భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

పి.వి.ఎస్‌ ‌కృష్ణకుమారి

అమ్మా,

ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇదేమిటీ, ఫోన్‌ ‌చేయకుండా, పాతకాలంలోలా ఈ ఉత్తరం రాయటం అని. ఏం చేయాలి, నీతో చాలా చెప్పాలని ఉంది. ఫోన్‌ ‌చేస్తే గంటపైనే పడుతుంది. ఈ గంటలో నా పనులు ఎన్నో ఆగిపోతాయి. అందుకే వీలైనప్పుడు వీలైనట్లు, నాలుగు లైన్లు రాస్తూ, నెల రోజులు కష్టపడి ఈ ఉత్తరం పూర్తి చేసి నీకు పోస్ట్ ‌చేస్తున్నాను.

మాట్లాడిన మాటలు మరుక్షణమే మర్చిపోవచ్చు కానీ అక్షర రూపంలో ఉండే నా మనసులోని ఈ మాటలు శాశ్వతంగా ఉండిపోతాయి కదా! విసుగు చెందకుండా చివరి వరకు చదువు.

సరే, ఇక అసలు విషయానికి వస్తాను. అమ్మా! కిందటి నెలలో నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు, అదే సమయంలో మామయ్య కూడా మన ఇంటికి వచ్చాడు. అప్పుడు మీ ఇద్దరూ కలిసి, మీ బాల్యం గురించి ఎంతోసేపు మాట్లాడుకున్నారు. మీరు చేసిన చిలిపి పనులు, మీరు ఆడుకున్న ఆటలు, మీరు చెప్పుకున్న కథలు, కబుర్లు, ఇద్దరు కలిసి ఒకే కంచంలో భోజనం చేయడం, ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడం, ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆ మధురస్మృతులు నెమరు వేసుకుంటూ, ఎంత ఉత్సాహంగా ఆ రోజు గడిపారు.

 ఆనాటి మీ కబుర్లు ఒక ఎనర్జీ బూస్ట్‌లాగా నీకు వారం రోజులు పని చేసింది. రెండు రోజులు మాతో కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఆ కబుర్లు చెపుతూనే ఉన్నావు. అది చూస్తే నా మనసు ఏదోలా అయిపోయింది. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చాను. ఎందుకో ఆఫీసుకు కూడా వెళ్లాలి అనిపించక, ఆ రోజుకి వర్క్ ‌ఫ్రం హోం పర్మిషన్‌ ‌తీసుకుని ఇంట్లోనే ఉన్నాను.

 మా అత్తగారు తన ఫ్రెండ్స్‌ని ఇంటికి ఆహ్వానించారు. వాళ్లు అంతా సామాజిక సేవా రంగంలో ఉన్నవాళ్లు అని నీకు తెలుసు కదా! వాళ్లందరూ ఆ మర్నాడు జరగబోయే ఒక కార్యక్రమంలో ప్రసంగించడానికి కావలసిన మ్యాటర్‌ని డిస్కస్‌ ‌చేసుకుంటున్నారు. నేను నా రూములో నుంచి వాళ్ల మాటలు వింటున్నాను.

 నేటి యువత ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు, పెద్దల పట్ల అవిధేయత కలిగి ఉండటం, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు ఎలా సన్నగిల్లుతూన్నాయి, భావాలలో గానీ, ఆర్థ్ధిక విషయాల్లో గానీ ఏమాత్రం షేరింగ్‌ ‌లేకపోవటం,విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టటం, పెళ్లయిన ఆడపిల్లలు కనీసం వంట కూడా చేసుకోలేకపోవడం, కొత్తగా పెళ్లయిన జంటలు ఏడాది లోపల విడిపోవడం…ఇలా నేటి యువతరం గురించి మాట్లాడుకుని, వీటిని ఎలా పోగొట్టాలి, దానికి వాళ్ళకి కౌన్సెలింగ్‌ ఇప్పించటం ఇలా చాలా సేపు చర్చించుకున్నారు.

 అసలే మీ అన్నాచెల్లెళ్ల మాటలతో మూడ్‌ ఆఫ్‌ అయి ఉన్న నా మనసు, వాళ్ల మాటలతో మరింత కలత చెందింది .

 అమ్మా!, అసలు మా యువత ఇలా తయారు కావడానికి కారణం ఎవరు? మా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదువులు తప్ప రెండో ప్రపంచం లేకుండా పెంచారు మీరు. అది మా మీద ప్రేమ, అభిమానంతో పాటు, వేరే వాళ్లతో పోటీ కోసం, అందరిలోనూ మీరు గొప్పగా ఉండాలి, మీ పిల్లల్ని బాగా చదివించారు అని అందరూ మిమ్మల్ని గొప్పగా చెప్పుకోవటానికేగా?

 అమ్మా! నీకు కోపం రావచ్చు, ‘మేము మీ మీద ప్రేమతో మీ కోసం మా జీవితాలని త్యాగం చేస్తే నువ్వేంటి ఇలా మా గొప్పల కోసం           మిమ్మల్ని కష్ట పెట్టాము అని మాట్లాడుతున్నావు’ అనుకోవచ్చు.

 కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నాకు మూడో సంవత్సరం రాగానే స్కూల్లో వేశారు. దానికి కారణం ఇంట్లో ఉంటే నేను అల్లరిచేస్తున్నాను, తమ్ముడుతో అస్తమానం గొడవ పడుతున్నాను అని. అమ్మా, ఇప్పుడు మీరే, పిల్లలు ఎంత బాగా అల్లరి చేస్తే అంత గొప్ప, అంత ఆరోగ్యం అని అంటున్నారు. మీరు మీ చిన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ అల్లరి చేసే వాళ్లని మీరు చెప్పుకోవటం లేదా! చెట్లు కొమ్మలు ఎక్కటం, మట్టిలో ఆడటం ఇవన్నీ మీరు ఇప్పుడు చాలా తీపి జ్ఞాపకాలుగా చెప్పుకుంటున్నారు.

 కానీ, మాకు అలాంటి తీపి గురుతులు ఏమున్నాయమ్మా? మా బాల్యంలో మీరేం చేశారు? నాలుగు గోడల మధ్య, ఫ్యాన్ల కింద ఇంకా కాస్త ముందుకు వెళితే, ఏసీ రూముల్లోనూ పడేసి అదే మా ప్రపంచం అన్నట్లు చెప్పారు.

 ఇంట్లో మాట వినడం లేదు అని చెప్పి, స్కూల్‌ ‌నుంచి రాగానే మళ్లీ ట్యూషన్‌. ‌మేము సిక్త్ ‌క్లాస్‌ ‌కొచ్చినప్పటి నుంచి, దగ్గర బంధువుల ఇళ్లకు కూడా మమ్మల్ని తీసికెళ్లటం మానేసారు. పోనీ వేసవి సెలవుల్లో ఎక్కడికయినా వెళ్దాం అనుకుంటే, సమ్మర్‌ ‌క్యాంపు అంటూ సంగీతం, డాన్స్, ‌కరాటే ఇలా ఏవేవో మాకు అంటగట్టారు. అమ్మా, ఒక్క నెల రోజుల్లో ఇవి మాకు వస్తాయా? ఇంట్లో అల్లరి చేస్తామని మమ్మల్ని వాటిలో పడేసేవాళ్లు. ఇలాంటి పరిస్థితులు మేము మాకు ఉన్న ఒక్క తోబుట్టువుతో ఆడుకునే అవకాశం ఎక్కడుండేది? మా మధ్య ప్రేమానురాగాలు ఇనుమడించడానికి అవకాశాలు ఎంతో తక్కువ ఉండేవి కదా!

ఇక మేము టెన్త్ ‌క్లాస్‌కి వస్తున్నాము అంటే మేము పాఠశాల ఖైదీల కింద లెక్క. తొమ్మిదవ తరగతి పరీక్షలు రాయగానే మొదలయ్యేవి మా బాధలు. రెమిడీయల్‌ ‌క్లాసెస్‌, ఆ ‌టెస్టులు, ఈ టెస్టులు అంటూ పొద్దున పూట ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది దాకా రోజంతా స్కూల్లోనే. మళ్లీ నాలుగు గంటలకు సరిపడా హోంవర్క్ ‌తో, ఇంటికి వచ్చి బ్రహ్మరాత లాగా రాస్తూనే ఉండేవాళ్లం.

మార్కులు తగ్గితే అది మీకు అవమానం. పక్క పిల్లలతో పోటీ. ఇంట్లో తోబుట్టువులతో పోటీ.

‘‘చూడు మీ అక్కకి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినయి. నీకు ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి?’’

‘‘మన పక్కింటి అమ్మాయికి టెన్త్‌లో ఎంత మంచి మార్కులు వచ్చాయో! నీవు కూడా అలాగే తెచ్చుకోవాలి’’

‘‘మా కొలీగ్‌ ‌వాళ్ల అబ్బాయికి అయితే అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు. స్టేట్‌ ‌ర్యాంక్‌ ‌తెచ్చుకున్నాడు. నీవు ఉన్నావు దేనికి? వెనకబడి తరుముతుంటే నిక్కీ , నీలిగి, తొంభై శాతం మార్కులు తెచ్చుకున్నావ్‌’’

ఇలాంటి పరిస్థితుల్లో మాకు తెలియకుండానే మాలో స్నేహితులు, తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాల కంటే ఒక అనవసరమైన పోటీ తత్వాన్ని మీరే పెంచారు.

ఎదుగుతున్న కొద్దీ ఈ పోటీ పెరిగిపోయి, ఈర్షగా మారి, తోబుట్టువుల మధ్య ఒక పెద్ద అగాధాన్ని సృష్టించిన విషయం మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు?

ఏదైనా ఒక విషయంలో ఓటమి ఎదురైతే, అది అవమానంగా భావించి, ఆత్మహత్యకు పాల్పడు తున్నారు కదా!

ఈలోపల మేము ఫరదర్‌ ఏం ‌చదవాలో కూడా మీరే నిర్ణయిస్తారు. కామన్‌ ‌కోర్స్ ఇం‌జనీరింగ్‌. అలా ఒక మరమనుషుల్లాగా మేము చదువులు పూర్తి చేస్తున్నాము.

అప్పటికి మా మనసులు, రెండో ధ్యాస లేకుండా చదువు, విదేశీవిద్య, మంచి జీతం, ‘బంగారు భవిష్యత్తు ..వీటి మీద స్థిరంగా నిలిచి పోయింది.

కొంతమందికి ఇంజనీరింగ్‌ ‌పూర్తి కాగానే క్యాంపస్‌ ‌సెలక్షన్‌లో మంచి ఉద్యోగం వస్తే, మరికొందరు ఉన్నత విద్య కోసం విదేశాలకు పరుగెడుతున్నారు. దాంతో తల్లిదండ్రుల కలలు పూర్తి అవుతాయి.

‘‘మా అమ్మాయికి క్యాంపస్‌లో మంచి ప్యాకేజీతో పెద్ద ఎమ్‌. ఎన్‌. ‌సీ.లో జాబ్‌ ‌వచ్చింది’’ అని ఒకరి గొప్పలు.

‘‘అవునా, మా అబ్బాయికి వచ్చింది కానీ, పై చదువుల కోసం అమెరికా వెళుతున్నాడు. అందుకే ఆ ఉద్యోగం వదులు కున్నాడు’’ అని మరొకరి అతిశయపు మాటలు.

అమ్మా, పిల్లల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు గర్వపడటం సహజం కానీ, ఆ అభివృద్ధి గురించి అందరిలో విపరీతమైన గొప్పలు చెప్పుకోవటం, ఏ కారణం చేతనైనా ఈ రెండూ రానివారిని ఎందుకూ పనికిరాని వారిగా మాట్లాడటం సర్వసాధారణం అయిపోయింది.

 ఇక మా సంగతి కొస్తే, అదిగో, సరిగ్గా అప్పుడే మాకు అందరికీ ఒక్కసారిగా ఒక పెద్ద జైలు నుంచి విడుదల అయిన అనుభూతి కలుగుతుంది. రెక్కలు వచ్చిన విహంగాల వలె మనసు గాలిలొ తేలిపోతూ ఉంటుంది.

చేతినిండా డబ్బు, తల్లితండ్రుల ఆంక్షలు ఉండవు. చుట్టూ స్నేహితులు. వాళ్లు కూడా ‘మా పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు, వాళ్లకు అన్నీ తెలుసు’ అనే భ్రమలోకి వెళ్లి నిశ్చింతగా ఉంటారు.

బాల్యంలో మేము పోగొట్టుకున్న ఆనందాలు ఇప్పుడు అనుభవించాలి అనుకుంటాము. కానీ ఆడుతూ పాడుతూ తిరిగే వయసు కాదుకదా! ఏదో విధంగా జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేయాలి. అదే మా ధ్యాస అంతా.

మా కోరికలకి తగ్గట్టుగానే రకరకాల మాల్స్, ‌షాపింగులు కళ్ల ముందు కనపడుతూ ఉంటాయి. చుట్టూ స్నేహితులు. వాళ్లతో ఎంజాయ్‌మెంట్స్.

‌మమ్మల్ని ఇంత ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులని రకరకాల బహుమతులతో ఆనందపరుస్తుంటాము. రెస్టారెంట్లు, సినిమాలు, విహార యాత్రలు . ఈ లోపు ఎవరైనా సత్త్తెకాలపు వాళ్లు…

‘‘మీ అమ్మాయికి పెళ్లి చేయరా’’ అని అడిగితే,

‘‘ఉద్యోగంలో చేరి రెండేళ్లే క•దండీ. ఇంకా చిన్న పిల్లే. కాస్త జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేయనివ్వండి. ఇప్పుడే ఈ సంసార జంఝాటం ఎందుకూ’’ అంటారు.

అబ్బాయిలు అయితే ‘‘మా వాడు ఇంకా సెటిల్‌ అవలేదండీ. మంచి ప్యాకేజీ వచ్చాక చేస్తాం. ఈ కాలం పిల్లలు దేనికీ ఎడ్జస్ట్ ‌కాలేరు. కారు, ఇల్లు, ఫర్నిచర్‌, ‌వీకెండ్స్ ‌పోగ్రామ్స్ అన్నీ కావాలి’’ అంటూ, మాకు లేని భావాలు మీరే ఊహించుకుని ఒక స్టేట్మెంట్‌ ఇస్తారు.

నలుగురు పెద్దవాళ్లు కలిస్తే తమ పిల్లల గొప్పల గురించి మాట్లాడుకుంటారు. అలా మమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి, ఇక మాకే అన్నీ తెలుసు అనే భ్రమలోకి మమ్మల్ని మీరే నెట్టేస్తారు.

ఇప్పుడే పెళ్లి చేసుకుంటే జీవితాన్ని ఎంజాయ్‌ ‌చేయలేము అనే భ్రమలో మమ్మల్ని ఉంచి, ముఫ్ఫై సంవత్సరాలకి దగ్గర పడుతుండగా పెళ్లి గురించి ఆలోచన చేస్తారు. అప్పటికి నిజంగానే మా మైండ్‌ ‌సెట్‌ ‌మీరు ట్యూన్‌ ‌చేసిన విధంగానే తయారయి ఉంటుంది.

ఏ సంబంధం నచ్చదు. నాగరికత ముసుగులో కొంత ముందుకి వెళ్లిన వాళ్లు, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన వాళ్లు సహజీవనం చేసి ఒకరినొకరు అర్థం చేసుకుని అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు.

అప్పుడు కళ్లు తెరుస్తున్నారు మీరు. తప్పు అని చెప్పబోతారు. కానీ ‘అన్నీ తెలిసిన మేము’ మీ మాట వినం.

ముఫై సంవత్సరాలు దగ్గర పడుతుండగా లేదా దాటాక పెళ్లిళ్లు అవుతాయి. ఇక అదొక ప్రహసనం. అతి గారాబంతో చదువు కోవటం తప్పితే మరొక పని తెలియని, ఒకే వాతావరణంలో, స్పూన్‌ ‌ఫీడింగ్‌కి అలవాటు పడి పెరిగిన ఇద్దరు పెళ్లి పేరుతో ఒకటవుతాము. పని రాదు, వంట అసలే రాదు. ఉదయమే నిద్ర లేవటం అనే కాన్సెప్టే ఉండదు. ‘ఇద్దరం సమానమే ‘అనే ‘సమానత్వంపు’ గొడవలు మొదలవుతాయి.

అప్పుడు ఎంట్రీ ఇస్తారు మళ్లీ తల్లిదండ్రులు. కొంతమంది సర్దిచెప్పాలి అని ప్రయత్నిస్తారు. మరికొందరు ఇంకా వాస్తవం లోకి రారు.

‘‘మా వాడు మగాడు. వాడు వంట చేయటం ఏమిటీ’’ అని ఒకరు.

‘‘మా అమ్మాయిని గారాబంగా పెంచాము. అది కూడా తక్కువేం సంపాదించటం లేదు’’ అని ఇంకొకరు.

ఈ క్రమంలో మీ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. నీవల్లే వాళ్లు పాడైపోయారు అని మీలో మీరు కొట్లాటలు. మమ్మల్ని సరిదిద్దాల్సిన మీరే గొడవలు పడుతుంటారు.

ఎలాగో కాంప్రమైజ్‌ అయ్యి నిజమైన జీవితం మొదలు పెట్టేసరికి నడి వయసుకు దగ్గర పడుతున్నాము.

అమ్మా, నిజమైన భయం అప్పుడు మొదలవుతుంది. మాకు పిల్లలు పుడతారు. వాళ్ల భవిష్యత్తు కోసం ఇద్దరం ఉద్యోగం చేయాలి. మా ఉద్యోగాలు తుమ్మితే ఊడే ముక్కులాంటివి. ఉద్యోగ భద్రత ఉండదు. టెన్షన్‌తో కూడిన మా ఉద్యోగాలు, మీద పడుతున్న వయసు, చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు వీటి మధ్య మా బతుకులు సాగుతున్నాయి.

అప్పటికి మీరు పెద్దవాళ్లు అయిపోతారు. ‘‘చేయవలసినదంతా చేసాం ఇక మాకు ఓపిక లేదు’’ అంటారు. ఈ మానసిక సమస్యలు తోబుట్టువులతో చెప్పాలంటే సిగ్గు. ఎగతాళి చేస్తారేమో అని భయం. అందుకే ఒకరి పరిస్థితి మరొకరికి చెప్పుకోము.

ఒకవేళ ఎవరైనా మంచి సలహా ఇచ్చినా పాజిటివ్‌గా స్వీకరించే స్థాయి దాటిపోయాము.

ఇంత జరిగాక ఇప్పుడు మీరు కళ్లు తెరుస్తున్నారు. మీలో అంతర్మథనం మొదలవుతున్నది. తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితుల్లా చూడాలి అని మీరు ఇచ్చిన స్వేచ్ఛని వాళ్లు దుర్వినియోగం చేస్తూ, గౌరవం లేకుండా మాట్లాడుతుంటే ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే కుమిలిపోయే దుస్థితికి వచ్చారు కదమ్మా మీ వయసు వాళ్లందరూ. మీ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి సభలు, సమావేశాలు నిర్వహించి మమ్మల్ని ‘బాగుచేయాలి’ అనుకోవటం ఎంత హాస్యాస్పదం!

స్కూల్‌ ‌ఫస్ట్ ‌రావాలి అని చెప్పినట్లే, పెళ్లయ్యాక నీ కుటుంబంలో బెస్ట్ అనిపించుకోవాలి అని ఆనాడు మాకు చెప్పలేదు. పోటీ కాదు ప్రేమతత్వం అలవరచుకో అని ఎందుకు చెప్పలేదు. కాలేజీ కొచ్చాక కొంతమంది స్టూడెంట్స్ ‌టీజ్‌ ‌చేస్తున్నారు అని చెపితే సర్దుకుపోమ్మా అనేదానివి. అలాంటి సర్దుబాటు అత్తగారింట్లో చేసుకోమని చెప్పేవాళ్లు లేరు. ఇంగ్లీష్‌ ‌మీడియంలో చదివిన మాకు ఐకమత్యమే బలం, పెద్దల్ని గౌరవించు లాంటి సూక్తులకి అర్థం తెలియకుండా పోయింది.

నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ వాతావరణం నా పిల్లలకి ఇవ్వాలని కలలు కంటున్నాను. నన్ను ఆశీర్వదించు.

అమ్మా, చివరిగా ఒక మాట. మీకు మా మీద ప్రేమ లేదు అని అనను. మీరందరూ పిల్లల్ని ఎంతో ప్రేమించారు. వాళ్లకు సాటి మరెవరూ ఉండకూడదు అనేటంత గొప్పగా ప్రేమించారు. ఆ అతి ధోరణే ఈనాటి ఈ పరిస్థితి.

మరొక చిన్న కానుక నీకు ఇస్తూ, ఈ ఉత్తరం ముగిస్తున్నాను. చిన్న గొడవతో, అహంకారానికి పోయి గత కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న నేను, అక్కయ్యతో ఈ రోజే ఫోన్‌ ‌చేసి మాట్లాడాను. మీ అన్నాచెల్లెళ్ల అనుబంధం చూశాక, ‘‘తగ్గిన వాళ్లు ఎప్పుడూ తక్కువ కాదు’’ అని నీవు నిరంతరం చెప్పే మాట గుర్తు పెట్టుకుని అక్కకి ఫోన్‌ ‌చేసాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. నీకు కూడా ఆనందమే కదా!

 ఇక ఉంటాను.

 నీ ప్రియమైన కూతురు,

 స్వప్నప్రియ.

About Author

By editor

Twitter
YOUTUBE