అది కార్తిక పూర్ణిమ. నవంబర్ 11,1962. అంటే 62 ఏళ్ల క్రితం. ఆమెను దర్శించుకున్న ఆయన, ఆ మాటలకు ప్రభావితులయ్యారు. నిత్యసంసేవ్య, నిరంతర ఆరాధ్య అని తనలో తానే ప్రకటించుకున్నారు.
కాలక్రమాన ‘శ్రీచరణ వైభవం’ పేర కృతి రచన చేశారు. ఆయనని నాలుగు ప్రశ్నలు, ఆ అన్నింటికీ ఆ పుస్తకమే ఐక్య సమాధానం!
అనుభవంతోనే మనకు నమ్మకం కలుగు తుందా?
నమ్మిక ఉండటమే అనుభవానికి దారితీస్తుందా?
మనిషి చేసిన సాధనతో దైవకరుణ ప్రసరిస్తుందా?
ఆ దైవ కరుణాకటాక్ష ఫలితమే మానవుడి సాధనకు మూలమా?
ఎన్నో ఆలోచనలు, ఇంకెన్నో అంతర్మథనాలు, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆ ‘అమ్మ’ ఏం అందో తెలుసా?
‘జీవితం అబద్ధం; చరిత్ర బద్ధం’ అని. అందుకే ఆ చరితను రచనగా తెచ్చిన అవకాశం ఆయనకు కలిగింది. ‘కనిపించే సృష్టిని సేవిస్తే… కనిపించని దైవాన్ని పూజించినట్లే’ అనిపించేలా చేసింది.
సరిగ్గా ఆ కారణంగానే – మలయ మారుత వీచిక వీచిందనీ శరచ్చంద్రిక పూచిందనీ అభివర్ణించారు కరుణ కవిశ్రీ. అంతటి హృదయ సంబంధ వచన కావ్యకర్త ‘జిల్లెళ్లమూడి’ కొండముది రామకృష్ణ. సూక్ష్మంగా ‘రహి’! విజ్ఞానం, వికాసం, ప్రకాశం, ప్రియత్వం అని అర్థాలు. ‘అమ్మ తలపే ప్రాణం, అమ్మ మరపే మరణం’ అన్నారంటే – పరిపూర్ణ మాతృశ్రీ తత్వం!
‘జయహో మాతా శ్రీ అనసూయా’ అంటా రందరూ. అదే ఆమె అసలు పేరు. ఆమె తనయ హైమ స్మృతి సూచకంగా హైమాలయం ఏర్పాటైంది. హైమవతీ దేవి 82వ జయంతి కార్యక్రమం ఇదే నెల పదిహేనున మొదలవుతోంది. వ్రతంగా వారం రోజులు కొనసాగుతుంది.
మాతృమూర్తికి తనయులు, తనయలు సమానం. ఒకనాడు ఓ భక్తురాలు మంత్ర ఉపదేశం కోరితే ‘అది కాదు కానీ, సందేశం ఇస్తా’ అంది అమ్మ. అది ఏమిటంటే ‘కూతురినీ కోడలనీ ఒకేలా చూసుకో, అలాగే కుమారుడినీ అల్లుడినీ ఒకేలా చూసుకుంటే అదే జీవన మంత్రం’ అని!
పుట్టిన మూడేళ్లకే తల్లిని కోల్పోయింది అమ్మ.
‘మీ అమ్మ పోయిందమ్మా’ అన్నారు తాతగారు.
‘ఎక్కడికి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోవడమంటే ఏమిటి? పోయిందంటారేమిటీ… ఇక్కడే ఉంది కదా?’ ఇవన్నీ ప్రశ్నలు.
నిద్రపోతోందమ్మా?
నిద్రపోతుంటే వీళ్లంతా ఏడుస్తున్నారెందుకు? రోజూ నిద్రపోతుందిగా? మరి రోజూ ఎవరూ ఏడవటం లేదుగా!
ఇటువంటి ప్రశ్నలే ఆమె తార్కికతను పెంచాయి. తత్వచింతనను పరిపోషించాయి. అనుభవాల పరంపరలు ఆధ్యాత్మికతను విస్తారం చేశాయి. దుఃఖమే చైతన్యం అనేలా భావనలు విస్తృత మయ్యాయి.
కష్టసుఖాలను ఒకే విధంగా భావించిందామె. వివాహం తదుపరి జిల్లెళ్ల మూడిలో శాశ్వత నివాసం. అమ్మది వాత్సల్యం. కుమార్తె హైమది కరుణ స్వభావం. పాతికేళ్లయినా రాకుండానే, హైమ అస్తమయం. స్మారకంగా హైమాలయం నిర్మిత మైంది. అటు తర్వాత హైమవతీ జనయిత్రీ వ్రతం ఆరంభమైంది.
మాతృశ్రీ ప్రతిరూప దివ్య విభవాం మాధుర్య వాగ్వైభవాం
దైవీం హైమవతీశ్వరీం హృది భజే కారుణ్య వారాన్నిధిం
హైమవతీశ్వరీ ప్రాభవాన్ని విశదీకరిస్తూ హైమాలయం పేరిట పుస్తకాన్ని కొండముదివారే రచించారు. అందరి యోగక్షేమాలూ కోరుతూ వ్రతం ఆచరిస్తున్నారు. అందరిల్లు, అన్నపూర్ణాలయం, అనసూయేశ్వరీ మందిరం, హైమాలయ ప్రాంగణం, ధ్యాన నిలయం, వాత్సల్య ఆచరణం; వీటితోపాటు గణపతి దేవాలయం, యాగశాల, మరెన్నో సందర్శనీయ స్థలాలు జిల్లెళ్లమూడికి సహజ ఆభరణాలు. నవ నాగేశ్వర ఆలయమూ ఇక్కడుంది? విద్య, వైద్య సదుపాయాలు అనేకం.
పవిత్ర క్షేత్రం జిల్లెళ్లమూడిలోనిదే శ్రీ విశ్వజననీ పరిషత్. వేదపాఠశాలను నిర్వహిస్తోంది. విద్య, భోజన, నివాస వసతులన్నింటినీ ఉచితంగా అందిస్తూ అమ్మ ప్రేమను పంచి పెడుతోంది. ఉపకార వేతనాలు అందచేస్తూ మాతృ వాత్సల్యాన్ని విస్తృతపరుస్తోంది.
అమ్మ నిత్య అన్నప్రసాద వితరణం మానవ / మాధవసేవా నిరతిని ప్రస్ఫుటం చేస్తోంది. సార్థక నామధేయ ‘అన్నపూర్ణాలయం.’ ఎవరు ఎప్పుడు వచ్చినా ఎటువంటి అంతరాలూ లేకుండా వితరణ పక్రియ జరుగుతూనే ఉంది. అనేక దశాబ్దాల సేవ.
ఇదే ఊళ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించి అర్ధ శతాబ్ది దాటింది. సంస్కృత, తెలుగుభాషల్లో సమీకృత డిగ్రీ కోర్సును అందిస్తోంది. గురుకుల వ్యవస్థ రూపేణా మాతృభాష ప్రశస్తికి ఎంతగానో దోహదమవుతోంది.
ఆధ్యాత్మిక విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం ప్రధాన ఆశయాలు. ఏటేటా విద్యను విస్తరించడంలో ‘విశ్వజనని’ ముందుంటోంది.
ప్రేమవాహినీ! సేవాసింధూ!
నవనీత హృదయినీ, కరుణారస స్వరూపిణీ!
మదిలోని కదలికే చేతన
నమ్మికే దైవిక భావన
అనడంలో మాతృహృదయ తత్వమే గోచరిస్తుంది.
వైద్యసేవలు అందించడంలో సంస్థ కృషి నిరుపమానం. శరీరమే శ్రీచక్రం అని అమ్మ మాట. శారీరక ఆరోగ్యం ఉండి తీరాలన్నది అంతరార్థం. అందుకనే మెడికల్ సెంటర్ ఏర్పాటు సంభవించింది.
వైద్యపరీక్షలు, మందుల పంపిణీలు అన్ని ఉచితమే. ఉచితంగాని వైద్యశిబిరాలు నిర్వహిస్తు న్నారు. పరిసర గ్రామాలను దత్తత తీసుకొని, వైద్యసేవల విస్తృతికి పరిశ్రమిస్తున్నారు.
ప్రత్యేకించి – ‘అన్నదానం’ అనే పదాన్ని గ్రామంలో ఉపయోగించరు. అన్నం పెట్టడంలో మాతృప్రేమ ఉంటుంది. ఆకలి తీర్చడంతోపాటు వాత్సల్యాన్ని పంచిపెట్టడం అది. శక్తి, ఆశీస్సు అదే.
ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు, కడుపు నిండా తినాలి – అన్నది మాతృశ్రీ అభిమతం. అమ్మ అంటే అన్నం, అన్నం అనేది బ్రహ్మ. బ్రహ్మే అమ్మ. అన్నం అమ్మ ప్రసాదం; పరబ్రహ్మ స్వరూపం.
గోశాల మూగప్రాణుల ఆకలి దప్పులు తీరుస్తోంది.
అన్ని భావాలూ, క్రియలూ, రూపాలూ, నామాలూ, శబ్దాలూ, అర్థాలూ అన్నింటినీ అమ్మలోనే చూస్తారు పిల్లలు.
ఆమె పాదాల్లో ఒకటి మానవతకు పతాక, మరొకటి మాధవత్వానికి ప్రతీక అంటారందుకే ‘శ్రీచరణ వైభవం’ కర్త.
