ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మరోసారి భగ్గుమన్నది. గత ఏడాది జరిగిన ఘర్షణల నుంచి క్రమంగా కోలుకుంటున్న రాష్ట్రంలో మళ్లీ చిచ్చు రగిల్చాయి విద్రోహ శక్తులు. జాతుల మధ్య పోరాటం వెనుక విదేశీ హస్తాలు కనిపిస్తున్నాయి. వేర్పాటువాద శక్తులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్‌లు, క్షిపణులు ఉపయోగించి అమాయక పౌరులను బలి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామాలు మరింత తీవ్రం కాకముందే దేశ భద్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలి

మణిపూర్‌- అసోం రాష్ట్రాల సరిహద్దుల్లోని జిరీ, బరాక్‌ నదుల సంగమ ప్రదేశంలో నవంబర్‌ 15 రోజున మూడు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. అసోం రైఫిల్స్‌ సైనికులు వాటిని బయటకు తీశారు. మరునాడు మరో ముగ్గురి శవాలు తేలాయి.. వీటిని జిరిబామ్‌ జిల్లాలో నవంబర్‌ 11న కిడ్నాప్‌ అయిన వారి మృతదేహలుగా గుర్తించారు అధికారులు. ఇందులో ముగ్గురు మహిళలు కాగా ఓ బాలిక, ఇద్దరు బాలురు ఉన్నారు. ఈ ఘటనతో మరోసారి మణిపూర్‌ హింసాత్మకంగా మారిపోయింది

అపహరణపాలై, చనిపోయినవారు మెయితీ (మైతేయి) తెగకు చెందిన వారు. దీంతో గత ఏడాది అల్లర్ల తర్వాత కుదుటపడుతున్న రాష్ట్రంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే అపహరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేయిస్తున్నవారి కోపం కట్టలు తెగింది. భారీ ఎత్తున విధ్వంసానికి దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేశారు. వారి ఇళ్లల్లోకి చొరబడి ఫర్నిచర్‌, వాహనాలను, ఇతర సామగ్రిని తగలబెట్టారు. 16వ తేదీ రాత్రి ఒక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు అల్లరి మూక నిప్పు పెట్టింది. ముగ్గురు బీజేపీ, ఒక కాంగ్రెస్‌ నేత ఇళ్లపై ఈ దాడి జరిగింది.

మరోవైపు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ పూర్వికుల ఇంటిపై దాడి చేసేందుకు అల్లరి మూక ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 17వ తేదీ సాయంత్రం ఇంఫాల్‌లోని మరో బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది పలుచోట్ల బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది. రాజధాని ఇంఫాల్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్‌నెట్‌ సేవలనూ నిలిపివేశారు.

తెగించిన కుకీ మిలిటెంట్లు

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో నవంబర్‌11వ తేదీన జరిగిన ఘటన తర్వాత వరుసగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూ వచ్చాయి. ఆరోజు మధ్యాహ్నం కుకీ-జో వర్గానికి చెందిన మిలిటెంట్లు సైనిక దుస్తులు ధరించి, అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీస్‌ స్టేషన్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. అనంతరం పక్కనే ఉన్న జకురాడోర్‌ కరోంగ్‌ గ్రామం వైపు దూసుకెళ్లి, అనేక దుకాణాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఇరువురి మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు. అటు కొంతమంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చనిపోయిన మిలిటెంట్లు భారతీయులు కాదు. పొరుగున ఉన్న మయన్మార్‌కు చెందిన కుకీలు. అక్కడ సాయుధ శిక్షణ పొంది, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొని పోరాడుతున్నారు. తమకు తాము గ్రామ వాలంటీర్లుగా చెప్పుకుంటారు.

అయితే సంఘర్షణలో మరణించిన 11 మందీ పౌరులేనని కుకీ సంస్థలు చెబుతున్నాయి. కానీ మణిపూర్‌ ఐజీపీ ముయివా వారి వాదనను ఖండిరచారు. మరణించిన వారి దుస్తులు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వారు ఉగ్రవాదులని నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు

మెయితీల కిడ్నాప్‌, హత్యలు

బోరోబెక్రా ఎన్‌కౌంటర్‌ ఘటన తర్వాత మెయితీ తెగకు చెందిన ఆరుగురు అపహరణకు గురయ్యారు. శరణార్థి శిబిరంలో ఉన్న వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కుకీల హింసాత్మక దాడి తర్వాత నుంచీ ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించడం లేదని అధికారులకు ఫిర్యాదు అందింది. వీరిని యురెంబమ్‌ రాణి (60), టెలిమ్‌ థోయిబి దేవి (31), ఆమె కుమార్తె టెలిమ్‌ థాజమన్బి దేవి (8), లైష్రామ్‌ హేతోంబి దేవి (35), ఆమె ఇద్దరు కుమారులు, లైష్రామ్‌ చింగ్‌ఖీంగన్‌బా సింగ్‌ (2), లైష్రామ్‌ లమ్‌గాంబా సింగ్‌ (10 నెలలు)గా గుర్తించారు. కుకీ ఉగ్రవాదులే ఎత్తుకుపోయారని అందరికీ అర్థమైపోయింది. ఈ అపహరణను నిరసిస్తూ మెయితీ సంస్థలు 13వ తేదీన ఇంఫాల్‌ లోయలో బంద్‌ ప్రకటించి, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశాయి.

ఇంతలోనే కుకీ మిలిటెంట్లు తాము అపహరించిన ఈ ఆరుగురిని చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. రెండేళ్ల బాలుడి తల, చేతులు అత్యంత దారుణంగా నరికేశారు. ఆ బాలుడి అమ్మమ్మ మృతదేహం కూడా అర్ధనగ్న స్థితిలో బయట పడిరది. వీరి మృతదేహాలు జిరీ, బరాక్‌ నదుల సంగమ ప్రదేశంలో వరుసగా రెండు రోజుల పాటు దొరికాయి.

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో కొంత కాలంగా కుకీ మిలిటెంట్లు మెయితీలను లక్ష్యంగా చేసుకొని అధునాతన ఆయుధాలతో దాడులు చేస్తూనే ఉన్నారు. బిష్ణుపూర్‌ జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఒక మహిళపై కాల్పులు జరిపి చంపారు. చురాచాంద్‌పూర్‌ జిల్లాలో కొండపై నుంచి కాల్పులు జరపడంపై మరో మహిళ మరణించింది.

ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న రైతుపై సమీపంలోని కొండలపై నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైతు గాయపడ్డాడు. వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. కొద్దిసేపు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. గాయపడిన రైతును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. థమ్నాపోక్పి, jైుంగాంగ్‌పోక్పి, సబుంగ్‌ఖోక్‌, సనాసాబి ప్రాంతాలో అదే తరహా దాడులు జరిగాయి.

అంతకు ముందు 7వ తేదీనాడు ఓ గిరిజన స్త్రీని సజీవ దహనం చేశారు.కుకీ మిలిటెంట్లు నవంబర్‌ 13న జిరిబామ్‌-ఇంఫాల్‌ సెక్షన్‌లో జాతీయ రహదారిపై ఉల్లిపాయలతో వెళ్తున్న ట్రక్కును తగులబెట్టారు. ఈ అరాచకాలను రోంగ్‌మీ నాగా సంఘం ఖండిరచింది. తమెంగ్‌లాంగ్‌, నోనీ జిల్లాల్లోని కుకీలకు అన్ని సరఫరాలను శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

మణిపూర్‌కు అదనపు బలగాలు

మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులను అదుపు చేసే దిశగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వ హించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, శాంతి స్థాపనకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు 50 కంపెనీల బలగాలను ఈ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించ నున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.

అంతకు ముందే 2000 మంది సిబ్బందితో కూడిన సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌-సీఏపీఎఫ్‌ బలగాలను రాష్ట్రానికి తరలించింది. 20 సీఏపీఎఫ్‌ కంపెనీలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ 15, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 5 బలగాలు ఉన్నాయి.కాగా, గతేడాది మేలో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత రాష్ట్రంలో 198 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలు మోహరించింది.

బాధ్యత మరిచి విమర్శలు

మణిపూర్‌లో జరుగుతున్న పోరాటం రాజకీయ పార్టీల మధ్య కాదు. జాతుల మధ్య జరుగుతున్న పోరాటం ఇది. దేశ భద్రత, సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా తన వంతు కృషి చేయాలి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ విద్వేష రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోంది. గత ఏడాది మణిపూర్‌లో అల్లర్ల తర్వాత పర్యటించిన రాహుల్‌ గాంధీ అక్కడి విద్వేషాగ్ని నుంచి చలి కాచుకుందుకే ప్రయత్నించారు. బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలిపి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు.

మరోవైపు బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా లేఖ రాశారు.

చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి: ఆర్‌ఎస్‌ఎస్‌

మణిపూర్‌ హింసాత్మక ఘటనలపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని మణిపూర్‌ శాఖ సూచించింది. ఈ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘర్షణలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇదో మానవతా సంక్షోభంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు, పిల్లలను అపహరించడం, నిర్బంధించడం, హత్య చేయడాన్ని నిరసించింది.

అట్టుడుకుతున్న మణిపూర్‌

 జాతుల వైరంతో ఏడాదికిపైగా అట్టుడికి పోయిన మణిపూర్‌లో ప్రశాంత ఏర్పడినట్లే కనిపించినా కొద్ది వారాలుగా మళ్లీ ఘర్షణలు చోటు చేసుకుంటు న్నాయి. మే 2023లో మణిపూర్‌లో ప్రారంభమైన హింసాకాండ ప్రారంభమైనా మొదటి 12 నెలల కాలంలో జిరిబామ్‌ జిల్లా శాంతియుతంగా ఉందనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కుకీ ఉగ్రవాదులు జిల్లాలోని మెయిటీ గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు.శాంతి మూణ్ణాళ్ల ముచ్చటే అయి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈశాన్య భారతంలో ఒకవైపు మయన్మార్‌ జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య నలిగిపోతోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలి ఇస్లామిక్‌ శక్తులు పైచేసి సాధించడం ఆందోళన కలిగి స్తోంది. ఈ రెండు దేశాలలో బాధ్యత లేని ప్రభుత్వాల కారణంగా భారత వ్యతిరేక తీవ్రవాదశక్తుల అడ్డాలుగా మారిపోయాయి. ఆగ్నేయాసియాతో భారతావనిని అనుసంధానించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదోసేం దుకు చైనా ఇప్పటికే కుట్రలెన్నో పన్నుతోంది.

మణిపూర్‌లో హింసలో 240 మంది చనిపోయారు. 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుంతో, ఎవరు చేస్తారో తెలియని స్థితి. ఈ ఘర్షణలతో అక్కడి ప్రజల ఉపాధి దెబ్బతింటోంది. వ్యవసాయం, పరిశ్రమలు ఇప్పటికే చతికిపడ్డాయి. విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయి. పర్యాటక ఆదాయం పడిపోయింది.

పొరుగు దేశం నుంచి మిలిటెంట్లు

మయన్మార్‌ నుంచి గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లోకి ప్రవేశించారు. వీరంతా ఆయుధాలతో పాటు డ్రోన్‌ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందారు. ఈ కుకీ మిలిటెంట్లు 30 మంది చొప్పున గ్రూపులుగా మణిపూర్‌లోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. కుకీ మిలిటెంట్లు మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు మణిపూర్‌ పోలీసులను ముందే హెచ్చరించాయి. దక్షిణ మణిపూర్‌లోని భారత్‌-మయన్మార్‌ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్‌ పోలీసు సూపరిం టెండెంట్‌లకు ఇంటెలిజెన్స్‌ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

 అక్కడ జరగుతున్నది వర్గాలు, జాతులు, మతాల మధ్య ఘర్షణ మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. ఒక పథకం ప్రకారం జరుగుతున్న వ్యవస్థీకృత నేరం అని చెప్పవచ్చు. మన దేశ భూభాగంలో, పౌరులపై ఇలా డ్రోన్‌ దాడులను చేస్తుంటే మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. యుద్ధాల్లో వాడే వ్యూహాలను పౌరులపై అమలు చేయడం, డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. మణిపూర్‌లోని కొన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనించవచ్చు.

దెబ్బతిన్న రాష్ట్ర ఆదాయం

గత ఆర్థిక సంవత్సరంలో హింస కారణంగా రాష్ట్రం రూ.500 కోట్ల ఆదాయం కోల్పోయిందని ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ తెలిపారు. ‘హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్రంలో 226 మంది మరణించారు. 4,569 ఇళ్లు ధ్వంసం కాగా..5,554 మంది రైతుల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. 39 మంది గల్లంతయ్యారు. 59,414 మంది నిర్వాసితులయ్యారు. అల్ల్లంకు సంబంధించి మొత్తం 11,892 పోలీసు కేసులు నమోదయ్యాయి. మణిపూర్‌ అంతటా 302 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాం. 2024`25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పోలీసులను బలోపేతం చేయడానికి బడ్జెట్‌లో రూ. 2,900 కోట్లు కేటాయించాం’ అని ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వెల్లడిరచారు.

మణిపూర్‌- కొన్ని వాస్తవాలు

మణిపూర్‌లో జాతుల మధ్య వైరం కొత్తదేం కాదు. రాష్ట్రంలోని ప్రధాన తెగలైన మెయితీ, కుకి-జోల మధ్య పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణతో ఇరువర్గాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వేలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. వారి నివాసాలు ధ్వంసమయ్యాయి, వందలాది మంది మరణించారు. విదేశీ జోక్యం ఈ పోరాటాన్ని ప్రమాదకర మలుపు తిప్పింది. ఈ కారణంగానే మణిపూర్‌ నిరంతరం మీడియాలో నిలుస్తోంది.

మణిపూర్‌లో మెయితీలు జనాభా పరంగా కుకీ-జోల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ అతి తక్కువ భూభాగం ఉన్న రాజధాని ఇంఫాల్‌ లోయకు పరిమితం అయ్యారు. కుకీ-జో తెగలకు పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలు, మయన్మార్‌లతో కూడా జాతి పరంగా సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలోకి చొరబాట్లు పెరిగిపోయాయి. సాయుధ పోరాటాలకు దిగిన కుకీలకు మయన్మార్‌ లోని శక్తుల నుంచి ఆర్థిక, ఆయుధ సాయం అందుతోంది.

మెయితీలు ప్రధానంగా హిందువులు కాగా కొందరు క్రైస్తవాన్ని పాటిస్తున్నారు. మిషనరీల ప్రభావంతో కుకీ, నాగా తెగలవారు పూర్తిగా క్రైస్తవం స్వీకరించారు. దీంతో తెగల పోరాటాన్ని మత యుధంగా చూపిస్తున్నారు. క్రైస్తవులైన కుకీలపై హిందువులైన మెయితీలు దాడులు చేస్తున్నారనే దుష్ఫ్రచారం మొదలైంది. వాస్తవానికి ఇరు మతాల ప్రార్థనాలయాలపై దాడులు జరిగాయి. కానీ కేవలం చర్చిల మీదే దాడులు జరుగుతున్నాయి అంటూ దేశ, విదేశాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.

ప్రపంచంలో ఎక్కడ పోరాటాలు జరిగినా ప్రత్యర్థులు మహిళల మానప్రాణాలపై దాడులు చేయడం సహజం. మణిపూర్‌ ఇందుకు అతీతం కాదు. కుకీలు అయితే, మెయితీలు అయినా ఈ విషయంలో తప్పు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వారిని నగ్నంగా నడిపించి అవమానించడంలాంటి ఘటనలు కళంకం తెచ్చిపెట్టాయి. కానీ ఈ పనులు మెయితీలు మాత్రమే చేశారు అనే ప్రచారం ఎక్కువగా జరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యమతంగా ఉన్నందున క్రైస్తవ మిషనరీలు, విదేశీశక్తులు మణిపూర్‌ ప్రతిష్టను దెబ్బ తీయడంలో విజయం సాధించారు.

సమగ్రతకు కాపాడుకోవాలి

మణిపూర్‌ సమస్య కేవలం ఈశాన్యరాష్ట్రానికే పరిమితమైన చిన్న ఘటనలుగా వదిలేస్తే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఇది విస్తరించే ప్రమాదం ఉంది. పంజాబ్‌లో ఖలిస్తానీలు, తమిళనాడులో ద్రవిడ వేర్పాటువాదులు, జమ్మూ కశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం, కొన్ని రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం కారణంగా మన దేశం ఇప్పటికే సమస్యలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌, చైనా దేశాలు మన దేశంలో నిరంతరం అశాంతిని ఎగదోసే కుట్రలు కొనసాగిస్తున్నాయి. ఆగ్నేయాసియాతో మన దేశాన్ని అనుసంధానించే ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి జ్వాలలను ఎగదోసేందుకు చైనా కుట్రలెన్నో పన్నుతోంది. మణిపూర్‌ సంక్షోభ నివారణకు రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE