– దేశరాజు

భండారు సదాశివరావు  స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన


అపార్ట్‌మెంట్‌ బయట ఆగి ఉన్న రెండు కార్లలోని అల్లుళ్లు ఇద్దరూ అసహనంగా కదులుతున్నారు. ఖరీదైన శార్వణీలు, గాగ్రా ఛోళీలు, గౌనులు వేసుకున్న వారి పిల్లలు కారుల్లోంచి దిగుతూ, ఎక్కుతూ అల్లరి చేస్తున్నారు. అప్పటికి అరగంటపైన అయ్యింది. ఇక లాభం లేదని చిన్న కూతురు మొబైల్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లో వేసుకుని కారులోంచి దిగింది.

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ దగ్గరే అక్క ఎదురుపడిరది.

‘‘ఏమైందే, అమ్మను తీసుకురావడానికి ఇంతసేపా?’’ అంది విసుగ్గా.

ఆమె అంతకన్నా విసుగ్గా ‘‘అవును మరి, ఇద్దరం ఆడుకుంటున్నామే’’ అని గట్టిగా అరిచి, ‘‘ఓ పని చేయండి. మీరంతా వెళ్లండి కార్లలో. నేను అమ్మ ఆటోలో వచ్చేస్తాం కాసేపట్లో’’ అంది.

‘‘అసలు ఏమైందే?’’ అన్న చెల్లెలికి ‘‘తర్వాత చెబుతాలేవే, వెళ్లమన్నాగా..’’ అంటూ గబగబా బయటకు వెళ్లిపోయింది.

అక్క హడావిడి ఏమిటో అర్థంగాక, కంగారుగా తల్లి సంగతి స్వయంగా చూద్దామని ఆమె పైకి వెళ్లింది.

నెమలి పింఛం రంగు ధర్మవరం పట్టుచీర కట్టుకున్న తల్లి, భుజాల చుట్టూ కొంగు తిప్పుకుని, ముందువైపు కుడి చేత్తో గట్టిగా కొంగును పట్టుకుని కంగారుగా అటూఇటూ తిరుగుతోంది.

‘‘ఏమైందమ్మా? ఏంటి హడావిడి?’’ అని అడిగింది.

‘‘హడావిడీ లేదు…పాడూ లేదు. మీరు వెళ్లండి. నేను మీ అక్క వెనకాలే వచ్చేస్తాం’’ అందావిడ.

‘‘వెనకాల వస్తాం అంటారేగాని, ఏంటో చెప్పరేం?’’ అని విసుక్కుని, ‘‘ఏంటి జాకెట్టు దొరకలేదా?’’ అంది మెల్లగా.

‘‘ఉంది, దొరికింది. అది కాదులే. మిమ్మల్ని వెళ్లమన్నాగా..’’ అని ఆవిడ కూడా చిన్నగా విసుక్కుంది.

‘‘ఏమిటో చెప్పకుండా, ఊరికే వెళ్లు.. వెళ్లు.. అంటావేం’’ అని అరుస్తూ కోపంగా కిందకు దిగింది చిన్న కూతురు.

గేటు దగ్గరే అక్క ఎదురుపడిరది. ‘ఏమిటే?’ అన్నట్టు చూసిన చెల్లెలికి కవరులోంచి డబ్బా కొద్దిగా బయటకుతీసి చూపించింది.

చెల్లెలు షాకయ్యింది. ‘‘దీని కోసమా, ఈ గొడవంతా? ఇప్పుడు ఇది వేసుకుంటేగానీ జాకెట్టు వేసుకోదటనా?’’ అని ‘‘అయినా, అంత గబుక్కున ఎక్కడ దొరికిందే నీకు’’ అని అడిగింది విసుగును మర్చిపోయి నవ్వుతూ.

‘‘అదే.. రోడ్డు మీద నైటీలు, మ్యాచింగ్‌ బ్లౌజ్‌ పీసులు అమ్ముతాడు కదా, వాడి దగ్గర’’ అంటూ అక్క పైకి వెళ్లిపోయింది.

చెల్లెలు ముసిముసిగా నవ్వుకుంటూ కారు దగ్గరకు వెళ్లి ‘‘మీరూ, పిల్లలు బావగారితో పాటు ఆ కారులో వెళ్లండి. మేమీ కారులో వచ్చేస్తాం. అందరం లేటుగా వెళ్తే బాగోదు’’ అని భర్తతో చెప్పింది.

అతను దీర్ఘంగా ఓ శ్వాస వదిలి, కారు దిగి, కీస్‌ ఆమె చేతిలో పెట్టి ముందున్న కారులో ఎక్కాడు. పిల్లలందరూ అప్పటికే ఆ కారులో కూర్చుని గోల చేస్తున్నారు.

చెల్లెలు పైకి వెళ్లేప్పటికి, అక్క అద్దంలో చూసుకుంటోంది. ‘‘ఏంటే ఇప్పుడు నువ్వు సింగారించుకుంటున్నావా?’’ అని నవ్వుతూ, ‘‘ఆవిడ గారికి ఇంకా ఏం కావాల్ట?’’ అంది, తలుపులు వేసి వున్న బెడ్‌రూమ్‌ వైపు చూస్తూ.

‘‘ఏం లేదులే, వచ్చేస్తున్నాం.’’ అని ‘‘ఏంటి, వాళ్లందరినీ మా కారులో పంపేసావా?’’ అని అడిగింది.

‘‘అవును మరి, అందరం కట్టకట్టుకుని ఒకేసారి అంటే, ఈ ట్రాఫిక్‌లో ఎప్పటికి చేరతామో. మరీ లేటైతే ఏం బావుంటుంది? అందుకే పైలెట్లని ముందు పంపిచా’’ అంది గట్టిగా నవ్వుతూ.

ఇంతలో బెడ్‌రూమ్‌ డోర్‌ తెరుచుకుని, పైటకు పిన్నీసు పెట్టుకుంటూ తల్లి బయటకు వచ్చింది.

తల్లిని చూసిన వెంటనే ‘‘ఆగు.. నేను పెడతాలే’’ అంటూ పెద్దకూతురు దగ్గరకు వెళ్లింది.

పిన్నీసు పెట్టడానికి వీలుగా తిరుగుతూ ‘‘ఏమే.. ఎందుకంత గట్టిగా నవ్వుతున్నావ్‌?’’ అని చిన్న కూతురును ప్రశ్నించింది తల్లి.

‘‘ఏం లేదమ్మా, నీ ఘన కార్యాలను కీర్తించుకుంటూ.. నవ్వుకుంటున్నాం’’ అంది చిన్న కూతురు మళ్లీ నవ్వుతూ.

‘‘నీకు ఎకసెక్కాలు ఎక్కువయ్యాయే. నా వయసొస్తే తెలుస్తుంది. కాకపోతే అప్పటి వరకూ నేను ఉండను’’ అందావిడ నిష్టూరంగా.

‘‘శుభమాని చక్కగా రెడీ అయ్యి పెళ్లికి వెళ్తూ, ఆ మాటలెందుకిప్పుడు? పదండి.. ఇప్పటికే బోలెడంత లేటయ్యాం’’ అంటూ హడావిడిగా పెద్ద కూతురు ఇద్దరినీ బయల్దేరదీసింది.

తల్లి చీర నలగకుండా జాగ్రత్తగా ముందు సీట్లో కూర్చుంటూ, చెంగును ముందుకు తీసుకుని ఒళ్లో పెట్టుకుంది.ఆ కూర్చున్న తీరు చూసి చిన్న కూతురు ఆ మళ్లీ ముసిముసిగా నవ్వుకుంటూ..

‘‘ఏమైనా నీకు పట్టుదల ఎక్కువమ్మా. గట్టిదానివి’’ అంది చిన్న కూతురు.

‘‘నోర్మూసుకో.. ఇలా అయితే నేను మీతో రాను. సుబ్బరంగా ఏ క్యాబో బుక్‌ చేసుకుని వెళ్తా’’ అంది తల్లి.

‘‘ఇప్పుడేమీ అనేయలేదులే. ఎందుకలా ఉడుక్కుంటావ్‌?’’ అంది చిన్నకూతురు నవ్వుతూనే.

కాసేపు కారులోని ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, మెల్లగా వినిపిస్తున్న పాటల వైపు చెవులు మరల్చారు.

‘‘ఎంత చిత్రమో చూడు. అంత సున్నితమైన గొంతుతో మధురంగా పాటలు పాడే రావు బాలసరస్వతీ దేవిగారికి హార్రర్‌ సినిమాలు చూడటమంటే ఇష్టమంట. తెలుసా?’’ అని అడిగింది పెద్దావిడ, కూతుళ్లను ఉద్దేశించి.

వెంటనే ‘‘ఓహో.. నీకొచ్చి చెప్పిందా ఆవిడ?’’ అని ఎప్పటిలాగానే వెటకరించింది చిన్న కూతురు.

‘‘ఆవిడ చెప్పడం కాదే. ఫేస్‌ బుక్లో ఎవరో రాశారు’’ అని అందామె కూతురు వెటకారం పట్టించుకోకుండానే.

‘‘అమ్మో.. నువ్వు ఫేస్‌ బుక్‌ కూడా చూస్తున్నావా? ఇదెప్పటి నుంచి?’’ అని ప్రశ్నలు సంధించింది చిన్న కూతురు.

‘‘నీకు తెలీదులే.. పగలు సీరియళ్లు, సాయంత్రం ఫేస్‌బుక్‌,రాత్రి వాట్సప్‌. ఏమనుకున్నావ్‌, అమ్మంటే?’’ అంది పెద్దది.

‘‘నీకేమైందే, నా మీద పడుతున్నావ్‌?’’ అంటూ మొట్టికాయ వేస్తున్నట్టు చెయ్యెత్తి, ‘‘మొన్న నన్ను చూద్దామని వచ్చాడు కదా, మా పెద్ద చెల్లెలు కొడుకు.. వాడు ఆ ఫేస్‌ బుక్‌లో చేర్చాడు. వెంటనే వాళ్లమ్మకీ, పిన్నికీ ఫోన్లు చేసేసి ‘పెద్దమ్మ ఫేస్‌ బుక్‌లో ఉంది. తెలుసా’ అంటూ బాకా ఊదేశాడు కూడా’’ అంది నవ్వుతూ.

‘‘ఓహో.. వాడి నిర్వాకమా, ఇది’’ అని సాగదీసింది పెద్ద కూతురు. చిన్న కూతురు విననట్టే ఊరుకుంది.

వాళ్లు ఆర్థికంగా తమకుంటే తక్కువ వాళ్లనీ, అందుకే లేనిపోని ప్రేమలు ఒలకబోస్తాడని పెద్ద కూతురు ఉద్దేశం.

*       *       *

కారు సాఫీగా సాగిపోతోంది. వాళ్ల జీవితాలు కూడా అంతే, పెద్ద ఒడుదొడుకులేమీ లేవు. పెద్ద కూతురు కొన్నాళ్లు ప్రైవేట్‌లో ఉద్యోగం చేసేది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిపోతే పిల్లలను చూసేందుకు ఎవరూ ఉండరని తల్లి ఇంటికి దగ్గర్లోనే రెండు గదుల ఇల్లు అద్దెకు తీసుకుంది. భార్యాభర్తలు ఉద్యోగాల్లో కుదురుకునేసరికి నాలుగిళ్ల అవతల అపార్ట్‌మెంట్‌ లేచింది. బ్యాంక్‌ లోన్‌తో అందులో ఓ ఫ్లాట్‌ తీసుకుంది. కొన్నాళ్లకు చెల్లెలికి పెళ్లి సంబంధం కుదిరినప్పుడు కూడా రెండు వీధుల అవతల వస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ బుక్‌ చేయించేసింది.

‘‘ఇప్పుడంటే మీరిద్దరూ చిలకాగోరింకల్లా హాయిగా ఉంటారు. రేపు పిల్ల పీచూ అయితే.. ఎవరు చూస్తారు. అయినా, పెద్దమ్మ ఉండగా వాళ్లని ఎవరో చూడాల్సిన ఖర్మేంటి? ఇద్దరివీ పెద్ద ఉద్యోగాలే కాబట్టి ఇప్పుడే బుక్‌ చేసేసుకోండి. ప్రీ బుకింగ్‌ చేస్తే ఓ రెండు మూడు లక్షలపైనే మిగుల్తాయి. నేను మాట్లాడి కారు పార్కింగ్లు రెండు ఇప్పిస్తా. మీకు అవసరమైతే వాడుకోవచ్చు లేదంటే ఎవరికైనా అది కూడా అద్దెకు ఇవ్వొచ్చు. అమ్మా, నేనూ దగ్గర్లలోనే తగలడ్డాం కదా, ఇక నీకు దిగులేంటే?’’ అని ఊదరగొట్టి చెల్లెల్నీ, కాబోయే ఆమె భర్తనీ ఒప్పించేసింది. అలా ఆ మూడు కుటుంబాలు అక్కడే సెటిల్‌ అయిపోయాయి.

కూతుళ్లిద్దరూ పక్కపక్కనే ఉంటామంటే కాదని గట్టిగా అనలేకపోయింది గానీ, పెద్దావిడకు సుతరామూ ఇష్టం లేదు. తమకు వయసు మీరుతున్న కొద్దీ వాళ్లు నెత్తికెక్కి పెత్తనం చేస్తారని ఆమెకు బాగానే తెలుసు. అందుకే ‘‘చేసినంత కాలం చేశా. ఇంకా ఎంతకని? దూరంగా ఉంటే వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు. లేకపోతే, అస్తమాటూ నన్ను పట్టుకు వేధించుకుతింటారు’’ అని భర్తతో అంది.

‘‘మనమూ పెద్దవాళ్లం అవుతున్నాం. డెబ్బయ్యిలు దాటేశాం. కలిసి మెలిసి ఉండటం వాళ్ల కంటే మనకే ఎక్కువ అవసరం’’ అన్నాడు ఆయన, కూతుర్లపైన సహజంగా ఉండే అభిమానంతో.

మరో నాలుగేళ్లకి ఆయన వెళ్లిపోయాడు.

‘‘నాకంటే ముందే పోయాడు మహానుభావుడు, అదృష్టవంతుడే’’ అని అనుకుందామె.

తిథి, వారం, వర్జ్యం చూసుకుని మరీ వచ్చిన బంధువులు ‘‘అయ్యో.. ఒక్కత్తివీ ఎలా బతుకుతావోనే?’’ అంటూ కల్లబొల్లి కన్నీళ్లు విడిచి వెళ్లారు.

‘‘ఈ పదిహేను రోజులూ మేమే చేశాంగా, ఇక మీదట కూడా మేమే చూసుకుంటాం. నువ్వేం వంటలూ వార్పులూ పెట్టుకోవద్దు. మేమే ఏదో ఒకటి తెచ్చిస్తాం’’ అన్నారు కూతుళ్లిద్దరూ.

ఈ పెత్తనాల గురించి తెలిసినా, గబుక్కున కాదని అనలేకపోయింది.

వాళ్లు తెచ్చిన కూరుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో ఏవైనా లోపాలు ఎత్తి చూపితే మొదట్లో వినేవారు. కానీ, రానురానూ ‘‘నీకీ వయసులో రుచులు ఎక్కువ య్యాయ్‌?’’ అని విసుక్కోవడం మొదలు పెట్టారు.

అంతేకాదు, తర్వాత్తర్వాత ‘ఏవైనా నీకు పెద్దదంటేనే ఇష్టం’ అని చిన్నదీ, ‘నీకు చిన్నదానిమీదే మనసు, నేనెంత చేసినా లక్ష్యపెట్టవ్‌’ అని పెద్దదీ ఆమెను ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు.

పిల్లల గొడవలు ఆమెలో ఉక్రోషాన్ని రగిలించాయి. ‘ఏం, ఈ వయసులో మాత్రం రుచిగా తినకూడదా? ఆయన వెళ్లిపోగానే నేనేదో అనవసరంగా ఇక్కడ ఉండిపోయినట్టు మాట్లాడతారేంటి? ఎలాగోలా బతికితే సరిపోదా అన్నట్టు చూస్తారేంటి? ఏం, నేను మనిషిని కాదా? నా కోసం నేను సుబ్బరంగా బతక్కూడదా? వీళ్ల బోడి పెత్తనమేంటి?’ అనే ఆవేదన ఆమెలో పురులు విప్పుకుంది. నాలుగు రోజుల అంతర్మధనం అనంతరం, అది పడగ విప్పింది.

‘ఇక మీదట మీ పనులేవో మీరు చూసుకోండి, నా కోసం హైరానా పడొద్ద’ని కూతుర్లకు నచ్చజెప్పింది.

‘ఊరికే చేస్తుంటే, లెక్క లేకుండా ఉంది. చూద్దాం,ఎన్నాళ్లు సాగుతుంతో..’ అని కూతుళ్లు కూడా ‘సరే’ అన్నారు.

స్త్రీలలో మార్పును ముక్కు మీద గుద్దినట్టు చెప్పేది అలంకరణే. ఏదో నైటీ వేసుకుని, నేత చీర కట్టుకుని, తలవంచుకుని, తలపుచాటున నిలబడి, ఎటో దిక్కులు చూస్తూ మాట్లాడాల్సిన పరిస్థితిలో ఆమె-వెన్ను నిటారుగా చేసుకుని నిలబడిరది. బీరువాల్లో మగ్గుతున్న చీరలన్నీ బయటకు తీసింది. పూటకో చీర మార్చకపోయినా, రోజుకో చీర నిండుగా కట్టుకోవడం మొదలు పెట్టింది. నసగాల్సిన చోటా, గుసగుసగా మాట్లాడాల్సిన చోటా- కావాలనే గొంతు పెద్దది చేసి గట్టిగా మాట్లాడటం ప్రారంభించింది.

ఆమె అభిజాత్యం కూతుర్లకే కాదు, కాలనీ వాళ్లందరికీ కొట్టొచ్చినట్టు కనబడిరది. కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగే ప్రతి కార్యక్రమానికీ హాజరవ్వ సాగింది. పొద్దన్నే యోగా క్లాసులకు వెళ్లేది. అలా వేళ్లేప్పుడు చుడీదార్‌ వేసుకునేది. వాళ్లాయన ట్రాక్‌ ప్యాంట్‌, టీ షర్టు కూడా వేసుకుని ఇంట్లోని అద్దంలో చూసుకుంది. కానీ, బయటకు వెళ్లడానికి కాస్త తటపటాయించింది. పండగలప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలకు మంచిమంచి పట్టు చీరలు కట్టుకుని హాజరయ్యేది. ఆమె గాంభీర్యం చూసి, తెచ్చిపెట్టుకున్న సానుభూతి ఒలకబోయాలనుకున్న వాళ్లు కూడా వెనుకంజ వేసేవాళ్లు.

నెమ్మదిగా ఆమెలో ఆత్మవిశ్వాసం బలపడిరది. ఇంటిని చక్కదిద్దే ప్రయత్నం చేసింది. మళ్లీ ఏడవకుండా, కూతుళ్లను పిలిచి కావాల్సిన వస్తువులు, సామాన్లు తీసుకుపొమ్మని చెప్పింది. భర్త బట్టలు చట్టుపక్కల అపార్ట్‌ మెంట్లలోని వాచ్‌మన్లకు ఇచ్చేసింది. వాచీ, వాడని పర్సు, టై లాంటివి బంధువుల్లో కాస్త లేనివారికి అందజేసింది.

తన వంటింట్లోని సామాన్లన్నీ తీసుకుని పనిమనిషి సాయంతో ఆటోలో బజార్లోని స్టీలు సామాన్ల షాపుకి వెళ్లింది. తాను తీసుకెళ్లిన సామాన్లు ఇచ్చి, పైన కాసిని డబ్బులు వేసుకుని తన ఒక్క దానికీ సరిపడేలా చిన్న చిన్న స్టీల్‌ కుక్కర్‌, మూకుళ్లు, గరిటెలు, కాఫీ ఫిల్టర్‌ తీసుకుంది.

దాంతో ఇల్లు-సగం ఏంటి, అంతకంటే ఎక్కువే ఖాళీ అయిపోయింది.

ఆమెలో ఉత్సాహం మరింత ఉరకలు వేసింది.

పొద్దున్న లేవగానే ‘టైమెంతైందీ?’ అనుకుంటూ గడియారం వైపు చూడటం మానేసింది. టీవీ ఆన్‌ చేసి భక్తి పాటలు పెడుతుంది. స్టౌమీద పాలు పడేసి బ్రష్‌ చేసుకుని వచ్చి, ఫిల్టర్‌ కాఫీ తాగుతూ ఛానల్స్‌ మారుస్తూ వార్తలు చూస్తుంది. స్నానం చేసొచ్చి ఏ దోశలో పోసుకుంటుంది. లేదంటే ఇడ్లీలు పెట్టుకుంటుంది. పచ్చళ్లు పొడులు ఎలాగూ ఉండనే ఉంటాయి. సాయంత్రాలు హాల్లోంచి గదుల్లోకి తిరుగుతూ వాకింగ్‌ అయిందనిపిస్తుంది. ఇలా నాలుగు నెలలు గడిచాయో లేదో ఆమెలో చాలా మార్పు వచ్చింది. వయసుకు మించిన హుషారు వచ్చింది. అది ఇతరుల్లోనూ గమనింపునకు వచ్చింది. టీవీలో పాత సినిమాలు చూస్తూ అందులోని పాటలు గొంతు విప్పి హాయిగా పాడుకునేది. ఫేస్బుక్‌, యూట్యూబ్‌ వీడియోల్లో డాన్సులు చూస్తే-శరీరం సహకరించకపోయినా, మనసు ఊగిపోయేది.

సంతోషం సగం బలం అని ఎందుకంటారో అప్పుడు ఆమెకు అర్థమయ్యింది.

‘‘బా.. పాడతన్నవమ్మా’’ అని పని మనిషి నవ్వుతూ పొగిడేది.

‘‘ఏడిసావులే. టిఫిన్‌ కావాలంటే అడుగు పెడతా. నా పాట ఏ పాటో నాకు తెలీదనుకున్నావా?’’ అని నవ్వేసేది.

హెన్నా నానబెట్టుకుని, పనిమనిషితో తలకు పెట్టించుకునేది. అది ‘ఈ వయసులో ఎందుకమ్మా?’ అనకుండా, పనిమనిషి చేతిలో ఓ వంద పడేసేది.

పైకి చెప్పకపోయినా, తల్లిలో వచ్చిన మార్పు కూతుర్లిద్దరిలో తెలియని గర్వాన్ని నింపింది. ధైర్యాన్నిచ్చింది.

*       *       *

సాఫీగా వెళ్తున్న కారు సడన్‌ బ్రేక్‌తో ఆగింది. ఎవరి ఆలోచనల్లోంచి వాళ్లు ఇహ లోకంలోకి వచ్చారు. పక్క సీట్లోని తల్లీ, వెనుక సీట్లోని అక్కా ‘ఏవైందీ?’ అన్నట్టు చూశారు.

‘‘ఏమీ లేదు, సిగ్నల్‌ పడిరది’’ అంటూ గేర్‌ని న్యూట్రల్‌లో పెట్టి, తల్లి వైపు దీర్ఘంగా చూసింది చిన్న కూతురు.

‘‘అమ్మా.. నువ్వు మరీ ఓవర్‌ చేస్తున్నావ్‌. మేమే ఏదో అలాఅలా తయారవుతుంటే, నీకేమో షోకులెక్కువయ్యాయి’’ అంది.

‘‘అవును, నాకు షోకులు ఎక్కువయ్యాయి. నేనే బ్యూటీ పార్లర్‌కి పోయి ఐబ్రోస్‌ చేయించుకుంటున్నా. నేనే ఫేస్‌ ప్యాక్‌ వేయించుకుంటున్నా. నేనే హెయిర్‌ స్ట్రయిటెనింగ్‌ చేయించుకుంటున్నా..’’ అని ఆవిడ ఇంకా అంటుండగానే..

‘‘అవునమ్మా, మేమంటే వయసులో ఉన్నాం. చేయించుకుంటాం..’’ అని పెద్ద కూతురు ఇంకా ఏదో అనబోతుండగానే..

‘‘అవునే, మీరేమో కన్నె పిల్లలూ, కుర్రపీనుగులూ. నేనేమో ముసలిదాన్ని. అంతేగా? అందులో దాపరికం ఏముంది?’’ అంది పెద్దావిడ, వ్యంగ్యంగా.

అమ్మ కోపాన్ని చూసి చిన్న కూతుళ్లు చిన్నగా నవ్వుకున్నారు. అది పెద్దావిడకు మరింత కోపం తెప్పించింది.

‘‘అంటే.. అన్నానని ఏడుస్తారు మళ్లీ. నువ్వూ ఉద్యోగం వెలగబెడుతున్నావ్‌ కదా. ఆ మధ్య నీతో చాలా క్లోజ్‌గా ఉండే మీ కొలీగ్‌ ఒకాయన ఫోన్‌ చేసి ‘మీరుండే ఏరియాకు పనిమీద వచ్చాను. ఓసారి కలుస్తా. ఇంటికి రానా?’ అని అడిగితే రానిచ్చావా?’’ అని నిలదీసిందావిడ.

వెంటేనే చెల్లెలు ఓ వైపు డ్రైవింగ్‌ చేస్తూనే, కాస్త వెనక్కు తిరిగి అక్కవైపు చూస్తూ..

‘‘అది కాదే, ఎప్పుడంటే అప్పుడు ఎలా రానిస్తామే మగవాళ్లని ఇంటికి. జుట్లు ముడులేసుకుని, నైటీలు దిగేసుకుని పోతామా, జిడ్డు ముఖాలతో వాళ్ల ముందుకు? డిగ్నిటీ పాడూ ఏమీ ఉండవా?’’ అని ఆవేశంగా ప్రశ్నించింది.

‘‘అమ్మ ఏదో అంటుంది లేవే. నీకేమైనా కొత్తా? సరిగ్గా చూసి డ్రైవింగ్‌ చెయ్యి. లేదంటే..’’ అందామె చెల్లెలితో.

‘‘ఆ.. ఆ డిగ్నిటీయే నాకూ ఉండాలి కదా అనేది. ఓపిక లేకపోతే పోనీ అనుకోవచ్చు. ఉన్నప్పుడు కూడా ఏం ఖర్మ? ఈసురోమంటూ బతుకాలా? అదీగాక, చుట్టుపక్కల ఫంక్షన్లు, మనవాళ్ల ఇళ్లలో కార్యక్రమాలు అంటే పోనీలో అనుకోవచ్చు. ఎప్పుడూ చూసే ముఖాలే కాబట్టి. స్టార్‌ హోటల్లో, అంత పెద్ద పెళ్లి రిసెప్షన్‌ అంటే ఎక్కడెక్కడి వాళ్లో రారూ? కాస్త ఠీవిగా, దర్జాగా ఉండద్దుటే వాళ్ల ముందు? లోపట వేసుకోపోతే ఎలా? ఉన్నాయనే అనుకున్నా. ఉండాలి కూడా. రెగ్యులర్‌గా వాడకపోయేసరికి, గబుక్కున ఎక్కడ తగలడ్డాయో కనబడలేదు. లేపోతే, మీతో ఇన్ని మాటలు పడేదాన్నా?’’ అని ఆవిడ అంటూ ఉండగానే, గొంతు బొంగురుపోయింది. కూతుళ్లు ఏదో సర్ది చెప్పబోయారు, ఇంతలో హోటల్‌ వచ్చేసింది.

లోపలకు వెళ్తూనే బంధువులతో తమ నగలు, బట్టలు పోల్చుకుని ‘ఫరవాలేదు బాగానే తయారయ్యాం’ అనే నిర్ణయానికొచ్చారు కూతుళ్లిద్దరూ. ఎంత ఎక్కువ స్కిన్‌ షో చేస్తే అంత గొప్పని వాళ్లకు తెలుసు. కానీ, తమ పిల్లల కంటే చాలామంది సింగిల్‌ పీస్‌ డ్రస్స్‌తో- అసలు అది కూడా వేసుకోడం ఎందుకు అన్నట్టు స్కిన్‌ షో చేస్తూ కనబడేసరికి కాస్త ఖంగుతిన్నారు.

పెద్దావిడలోని హుందాతనాన్నీ, ఠీవిని.. చాలామంది బంధువులు గుర్తించారు.

‘‘ఎనభైల్లోకి వస్తూ కూడా యాభైల్లోలాగా ఫెళఫెళలాడుతున్నావ్‌’’ నెమ్మదిగా అంది పెద్దావిడ చిన్న చెల్లెలు దగ్గరకు వచ్చి కౌగిలించుకుంటూ.

‘‘మరీ మోసయ్యకే. ఏదో పెద్ద ఫంక్షన్‌ అనీ, నలుగురూ వస్తారని.. అంతే. మరీ అతిగా ఉందా?’’ అంటూ చెల్లెలిని అడిగిందావిడ మొహమాటాంగా.

‘‘ఏం లేదు. బావున్నావ్‌. ధీమాగా, దర్జాగా కనిపిస్తున్నావ్‌’’ అంటూ చెల్లెలు కబుర్లలోకి దింపింది.

తల్లి వయసుకంటే చాలా చిన్న వాళ్లు, ఆమెకంటే వృద్ధుల్లా కనబడటాన్ని కూతుళ్లు గుర్తించకపోలేదు. బహుశా, వాళ్లు ముసలితనానికి లొంగిపోయారేమో అనిపించింది వాళ్లకి.

ఫంక్షన్‌ ముగించుకుని, బయటకు వస్తుంటే ‘‘అమ్మా నువ్వొక్కసారి ఉండు’’ అని తల్లిని చేయి పట్టుకుని తీసుకువెళ్లిన చిన్న కూతురు, పైనున్న షాండ్లియర్‌ లైటింగ్‌ పడేలా, వెనకాల అలంకరించిన వాల్స్‌ కూడా వచ్చేలా మొబైల్‌తో టకటకా నాలుగైదు ఫొటోలు తీసింది.

అంతా బయటకు వచ్చాకా, ‘మేమంతా ఒకే కారులో వెళ్తాం’ అని పిల్లలు గొడవ చేశారు. ఆడవాళ్లతో ఎందుకులే అనుకున్నాడేమో, చిన్నల్లుడు కూడా అదే కారులో ఎక్కేసాడు.

కారు రోడ్డెక్కాక ‘‘ఏమే ఫోన్‌ ఇటియ్యి. అమ్మ ఫొటోలు తీసినట్టున్నావ్‌’’ అని చెల్లెలి ఫోన్‌ తీసుకుంది అక్క.

ఫొటోలు చూస్తూ ‘‘అమ్మా నీది వేరే లెవెలమ్మా. జయాబచ్చన్‌, రేఖ.. అలాంటి వాళ్లలా దర్జాగా వున్నావ్‌’’ అంది.

‘‘ఏడిసార్లెండి మీరూ మీ మాటలూనూ. ఇలా ఇవ్వండి. నేనెలా ఉన్నానో నేను చూసుకోవద్దా?’’ అందావిడ.

పెద్ద కూతురు ఫోన్‌ అందించింది. తన ఫొటోలను చూసుకుంది. అలా చూసుకుంటుంటే ఒకరకమైన గర్వం ఆమె ముఖంలో తొణికిసలాడిరది. ఫోన్‌ పక్కన పెట్టేసి ఓ క్షణం మౌనం వహించింది. తరువాత నెమ్మదిగా ఆచితూచి మాట్లాడుతున్నట్టు ‘‘ఓమాట చెబుతా వినండి. వయసులో ఉన్నప్పుడు అలంకరణలు ముచ్చట కోసం, ఆకర్షణ, ఫ్యాషన్‌ కోసమైతే వయసైపోయాక అలంకరణలు ఆత్మగౌరవం కోసం. ఇంటి గుట్టే కాదే, లోగుట్టు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంటి గుట్టు లంకకు చేటైతే.. లోగుట్టు ఒంటికి చేటు. నువ్వు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడినంతకాలమే ఈ ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. వంగావనుకో అణగదొక్కేస్తుంది’’ అందావిడ ఉద్వేగంగా.

కూతుర్లిద్దరూ తల్లివైపు చూసారు, కూతుర్లలా కాదు-భక్తుల్లా.

వచ్చేవారం కథ..

 భరతమాత –  గోగినేని రత్నాకరరావు

About Author

By editor

Twitter
YOUTUBE