సృజనాత్మకతకు హద్దులు లేవు. గ్రహాల మధ్య ప్రయాణం కూడా ఆ మహాశక్తికి అసాధ్యం కాదు. ఐదు దేశాల వ్యోమగాములు అంతరిక్షంలో నిర్మించిన స్పేస్ స్టేషన్‌లో 24 గంటలు గడిపితే, వారి అనుభవాలూ, అనుభూతులూ ఎలా ఉండవచ్చు? వాటి నుంచి ఏమి గ్రహించవచ్చు? 24 గంటలలో 16 సూర్యోదయాలూ, అదే సంఖ్యలో అస్తమయాలూ చూడడం ఎలాంటి అనుభూతి? మన గ్రహం అనుసరించే కాలమానానికీ, అంతరిక్షంలో కాలమానానికీ తేడా ఉందని చెబుతారు. ఆ సమయం ప్రకారం భూమి తన చుట్టూ తాను 16 పర్యాయాలు తిరుగుతుంది. ఇలాంటి ఇతివృత్తంతో రాసిన సైన్స్ ఫిక్షన్ ‘ఆర్బిటల్’. 2024 సంవత్సరానికి బుకర్ పురస్కారానికి ఎంపికైన నవల ఇదే. రచయిత్రి ఇంగ్లండ్‌కు చెందిన సమంత హార్వే. నవంబర్ 12న ఈ మేరకు ప్రకటన వెలువడిరది.
ఇది గాయపడిన ప్రపంచం గురించి చెప్పిన రచన అని న్యాయ నిర్ణేతలు వ్యాఖ్యానించారు. ఈ ఏటి పురస్కారం ఈ నవలకు ఇవ్వాలని న్యాయ మూర్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారంటే ఇందు లోని సౌందర్యం, ఆశయం ఎంత విశిష్టమైనవో అర్ధం చేసుకోవచ్చు. అంతరిక్షంలో ఉన్నంత సేపు వ్యోమ గాముల ఆలోచనలు, అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ అలాంటి కేంద్రంలో ఉండే నిర్మానుష్య వాతావరణం, మనిషి సాటి మనిషితో కోరుకునే బంధం, ఆశ నిరాశల మధ్య ఊగిసలాటల గురించి ఆమె కల్పన చేశారు. భూగోళం మీద జీవితం ఎంత అందమైనదో, ప్రతిక్షణం మనిషిని భయాల మధ్య నిలిపిఉంచే అంతరిక్ష కోణం నుంచి తెలియచేసే ప్రయత్నమే ఇదంతా. నిజానికి భూగోళం ఎంత సుందరమైనదో ఆవిష్కరించడం ఆమె అసలు ఉద్దేశంగా కనిపిస్తుంది.
అంతరిక్ష జీవితం గురించి రాసిన తొలి నవలగా సాహిత్య చరిత్రలో ‘ఆర్బిటల్’ ప్రత్యేకతను సంతరించు కుంది. 16 ఉషోదయాల దృశ్యాలను, అలాగే 16 సూర్యాస్తమయాలను ఆమె తన నవలలో అద్భుతంగా ఆవిష్కరించారని న్యాయనిర్ణేతలు చెప్పారు. ఈ సంవత్సరం బుకర్ పురస్కారం పరిశీలనకు వెళ్లిన ఆంగ్ల రచయిత ఆమె ఒక్కరే.
1975లో కెంట్‌లో పుట్టిన సమంత తత్త్వశాస్త్ర విద్యార్థిని. ఆమె మొదటి నవల ‘ది వైల్డర్‌నెస్’ కూడా బుకర్ పరిశీలనకు వెళ్లింది. ఆ సంవత్సరం ఆ అత్యున్నత పురస్కారం దక్కకపోయినా బెట్టీ ట్రాస్క్ పేరుతో ఇచ్చే సాహిత్య పురస్కారం దక్కింది. పుడమికి అనుకూలంగా ఎవరు మాట్లాడతారో, మానవీయ విలువలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరో వారికి ఈ బహుమానం అంకితం చేస్తున్నానని హార్వే అన్నారు. మొత్తంగా చెప్పాలంటే ఎవరు శాంతి కోసం మాట్లాడతారో వారికి అంకితం అన్నారామె. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆర్బిటల్ 29,000 ప్రతులు అమ్ముడయ్యాయి. ఆర్బిటల్‌కు ముందు ఆమె వెలువరించిన నవలలు ది వెస్ట్రన్ విండ్, ది షేప్‌లెస్ అన్ ఈజ్: ఏ ఇయర్ ఆఫ్ నో స్లీపింగ్, ఇంకొన్ని రచనలు ఉన్నాయి. హార్వే రాసిన ఆరవ నవల ఆర్బిటల్. హార్వే ఈ తరం వారికి వర్జీనియా ఊల్ఫ్ వంటివారని కూడా ఖ్యాతి గాంచారామె.
మానవ జీవితం మీద దుర్బలత్వం, ఐక్యత, వియోగాల పాత్ర ఎంత బలీయంగా ఉంటుందో చెప్పడానికి రచయిత్రి అంతరిక్షాన్ని ప్రతీకగా తీసుకున్నారు. మానవ జీవితంలోని ఆ స్థితులను ఆ పాత్రలతో వర్ణించారు. ఒక జీవితం ఎంచుకున్నారు. ఉద్వేగం, మానసిక, భౌతిక కోణాల నుంచి చూసినా మనిషి ఉనికి ఎంత దుర్బలమైనదో చెప్పడం ఇందులోని మరొక కోణం. అంతరిక్షం అంటే ప్రతిక్షణం ప్రాణాన్ని ముప్పు అంచుకు తీసుకువెళ్లి వెనక్కి తీసుకువచ్చే వాతావరణంలో ఉంటుంది. మానవ జీవితం అసలు తత్త్వం ఇదేనని ఆమె చెబుతారు. భూమి మీద కూడా మానవ జీవితం ఎప్పటికీ ఒక ముప్పు అంచునే ఉన్నా, ఆ విషయం మనిషి నిశితంగా గమనించడు కాబట్టి రచయిత్రి తన ఇతివృత్తానికి అంతరిక్ష కేంద్రాన్ని నేపథ్యంగా తీసుకున్నారని అనిపిస్తుంది. ఒక క్షణం ఆశ, మరుక్షణం నిరాశ ఎలా పెనవేసుకుని ఉంటాయో వ్యోమగామి జీవితం బాగా ప్రదర్శించగలదు. ఇంత పెద్ద కాన్వాస్‌ను వర్ణించడానికి తీసుకున్న ఇతివృత్తం కాలపరిమితి కేవలం 24 గంటలు. 16 సూర్యో దయాలు, 16 అస్తమయాల నడుమ ఆ పాత్రలన్నీ భూమి మీది తమ అనుభవాలే గీటురాళ్లుగా అంతరిక్షంలో ఏర్పడిన భయాలను ఆలోచనలను వివరిస్తాయి. సమూహంలో ఉన్నా మనిషిలో తనవైన ఆలోచనలు తప్పవంటారు రచయిత్రి. అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, ఇటలీ దేశాల వ్యోమ గాములను అంతరిక్షంలో కలపడమే ఈ నవలలోని వైవిధ్యం. ఈ కూర్పే నవల రూపసారాలను సంప ద్వంతం చేసింది. ప్రతి వ్యోమగామి తనదైన సంస్కృతి, దృక్పథం నుంచి అనుభవాలను పంచుకుంటూ ఉంటాడు. ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా, ఎలాంటి దృక్పథంతో ఉన్నా మానవాళిలో ఒక సామ్యత ఉంటుందని ఆమె చెబుతారు.
మానవాళి మొత్తానికి వర్తించే కొన్ని అనుభవాలు, భయాలు, ఆకాంక్షలు ఉన్నాయని మనకి ఇటీవలనే గుర్తు చేసిన సందర్భం కొవిడ్ 19. మనిషి జీవితం లోని ఈ స్థితులను అంతరిక్షం కేంద్రంగా చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన హార్వేకు కొవిడ్ కాలంలోనే రావడం విశేషం. ప్రకృతి ముందు మనిషి ఎంత అల్పుడో ఆ కాలం గొప్పగా చెప్పింది. ఎడబాటు ఎంత భయానకమో, మనిషికి మనిషి ఎంత సాంత్వనో తెలియచేసిన ఇటీవలి అనుభవం కూడా అదే. దీనినే రచయిత్రి మరింత బలంగా ఆవిష్కరించ డానికి, కాన్వాస్ పరిధిని పెంచుతూ అంతరిక్షంలో చెప్పారు. ఈ నవల పూర్తి చేసిన పాఠకులు సొంత జీవితం గురించి, మానవ సంబంధాల గురించి మనిషి ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉందన్న అభిప్రాయానికి వస్తారని నిశ్చయంగా చెప్పవచ్చు నంటారు విమర్శకులు. ఇంత తాత్త్వికతను కేవలం 136 పేజీలలోనే అందించారు. నిజానికి హార్వే రచనా శైలి ఉద్వేగభరితంగా, ప్రభావాత్మకంగా, అయినా క్లుప్తంగా ఉంటుందని విమర్శకులు చెబుతారు. ఎంతటి క్లిష్ట ఇతివృత్తానయినా ఆమె తక్కువ నిడివిలో చెప్పడానికే ప్రయత్నిస్తారు. ప్రయోగించే ప్రతి పదం పాఠకుడిని కదిలించే తీరులో ఉపయోగిస్తారన్న ఖ్యాతి ఆమెది. అర్బిటల్ నవలలోని క్లుప్తత కూడా పాఠకులను విశేషంగా ఆకర్షించిన కారణాలలో ఒకటి. చిరకాలం పాఠకుల మనసుల మీద ప్రభావం చూపించాలి అంటే సుదీర్ఘమైన నవలలే కానక్కరలేదని ఆమె నిరూపించా రని కూడా విమర్శకులు అంటారు.
- జాగృతి డెస్క్