తమ దేశంలో సిక్కు వేర్పాటువాదుల హత్యల వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా హస్తముందంటూ కెనడా చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే సృష్టించాయి. కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ ‌మోర్రిసన్‌ ‘‌కెనడాలో జరుగుతున్న కుట్రల వెనుక అమిత్‌ ‌షా హస్తముందని’ తాను ‘వాషింగ్టన్‌ ‌పోస్‌ట్‌కు చెప్పానన్న సంగతిని, పార్లమెంటరీ ప్యానల్‌ ‌వద్ద అంగీకరించారు. ఈ అంశపై భారత్‌ ‌తీవ్రంగా స్పందించి, కెనడా హైకమిషన్‌ ‌ప్రతినిధిని పిలిచి, ఆదేశ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో నిరసన తెలియ జేసింది. కెనడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే, దౌత్యపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది కూడా. దీనిపై అమెరికా స్పందిస్తూ, కెనడా చేసిన ఆరోపణలు బాధాకరమని పేర్కొంటూనే, ఈ సమస్యపై కెనడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది.

నిజానికి నిజ్జర్‌ ‌హత్య కేసులో కెనడా విచారణకు భారత్‌ ‌సహకరించడంలేదంటూ ఆరోపిస్తోంది. ఆ విధంగా కెనడాకు మద్దతిస్తున్న అమెరికాతో పాటు యు.కె. కూడా వంతపాడింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ ‌హర్‌దీప్‌ ‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన స్పర్థలు మొదలై వేగంగా క్షీణించడం వర్తమానచరిత్ర.

ఖలిస్తానీల చేతిలో కీలుబొమ్మ

రెండుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో రాయల్‌ ‌కెనడియన్‌ ‌మౌంటెడ్‌ ‌పోలీస్‌ (ఆర్‌సీఎంపీ) కమిషనర్‌ ‌మైక్‌ ‌డుహిమే, ‘కెనడా లోని నేరగాళ్లు, భారత్‌లో కార్యకలాపాలను నియంత్రించే అవకాశాలున్నాయి’ అంటూ అక్టోబర్‌ ‌నెలలో పార్లమెంటరీ కమిటీ విచారణకు హాజరైన సందర్భంగా పేర్కొనడం, జస్టిన్‌ ‌ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీల చేతిలో కీలుబొమ్మగా మారిందన్న సత్యాన్ని వెల్లడిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికల్లో సిక్కుల ఓట్లకోసం జస్టిన్‌ ‌ట్రూడో ఆడుతున్న నాటకంగా దీన్ని పరిగణించినా, ఈ నాటకం వెనుక అమెరికా హస్తం లేకపోలేదన్న సత్యాన్ని గుర్తించాలి. ఆంగ్లో సాగ్జన్‌ ‌దేశాలైన ‘ఫైవ్‌ ఐ ‌నేషన్స్’ (ఆ‌స్ట్రేలియా, న్యూజిలాండ్‌, ‌కెనడా, అమెరికా, యు.కె) ఇతర దేశాలతో వ్యవహరించే సమయంలో పరస్పరం మద్దతుగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు యుద్ధాలతో సతమతమవుతుంటే, ఆయుధాల అమ్మకం ద్వారా అమెరికా లాభపడటమనేది ఇప్పటికీ జరుగుతున్న తంతు. చైనా బూచిని చూపి భారత్‌-‌తైవాన్‌లకు, ఉత్తర కొరియాను చూపి దక్షిణ కొరియాకు, ఆఖరికి ఇరాన్‌ను చూపి సౌదీ అరేబియాకు ఆయుధాలను అమ్మడానికి అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తున్నది. భారత్‌ ఈ ఉచ్చులో పడలేదు. పైగా చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకు ఎంతమాత్రం కొరుకుడుపడని అంశం. రష్యా ప్రమేయంతో చైనా దిగివచ్చి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి అంగీకరించడంతో భారత్‌తో దానికి సయోధ్య కుదిరింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి కెనడాను వాడుకుంటున్నదని భావించాలి. ముఖ్యంగా మరో దేశానికి చెందిన బాధ్యతాయుత పదవిలో ఉన్న ప్రముఖ నాయకుడిపై ఈరకమైన ఆరోపణలు చేయడం ఇప్పటివరకు ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో మన ఆగర్భ శత్రువు పాకిస్తాన్‌, ‌దాని డీప్‌ ‌స్టేట్‌, ‌కెనడాలో నేషనల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌కెనడియన్‌ ‌ముస్లిమ్స్ ‌సంస్థ ద్వారా, భారత్‌ -‌కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి కృషిచేస్తోంది.

కెనడా దిగజారుడు వైఖరి

ఉగ్రవాదంతో సతమతమవుతూ, దానిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారత్‌పై ముఖ్యంగా హోంమంత్రి అమిత్‌షాపై, ట్రూడో ప్రభుత్వం ఆరోపణలు చేయడం రాజకీయ నైతిక పతనానికి పరాకాష్ట. ఉగ్రవాది గురుపత్వంత్‌ ‌సింగ్‌ ‌పన్నును వెనకేసుకొస్తున్న అమెరికా, ఇప్పుడు జస్టిన్‌ ‌ట్రూడోను పావుగా వాడుకుంటూ ఇటువంటి దిగజారుడు ఆరోపణలు చేసేలా ప్రోత్సహిస్తోంది. దీనికి తోడు ట్రూడో ఓట్ల రాజకీయం ఇందులో ఇమిడి ఉంది. తాజాగా చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తరకొరియా, ఇండియాల నుంచి సైబర్‌ ‌దాడులు జరగే అవకాశ ముందంటూ కెనడా ప్రభుత్వం ఒక నోట్‌ను విడుదల చేయడం ఇందులో భాగమే! భారత్‌పై ఈవిధమైన నోట్‌ను జారీచేయడం ఇదే ప్రథమం. నిజానికి అమెరికా, కెనడాలు ఎంతగా ప్రయత్నించినా భారత్‌ను చికాకు పెట్టగలవేమో కాని, ఇబ్బందికి గురిచేసే స్థాయిలేదు. అంతెందుకు, అమెరికా మనదేశంతో సంబంధాలను ఎట్టిపరిస్థితుల్లో వదులు కోవడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు మనతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాయి. ఇక యూరప్‌ ‌దేశాలు సరేసరి. స్పెయిన్‌ ‌ప్రధాని పెట్రో సాంజ్‌ ‌మనదేశంలో పర్యటించి రైలు ప్రాజెక్టులు, కల్చర్‌, ‌పర్యాటకం మొదలైన ఎం.ఒ.యు.లపై సంతకాలు చేశారు. ప్రధాని మోదీతో కలిసి పెట్రోసాంజ్‌ ‌వడోదరలో ఒక ప్రైవేటు మిలటరీ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ప్లాంట్‌ను ప్రారంభించారు. జర్మనీ మనదేశంతో సంబంధాలను పెంచుకోవ డానికి తహతహలాడుతోంది. గ్రీస్‌ ‌ప్రధాని కైరియోకాస్‌ ‌మిట్సోటాకిస్‌, ‌ప్రధానితో తాజాగా జరిపిన టెలిఫోన్‌ ‌సంభాషణల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతపై ముచ్చటించారు. ఈ ఏడాది మొదట్లో ఆయన మనదేశంలో పర్యటించిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి. భారత్‌-‌చైనాల మధ్య అంగీకారం కుదిరిన తర్వాత స్విట్జర్లాండ్‌ ‌మనదేశంలో వంద బిలియన్‌ ‌డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ పెట్టుబడులను చైనాలో పెట్టాల్సింది. భారత్‌ ‌మాత్రమే అత్యంత సురక్షితమైన దేశమని విశ్వసించిన స్విడ్జర్లాండ్‌ ఈ ‌నిర్ణయం తీసుకోవడం అత్యంత సానుకూల పరిణామం. అంతేకాదు ఒక్క బుల్లెట్‌ ‌కాల్చకుండా, సరిహద్దులో ప్రతిష్టంభనకు చక్కటి పరిష్కారం సాధించిన భారత దౌత్యనీతిని, నాయకత్వ పటిమను యూరప్‌ ‌దేశాలు అభినందిస్తున్నాయి. ఇన్ని పరిణామాల నేపథ్యంలో భారత్‌పై తాను చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు కెనడాపై ఉంది. పరిణామాలు పరిశీలిస్తే ఈ ఆరోపణలన్నీ బూమరాంగ్‌ అయి జస్టిన్‌ ‌ట్రూడో ప్రభుత్వం మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

హిందువులే లక్ష్యం

ప్రస్తుతం జస్టిన్‌ ‌ట్రూడో, కెనడాలోని హిందువులను తన రాజకీయ లక్ష్యంగా చేసుకోవడం తాజా పరిణామం. ఖలిస్తానీ ఉగ్రవాదుల నేపథ్యంలో, సిక్కులను, మతఛాందసవాదం నేపథ్యంలో ముస్లింలను హిందువులు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. కెనడాలో దీపావళి వేడుకలను రద్దుచేయడం ఇందులో భాగమే. దీనిపై భారత్‌ ‌తీవ్ర ఆక్షేపణ తెలపడమే కాదు, ఇది బాధ్యతారహిత చర్యగా పేర్కొంది. కెనడా విపక్షనేత పియర్రీ పోయిలీవర్‌, ఒట్టావోలోని పార్లమెంట్‌ ‌హిల్‌లో జరిగే దీపావళి వేడుకలను రద్దుచేయడం అక్కడి ఓటుబ్యాంకు పతన రాజకీయాలకు పరాకాష్ట. గతంలో కెనడాలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. భారత్‌పై దౌత్యపరమైన దాడులకు మద్దతివ్వాలని జస్టిన్‌ ‌ట్రూడో విపక్ష పార్టీలను కోరుతున్న నేపథ్యం లో ఈ పరిణామం జరగడం గమనార్హం. ఒవర్‌సీస్‌ ‌ఫ్రండ్స్ ఆఫ్‌ ఇం‌డియా- కెనడా (ఓఎఫ్‌ఐసీ) అధ్యక్షుడు శివభాస్కర్‌, ‌దీపావళి వేడుకల రద్దు విషయంలో పియర్రీ పోయిలీవర్‌ ‌నిర్ణయాన్ని తప్పుపట్టారు. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఇదిలావుండగా భారత్‌ ‌తాజాగా కెనడా సరిహద్దు పోలీసు అధికారి సందీప్‌ ‌సింగ్‌ ‌సిద్ధూ పేరును విచారణ జరపాల్సిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్‌లోని ఖలిస్తానీ ఉగ్రవాది లక్బీర్‌ ‌సింగ్‌ ‌రోడెతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ, పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఇతగాడిపై వున్నాయి. మొత్తంమీద పరిశీలిస్తే, వచ్చే ఏడాది ఎన్నికల వరకు కెనడా రాజకీయపార్టీలు, ఓట్లకోసం భారత వ్యతిరేక వ్యవహారశైలిని విడిచిపెట్టే పరిస్థితి కనిపించడంలేదు!

– విఠల్‌

About Author

By editor

Twitter
YOUTUBE