‘కందువ మాటలు, సామెత / లందముగా గూర్చి చెప్పినది తెనుగునకున్/ బొందై, రుచిjైు, వీనుల / విందై, మరి కానుపించు విబుధుల మదికిన్’ మొల్ల కవితా విలసన భాగం ఇది. శ్రీ మహిమాభిరాముడు, వశిష్ఠ మహాముని పూజితుండు, సుత్రామ వధూ కళాభరణ రక్షకుడు, ఆశ్రితపోషకుడు, దూర్వామల సన్నిభాగుండు, మహాగుణశాలి, దయాపరుండు అంటూ కొనియాడుతుంది ఇష్టదేవతా సన్నుతి. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండల ఆశ్వాసాలన్నింటిలోనూ అనేకానేక వైభవ ప్రాభవాలు. ఆశ్వాస ముగింపున `
‘జలజాక్ష, భక్తవత్సల
జలజాసన వినుతపాద జలజాత, సుధా
జలరాశి భవ్యమందిర
జలజాకర చారుహంస, జానకినాథా!’
అన్నపుడు మహదానంద తరంగితం కాని హృది ఉంటుందా?
గద్యానికి సంబంధించీ.. శ్రీగౌరీశ్వర వరప్రసాద లబ్ధి గురు జంగమార్చన వినోద సూరి జన వినుత కవితా చమత్కార.. అని కొనసాగుతుంటే ` పఠించినా, ఆలకించినా మరెంత భావనోత్తేజమో కదా! వందలాది పద్యాలను కొద్ది రోజులలోనే విరచించిన ఆమెది సరళసుందర శైలి.కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణిగా, శ్రీమద్ రామాయణ కావ్య రచనా రసథునిగా పేరొందిన ఆమె పదబంధాలన్నీ ఆపాత మధురాలు.
అంతటి నవ్యత, భవ్యత, దివ్యత నిండిన తనతో పోలుస్తూ ‘అభినవ మొల్ల’ అనిపించుకోవడమంటే మాటలా? అంత ప్రశస్తినీ సొంతం చేసుకున్న చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ సంస్కృతి సభా కార్యక్రమ వేదిక భద్రాచలంలోని శ్రీ జీయర్ మఠం. అక్కడే వాల్మీకి శ్రీరామాయణ బాలకాండ అనుసృజనగా గ్రంథ ఆవిష్కరణ, ‘భద్రభారతి’ పురస్కార ప్రదానోత్సవం నవంబర్ 24న ఏర్పాటైంది.
‘మధుర కవయిత్రి’గా లక్ష్మీ నరసమ్మకు పేరు. ఎనిమిదన్నర దశాబ్దాల క్రితం భద్రాచలాన జనించిన ఆమె బాల్యమంతా సీతారాముల దేవస్థాన ప్రాంగణ విభవంతో ముడివడి ఉంది. తండ్రి వీరరాఘవా చార్య, తల్లి నరసమాంబ. తొలి నుంచీ చదువుమీద మక్కువ ఎక్కువగా ఉన్న లక్ష్మీనరసమ్మకు నివాసగృ హమే విద్యాలయం.బోధక వృత్తి శిక్షణ తదుపరి, తన ప్రాంతంలోనే ఉపాధ్యాయినిగా ఉద్యోగ బాధ్యతల నిర్వహణ. ఉన్నత విద్యాభ్యాస కాలాన ఎప్పుడూ ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత. ప్రతిభా సామర్థ్యాల నిధి.
కవిత అంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రథమంగా రాసినపుడు తనది ఆరేడు ఏళ్ల వయసు! కవితలతోపాటు కథలనూ రచించి, నాటి మేటి పత్రికల ప్రోత్సాహాన్నీ సాధించి, తనదైన విలక్షణతను కనబరిచారు. భద్రగిరి పేరిట నవలను కూడా వెలువరించినపుడు ఆమెది పాతికేళ్లప్రాయం. భద్రాద్రి ముంగిట వరకల్పవల్లీ, రాముని పాదాల పాద్యాల వెల్లీ, నా కవితల్లె పొంగవే గోదారి తల్లీ! అని సుమనోహర వర్ణన చేశారు.
హృదయోల్లాస కవితా రీతికి, మరొక ఉదాహరణ ‘రామదాసు’. ఆ పేరు వినీ వినగానే ‘రామమయం’ గుర్తుకొస్తోందా? భద్రాద్రి గౌతమి మదిలో మెదులు తోందా? ఇక్ష్వాకుల తిలకా స్ఫురణ కొస్తోందా? రఘునందనా రఘువీరా అంటూ హృదిలో నాద ధ్వని పలుకుతోందా?
రామదాసు కావ్యరచనమే ఆ మహనీయ సాహితీ జీవితాన్ని మరింత మేలిమలుపు తిప్పింది. మరంద మాధురీతత్వానికి సాకారరూపం ఇచ్చినట్ల యింది. అది 1981. ఇప్పటికి నాలుగు దశాబ్దాలపైన మాట. అప్పటికి లక్ష్మీనరసమ్మకు యాభై ఏళ్లు పైగా ఉంటాయి. పద్య, గద్య రచనా ధురీణతకు ముగ్ధులైన ‘కరుణశ్రీ’ అభినవ మొల్లగా బిరుదాంకితం చేశారు.
నాటి ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకునే ఇప్పుడు ఆ కవయిత్రి సారస్వత కుటుంబ సభ్యులంతా ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.కరుణ కవికుమారుల్లోని వేంకట రమణ చేతుల మీదుగా నల్లాన్ చక్రవర్తుల శ్రీరామచక్రవర్తి, స్థలశాయి స్వామి, తాళ్ళూరి పంచాక్షరయ్య సన్నిధిలో గ్రంథావిష్కరణ. అయోధ్యా పుర వైభవం, దశరథ ధర్మపాలనం, పుత్రకామేష్టి నిర్వాహకత్వం, రామలక్ష్మణ భరత శత్రుఘ్నల అవతార తత్వం, సీతా స్వయంవరం, సీతారాముల పరిణయ శుభసందర్భం, మరెన్నో విశాషాంశాల సమాహారమే బాలకాండ.
శైలీ విన్యాస నిదర్శనంగా సీతాస్వయంవర ఘట్టాన్ని ప్రస్తావించుకుందాం.
‘ద్రవిడ కర్ణాటాంధ్ర యవన మహారాష్ట్ర ` రాజకుమారులు తేజమలర/ బాండ్య ఘార్జరలాట బర్బర మలయాళ ` భూపనందనులు విస్ఫూర్తి మీర / గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ ` ధరణీశ పుత్రులు సిరి వెలుంగ / మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ ` నృపతనూభవులు నెన్నికకు నెక్క
ఉత్కల కొంకణ మద్ర పాండ్ర వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ…’ ఇలా రాజ్యాల పేర్లన్నింటి తోనూ స్వయంవర నిర్ణయ సభామండపం ఉందన్నది ఇతివృత్త అంశం. అంతా ఏకధాటిగా చదివించేదే!
ఇదే బాలకొండలో ఉన్న పారావారా గభీóరి, నిత్య విస్ఫారోదార విహారి, సుజన రక్షాదక్ష దక్షారి, దశరథోర్వీనాథ జంభారి…. వంటి పదప్రయోగాలు వేటికి అవే సాటి, మేటి. వీటన్నింటి నేపథ్యంలో గతంలో ఆమెకు ప్రదానం చేసిన ‘అభినవ మొల్ల’ అనేకానేక ప్రకాశ వికాసాలందుకుంది.
సాహితీ స్వర్ణమహిళ, విశిష్ట వనిత, భద్రాద్రి ఉత్సవాల సాకేతపురి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కృతులూ లక్ష్మీ నరసమ్మను అలనాడే ఏరికోరి వరించాయి. ప్రపంచస్థాయిన విద్యాశాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) బహూకృతీ ఆమెదే.
భద్రగిరి నవలకు దాశరిథి పీఠిక, రామదాసు కావ్యప్రభకు కరుణశ్రీ నుంచి బిరుదు బహూకరణ, మధునాపంతులవారి ప్రత్యేక ప్రశంస మధురాతి మధుర సందర్భాలు. భద్రగిరి ధామ శతకం, భద్రాచల యోగానందలక్ష్మీ నృసింహ సుప్రభాతం, భద్రాచల క్షేత్ర మహాత్మ్యం, శ్రీపదం పేరిట ప్రబంధ అనువాద పద్యకృతి, గోదాకల్యాణం, కావ్యగౌతమి, పద్య కవితా సంపుటిగా నీరాజనం, భక్తి గీతాలుగా తులసీదళాలు.. ఇంకా ఎన్నెన్నో ఆ లేఖిని నుంచి వెలువడ్డాయి. భద్రగిరి శతకానికి ‘సమతాభిరామం’ అనే నామకరణం కవయిత్రీ తిలకం అక్షర శక్తికి ప్రతీక.
కవితా ధనుస్సు, శాంతిభిక్ష, అక్షర తర్పణం, మధువని, మాతృభూమి, దివ్య గీతాంజలి… ప్రతీ పుస్తకమూ భావ సమన్వితం. రచనలతో పాటు భాషా సంబంధ అధ్యయన యాత్రలు సాగించిన ఉత్సాహి. అందులో భాగంగానే మైసూరు ప్రాంతానికి వెళ్లి వచ్చారు.
పద్యం, గద్యం… రెండిరటా మిన్న. ఆ కారణం గానే వాచకాల ఎంపిక సంఘ సభ్యురాలిగా నియమితులయ్యారు. తేట తెలుగుపదాల ఎంపిక, కూర్పులో నేర్పు, ఏ ప్రక్రియ చేపట్టినా నిశిత వ్యక్తీకరణ ఆమె సహజ గుణాలు. పదుల సంఖ్యలో పుస్తకాలు వెలయించారు.
వచన కవితా రంగంలో సైతం అందెవేసిన చెయ్యి. ‘ఆమె కాదు కేవలం భామ/ ఈతరం సత్యభామ / ధరించిందొక కవితా ధనుస్సు / చీల్చి వేస్తోంది జీవన విషాద తమస్సు’ అంటూ నారీభేరి మోగించారు. ఈ కారు చీకట్లను నీ చేతి చిరుదీపం జయిస్తుంది. అప్పుడు ఒకే జాతి ఒకే నీతి నిలుస్తుంది` అంటూనే మానవతా శీతశీకరాల జల్లులో మనోభూమి తడవడాన్ని దర్శించారామె. ఆత్మవిశ్వాస బీజం మొలకెత్తడాన్ని తిలకించారు.
శతక శంఖారామం గురించి ప్రస్తావించి తీరాలి. ఉదాత్త భావపూరితం. సముదాత్త ఆచరణ రీతిక కీలకం, సామాజిక చేతనకు ఆలవాలం.
కువలయ ధళనేత్రా! కోమల స్నిగ్ధ గాత్రా
భవముఖ నుతిపాత్రా! భక్త వృక్షాళి చైత్రా!
రవిశశి సమధామా! రక్షితా క్షాంఘ్రిభామా!
కవిజననుతనామా! కావుమా మమ్ము రామా!
ఈ పదప్రయోగ చాతురి ఎంత అసాధారణమో ప్రస్ఫుటమవుతూనే ఉంది .వచన ప్రక్రియ, అందునా కవితపరంగా భావ సరళతను చూస్తే `
ఉన్నోళ విందుల్లో నీళ్లున్న సెలయేళ్లు
లేనోళ్లకు కన్నీళ్లే మంచినీళ్లు!
ఈ మాటల తూటాలు సమాజ తీరును ప్రతి ఫలిస్తూనే ఉన్నాయి. ప్రాచీన, ఆధునికతలు రెండిరటిలోనూ ఆమె కలం బలాన్ని సూచిస్తున్నాయి.
బతుకమ్మను ఏ విధంగా మనకళ్ల ముందు నిలిపారంటే `
పండుగ పందిళ్లు, సంబురాల సందళ్లు
కలిమిలేముల గడపల్లో సమత పండేలా… అని.
ఇదివరలో భద్రాచలం రామాలయంలో ఉత్సవాలు, అదేవిధంగా అహోబిల మఠంలో ప్రత్యేక పూజలు ఏర్పాటైనపుడు…
గోదాదేవి విరచిత తిరుప్పావై గురించిన ప్రవచనంతో ఆబాల గోపాలాన్నీ మంత్రముగ్ధం చేశారు. ఆ కోవలోనే తిరుమల`తిరుపతి దేవస్థానం నిర్వహణలోని ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు తరఫునా ఆధ్యాత్మిక బోధలు సాగించారు. తిరుప్పావై స్వామిని కీర్తిస్తూ గోదాదేవి గానం చేసిన పాశురాల గీతమాలిక వివరమరెతటిని తేటతెల్లం చేయడంలో దిట్ట. మంగళ ప్రదం తిరు, వ్రతపూరితం పావై. ధనుర్మాస వ్రతంగా తిరుప్పావైకి విఖ్యాతి.
ఆళ్వారుల పవిత్ర సోత్రాల సంబంధితమే దివ్యప్రబంధం. ధార్మికతత్వమే ఆళ్వారుల ప్రత్యేకత. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి/జీవనానికి మూలాధారం దివ్యప్రబంధమే. అటువంటి మూల అంశాల విశదీకరణలో నిష్ణాతురాలు లక్ష్మీనరసమ్మ. దైవ సమ్మేళనాల ప్రచారకర్తగా అనుభవశీలి. భక్తి రస పరిపూర్ణ పాశురాలను అంతటా విస్తృతపరిచారు.
‘తెలుగుతల్లికి వెలుగు పారాణి’ని మనం ఇక్కడ గుర్తుచేసుకుని తీరాలి. ఆదికవీంద్రుని అక్షర రమ్యతా నారికేళ రుచులు నవరసాలు అని ఆరంభించి నన్నెచోడుడు, పండితారాధ్యుడు, పాల్కురికి, గోనబుద్ధ వంటి సాహితీ విరాట్ స్వరూపులందరినీ శ్లాఘించడం ఇందులో కానవస్తుంది.
ఎంత ప్రాచీనతో అంత ఆధునికత. నీటి విలువను ప్రస్ఫుటపరచేలా ‘జలసిరి’ని ఆ కాలంలోనే ఆవిష్కరించారు లక్ష్మీనరసమ్మ.
వరవిలంబి వసంతమా! వసుధ యెల్ల / జలసిరులు నింపి సస్య సుశ్యాలమ్ము / శాంతిభద్రత లొసగుమ్ము స్వాగతమ్ము! అంటూ ఆనాడే ఆహ్వానగీతిక ఆలాపించినవారు ఆమె. నాడు ఆకాశవాణి వెలువరించిన ‘భద్రాచల క్షేత్ర చరిత్ర’ నాటకం నేటికీ శ్రోతల మదిలో ధ్వనిస్తూనే ఉంది, ఇంకా ఎంతకాలమైనా ధ్వనిస్తూనే ఉంటుంది. తనది నిత్యనూతన బాణి.
- జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్