అమెరికా అధ్యక్షపీఠం మీద ఎవరు ఉన్నా, ప్రపంచ పరిణామాలను శాసిస్తారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా అది అగ్రరాజ్యం. అటు గెలుపు ధీమాతోనే ఉన్నా, ఒక తీవ్ర ఉత్కంఠ మధ్య అమెరికా అధ్యక్ష పదవికి మరొకసారి ఎన్నికైన డొనాల్డ్ ‌జాన్‌ ‌ట్రంప్‌ ‌నిజంగానే చరిత్ర సృష్టించారు. కొన్ని చీకటికోణాలు ఉన్నా శ్వేతసౌధాన్ని ఆయనకే అప్పగించాలని అమెరికా ప్రజలు నిశ్చయించారన్నది రూఢి అయింది. అమెరికాకే తొలి ప్రాధాన్యం అన్న నినాదంతో ఆయన ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మలుచుకుని 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పిలుపు వెనుక లోతైన పరిణామాలనే ప్రపంచం చూస్తున్నది. మిత్రులు ‘డాన్‌’ అని పిలుచుకునే డొనాల్డ్ ‌ట్రంప్‌ అమెరికాకు స్వర్ణయుగం తెస్తానని విజయోత్సవంలో ప్రకటించారు. వ్యాపారవేత్త హృదయం ఉన్న ఈ రాజకీయవేత్త ప్రపంచ ఆర్థిక పరిణామాలను కొత్తదారులు తొక్కించడం నిశ్చయమన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సంక్షోభాల అన్నింటి నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉన్న తన ప్రమేయాన్ని అమెరికా నియంత్రించు కుంటుందన్న అంచనాలు కూడా బలంగానే ఉన్నాయి. ఇదే పెద్ద పరిణామం. ట్రంప్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ ‌పార్టీ ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధానికి మొదటి నుంచి వ్యతిరేకమే. తాము అధికారంలోకి వస్తే ఒక్కరోజులోనే ఆ యుద్ధాన్ని ముగిస్తామని చాలాకాలం కిందటే ఆ పార్టీ ప్రకటించింది. యుద్ధం నిలిపి వేయడం గురించి ఆలోచించండని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను  ట్రంప్‌ ‌కోరవచ్చు. ఆయన సరేనని అనవచ్చునని బీబీసీలో ఒక వ్యాఖ్యాత చెప్పడం విశేషం. ఒకవేళ ట్రంప్‌ ‌మాటకు పుతిన్‌ ‌ప్రతికూలంగా స్పందిస్తే కొత్త అధ్యక్షుడు తీవ్రంగానే ప్రతిస్పందిస్తా రన్న అంచనా కూడా ఉంది. ట్రంప్‌ ‌గెలుపు కొన్ని కోణాల నుంచి భారత్‌కు శుభ పరిణామం. ఆయన చైనాను వాణిజ్య రంగ శత్రువుగా చూస్తారు. పాకిస్తాన్‌ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఈ రెండూ భారత్‌కు మేలు చేసేవే. పూర్తి మద్దతు ఇచ్చే అధ్యక్షుడు అమెరికాకు వచ్చినందుకు హమాస్‌ ఇం‌తకు ముందు వలె ఇజ్రాయెల్‌ ‌మీద దూకుడు ప్రదర్శించలేకపోవచ్చు. తాను యుద్ధాలను అపుతానని చెప్పాడు కాబట్టి ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధం కూడా త్వరలోనే ముగిసిపోతుందన్న ఆశాభావం కనిపిస్తున్నది. తన ఎన్నిక చరిత్రాత్మకమని గొప్ప స్థయిర్యంతో చెప్పుకున్న ట్రంప్‌, ‌తాను మళ్లీ గెలవడమంటే అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ పరిణామమని కూడా వ్యాఖ్యానించారు. తన మీద జరిగిన హత్యాయత్నాన్ని కూడా వమ్ము చేసి, భగవంతుడు జీవితం ఇచ్చాడంటే తన వల్ల జరగవలసిన పనేదో ఉందనే అనిపిస్తుందని ఇప్పుడు ట్రంప్‌ ‌నమ్ముతున్నారు. ఆ పని గురించి త్వరలోనే బయటపెట్టవచ్చు కూడా.

దాదాపు అందరూ ఊహించినట్టుగానే అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ‌ట్రంప్‌ ఎన్నిక ఖాయమైంది. పెద్దవయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడిగా కూడా ట్రంప్‌ (78) ‌నిలిచారు. క్రిమినల్‌ అభియోగాల్లో దోషిగా తేలిన మాజీ అధ్యక్షుడిగా ఒక చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ చరిత్రతో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత కూడా ఆయనదే! ఈ వ్యాసం రాసే సమయానికి మొత్తం 50 రాష్ట్రాల్లో నలభైఎనిమిదింట్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన సమయానికి ట్రంప్‌ అధికారానికి అవసరమైన 270 ఎలక్టోరల్‌ ఓట్లను దాటి 295 సాధించారు. డెమోక్రటిక్‌ ‌పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు 226 ఓట్లు లభించాయి. ట్రంప్‌కు ఇప్పటి దాకా 50.8%, కమలా హారిస్‌కు 47.5 శాతం ఓట్లు దక్కాయి. ట్రంప్‌కు 72734149 ఓట్లు రాగా, కమలా హారిస్‌కు 68049758 ఓట్లు సాధించారు. తరువాత జరిగిన లెక్కింపులో రిపబ్లికన్‌ ‌పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌చరిత్రను సృష్టించాడు. ఏకంగా 312 స్థానాలను, ఎవరికి ఓటు వేస్తారో అంచనా వేయలేని ఏడు స్వింగ్‌ ‌స్టేట్‌లను కైవసం చేసుకున్నాడు. చివరగా ఓట్లు లెక్కించిన నెవాడా, నార్త్ ‌కరోలినా, ఆరిజోనాలో కూడా రిపబ్లికన్లు నెగ్గడం గమనిస్తే, అక్కడి ప్రజలు అక్కడి గత పాలనతో ఎంత విసిగి ఉన్నారో తేలికగా అర్థమవుతుంది.

అధ్యక్ష ఎన్నికలతో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనెట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలో 435 స్థానాలకు పోలింగ్‌ ‌జరిగింది. వీటితోపాటు 11 రాష్ట్రాల గవర్నర్‌ ‌పదవు లకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో సెనెట్‌దే కీలకపాత్ర. నాలుగేళ్ల తర్వాత ఇందులో రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. తాజా సమాచారం మేరకు రిపబ్లికన్లు 52 స్థానాల్లో విజయం సాధించగా, డెమోక్రట్లు 45కు పరిమితమయ్యారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవా నడుస్తోంది. మెజారిటీ మార్కు 218 కాగా మొదటే వారికి 206 సీట్లు దక్కాయి. డెమోక్రాట్లు 192 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు.

నిండా ముంచిన బైడెన్‌

ఒకపక్క శాంతివచనాలు వల్లిస్తూనే ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహించే విధానాన్ని బైడెన్‌ అనుసరిం చడం డెమోక్రట్‌ ‌పార్టీని బాగా దెబ్బ తీసింది. నిజం చెప్పాలంటే గత 70ఏళ్ల కాలంలో అతితక్కువ ప్రజాదరణ పొందిన నాయకుడు జోబైడెనేనని గాలప్‌ ‌పోల్‌ ‌సర్వే తేల్చి చెప్పిన విషయం గుర్తుం చుకోవాలి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక, ఆయుధ సహాయం అందించడం, గాజాలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడం అమెరికా ప్రజలు ఇష్టపడలేదన్నది ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ట్రంప్‌ ఈ ‌రెండు అంశాలను సమర్ధంగా నిర్వహించి ఉండేవారన్నది ప్రజలు అభిప్రాయం. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం చేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో పడిపోయింది. ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్‌ ‌హామీ ఇవ్వడం రిపబ్లికన్లకు కలిసొచ్చింది. దేశంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతుంటే పట్టించుకోకుండా ఉక్రెయిన్‌కు కోట్ల డాలర్ల సహాయం అందించడం అమెరికన్లకు నచ్చలేదు. ట్రంప్‌కు గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టుంది. వలసలను అరికట్టే విషయం కఠినంగా వ్యవహరిస్తానంటూ ట్రంప్‌ ‌హామీ ఇవ్వడం, బైడెన్‌ ‌హయాంలో లక్షల సంఖ్యలో వలసలు పెరిగాయంటూ ఆయన గణాంకాలతో సహా వివరించిన తీరు అమెరికన్లను ఆకట్టుకుంది. వయసు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా అధ్యక్ష ఎన్నికల బరిలో జోబైడెన్‌ ‌నిలవడం డెమోక్రట్లను బాగా దెబ్బతీసింది. ఆయన తన మానసిక సంతుల్యత సరిగ్గా లేకపోవడాన్ని బయటపెట్టక పోవడం, ఆలస్యంగా బరినుంచి తప్పుకోవడం కమలాహారిస్‌ను నిండా ముంచింది. ముఖ్యంగా బైడెన్‌ ‌పాలనా శైలిపై అప్పటికే ప్రజల్లో పెరిగిపోయిన విసుగును డెమోక్రట్లు పట్టించుకోక పోవడం, తర్వాత తప్పు తెలుసుకొని, కమలా హారిస్‌ను రంగంలోకి దించి వ్యూహాన్ని మార్చినా అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది. ఒక రకంగా బైడెన్‌ ‌చేతగాని పాలనకు కమలా హారిస్‌ ‌బలైందని చెప్పాలి. బైడెన్‌ అసమర్థత, తప్పుడు విదేశాంగ విధానం ప్రజల్లో తెచ్చిన ప్రతికూలత కమలా హారిస్‌కు గుదిబండలా తయారై ఓటమికి కారణమైంది. అంతేకాదు మొదట్నుంచీ ఆమె అధ్యక్ష అభ్యర్థిగా బరిలో లేరు. ప్రచార పర్వంలో పుణ్యకాలం ముగిసాక బైడెన్‌ ‌తప్పుకోవడం, కమలా హారిస్‌ ‌పేరును ప్రకటించ డంతో తాను అనుసరించబోయే విధానాలపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని ఏర్పరచుకోలేకపోయారనే చెప్పాలి. ఫలితంగా బైడెన్‌ ‌బాటలోనే ఈమె కూడా పయనిస్తారన్న అభిప్రాయం అమెరికన్లలో ఏర్పడటం కూడా ఆమె వెనుకబాటుకు మరో కారణం.

ఇలాన్‌ ‌మస్క్ ‌హవా

2016లో డోనాల్డ్ ‌ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఇలాన్‌ ‌మస్క్ ఈసారి ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇవ్వడం విశేషం. అంతేకాదు ట్రంప్‌ ‌విజయం కోసం, రిపబ్లికన్‌ ‌పార్టీకి అత్యధిక నిధులు సమకూర్చింది కూడా ఇలాన్‌ ‌మస్కే! విషయ మేంటంటే ట్రంప్‌, ఇలాన్‌ ‌మస్క్ ఇద్దరూ గొప్ప వ్యాపారవేత్తలు మాత్రమే కాదు బిలియనీర్లు. వ్యాపారవేత్త ఆలోచన ఎప్పుడూ ఆర్థిక పరమైన లాభాలపై ఉంటుంది తప్ప యుద్ధాలు, నష్టాలపై కాదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు మద్దతుగా చేసిన ప్రచారంలో అమెరికా ఆర్థిక పరిస్థితి డొల్లతనాన్ని బయటపెట్టారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని డోనాల్డ్ ‌ట్రంప్‌కు అనుకూలంగా మార్చిన గొప్ప వ్యూహకర్తగా పేరు సంపాదించుకున్నారు. కొత్త స్టార్‌ ‌కాంపెయినర్‌ ‌తయారయ్యారంటూ ట్రంప్‌ ‌కూడా ఇలాన్‌ ‌మస్క్‌ను ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇలాన్‌ ‌మస్క్‌కు, ఏదో ఒక మంత్రిపదవి దక్కే అవకాశమున్నదన్న వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, ప్రస్తుత ఎన్నికల్లో చేసిన ప్రచారం, ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం భవిష్యత్తులో అమెరికా అధ్యక్షపదవికి పోటీపడే స్థాయికి ఇలాన్‌ ‌మస్క్‌ను తీసుకెళ్లకూడదనేం లేదు.

ఈయూ దేశాలపై సుంకాల పిడుగు!

తాను ఎన్నికైతే ప్రపంచ దేశాలనుంచి దిగుమతు లపై సుంకాలు విధిస్తానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారం సమయంలో గట్టిగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎంతవరకు ఈ మాటను నిలుపుకుంటారనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యరంగ నిపుణుల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. స్వతహాగా పెద్ద వాణిజ్యవేత్త అయిన ట్రంప్‌, ‌దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం, అమెరికన్ల ఉద్యోగాల రక్షణ, పన్ను ఆదాయం పెంచాలంటే ఈ టారిఫ్‌ల పెంచకతప్పదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం విదేశీ దిగుమతులపై 10% నుంచి 20% వరకు టారిఫ్‌లు విధిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. ఎన్నిక ప్రచార సమయంలో ఆయన ఒకసారి మాట్లాడుతూ, ‘‘యూరోపియన్‌ ‌యూనియన్‌ అం‌టేనే ఎంతో వినసొంపుగా ఉంటుంది. కానీ ఈ చిన్న దేశాల్లో ఏదీ కూడా అమెరికా ఉత్పత్తిచేసే కార్లను లేదా వ్యవసాయ ఉత్పత్తును కొనుగోలు చేయవు. కానీ వాళ్లు యు.ఎస్‌.‌కు మిలియన్లకొద్దీ డాలర్ల విలువైన కార్లను ఎగుమతి చేస్తారు. ఇందుకు కచ్చితంగా వాళ్లు మూల్యం చెల్లించక తప్పదు’’ అని అన్నారు. ట్రంప్‌ ‌విజయం వార్త వెలువడిన వెంటనే వోక్స్‌వాగన్‌, ‌బి.ఎం.డబ్ల్యు, మెర్సిడిస్‌ ‌కార్ల కంపెనీల షేర్లు 5 నుంచి 7శాతం వరకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈయూ దేశాలు అమెరికాపై ప్రతీకార చర్యలకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకుముందు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు టారిఫ్‌లపై ట్రంప్‌ ‌చేసిన ప్రకటనను ఈ దేశాల మంత్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దిగుమతి సుంకాలు విధించిన తర్వాత కానీ వాళ్లకు ట్రంప్‌ ఏం‌టో అర్థం కాలేదు. ఈ అనుభవ నేపథ్యమే ప్రస్తుతం అవి తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రధాన కారణం. గతంలో ఈయూ దేశాలు అమెరికా కంపెనీ హార్లీ డేవిడ్‌సన్‌ ‌మోటారుసైకిళ్ల దిగుమతులపై సుంకాలు విధించిన చరిత్ర వుంది. ట్రంప్‌ ‌తీసుకునే చర్యలవల్ల వాణిజ్య యుద్ధాలకు తెరతీసి, ప్రపంచ ఆర్థిక వ్యస్థ 7% వరకు పతనమయ్యే అవకాశ ముందని ఐ.ఎం.ఎఫ్‌. అం‌చనా వేస్తోంది. ఇది ఫ్రాన్స్, ‌జర్మనీల మొత్తం ఆర్థిక వ్యవస్థలకు సమానం.

యు.కె. తటస్థం!

ఇక యు.కె. విషయానికి వస్తే బ్రిగ్జిట్‌ ‌తర్వాత ఆ దేశం ఏ దిశగా పయని స్తున్నదీ స్పష్టత రాలేదు. యు.ఎస్‌.‌కు అత్యంత సన్నిహిత దేశంగా ఉన్నప్ప ప్పటికీ, తనకు ఈయూ దేశాలతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సన్నిహిత సంబంధాల నేపథ్యాన్ని విస్మరించలేదు. ప్రస్తుతం అది ఈయూ దిశగానే వెళుతోంది. ముఖ్యంగా ఆహారం, వ్యవసాయ ప్రమాణాలు ఈయూ దేశాలకు దగ్గరగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో యు.ఎస్‌. ‌తో సన్నిహితం కావడం కొంచెం కష్టమే. ఉభయ తారకంగా ఈయూ, యు.ఎస్‌.‌ల మధ్య తటస్థవైఖరి అవలంబించే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వస్తు వాణిజ్యం, ఔషధాలు, కార్ల రంగాల విషయంలో వాణిజ్య యుద్ధాలకు దిగడానికి యు.కె. ఎట్టిపరిస్థి తుల్లో ముందుకు రాదు. మొత్తంమీద చెప్పాలంటే ట్రంప్‌ అధికారంలోకి రావడం యూరప్‌ ‌దేశాలపై వాణిజ్యపరంగా ప్రతికూల ప్రభావం పడక తప్పదనే చెప్పాలి. ఇతర దేశాల దిగుమతులపై 20% వరకు సుంకం విధిస్తామన్న ట్రంప్‌, ‌చైనా ఉత్పత్తులపై 60%, మెక్సికో తయారీ వాహనాలపై ఏకంగా 2వేల శాతం టారిఫ్‌ ‌విధిస్తానని స్పష్టం చేశారు. మొత్తంమీద పరిశీలిస్తే ‘టారిఫ్‌’ ‌ట్రంప్‌కు అత్యంత ఇష్టమైన పదంగా కనిపిస్తోంది.టారిఫ్‌లు విధించే విషయంలో ట్రంప్‌ ‌రెండు విధానాల్లో ఏదో ఒకటి అనుసరించే అవకాశముంది. సుంకాలను విధిస్తామని బెదిరిస్తూ, ఇతరదేశాలతో బేరసారాలకు దిగడం ఒకటి కాగా, నిక్కచ్చిగా అధిక సుంకాలు విధించడం రెండో పద్ధతి.

ఆసియాదేశాలపై ముఖ్యంగా చైనాపై ట్రంప్‌ ‌ప్రధానంగా తన ‘టారిఫ్‌’ అ‌స్త్రాన్ని ప్రయోగించడం తథ్యం. 2016లో ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి అనుభవాలు చైనాకు బాగానే గుర్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండదు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్‌ ‌టారిఫ్‌ల గురించి విస్తృతంగా మాట్లాడిన నేపథ్యంలో ఎందుకైనా మంచిదని చైనా జాగ్రత్త పడుతోంది. ముఖ్యంగా దీన్ని తట్టుకోవడానికి దేశీయంగా ఉద్దీపన ప్యాకేజీలు అమలు పరచేందుకు సిద్ధమైంది. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థను 5%వరకు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

విధానాలు మారవు!

ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాలపై అమెరికా విధానంలో మార్పులు ఉండబోవన్న సత్యాన్ని గుర్తించాలి. ముఖ్యంగా గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల విషయానికి వస్తే, ‘ప్రజాస్వామ్యం వర్సెస్‌ ‌నిరంకుశత్వం’, ‘పశ్చిమ వర్సెస్‌ ‌తూర్పు’, అనే అంశాలు చైనా కేంద్రంగా ప్రాధాన్యత వహిస్తాయనడంలో సందేహం లేదు. విచిత్రమేమంటే ఇక్కడ ‘గ్లోబల్‌ ‌సౌత్‌, ‌గ్లోబల్‌ ‌నార్త్’ అనే అంశం కంటే పై విషయాలకే ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ దేశాలకు, మిగిలిన దేశాలకు మధ్య సంపద విషయంలో అంతరాలు తీవ్రస్థాయిలో కొనసాగుతుండటం ఇందుకు ప్రధాన కారణం. యు.ఎస్‌. ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా విదేశాంగ విధానంలో పెద్దగా మార్పు ఉండదు. చారిత్రకంగా పరిశీలిస్తే గ్లోబల్‌ ‌నార్త్, ‌గ్లోబల్‌ ‌సౌత్‌ను దారుణంగా అణచివేసిందనేది సత్యం. భారత్‌ ‌గ్లోబల్‌ ‌సౌత్‌ ‌వాణిని గట్టిగా వినిపించడానికి ప్రధాన కారణం ఇదే. ఈ నేపథ్యంలో ప్రపంచ పాలనా వ్యవస్థలో మార్పుల కోసం అమెరికాపై ఆధారపడటానికి గ్లోబల్‌ ‌సౌత్‌ ‌నాయకులు ఇష్టపడటం లేదు. ప్రత్యామ్నాయ వేదికల ద్వారా తాము బలపడాలని గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని ‘‘రూల్స్ ‌బేస్డ్ ఆర్డర్‌’’‌ను ఇవి వ్యతిరేకించడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఒకేరకమైన నియమనిబంధనలు అమలు కావాలని కోరుతున్నాయి. ప్రస్తుత ‘‘రూల్స్ ‌బేస్డ్ ఆర్డర్‌’’ ‌కారణంగా కొద్ది సంఖ్యలో ఉన్న పశ్చిమ దేశాలు, మొత్తం ప్రపంచ దేశాలను శాసించడం కొనసాగడానికి వీల్లేదన్నది వీటి వాదన. అదీ కాకుండా అమెరికా విదేశాంగ విధానం అనుసరిస్తున్న ఈ రూల్స్ ‌బేస్డ్ ఆర్డర్‌ ‌పశ్చిమదేశాలకు అనుకూలంగా, మిగిలిన దేశాలపట్ల వివక్షతో కూడి ఉండటం కూడా గ్లోబల్‌ ‌సౌత్‌లో దీనిపట్ల వ్యతిరేక తకు మరో కారణం. బ్రిక్స్ ‌వంటి వేదికలు వెలుగు లోకి రావడానికి ఇదే ప్రధాన కారణం.

మార్కెట్లలో సానుకూలత

ట్రంప్‌ ఎన్నికైన వెంటనే యు.ఎస్‌., ఇం‌డియా మార్కెట్లలో సానుకూలత వ్యక్తమైంది. ముఖ్యంగా ట్రంప్‌ ‌చైనా వ్యతిరేక వైఖరి, రష్యాతో సామరస్యం ఈ మార్కెట్లలో జోష్‌ ‌నిండటానికి ప్రధాన కారణం. భారత్‌కు కూడా టారిఫ్‌ల గండం లేకపోలేదు. అయితే ఐసీఈటీ, జీఈ-హెచ్‌ఏఎల్‌ల మధ్య యుద్ధ విమానాల ఇంజిన్ల ఒప్పందం కుదరడం, చైనా నుంచి యు.ఎస్‌.‌కు సరఫరా శృంఖలాలు తగ్గే అవకాశాలు మెరుగుపడటం మనదేశానికి ప్రయోజనకరం. ట్రంప్‌ ‌హయాంలో డాలర్‌ ‌మరింత బలపడి, మనదేశం నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోయే అవకాశాలున్నాయి. భారత్‌ ‌క్వాడ్‌లో కీలకమైన భాగస్వామిగా ఉన్నందున తయారీ, రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ సామర్థ్య కేంద్రాలనుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అందువల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులపై కంటే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్లనే మనకు అధిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ. క్వాడ్‌ ‌గ్రూపులో సభ్యురాలిగా, చైనాకు మనదేశం గట్టిపోటీదారుగా నిలవడం కూడా ఈ సానుకూలతలకు ఒక కారణం. భారత్‌, ‌దక్షిణాఫ్రికా దేశాలు దేశీయ అభివృద్ధి సంభావ్యత కలిగివుండటంవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో చోటు చేసుకునే అస్థిరతలు వీటిపై పెద్దగా ప్రభావం చూపవు. మరో విషయమేంటంటే చీలీ దేశం నుంచి ఎగుమతయ్యే లీథియం ఎగుమతులపై కూడా ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే ఈ లోహం అన్నిదేశాలకు ముఖ్యంగా అమెరికాకు అత్యవసరం!

యు.ఎస్‌. ‌దేశీయ పన్నుల్లో కోత, దిగుమతులపై సుంకాలను పెంచినట్ల యితే యూరో ఒక డాలర్‌కంటే దిగువకు, చైనా కరెన్సీ యువాన్‌ ‌విలువ మరింత పడిపోయే అవకాశముంది. ఒకరకంగా చెప్పాలంటే 2018-20 నాటి క్షీణతను మళ్లీ చూడవచ్చు. డాలర్‌ ‌విలువ పెరగడం వల్ల జపాన్‌ ‌కరెన్సీ యెన్‌, ‌స్విస్‌ ‌కరెన్సీ ఫ్రాంక్‌లతో వర్తకం మళ్లీ వృద్ధి చెందే అవకాశముంది. ట్రంప్‌ ‌క్రిప్టో కరెన్సీపై మరింత సరళంగా వ్యవహరించడం వల్ల బిట్‌కాయిన్‌ ‌మరింత ప్రయోజనం పొందగలదు. ఇప్పటికే అమెరికా స్టాక్‌ ‌మార్కెట్లలో బిట్‌కాయిన్‌ ఎం‌తో లాభపడింది. ఇక ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించినట్లయితే ప్రపంచ దేశాలకు తగినంత ముడిచమురు అందదు. ఈ నేపథ్యంలో అమెరికాలో అపరిమితంగా ఉన్న చమురు నిల్వల కారణంగా మార్కెట్‌లో ప్రభుత్వ భాగస్వామ్యం వల్ల వీటి ధరలు విపరీతంగా పెరి గే అవకాశముంది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం ద్వారా, చమురు ఉత్పత్తిలో ప్రధాన దేశంగా యు.ఎస్‌. ఎదగాలన్నది ట్రంప్‌ ‌లక్ష్యం. మధ్యప్రాచ్య దేశాలపై ఆంక్షలు విధించి, తన చమురును అధిక ధరకు అమ్ముకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నది ట్రంప్‌ అసలు ఉద్దేశం!

భారత్‌పై ప్రభావం

రష్యాతో మనకున్న సంబంధాలపై ట్రంప్‌ ‌పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కాకపోతే మన ఎగుమతులపై సుంకాలు పెంచుతూ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని మన దేశాన్ని కోరుతున్నారు. ఒకవేళ ఆవిధంగా చేస్తే 2028 నాటికి మన జీడీపీ 0.1శాతం పడిపోయే అవకాశముందని నిపుణుల అంచనా. ట్రంప్‌ ‌చైనాను గట్టి పోటీదారుగా పరిగణించడం వల్ల, ఆ దేశంపై చెక్‌ ‌పెట్టడానికి మనతో స్నేహ సంబంధాలను కొనసాగించే అవకాశాలే ఎక్కువ. విదేశీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాక్కుంటున్నారని వాదిస్తున్న ట్రంప్‌ ‌వీసా నిబంధనలను కఠినం చేస్తానని ఎన్నికల ప్రచారంలో హెచ్చరించినప్పటికీ, కార్పొరేట్‌ ‌పన్నుల్లో కోత విధించే దిశగా ట్రంప్‌ ‌యంత్రాంగం అడుగులు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే భారతీయ ఐటీ సంస్థల సేవలకు మరింత డిమాండ్‌ ‌పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఈ సంస్థలు యు.ఎస్‌. ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారతీయ ఐటీ రంగం విలువ దాదాపు 254 బిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లుగా ఉన్నప్పటికీ, అక్కడి కఠిన వీసా నిబంధనల కారణంగా హెచ్‌1-‌బి వీసాలపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి లేదు. ట్రంప్‌ ‌హయాంలో ఈ నిబంధనలు కొనసాగడంవల్ల మన ఐ.టి.రంగ నిపుణులకు అమెరికా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెరగడం, యు.ఎస్‌. ‌కంపెనీలు ఎక్కువగా ఖర్చు చేయడానికి ముందుకు రావడంవల్ల ఐటీ రంగం మంచి ఊపందుకునే అవకాశాలే ఎక్కువ.

లాభపడనున్న ఔషధరంగం

బలహీనమైన రూపాయి, చైనాపై దిగుమతులపై యు.ఎస్‌. ఆధారపడటం తగ్గడం వల్ల, భారతీయ ఫార్మాస్యూటికల్స్ ఎక్కువ లాభపడనున్నాయి. ముఖ్యం గా ట్రంప్‌ అనుసరించే చైనా వ్యతిరేక విధానంతో మన ఫార్మా రంగానికి మంచి ఊపు లభించనుంది. ముఖ్యంగా అమెరికా సంస్థలు జనరిక్‌ ‌మందుల కోసం మన దేశం వైపు చూడక తప్పదు. కాకపోతే యు.ఎస్‌.‌లో అమల్లో ఉన్న ఔషధ ధరల నియంత్రణ విధానాల విషయంలో మన ఫార్మా కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. టారిఫ్‌లను విపరీతగా పెంచేసి తయారీ రంగం వరకు చైనాపై ఆధార పడటాన్ని తగ్గించడంవల్ల, ఎలక్ట్రానిక్‌ ‌రంగంలో చైనా స్థానాన్ని మనదేశం భర్తీ చేయగలదు. ఇండో-పసిఫిక్‌ ‌ప్రాతంలో మనదేశ ప్రాధాన్యం రీత్యా ట్రంప్‌ ‌మనతో సానుకూలంగా వ్యవహరించక తప్పదు. యు.ఎస్‌. ‌ప్రయోజనాల పరిరక్షణకు ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య రక్షణరంగంలో మరింత సహకారం పెంపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రంగంలో స్టార్టప్‌లపై పెట్టుబడులు మరింత ఊపందుకోవచ్చు. ఇదేసమయంలో ట్రంప్‌ అనుసరించే ‘అమెరికా ఫస్ట్’ ‌విధానం వల్ల మన ఎగుమతుల్లో ఫార్మాస్యూటికల్స్, ‌వస్త్రాలపై దిగుమతి సుంకాలు పెరిగే అవకాశ ముంది. ఒకవేళ ట్రంప్‌ ‌ప్రభుత్వం మన దేశం నుంచి దిగుమతులపై సుంకాలు విధిస్తే, అందుకు దీటుగా భారత్‌ ‌ప్రతిక్రియకు తప్పనిసరిగా దిగుతుంది. ఎందుకంటే గతంలోని భారత్‌ ‌కాదు మరి! ట్రంప్‌ ‌ప్రభుత్వ హయాంలో డాలర్‌ ‌మరింత బలోపేతమై, రూపాయి బలహీనపడితే ఇది మొత్తంమీద మనదేశ ఆర్థిక స్థిరత్వం మీద ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

ఊపిరి పీల్చుకున్న భారత్‌

‌ప్రస్తుతం ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న పోరులో అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్‌ ‌పక్షం వహించడమే కాకుండా, ఇరాన్‌ ‌సరిహద్దులో భారీ యుద్ధ నౌకలను మోహరించింది. ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్‌ను పూర్తిగా కోలుకోకుండా దెబ్బతీయడం. ఇది జో బైడెన్‌ అనుసరించిన విధానం. కానీ ఇరాన్‌కు రష్యా మద్దతుంది. విచిత్రమేమంటే మనదేశానికి అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌, ‌రష్యాలు మిత్రదేశాలే. జోబైడెన్‌ ఇరాన్‌కు వ్యతిరేకంగా అనుసరించిన విధానాల వల్ల చబ్బహార్‌ ‌పోర్ట్‌లో మన వాణిజ్య కార్యకలాపాలకు విఘాతం ఏర్పడటమే కాదు, సెంట్రల్‌ ఆసియాతో మన వాణిజ్య సంబంధాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ట్రంప్‌ ‌యుద్ధాలు వద్దనే విధానాన్ని అనుసరించబోతున్నట్టు స్పష్టంగా ప్రకటించడమే కాదు, ఉగ్రవాదంపై పోరు కొనసాగు తుందని స్పష్టం చేయడం భారత్‌కు సానుకూల పరిణామం. అయితే ఇరాన్‌ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయాలని ఆయన ఇజ్రాయెల్‌ను కోరారు. ఇజ్రాయెల్‌ ‌నేత బెంజిమన్‌ ‌నెతన్యాహుకు కావలసిందిదే. ఆ తర్వాత యుద్ధాన్ని నిలిపివేయా లన్నది ట్రంప్‌ అభిమతం. ఈ విధానం వల్ల మధ్యప్రాచ్యం, సెంట్రల్‌ ఆసియాలో భారత్‌ ‌వాణిజ్య విధానాలకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. నార్త్ ‌సౌత్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కారిడార్‌ (ఎన్‌.ఎస్‌.‌టి.సి) పనులతో పాటు వాణిజ్యం యథాతథంగా కొనసాగుతాయి. ట్రంప్‌ ‌వల్ల భారత్‌కు ఒనగూడుతున్న ప్రయోజనం ఇది.

ఇంటర్నేషనల్‌ ‌నార్త్-‌సౌత్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కారిడార్‌ (ఎన్‌ఎస్‌టీసీ) అంటే…

భారత్‌, ఇరాన్‌, ‌రష్యాల మధ్య ఎన్‌ఎస్‌టీసీ ఏర్పాటుకు 2002లోనే ఒక అంగీకారం కుదిరింది. దీనివల్ల సెంట్రల్‌ ఆసియా, రష్యాలతో భారత్‌ ‌వాణిజ్యం నెరపడానికి రవాణా ఖర్చు 30శాతం, దూరం 40శాతం తగ్గుతుంది. ఈ మొత్తం దూరం 7200 కిలోమీటర్లు. నౌక, రైలు, రోడ్డు మార్గాల ద్వారా భారత్‌, ఇరాన్‌, అజర్‌బైజాన్‌, ‌రష్యా, సెంట్రల్‌ ఆసియా, యూరప్‌ ‌దేశాల మధ్య వాణిజ్యం మరింత ఊపందుకునేందుకు ఇది దోహదపడుతుంది. సంప్రదాయికంగా జరిపే వాణిజ్యంతో పోలిస్తే ప్రతి 15 టన్నులకు అయ్యే ఖర్చులో 2500 డాలర్ల వరకు తగ్గుతుందని నిరూపణ అయింది కూడా. అష్కాబాత్‌ ఒప్పందం పేరుతో కుదిరిన ఈ బహుళ నమూనా ఒప్పందంపై ఇండియా, ఒమన్‌, ఇరాన్‌, ‌తుర్క్‌మెని స్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ‌కజకిస్తాన్‌ ‌దేశాలు సంతకాలు చేశాయి.

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధానికి ముగింపు?

జోబైడెన్‌ అనుసరించిన మరో వినాశనకర విధానం రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని రావరణకాష్టంలా కొనసాగించడం. మిలియన్లకొద్దీ డాలర్లను ఉక్రెయిన్‌కు సహాయంగా అందించి రష్యాను దెబ్బకొట్టాలన్న ఆయన విధానం పూర్తిగా విఫలమైంది. అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవడమే కాదు చివరకు కమలా హారిస్‌ ‌పరాజయానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌, ఈ ఉ‌క్రెయిన్‌ ‌యుద్ధంకోసం పన్ను చెల్లింపుదార్లు చెల్లించే మొత్తం ఏవిధంగా వృధా అవుతోందనేది గణాంకాలతో సహా ప్రజల ముందుంచడంలో విజయం సాధించారు. డీప్‌స్టేట్‌ ‌పాలిటిక్స్‌లో భాగంగా కొనసాగిన ఉక్రెయిన్‌ ‌యుద్ధానికి ట్రంప్‌ ‌పూర్తి వ్యతిరేకి. ఆయనపై హత్యాయత్నాలు కొనసాగడానికి కారణం ఈవిధంగా వ్యతిరేకించడమేనన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అందించే సహాయాన్ని అమెరికా నిలిపివేయడం వల్ల రష్యాతో యుద్ధం ఆగిపోతుంది. రష్యా కోరుకుంటున్నది కూడా ఇదే. రష్యాను బలవంతంగా యుద్ధంలోకి లాగింది కూడా ఈ డీప్‌స్టేట్‌ ‌పాలిటిక్స్ ‌మాత్రమే! ట్రంప్‌ ‌విజయంతో రష్యాలో పండుగ వాతావరణం నెలకొనగా, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీకి అశనిపాతంగా మారింది.

ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్

అమెరికా 50వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జె.డి. వాన్స్ ‌పేరు ఇప్పుడు భారత్‌లో అందరికీ పరిచితమే. అతడి శ్రీమతి భారతీయ సంతతికి చెందిన మహిళ కావడమే. అంతేకాదు, అమెరికా చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడిగా 40 ఏళ్ల వాన్స్ ‌చరిత్ర సృష్టించాడు.  తొలుత ట్రంప్‌ ‌విమర్శకుడుగా ఉన్న అతడు  ఇప్పుడు ఏకంగా ఉపాధ్యక్ష పదవికి ఎదిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అతడు ట్రంప్‌పై మామూలు విమర్శలు చేయలేదు. ఏకంగా సాంస్కృతిక హెరాయిన్‌ (‌మాదక పదార్ధంతో) ట్రంప్‌ను పోల్చాడు. అయినప్పటికీ, ట్రంప్‌ అం‌దరినీ వదిలి జె.డి.వాన్స్‌ను ఉపాధ్యక్షుడిగా ఎంచుకున్నప్పుడు అందరూ విస్మయం చెందారు.

వాన్స్ శ్రీ‌మతి ఉషా చిలుకూరి వాన్స్ ‌తల్లిదండ్రులు ఆంధప్రదేశ్‌కు చెందిన వారు. వారు 1980వ దశకంలో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తల్లిదండ్రులు కృష్‌ ‌శాస్త్రి, లక్ష్మి ఉన్నతవిద్యావంతులు కావడమే కాదు, అధ్యాపక వృత్తిలో ఉన్నవారు కావడం విశేషం. ఉష తాత రామశాస్త్రి భారత్‌లో ఐఐటి చెన్నై వ్యవస్థాపక ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన సోదరుడు చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆంధ్రా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా సేవలందించడమే కాదు, ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శాఖకు అధిపతిగా వ్యవహరించారు.

-జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE