సినిమాను వ్యాపార సాధనంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశం కోసం, ధర్మం కోసం జీవితాలను అర్పించిన వారి చరిత్ర తెర మీదకు రావడం బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వ్యాపార దృక్పథంతో కాకుండా సమాజంపై బాధ్యతతో రూపుదిద్దుకుంది ‘జితేందర్‌ ‌రెడ్డి’ సినిమా. ఏబీవీపీ, భారతీయ జనతాపార్టీ యువమోర్చా నేతగా పనిచేస్తూ, దేశద్రోహ నక్సలైట్ల గుండెల్లో గుబులు పుట్టించాడు జగిత్యాల టైగర్‌ ‌జితేందర్‌ ‌రెడ్డి. అతని అడ్డు తొలగించకపోతే తమ ఆటలు సాగవని భావించిన నక్సలైట్లు 1987లో ఏకే 47 తుపాకులతో కాల్చి చంపేశారు. జితేందర్‌ ‌రెడ్డి వీరమరణం పొందిన 37 సంవత్సరాలకు ఆయన తమ్ముడు ముదుగంటి రవీందర్‌ ‌రెడ్డి ‘జితేందర్‌ ‌రెడ్డి’ బయోపిక్‌ ‌నిర్మించారు. నవంబర్‌ 8‌న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ముఖాముఖి:

జితేందర్‌ ‌రెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపినప్పుడు మీ వయస్సు ఎంత?

నాకు అప్పుడు 22 సంవత్సరాలు. అన్నయ్యను నక్సలైట్లు చుట్టుముట్టి కాల్పులు జరుపుతుంటే… పక్కనే ఉన్న సుభాష్‌ ‌కొన్ని కిలోమీటర్ల పాటు పరిగెత్తుకుని వెళ్లి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు జీపులో జగిత్యాలలో ఉన్న నా దగ్గరకు వచ్చారు. అప్పటికి అసలు ఏం జరిగిందో వారికీ తెలియదు. నన్ను తీసుకుని సంఘటన స్థలానికి వెళ్లేసరికే అన్నయ్య విగతజీవుడై పడి ఉన్నాడు. కిలోమీటరు పాటు అక్కడ పెద్ద యుద్థవాతావరణం కనిపించింది. నక్సలైట్లతో దాదాపు రెండు గంటల పాటు అన్నయ్య పోరాటం చేశాడని అర్థమైంది. అలా వీర మరణం పొందిన అన్నయ్య భౌతికకాయాన్ని చూసిన మొదటి కుటుంబ సభ్యుడిని నేనే.

జితేందర్‌ ‌రెడ్డి జీవితాన్ని వెండితెరకెక్కించాలనే ఆలోచన ఎప్పుడు, ఎందుకు కలిగింది?

అన్నయ్య వీర మరణం పొంది మూడున్నర దశాబ్దాలు గడిచిపోయింది. ఓ తరం మారి పోయింది. ఇప్పటి వారికి అప్పటి దేశభక్తుల గురించి చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. నిజానికి జితేందర్‌ ‌రెడ్డి జీవితాన్ని పుస్తకంగా ప్రచురిద్దామనే ఆలోచన వచ్చింది. కానీ ఇలాంటి వారి జీవితాన్ని పుస్తక రూపంలో కంటే విజువల్‌గా చూపిస్తే హృదయానికి హత్తుకుంటుందనే భావన కలిగింది. దాంతో షార్ట్ ‌ఫిల్మ్ ‌చేయాలని అనుకున్నాం. కానీ కొందరు మిత్రులు ఇచ్చిన సలహాతో ఫీచర్‌ ‌ఫిల్మ్ ‌చేస్తే ఎక్కువ మందిని ఇది చేరుకుంటుందనే ఉద్దేశంతో చివరకు సినిమా తీయాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను.

మీరు సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. మరి మీ సోదరుడి జీవితగాథను సినిమాగా తీయాలనుకున్నప్పుడు మీకు బయటి నుండి అలానే సినిమా రంగం నుండి ఎలాంటి సహకారం లభించింది?

మా నాన్న మల్లారెడ్డి గారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రాంత బాధ్యతలను నెరవేర్చారు. ఆ రకంగా మాది సంఘ కుటుంబం. అన్నయ్య జీవించి ఉన్నప్పుడు రామచంద్రయ్యగారు మాకు విభాగ్‌ ‌ప్రచారక్‌గా ఉండేవారు. లింగం సుధాకర్‌ ‌రెడ్డి గారు మా జిల్లా ప్రచారక్‌. ‌జితేందర్‌ ‌రెడ్డి గురించి వారికి బాగా తెలుసు. వారి సలహాలు సంప్రదింపులు తీసుకుని ఈ సినిమా ఎలా ఉంటే బాగుంటుందనే ఆలోచన చేశాను. అన్నయ్యతో పరిచయం ఉన్నవారి నుండి కొన్ని విషయాలను సేకరించాం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి నుండి కొంత సమాచారం తీసుకున్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారకులు, జాతీయవాద రచయిత అప్పాల ప్రసాద్‌ ‌గారికి ఈ ప్రాజెక్ట్ ‌గురించి చెప్పినప్పుడు ఆయన ఎ. దయాకరరావుగారిని పరిచయం చేశారు. ఆయన ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నంగారి తమ్ముడు. ప్రస్తుతం పవన్‌ ‌కల్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన ద్వారానే సినిమాటోగ్రాఫర్‌ ‌జ్ఞానశేఖర్‌ ‌గారి పరిచయం అయ్యింది. వారే దర్శకుడిగా విరించి వర్మను సూచించారు. విరించి వర్మ గతంలో ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాలను తెరకెక్కించారు. వారిని కలిసి జితేందర్‌ ‌రెడ్డి జీవితం గురించి చెప్పినప్పుడు స్ఫూర్తి పొంది ఈ సినిమాను తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు. అలా ‘జితేందర్‌ ‌రెడ్డి’ సినిమా మొదలైంది.

