ఆర్టికల్‌ 370, 35ఎ అధికరణాలు రద్దయిన పదేళ్ల తరువాత, ఎన్నికలు జరుపుకుని తొలిసారి సమావేశమైన జమ్ముకశ్మీర్‌ ‌శాసనసభలో అవాంఛనీయ దృశ్యాలే చోటు చేసుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం 2019లో రద్దు చేసిన 370 ఆర్టికల్‌కు మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలన్న కుట్రను దొడ్డితోవన అమలు చేయడానికే లోయ పార్టీలు ప్రయత్నం చేస్తున్న సంగతి స్పష్టమైంది. అచ్చంగా పాకిస్తాన్‌ అజెండాను అమలు చేయడానికి లోయలోని ముస్లిం వర్గాలు ప్రయత్నించడంతో సభలో తొలిరోజు, అంటే నవంబర్‌ 4‌న మొదలైన బాహాబాహీ మూడురోజులు సాగి రణరంగాన్ని తలపించింది. తొలిరోజు పీపుల్స్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ సభ్యుడు వాహిద్‌ ‌పారా 370 అధికరణను పునరుద్ధరించాలని కోరుతూ సభలో తీర్మానం చదివారు. ఇందుకు బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వం కూడా అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అవామీ ఇత్తేహాద్‌ ‌పార్టీ నాయకుడు షేక్‌ ‌కుర్షీద్‌ 370, 35ఏ అధికరణలను పునరుద్ధరించాలని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకుని వెల్‌లోకి దూసుకువెళ్లారు.

నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పార్టీ (ఎన్‌సీ) తన మేనిఫెస్టో లోనే ఈ అంశాన్ని చేర్చటంతో అధికార పార్టీకిది ప్రాధాన్య అంశంగా ఉంది. 370 అధికరణ పునరుద్ధ రణకు అసెంబ్లీకి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యేకహోదా, రాజ్యాంగ బద్ధతకు అవసరమైన పక్రియను చేపట్టాలని ఈ తీర్మానంలో ప్రభుత్వం కోరింది. ముఫ్తీ మెహబూబా నాయకత్వం లోని పీడీపీ పార్టీ 370 పునరుద్ధరణను కోరుతూ మొదటే తీర్మానం ప్రవేశపెట్టింది. బయట ఎంత బద్ధ విరోధుల్లా కనిపించినా అసెంబ్లీలో లోయలో ముస్లిం పార్టీలన్నీ ఏకమైపోయాయి. ప్రత్యేక హోదాకు పట్టుపట్టటం అంటే ఆర్టికల్‌ 370‌ని పునరుద్ధరించ టమే అన్న అభిప్రాయాన్ని ఎన్‌సీ వ్యక్తం చేయటం దారుణమని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ‘ప్రజా స్వామ్యానికి అత్యున్నత ఆలయంగా భావించే వ్యవస్థ (పార్లమెంట్‌) ‌ద్వారా ఆర్టికల్‌ 370 ‌రద్దయింది. దానిని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఇప్పుడు అదంతా గత చరిత్ర’ అని స్పష్టం చేశారు. బీజేపీ సభ్యులు శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీకి అనుకూలంగాను, భారత మాతకు జై అంటూ నినాదాలు చేశారు. ఎన్‌సీ సభ్యులు ప్రత్యేక హోదా అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఆర్టికల్‌370 ‌రద్దు చారిత్రాత్మక నిర్ణయం. దీనితో మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్‌ ‌దేశంలో భాగం అయ్యింది. ఇతర ప్రాంతాలవారు ఆస్తుల కొనుగోలుకు మార్గం సుగమమైంది. దళితులు, ఆదివాసులు, మైనార్టీలు, మహిళలు మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. తీవ్రవాదుల అలజడి తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంది. అందాల కశ్మీరం వెలుగులు విరజిమ్ముతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అక్కడి ప్రజలు ప్రజాస్వామ్య పక్రియలో కీలకమైన ఎన్నికల పక్రియలో భాగస్వాములయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో, అంత కంటే ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ముందుకొచ్చి స్వేచ్ఛగా ఓటేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఎన్‌సీకి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టలేదు. సొంతంగా తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఎన్‌సీకి 42 సీట్లు, బీజేపీకి 29, కాంగ్రెస్‌కి 6, పీపుల్స్ ‌డెమోక్రటిక్‌ ‌పార్టీ (జెకెపీడీపీ) 3,ఆమ్‌ ఆద్మీ పార్టీ 1, ఇండిపెండెంట్లు 7 సీట్లు దక్కాయి. ఇండియా కూటమిలో ఎన్‌సీ, కాంగ్రెస్‌లు భాగస్వాములుగా ఉన్నా, కానీ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ‌భాగస్వామిగా లేదు.ఎన్‌సీకి కశ్మీర్‌ ‌నుంచే ఎక్కువ సీట్లు వచ్చాయి. దాంతో జమ్మూ నుంచి ఎంపికయిన ఎమ్మెల్యే సురేందిర్‌ ‌కుమార్‌ ‌చౌదరిని ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ప్రత్యేక హోదా కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టే బాధ్యతను చౌదరికే పార్టీ అప్పగించింది.

ప్రత్యేక హోదాను రద్దు చేసి, జమ్మూకశ్మీర్‌ ‌లద్దాక్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఆగస్టు 5, 2019న తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీ తీర్మానంలో తిరస్కరించారు. ప్రత్యేక హోదా పునరుద్ధరణకు చేపట్టే పక్రియతో జాతి ఐక్యతను, జమ్ముకశ్మీర్‌ ‌ప్రజల ఆశలను నెరవేర్చాలి అని కోరారు.

మొత్తానికి సమావేశాలలో తీవ్ర రచ్చ సాగింది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ వాగ్వాదానికి దిగారు. అవామీ ఇత్తెహాద్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, ఇంజనీర్‌ ‌రషీద్‌ ‌సోదరుడు ఖుర్షీద్‌ అహ్మద్‌ ‌షేక్‌ ఆర్టికల్‌ 370‌పై బ్యానర్‌ను ప్రదర్శించడంతో సభలో గందరగోళం మొదలైంది. బ్యానర్‌ ‌ప్రదర్శనపై శాసనసభలో విపక్ష నేత బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ ‌శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాగ్వాదం జరిగిన వెంటనే మార్షల్స్ ‌జోక్యం చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ ‌రైనా స్పందిస్తూ, ఎన్‌సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ ‌కా హాత్‌ ‌పాకిస్తాన్‌ ‌కే సాత్‌, ‌కాంగ్రెస్‌ ‌కే హాత్‌ ‌టెర్రరిస్ట్ ‌కే సాత్‌ అని విమర్శించారు.

బీజేపీ శాసన సభాపక్ష నేత సునీల్‌ ‌శర్మ తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌ అబ్దుల్‌ ‌రహీమ్‌ ఎన్‌సీ అధికార ప్రతినిధి మాదిరిగా వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రవర్తన దేశ సార్వభౌమత్వానికి, ఐకమత్యానికి సవాలుగా ఉందని విమర్శించారు. ‘‘మార్షల్స్ ‌మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటకు నెట్టినప్పుడు బయట సమాంతర అసెంబ్లీని నిర్వహించాం. దీనిని స్పీకరు తక్కువగా అంచనా వేయకూడదు. ఇది మా హెచ్చరిక’’ అని పేర్కొన్నారు. ‘‘ఆర్టికల్‌ 370 అనేది గత చరిత్ర. ఆర్టికల్‌ 370‌ని రాజ్యాంగంలో లేని ప్రత్యేక హోదాతో పోలుస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడయినా ప్రత్యేక హోదా అన్న మాట ఉంటే చూపించాలని ముఖ్య మంత్రి ఒమర్‌ అబ్దుల్లాను సవాలు చేస్తున్నా’’ అన్నారు సునీల్‌ ‌శర్మ.

370 రద్దును కోరుతూ తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చారిత్రాత్మకమైన నిర్ణయంగా ముఖ్య మంత్రి ఒమర్‌ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. దీని ద్వారా ఒక చర్చకు సానుకూలత ఏర్పడుతుందని అభిప్రా యాన్నే వ్యక్తం చేశారు. సంభాషణలను నియంత్రిం చేలా లేదా అవకాశాలను తగ్గించే భాషను తాము ఉపయోగించలేదనే పేర్కొన్నారు. గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2019న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని భాగస్వాములను చేయలేదు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేసినా, జాతీయ జెండా ఇక్కడ ఎగరటానికి మేం అనుమతించాం. అరెస్టులు చేయటం, నిర్బంధంగా అణచివేతలు తాత్కాలికమైన ప్రశాంతతను మాత్రమే మిగులుస్తాయి. జమ్ము కశ్మీర్‌ ‌ప్రజలు శాంతిలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. త్వరలోనే రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

సభ బయట మరొక ప్రముఖ నేత ఫరూక్‌ అబ్దుల్లా తన పాత పాటనే అందుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులకు కేంద్రమే కారణమని ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా ఆరోపించారు.‘‘ఆర్టికల్‌ 370 ‌రద్దు చేయటానికి వారికి 31 సంవత్సరాల పడితే, దానిని పునరుద్ధరించటానికి అది ఎంత కాలమైనా మేం ప్రయత్నించే తీరతాం’’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను కాల్చి చంపరాదని, పాక్‌తో చర్చలు ఆరంభించాలని కూడా చెప్పారు. 370 ఆర్టికల్‌ ‌జమ్ముకశ్మీర్‌ ‌ప్రజల గుండె చప్పుడు అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి ఆర్టికల్‌ 370 ‌కారణమని బీజేపీ చెబుతున్న మాటల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఆర్టికల్‌ 370 ‌రద్దును పీడీపీ సమర్థిస్తోంది. అయితే జమ్ముకశ్మీర్‌ ‌ప్రభుత్వ తీర్మానంపై పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ చిత్రంగా స్పందించారు. ప్రభుత్వం నేరుగా ఆర్టికల్‌ 370 ‌రద్దును కోరుకోకుండా, మేం ఈ విషయంలో చర్చలను కోరుకుంటున్నామని డొంక తిరుగుడుగా వ్యాఖ్యానించటాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఎవరితో మీరు ఎవరితో చర్చిస్తారు? అని ప్రశ్నించారు.

అసెంబ్లీలోని ఇతర పార్టీలు ఒమర్‌ ‌ప్రభుత్వ చర్యలను సమర్థించాయి. ‘‘ఈ తీర్మానం నైతికంగా, రాజకీయంగా ఆర్టికల్‌ 370‌ని తిరస్కరించింది. ఇది మంచి ప్రారంభం’’ అన్నారు పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ ‌సాజద్‌ ‌లోనె. అసెంబ్లీలో గందరగోళానికి కాంగ్రెస్‌ ‌దూరంగా ఉంది. కాంగ్రెస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ (సీఎల్పీ) నాయకుడు గులాం అహ్మద్‌ ‌మిర్‌ ‌మాట్లాడుతూ ‘ప్రజల్లో ఉన్న వ్యతిరేకత (370 రద్దు మీద) గురించి మా పార్టీ ఇంతకు ముందే చెప్పింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా జమ్ముకశ్మీర్‌ ఈ ‌నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నారని, తమ గౌరవాన్ని, హుందాతనాన్ని తిరిగి కోరుకుంటున్నారని వెల్లడయిందని అన్నారు.

ఎన్‌సీ ఆధ్వర్యంలోని జమ్ముకశ్మీర్‌ ‌ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి చట్టబద్ధత లేదని, పార్ల మెంటు, సుప్రీం కోర్టుల కంటే ఈ అసెంబ్లీ గొప్పదేమీ కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఆర్టికల్‌ 370‌ని పునరుద్ధరించడం ఏ శక్తికీ సాధ్యం కాదని ప్రధాని మోదీ సహా కేంద్రంలోని బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలోని ధులేలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు.‘‘370వ అధికరణకు మద్దతుగా అసెంబ్లీ వెలుపల బ్యానర్లు పెట్టారు. ఆ అధికరణను ఆమోదించాలంటూ కాంగ్రెస్‌ ‌కూటమి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని దేశ ప్రజలు ఆమోదిస్తారా? ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు శక్తివంచన లేకుండా నిరసన తెలిపినప్పటికి వారిని బయటకు పంపించేశారు. కాంగ్రెస్‌ ‌కూటమి నిజస్వరూపం ఏమిటో యావద్దేశం అవగాహన చేసుకోవాలి’’ అని ఆయన కోరారు. ‘‘పాకిస్తాన్‌ ఎజెండాను అమలు చేయాలని చూడకండి. మీ ఆశయం నెరవేరేది కాదు. కశ్మీర్‌లో మీరేంచేయలేరు. మోదీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. ఏ శక్తి కూడా ఆర్టికల్‌ 370‌ని అక్కడ పునరుద్ధరించలేదు. నేను ఉన్నంత వరకూ మీ ఆటలు సాగవు’’ అని హెచ్చరించారు. బీజేపీ ఐటీ విభాగాన్ని చూసే అమిత్‌ ‌మాలవ్యా మాట్లాడుతూ, ‘‘మొదట నుంచి ప్రజలను దారితప్పించటం వాళ్లకు అలవాటు. ఇప్పుడు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టి మళ్లీ వీధుల్లోకెక్కేలా చేస్తున్నారు. ఆర్టికల్‌ 370 ‌పై తమ వైఖరిని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఆర్టికల్‌ 370 ‌రద్దుపై జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో రగడ కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడకు దారితీస్తుందో, జమ్మూ కశ్మీర్‌ ‌ప్రజల జీవనంపైఎలాంటి ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో గానీ తెలియదని అన్నారు.

ఆర్టికల్‌ 370, 35(ఏ) ‌రద్దు వల్ల ఈ ప్రాంతంలో తీవ్రవాద దాడులు 70 శాతం తగ్గు ముఖం పట్టాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ ‌పాటిల్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలు చేతుల్లో రాజ్యాంగం పుచ్చుకుని తిరుగుతారు. కానీ రద్దయిన ఆర్టికల్‌ 370 ‌కి మద్దతు ఇస్తారు అని విమర్శించారు. ‘‘నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నేతలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేబినెట్‌ ఏర్పాటు చేశారు. తొలి అసెంబ్లీ సెషన్‌ ‌లో ప్రాజెక్టుల అభివృద్ధి గురించి చర్చించాలి. కానీ మెజార్టీ పార్లమెంటు సభ్యులు తిరస్కరించి తీసుకున్న ఆర్టికల్‌ 370,35 (ఏ) ‌రద్దు నిర్ణయాన్ని దెబ్బతీయాలని చూస్తున్నార’’ని విమర్శించారు.

-డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 9908892065

About Author

By editor

Twitter
YOUTUBE