అదే ఒరవడి. అదే కూర్పు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు సినీ తారడు ముదిరి రాజకీయ నాయకుడయ్యాడు. దళపతి బిరుదాంకితుడు విజయ్‌ ‌తన రాజకీయ పక్షానికి లాంఛనంగా తొలి క్లాప్‌ ‌కొట్టారు. ఈ పక్షం పేరు తమిళగ వెట్రి కళగం (టీవీకే). వెండితెర మీద తనకు ఉన్న ఆకర్షణ రాజకీయ రంగానికి కూడా బదలీ అవుతుందని విజయ్‌ ఊహ. అక్టోబర్‌ 27‌న తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి వద్ద భారీఎత్తున నిర్వహించిన టీవీకే తొలి మహానాడులో లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో విజయ్‌ ‌ప్రసంగించారు. ఇది టీవీకే  రాష్ట్ర స్థాయి తొలి సమావేశం. విజయ్‌ 46 ‌నిమిషాలు మాట్లాడారు. రెండు విషయాలను మాత్రం నీళ్లు నమలకుండా చెప్పారు. ఒకటి ద్రవిడ మోడల్‌ అం‌టూ ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) మోసగిస్తున్నది. కాబట్టి టీవీకే రాజకీయ శత్రువు డీఎంకే.  రెండు- సైద్ధాంతికంగా శత్రువుగా భావించేది బీజేపీ అట. ఎందుకంటే సమాజంలో చీలికలు తీసుకువస్తున్నదట. ఇప్పుడు అంతా వేసుకుంటున్న ప్రశ్న- టీవీకే తమిళ రాజకీయాలలో తేగలిగే మార్పు ఏమిటి?

విక్రవాండి సభలో చాలా గంభీరమైన మాటలే ఈ యాభయ్‌ ఏళ్ల నటుడు పలికారు. కొంత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద, ఇంకొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మీద విమర్శలు కురిపిస్తూ ఆయన తన ఉపన్యాసాన్ని రక్తి కట్టించడానికి తన వంతు కృషి చేశారు. టీవీకే తమిళనాడులో ఉనికిలోకి వచ్చిన మరొక మామూలు రాజకీయ పార్టీ అయితే కాదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించినా, ఇది రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం తథ్యమని అన్నారు. టీవీకే ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఉనికిలోనికి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి  తొలి సమావేశం జరుపుకుంది. మూడు లక్షల నుంచి ఆరు లక్షలు వచ్చారని ఒక్కొక్క మీడియా ఒక్కొక్క లెక్క చెబుతోంది. ఆ అంచనాలు ఎలా ఉన్నా, జనం బాగానే వచ్చారని, అది లక్షలలోనే అని చెప్పక తప్పదు. తమిళనాడు నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయన ఉపన్యాసం విన్నారు.

2026లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలే విజయ్‌ ‌లక్ష్యమని స్పష్టమవుతూనే ఉంది. టీవీకే అభ్యర్థులను 234 స్థానాలలోను బరిలోకి దించడమే ఆయన ఉద్దేశమని చాలామంది భావిస్తున్నారు.

 తెర మీద కనిపించేవారు, తెర వెనుక నడిపించే వారు ఇద్దరూ తమిళ రాజకీయాలలో కీలకంగానే కనిపిస్తారు. ఎంజీ రామచంద్రన్‌, ‌జయలలిత, విజయ్‌కాంత్‌, ‌కమల్‌ ‌హాసన్‌ ‌తెర మీద వచ్చిన కీర్తిని రాజకీయాలలో ఉపయోగించుకున్నారు. కరుణానిధి తెర వెనుక ప్రముఖుడు. ఇప్పుడు సనాతన హిందూ ధర్మం మీద అవాకులూ చెవాకులూ పేలి ప్రసిద్ధుడైన ఉదయనిధి స్టాలిన్‌ ‌కూడా తెర మీది జీవే. విజయ్‌ ‌తన సినీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న సమయంలో రాజకీయ అరంగేట్రం చేశారు.

దశాబ్దాలుగా తమిళ రాజకీయ రంగం రెండు పార్టీల ఆటస్థలంగా ఉండిపోయింది. ఒకటి అన్నా డీఎంకే, రెండు డీఎంకే. ఈ రెండు పార్టీలే జాతీయ పార్టీలను శాసిస్తూ ఉంటాయి. అటు కాంగ్రెస్‌తోను, ఇటు బీజేపీతోను కలసి ప్రయాణం చేసిన చరిత్ర రెండు పార్టీలకు ఉంది. ఇవి కాకుండా ఇతర రాజకీయ పార్టీలు కూడా అక్కడ ఉన్నాయి. వాటిలో వైకో పార్టీ, డాక్టర్‌ ‌రామదాస్‌ ‌నాయకత్వాలలోని పార్టీలకు మంచి పేరే ఉంది. ఇటీవలి పరిణామం- కె.అన్నామలై నాయకత్వంలో బీజేపీకి ఒక ఊపు రావడం. సీట్లు రాకపోయినా ఓట్లు దండిగానే వచ్చాయి. అన్నామలై ఆకర్షణకు నరేంద్ర మోదీ పట్ల ఆదరణ కూడా అందుకు కారణం. అయితే దేశమంతా, ఈశాన్య భారత్‌ ‌సహా చాలా చోట్ల బీజేపీ చొచ్చుకుపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ 18.27 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ పోటీ చేసిన 39 స్థానాలలో 12 చోట్ల అన్నా డీఎంకేను రెండో స్థానం దగ్గర నిలువరించగలిగింది. అయినా తమిళనాడు కమలానికి కొరుకుడు పడడం లేదన్న రాజకీయ పండితుల మాట కాదనలేనిది.

మరొక నటుడు విజయ్‌కాంత్‌ ‌డీఎండీకే అనే పార్టీని 2005లో ఆరంభించారు. కానీ దాని ప్రభావం స్వల్పకాలమే. 2018లో కమల్‌ ‌హాసన్‌ ఎంఎన్‌ఎం అనే పార్టీని ప్రారంభించారు. ఆయన నినాదం కూడా అవినీతి డీఎంకే, అన్నా డీఎంకేలను ఓడించడమే. అలాగే తన పార్టీ ఆ పార్టీలకు ప్రత్యా మ్నాయమనే కమల్‌ ‌చెప్పారు. ఈ పార్టీ తమిళ రాజ కీయాలను ఏ విధంగాను ప్రభావితం చేయలేక పోయిందన్నది నిజం. ఎంజీఆర్‌ ‌కొద్దికాలం కాంగ్రెస్‌తో, మరికొంతకాలం డీఎంకేతో ప్రయా ణించి, తరువాత అన్నా డీఎంకేను ప్రారంభించారు. విజయ్‌కాంత్‌ ‌రాజకీయాలలోకి రాకముందు ప్రజాసేవలో ఉన్నారు. ఇలాంటి అంచనాలకు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు రావడానికి కారణం లేకపోలేదు. కేవలం తెర మీద ఉన్న ఆకర్షణ ఒక్కటే రాజకీయవేత్తగా స్థిరపడడానికి తమిళనాడులో ఉపకరించడం లేదు. సిద్ధాంతం, రాజకీయ అనుభవం ఉండాలి. లేని పక్షంలో ఏం జరుగుతుందో మనం చూశాం. విజయ్‌కాంత్‌, ‌కమల్‌హాసన్‌ ‌రాజకీయ జీవితం ఇదే చెబుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి విజయ్‌ ‌సభలకి మూడు లక్షలు వచ్చినా, ఆరు లక్షలు వచ్చినా కారణం తెర మీద ఆకర్షణ మాత్రమే అని ఇప్పుడే విశ్లేషకులు తేల్చేశారన్న మాట. మరొక విషయం కూడా ఉంది. కమల్‌ ‌హాసన్‌ 2016‌లో రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. మరుగున ఉండిపోయిన విషయం- అదే సంవత్సరం విజయ్‌ ‌కూడా రాజకీయాలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. జె.జయలలిత మరణించిన సంవత్సరం అదే. ఆమె లేని అన్నా డీఎంకే ఎలాగూ శూన్యమేనని చాలామంది నమ్మారు. కొంచెం ఆలస్యమైనా అదే నిజమని రుజువైంది. ఆ శూన్యం తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నదే కమల్‌, ‌విజయ్‌ల అభిప్రాయంలా ఉందన్నదే ఇప్పుడు వినిపిస్తున్న అభిప్రాయం. ఆనాటికి డీఎంకే మనుగడ పట్ల పెద్ద పెద్ద అనుమానాలే ఉండేవి.

ఇప్పటి వరకూ ఆడియో లాంచ్‌ ‌పోగ్రామ్‌లలో ప్రసంగించిన తాను తొలిసారిగా ఇంతమంది ప్రజల ముందు, వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని విజయ్‌ ‌చెప్పారు. ‘రాజకీయాలు పాములాంటివి. నేను రాజకీయాల్లో చిన్న పిల్లాడినే కావచ్చు. నాకు అనుభవం కూడా లేకపోవచ్చు. అయి నా బరిలోకి దిగిన తర్వాత ఎవ్వరికీ భయపడేదే లేదు’ అన్నారాయన. ఈవీ రామస్వామినాయకర్‌, ‌కె.కామరాజ్‌, ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌, ‌రాణి వేలు నాచియార్‌, అం‌జలి అమ్మాళ్‌ ‌వారసత్వాన్ని కొనసాగిస్తారట. వారి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తారట. కానీ ఆయన రాజకీయాలలో నీతినియమాల గురించి తనకు పట్టింపు గురించి ఏమీ చెప్పలేదు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాల ప్రాతిపదికగా పనిచేస్తారట. నీట్‌ ‌నిర్వహణకు టీవీకే వ్యతిరేకమట. జాతీయ స్థాయిలో మెడికల్‌ ఎం‌ట్రన్స్ ‌పరీక్ష అవసరం లేదని తేల్చారాయన.

‘సమాజంలో విభేదాలు సృష్టించేవారు, అనినీతిపరులు మనకు మొదటి శత్రువులు. ద్రావిడ భావజాలాన్ని కాపాడుతున్నామని చెప్పుకొంటూ రాష్ట్రాన్ని కుటుంబ సంస్థలా వాడుకుంటున్న వారు తదుపరి శత్రువులు’ అంటూ  విజయ్‌ ‌చేసిన వ్యాఖ్య జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. మరొకటి కూడా అంతగానూ ఆకర్షించింది. పదే పదే బీజేపీని ఫాసిస్టు పార్టీ అంటున్నారు కదా, మరి మీ పార్టీ అందుకు ఏమైనా మినహాయింపా? అని నిలదీశారు. ఆ విషయం వరకు మీకూ వాళ్లకీ ఏమిటి తేడా? అని స్పష్టంగానే విమర్శించారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలు పాటిస్తామని, పుట్టుకతో అందరూ సమానులే అన్నది తమ పార్టీ సిద్ధాంతమని కూడా అన్నారు. తమిళనాడు ప్రజలపై తిరుగులేని విశ్వాసం, నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, రాజీపడే ప్రసక్తే లేదని, సర్దుబాటు రాజకీయాలుండబోవని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని, సామాజిక నిబద్ధతతో వచ్చానని చెప్పారు.

తమిళనాట ద్రావిడ తరహా సుపరిపాలన అందిస్తున్నామంటూ ఓ కుటుంబ పరిపాలన కొనసాగుతోందని, దాన్ని అంతమొందించడమే తన కర్తవ్యమని విజయ్‌ ‌ధ్వజమెత్తారు. పెరియార్‌, అన్నాదురై పేర్లు చెప్పుకుని రాష్ట్రంలో ఓ గుంపు కుటుంబ పాలన కొనసాగిస్తోందని పరోక్షంగా డీఎంకేపై విరుచుకుపడ్డారు. పేదలకు ఇళ్లు, ఆహారం, ఉపాధి కల్పించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏమిటంటూ అంటూ విరుచుకు పడ్డారు. కానీ డీఎంకే వలెనే తమిళ జాతీయవాదమే (ఇదెక్కడిదో?) తమను నడిపిస్తుందని అంటున్నారు.  దీనికి ద్రవిడ సిద్ధాంతాలు మూలమని చెప్పారు.

ఈవీ రామస్వామి నాయకర్‌ను సమర్ధించడం అంటే, ఈ దేశ సాంస్కృతిక రాజకీయ ఐక్యతను నిరాకరించడమే. కానీ కామరాజ్‌ ‌నాడార్‌ ‌కూడా తమకు మార్గదర్శకమేనని అంటున్నారు. ఆయన జాతీయ కాంగ్రెస్‌ ‌నుంచి వచ్చినవారు. ఆయన సిద్ధాంతాలకీ, ఈవీ అతికి ఎప్పటికీ పొంతనే ఉండదు. వేలు నాచియార్‌ ఎవరో, ఆమె ఎందుకోసం పనిచేశారో కూడా విజయ్‌ ‌తెలుసుకుంటే మంచిది. ఇంతకీ తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతిని విజయ్‌ ఎం‌దుకు ప్రస్తావించలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఈవీ రామస్వామి నాయకర్‌ ‌సిద్ధాంతాన్ని పాక్షికంగా అనుసరిస్తానని చెప్పడంలోనే ఉంది. ఈవీ రామస్వామి నాయకర్‌ ‌సిద్ధాంతానికీ, నాస్తికత్వానికి (ప్రధానంగా హిందూ వ్యతిరేకత) అవినాభావ సంబంధమే ఉంటుంది. దీనిని కాదనడం విజయ్‌ ‌హిపోక్రసీ మాత్రమే. తన తండ్రి, తమిళ సినీ దర్శకుడు చంద్రశేఖరన్‌ ‌ప్రేరణే విజయ్‌ను రాజకీయం వైపు నడిపించింది.

ఈ సమావేశంలో విజయ్‌ ‌డీఎంకే మీద నేరుగానే విమర్శలకు దిగారు. అవి బీజేపీ మీద చేసిన విమర్శలలో ఘాటు తక్కువే. ద్రవిడవాదం పేరుతో ఒక కుటుంబం దోచుకుంటున్నదని ఆయన విమర్శించారు. ఇంతకు ముందు డీఎంకే పెద్ద కుటుంబానికి సంబంధించి, అంటే కరుణానిధి కుటుంబ అవినీతి గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అయితే బోషాణాల కొద్దీ రుజువులు గవర్నర్‌కు అందచేశారు. ఏ విధంగా చూసినా ద్రవిడవాదం పేరుతో ఇంతకాలం సాగిన దగాను ప్రజలకు తెలియచేసే పక్రియ మొదలైందనే అనిపిస్తుంది. ఇది ఇప్పుడు అత్యవసరం. అటు అన్నామలైకీ, ఇటు విజయ్‌కీ లభిస్తున్న ఆదరణను బట్టి ద్రవిడ పైత్యం కరగడం మొదలైందనే అనుకోవచ్చునేమో కూడా.

 తమ పార్టీకి ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ ఆదర్శమని, అయితే దేవుడు లేడంటూ ఆయన బలపరచిన నాస్తికవాదాన్ని మాత్రం తమ పార్టీ అంగీకరించే ప్రసక్తేలేదని విజయ్‌ ‌స్పష్టం చేశారు. తమిళనాడును శాసిస్తున్న రెండు ద్రవిడ పార్టీలకి ప్రత్యక్షంగాను, కమల్‌హాసన్‌ ‌వంటివారు స్థాపించిన పార్టీకి పరోక్షంగాను నాస్తికత్వం ఒక సూత్రం. అది మాత్రం తన పార్టీకి ఉండదని విజయ్‌ ‌చెప్పారు. ఆ పార్టీల నుంచి ఈ కొత్త పార్టీని వేరు చేస్తున్నది బహుశా ఇదొక్కటే. మిగిలినదంతా కొత్త సీపాలో పాత సారాయే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE