చరిత్ర రచన ఒక నిరంతర పక్రియగా సాగాలి. చరిత్రను ప్రతితరం పునర్ మూల్యాంకన చేసుకుంటూనే ఉండాలి. ఎంగిలి సిద్ధాంతాలు పట్టుకుని వేలాడుతూ అన్ని రకాలైన జాతీయ విలువలను విచక్షణా రహితంగా విమర్శించినప్పటికీ మహాపురుషులుగానే ఇప్పటికీ గౌరవం పొందుతున్న కీర్తిశేషుల పట్ల, సిద్ధాంతాల పట్ల ఇప్పటికీ మూఢభక్తిని ప్రదర్శించే వారికి కూడా ఇది వర్తిస్తుంది. కమ్యూనిస్టులు, సోషలిస్టులు జాతీయ భావాలను, జాతీయవాదాన్నీ, జాతి హితం కోరి చేసే పనులను ఏనాడూ గౌరవించలేదు. కానీ అనంతర కాలాలలో కొందరు నాయకులు మాత్రం ఆ పైత్యం నుంచి బయటపడి వాస్తవాలు చెప్పడానికి, నిజాన్ని అంగీకరించడానికి వెనుకాడలేదు. కమ్యూనిస్టులు సుభాశ్ చంద్ర బోస్ శతజయంతికి, అవును మేం ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నా’ మంటూ ఓ దొంగ ఏడుపు ఏడిచారు. బోస్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఇలాంటి ప్రకటన ఒకటి చేశారు. ఇలాంటివి ఉదంతాలు కొన్ని ఉన్నాయి. వెలువడిన సత్యాల సాక్షిగా అభిప్రాయాలను మార్చుకున్న వారు ఉన్నారు. పటేల్, సావర్కర్, బోస్ ఇంకా ఎందరో ఇలాంటి తప్పుడు తీర్పులకు బలైపోయారు.
సర్దార్ వల్లభ్ బాయి పటేల్‌ను ఆనాడు తాము ఎలా విమర్శించినదీ, తరువాతి కాలాలలో ఆ విమర్శలోని డొల్లతనాన్ని ఎలా గుర్తించినదీ, ఎలా పశ్చాత్తాప పడినదీ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కూడా వెల్లడించారు. పటేల్ కన్నుమూసిన రెండు దశాబ్దాల తరువాత రాసిన పెద్ద వ్యాసంలో చాలా అంశాను జేపీ ప్రస్తావించారు.
స్వతంత్ర భారతదేశ తొలి కేంద్ర మంత్రివర్గంలో సర్దార్ పటేల్ కనుక హోం మంత్రి కాకుండా ఉంటే, దేశ సమగ్రత వేరే విధంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే, చాలా కశ్మీర్‌లు పుట్టుకొచ్చేవి. చాలా వివాదాలు ఐక్యరాజ్య సమితిలో దశాబ్దాల పాటు నానుతూ ఉండేవి. పటేల్ చాలా విషయాలలో కరాకండీగా ఉండేవారన్నది నిజం. ఆయన మాట కూడా పెళుసుగానే ఉండేదని ప్రతీతి. దీనితో ఆయనకు చాలామంది విరోధులు తయారయ్యారు. ప్రధానంగా భారత కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టడానికి పునాది వేసిన కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఆయనంటే భగ్గుమని మండేవారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ పేరుతో ఈ రెండు సిద్ధాంతాల వాళ్లు కాంగ్రెస్‌లో చొరబడ్డారు. అప్పటి దాకా బుజ్జగింపు జాడ్యంతోనే బాధపడుతున్న కాంగ్రెస్‌కు తరువాత వీళ్లు కొత్త రుగ్మతలను అంటించారు.
జయప్రకాశ్ నారాయణ్ ఎంతో త్యాగం చేసిన వారే. మొదట కమ్యూనిస్టుగా, తరువాత సోషలిస్టుగా ఆయన అవతారాలు ఎత్తారు. చివరికి ఇందిర వ్యతిరేక సంపూర్ణ విప్లవంతో ఆయన జీవితం ముగిసింది. ఫలితమే జనతా పార్టీ. సర్దార్ పటేల్‌తో జేపీకి తీవ్రమైన విభేదాలు ఉండేవి. అవి సిద్ధాంత పరమైనవి కూడా. సర్దార్ పటేల్ పెట్టుబడిదారీ ప్రతినిధి అని జేపీ, ఆయన బృందం ప్రగాఢంగా నమ్మేదట. నిజానికి అదేమీ నమ్మకం కాదు. తాము అన్న మాటను ఎవరు వ్యతిరేకించినా విమర్శించ డానికి కమ్యూనిస్టులు, సోషలిస్టులకు నాలుక చివరి ఉండేమాట- పెట్టుబడిదారుల అనుకూలుడు. గాంధీ హత్యోదంతంలో పటేల్ దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని జేపీ అభిప్రాయం. కేంద్ర హోం శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పటేల్ హత్యోదంతం బాధ్యత నుంచి తప్పించుకోలేరని జేపీ విమర్శించారు. ఈ పరిణామాలను ‘ఇండియా విన్స్ ఫ్రీడమ్’ (మౌలానా ఆజాద్) వివరించింది. నిజానికి మౌలానా ఆజాద్ కూడా కాంగ్రెస్‌లో పటేల్‌కు ఉన్న అంతర్గత శత్రువులలో ఒకరు. అందుకే పటేల్ రాజీనామా చేయాలంటూ ప్రకటించి జేపీ గొప్ప సాహసం ప్రదర్శించారని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఒక విషయం మాత్రం దీనితో వెల్లడవుతున్నది. పటేల్‌ను విమర్శించడం అంటే ఆ రోజులలో సాహసమేనన్న మాట. గాంధీ రక్షణకు ప్రత్యేక చర్యలు ఎందుకు తీసుకోలదని ప్రశ్నిస్తూ పటేల్ పదవికి రాజీనామా చేయాలని కోరిన విషయాన్ని పటేల్ జీవిత చరిత్ర రాసిన రాజ్‌మోహన్ గాంధీ కూడా ప్రస్తావించారు.
గాంధీ కూడా పటేల్‌ను మనసారా అభిమా నించినవారు కాదనే చెప్పాలి. పటేల్ కూడా తన వైరుధ్యాలను దాచుకోలేదు. అయినా గాంధీకి తన హృదయంలో సమున్నత స్థానమే కల్పించారు పటేల్. కారణం ఏదైనా గాంధీజీ హత్య తరువాత నెలరోజులకు పటేల్‌కు తీవ్ర గుండెపోటు వచ్చింది. ఎంతవరకు నిజమో మరి! జేపీ, ఇతర కాంగ్రెస్, కాంగ్రెస్సేతర నాయకుల సూటిపోటి మాటలు ఆయనను తీవ్రంగానే బాధించాయన్న అభిప్రాయం ఉంది.
గాంధీ మరణించిన కొద్దికాలానికే సర్దార్ పటేల్ కూడా కన్నుమూశారు. కానీ మారుతున్న కాలాన్ని చూడడానికి జేపీ మిగిలారు. కాస్త ఆలస్యం కావచ్చు. అయినా వాస్తవాలను తనలో కలకాలం బంధించి ఉంచదు కాలం.
‘‘ఇవాళ నన్నొక భావన తీవ్రంగా కుదిపి వేస్తున్నది. ఆత్మ శోధన చేసుకునేటట్టు చేస్తున్నది. ‘గ్రేట్ సర్దార్’ జీవించి ఉన్న కాలంలో నేను ఆయన విమర్శకుడిని మాత్రమే కాదు. ప్రత్యర్థిగా చూసిన వాడిని కూడా’ అని రాశారు జేపీ. ఇక్కడ గ్రేట్ సర్దార్ అని సంబోధించడంలోనే జేపీ ఆత్మ శోధన బలం ఎంతటిదో తెలుస్తుంది. కాంగ్రెస్ సోషలిస్టులు పటేల్‌ను పెద్ద తిరోగమన వాదిగా చూసిన సంగతిని కూడా ఆయన అంగీకరించారు. సరే, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధి అన్న ముద్ర మరొకటి. కానీ జేపీ, ఇతర సీఎస్‌పీ నాయకులను పటేల్ ద్వేషించిన కారణం వేరు. సీఎస్‌పీ సభ్యులు నిరంతరం గాంధీజీని విమర్శించడం ఆయనకు నచ్చలేదు. మార్క్సిస్టుగా జేపీ గాంధీజీని విమర్శించడం అసలే నచ్చలేదు పటేల్‌కు. అయినా కొన్ని నిశిత అంశాలలో పటేల్‌ను తాను అంతో ఇంతో అభిమానించిన సంగతి కూడా వాస్తవమేనని జేపీ చెప్పుకున్నారు.
భారతభూమికి పటేల్ చేసిన మహోన్నత సేవ సంస్థానాల విలీనం. 562 సంస్థానాలను ఆయన దేశంలో విలీనం చేశారు. ఈ కఠిన చర్యలోని చారిత్రక అవసరాన్ని మాత్రం జేపీ తోసిపుచ్చలేక పోయారనే అనిపిస్తుంది. కానీ సంస్థానాలను విలీనం చేసిన పటేల్‌ను సీపీఐ ప్రజాద్రోహిగానే పరిగణిస్తున్నది. సంస్థానాల విలీనంలో పటేల్ దృష్టిని శ్లాఘించడమే కాదు, కశ్మీర్ వ్యవహారంలో నెహ్రూ తీరును కూడా జేపీ తరువాత తప్పు పట్టారు. అలాగే చైనా నుంచి పొంచి ఉన్న బెడదను అంచనా వేయడంలో కూడా నెహ్రూ వైఫల్యం ఉందనే జేపీ వెల్లడించారు. టిబెట్‌ను బఫర్ స్టేట్‌గా (రెండు పెద్ద రాజ్యాల మధ్య చిన్న రాజ్యం) నిలబెట్టి ఉంచవలసిన అవసరం గురించి నెహ్రూను పటేల్ నిరంతరం హెచ్చరించిన సంగతిని కూడా జేపీ విస్మరించలేదు. వెల్లడించకుండా ఉండలేదు.
నాయకత్వ పగ్గాలు చిరకాలం పటేల్ ఉక్కు పిడికిళ్లలలో ఉండిపోయినందుననే దేశ ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని మార్చడానికి నెహ్రూకు సాధ్యం కాలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో వివిధ అవతారాలలో ఉన్న సోషలిస్టులు, కమ్యూనిస్టులు చేసిన ఫిర్యాదు. ఇది ఎంత అబద్ధం! ఎంత చారిత్రక ద్రోహం! డిసెంబర్ 15, 1950న పటేల్ కన్ను మూశారు. అంటే స్వాతంత్య్రం వచ్చిన దాదాపు మూడేళ్లకే. నెహ్రూ 1964లో మరణించారు. తరువాత దశాబ్దన్నర కాలం దేశాన్ని శరవేగంతో ముందుకు నెట్టెయ్యడానికి నెహ్రూను అడ్డుకున్న శక్తి ఏమిటి మరి! జేపీయే కావచ్చు, ఇలాంటి విమర్శలు చేసినందుకు చరిత్ర ఆయనను క్షమించదు. ఒక దేశం పురోగమించకుండా ఉండిపోవడానికి కారణంగా పటేల్‌ను చూపడం అపరాధమే. పటేల్ కన్నుమూసిన తరువాత దేశాన్ని సోషలిస్టు పథంలో ముందుకు నడపడంలో నెహ్రూ సాధించిన విజయం అతి స్వల్పమని కూడా జేపీ చెప్పారు. చాలామంది లాగే నెహ్రూ భ్రమలు వీడిన వ్యక్తి జేపీ. చాలామంది వలె కమ్యూనిజం పట్ల పిచ్చిని వదులుకున్న వ్యక్తి జేపీ.
గుజరాత్‌కు చెందిన సోషలిస్ట్, స్వాతంత్య్ర సమరయోధుడు కమల్‌శంకర్ పాండ్యా చెప్పినది ఇంకా చిత్రంగా ఉంది. గ్రాంట్ రోడ్‌స్టేషన్ దగ్గరి శ్మశాన వాటికలో పటేల్ అంత్యక్రియలు పూర్తయి తిరిగి వచ్చిన తరువాతనే, పటేల్ పట్ల సోషలిస్టులలో ఉన్న అభిప్రాయాలు ఎంత భిన్నంగా ఉన్నాయో బయటపడింది. ‘వెరన్ జీవన్’ అన్న తన ఆత్మకథలో పాండ్యా ఈ విషయాలు రాశారు. పటేల్ అంత్యక్రియల నుంచి వచ్చిన తనతో మిత్రుడు ఒకడు చేసిన వాదనలో నెహ్రూ పట్ల అంధభక్తి మాత్రమే కనిపించిందని పాండ్యా రాశారు.నేను నా జీవితంలో 15 నుంచి 20 ఏళ్లు నెహ్రూ జిందాబాద్ అంటూనే గడిపాను. గాంధీ-సర్దార్ జంట కంటే నెహ్రూ పట్లనే ఎక్కువ భక్తి ప్రదర్శించాను. కానీ భ్రమలు వదలి పోయాయి. కానీ ఇప్పుడు నేను బాధపడుతూ ఒక విషయం చెబుతున్నాను. పటేల్ ఎప్పుడూ స్వలాభం కోసం ఏ పనీ చేయలేదు. కానీ నెహ్రూ ఏం చేసినా స్వలాభాపేక్షతోనే చేశారు. కాబట్టి, సర్దార్ పటేల్ సోషలిస్టు కాకపోతే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన దృష్టిలో మానవీయకోణం ఉంది.అదే నెహ్రూ సోషలిజం, ఆయనది అని చెప్పుకునే దృష్టి అంతా అధికార లాలసకు సంబంధించినదే- ఇది పాండ్యాలో అంతిమంగా వచ్చిన జ్ఞానోదయం.
సి. రాజగోపాలాచారి అభిప్రాయాలు చూద్దాం. ఎందుకంటే ఆయన గాంధీ-పటేల్-నెహ్రూ ముగ్గురితో కలసి కాంగ్రెస్‌లో పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌తో విభేదించి 1959లో స్వతంత్ర పార్టీ ఏర్పాటుచేశారు. 1971లో తన పార్టీ పత్రిక స్వతంత్రకు రాసిన వ్యాసంలో కొన్ని వాస్తవాలను రాజాజీ ఆవిష్కరించారు. నెహ్రూయే ఉత్తమ ప్రధాని కాగలరని తాను విశ్వసించడం తప్పిదమేనని రాజాజీ రాశారు. ఎందుకంటే పటేల్ కంటే నెహ్రూ పెద్ద మేధావి అని నాటి చాలామంది సమకాలికుల మాదిరి గానే రాజాజీ కూడా నమ్మారు. మహమ్మదీయుల పట్ల పటేల్ దయాదాక్షిణ్యాలు లేకుండా ఉంటారని ఒక మాట విపరీతంగా నాడు వినిపించేది. కానీ దీనికి రుజువులు లేనేలేవు అని రాజాజీ తెలియ చేశారు. కానీ పటేల్ డొంకతిరుగుడు లేకుండా, న్యాయబద్ధంగా నడుచుకునేవారు అని కూడా రాజాజీ పేర్కొన్నారు.
సంస్థానాల విలీనంలో పటేల్ చర్య భారత దేశానికి వరమేనని ఇప్పుడు అంగీకరించడం విజ్ఞత. అంగీకరించగలగడం వాస్తవికత.
చైనాను నమ్మవద్దని పదేపదే పటేల్ ప్రథమ ప్రధానికి ఇచ్చిన సలహా వాస్తవికమైనదని, దూరదృష్టి కలిగినదని కాలం రుజువు చేసింది. నెహ్రూ కంటే పటేల్ దూరదృష్టి నిర్మాణాత్మకమైనదని, భ్రమాజనితం కాదని రుజువైంది.
-జాగృతి డెస్క్