దేశీయ ఆయుధాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న భారత్‌ ‌ప్రస్తుతం తాను తయారు చేస్తున్న వాటిలో ఒక ఆయుధాన్ని భవిష్యత్తులో అత్యంత విశ్వసనీయమైన క్షిపణి ప్రయోగ వ్యవస్థగా చేసేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా తయారు చేసిన పినాక మల్టిపుల్‌ ‌లాంచ్‌ ‌రాకెట్‌ ‌సిస్టమ్‌ (‌బహుళ రాకెట్లను ప్రయోగించగల వ్యవస్థ – ఎంఎల్‌ఆర్‌ఎస్‌) ‌సామర్ధ్యాన్ని ప్రస్తుతానికన్నా నాలుగురెట్లు పెంచేందుకు పక్రియను ప్రారంభించింది. పినాకను దీర్ఘశ్రేణి క్షిపణిగా మార్చేందుకు దాని పరిధిని, శక్తిని పెంచే పని ప్రారంభమైందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

పినాక నుంచి స్పెషల్‌ ఏరియా డెనియల్‌ ‌మ్యునిషన్‌ (ఏడీఎం)లో కాల్పులను జరపడంపై పని జరుగుతోంది. ఇది శత్రు దళాలు ముందుకు రాకుండా దూర ప్రాంతం వరకు మందుపాతరలను వెదజల్లనుంది.

పినాక పరిధిని నాలుగు రెట్లు పెంచడం ద్వారా ప్రపంచంలోనే ఉత్తమమైన రాకెట్‌ ‌ప్రయోగ ఆయుధ వర్గంలోకి దీనిని తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, ఈ దిశలో పురోగతి సంతృప్తికరంగా ఉందని రక్షణ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఇది అత్యంత అద్భుతమైన ఆయుధంగా రూపుదిద్దుకోనుందని వారు విశ్వసిస్తున్నారు.

గత మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న పినాక

భారతీయ సైన్యానికి పినాక కొత్త ఆయుధమేం కాదు. దీనిని దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సైన్యం ఉపయోగిస్తోంది. తన శక్తి సామర్ధ్యాలను 1999లో యుద్ధ రంగంలో పినాక తొలిసారి ప్రదర్శించింది. కార్గిల్‌ ‌యుద్ధ సమయంలో పాకిస్తానీ చొరబాటుదారులు ఆ ఎత్తైన పర్వత శ్రేణుల్లోకి చొచ్చుకు రాకుండా ఆ ప్రాంతాలను నిష్ప్రభావం చేసేందుకు సైన్యం వీటిని మోహరించింది. తర్వాత సంవత్సరంలో వీటిని భారతీయ సైన్యంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు.  ఇందులో ప్రతి లాంచర్‌లోనూ 122ఎంఎం సామర్ధ్యం గల రాకెట్లను ప్రయోగించేందుకు 12 గొట్టాలు ఉంటాయి. ఈ మొత్తం రాకెట్లను కేవలం 44 సెకెండ్లలో పేల్చవచ్చు. ఈ లాంచర్‌ను ఎక్కడ కావాలంటే అక్కడకు వేగంగా ప్రయాణించగల ఎత్తుగా ఉన్న ట్రక్కుపై అమరుస్తారు. మొదట పినాక పరిధి 37.5 కి.మీలుగా ఉండేది కానీ తర్వాతి కాలంలో దానిని 70 కి.మీల వరకూ పెంచారు. దానిని 90 •.•మీ పరిధికి సంబంధించిన క్షిపణి పరీక్షలు త్వరలో జరుగనుండగా, దాదాపు 120 కిమీలు, 300 కి.మీల వరకు దాని పరిధిని పెంచేందుకు కూడా పరీక్షలు ప్రయోగాలు జరుగుతున్నాయి.

భారతీయ సైన్యంలోని శతఘ్ని దళాలలోని నాలుగు పటాలాల వద్ద పినాక ఎంఎల్‌ఆర్‌ఎస్‌ ఉం‌డగా, మరొక ఆరు దళాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. రానున్న ఆరేళ్ల కాలంలో పినాకా దళాలను 22కు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.

దీని పరిధిని విస్తరించడమే కాకుండా, దీని సామర్ధ్యాన్ని 122 ఎంఎం నుంచి 214 ఎంఎంకు పెంచారు. కేవలం 44 సెకెన్లలో ఆరు లాంచర్ల దళం 1000 మీటర్ల పొడవు, వెయ్యి మీటర్ల విస్తీర్ణం గల ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయగలవు.

అర్మేనియాకు పినాక ఎగుమతులు

భారతదేశంలో తయారు చేసి, అర్మేనియాకు ఎగుమతి చేసిన పినాక రాకెట్లు ఇరాన్‌, అజెర్బైజాన్‌ ‌రహదారి ద్వారా రవాణా చేసినట్టు గత జులై ఆఖరు వారంలో వార్తలు వచ్చాయి. న్యూఢిల్లీ నుంచి పినాక రాకెట్లను అర్మేనియా రాజధాని యెరెవన్‌కు ట్రక్కులో తీసుకువెడుతున్నట్టుగా పేర్కొంటూ ఆ ట్రక్కు ఫోటోలు కూడా సోషల్‌ ‌మీడియాలో షికార్లు చేశాయి.

కాగా, ఈ సరుకును ఇరాన్‌లోని బందర్‌ అబ్బాస్‌ ‌రేవు ద్వారా రవాణా చేసినట్టు అజెర్బైజానీ మీడియా ఆరోపించింది. ఇరాన్‌ అటు అర్మేనియా, ఇటు అజర్బైజాన్‌తో సరిహద్దులు కలిగి ఉంది.ఒక రకంగా అర్మేనియా, అజర్బైజాన్‌లు ఇరుగు పొరుగు దేశాలు. అందుకే అజర్బైజాన్‌ ‌రాజకీయ నాయకులు ఈ చర్యను ప్రతికూలంగా చూశారు. దీనికి ప్రధాన కారణం, అజర్బైజాన్‌కు నైరుతిలో ఉన్న నాగొర్నో – కరబాఖ్‌ అనే ప్రాంతం విషయంలో రెండు దేశాల మధ్య వివాదం నడుస్తుండడమే. అజర్బైజాన్‌ ‌నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో నివసించే జనాభాలో మెజారిటీ ప్రజలు అర్మేనియన్లే కావడం, ఈ ప్రాంతాన్ని అర్మేనియాలో కలపాలని వారు దీర్ఘకాలికంగా డిమాండ్‌ ‌చేస్తుండడం, ఈ క్రమంలో 1991-1994వరకు యుద్ధం జరగడం వంటి కారణాల వల్ల భారత్‌ ‌చేపట్టిన ఈ చర్యను అజర్బైజాన్‌ ‌తమకు ముప్పుగా చూస్తోంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE