హిందూత్వాన్ని ఎవరికి తోచినట్టు వారు నిర్వచిస్తే మౌనం దాల్చడం ఇంక సరికాదు. హిందూయిజం అని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్న పేరు గౌరవ ప్రదమైనదీ, సానుకూల దృక్పథాన్ని ఆవిష్కరించేదీ కాదు. హిందుత్వం ఒక ఇజమ్‌ ‌కాదు. హిందూత్వకు సరైన ఆంగ్లానువాదం కావాలంటే అది హిందూనెస్‌ అవుతుంది. హిందూయిజం అంటే మార్పునకు అవకాశంలేని భావజాలం. హిందూ జీవన విధానంలో, చింతనలో చోటు లేనిదే అలాంటి భావజాలానికి. ఏమైనా హిందూ జీవనాన్ని ప్రతిబింబిస్తాయనుకునే ఏ పదాన్ని ప్రయోగించాలన్నా చాలా జాగరూకత అవసరం. హిందూయిజం వంటి పదాలతో పిలవడం అంటే ఒక నాగరికత మొత్తాన్ని అవమానించడమే అవుతుంది. హిందూయిజం అన్నది మొత్తం ఒక సనాతన నాగరికతకు అపార్థాలు అపాదించడానికి జరిగిన ప్రయత్నం. ప్రపంచాన్ని విధ్వంసం వైపు నెట్టుకు వెళ్లిన ఇజాల సరసన హిందూయిజంను చేర్చే ప్రయత్నం సహించరానిది. ఇప్పటికైనా ఈ అంశం మీద స్పష్టత తీసుకురావాలి. ఆ ప్రయత్నం చాలా కాం క్రితమే మొదలయింది. ‘భారతదేశం హిందూ రాష్ట్రం, లేక హిందుత్వమే రాష్ట్రీయత (జాతీయత)’ అన్నారు డాక్టర్‌జీ. హిందూ జీవన విధానాన్ని ఏ పేరుతో బడితే ఆ పేరుతో పిలవడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేయడానికి, ఏ పేరుతో పిలిస్తే చరిత్రకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చునో ఒక రూపు ఇవ్వడానికి జరిగిన ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. హిందూ అన్న పదం మన ఆర్ష వాఙ్మయంలో కనిపించదని అంటారు. కానీ వేర్వేరు పేర్లతో పిలిచినా, నిర్వచించినా ఒకే జీవన విధానాన్నీ, తాత్త్వికతనూ గుర్తించడానికి చేసిన ప్రయత్నమే అందులో ఉంది.

ఈ పుస్తకంలో సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌మరాఠీ దినపత్రిక ‘లోకమత్‌’ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘హిందుత్వమే రాష్ట్రీయ ఏకాత్మత’ అనే అంశంపై ప్రసంగించారు. ఆ ప్రసంగమే ఈ పుస్తకం ఇతివృత్తం, అలాగే సురేష్‌ ‌సోనీ (అఖిల భారత కార్యకారిణి సభ్యులు), అరుణ్‌ ‌కుమార్‌ (అఖిలభారత సహ సర్‌ ‌కార్యవాహ) ఈ ఇద్దరు వివిధ సందర్భాలలో ‘హిందుత్వం’ పై చేసిన ఉపన్యాసాల ఆధారంగా ఈ సంవత్సరం జూన్‌ ‌మాసంలో సురుచి ప్రకాశన్‌ ‌వారు ‘వర్తమాన్‌ ‌సందర్భమే హిందుత్వకి ప్రస్తుతి’ పేరుతో హిందీలో పుస్తకం ముద్రించారు. దానిని ‘నవయుగ భారతి’ ప్రచురణల విభాగం తెలుగులో ‘హిందుత్వం-సనాతనం- నిత్య నూతనము’ పేరుతో వి.వి. సుబ్రహ్మణ్యం అనువదించిన పుస్తకాన్ని ముద్రించినది.

ఈ పుస్తకంలో ప్రముఖమైన కొన్ని విషయాలను పాఠకుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఒక చిన్న ప్రయత్నం. వర్తమాన పరిస్థితులలో హిందూ సమాజనికి ఎదురవుతున్న ప్రశ్నలకు, సవాళ్లకు సమాధానం చెప్పటం మాత్రమే కాక ప్రపంచంలో నిర్మాణమవుతున్న సమస్యల పరిష్కారానికి హిందుత్వం ఎటువంటి ఆలోచనలు అందించగలుగు తుంది అనే విషయాలు కూడా ఈ పుస్తకంలో కొన్ని ప్రస్తావించారు.

ఈ పుస్తకంలో ‘‘ఆద్యంతరహితమైన శాశ్వత సత్యాలు, కాలానుగుణ్యంగా పరివర్తన శీలమైన కొన్ని విషయాలు ఈ పుస్తకంలో ప్రస్తావనకు వస్తాయి. మన పరంపరాగతమైన శాశ్వత విషయాలపై ఈరోజు చోటుచేసుకుంటున్న వక్రభాష్యాలను, కొన్ని వికృత వ్యవహారాలను సరి చేసుకోవటానికి కావలసిన వ్యాఖ్యానాలు కూడా మనకు ఈ పుస్తకంలో కనబడతాయి. కాలానుగుణ్యమైన మార్పులు చేసుకోవటం మన సమాజ సహజస్వభావం.

21వ శతాబ్దంలో చోటు చేసుకొన్న అనేక క్రొత్త క్రొత్త ఆలోచనలను ఎట్లా అనుసంధానం చేసు కోవాలి, ఎటువంటివి కాల ప్రవాహంలో కొద్దికాలం ఉండి పడిపోతాయి, ఎటువంటివి ఈ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకోవలసినవి – ఈ పుస్తకంలో చర్చకు వచ్చాయి. ఇప్పుడున్న కొన్ని పరిస్థితులు కాలక్రమంలో వాటికవే సర్దుకు పోవటమో లేక కాలగర్భంలో కలిసిపోవటమో జరుగుతాయి కాబట్టి సమాజ నిరంతర జీవనంలో ఏ విషయాలు మనం ఆలోచించాలి అనేది ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి.

ప్రస్తుత సంక్షుభిత ప్రపంచంలో పరిస్థితులు, మన దేశంలో, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక హిందువుగా మనం చూడవలసిన దృష్టికోణం వాటిని చక్కదిద్దుకోవటానికి మన ఆలోచనలు ఎట్లా ఉండాలి అనే విషయాలు ఈ పుస్తకంలో మనకు స్పష్టంగా వివరించారు. మనం అందరం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి పరంపరాగతమైన మన జీవనశైలిని కాపాడుకొందాము.

మన హిందూసమాజం నిరంతర గంగా ప్రవాహం లాంటిది. గంగా ప్రవాహంలో ప్రవాహానికి అనేక అడ్డంకులు ఒడుదొడుకులు వస్తుంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ గంగా ప్రవాహము వేల సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రవహిస్తున్నదో ఈ హిందూ సమాజం కూడా వేల సంవత్సరాలనుండి అనేక భీషణ పరిస్థితులను ఎదుర్కొంటు నిలబడి ఉన్నది.

అటువంటి శక్తి సామర్ధ్యాలు కలిగినటు వంటిది హిందూ సమాజం. నిజానికి హిందూత్వం అన్నది సంఘ పరిధిలో, చింతనలో పాత అంశమే. ఇప్పుడు బయట ఇంత చర్చకు పెట్టవలసిన అవసరం ఏమిటి? అంటే- ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ను నాయకత్వ స్థానంలో మొత్తం హిందూ సమాజం, భారతీయ సమాజం చూస్తున్నది కాబట్టి. అందుకే హిందూత్వం అనే పదం అసలు అర్ధం వెల్లడించడం ఇవాళ్టి తక్షణ అవసరం. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. ఈ విషయాలను మనం గమనించి వర్తమాన పరిస్థితులలో మన హిందూత్వానికి ఏ రకమైన వ్యాఖ్యానం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. దానికోసమే ఈ పుస్తక ప్రయత్నం. అయినా హిందూ అన్న పదాన్ని అర్ధం చేసుకోవడం దగ్గర ఇప్పుడు కూడా మనం గందరగోళానికి గురికావడం ఒకింత అవమానమే కూడా. అంధకారంలో ఉంచి, మనది కాని ఒక అవమానకర అస్తిత్వాన్ని మన మెడలో వేలాడదీస్తే దానిని ఇంకా ఎందుకు మోయాలి?

– రాంపల్లి మల్లికార్జునరావు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE