెహమాన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు తొలి కేసుకు అదనంగా రెండో కేసును కూడా నమోదు చేశారు. ఎస్‌ఐ ‌సురేష్‌ ‌ఫిర్యాదుతో 299, 192, 196, 223, 49 బీఎన్‌ఎస్‌ ‌ప్రకారంగా కేసు పెట్టారు. ముగ్గురిని నిందితులుగా పేర్కొనగా.. వీరిలో మోటివేషనల్‌ ‌స్పీకర్‌ ‌మునావర్‌ ‌జామ, మెట్రో పోలీస్‌ ‌హోటల్‌ ‌యజమాని అబ్దుల్‌ ‌రషీద్‌, ‌హోటల్‌ ‌మేనేజర్‌ ‌రెహమాన్‌ ఉన్నారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన సల్మాన్‌ ‌హోటల్‌లో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 1 ‌నుంచి 31 వరకు మెట్రో పోలీస్‌ ‌హోటల్‌లో మునావర్‌ ‌జామ ఒక సదస్సు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా హిందూమతానికి వ్యతిరేకంగా ఈ సదస్సు ఏర్పాటుచేసి కొందరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తం 151 మందికి ఈ హోటల్‌లో బస కల్పించారని పోలీసులు గుర్తించారు. మొత్తం 49 గదులను నిందితులు బుక్‌ ‌చేశారని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మునావర్‌ ‌జామ్‌ ‌సదస్సు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అంతేకాదు.. మునావర్‌ ‌జామ సదస్సుకు మెట్రో పోలీస్‌ ‌హోటల్‌ ‌యజమాని సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. మునావర్‌ ‌జామ్‌ ‌రెండు మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం కోసమే సదస్సు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఐ ‌సురేష్‌ ‌ఫిర్యాదు చేశారు. మునావర్‌ ‌మోటివేషన్‌ ‌క్లాస్‌ ‌తర్వాతే అమ్మవారి గుడిపై సల్మాన్‌ ‌దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.

-సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 

About Author

By editor

Twitter
YOUTUBE