నటీనటుల ఎంపిక ఎలా జరిగింది?

ఆ బాధ్యతను పూర్తిగా దర్శకుడు విరించి వర్మ తీసుకున్నారు. ఇది బయోపిక్‌ ‌కాబట్టి… నిజజీవిత వ్యక్తుల ఛాయా చిత్రాలను ఆయనకు ఇచ్చాను. దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని, ఆడిషన్‌ ‌నిర్వహించి సెలెక్ట్ ‌చేశారు. అలానే జితేందర్‌ ‌రెడ్డి పాత్రను రాకేశ్‌ ‌వర్రె పోషించారు. ఆయన తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చారు. ఎప్పటికప్పుడు నాకు ఏ పాత్రకు ఎవరిని తీసుకుంటున్నారో చెప్పేవారు. సినిమా నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా డేట్స్ అడ్జస్ట్ ‌కాక కొంతమంది పాత్రధారులను మార్చాల్సి వచ్చింది. ఏదేమైనా ప్రతి ఒక్కరూ ఇది తమ చిత్రంగా భావించి, ఆయా పాత్రలను చక్కగా పోషించారు.

సినిమా రంగం నుండి మీకు ఎలాంటి సహకారం లభించింది?

మీరన్నట్టుగా నేను ఈ రంగానికి చెందిన వాడిని కాదు. అయితే ఓ సత్‌ ‌సంకల్పంతో ఈ సినిమా ప్రారంభించాను. చాలామంది ఇలాంటి సినిమాలు తీయడం కష్టమని నా నిర్ణయాన్ని మార్చుకోమని సలహాలు ఇచ్చారు. సినిమాను సమయానికి పూర్తి చేసి విడుదల చేయలేననీ అన్నారు. నక్సలిజాన్ని వ్యతిరేకిస్తూ సినిమా తీయొద్దంటూ కొందరు చెప్పారు. ‘జితేందర్‌ ‌రెడ్డి’ బయోపిక్‌ ‌తీయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడే నేను వీటన్నింటినీ ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాను. ఎవరి మెప్పుకోసమో, ఎవరికో భయపడో సినిమాను తీయాలని అనుకోలేదు. నిజాన్ని నిర్భయంగా ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నాను. ఒకప్పుడు తెలంగాణలో పారలల్‌ ‌గవర్నమెంట్‌ ‌నడిపిన నక్సలైట్ల వల్ల ఈ దేశానికి, ధర్మానికి జరిగిన అన్యాయాన్ని కచ్చితంగా తెర మీద చూపించాలని నిర్ణయించుకున్నాను. ఆ దిశగా ముందుకు సాగాను.

మీకు ఎవరి నుండి బెదిరింపులు రాలేదా?

ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వాడిని. కానీ ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం లేదు. దాంతో సహజంగా సినిమా రంగంలోని కొందరు ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల మీ కెరీర్‌ ఇబ్బందిలో పడే ఆస్కారం ఉందని చెప్పారట. నాకూ కొన్ని కాల్స్ ‌వచ్చాయి. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ ధైర్యంగా తమ పేరును ప్రకటించి నన్ను బెదిరించి ఉంటే నేను దానిని సీరియస్‌గా తీసుకునే వాడిని. కానీ పేరూ, ఊరు చెప్పుకునే ధైర్యంలేని వారి కాల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అలాంటి బెదిరింపులకు బెదిరే వ్యక్తినీ కాదు. అందుకే వాటిని సీరియస్‌గా తీసుకోలేదు.

‘జితేందర్‌ ‌రెడ్డి’ సినిమా విడుదలలో జాప్యం జరిగింది. ఎందుకలా?

సినిమా నిర్మించాలనే ఆలోచన నాలుగేళ్లుగా ఉంది. షూటింగ్‌ ‌మొదలు పెట్టడానికి ముందు విరించి వర్మ టీమ్‌ ‌ప్రీ ప్రొడక్షన్‌ ‌సమయంలోనే చాలామందిని కలిసి, అభిప్రాయాలు సేకరించి, కథ, కథనాలను తయారు చేసుకుంది. ఆ తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరిగింది. నిజానికి షూటింగ్‌ ‌తొందరగానే జరిగింది. కానీ సెన్సార్‌ ‌కావడం ఆలస్యమైంది.

సెన్సార్‌ ‌పరంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందు లేమిటీ?

మేం తీసిన ‘జితేందర్‌ ‌రెడ్డి’ పొలిటికల్‌ ‌మూవీ కాదు. ఇది దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన ఓ యోధుడి కథ. సెన్సార్‌ అధికారి అప్పట్లో సెలవులో ఉండటంతో అనుకున్న సమయానికి ఇది సెన్సార్‌ ‌కాలేదు. ఆ తర్వాత టెంపరరీగా వేరే వారు వచ్చారు. వారు ఇతర సభ్యులతో సినిమా చూసి, చాలా బాగుందని అభినందిస్తూనే, 30కి పైగా మార్పులు, చేర్పులూ సూచించారు. వాటిని సవరించడానికి బాగా టైమ్‌ ‌పట్టింది. ఆ తర్వాత ముంబై నుండి క్లియరెన్స్ ‌వచ్చే సరికీ లేట్‌ అయ్యింది. ఈ లోగా ఎన్నికల కోడ్‌ ‌వచ్చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయకూడదని సూచించారు. అందువల్ల ఇంకొంత ఆలస్యమైంది. చివరకు నవంబర్‌ 8‌న సినిమాను జనం ముందుకు తీసుకొచ్చాం.

‘జితేందర్‌ ‌రెడ్డి’ సినిమాలో రామన్న, గోపన్న, మధుసూదన్‌ ‌గౌడ్‌, ‌సామా జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి బలిదానం కూడా చూపించారు. వారి కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

ఇది బేసికల్‌గా జితేందర్‌ ‌రెడ్డి బయోపిక్‌. ‌కుటుంబపరంగా వచ్చిన రాజకీయ వారసత్వం కారణంగా అన్నయ్య బీజేవైయంలోనూ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈ లోగా నక్సల్‌ ‌చేతిలో హతమయ్యాడు. అయితే అన్నయ్యకు ముందు కూడా ఇలానే కొందరిని నక్సలైట్లు దారుణంగా హత మార్చారు. మరీ ముఖ్యంగా గోపన్న మా కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి. అన్నయ్యకు ఆయనంటే ఎంతో ఇష్టం. అలానే అన్నయ్యకు పరిచయం ఉన్న ఏబీవీపీ కార్యకర్తలనూ నక్సల్స్ ‌పొట్టనబెట్టుకోవడాన్ని అతను సహించలేకపోయాడు. వారి జీవితాలను ఈ సినిమాలో అవసరమైన మేరకు చూపించే ప్రయత్నం చేశాం. వారి కుటుంబ సభ్యులకు సినిమాను చూపించాం. కొందరైతే ఆ నాటి రోజుల్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు.

‘జితేందర్‌ ‌రెడ్డి’ కేవలం మీ ఇంటి బిడ్డ కాదు. దేశ ద్రోహులతో పోరాటం చేసి అమరుడైన వ్యక్తి. మరి అతని బయోపిక్‌కు ఎలాంటి స్పందన వస్తోంది?

ఇది డబ్బుల కోసం తీసిన సినిమా కాదు. జాతీయవాదాన్ని పదిమందికి తెలియచెప్పడం కోసం తీసిన సినిమా. దీని నిర్మాణానికి నేను ఎవరి సహాయం తీసుకోలేదు. అయితే విడుదల సమయంలో మాత్రం సంఘ పెద్దలు, ఏబీవీపీ విద్యార్థులు, బీజేపీ నాయకులు ఈ సినిమాను చూసి ప్రోత్సహించాల్సిందిగా కోరారు. సంఘ పెద్దలు ఈ విషయంలో ఎంతో సాయం చేశారు. అలానే ఏబీవీపీ విద్యార్థులు తమ నాయకుడి సినిమాగా భావించి ఆదరిస్తున్నారు. బీజేపీ నాయకులు ఈ సినిమాను చూసి, తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి గారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌గారు సినిమా చూసి చాలా బాగా తీశానని అభినందించారు. ఇలాంటి వాటిని సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరిస్తే… మరిన్ని మంచి సినిమాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ మందిని ఈ సినిమా రీచ్‌ ‌కావడం కోసం మేం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం.

‘జితేందర్‌ ‌రెడ్డి’ని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చు? ఇతర భాషల్లోకి అనువదించే ఆలోచన ఉందా?

అమెజాన్‌ ‌ప్రైమ్‌తో చర్చలు జరుగుతున్నాయి. వారి కోరిక మేరకు వివిధ భాషల్లోకి దీనిని అనువదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఓటీటీలో వచ్చే వరకూ వేచి ఉండాలనే ఆలోచన పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ థియేటర్‌లో ‘జితేందర్‌ ‌రెడ్డి’ సినిమాను చూస్తే బాగుంటుంది. జాతీయ వాదుల చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన వాటిని ఆదరించడం తమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ భావించాలి.

వడ్డి ఓంప్రకాశ్‌ ‌నారాయణ

సీనియర్‌ ‌ఫిల్మ్ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE