నవంబర్‌ 15 ‌కార్తిక పౌర్ణమి

దీపం జ్ఞానానికి సంకేతం. అజ్ఞానం, నిర్లక్ష్యం అనే చీకటిని పోగొడుతుంది. పరిసరాలను శక్తిమంతం చేస్తుంది. దీపారాధనలో ప్రాపంచిక పరిజ్ఞానం దాగి ఉందని చెబుతారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయనకు చేసే ఉపచారాలలో దీపారాధన ఒకటి. ఆ వెలుగులో భగవంతుని పాదాలను చూడాలంటారు. దీపం నిత్య ఆరాధన విశేషం కాగా కార్తిక దీపం, అందునా కార్తిక పౌర్ణమి దీపారాధనను సర్వపాపహరణ, సకలార్థ సాధకంగా చెబుతారు. ఆత్మ, చెడు కర్మల నుంచి శుద్ధి పొందుతుందని, పరమాత్మతతో అనుబంధాన్ని పెంచుకుంటుందని పెద్దలు అంటారు. హరిహరులను అర్చించడం ఈ మాసం ప్రత్యేకత. వారికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో దైవసన్నిధిలో ఒక్కసారి దీపం వెలిగించినా పాపనివారణ అవుతుందని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. కార్తిక పౌర్ణమి నాడు వెయ్యి లేదా అంతకంటే ఎక్కువ వత్తులను (గుత్తి వత్తులను) ఆలయాలలో, తులసికోటల వద్ద వెలిగించడం ఆచారంగా వస్తోంది. కార్తిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనీ అంటారు.

కార్తిక మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైనది. చాంద్రమానం ప్రకారం, కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కార్తిక పౌర్ణమి. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని ‘దేవ దీపావళి’గా వ్యవహరిస్తారు. ఆ రోజునే పరమశివుడు త్రిపురాసురులను సంహ రించారు. తారకాసురుడి పుత్రులు (తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి) తండ్రి మరణానంతరం దేవతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పిస్తారు. ప్రత్యర్థి ‘రథం కాని రథం ఎక్కి విల్లుకాని విల్లుతో, నారి కాని నారితో, బాణం కాని బాణం ఎక్కుపెట్టి తమ ముగ్గురు సోదరులను ఏకకాలంలో పడగొట్టే వరకు మృత్యువు లేకుండా వరం పొందారు. సహజంగానే వరం గర్వంతో విర్రవీగసాగారు. వారి ఆటకట్టించడానికి నిర్ణయించిన మహేశ్వరుడికి సహకరించేందుకు దేవతలు ముందుకు వచ్చారు. భూమి రథంగా, సూర్యచంద్రులు రథచక్రాలుగా, చతుర్వేదాలు గుర్రాలుగా, బ్రహ్మదేవుడు సారథిగా, మేరు పర్వతం విల్లుగా, ఆదిశేషువు దానికి నారిగా, శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. అలా శివుడు ఒక్క పెట్టున దానవ సోదరత్రయాన్ని సంహరించాడు. అందుకే కార్తిక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ/త్రిపురారి పూర్ణిమ’ అని వ్యవహరిస్తారు. శంకర విజయానికి చిహ్నంగా ఆ రాత్రి దీపోత్సవం నిర్వహిస్తారు. పూర్ణ చంద్రుడు ప్రకాశించే వేళ.. కార్తిక పున్నమి రేయిలో చంద్రశేఖర దర్శనం, అభిషేకం, మారేడు దళాలు, జిల్లేడు పూలతో అర్చించడం వల్ల విశేష ఫలితాలు సిద్ధిస్తా యంటారు. ఆ రోజున శివుడి ప్రీత్యర్థం భక్తేశ్వర వ్రతం చేసుకుంటారు. పగలంతా నిరాహారంగా గడపి సాయంత్రం శివుడిని అభిషేకించి, మారేడు దళాలతో అర్చిస్తారు.

క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని లోకహితం కోసం శివుడు సేవించి కంఠంలో నిలిపినది ఈ రోజే. ఆనాడే విష్ణువు వేదోద్ధరణకు మత్స్యావతారం దాల్చారు. బృందాదేవి తులసీ మొక్కగా అవతరించారు. క•ృష్ణభక్తులు ‘రాసపూర్ణిమ’ ఉత్సవం జరుపుకుంటారు. ఆషాఢ పూర్ణిమ నాడు ప్రారంభించిన చాతుర్మాస్య దీక్షను కార్తిక పౌర్ణమి నాడు విరమిస్తారు. ఆ నాటి రాత్రి అరటి దొప్పలలో దీపాలను ఉంచి నీటిలో వదులుతారు.

పవిత్ర దీపదర్శనంతో ప్రశాంతత• కలుగు తుంది. దీపాన్ని లక్ష్మీదేవి చిరునవ్వులతో పోలుస్తారు. దీపాలతో కళకళలాడే లోగిళ్లు సకల సౌభాగ్యాలకు నెలవులని, దీపాన్ని వెలిగించి పూజిస్తే త్రిశక్తులతో పాటు త్రిమూర్తులను అర్చించినట్లేనని, దీపం వెలిగించిన వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులు అవుతారని, మోక్షాన్ని పొందుతారని పెద్దలు చెబుతారు. క్షేత్రదర్శనం తరువాత నదీ దేవతలకు దీపం వెలిగించి హారతి ఇస్తారు.

అగ్ని సంబంధమైన కృత్తిక నక్షత్ర ఈ మాసంలో దీపాలు వెలిగించడం సదాచారం. భారతీయ సంస్కృతిలో తొలి నుంచి అగ్ని ఆరాధన ఉండగా, ఈ మాసంలో అది అత్యంత ప్రధానమైంది. లోకంలోని సమస్త ప్రాణుల హితం కోసం, వాటికి కృతజ్ఞతలు చెప్పేందుకు కనీసం కార్తిక పౌర్ణమి నాడు దీపం పెట్టాలని పెద్దలు చెబుతారు. ఆనాడు ఊళ్లలో చేసే దీపారాధన కాశీలో దీపం వెలిగించినంత పుణ్యమని విశ్వాసం. కారణాంతరాల వల్ల నెలంతా దీపాలు పెట్టలేకపోయినా, శుక్ల ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ రోజుల్లోనైనా దీపం వెలిగిస్తే పుణ్యలోక (వైకుంఠ) ప్రాప్తి కలుగుతుందని అంటారు.

కార్తిక పున్నమి అనగానే సాహితీవేత్తలకు గుర్తుకొచ్చే మహాకవి భవభూతి (శ్రీకంఠశర్మ). ఒక కార్తిక పున్నమినాడు వెన్నెల శోభను ఆస్వాదిస్తున్న ఆయనకు, నింగి నుంచి నేలకు జాలువారుతున్న కౌముదీ ప్రవాహం,  కైలాసంలో తాండవం ఆడుతున్న పరమశివుడి దేహం నుంచి జాలువారే విభూతిలా అనిపించిందంట. పరవశంతో అలా కవిత్వం చెప్పడంతో ఆయన భావుకతకు మెచ్చిన సాహితీలోకం ‘భవభూతి’ అని సంభావించిందట.

జ్వాలాతోరణం

కార్తిక పౌర్ణమి నాడు ఇళ్లలో, ఆలయాలలో ఆవునేతితో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపోత్సవాలతో పాటు శివాలయాలలో జ్వాలాతోరణం ప్రత్యేక ఉత్సవంగా నిర్వహిస్తారు. దీని దర్శనం సర్వపాప హరణం, అనంత పుణ్యఫలం అని విశ్వసిస్తారు. జ్వాలాతోరణ సంప్రదాయం వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి.

క్షీరసాగర మథనవేళ వెలువడిన గరళాన్ని గళంలో నిలిపిన పతికి ఎలాంటి హాని కలుగకూడదని, అలా క్షేమంగా బయటపడితే చిచ్చులతోరణం కింద నుంచి నడిచివస్తామని పార్వతీదేవి మొక్కుకుందట. అలా శివపార్వతులు మూడుసార్లు దాని కింద నుంచి దాటి వెళ్లారట. నేటికీ శ్రీశైలంలో ఆదిదంపతుల మూర్తుల పల్లకిని మూడుమార్లు అటుఇటు దాటిస్తారు. మరో కథనం ప్రకారం, దానవ సంహారానికి వెళ్లిన శివుడు ఎన్నేళ్లకూ తిరిగి రాకపోవడంతో విరక్తి చెందిన పార్వతీ పతీవియోగం భరించలేక, అగ్ని ప్రవేశానికి సిద్ధమైంది.శివుడు ప్రత్యక్షమై ఆమె ప్రయత్నాన్ని నివారించాడు. ఆ చితిని జ్వాలాతోరణంగా మార్చి, వారిద్దరు విలాసంగా దానికి మూడుసార్లు ప్రదక్షిణ చేశారు.

త్రిపురాసుర సంహరం తరువాత అమ్మవారు పరమేశ్వరుడికి జ్వాలాతోరణ కింద దిష్టి తీశారని మరో కథనం. నాటినుంచి శైవ క్షేత్రాలలో జ్వాలాతోరణం సంప్రదాయం వచ్చిందని చెబుతారు. శ్రీశైల క్షేత్రంలో కార్తిక జ్వాలాతోరణ మహోత్సవం నయనానందదాయకం. జ్వాలాతోరణాన్ని గడ్గ్డితో తయారు చేయడం సాధారణం కాగా అక్కడ మాత్రం పత్తిదారాలతో రూపొందిస్తారు. దేవాంగులు ఏడాది పాటు పత్తిని వడికి తయారు చేసిన దారపు ఉండలను పున్నమి నాటి ఉదయం భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధికి చేరుస్తారు. ఆ దారాలను ఆవునెయ్యి, నువ్వుల నూనెలో నానబెట్టి, సాయం సమయంలో ఆలయ వద్ద స్తంభాలకు కట్టి వెలిగిస్తారు. జ్వాలాతోరణ భస్మాన్ని భక్తులు ప్రీతిపాత్రంగా నొసటను ధరిస్తారు. జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశుగ్రాసంలో కలుపుకుంటే మంచిదని భావిస్తారు.

తమిళనాడులోని అరుణాచలంపై అగ్నిలింగంగా వెలుగొందుతున్న ఆదిదేవుడి ఉత్సవాలలో కార్తిక పౌర్ణమి నాటి దీపారాధన అత్యంత ప్రధానమైంది. ఈ కృత్తికా దీపోత్సవం జగత్ప్రసిద్ధం. దీనిని ‘కుమార దర్శనం’ పేరుతోనూ పిలుస్తారు. శివుడిలో ఐక్యమయ్యేందుకు పార్వతీదేవి అరుణగిరిపై తపస్సు చేసిందని, కార్తిక పూర్ణిమ నాడు ఉజ్వల దీపస్తంభంలా ప్రత్యక్షమైన శివుడు ఆమెను లీనం చేసుకున్నాడని పురాణగాథ. శక్తి, శివుడు ఐక్యం కావడమే అర్ధనారీశ్వర వృత్తాంతంగా చెబుతారు.

నాటి నుంచి అరుణగిరిపై దీపం వెలిగించి, దానిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందని చెబుతారు. కార్తిక మాసంలో కృత్తికా నక్షత్ర వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు అభయమిచ్చారట. అందుకు భక్తిపూర్వక కృతజ్ఞత•తో ఈ మహాదీపోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు వేకువజామున ఆలయంలో భరణీదీపం, సాయంత్రం ఆరు గంటలకు కొండ శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు. అక్కడి పెద్ద రాతిపై గల భారీ ప్రమిదలో నూనె పోసి భారీ వత్తిని వెలిగిస్తారు. తిరుమలేశుడు దేవేరులతో కలసి అరుణాచలేశ్వరుడి మహాజ్యోతిని దర్శిస్తాడట. హిమాలయాల గుహల్లోని తాపసులు దానిని సందర్శించి పరవశులవుతారట. ఏడాదిలో అన్ని రోజలు గిరి ప్రదక్షిణలు ఉన్నా, పౌర్ణమినాడు విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక కార్తిక పున్నమి నాడు అరుణాచల భక్త జన సంద్రమే.

దీపదానం

ఈ పౌర్ణమి నాడు దీపదానాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. కార్తికంలో శివకేశవుల సన్నిధిలో దీపదానం చేసిన వారి అజ్ఞానం పటాపంచలవుతుందని చెబుతారు. దీపదానంతో జ్ఞానం, ఆయుర్వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని వెయ్యి సోమయాగాలు, అగ్నిష్టోమ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్ర వాక్కు. బియ్యం పిండితో చలిమిడి చేసి, దానిలో వత్తివేసి వెలుగుతున్న దీపాన్ని దానం చేస్తారు. కార్తిక పున్నమి నాడు కార్తిక దీపాలనోము నోస్తారు. ఇది మూడు సంవత్సరాల పాటు కొనసాగించాల్సిన నోము. ఆ రోజున దీపదానం చేస్తారు. ఈ మాసంలో అన్న, విద్య, వస్త్ర దానాలు కూడా చేస్తారు.

-డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE