భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– దాట్ల దానం దేవదానం రాజు

‘ఆ ‌గడియ రావాలి. మన చేతుల్లో ఏముంది?’ అనేది అమ్మ. భారం ఎవరి మీదో పెట్టడం సరైనది కాదు. ప్రయత్న లోపం ఉండకూడదు. నిజానికి అదే కొంప ముంచింది. విపరీత జాప్యానికి కారణమైంది. కొన్ని జీవితాలంతే. ‘ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. కొంచెం తొందర పడాలి’ ఇదీ అమ్మ మాటే. కొన్ని జీవితాల్లో అన్నీ సక్రమంగా జరిగిపోవు. ఆ తర్వాత ఇక మాటలు అనడానికి అమ్మ లేదు. హఠాత్తుగా ఈ లోకం విడిచిపెట్టి పోయింది. గడిచిన కాలం తిరిగి రాదు. నన్ను తొందర పెట్టేవారు లేరు. పైగా చెల్లెళ్ల బాధ్యత నెత్తి మీద పడింది. నా చూపు పెళ్లి వైపు వెళ్లలేదు. తర్వాత కాలంలో రేవతిని ఇష్టపడ్డాను. రేవతి అందమైంది. కాని దురదృష్టవంతురాలు. ఆమెకు నాకూ పదేళ్ల ఎడం ఉంది.

 రేవతికి పెళ్ళైంది. ఆ తరువాత మూడు మాసాలకే రేవతి భర్త ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఉద్యోగం చేస్తోంది. బుర్ర నిండా పాతకాలం నాటి భావాలు. ఆమె బాల్యం..ఇరుకు ఇంటిలో కురచ మనస్తత్వాల మధ్య గడిచింది. సొంత ఆలోచనలతో ఎదగనివ్వని ఇంటి పరిసరాలు. తాతగారి బామ్మగారి భావాలు పేరుకు పోయాయి. దాంతో చదువుకున్న ప్పటికీ అవి వదలలేదు.

చుట్టూరా ఆధునిక నాగరికత. రేవతి పట్టించు కోదు… మారదు. కాలం గడుస్తున్నా ఇంకా విషాదాన్నే అనుభవిస్తోంది. దుఃఖాన్నే మోస్తోంది. తన బతుకు అలా రాసిపెట్టి ఉందని నమ్ముతుంది. తలరాత…ఏం చేయలేం అనుకుంటుంది.

రోజులు నెలలు సంవత్సరాలుగా గడిచి పోయాయి. నాది ఉపాధ్యాయ వృత్తి. అభ్యుదయ భావాలు నావి. వృత్తి పట్ల నిబద్ధత ఉంది. పాఠాలతో పాటు సమయం వచ్చినపుడు మూఢవిశ్వాసాల్ని ఖండించే మాటలు చెబుతాను. కుటుంబ బాధ్యతలు తీరేటప్పటికి వివాహ వయసు దాటిపోయింది.

రేవతి పట్ల జాలి కాదు. ప్రేమ ఉంది. పరిచయం పెరిగే కొలదీ ఆమె అంటే ఇష్టం మరింత పెరిగింది. ఒకరోజు నా మనసులో మాట చెప్పేశాను. భోరుమని ఏడ్చింది. కన్నీళ్లు బొటబొటా కారాయి. రోషంతో కళ్లు ఎర్రబడ్డాయి. పెళ్లి మాట ఎత్తడంతో ఆమెకు నా పట్ల ఉన్న గౌరవభావం ఎగిరిపోయింది.

‘‘దురదృష్టం వెంటాడింది. శాపగ్రస్తురాలను. నా జీవితం ఇక ఇంతే. రవి జ్ఞాపకాలతో బతకడమే. మరో తలంపు లేదు. దయచేసి నా మానాన నన్నుండనీయండి. ఆశలు రేపకండి’’ చేతులు జోడించింది.

‘‘మరో రెండేళ్లలో ఇరవై ఒకటో శతాబ్దం వస్తుంది. నేలపై నిలబడి బతుకు బాట ఎంచుకోవాలి. ఎల్లకాలం ఇలా ఉండిపోవడం మంచిది కాదు. నిన్ను నేను ఉద్ధ్దరించడం కోసం కాదు. నీ ఆలోచనలు గతకాలానివి. నిన్ను ఒత్తిడి చేయను. ఇంత చదువుకున్నదానివి. తీరిగ్గా ఆలోచించు’’ నచ్చచెప్పే ప్రయత్నం చేశాను.