అమ్మ అనే కొండల్లో పుట్టి
అమ్మ అనే కడలిలో లయమందడానికి
పరుగులు తీసే నది అయింది నా జీవితం అన్నారు.
ఆ పాదాలు…
కారుణ్య పరమేశ్వరికి అలరు వాహకాలు
వాత్సల్య భువనేశ్వరికి అగరు ధూపాలు
ప్రేమానురాగాలకు పర్యాయపదాలు
సర్వలోకాలకూ ప్రేమాస్పదాలు
విరబూసిన తత్వ సుమవాటికలు
అక్షీణ దయాగుణ నిక్షిప్త సువర్ణ పేటికలు
ఉపదేశాలూ ఉపన్యాసాలూ ఇవ్వని జగద్గురువులు
అడిగినదానిని కాక, కావలసినదానిని ప్రసాదించే కల్పతరువులు
రాసిపోసిన పుష్య రాగాలు
పారమార్థిక పుష్పసరాగాలు
మానవ మాధవ మధుర మేళనను
సంఘటించే పరస్పరానురాగాలు….
అంటున్నప్పుడు బిడ్డ హృదయం ఎంతగా స్పందిస్తుందో! అమ్మ మానసం మరెంతగా వాత్సల్యభరిత కృతారమవుతుందో!!
అమ్మలో అనిర్వచనీయ అనురాగం. అసామాన్య దయాభావనం, అలౌకిక త్యాగచింతనం. జీవితం అబద్ధం అంటే ‘బద్ధం కానిది’ అని. చరిత్ర బద్ధం అన్నదంటే అర్థం… అక్షరీకరించాలని. అందుకోసమే ఆమె జీవిత మహోదధిలో తరంగాలను దర్శించారు ‘రహి’. అమ్మ పాదాలను స్పర్శించి జీవితాలను ధన్యం చేసుకున్న పుణ్యమూర్తులు ఎందరెందరో అంటూ విపలీకరించారు కవి.
మాతృశ్రీ చేసింది ధర్మప్రబోధం కాదు, ధర్మ ఆచరణం.
నిస్వార్థ సేవానిరతికి ప్రతిరూపం. క్రియాశీలి.
నీ సేవలోనే నా జీవితం సాగనీ
నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ – అన్నవారు న్నారు. వారిని, ఆత్మీయ బిడ్డలందరినీ చూసినపుడు; ‘అక్కయ్యా, అన్నయ్యా’ పిలుపులు విన్నపుడు హృదయం పులకరిస్తుంది. ‘మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి అతివ’ అనీ గుర్తుకొచ్చి తీరుతుంది.
కన్నతల్లిగా, కల్పవల్లిగా, ఆమె మాట, బాట చరిత్రను సృష్టిస్తుంది. ‘మన్నవ’ వారన్నట్లు ‘అందరి హృదయాల వెలుగు హైమా! ఎందు దాగినావో తెలుపుమమ్మా!’ అనేది మదిని విచలితం చేస్తుంది.
ఈ నెల 21న హైమావతీ జయంతి సందర్భాన లలితాకోటి నామ పారాయణం. శక్తి సమ ఆరాధనం. దశాబ్దాల కిందట హైమ రాసిన లేఖలోని ఈ వాక్యాలు స్త్రీ హృదయ పరమోన్నతిని చాటి చెప్తాయి.
ఇక్కడ అమ్మ, నాన్నగారు, అన్నయ్యలు, అందరూ కులాసాగా ఉన్నారు.
పాప పేరు ‘భగవతి’ చాలా బాగుంది!
ఈ అన్ని అంశాలనీ మనసులోకి తెచ్చుకున్నపుడు – వనిత అంతరంగం, ఆదరణీయత, సర్వశ్రేయ అభిలాష స్ఫుటమవుతూ ఉంటుంది.
ఒకానొక సందర్భంలో అమ్మే అన్నట్లు – ‘చెప్పేది అనుభావం, లోపల కలిగేది అనుభవం.’ భావాను భవాల మిశ్రిత తత్వం మన జీవన రంగాన్ని నిర్దేశిస్తుంది.
ఆత్మీయత, అనురాగం, ప్రేమాస్పద రీతి, హృదయానుగత వర్తనం లోకానికి శ్రేయోదాయ కాలు. వాటిని ప్రసాదించే మాతృతత్వమే తరతరాలకీ మూలం, మూలకం, వరం, దివ్యం. మనసు, మాట చేత ఒకటే అయినపుడు అంతటా నడిపించేదీ ఆ ప్రాభవమే!
మాతృమూర్తి పాదపీఠాన చేరిన కర్పూరదీపం జ్వాలాతోరణం. ఆ అశలు వెలుగులోనే మానవ జీవితాలు ఫలిస్తాయి, ప్రతిఫలిస్తాయి.
జంధ్యాల శరత్ బాబు, సీనియర్ జర్నలిస్ట్