ఇంటి పేరు కస్తూరి వారు. ఇంట్లో గబ్బిలాల కంపు అని సామెత. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఇంతకు మించి ఏమీ కాదు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవాళ్లు సభ్య సమాజానికి చెప్పేదే ముంటుంది? సభ్య సమాజం వాళ్ల నుంచి వినడానికి ఏముంటుంది? ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ పేరుతో ఆ విశ్వవిద్యాలయం చేసే నిర్వాకాలన్నీ ఇలాగే ఉంటున్నాయి. ఇటీవల అక్కడ కశ్మీర్‌ మీద జరిపిన ఒక గోష్టికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్న ఇద్దరిని పిలిచిందా వేదిక. ఇందుకు భారత హిందువులు తీవ్ర నిరసన తెలియచేశారు. ఉగ్రవాదుల తైనాతీలను తెచ్చి యూనివర్సిటీ వేదికలు ఎక్కించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో ఆక్స్‌ఫర్డ్‌ యాజమాన్యం తెలియచేస్తే ప్రపంచం ధన్యమవుతుంది. దానిని ఎలాంటి భావ ప్రకటనా స్వేచ్ఛ అనాలో కూడా వెల్లడిస్తే మొత్తం మేధోవర్గం మోక్షం పొందుతుంది కూడా.

కశ్మీర్‌ సమస్యకు పూర్తి బాధ్యత వహించవలసిన ఉన్న ప్రథమ ప్రధాని నెహ్రూ జన్మదినం నవంబర్‌ 14న ఆ గోష్టికి ముహూర్తం పెట్టారు. నిజానికి కశ్మీర్‌ ఆక్రమణకీ, రక్తపాతానికీ, 370 అధికరణ రాజ్యాంగంలో చొరబడడానికి కారకుడైన నెహ్రూ వారసత్వాన్ని బోను ఎక్కిస్తూ సమావేశాలు, గోష్టులు నిర్వహించవలసిన రోజు అది. కానీ ‘దిస్‌ హౌస్‌ బిలీవ్స్‌ ఇన్‌ ది ఇండిపెండెంట్‌ కశ్మీర్‌ స్టేట్‌’ అన్న అంశం మీద ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ వేదిక (ఇది యూనివర్సిటి అంతర్భాగమే) అదే రోజున గోష్టి నిర్వహించింది. కశ్మీర్‌ స్వతంత్ర దేశం అనే అంశం మీద ఈ వేదిక నమ్మకం ప్రకటిస్తున్నది అని దానికి అర్ధం చెప్పుకోవచ్చు. ఈ వేదిక మీద నుంచే ఒక భారతీయ విద్యార్థి జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ అంటూ ఆవేశంగా ప్రసంగించడం విశేషం. ఈ గోష్టిలో ప్రసంగించడానికి నిర్వాహకులు ఆహ్వానించిన ముజుమ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌, జఫార్‌ ఖాన్‌ కశ్మీర్‌ వేర్పాటువాదులని కూడా ఆ విద్యార్థి ఆరోపించాడు. కాగా, ఇంగ్లండ్‌లో స్థిరపడిన హిందువులు గోష్టి జరిగిన వేదిక బయట నిలిచి నిరసన వ్యక్తం చేశారు. ఇన్‌సైట్‌ యూకే అనే సంస్థ పేరుతో వీరంతా గోష్టికి నిరసనగా నినాదాలు చేశారు. ఆదర్శ్‌ మిశ్రా అనే భారతీయ విద్యార్థి జేకేఎల్‌ఎఫ్‌ నెత్తుటి చరిత్రను వేదిక సాక్షిగా తెలియచేశాడు. బ్రిమ్మింగ్‌హామ్‌లో ప్రభుత్వ అధికారులుగా పని చేస్తున్న కశ్మీరీ పండితులను, మిగిలిన హిందువులను ఎంత ఘోరంగా ఊచకోత కోసినదీ కూడా తెలియచేశాడు. నేను ఈ వేదికను నమ్మను. ఈ వేదిక అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను అని కూడా చెప్పాడు. తాను మాత్రమే కాకుండా, చాలా మంది సభ్యులకు కూడా అతడి మీద విశ్వాసం లేదని నేను చెప్పగలనని మిశ్రా తెలియచేశాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఐఎస్‌ఐ చేతిలో ఆయుధం తప్ప మరొకటి కాదనీ, పాకిస్తాన్‌లో చేతిలో కీలుబొమ్మ మాత్రమేననీ మిశ్రా తీవ్రంగా విమర్శించాడు.

ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ ఉగ్రవాదల పక్షాన నిలిచిందని, ఇది సత్యమని బయట భారతీయ హిందువులు నినాదాలు చేశారు. జమ్ముకశ్మీర్‌ భారతదేశానిదే, జమ్ముకశ్మీర్‌ అంటే భారతదేశమే, జమ్ముకశ్మీర్‌ ఎప్పటికీ భారతదేశానిదే, భారతమాతకు జై అంటూ ఇన్‌సైట్‌ యూకే సభ్యులు నినాదాలు చేశారు. ఈ గోష్టిని ఏర్పాటు చేసినవాడే ముజ్జమ్మిల్‌ ఆయూబ్‌ ఠాకూర్‌. ఇతడే ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ చేత ఆహ్వానింప చేసుకున్నాడు. అయితే ఇతడికి ఉగ్రవాదు లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌, చారిటీ కమిషన్‌, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేశాయి. ఇక జఫార్‌ ఖాన్‌ జేకేఎల్‌ఎఫ్‌ దౌత్య విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు. భారత మాజీ ప్రధాని వీపీ సింగ్‌ కార్యదర్శిగా పనిచేసిన ప్రేమ్‌శంకర్‌ రaా మరొక ఉపన్యాసకుడు. ఠాకూర్‌, ఖాన్‌ – ఈ ఇద్దరి మీద హింసను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన నేరానికి గతంలోనే కేసులు నమోదై నాయి. ఠాకూర్‌ వరల్డ్‌ కశ్మీర్‌ ఫ్రీడమ్‌ మూవ్‌మెంట్‌ అనే సంస్థకు అధ్యక్షుడు కూడా.

 ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం ఉస్మాన్‌ మోవాఫీకి రాసిన లేఖలో కొన్ని ఇతర అంశాలను కూడా ఇన్‌సైట్‌ సభ్యులు ప్రస్తావించారు. నవంబర్‌ 14న ఈ లేఖ రాశారు. జమ్ముకశ్మీర్‌లో హిందువులను దారుణంగా హత్య చేసిన జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌తో మరొక ఆహ్వానితుడు జఫార్‌ ఖాన్‌కు ఉన్న సంబంధాల గురించి ఆ లేఖలో పేర్కొ న్నారు. ఇంగ్లండ్‌లో భారత దౌత్యవేత్తగా పనిచేసిన రవీంద్ర మాత్రేను 1984లో ఈ ఫ్రంటే హత్య చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు.

ఈ గోష్టికి అర్బన్‌ నక్సల్స్‌ పుస్తక రచయిత, కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిని మొదట పిలిచారు. ఇలాంటి తనను పిలవడమే అవమాన కరంగా అనిపించిందని నవంబర్‌ 14న ఎక్స్‌ వేదికగా చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ నుంచి అందిన ఆహ్వాన పత్రం చూడగానే తనకు ఇది నేరపూరితంగా కనిపించిందని అగ్నిహోత్రి అన్నారు. ఇది భారత్‌ వ్యతిరేకం, కశ్మీర్‌కు వ్యతిరేకం. అందుకే తిరస్కరించా నని ఆయన చెప్పారు. ఇలాంటి గోష్టి, ఇలాంటి అంశంతో ఏర్పాటు చేయడమే రాక్షస చర్యగా తాను భావించానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వలసవాద బానిసత్వం నుంచి వైలదొలగాలని గట్టిగా భావిస్తున్నవారు ఇలాంటి యూనివర్సిటీ గోష్టులను పరిహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. చాలా చిత్రంగా అగ్నిహోత్రి ఈ అవకాశాన్ని కాలదన్నడం కొందరికి నచ్చలేదట. శ్రేయోభిలాషులు పేరుతో వారంతా ఈ అవకాశం వదులు కోవద్దని హితవు పలికారట కూడా. కానీ తాను ఒక సిద్ధాంతానికి నమ్మి పని చేస్తున్నానని తాను తప్పక నిరాకరిస్తానని అగ్నిహోత్రి చెప్పవలసి వచ్చిందట. ఆక్స్‌ఫర్డ్‌ పిలిస్తే చాలు తోక ఊపుకుంటే వెళ్లిపోవడం సరికాదని ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి. హిందుత్వను కూకటివేళ్లతో పెకలించాలంటూ జరిగే చర్చలకీ, కశ్మీర్‌ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ చేసే ఉద్యమాలకీ దూరంగా ఉండడం ఎంత అవసరమో ఇవాళ్టి సాధారణ భారతీయుడు గ్రహించాలి. అలాంటి గోష్టులు ఎక్కడ జరుగుతున్నా, అలాంటి ఉద్యమాలను ఎవరు ముందు ఉండి నడిపిస్తున్నా దూరంగా ఉండడం భారతీయుల ప్రథమ కర్తవ్యం. అందుకే ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ వేదిక దగ్గరే ప్రధాన ఆహ్వానితులను దుయ్యబట్టిన మిశ్రాను ఇప్పుడు అంతా ధీశాలి భారతీయునిగా శ్లాఘిస్తున్నారు.

అగ్నిహోత్రి వంటి వారు చీకొట్టినా, వేదిక దగ్గర నిరసనలు జరుగుతున్నా ఇలాంటి చర్చలు నిర్వహించడం ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌కు ఫ్యాషన్‌గా మారింది. ప్రపంచమంతటా ఉన్న వివాదాస్పద అంశాల మీద చర్చలు నిర్వహించి తుపానులు సృష్టించాలనే దుగ్ధ దీనిలో కనిపిస్తుంది. తాజా చర్చకు సంబంధించి చాలామంది ముందే చీకొట్టారు. కశ్మీర్‌ అంశం మీద ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ చర్చకు పెట్టిన అంశాలు ఏమిటి? కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం, ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు భవిష్యత్తులో కశ్మీర్‌కు ప్లెబిసైట్‌ ద్వారా నిర్ణయ అధికారం ఇస్తామన్న హామీ, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో వలసలను ప్రోత్సహిస్తూ స్థానిక ప్రజల సమీకరణలను ప్రభుత్వం మార్చుతున్నది, సైనికీకరణ చేయడం, మానవ హక్కుల ఉల్లంఘన, ఆస్తుల ధ్వంసం, నిర్బంధాలు, లైంగిక అత్యాచారాలు ఇవే కనిపిస్తాయి. ఇందులో కశ్మీర్‌ పండిత్‌లపై హింసాకాండ ఎక్కడ ఉంది? ఎంతసేపు ఉగ్రవాదుల హక్కుల గురించి, పాకిస్తాన్‌ ఎజెండా మాత్రమే ఉంటాయి.

About Author

By editor

Twitter
YOUTUBE