అపుడు రేవతి అంది కదా- ‘‘మూడుమాసాల దాంపత్య జీవితం నాది. మధుర స్మృతులున్నాయి. అవి చాలు. మీరు చెప్పింది గుర్తుంది నాకు. మీ బంధువర్గంలో ఒకామె పదేళ్లలోపు వయసులో భర్తను కోల్పోతే ఏం చేసింది? ఎనభై ఏళ్లు తోడు లేకుండా బతికేసింది కదా’’ తల పట్టుకున్నాను. నా మాట నాకే అప్పగించింది. అయినా కాసేపటికి తేరుకుని చెప్పాను. అమాయకత్వం ముసుగుల్ని తొలగించే పని ఆఖరి నిమిషం వరకూ చేయాల్సిందే. పోటెక్కిన గోదారి ఉధృతి సమయంలో సుడులు గుండాలుగా తిరుగుతాయి. రోజులు గడిచేకొలదీ మళ్లీ మామూలే. అప్పటి వరకు పరిస్థితులు అర్థం కావు.

‘‘జీవితాంతం తలపులు మన వెంటరావు. మరీ దుఃఖపూరితంగా మారితే వదిలించుకునే సాధన చేయాలి. అవకాశం ఉన్నపుడు జీవితాన్ని మళ్లీ అందుకోవాలి. ఎదుటివారికి ఒక సందేశం ఇవ్వాలి’’ ఈ మాటలు అని ఊరుకున్నాను. వాడిన పూలకు పరిమళం ఎక్కడిదని నేనింతేనని నిశ్శబ్దంగా ఉండిపోయింది. అప్పట్నుంచీ రేవతి తప్పించుకుని తిరుగుతోంది.

నాకు ఉద్యోగ బదిలీ వల్ల ఊరు మారాల్సిన పరిస్థితి వచ్చింది. రేవతితో పరిచయం అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. నాకూ ఒకటొకటిగా కొన్ని సమస్యలు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యాయి. చెల్లెలి కాపురం ఆందోళన కలిగిస్తోంది. ఆమె భర్త వాసు తాగుబోతు. సంసారాన్ని పట్టించుకోని దగుల్బాజీ. అదే ఊరికి బదిలీ కావడంతో అనేక విషయాలు వాళ్ల గురించి తెలిశాయి. చెల్లెలు హింస అనుభవిస్తోంది. ఎన్నిసార్లు వాసుకి చెప్పినా వినిపించుకోలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాళ్ల కాపురం గాడిలో పడాలి.

రెండునెలల్లో దారుణం జరిగిపోయింది. ఒకరోజు చెల్లెలిని కొట్టుకుంటూ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ గేటు బయటకు గెంటేశాడు వాసు. నలుగురూ చూస్తుండగా జరిగిన ఘోరం ఇది. అకారణంగా జరిగిన సంఘటన. రమ కోపంతో ఊగిపోయింది. కానీ అశక్తురాలు. అవమానభారంతో నిస్సహాయంగా బేల చూపులతో నిలుచుండి పోయింది. పిల్లలు చిన్నవాళ్లని, వాళ్లకు తన అవసరం ఉందని మరచిపోయింది. కఠిన నిర్ణయం తీసుకుంది. ఆవేశంతో క్షణం కూడా ఆలోచించకుండా ఈ లోకం నుండి నిష్క్రమించింది.

బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమేంటి? పిల్లలున్నారన్న గ్రహింపు ఉండొద్దా? ఆత్మహత్య ఎప్పటికీ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడిని కొన్ని క్షణాలు దాటగలిగితే ఇట్లాంటి అనర్థాలు జరగవు.

కొన్నాళ్ల పాటు చెల్లెలి జ్ఞాపకాలు బాధించాయి. చేరువలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను.

ఒకనాటి సాయంత్రం…

నెమ్మదిగా చీకట్లు అలముకుంటున్నాయి. కేశవరెడ్డి నవల చదువుకుం టున్నాను. ముసలోడి ఆతురత పంది కూనల్ని రక్షించుకోవాలనే తపన ఉత్కంఠ కలిగిస్తోంది. అక్షరాలు కాదు దృశ్యం కళ్ల ముందుంది.చుట్టూ రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి. పిట్టల అరుపులు వినిపిస్తున్నాయి.

సాయంత్రం గోదారి ఒడ్డుకెళ్లి కాసేపు కూచోవడం అలవాటైంది. ఈరోజు వెళ్లలేదు. పుస్తకం పట్టుకున్నాను. లీనమై పోయాను. అడివిలో తిరుగాడు తున్నట్లుంది. సరిగ్గా సత్తిబాబు అప్పుడొచ్చాడు.

సత్తిబాబు నాకు స్నేహితుడే. పెళ్లి సంబంధాలు కుదురుస్తుంటాడు. పెండ్లివారి స్థాయిని బట్టి డబ్బులు వసూలు చేస్తాడు. డాబుగా ఉంటాడు. పెద్దవాళ్లతో పరిచయాలు ఎక్కువ. లౌక్యంగా మాట్లాడతాడు.

‘‘ఇది విన్నావా?’’ అన్నాడు వింతగా ముఖం పెట్టి. పుస్తకం మూసి ఏమిటన్నట్టు చూశాను. ఇక పఠనం సాగదు. చదివే పేజీ దగ్గర మడిచి పుస్తకాన్ని ఎదురుగా ఉన్న స్టూలు మీద పెట్టాను.

సత్తిబాబు తీరిగ్గా జేబులోంచి చిన్న నోటు బుక్‌ ‌తీసి ఏదో రాసుకుంటున్నాడు. చిరాకు పడ్డాను.

ఉక్కగా ఉంది. పైగా ట్యూబులైటు వెలుగుల్ని ఆకర్షించిన రెక్కల పురుగులు మూగుతున్నాయి. తటాలున లేచి లైటు ఆర్పేశాను. వెలుగుల్ని వెతుక్కుంటూ రయ్యిమని బయటకు పోతున్నాయి. మేం మాత్రం చీకటిలో ఉండి పోయాం. ముఖాలు కనపడటం లేదు. సత్తిబాబు ఏం చెప్పబోతున్నాడు?

‘‘నామావారి వీధిలో ఉండే సుందరం మాష్టారి భార్య మళ్లీ పెళ్లి చేసుకుంటుందట. ఆయన పోయి మూడునెలలు కూడా అవ్వలేదు. వయసేమో ఏభై ఐదు. ఆవిడగారికి ఇపుడు పెళ్లి కావాల్సి వచ్చింది. లోకం మారిపోయింది. పిదప కాలం వచ్చేసింది’’ దీర్ఘంగా రాగాలు తీస్తూ అన్నాడు.

‘‘ఇందులో తప్పేముంది? తోడు అవసర మైందేమో. నీవే ఏదైనా సంబంధం చూడు’’ నెమ్మదిగా అన్నాను.

‘‘ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. వాడి దగ్గరకు పోయి హాయిగా మనుమలతో గడపొచ్చు కదా! ఇక నేను సంబంధం చూడటమా? చాల్లే…అయినట్లే. బోలెడు షరతులు ఉన్నాయి. ‘వరుడు కావలెను’ అని ప్రకటన ఇచ్చింది. ఇదిగో నీవే చూడు. అభ్యుదయ భావాలు కలిగి ఉండాలట. అర్థం చేసుకునే మనసు ఉండాలట. విద్యావంతుడై ఉండాలట’’ నలిగిన కాగితాన్ని తన కుర్తా పక్క జేబు లోంచి తీసిచ్చాడు.

లేచి వెళ్లి లైటు వేశాను. చదివాను. అందులో సావిత్రి అనే ఆవిడకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వెంటనే ఆ కాగితాన్ని సాపుచేసి సెల్‌లో ఫొటో తీసుకున్నాను. సత్తిబాబు తెల్లబోయి చూస్తున్నాడు.

‘‘ఏం మాట్లాడమంటావా? ఆఖరికి నీ గతి అంతేలే. జీవితకాలం లేటు అంటే ఇదే’’ వెటకారంగా అన్నాడు. మౌనంగా కూర్చున్నాను. అన్యమనస్కంగా ఉండిపోయాను. కాసేపు అవీ ఇవీ మాట్లాడి వెళ్లిపోయాడు.

