రేకందార్‌. ‌తెలుగువారిలో ఒక ఇంటి పేరు.
ప్రత్యేకించి, ‘సురభి’ ఉమ్మడి నట కుటుంబంలో కీలక పాత్రధారులు. సురభి అంటేనే – అందచందాలు, సద్గుణ సంపదలు, గుబాళింపులు.
ఆ పేరు వినగానే నాటక సమాజం గుర్తుకొస్తుంది.
సారస్వత సంస్థాగత మాధుర్యం మన మదిని తాకుతుంది.
పెద్ద బాలశిక్ష సైతం మనందరి ఎదురుగా కనిపిస్తుంది.
అభిమతాల్ని నెరవేర్చే వరప్రసాదినిగా ప్రత్యక్షమవుతుంది.
ఆధ్యాత్మికత నిండి ఉన్న ‘సురభి’లోని సభ్యుల్లో కొందరు రేకందార్‌ ‌వారు.
సుభద్రమ్మ, గుణవతి, ఉత్తరమ్మ, అనసూయాదేవి. ఇంకా మరెందరో కళారంగ మహిళా మణిదీపికలు.
విఖ్యాత ప్రదర్శక సంస్థగా పేరొందిన సురభిది దరిదాపు ఒకటిన్నర శతాబ్దాకాల ఘనచరిత. మొదట ‘శారదా వినోదిని.’రంగస్థలాన స్త్రీ పాత్రలకు సమధిక ప్రాధాన్యత కలిగించిన ప్రధానబృందం, కుటుంబమే బృందం. వేదికే వారందరి కళాప్రదర్శక క్షేత్రం,కాలక్రమంలో పలు బృందాలు రూపొందాయి… విస్తరించాయి. తదుపరి పరిణామాలకూ నిదర్శనమయ్యాయి. నాటక కళాసంఘం. అందులో బృందాల వారీ అభినయ కౌశలం.
నాట్యమండలిలో బృందస్థాపక బాధ్యురాలు సుభద్రమ్మ. ప్రదర్శనలతోపాటు రంగస్థల అలంకరణ, దర్శకత్వం, ఇతర బాధ్యతల్లోనూ ఆరితేరిన కుటుంబ సభ్యులు అనేకులు.
సంస్థ సప్తతి ఉత్సవ వేళ, 1960 నవంబరు తొలిపక్షంలో ప్రత్యేక సంచిక ఆవిష్కరణ. భారత ఉపరాష్ట్రపతి హోదాలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అక్షరాశీస్సులు అందించారు. నాట్య నాటక ప్రయోగం ఓ యోగం, యాగం అని అభివర్ణించారు భాషావేత్త జమ్ములమడక మాధవరాయశర్మ. సురభి సుస్థిరంగా భాసించాలన్నది నాటి ఆకాశవాణి నుంచి స్థానం నరసింహారావు ఆత్మీయ కామన.
స్త్రీలె స్త్రీ పాత్రములను ధరించిరేని
కళకు మెరుగను రంగ సంస్కరణమునకు
తొలి పునాదిని మునుపు వేయగలిగిరనెడి
అలఘతర కీర్తి సురభివారలదె కాదె…. అనీ ప్రముఖుల ప్రశంస.

‘సురభి’లో విశిష్ట పరిగణన ఉన్న అనసూయాదేవి పుట్టింది నవంబరు 9న. అది 1936వ సంవత్సరం. స్వస్థలం ఏలూరు ప్రాంతం. తండ్రి ఉత్తమరావు, తల్లి సావిత్రి.
బాల్యంలోనే రంగప్రవేశం చేసిన అనసూయ. మహర్షి భార్య అనసూయగా పాత్రలో జీవించారు.ద్రౌపది, రాధ, రుక్మిణి, సత్యభామ, యశోద, సుభద్ర పాత్రలను ధరించి మెప్పించారు. నటవైవిధ్యం అడుగడుగునా కనబరిచారు. తాను ఏ పాత్ర ధరించినా, మూల స్వభావం తెలుసుకుని మరీ కర్తవ్య నిర్వహణ చేశారు.
అర్జునుని భార్య చిత్రాంగదగా నటనలో రాణించారామె. పలు రసాలనీ పండించారు. వాచికం, ఆంగికం, అభినయంలో సాటిలేరనిపించుకున్నారు.ఎంత ఉత్తమ నటనం అంటే, ‘కళాదీపిక’గా బిరుదు పొందేంత!
గుణవతిది విశాఖ పరిసర ప్రాంతం. ఆ ఊరిపేరు నర్సింగరావుపల్లి, బాలనటిగా రంగస్థల ప్రవేశం. ఒకే నాటకంలో మూడు పాత్రలు వేసిన దక్షురాలు. సతీఅనసూయ, బాలనాగమ్మ, లవకుశ చూస్తే ఆమె నటవైదుష్యం ప్రస్ఫుటమ వుతుంది. మరింత విలక్షణం ఏమిటంటే – విశ్వనాథ విజయంలో ఆమెది శ్రీకృష్ణదేవరాయలు పాత్ర.
మరికొన్ని నాటకాలను నాట్యమండలి ఫ్రాన్స్‌లో ప్రదర్శించింది. అక్కడి అంతర్జాతీయ మహోత్సవాలకు దాదాపు యాభైమందితో కూడిన సురభి నటీనట బృందం వెళ్లి వచ్చింది.

ఉత్తరమ్మది విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వలపర్ల గ్రామం.అనేక సంవత్సరాలుగా ప్రదర్శనలిచ్చిన నటీమణి తాను. సావిత్రి, కాంతామతి, గంగావతరణం, బాలనాగమ్మలలో తనదే ప్రధానపాత్ర. దశావతారాలులో అయితే రెండు విభిన్న పాత్రలు. సీతగా, మోహినిగా కూడా! ‘లవకుశ’లో కుశుడు, రామాంజనేయ యుద్ధంలో నారదుడు తానే.
రంగస్థలం మీదనే కాదు, హరికథా వేదికపైనా నిష్ణాతురాలు. ‘మాయా బజారు’లో శశిరేఖ గుర్తుందా? ఆ రేఖ ఈ ఉత్తరే! శశిరేఖ పరిణయం ఒక పద్య కావ్యం. వావిళ్లవారు ఆనాడు ప్రచురించారు. అక్షరాల్లో, నటనలోనూ జనాదరణ పొందింది ఈ పాత్ర పరిపోషణం. ఇందులో ఉత్తరమ్మది ధాటి నటన.
నాటకరంగ స్మృతులు అనేకానేకం. అనుభవాలను కలబోసి, అజరామర పాత్రలను సృష్టించినవారున్నారు. నాట్యం/ నటన ఎప్పుడు పుట్టిందో కానీ; ఆదిదేవుని ఢ•మరక నాదంతో అమ్మవారి చరణ మంజీరనాదానికి శ్రుతి కలిపిందన్నది ‘ధారా’ వారి ప్రశంస.
‘నా పాత్రలను నేను ఓపినంత వరకు ప్రత్యక్షం చేసుకుని ఆరాధిస్తాను’ అని పలికిన వారున్నారు. ఫలితం ప్రేక్షకలోకానిదే అని వారి నిశ్చిత అభిప్రాయం. అంటే – పొగడ్తలకు పొంగని, విమర్శలకు కుంగని తత్వం. ఇదే కదా క్రియాశీలత!
యాగపుత్రిక ద్రౌపది. సదా ఆత్మ పరిశీలకురాలు, ప్రకృతి తత్వప్రతీక రాధాదేవి. అవతార రూపధారిణి, సంప్రదాయ స్వరూపిణి రుక్మిణి. నిబద్ధతకు ఉదాహరణ ఆత్మవిశ్వాసి సత్యభామ. విశేషపాత్ర. ఆమె భావనల సున్నిత, తీవ్రతలను ప్రతిఫలింపచేసిన రంగస్థల నటీమణులు వీరంతా. భావాలను తేటతెల్లం చేయగలిగిన విదుషీమణులు. అందుకే సురభి సంస్థకు ఇంతటి ప్రాధాన్యరీతి.
కల్యాణ లావణ్య కమనీయకాంతులు
చిమ్మె విశ్వము మా శిల్పలక్ష్మి
కళకళలాడి కొందళుకులం గుల్కెను
సౌభాగ్యరేఖ మా జయపతాక
ఖండఖండాల ప్రఖ్యాతినార్జించె వి
నిర్మలంబైన మా ధర్మదీక్ష
సస్య సంపదలతో సౌందర్యమలరించి
సంతోష మొసగె మా సౌఖ్యసీమ
తెలుగు వెలుగులు దశదిశల్‌ ‌తేజరిల్లె!..
అనేలా నటప్రతిభను వెలయించారు
ఈ రంగస్థల నటవనితలంతా!
నటన అనేది నిమగ్నపద్ధతి
కళారూపానికి ప్రత్యక్ష వేదిక.
ఇందులో నైపుణ్యం ఒక్కటే సరిపోదు. భావోద్విగ్నత వెల్లివిరియాలి. ముఖ కవళికలు తేటతెల్లం కావాలి. నట ప్రతిభ, ప్రభ జతకూడితేనే ప్రేక్షక శ్రోతులకు స్పందన. అందుకే సురభి సమాజం సహజత్వానికే ప్రాధాన్యమిస్తూ వచ్చింది, వస్తోంది.
పతికి హితవు నేర్పి బవరమ్మునకు పంపు
మాంచాల మగువలోని కృతనిశ్చయం
కరవాలమూని సంగరరంగమున కేగు
నాగమ్మలోని ఆంధ్రనారీ తత్వం
ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రాణమర్పించిన
మల్లమ్మ ధీశక్తి, యుక్తి సమ్మిశ్రితం
ఇటువంటివాటినీ రంగస్థల వేదిక మీద ప్రతిష్ఠించిన ఘనత నటీమణులకు పుష్కలంగా ఉంది. వీరందరికీ నాటక ప్రదర్శనే జీవిత సర్వస్వం. 1900 ప్రాంతంలోనే సురభి నాటక ప్రదర్శనలనేకం తెలుగువారిని అలరించాయి. ప్రత్యేక రంగస్థల వేదికలు ఏర్పాటయ్యాయి. నగరాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారి, రసహృదయుల అభిమాన ఆదరణలను సొంతం చేసుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని ఇంకా అనేక ప్రాంతాలకు సురభి ప్రదర్శనలు విస్తరించాయి.
దేశ విదేశాల్లో ప్రదర్శనలయ్యాయి. తొలినుంచి ఇప్పటి వరకు కొనసాగిన నట జీవనయానంలో మహిళలది విశిష్ట విశేష పాత్ర. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రధారణలో తమదైన ప్రత్యేకతను ఎవరికివారు కనబరుస్తూ వచ్చారు. నటకళను జీవిత సర్వస్వంగా, సమస్తంగా మలుచుకున్నారు.
భారతీయ కళావేదికపైన స్త్రీలు రికార్డులు సృష్టించారు. సృజనతో ఖండాంతర ఖ్యాతిని సముపార్జించుకున్నారు. ఎన్ని భావవైరుధ్యాలను పలికించారో ఊహకైనా అందదు ఇప్పటి వారికి!
ఉదాహరణకు : మగువ మాంచాల.
భర్త బాలచంద్రునికి కదనకర్తవ్య హితబోధ చేస్తోంది ఆమె.
‘ఎందరు రాజులీ ధరణినేలి తరించిరి-సౌఖ్య సంపదల్‌
‌పొందిరి మూటగట్టుకుని పోయిరెవారు ప్రతిష్ఠ ఒక్కటే
చెందును శూరమూర్తుల ప్రసిద్ధులనెందు యశస్సుకై రణ
మ్మందున ముందుకేగి జయ హరతులందుడు రాజశేఖరా!
ఇందులో… వీర, త్యాగ, భక్తి చింతనలన్నీ నిబడీకృతం. దీన్ని ప్రతిఫలింప చేయడంలో మహిళా నటుల కృషి అనన్య సామాన్యం.
నటరంగానికి ఎనలేని కీర్తి తెచ్చిన సుభద్రమ్మ, ఉత్తరమ్మ ఆయా పాత్రల పరిపోషణంతో చిరయశస్సులయ్యారు.
గుణపతి, అనసూయాదేవి సాత్విక పాత్రధారణంతో అసమాన ప్రఖ్యాతిని సంపదగా అందుకొన్నారు. వీరందరిదీ ఒకే ఇంటిపేరు. రేకందార్‌గా ప్రశస్తి వహించిన కళాకారిణులు. సురభికి మరెంతో వన్నెతెచ్చినవారు.
వీరిని తలచుకోవడం, నటరీతిని తలవులోనికి తెచ్చుకోవడం, చేసిన సేవను స్మరించి గౌరవించుకోవడం నటకళామతల్లిని అర్చించుకోవడమే.
ఆనాటి ఆ కళాపాండితి, నటప్రశస్తి
ఈనాటికీ స్మరణీయం, అభినందనీయం.
ఎన్నెన్నో ప్రతికూలతలను అధిగమించి,
కళాసేవే పరమార్థంగా భావించి,
వీరంతా సాగించింది కలార్చన.
అందుకే వందనాలందించాలి అందరూ!
సంగీత, సాహిత్య శిల్ప, చిత్రలేఖనాది కళారూపాల సమాహారమే నాటక రంగం. ఇందులో అతివలు నిర్వర్తించిన పాత్ర అన్నివిధాలా స్ఫూర్తిమంతం!

-జంధ్యాల శరత్‌బాబు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE