‘‘స్వదేశీనా? ఏంటి మమ్మల్ని పదిహేనవ శతాబ్దానికి తీసుకువెడదామనుకుంటున్నారా?’’… నాయకుల ఎగతాళి.
‘‘అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆర్థికశాస్త్రం ఏం తెలుసు?’’.. మేధావుల అహంకారం…
‘‘స్వదేశీ జాగరణ్ మంచ్ వాజ్‌పేయి ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షమా?’’ అంటూ పత్రికల ఎత్తిపొడుపులు…
స్వదేశీ జాగరణ మంచ్ తన మూడు దశాబ్దాల ప్రయాణంలో ఎదుర్కొన్న అనేకానేక వెటకారాలు, ఎత్తిపొడుపులూ, విమర్శలను అధిగమిస్తూనే, నేటి ప్రభుత్వ విధానాలలో స్వదేశీ అంశాలు ఉండేలా ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదేమో! ప్రపంచ వాణిజ్య సంస్థ షరతులను గుడ్డిగా ఆమోదించవద్దని, జన్యు మార్పిడి చేసిన విత్తనాలను అమ్మే ఎమ్మెన్సీలకు వ్యతిరేకంగా, వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశమే ప్రధానమంటూ స్వదేశీ జాగరణ్ మంచ్ ఉద్యమించి, అనేక విజయాలను సాధించింది. భారతీయ అభివృద్ధి నమూనాతోనే దేశ అభివృద్ధి సాధ్యమని విశ్వసించి, అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ, ప్రజలలో స్వదేశీ భావనను జాగృతం చేస్తూ వస్తోంది.
నిజానికి స్వదేశీ భావన శతాబ్దమున్నర కాలం కిందటిది. అనంతరం లోకమాన్య బాలగంగాధర్ తిలక్, వీరసావర్కర్, అరవింద ఘోష్, మహాత్మా గాంధీ వంటి దార్శనిక నాయకులు స్వాతంత్య్ర పోరాటానికి దీనిని మార్గదర్శక శక్తిగా మార్చారు.
నేటి ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’, ‘విశ్వకర్మ యోజన’ సహా పలు పథకాలలో అంతర్లీనంగా ఉన్నది స్వదేశీ భావనే. దేశ ప్రజలలో జాగరూక•మై ఉన్న ఈ భావనను మేల్కొలిపేందుకు, దీనిని ఒక జీవన విధానంగా అలవాటు చేసేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి అభియాన్ సహా పలు సంస్థలతో కలిసి పని చేస్తూ జిల్లా, మండల స్థాయి వరకూ వ్యాపించింది. పేదల ఆదాయం పెరిగే వరకూ, ఉపాధి, నైపుణ్యాలు పెరగనంత వరకూ నిజమైన అభివృద్ధి సాధ్యం కాదన్నది స్వావలంబి భారత్ అభియాన్ విశ్వసించి ప్రచారం చేస్తోంది. అట్టడుగు స్థాయిలో ఉన్న సమాజానికి, జాతీయ స్థాయిలో ఉన్న విధానకర్తలకు మధ్య లంకెగా మారే స్థితికి ఎదిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడం, ప్రల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలిసేలా చేయడం ద్వారా పరోక్షంగా విధాన రూపకల్పనను ప్రభావితం చేస్తోంది.
స్వదేశీని ఒక జీవన విధానం చేయడానికి అత్యంత ముఖ్యమైన ఆర్ధిక స్వేచ్ఛను భారత్ స్వాతంత్య్రాన్ని సాధించిన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా పొందలేకపోవడం ప్రమాదకరమని భావించి భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తదితర సోదర సంస్థలతో కలిసి 1980ల్లో స్వదేశీ కోసం ఉద్యమిం చారు. ఈ ఉద్యమానికి ఒక స్వరూపాన్ని ఇచ్చేందుకు స్వదేశీ జాగరణ్ మంచ్‌ను ప్రారంభించాలని నిర్ణయించి, 1991, నవంబర్ 22న నాగపూర్‌లో మొదలుపెట్టారు. బీఎంఎస్, బీకెఎస్ వ్యవస్థాపకులైన దత్తోపంత్ ఠెంగ్డే మార్గదర్శనంలో జాతీయ సంస్థలు బిఎంఎస్, ఎబివిపి, బికెఎస్, అఖిల్ భారతీయ గ్రాహక్ పంచాయత్, సహకార భారతి ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యమాన్ని సరైన దిశలో ముందుకు తీసుకు వెళ్లేందుకు ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేసి, దానికి కన్వీనర్‌గా నాగపూర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌గా డా।। ఎం.జి బోకారేను నియమించారు. మరు ఏడాది, జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని ప్రారంభించారు. అన్ని రంగాలకు చెందిన, భిన్న భావజాలాలకు చెందినప్పటికీ అందరూ ఆర్ధిక సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిం చేందుకు కలిసి వచ్చారు.
దేశం స్వయం సమృద్ధిని సాధించాలంటే, వ్యవస్థాపకతను మించిన మార్గం లేదన్న భావనతో యువతను వ్యవస్థాపకత దిశగా మళ్లేలా మార్గ దర్శనం చేస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర శాఖకు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్, స్వదేశీ అభియాన్‌లు సంయుక్తంగా హైదరా బాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో అక్టోబర్ 23 నుంచి 27వరకు ‘స్వదేశీ మేళా’ను నిర్వహిం చారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మేళాను ప్రారంభించారు. మేళాలో భాగంగా సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్ వంటి సంస్థల సహకారంతో ‘ఉద్యోగ మేళా’ను నిర్వహించి, అర్హులైన నాలుగువేలమంది యువతకు నియామక పత్రాలను అందించారు. మేళాలో చేతివృత్తుల వారు, హస్తకళాకారులు, ఆయుర్వేద ఉత్పత్తులు, మూలికలు, దేశవాళీ విత్తనాలు, దుస్తులు సహా డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా, చిరుధాన్యాలతో చేసిన ఆహార ఉత్పత్తులు, మూలికలు కలిపి తయారు చేసిన టీ వంటివి సందర్శకులను బాగా ఆకర్షించాయి.
ఈ స్వదేశీ మేళాను కేవలం ఒక ప్రదర్శనగా కాకుండా, అవగాహనా కార్యక్రమానికి వేదికగా కూడా నిర్వాహకులు ఉపయోగించడం విశేషం. ఇందులో భాగంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు స్వదేశీ అంటే ఏమిటి, దాని ప్రాధాన్యం ఎంతటిది వంటి అంశాలపై ప్రసంగించి, యువతలో స్ఫూర్తిని నింపే యత్నం చేశారు.
మహత్తర దేశానికి వారసులం
తొలిరోజు ఉదయం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సల్ ప్రొ. సదాశివమూర్తి ప్రసంగిస్తూ, ‘సర్వే భవంతు సుఖినః’ అంటూ ఈ మొత్తం ప్రపంచపు సంక్షేమాన్నీ కోరే సంస్కృతి కేవలం భారతీయులదేనని అన్నారు. కనుక, భారతీయులు మాత్రమే ప్రపంచానికి నాయకత్వం వహించగలరని చెప్పారు. ప్రకృతి సహా సకల జీవరాశుల సమాజానికీ, ప్రపంచానికీ మధ్య ఉన్న గొప్ప అంశమే దేశమని, మనది భారతదేశం, ఇందులో ‘భా’ అంటే జ్ఞానమని, ‘రత’ అంటే ఆసక్తి అని, జ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన వారు భారతీయులని వివరించారు. అంతటి మహత్తర ప్రదేశానికి మనం ప్రతినిధులమని అన్నారు. మన ఆధునిక విద్యలో ప్రాచీన విజ్ఞానాన్ని సమ్మిళితం చేయవలసిన అవసరం ఉందని సూచించారు. నిన్నటి రష్యా మనసు కమ్యూనిజంలో ఉంటే, చైనాది మావోయిజంలో, యుఎస్‌ఎది ఆధిపత్యంలో ఉండగా, భారత్ ఆత్మ మాత్రం జ్ఞానంలో ఉందని అన్నారు. ప్రకృతిలోని ప్రతి అంశం బోధిస్తుందనే విషయాన్ని మనం అంగీకరించామని, అందుకే మన జ్ఞాన వ్యవస్థలు మనకు చక్కటి వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని అందిస్తాయన్నారు. మనం వ్యక్తిత్వం అనే పదాన్ని తరచుగా వింటుంటా మని, దాని అర్థం మనలో ఉన్న నైపుణ్యాల గురించి మనకు తగిన అవగాహన ఉండడమే అని ఆయన వివరించారు. మనలోకి మనం చూసుకున్నప్పుడే ఇది ప్రారంభం అవుతుందని, ఎందు కంటే మన మనసులో ఉండే అద్దం సత్యాన్ని ప్రతిఫలిస్తుం దని అన్నారు. మనలో ఉన్న నైపుణ్యాలను పెంచి పోషించ నంత వరకూ అవి వృథా అని, అందుకు కారణం సమాజంలో మనలో ఉన్న నైపుణ్యాలను బట్టే మన వ్యక్తిత్వాన్ని గుర్తిస్తుందని ఆయన బోధించారు. ఈ నైపుణ్యాలను దేశ సేవకు ఉపయోగిస్తే, దేశం నీ సంరక్షణను చూసు కుంటుందంటూ ఆయన విద్యార్ధులకు ప్రేరణ ఇచ్చారు. మన జ్ఞాన వ్యవస్థలు అన్నీ ప్రకృతి అనుకూల జీవనాన్ని బోధిస్తాయని, అందుకు అనుగుణమైన అభివృద్ధిని సూచిస్తాయని ఆయన అన్నారు. రక్షణ, ఆరోగ్యం, ప్రకృతి సంరక్షణ, ఆర్జన సహా పలు అంశాలను మన ప్రాచీన శాస్త్రాలు బోధిస్తాయని ఆయన తెలిపారు. తాను మార్గాన్ని, ద్వారాన్ని సూచిస్తున్నానని, జ్ఞానాన్ని విద్యార్ధులే అభివృద్ధి చేసుకోవాలని, మనకు తోడ్పడే జ్ఞానాన్ని ఆర్జించాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు.
అమెరికా సాయం లేకున్నా అభివృద్ధి
సాయంత్రం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ ప్రచారక్ రవికుమార్ అయ్యర్ మాట్లాడుతూ, ఆంధ్ర దేశ గొప్పతనాన్ని వివరించారు. మహమ్మద్ ఘోరీ దాడి చేసిన సమయంలో ఆ ప్రాంత రాజును వివాహం చేసుకున్న తెలుగు మహిళ నాయకీదేవి అతడిని యుద్ధంలో ఓడించిందని, అతడు తిరిగి దండెత్తలేదని ఆయన చెప్పారు. తంజావూరును తెలుగు నాయక వంశ రాజులు పాలించారని ఆయన అన్నారు. మనం ఈ దేశ పౌరులమైనందుకు గర్వంతో ఉన్నప్పుడే మనం నిశ్చితంగా మాట్లాడగలమని ఆయన అన్నారు. ఆ దృఢ విశ్వాసమే మనకు సాహసాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. మారిషస్‌కు ప్రధానులు, అధ్యక్షులు అయిన వారిలో 28మంది భారతీయ సంతతికి చెందిన వారేనని ఆయన తెలిపారు. వెస్టిండీస్ ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన కమలా బిశ్వేశ్వర్ ఉన్నారని, పోర్చుగల్ ప్రధానిగా ఉన్న డీ కోస్టా గోవా నుంచి వెళ్లి అక్కడ స్థిరపడిన వారి సంతతేనని, యుఎస్‌ఎ తొలి మహిళా ఉపాధ్యక్షరాలు కమలా హారిస్‌లో భారతీయ రక్తం ప్రవహిస్తోందని, ఒకవేళ ఈసారి ట్రంప్ గెలిస్తే, సెకెండ్ లేడీ (ఉపాధ్యక్షుడి భార్య) భారతీయ సంతతికి చెందిన మహిళే అవుతుందని ఆయన వివరించారు.
అమెరికా తోడ్పాటు లేకుండానే భారత్ పురోగమించగలదని ఆయన అన్నారు. అందుకు ఉదాహరణగా, కొవిడ్ మహమ్మారి కాలంలో ప్రపంచమంతా విలవిలలాడుతున్న సమయంలో స్వదేశీ సంస్థ అయిన భారత్ బయోటెక్ తొలి టీకా ‘కోవాక్సిన్’ను తయారు చేయడాన్ని, దానిని పేద దేశాలకు ఉచితంగా సహా మొత్తం 98 దేశాలకు కోట్లాది వాక్సిన్లను ఎగుమతి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మనం పురోగమిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం అన్ని దేశాలనూ సంరక్షిస్తూ ముందుకు వెడతామని ఆయన అన్నారు. అనేకమంది ప్రొఫెషనల్స్ ఇతర దేశాలకు వలస వెళ్లడాన్ని విమర్శిస్తుంటారని, కానీ, ఆ ఎన్‌ఆర్‌ఐలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారని ఆయన వివరించారు. ఆ రకంగా మన సంస్కృతిని, సభ్యతను ఇతర దేశాలకు తీసుకువెళ్లగలుగు తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి కూడా యోగాను అంతర్జాతీయం చేయడంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. భారత్ అంతర్జాతీయ యవనికపై తన ఉనికిని సుస్థిరం చేసుకుంటున్న తరుణంలో ప్రవాసీ భారతీయులు అందుకు ఎంతో తోడ్పడుతున్నారని ఆయన వారిని ప్రశంసిం చారు. భారత్‌ను ఇష్టపడని వారు దాని అభివృద్ధిని అడ్డుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని ఆయన పట్టి చూపారు. ప్రపంచంలోనే అతిపెద్ద యూనికార్న్‌లు భారత్ నుంచి వచ్చినవేనని, నేటి యువత భారీ స్థాయిలో ఆవిష్కరణలు జరుపుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కొనుగోలే శక్తి పెరిగింది
మరురోజు సాయంత్రం జరిగిన సభలో అతిథులుగా పాల్గొన్న జెన్‌టియు ప్రొఫెసర్ వేంకటేశ్వరరావు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ప్రసంగించారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మూడవ ప్రపంచ దేశాలపై పెత్తనం చేసేందుకు వినియోగ వస్తువులను ఆ దేశాలకు అమ్మి, వారిని దోచుకునేందుకు ప్రయత్నం చేశారని గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పరిశ్రమలు కుదేలు అయ్యాయని ఆయన అన్నారు. దిగుమతి సుంకాన్ని తప్పించుకొని, ఈ దేశాలపై పెత్తనం చేయాలనే ప్రపంచ వాణిజ్య సంస్థను ముందుకు తెచ్చారని, ఈ క్రమంలోనే స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పాటు గురించి ఆలోచన జరిగి, అది సాకారమైందని ఆయన సంస్థ ఆవిర్భావం గురించి వివరించారు. గ్రామ స్థాయిలో ఉండే చిన్న చేతివృత్తుల వారికి కూడా అవకాశం ఇవ్వడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే దీని లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం అటువంటి పని చేస్తున్న వారికి సాంకేతికతను అందించడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చని చెప్పారు. నేడు ప్రజలలో ఖర్చు పెట్టే తత్వం పెరిగిందని, ఈ క్రమంలో వారు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా దేశా భివృద్ధిలో పాలుపంచుకోవచ్చని ఆయన అన్నారు. నేటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ విత్తనాలను పరిరక్షించడం అత్యవసరం అని ఆయన చెప్పారు.
భారత్ ఓ యువరాజ్యం
మరురోజు జరిగిన సభలో లీడర్‌షిప్ కోచ్ వై.నవీన్‌కుమార్, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ జి. సతీశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్ధులు కేవలం ఉద్యోగం చేయాలన్న ఆలోచనలో ఉండకుండా, వ్యవస్థాపకత దిశగా కూడా ఆలోచించా లని నవీన్‌కుమార్ అన్నారు. పారిశ్రామిక వేత్త అదానీ ముందు ఓడరేవులో పని చేశాడని, ఒకసారి మాట్లాడుతూ తాను ఓడరేవునే కొంటా నంటూ అనడమే కాదు, ఆ స్థాయికి ఎదిగాడని ఆయన వివరించారు. మంచి వ్యవస్థాపకత అనేది మనతోనే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
నేటి భారత్ శక్తి యువతేనని, ప్రస్తుతం దేశ జనాభాలో 50 నుంచి 60 శాతం యువతే ఉన్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. ఒక సర్వే ప్రకారం, రానున్న ఐదారేళ్లల్లో భారతదేశంలో నైపుణ్యాలు కలిగిన యువత 40 శాతానికి చేరుకుంటుందని, ఇది ఎంతో సానుకూల పరిణామమని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. గతంలో దేశం మొత్తంలో కొద్ది ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐటీలు ఉండేవని, కానీ నేడు ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీనే వచ్చిందని చెప్పారు. నేడు వేలాది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి ఏడాదీ 14 లక్షల మంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారని ఆయన గణాంకాలు చెప్పారు. ఇంతకు ముందు అనేకమంది వ్యక్తులు దేశంలో అవకాశాలు లేక విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారని, కానీ ఇప్పుడు దేశంలో పరిణామాలు చూసి తిరిగి రావాలనుకుంటున్నారని ఆయన తెలిపారు. అలాగే, ఐఐటిల నుంచి బయటకు వచ్చిన వారిలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లే వారని, కానీ నేడు వారు దేశంలోనే ఉండిపోతున్నారని, ఇది మారుతున్న యువత దృక్పధానికి ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కల్చర్‌కు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని, ప్రతి కాలేజీలోనూ వీటికి చేయూతనిచ్చేందుకు ఇన్‌క్యు బేషన్ సెంటర్లను్ర పరంభించారన్నారు. గతంలో పరిశ్రమ పెట్టడమే చాలా కష్టంగా ఉండేదని, ఒకవేళ పెట్టినా పెద్ద సంస్థలకు అనుబంధ సంస్థలుగా మాత్రమే పెట్టగలిగేవారని ఆయన అన్నారు. సాఫ్ట్‌వేర్ యాప్స్ తయారీలో 2016 నాటికి 450 స్టార్టప్‌లు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నేటి యువత ఆవిష్కరణల దిశగా మొగ్గు చూపుతోందని, ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని ఉత్పత్తిని తయారు చేయాలని యోచిస్తోందని, అది ఎంతో అభినందనీయమైన, ప్రోత్సాహకరమైన విషయమని అన్నారు. అనుబంధ సంస్థల స్థాయి నుంచి ప్రపంచంలోనే పోటీ పడే స్థాయికి నేడు ఎదిగామని ఆయన అన్నారు. స్థానిక స్కైరూట్ అన్న స్థార్టప్‌కు వందల కోట్ల నిధులు వచ్చాయని ఆయన చెప్పారు. బెంగళూరుకు చెందిన సుహాస్ గోపీనాథ్ అనే బాలుడు తన 10 ఏళ్ల వయసులోనే కంపెనీని ప్రారంభించాడని, అతనికి పదిహేనేళ్లు వచ్చేనాటికి ఆ కంపెనీ విలువ పెరగడమే కాదు, ఫార్చూన్ 500 కంపెనీలలో ఒకటిగా ఎదిగిందని ఆయన చెప్పారు. స్టార్టప్‌లు పెరగడమే కాదు, నేడు కళాశాల్లో పరిశోధన, అభివృద్ధి కూడా ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు. నేడు మనం అనేక రంగాలలో ఎగుమతులు చేయగలుగుతున్నామని చెప్పారు. ఒకనాడు మన దేశం రక్షణ దిగుమతులలో ఒకటి లేక రెండవ స్థానంలో ఉండేదని, నేడు మనం వాటిని ఎగుమతులు చేసే దశకు ఎదిగామని ఆయన చెప్పారు. డిఆర్‌డిఒ చేపట్టిన బయోడిగ్రేడబుల్ బ్యాగులు నేడు తిరుమలలో కూడా ఉపయోగిస్తు న్నారని, విస్తర్లు, గ్లాసులు తయారు చేసే సాంకేతి కతకు కేవలం 5 నుంచి 7 లక్షల పెట్టుబడి ఉంటే చాలని వివరించారు. ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదని, ఎలా ఆలోచిస్తున్నారనేది ముఖ్యమని ఆయన అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆవిష్కరణ చాలా ముఖ్యమని తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ కలను సాకారం చేయాలంటే యువత ఆవిష్కర్తలు కావాలని ఆయన అన్నారు.
ఈ స్వదేశీ మేళాను నిర్వహిస్తున్నందుకు, యువతకు ఉపాధి కల్పన కోసం డ్రైవ్‌ను చేపట్టి నందుకు ఆయన నిర్వాహకులను అభినందించారు.
అమ్మభాష, స్వధర్మం విస్మరించవద్దు
నాటి సాయంకాల సభలో ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ శ్రీమతి విజయభారతి పాల్గొని ప్రసంగిస్తూ, మన ఆలోచన, ఆచరణ, వస్త్రధారణ భాష అన్నీ స్వదేశీగా ఉండాలన్న విషయాన్ని మరువరాదని సూచించారు. మాతృభాష, స్వధర్మం, స్వాభిమానం మరవద్దన్నారు.
రామరాజ్య కల్పనే స్వదేశీ
మేళా చివరి రోజున ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ ప్రచారక్, స్వదేశీ జాగరణ మంచ్ అఖిలభారత సహ సంఘటన మంత్రి, సతీశ్, వీరేంద్రగౌడ్ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అపారమైన చారిత్రిక వైభవం కలిగిన హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగడం పట్ల మంత్రి జూపల్లి హర్షాన్ని వ్యక్తం చేశారు. మన సంప్రదాయాలూ, సంస్కృతే అన్ని ప్రాంతాలనూ కలుపుతాయని, భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనమని ఆయన అన్నారు. స్వయం సమృద్ధికి ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం ఎస్‌జేఎం దక్షిణ ప్రాంత ప్రముఖ్, కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా।। లింగమూర్తి ప్రసంగిస్తూ, ‘జననీ జన్మ భూమిశ్చ..’ అన్న శ్రీరాముడే స్వదేశీని ప్రారంభించాడని ఆయన అన్నారు. నిజానికి రామరాజ్య కల్పనే స్వదేశీ అని ఆయన అన్నారు. ఆర్ధిక వైభవాన్ని తేవడమే స్వదేశీ అన్నారు. మన భాషను, జీవనవిధానాన్ని అలవరచుకోవడమే స్వదేశీ అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. జోహో కంపెనీని ప్రారంభించిన శ్రీధర్ వేంబు జీవనశైలి స్వదేశీ అని ఆయన ప్రశంసించారు. ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన భారత్‌కు వచ్చి తమిళనాడులో కుగ్రామంలో ఉంటూ తన కార్యకలాపాలను నిర్వహించడాన్ని ఆయన వివరించారు. దాదాపు 17వ శతాబ్దం వరకూ ఎగుమతులు చేసిన ఏకైక దేశం భారత్ అని ఆయన అన్నారు. స్వదేశీ ఆర్ధిక వ్యవస్థ ద్వారా జీవన విధానాన్ని నడిపించాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపిచ్చారు.
దాదాపు 19 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో స్వదేశీ మేళాను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ మేళ ఆత్మ స్వదేశీ అని ఆయన అన్నారు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగవ ఆర్ధిక వ్యవస్థగా బారతదేశం ఉందని, 2047 నాటికి మనం మొదటి స్థానంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన చెప్పారు. జపాన్, చైనా, అమెరికా, యూరోప్ దేశాలలో వృద్ధ జనాభా పెరుగుతోందని, మన దేశంలో సగటు వయసు 27 సంవత్సరాలని, అయితే మనం కూడా మన జననాల రేటును పెంచుకోకపోతే, ఆ దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులనే ఎదుర్కొంటామని ఆయన అన్నారు. దేశం ఎప్పుడూ యువ దేశంగా ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
వ్యవస్థాపకత అనేది భారతీయ డిఎన్‌ఎలోనే ఉన్నదని, ప్రాచీన భారతం స్వయం సమృద్ధిగా ఉందంటే అందుకు కారణం వ్యవస్థాపకతేనని చెప్పారు. ఇదే దేశభక్తి అని ఆయన అన్నారు.
కార్యక్రమాన్ని ముగిస్తూ, అక్టోబర్ 23 నుంచి 27 వరకూ సాగిన మేళా నివేదికను నిర్వాహకులలో ఒకరైన ఇంద్రసేనారెడ్డి వివరించారు. దాదాపు రెండు నెలల పాటు శ్రమించి 15 బృందాలతో ఈ ఏర్పాట్లు చేయగలిగాయని ఆయన చెప్పారు. గంగోత్రి గ్రూప్ సహా పలు సంస్థలు తమకు సహకరించాయని అన్నారు.
ఒకవైపు అవగాహన కార్యక్రమాలు, మరొకవైపు ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రజలలో స్వదేశీ పట్ల జాగృతిని తెచ్చే కార్యక్రమాన్ని నిర్వాహకులు తమ భుజస్కంధలపై వేసుకున్నారు. మేళా చూసేందుకు వచ్చినవారే కాదు, అక్కడ ప్రసంగించిన ప్రతి అతిథీ, ప్రదర్శన మొత్తాన్ని సందర్శించి, స్టాళ్లు నిర్వహిస్తున్న వారితో ముచ్చటించడం విశేషం.
వేప చెక్కతో విగ్రహాలు
శిలలపై కాకుండా చెక్కపై కూడా విగ్రహాలను చెక్కి అవి రాతివేమోననే భ్రమకు లోనయ్యేలా చేసిన శిల్పి కరీంనగర్‌కు చెందిన రాము. శ్రీ వేంకటేశ్వరుడు సహా పలు దేవతా విగ్రహాలను, రకరకాల సైజుల్లో చెక్కిన ఆయన ‘జాగృతి’తో మాట్లాడుతూ, చిన్న విగ్రహమైనా, పెద్ద విగ్రహమైనా కావలసిన ఏకాగ్రత ఒక్కటేనన్నారు. బ్యాచలర్ ఆఫ్ ఫైన్ ఆర్టస్ చేసిన రాము, తనకు ఎంతో ఇష్టమైన శిల్పకళను తన వృత్తిగా ఎంచుకుని, అనేక ప్రదర్శనలు, మేళాల్లో తన విగ్రహాలను ప్రదర్శి స్తున్నట్టు చెప్పారు. పూర్తిగా వారసత్వంగా వచ్చింది కాకపోయిన ప్పటికీ, తన తాతగారు శిల్పాలు చెక్కేవారని, శిల్పి కావడానికి అదే తనకు ప్రేరణ అని ఆయన అన్నారు. విగ్రహాలను చెక్కేటప్పుడు వేలి గోరుతో సహా ప్రతి అంగానికీ కొలతలు ఉంటాయని, వాటికి అనుగుణంగా చెక్కుతామని వివరించారు. ముఖ కవళికలు, రకరకాల భావాలను ఒలికేలా చెక్కాలనుకున్నప్పుడు సృజనాత్మకంగా ఉండాల్సిందేనని అన్నారు. పూర్తిగా చేతితో చేసే ఈ పనిలో సహాయపడేందుకు తనకు ఐదుగురు సహాయకులు ఉన్నారని ఆయన చెప్పారు. గ్రామాలలో అనేక చేతివృత్తులలాగానే, ఈ కళ కూడా అంతరించిపోతోందని, రుణాలు లభ్యం కావడం కూడా అంత సులభం కాదని ఆయన అన్నారు. చేతితో చెక్కిన విగ్రహం కనుక సహజంగానే యంత్రం ఉత్పత్తి చేసిన దానికన్నా ఖరీదు ఎక్కువ ఉంటుందని, దానివల్ల తమ ఉత్పత్తులు సాధారణ ఎగ్జిబిషన్లలో అంత ఎక్కువగా అమ్ముడుపోవని, ఒక రకంగా చూస్తే ఆర్ధికంగా అంత లాభదాయకం కాదని అన్నారు. తన ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా జరిగే ప్రదర్శనలలో, స్టూడియోలలో ప్రదర్శిస్తానని, ప్రకృతి, తదితర విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తుందని అన్నారు.
సేవాభారతి స్టాల్
చక్కటి సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు, అందమైన రబ్బర్ బాండ్లు, ఫోటో ఫ్రేమ్‌లు, బ్యాగులు సహా చేతితో చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు ఆ యువతులు. సేవాభారతికి చెందిన ఆ స్టాల్‌లో రకరకాల రూపాలలో పరిమళాలు వెదజల్లే క్యాండిల్స్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. సేవా భారతి చేపట్టే పలు కార్యక్రమాల్లో భాగంగా, కౌమారంలో ఉన్న ఆడపిల్లలకు పలురకాల చేతివృత్తులలో ఇచ్చిన శిక్షణనిచ్చి, వారిని ఉత్పత్తులు చేసేలా ప్రోత్సహించి, మార్కెటింగ్ చేస్తున్నారు. కిశోరి దశలో ఉన్న ఆ బాలికలకు జీవించడానికి ఒక కళతో పాటు, పాకెట్ మనీ కూడా వస్తుంది. మురికివాడలలో ఉన్న పిల్లలు, స్కూల్ డ్రాప్ ఔట్లను ఎంపిక చేసి వారికి శిక్షణ నిస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వారు తమకు ఆర్డర్ ఇస్తే సరసమైన ధరలో చేసిపెడతామని స్టాల్‌లో ఉన్న యువతులు వివరించారు.
స్వచ్ఛమైన పళ్లరసాలు
ఎటువంటి రంగులు, రుచికి అవసరమైన పదార్ధాలను కలుపకుండా స్వచ్ఛమైన పళ్లరసాన్ని అందిస్తోంది ఎన్‌కోల్డ్ సంస్థ. శరీరానికి తగిన ఫలాన్ని ఎంచి దాని రసాన్ని ఇంటి వరకూ సరఫరా చేస్తున్నారు ఈ సంస్థవారు. మూడు రోజుల వరకూ మాత్రమే నిల్వ ఉండే ఈ రసాలలో మామూలు రసాలలో కన్నా 40 శాతం అధిక పౌష్ఠికత ఉంటుందని సంస్థ ప్రతినిధి కృత్తిక తెలిపారు. బీపీ, షుగరు వంటి వ్యాధులు చర్మం, వెంట్రుకలు, రోగ నిరోధకత వంటివాటి కోసం పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు తాము పళ్లరసాలను తయారుచేసి సరఫరా చేస్తున్నామన్నారు. నగరంలో నాలుగువేల మంది క్లైంట్లు ఉన్నారని, నెలకు రూ.3,000కు 26 సీసాల పళ్ల రసాన్ని (250 ఎంఎల్)అందిస్తామని చెప్పారు. వ్యక్తులు తమ సమస్యకు అనుగు ణంగా నెల, మూడు నెలల ప్యాకేజీలను ఎంచుకోవచ్చన్నారు.
చిరుధాన్యాలతో ‘మావీ న్యూట్రిషన్’
జి.20 సదస్సుకు వచ్చిన నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ చిరుధాన్యాలతో చేసిన రకరకాల పదార్ధాలను తినిపించారు. చిరుధాన్యాల ప్రాధాన్యం వారికి తెలియ చేయడమే కాక, అవి ఎంత పౌష్టికతను ఇస్తాయో తెలియ చేయడమే అందులోని ప్రధాన ఉద్దేశం. చిరుధాన్యాలు సరే వాటితో ఏమేం వండి వడ్డించుంటారో కదా అనుకున్నామప్పుడు, కానీ ఏమైనా చేసుకోవచ్చని రుజువు చేస్తోంది మావీ న్యూట్రిషన్ సంస్థ ఇన్‌స్టాంట్ ఇడ్లీ, దోశ పిండ్ల దగ్గర నుంచి నూడుల్స్, పలావ్, రోటీల వరకూ తయారు చేసి వినియోగదారులకు అందిస్తోంది. వీరి ఉత్పత్తులలో ముఖ్య ఆకర్షణ ‘టీ కప్పులు’, మనం ఐస్‌క్రీం కోన్‌ను తిన్నట్టుగానే టీతో పాటు తినే విధంగా తయారు చేసిన కప్పులు చూడముట్టగా అనిపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి చిరుధాన్యాలను సేకరించి, వీటిని తయారు చేస్తున్నామని, పౌష్టికాహార నిపుణుల సలహా మేరకే తమ పదార్ధాలలోని పాళ్లు ఉంటాయని వివరించారు. అన్ని వయసుల వారికీ తగిన ఆహార పదార్ధాలను తయారు చేస్తున్న ఈ సంస్థకు ఆన్‌లైన్ డెలివరీ సౌకర్యం కూడా ఉన్నది.
స్వదేశీ ఉత్పత్తులు
ఏ మాత్రం రసాయనాలు లేని జీవ వ్యవసాయం ద్వారా పండిన వస్తువులను, చేత్తో తయారు చేసిన సబ్బులనూ ప్రదర్శనకు పెట్టిన రాజుశెట్టి, తాను 2017లో పొందిన వ్యవసాయ శిక్షణే తనకు స్ఫూర్తినందించిందని చెప్పారు. ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలిగించని, రసాయన రహిత ధాన్యాలను, సువాసనలు వెదజల్లే నెయ్యి, నూడుల్స్, బిస్కెట్లు తదితరాలను ప్రదర్శనకు పెట్టారు. ఇందులో రసాయన రహితంగా చేసిన అత్తర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పసి పిల్లలకు కూడా పూసేందుకు వీలుగా ఎటువంటి రసాయనాన్ని వాడకుండా వాటిని తయారు చేశామని ప్రదర్శకులు చెప్పారు. రసాయన ఆధారిత వస్తువులు కాకుండా మనకు సంప్రదాయంగా వస్తున్న గోమూత్రం, పేడ వంటివి ఉపయోగించి చేసే వ్యవసాయం ద్వారా వచ్చే వస్తువులు మనిషి ఆరోగ్యాన్ని అన్నిరకాలుగా సంరక్షిస్తాయని ఆయన చెప్పారు. తాము ఇంటికి కూడా సరుకును పంపే సౌకర్యాన్ని కలిగి ఉన్నామని, కూకటపల్లి మెట్రో స్టేషన్ పక్కనే తమ స్టోర్ ఉంద న్నారు.
అర్బన్ క్లాప్‌కు ప్రత్యామ్నాయం సహాయక్
నేటి బిజీ జీవితంలో అనేక పనులకు వ్యక్తులు ఆన్‌లైన్‌పైనే పడుతున్నారు. ఇల్లు సర్దడం నుంచి క్షవరం చేయడం వరకూ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుని, ఇంటికి పిలిపించి పూర్తి చేసుకుంటు న్నారు. అయితే, ఇటువంటి యాప్‌ల ద్వారా వచ్చేవారి కారణంగా జరుగుతున్న దుస్సంఘట నలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందుకే, జనహిత సేవా ట్రస్ట్ సహాయక్ యాప్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. తమ యాప్‌లో బుక్ చేసుకున్న వారికి తమ వద్ద శిక్షణ పొందిన వ్యక్తులను పంపుతామని, నిర్వాహకులు యనమండ్ర గణేశ్ తెలిపారు.
డ్రోన్ దీదీలకు డ్రోన్లు
ప్రస్తుతం వ్యవసాయంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది. పైగా రసాయనాలను నేరుగా వ్యక్తులే జల్లడం వల్ల ఆరోగ్యపరమైన దుష్పరిణా మాలు సంభవిస్తున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగా, దేశీయంగా తయారు చేసిన డ్రోన్లను ఏరియల్ టెక్నాలజీస్ సంస్థ ప్రదర్శనకు పెట్టింది. ప్రధాన మంత్రి డ్రోన్ దీదీల పథకానికి అనుగుణంగా తయారు చేసిన ఈ డ్రోన్ వ్యవసాయంలో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపుతో అవసరమైన ఎరువులను జల్లేందుకు ఉపయోగించవచ్చు. సుమారు ఏడు లక్షల రూపాయల విలువైన ఈ డ్రోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా కూలీ రేట్లను తగ్గించుకోవడమే కాదు, ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చని, సంస్థ యజమాని రమేష్ తెలిపారు. కేవలం పావు గంటలో ఒక ఎకరానికి ఎరువును జల్లడమే కాకుండా, మామూలుగా జల్లే ఎరువులో 15 నుంచి 25 శాతం ఎరువును ఆదా చేయవచ్చని ఆయన వివరించారు. ఈ మేళాలో ప్రధానంగా దేశీయంగా తయారు చేసిన వస్తువులే కాదు, స్వయంగా తయారు చేసిన వస్తువులను కూడా ప్రదర్శించడం విశేషం. గానుగాడించిన నూనెలు, ఇంట్లో చేసిన స్నాక్స్‌తో పాటుగా, దేశవాళీ విత్తనాలు, ఏకల్ అభియాన్ వారి దుకాణాలు, ఆయుర్వేద క్లినిక్, మూలికలతో తయారు చేసిన దవా చాయ్ స్టాల్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కృషి విజ్ఞాన కేంద్రం వారి ఉత్పత్తులు, వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత చీరలు, డ్రస్సులు, స్వెట్టర్లు, సాహితీ నికేతన్ వారి పుస్తకాలయం, గోమయంతో చేసిన ప్రమిదలు, వస్తువులను ప్రదర్శించారు. దాదాపు యాభై వేల మందికి పైగా ప్రజలు ఈ మేళాను సందర్శించారు.
– డి. అరుణ
ఫోటోలు : ఎన్. రవీంద్ర