మర్నాడు యధాప్రకారం గోదారి ఒడ్డున కూర్చున్నాను. పశ్చిమాన సూర్యుడు ఎర్రగా పెద్దగా చుట్టూ సిందూరం చీర కప్పుకుని గోదారిలో మునగడానికి సిద్ధంగా ఉన్నాడు. అస్తమించే ముందర పలుచని కిరణాలు నదిపై సగ్గు బియ్యం వడియాలు ఎండబెట్టినట్టు మెరుస్తున్నాయి. నాలో ఒక ఆలోచన మెరిసింది. గంట తర్వాత వెన్నెల పాక్కుంటూ నీడల జాడలతో వాలింది.

నా వ్యక్తిత్వాన్ని తడిమి చూసుకున్నాను. సావిత్రిని కలవాలి. నాలో ఆమె కోరుకున్న లక్షణాలున్నాయి. చూడాలి. జీవిత చరమాంకంలో వెన్నెల కురుస్తుందేమో.

ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఎప్పుడూ లేనిది గుండె చిత్రంగా కంపిస్తోంది. దేహంలో తెలియని అలజడి. హృదయ కవాటాలు తెరుచుకుని ఏవో సందేశాన్ని స్తున్నాయి. ఇదంతా నిజమేనా? భ్రాంతియేనా? నేల మీద నిలబడే ఉన్నానా? భాషకు అందని భావంతో కొట్టుమిట్టాడుతున్నాను.

తెల్లారింది. ఎన్నాళ్లుగానో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతున్నట్లుంది.

జుట్టుకు నల్లరంగు వేసుకున్నాను. నచ్చిన బట్టలు కట్టుకున్నాను. వడలినట్లు కనిపించకూడదని హుందాగా హుషారుగా కనపడాలని. సన్న గడులున్న తెల్ల చొక్కా, నల్లని ఫాంటు. అద్దం ముందు నిలబడ్డాను. తేజోవంతమైన రేఖలు ముఖంలో తారాడాయి. చెప్పకుండా వెళ్లడం భావ్యం కాదనుకున్నాను. ఆమెకు వెంటనే ఫోను చేశాను. రింగయింది. ఎత్తలేదు.

పావుగంట గడిచింది. మళ్లీ ప్రయత్నం చేద్దామనుకునేంతలో ఫోను మోగింది. ఆమె నుంచే. విషయం చెప్పి ఇంటికి వస్తున్నానని చెప్పాను. గంటసేపు ఆగి రమ్మని చెప్పారు. చిత్రమైన అనుభూతి. నేను నేనేనా?

గంటంటే అరవై నిమిషాలు. భారంగా గడిచింది. ఎక్టివాపై బయలుదేరాను. ఆ ఏరియా తెలుసు. ఊరికి కొంచెం దూరం. సులువుగానే ఇంటి జాడ తెలుసుకున్నాను.

చిన్న ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. రకరకాల పూలమొక్కలతో నిండి ఉంది. పరిమళభరితమైన స్వచ్ఛమైన గాలి. కాలింగ్‌ ‌బెల్‌ ‌కొట్టగానే తలుపు తెరుచుకుంది. ఆమె లోపలకి ఆహ్వానించారు. గదిలోకి అడుగు పెట్టాను. కింద ఆకుపచ్చని తివాసీ. సోఫా సెట్టు. మధ్యగా గాజుబల్ల. దాని మీద కూజా ఆకారంలో అందమైన ఫ్లవర్‌వాజ్‌లో ఎప్పటికీ వాడని పూలు. చుట్టూ పరికించాను.

గది స్వచ్ఛంగా శుభ్రంగా ఉంది. గోడలపై ఆధునిక పెయింటింగులున్నాయి. అడుగడుగునా కళాహృదయంతో తీర్చిదిద్దినట్లుంది. మాష్టారి అభిరుచేమో అనుకున్నాను. కాదట. తర్వాత చెబితే తెలిసింది అన్నీ తన ఇష్టాలే అంట.

ఇంటిని చూసింతర్వాత రాకూడని చిరునామాకు వచ్చానేమోనని శంకించాను.

మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చారావిడ. ఆమె కళ్లల్లో కాంతి ఉంది. ముఖంలో ఒకవిధమైన కళ ఉంది.

కుటుంబ విషయాలు, అభిరుచులు గురించి మాట్లాడుకున్నాం. ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు చెప్పాను. భర్త చనిపోయిన వెంటనే పెళ్లికి సిద్ధం కావడం గురించి ఆవిడ చెప్పారు. ఇది మాష్టారి కోరికట.

ఒంటరిగా ఉండొద్దని తోడు వెతుక్కుని జీవితం సాగించాలని చెప్పారట. అది కూడా కాలయాపన చేయకుండా జరగాలన్నారట. వారి అబ్బాయి అంగీకారంతోనే సిద్ధపడుతున్నానని చెప్పారు.

గంటయ్యింది. మరల మర్నాడు కలుద్దామని చెప్పాను.

‘‘మర్నాడే కాదు వారం రోజుల పాటు కలుద్దాం. మీకేమైనా అభ్యంతరమా?’’ వెళ్లబోతుండగా అన్నారు. ‘‘తప్పకుండా’’ అన్నాను వెనక్కి తిరిగి చిరునవ్వుతో.

ఆ వారం రోజులూ ప్రతి క్షణమూ దివ్యమైనదే. మధుర జ్ఞాపకాల దొంతరే. అనుభవాల పలవ రింతలే. ఇష్టాయిష్టాల మదింపులే. నిస్సంకోచంగా అభిప్రాయాల కలబోతలే.

 ‘‘చెల్లెల పిల్లలు ఇద్దరున్నారు. వాళ్ల ఆలనా పాలనా నేనే చూసుకోవాలి’ ఒకరోజున చెప్పాను.

‘‘మొక్కలన్నా పిల్లలన్నా నాకిష్టమే’’ ఒక్కసారిగా పూలవనంలోంచి పరిమళ మంతా గదిలోకి వచ్చినట్లయింది. నా పెదాలు మొగ్గ నుంచి విచ్చుకున్న పూవులా మారాయి. ముఖం దీపావళి మతాబులా వెలిగింది. మనసు ఆనంద తరంగమైంది.

పెళ్లి నిరాడంబరంగా సన్మిత్రుల సమక్షంలో జరిగింది.

సావిత్రి అక్క కూతురే రేవతి. పెళ్లికి రమ్మని పిలిచినా రాలేదు.

‘ఈ వయసులో మళ్లీ పెళ్లేంటి•? బుద్ధుందా?’ తిట్టి పోసింది. కోపగించుకుంది. రానని కచ్చితంగా చెప్పేసింది. గమ్మత్తేమిటంటే సావిత్రిని పెళ్లి చేసుకున్నది నేనని రేవతికి తేలీదు. వారం రోజుల వ్యవధిలో ముహూర్తం కుదిరింది. రేవతికి తెలిసే అవకాశం లేకుండా అంతా ఇట్టే జరిగిపోయింది.

రేవతి ఒకరోజు అకస్మాత్తుగా వచ్చింది. నన్ను బాబాయి స్థానంలో చూసి ఆశ్చర్యపోయింది.

‘‘ఆఖరికి నువ్వు కూడా…’’ అంటూ ఆగిపోయి ‘‘ఎన్నో అడుగులు ముందుకేసావ్‌..‌పిన్నీ’’ ఉద్వేగంగా చేతులు పట్టుకుని ఊపింది. వెంటనే తేలికపడలేక పోయింది. నా కళ్లలోకి సూటిగా చూడలేకపోయింది.

‘అర్థంపర్థం లేని పాత భావాలు నావి. కొత్త ఆలోచనలు దరి చేరనీయక పోవడం తప్పే. మనం స్వీకరించాలే గానీ అవతలి కొస అందేంత దూరం లోనే ఉంటుందని తెలుసుకోలేకపోయాను’ అని సన్నగా గొణుక్కుంది.

‘కాలం మారితే సరిపోదు. మనుషులూ మారాలి. ఒక మూస లోంచి బయటపడాలి. ఏ నిర్ణయం తీసుకున్నా జీవితం ముఖ్యమనే సంకల్పం చెప్పుకోవడం అవసరం’ అనుకున్నాను.

వచ్చేవారం కథ..

  లోగుట్టు 

– దేశరాజు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE