అక్కడ.. బాల్యానికి హిందూ జీవన విధానం పరిచయమైంది…

అందులోని సౌందర్యం, సమానత, ఐక్యతల అనుభవమైంది..

కుటుంబాల్లో మరుగునపడిపోతున్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనశైలి ఆవిష్కృతమైంది…

నేటి సమాజంలో బలపడుతున్న విషానికి విరుగుడు మన జీవన విధానమేనని మార్గదర్శనం అందించింది..

మన జీవనం అంటే బయట పెద్ద తెరమీద, ఇంట్లో బుల్లి తెరమీద, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి ఓటీటీ వేదికల్లో చూపేది కాదని తెలిసేలా చేసింది…

హిందూ నాగరికత, ఒక జాతిగా భారత్‌ పట్ల ఉన్న దురభిప్రాయాలను తొలగించడమే లక్ష్యంగా…

అన్నీ విస్మరించి కాలంతోపాటు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు మర్చిపోతున్న విషయాలను  జ్ఞాపకం చేసింది

ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఎత్తు అయితే, అందులో పాల్గొంటున్న బాలబాలికలకు కార్యక్రమం పట్ల ఆసక్తి, ఉత్సాహం జావగారకుండా పకడ్బందీగా రూపొందించి, వారిని కట్టిపడేసింది ‘హిందూ స్పిరిచ్యువల్‌ సేవా ఫౌండేషన్‌’ ఫెయిర్‌.

—————

భవిష్యత్‌ తరాలను ప్రభావితం చేస్తున్న నేటి సామాజిక పరిస్థితుల నుంచి వారిని తప్పించి, భారతీయతకు వారసులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో భాగ్యనగరంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు జంటనగరాల్లో అనేక పాఠశాలల నుంచి విద్యార్ధినీ విద్యార్ధులు హాజరై ఉత్సాహంగా పాలుపంచు కున్నారు.

ఏమిటీ హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌?

బహుళంగా ఉన్న హిందూ ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నతమైన స్ఫూర్తితో ప్రజా సేవ చేసేందుకు ప్రేరణ కలిగించి, ప్రోత్సహించి, కొనసాగించేందుకు, భారతదేశ వ్యాప్తంగా మేళాలను, కార్యక్రమాలను నిర్వహించడం ప్రాథమిక లక్ష్యంగా హిందూ స్పిరిచ్యువల్‌ సేవా ఫౌండేషన్‌ పని చేస్తోంది. విలువలను, నాగరికతా ధర్మాలను ప్రోత్సహించేం దుకు భారతదేశ వ్యాప్తంగా  గోష్టులు, సదస్సులు, సమావేశాలు, వర్క్‌షాప్‌్‌లు నిర్వహిస్తుంది. డా॥ రమేష్‌ ప్రభు వర్సెస్‌ ప్రభాకర్‌ కాశీనాథ్‌ కుంతే (1995) కేసులో సుప్రీం కోర్టు ‘హిందుత్వం’ అన్న పదానికి ఆపాదించిన అర్థానికి అనుగుణంగా, ‘హిందుత్వ’ను సంకుచిత మతపరమైన భావనగా కాక భారత ప్రజల సంస్కృతీ, ఆచార వ్యవహారాలను ఆవరిస్తూ, వారి జీవన విధానాన్ని అభివర్ణించేలా ఉండాలని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ భావిస్తుంది.

ప్రారంభ సమావేశం

నవంబర్‌ 7వ తేదీ సాయంత్రం జరిగిన ప్రారంభ సమావేశంలో  ఆశీః ప్రసంగం చేస్తూ ఇన్ని సేవా సంస్థలు తమ శక్తిని, యుక్తిని సమాజానికి అందిస్తున్నాయి, మన సమాజం అందుకుంటున్నది అనే విషయాన్ని తెలిపేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ప్రశంసించారు. భారతీయులు ఎప్పుడూ ప్రచారం కోరుకోలేదని, వారికి ఎప్పుడూ మార్కెటింగ్‌ స్ట్రాటజీల అవసరం పడలేదని, ఎందుకంటే స్వార్ధంగా పరిధులు నిర్ణయించుకున్న వ్యక్తులు వారు కాకపోవడమేనని ఆయన అన్నారు. ప్రస్తుత ఈ సభ, ప్రదర్శన అన్నీ కూడా భారతీయ స్ఫూర్తిని, దాని విశిష్ట ఆత్మను ప్రదర్శిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. భూమినంతా కూడా ఒక కుటుంబమనుకునే విశాలత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులని శ్రీ జీయర్‌ స్వామి పేర్కొన్నారు. మనకు వనరులకు కొరతలేదు, నేడు వాటిని వినియోగించే వ్యక్తుల నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, మేధోపరమైన బానిసత్వంలో మనం జీవిస్తున్నామన్న విషయాన్ని ఆయన పట్టి చూపారు. మనకు స్వయంపోషకత్వం ఉన్నప్పటికీ, ఎక్కడి నుంచో వచ్చిన సాంకేతికతలను తెచ్చుకొని మనను మనం కోల్పోతున్నామంటూ స్వామీజీ అప్రమత్తం చేశారు. కొవిడ్‌ మహమ్మారి కాలంలో డబ్బున్నవారంతా ముందస్తు జాగ్రత్తగా అన్నట్టుగా ఆక్సిజన్‌ సిలిండర్లను, మందులను తెచ్చి నిల్వ ఉంచు కుంటున్న సమయంలో నెల్లూరులో ఆనందయ్య అనే వ్యక్తి ఇంట్లోని కొన్ని మొక్కలను ఉపయోగించి మందు చేసి ఇస్తే, అప్పటిదాకా ఆసుపత్రిలో రోజుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టినవారంతా, ఆయన ఇచ్చిన మందు తీసుకొని హాయిగా ఇంటికి నడిచివెళ్లిపోయారని, తర్వాత ఆయనపై ఒత్తిడి తెచ్చి, రాజకీయ నాయకులు ఆ ఫార్ములా తీసుకుని వేరే పేరుతో అందరికీ ఇచ్చి వాళ్లు సంపాదించు కున్నారంటూ గుర్తు చేశారు. మనకు సహజంగా ప్రాణాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని వీడ్స్‌ (కలుపుమొక్కలు) అనే పేరుతో బయటపారేస్తూ, విదేశీ మందులను మాత్రం నాణ్యమైనవిగా భావించే మనస్తత్వం ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఒకనాడు అరటిపండు తిని, అరగ్లాసు పాలు తాగి పడుకుంటే వ్యాధులు రావని అనేవారని, ఇప్పుడు పరాయి దేశానికి చెందిన ఆపిల్‌ను వాడే పద్ధతి స్వతంత్ర భారతం అయిన తర్వాత కూడా కొనసాగుతూ రావడం విచారకరమన్నారు. నేడు ఈ దేశానికి కూడా ఒక ఆత్మ ఉంది, చిత్తం ఉంది, సంకల్పం ఉంది, దీన్ని మళ్లీ చూపించాలని మన వారు నిర్ణయించడాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఈ దేశానికి సంబంధించినంతవరకూ ఏ వ్యక్తీ కూడా నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనుకోలేదని ఆయన అన్నారు.    సూర్య నమస్కారం చేసే ప్రతి వ్యక్తీ రోజుకు మూడు సార్లు ఆయనకు నమస్కరించిన తర్వాత లోకాస్సమస్తా సుఖినోభవంతు అనుకుంటాడని, మన పూర్వీకులు చేసిన ఈ అలవాటు నేటికీ కొనసాగుతోందని అన్నారు.

మన రుషులు, మునులు, బోధించిన ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న బోధపై దృష్టి పెట్టినట్టు ఈ ప్రదర్శన పట్టి చూపుతోందని, రామకృష్ణ మఠం, నిర్వాహకులు స్వామి శితికంఠా నంద స్వామి ప్రశంసించారు. మానవాళి దైవత్వాన్ని సాధించే సాధనంగా సేవా మార్గాన్ని మన రుషులు మనకి చూపారని ఆయన అన్నారు. సనాతన ధర్మంలో నిస్వార్ధ సేవకు మరో పేరుగా, మహోన్నత వ్యక్తిత్వాలుగా కీర్తినందుకున్న దధీచి, శిబి మహారాజు, రంతి దేవుడిని ఉదంతాలను ఆయన ప్రస్తావించారు. గుర్తింపును ఆశించకుండా సమాజ సేవ చేస్తున్న వ్యక్తులు, సంస్థలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రదర్శన మనకు పట్టి చూపుతోందని ఆయన పేర్కొన్నారు. మన అహాన్ని నిర్మూలించుకోవ డానికి మార్గంగా సేవ అనే అంశంపై అనేక బోధలు చేసిన స్వామి రంగనాథానంద మాటలను ప్రస్తావిం చారు. సేవా ప్రదర్శినిలో భాగంగా నిర్వహించనున్న కన్యావందనం, గురు వందనం, మాతృ`పితృ వందనం కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆయన ఆశీస్సులు అందించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిలభారత కార్యకారిణి సభ్యులు భాగయ్య  ప్రసంగిస్తూ, భారతీయ మౌలిక స్వభావం, దాని సాంస్కృతిక తాత్వికత, ఆత్మ విశ్వాసానికి హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ 2024 సేవా ప్రదర్శిని అద్దం పడుతోందంటూ  అభివర్ణించారు. భారతీయ సమాజాన్ని నిర్వచించే మౌలిక విలువల గురించి ఆయన ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. సేవకు ప్రతిరూపమైన శ్రీకృష్ణుడి బోధల నుంచి స్ఫూర్తిని పొంది, ఆయన వారసులుగా భారతీయులు ఎప్పుడూ దేశ ధార్మిక కార్యకలాపాలకు వెన్నుముకగా నిలిచారని అన్నారు. బ్రిటిష్‌ పాలనకు ముందు, భారత్‌కు దరిద్రం అంటే ఏమిటో తెలియ దని, విదేశీ దాడులు జరుగుతున్న సమయంలో కూడా భారతీయ గ్రామాలు స్వయంసమృద్ధితో ఉన్నాయని పేర్కొంటూ, స్వావలంబన స్ఫూర్తి అనాదిగా కొనసాగుతూ వస్తున్న విషయాన్ని  పట్టి చూపారు. గ్రామాలలోని కుటీర పరిశ్రమల వల్ల ఏనాడూ దేహీ అనే పరిస్థితి లేదని నొక్కి చెప్పారు. ‘1785 వరకు తమిళనాడు నుంచి బరంపురం వరకూ లక్ష పాఠశాలలు ఉండేవని, ఇందులో అగ్రకులాలు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డు కులాలుగా నేడు పిలుస్తున్నవారూ అందరూ కలిసిమెలిసి విద్యనభ్యసించారని ఆయన చెప్పారు. ఈ పాఠశాలలను సమాజమే పోషించిందని, సామాన్య రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలే పాఠశాల నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చేవారని ఆయన వివరించారు. ఈ దేశం గొడ్రాలు కాదని, వీరులను కన్న భూమంటూ ఉద్వేంగగా పేర్కొన్నారు. ‘త్వమేవ సర్వం మమ మాతృభూమి’ అంటూ శాస్త్రాలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంగ్లేయులు దాదాపు మూడు శతాబ్దాల పాటు భారతీయుల మనస్సులను దెబ్బ తీయడంతో ఆత్మవిశ్వాస హీనతతో మనం కుంగి పోయామని, నిజానికి ఈ దేశంలో ఏ పని చేసినా, చేయాలనుకున్నా డబ్బుకు లోటు లేదని, పని చేస్తామని అనేవారు, చేసేవారు కావాలని ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్థలన్నీ కలిసి మెలిసి, నేను అనే అహం లేకుండా నేడు ఈ కార్యక్రమం చేస్తున్నాయని, ఇలా కలిసి పని చేయడం వల్లే దేశంలో పెద్ద మార్పు చోటు చేసుకోబోతోందని ఆయన చెప్పారు. రామకృష్ణ మఠం, సత్యసాయి సంస్థలు, మాతా అమృతానందమయి మఠం, సేవాభారతి వంటి సంస్థలు చేస్తున్న సేవలను కొనియాడుతూ, భారతీయుల సేవా స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భారతదేశ నిజమైన చరిత్ర గురించి పౌరులకు అవగాహన లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ దేశంలో పుట్టి పెరిగిన పౌరులుగా, చాలామందికి ఈ జాతి వాస్తవ చరిత్ర తెలియద’ని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిస్వార్ధ సేవలను అందించే వ్యక్తులను, సంస్థలను ఒక చోటకు చేర్చి, ఐకమత్యాన్ని ప్రదర్శించిన హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ 2024 సేవా ప్రదర్శిని నిజమైన పౌరసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోందని ఆయన కొనియాడారు. ప్రభుత్వాలు గుర్తించకపోయినా, ఈ కృషి నిజమైన పౌరసత్వ స్ఫూర్తికి ప్రతిరూపమని ఆయన నొక్కి చెప్తూ, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తున్న సేవల నుంచి స్ఫూర్తిని, ప్రేరణను పొందాలని ఉద్బోధించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ` ఐఎంసిటిఎఫ్‌ అఖిలభారత సమన్వయ కర్త గుణ్వంత్‌ సింగ్‌ కొఠారీ, తమ ఫౌండేషన్‌ లక్ష్యం గురించి మాట్లాడుతూ, ‘హిందూ ధర్మంలో అంతర్లీనంగా ఉన్న సేవా స్ఫూర్తిని ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంద’ని అన్నారు. తాము వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి మేళాలు అనేకం నిర్వహించామన్నారు.

భారతీయతను ఆచరిస్తూ, ప్రపంచ సంక్షేమం కోసం కృషి చేస్తున్న సంస్థలన్నింటినీ ఒకచోటకు తేవడం ద్వారా సేవకు, సామాజిక అవసరాలకు మధ్య గల అంతరాన్ని భర్తీ చేయాలన్నది తమ లక్ష్యమని హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ 2024, హైదరాబాద్‌ నిర్వాహక మండలి ప్రతినిధి రవి పేర్కొన్నారు. సమాజ అవసరాలను పరిష్కరిస్తూనే భారతీయ విలువలను నిలబెట్టేందుకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో సేవా పాత్రను బలోపేతం చేయడం హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ లక్ష్యమని ఆయన అన్నారు.

రెండవ రోజు కన్యావందనం

రెండవ రోజు విశిష్టమైన సాంస్కృతిక వేడుకలను నిర్వహించారు. ఉదయం జరిగిన కన్యావందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలకు సమాజం ఇచ్చే, ఇవ్వవలసిన గౌరవాన్ని పట్టిచూపారు. వందలాది మంది బాలబాలికలు హాజరైన ఈ కార్యక్రమంలో, బాలికలు కుర్చీలపై ఆసీనులై ఉండగా, బాలురు కింద కూర్చుని, ఒక దేవతను పూజించినట్టుగా పూజిం చడం ఒక అపురూప దృశ్యం! మన సమాజంలో ఆడపిల్లలకు అంత గౌరవం ఉందని బాలురకు తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

వేదికపై నుంచి స్తోత్రాలు వినిపిస్తుండగా, పసుపు, కుంకుమ, పూలతో బాలురు శ్రద్ధగా పూజ చేయడం ప్రతివారి హృదయాలను స్పృశించింది. ఇది కేవలం సంకేతాత్మక కార్యక్రమంగా కాక, ఆడపిల్లలను అక్కచెల్లెళ్లుగా, తల్లులుగా ,దేవతలుగా జీవితకాలమంతా గౌరవించాలన్న భావనను వారిలో కలిగించేందుకు, నిర్వహించారు. ప్రతిరోజూ ఒకరినొకరు చూసుకునే సహ విద్యార్ధులు తమను అలా పూజించడంతో బాలికలు పొంగిపోయారు.

ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త డా॥ అనంతలక్ష్మి ప్రసంగిస్తూ, భారతీయ సమాజంలో ఆడపిల్లలకున్న ప్రాధాన్యతను, గౌరవాన్ని వివరించారు. ఒక సత్కార్యం జరిగినప్పుడు, బాల, కన్య, కుమారి, దంపతిపూజ అంటూ నిర్వహిస్తారని, కాని మగపిల్లలకు వివాహం జరిగితే తప్ప పూజలందుకునే అర్హత కలగదంటూ వివరించారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలను, మగపిల్లలతో సమానంగా చూడాలని, వారిని ఇంట్లోనే చులకనగా చూస్తే, బయట సమస్య అవుతుందని అప్రమత్తం చేశారు. దసరాల్లో తొలి రోజున చేసే బాలపూజలో రెండేళ్ల బాలికకు ‘కుమారిక’ అన్న పేరుతో, రెండవ రోజున మూడేళ్ల బాలికను త్రిమూర్తిగా, నాలుగేళ్లకు కల్యాణిగా, ఐదేళ్ల బాలికను రోషిణిగా, ఆరేళ్లకు కాళికగా, ఏడేళ్లకు చండిగా, ఎనిమిది శాంభవిగా, తొమ్మిదేళ్ల పిల్లను దుర్గగా, పదేళ్ల బాలికను సుభద్రగా పూజించి, గౌరవించుకోవడం మన సంస్కృతి అని వివరించారు. ఆడపిల్లను గౌరవిస్తే జగన్మాత సంతోషిస్తుందన్నారు. అలాగే, మమ్మీ,డాడీ సంస్కృతిని మానుకొని అమ్మా, నాన్న అని పిలవడం అలవాటు చేసుకోవాలని, ‘అమ్మ’ అనే పదాన్ని పలికితే, ‘అ’ నుంచి ‘మ’ మధ్యనే అన్ని బీజాక్షరాలు ఉన్నందున అలా పిలిస్తే పుణ్యం వస్తుందని వివరించారు.

ప్రకృతి వందనం

కాలుష్యం పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రకృతిని మనం గౌరవించుకోవలసిన, పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని పట్టి చూపుతూ బాలబాలికలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శోభ మాట్లాడుతూ, ‘పరిరక్షించిన ప్రతివృక్షం జీవరాశి మొత్తం సంక్షేమానికి దోహదం చేస్తుంద’న్నారు. ప్రకృతిలో ఉన్న కీలక వనరులు, వాటి పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. బాలిబాలికలు ఈ పృధ్విని పరిరక్షణకు తామే బాధ్యులమన్న  సంకేతాత్మకంగా విద్యార్ధులు అందుకనుగుణమైన ప్రతిజ్ఞ చేసి, మొక్కలను ఇంటికి తీసుకువెళ్లారు.

నారీవందనం

అదే రోజు సాయంత్రం, సమాజంలో అనివార్యమైన మహిళల పాత్రను పట్టిచూపుతూ  ‘నారీ వందనం’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సభకు హాజరైన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ యాక్టింగ్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌. విజయభారతి మహిళలకు ఇవ్వవలసిన గౌరవించాలని, వైదిక కాలంలో పరిఢవిల్లిన స్త్రీ, పురుష సమానత్వం గురించి మాట్లాడారు. భగవద్గీత ఫౌండేషన్‌ చైర్మన్‌ గంగాధర శాస్త్రి మాట్లాడుతూ, మహిళల పట్ల గౌరవం, వారు చేసే సేవ, వారి సహకారం వంటి అంశాలన్నింటినీ హిందూ ధర్మంలో పొందుపరిచిన విషయాన్ని పట్టి చూపారు.

ఆ రోజు ఉదయం ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ, ‘ఇక్కడ ప్రదర్శనలో పాలుపంచుకుంటున్న సేవా సంస్థల స్ఫూర్తి ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. ప్రజల నుంచి గుర్తింపు లేకున్నా తమ వంతుగా మన సంస్కృతికి కేంద్రంగా ఉన్న ధర్మం, సేవ అన్న విలువలను బలోపేతం చేస్తూ సేవలందిస్తున్న గుర్తింపులేని హీరోలు వీరు’ అంటూ ప్రశంసించారు.

మూడవ రోజు గురువందనం

మూడవ రోజు గురువందనం, మాతృ`పితృ వందనం కార్యక్రమాలు జరిగాయి. విద్యార్ధులు భక్తి శ్రద్ధలతో, గౌరవంతో, కృతజ్ఞతా భావంతో తమ తల్లిదండ్రులకు, గురువులకు పూలతో పాదపూజ చేశారు.

ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన రామకృష్ణా మిషన్‌కు చెందిన స్వామి శితికంఠానంద మాట్లాడుతూ, హిందూ ఆధ్యాత్మిక మార్గంలో తల్లి దండ్రులను, గురువులను గౌరవించడం అన్నది అంతర్భాగమని విద్యార్ధులకు చెప్పారు. ఈ విలువలే బలమైన సమాజానికి పునాది అని వివరించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్ధుల ఈ పురాతన సంప్రదాయాల పట్ల ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అదనంగా, పర్యావరణవేత్త దుసర్ల సత్యానారాయణ మార్గదర్శనంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘భవిష్యత్తు కోసం చెట్లను రక్షించడం మన బాధ్యత’ అని ఆయన అన్నారు.

నాలుగవ రోజు

మాతృపితృ వందనం: కుటుంబ విలువల పట్ల గౌరవం

పరమవీర వందనం, ముగింపు సమావేశం

నవంబర్‌ 10 ఉదయం మాతృపితృ వందన కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతీయ సంస్కృతి లోని కుటుంబ విలువల్లో భాగమైన మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ బాలబాలికలు తమ తల్లిదండ్రులకు వందనం అర్పించారు. మాతా అమృతానందమయి ట్రస్టు ఇన్‌ఛార్జి స్వామిని సువిద్యామిత్ర సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులు డబ్బుకన్నా, జీవితం ముఖ్యమనే విషయాన్ని గ్రహించి, పిల్లలకు తగిన సమయాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పిల్లల్లో శీలం, విలువలను పెంచడంలో కుటుంబమే కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.

ఆధ్యాత్మికవేత్త విఎస్‌ఆర్‌ మూర్తి ప్రసంగిస్తూ, రామాయణ, మహాభారతాలలో పొందుపరిచిన కుటుంబ విలువలను, తల్లి పాత్రను, మనసును సోదాహరణంగా వివరించారు. కుటుంబ కేంద్రితమైన ఆధ్యాత్మికత, వ్యక్తిగత వృద్ధిపై దాని ప్రభావాన్ని ఆయన వివరించారు.

మానవీయం

ఆఖరురోజు మధ్యాహ్నం, సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించేందుకు మానవీయం కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజోద్ధరణకు పని చేస్తున్న వ్యక్తులను గౌరవించారు. ‘మానవత’ అన్న ఇతివృత్తం కింద, సామాజిక కార్యకర్తలు సమాజ సేవకు కట్టుబడి ఉన్న విషయాన్ని గుర్తిస్తూ, వారు ఎంతటి ఆదర్శమూర్తులో వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సేవా భారతి ట్రస్టీ ఎక్కా చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ, సమాజ సేవను అలవరుచు కునేందుకు యువతకు ప్రేరణను ఇవ్వవలసిన అవసరం గురించి మాట్లాడారు. కరుణకు, పనికి మధ్య అంతరం లేకుండా పనిచేయడమే సామాజిక సేవ అని గుర్తించి, తమ జీవితాలలో దానిని ఒక కీలక భాగంగా చేసుకునేందుకు ఆయన మాటలు హాజరైన వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.

పరమవీర వందన: జాతీయ హీరోలను గౌరవించుకోవడం

ఈ ప్రదర్శన కార్యక్రమం భారతీయ సేనల సేవలను, త్యాగాలను గౌరవించుకునేందుకు ఉద్దేశించిన పరమవీర వందన కార్యక్రమంతో ముగిసింది. ఈ సందర్భంగా, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డి, మన దేశాన్ని ధైర్యసాహసాలతో రక్షిస్తున్న వీరులకు పరమవీర వందన గొప్ప నివాళి అని ప్రశంచించారు. మన సైనికులు ఈ దేశానికి గర్వకారణమని అంటూ, సాయుధ దళాల పట్ల గౌరవాన్ని, కృతజ్ఞతను విద్యార్ధులలో పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేయడంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక కన్వీనర్‌   అప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ, భారత సైనికులంటే నమ్రత, వినయం, చిత్తశుద్ధి, క్రమశిక్షణ కలిగిన వారంటూ అత్యంత ఉద్వేగంగా ప్రసంగించారు. ఒకవైపు కుల, మతాల పేరుతో దేశాన్ని చీలుస్తుంటే, దాని అఖండత్వాన్ని కాపాడేందుకు యత్నం చేస్తున్న వీర సైనికుల పట్ల మనం ఎంతో రుణపడి ఉండాలన్నారు.

అనంతరం ముఖ్య అతిథి, పిన్న వయసులోనే పరమవీర చక్ర అవార్డు పొందిన సుబేదార్‌ మేజర్‌ యోగేంద్ర సింగ్‌ యాదవ్‌ యువతకు ప్రేరణ కలిగించేలా మాట్లాడారు. శీతాకాలం వచ్చి టెంపరేచర్లు కాస్త తగ్గితేనే సాధారణ పౌరులు గజగజా వణికిపోతూ, వీలైతే ఆఫీసులకు శలవు పెట్టి కూచుంటారని, కానీ మన వీర సైనికులు మైనస్‌ ఇరవై డిగ్రీల చలిలో, ఎత్తైన పర్వతశ్రేణులపై కాపలా కాస్తున్న విషయాన్ని ఆయన యువతకు వెల్లడిరచారు. కార్గిల్‌ యుద్ధంలో  బుల్లెట్లను ఎదుర్కొని, తాను చేసిన సాహసాన్ని, తనలో ఆ సమయంలో ముప్పిరి గొన్న దేశభక్తిని వివరించారు. నేడు యువతలో అహంకార భావన కనిపిస్తోందే తప్ప నమ్రత, సహనశీలతలు లోపిస్తున్నాయని, కానీ సైనికులు అహంకారం తమ తలకెక్కకుండా నిస్వార్ధ సేవలను అందిస్తున్న విషయాన్ని పట్టి చూపుతూ, ఇదే ఒక సాధారణ పౌరుడికి, సైనికుడికి మధ్య తేడా అన్నారు.

భారతీయ విలువలతో యువతకు ప్రేరణ కల్గించే యత్నం

ఈ నాలుగు రోజుల ప్రదర్శన కార్యక్రమంలో, భారతీయ సంస్కృతి, విలువలు, సంప్రదాయాలకు అంకితమై, కుటుంబం, సమాజం, దేశ బాధ్యత పట్ల గౌరవాన్ని పెంపొందింపచేసేందుకు అనేక ‘వందన’ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలకు హాజరైన విద్యార్ధులకు, యువతకు భారతీయ వారసత్వానికి కేంద్రమైన సామాజిక, సాంస్కృతిక విలువల పట్ల అవగాహనను పెంపొందించే యత్నం జరిగింది. తల్లిదండ్రులు, పెద్దల నుంచి నిస్వార్ధ సామాజిక సేవను గౌరవించడం వరకు జరిగిన ఈ కార్యక్రమాల ద్వారా ఈ ఆదర్శాలను యువతలో పాతుకుపోయేలా చేసే ప్రయత్నం జరిగింది.

కార్యక్రమ సాధకులు, కృషి

హిందూ ధర్మంలో అంతర్లీనంగా ఉన్న సేవా స్ఫూర్తిని పట్టి చూపడమే ఈ ప్రదర్శన లక్ష్యమని, హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌` ఐఎంసిటిఎఫ్‌ అఖిలభారత సమన్వయకర్త గుణ్వంత్‌ సింగ్‌ కొఠారీ పేర్కొన్నారు. హైదరాబాదు వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతి రోజూ విద్యార్ధులు, పాఠశాల ప్రతినిధులు హాజరవ్వడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. రోజుకు ఐదువేలమంది విద్యార్ధులు, వెయ్యిమంది ప్రతినిధులు వస్తారని తాము వేసిన అంచనాకు మించి రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారికి ఉదయం నుంచి రాత్రి భోజనం వరకూ అన్ని ఆహార సదుపాయాలు కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ 2024 కార్యదర్శి ఎం.రామ్మూర్తి మాట్లాడుతూ, ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేసిన వారందరికీ ఫీజు రద్దు చేయడంతో, స్వల్ప బడ్జెట్లతో లేదా వ్యక్తిగత విరాళాలతో పని చేసే చిన్న సంస్థలు కూడా భారీ సంస్థల సరసన తమ పనిని ప్రదర్శించే అవకాశం లభించిందన్నారు. ఇది కేవలం సామాజిక కార్యం లేదా పనిని ప్రదర్శించడం మాత్రమే కాదని, ఈ ప్రదర్శన ఒక లక్ష్యంతో జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమం మన సాంస్కృతిక మూలాలలోకి ప్రయాణమని, భారతీయ విలువలను సజీవం చేసిన ప్రదేశమన్నారు. నిరాడంబరత, స్వావలంబన, సమాజం కేంద్రంగా ఉండే జీవితం ఎంత సుసంపన్నంగా ఉంటుందో ప్రజలకు తెలిసేలా చేసేందుకు ఉద్దేశించిందన్నారు.

బాల్యంలోనే సార్వత్రిక, మానవ కేంద్రిత విలువలను పొందుపరచాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడం పట్ల హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌ (తెలంగాణ చాప్టర్‌) అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్‌ ఉత్సాహం వ్యక్తం చేశారు.

పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల స్పందిస్తూ, విద్యార్ధులలో కరుణ, బాధ్యతను పెంచిపోషించేందుకు ఎంతో జాగ్రత్తగా కార్యక్రమాలు రూపొందించామన్నారు. విద్యార్ధులు ఈ కార్యక్రమాలన్నింటి పట్లా సహకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాల్లో విద్యార్ధులు ఉత్సాహంతో ఉప్పొంగడం చూస్తున్న పెద్దలను ఉద్వేగానికి లోను చేసింది.. వీరు భవిష్యత్తులో దీనిని ముందకు తీసుకె ళ్లాలి భగవంతుడా అని ప్రార్ధించేలా చేసింది.


నిస్వార్ధ సేవలకు నిలువెత్తు రూపాలు

అన్నీ డబ్బులు పడేసి కొనుక్కుంటున్న ఈ కాలంలో, ఏమీ ఆశించకుండా సేవలు చేసేవారు న్నారంటే జనం నమ్మశక్యం కాదంటుంటారు. కానీ, ఇటీవలే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన హిందూ ఆధ్యాత్మిక సేవా ప్రదర్శనలో అటువంటి అజ్ఞాతవీరులు కొల్లలుగా కనిపించారు. అత్యంత స్వల్ప బడ్జెట్‌లతో, మనం ఊహించలేని సేవలు అందిస్తున్న సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, ధ్యాన కేంద్రాలు  ఇలా ఒకటేమిటి, ఆధ్యాత్మికత, సామాజిక సేవ పక్క పక్కనే ఉంటూ సేవ, ఆధ్యాత్మికతల మధ్య అంతర్లీనంగా గల లంకెను పట్టి చూపాయి. అరక్షిత బాలబాలికల కోసం ఎన్ని ఆశ్రమాలు నగరంలో, తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయో ఈ ప్రదర్శనలోనే అర్థమైంది. వీటితోపాటుగా యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తున్న సంస్థలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎంతో నిరాడం బరంగా, అజ్ఞాతంగా పేరు కోసం అర్రులు చాచకుండా వీరు చేస్తున్న సేవలను మనం  అభినందించి తీరవలసిందే.

కరుణశ్రీ సేవా సమితి సేవలు

విశ్వహిందూ పరిషద్‌ సేవా చొరవలో భాగంగా అరక్షిత బాలబాలికల కోసం నడుస్తున్న ఆశ్రమాలు కోకొల్లలు అనే విషయం అక్కడే అర్థమైంది. బాలలకు, బాలికలకు వేర్వేరు ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో వారిని చేరదీసి, పెంచి, పోషించి, సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తితో భారతీయ సంప్రదాయాలకు వారసలుగా తీర్చి దిద్దటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు. సరిగ్గా పాతికేళ్ల కింద ఈ సమితి కింద ప్రారంభమైన సంస్థలకు స్వంత భవన సముదాయం, శిక్షణా వ్యవస్థలకు ప్రత్యేక గదుల ఏర్పాటు, సోలార్‌ వ్యవస్థ, ఆర్‌ఓ నీటి శుద్ధి వ్యవస్థలతో అత్యాధునిక సౌకర్యాలతో ఇవి ఉంటాయి. ఇక్కడ నివసించే విద్యార్ధులందరికీ శ్రీ సరస్వతీ శిశుమందిర ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. నేటి వరకూ దాదాపు రెండువందల యాభైమంది విద్యార్ధులు లబ్ధిపొంది మంచి ఉద్యోగాలలో స్థిర పడ్డారు. వీరిలో ఉపాధ్యాయులే కాదు, వైద్యులు, ఇంజినీర్లు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. విద్యార్ధినీ, విద్యార్ధులు చదువుకునే సమయంలో వారికి కంప్యూటర్‌, కుట్టు శిక్షణ, క్రాఫ్ట్‌, బ్యుటీషియన్‌ కోర్సులు, మగ్గం పని, జూట్‌ బ్యాగ్‌ల తయారీలో శిక్షణను ఇచ్చి, వారి చేత తయారు చేయించి, ఇటువంటి ప్రదర్శనలలో ప్రదర్శించి వారికి పాకెట్‌ మనీగా ఇస్తారని అక్కడి నిర్వాహకులు తెలిపారు. సహాయం చేయమని నిర్వాహకులు విసిగించకపోయినా, స్వచ్ఛంద విరాళాలను వారు స్వీకరిస్తారు. నాగర్‌కర్నూల్‌లో నడుస్తున్న జ్ఞానేశ్వర సేవా ట్రస్టు కూడా ఈ కోవకు చెందిందే.

వాత్సల్య సింధు

గత 35 సంవత్సరాలుగా కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో సేవాభారతికి అనుబంధ సంస్థగా సేవలందిస్తున్న వాత్సల్యం సింధు తమ కార్యకలా పాలను వివరించింది. ఎవ్వరూ లేక, నిరాశ్రయులైన బాలురను తమ ఆశ్రమంలో ఉంచుకుని వారికి విద్యను, ఉపాధిని కల్పించే పని చేస్తోంది. ఆసక్తి ఉన్న బాలురకు ప్రత్యేక నైపుణ్యాల శిక్షణను అందించడమే కాక, లెప్రసీ కాలనీకి చెందిన కౌమార దశలోని ఆడపిల్లలకు నైపుణ్యాలలో శిక్షణనంది స్తోంది.

 ప్రతి బ్యాచ్‌కు 31 మంది ఆడపిల్లల చొప్పున నేటివరకూ 186మందికి శిక్షణను ఇచ్చారు. దాతల సహకారంతో నడుస్తున్న ఈ సంస్థకు ఆసక్తి ఉన్నవారు తోడ్పడవచ్చని నిర్వాహకులు అన్నారు.

సేవాభారతి ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలు

దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి మహిళలకు స్వయం ఉపాధి పట్ల ఆసక్తిని కల్పించి, ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పలు వృత్తి విద్యా శిక్షణ తరగతులను సేవా భారతి ఆధ్వర్యంలో కౌశలం సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌  నిర్వహిస్తోంది. తెలంగా ప్రభుత్వ అనుబంధ విభాగం సెట్విన్‌తో కలిసి అతి తక్కువ ఫీజులతో ఈ కేంద్రం ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్లౌజ్‌ డిజైనింగ్‌, మగ్గం, టై అండ్‌ డై ఫ్యాబ్రిక్‌, పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ తదితర సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది.

మంచిర్యాలకు చెందిన నయీదిశ` సేవాభారతి సైన్యంలో, గ్రూప్స్‌ పరీక్షలలో  అర్హులయ్యేందుకు శిక్షణను అందిస్తోంది. నిరుద్యోగ యువతీయువకులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఈ ఆశిక్షణను అందిస్తారు. నయీఈ దిశ కార్యక్రమం ద్వారా 700మంది శిక్షణ పొందారు. 2022లో జరిగిన పోలీసు నియామకాల కోసం 75మంది శిక్షణ తీసుకొని, మొత్తం 75మంది భౌతిక పరీక్షలలో విజయం సాధించగా, అందులో నలుగురు బాలికలు పోలీసు ఉద్యోగం సంపాదించగా, 10మంది గ్రూప్స్‌లో ఉత్తీర్ణులయ్యారని నిర్వాహకులు చెప్పారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు నయీదిశ ద్వారా యువతకు సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణను ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకుంది.

అనాథ వృద్ధులు, వికలాంగులు, అంధులకు సేవలు

జడ్చర్లలోని శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం, భారతీ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భాగ్య నగరంలోని మేడిపల్లిలో అనాథల, అభాగ్యుల పట్ల ప్రేమను మించిన భగవదారాధన లేదన్న స్వామి వివేకానందుడి ప్రబోధాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించామని నిర్వాహకులు చెప్పారు. నిస్సహాయ స్థితిలో రోడ్లపై తిరిగే అనాథలను తీసుకువచ్చి, వారికి అవసరమైతే వైద్యం చేయించి సేవలు అందిస్తున్నదీ ఫౌండేషన్‌. అంధులు, వికలాంగులు, వృద్ధులు సహా నిస్సహాయంగా ఉన్నవారికి సేవలు అందిస్తోంది. కాగా, ప్రస్తుతం రేకుల షెడ్‌లో నడుస్తున్న ఈ ఆశ్రమాన్ని పక్కాభవనంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆలయాల పూర్వ వైభవం కోసం..

అన్నామలయార్‌ ట్రస్టు:

గ్రామాలలో ఆలనాపాలనా లేక నిర్లక్ష్యానికి గురవుతున్న ఆలయాలను గుర్తించి, ఆ గ్రామస్తులను ఒప్పించి, తామే శ్రమదానం చేసి వాటిని వాటి అసలు స్వరూపానికి తీసుకువచ్చి, గ్రామస్తులకు అప్పగిస్తున్నారు అన్నామలయార్‌ ట్రస్టు నిర్వాహకులు, వాలెంటీర్లు గత పంతొమ్మిది ఏళ్లుగా.  చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి, అక్కడ ఆలయం ఉందని కూడా గ్రామస్తులు మర్చిపోయిన ఆలయాన్ని గుర్తించి,  ఆ మొక్కలను పీకి, శుభ్రం చేసి మరీ అందిస్తున్నారు వారు. వి. రామచంద్రన్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆలయానికి వెళ్లినప్పుడు ఎవరో, ఆలయాలకు సేవ చేస్తే ఆరోగ్యం, ఆయుష్షు కలుగుతాయన్న మాటలను గంభీరంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వాలంటీర్లు తెలిపారు. కంచి జిల్లాలో ఈ రకంగా ప్రారంభమైన వారి సేవ రాష్ట్ర సరిహద్దులను దాటి ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోకి ప్రస్తుతం ప్రవేశిస్తోంది. ఈ సేవా కార్యక్రమంలో ఐటి, బ్యాంకు, ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు స్వచ్ఛందంగా వారితో కలిసి పని చేస్తున్నారు. నేటి వరకూ 102 ఆలయాలను శుభ్రం చేసి గ్రామస్తులకు అప చెప్పినట్టు వారు తెలిపారు. తాము విరాళాలు కోరడం లేదని, ఇచ్చే వారి నుంచి కూడా పారదర్శక రూపంలో ఉంటేనే తీసుకుంటున్నామని వారు తెలిపారు.

కాలడి మఠం:

ఆదిశంకరులు జన్మ స్థలం కేరళలోని కాలడి. ఆ ప్రాంతం కేంద్రంగా పని చేస్తోంది తెలంగాణ కాలడి మఠం. పురాతన ఆలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక, సామాజిక అభ్యున్నతికి తాము అంకితమైనట్టు మఠ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం దేవసేవ ప్రాజెక్టు కింద నిరుపేద విద్యార్ధులకు వేద విద్యను అందించి, చిన్న చిన్న ఆలయాలలో నియమిస్తున్నట్టు వారు తెలిపారు. భవిష్యత్తులో ప్రాచీన జ్ఞానానికి ఆధారమైన ఉన్నత విద్యను అందించే విద్య, ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు కృషి చేయాలన్నది తమ లక్ష్యమని వారన్నారు.

డా॥ సూరి భగవంతం ఫౌండేషన్‌

దేశ అభివృద్ధిలో శాస్త్ర విజ్ఞాన ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన డా॥ సూరి భగవంతం దార్శనికుడు. నాడే రక్షణమంత్రికి శాస్త్ర సలహాదారుగా, డిఆర్‌డిఒ డైరెక్టర్‌ జనరల్‌గా, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ డైరెక్టర్‌గా, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా ఆయన అందించిన సేవలు  మరువలేనివి ఫౌండేషన్‌ ప్రతినిధి ఎస్‌బి రామ్‌  పేర్కొన్నారు. రక్షణ రంగంలో ‘మేకిన్‌ ఇండియా’ భావనకు ప్రాణం పోసింది ఆయనేనని, దీనికి అనుగుణమైన ప్రయోగశాలలను దేశవ్యాప్తంగా స్థాపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. నాటి శాస్త్రవేత్తలను నేటి యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు తెలిపారు. ప్రభుత్వ బడులు, కళాశాలలకు ప్రయోగశాలల పరంగా అన్ని సౌకర్యాలూ లేవని, అందుకే వాటిని సందర్శించి, అక్కడి  ప్రయోగశాలల పరిస్థితిని గమనించి, అక్కడ అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించేందుకు డిఆర్‌డిఒ మాజీ డైరెక్టర్‌ జి. సతీష్‌రెడ్డి నేతృత్వంలో తమ సంస్థ పని చేస్తోందని ఆయన వివరించారు. బడులు, కళాశాలలు ఈ అంశంలో తమను సంప్రదిస్తే, తాము చేయగలిగిందంతా చేస్తామని ఆయన అన్నారు.

గోరక్షణే తక్షణ కర్తవ్యం

తెలంగాణ ప్రాంతం గో సేవా విభాగం ఈ ప్రదర్శనలో తమ స్టాల్‌ను పెట్టి  మన జీవితాలలో గోవు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను, ఆరోగ్య ప్రదాయినిగా ఆవు వల్ల మనకు కలిగే లాభాలను, ఆర్ధికంగా, వైజ్ఞానికంగా ఆవుకున్న ప్రాధాన్యతను సందర్శకులకు వివరించారు. దానితో పాటుగా గోఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచి, వాటిని వాడటం వల్ల కలిగే లాభాలను వివరించారు. దానితో పాటుగా 1947లో జనాభా 33 కోట్లు ఉండగా, గోసంతతి 130 కోట్లు ఉండేదని, ప్రస్తుతం మానవ జనాభా సుమారు 140 కోట్లు ఉండగా, గోసంతతి మాత్రం 20 కోట్లు మాత్రమే ఉందని, ఇది ఆందోళనకరమైన విషయమని వారు వివరించారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 48 ‘గోవధ నిషేధాన్ని’ సూచించగా, తెలుగు రాష్ట్రాలలో మాత్రమే పాక్షిక ‘గోవధ నిషేధ చట్టం’ ఉందని వారు తెలిపారు. కనుక గోవులను కాపాడుకునేందుకు ప్రజలు విస్త్రత స్థాయిలో గో ఉత్పత్తులను వినియోగించడాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు.

గోవులకు స్నేహితులు ‘గో పాల్స్‌’

దేశవాళీ ఆవుల గురించి ప్రజలలో జాగృతిని తెచ్చేందుకు ఈ సంస్థ పని చేస్తోంది. రసాయన రహిత ఆహార పదార్ధాలకు, కర్బన ఉద్గారాలు లేని వాతావరణానికి, విష రహిత వ్యవసాయానికి, నిలకడైన జీవనానికి గోవులు ఎంత ముఖ్యమో వారు సందర్శకులకు వివరించారు. తద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యం కోసం పాల్పడుతున్నట్టు నిర్వాహకులు వివరించారు.

ప్రదర్శనకు తరలి వచ్చిన అమ్మవారు, అయ్యవార్లు

ఈ ప్రదర్శనకు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు, కొమరవెల్లి మల్లన, కొండగట్టు ఆంజనేయుడు తరలి వచ్చి భక్తులకు ఆశీస్సులను అందించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి, అయ్యవారి దర్శనం చేసుకొని సంతోషించడం కనిపించింది. వీరితో పాటుగా, హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థాన  పర్యవేక్షణలో, రంగారెడ్డి జిల్లా, నందివనపర్తి గ్రామానికి చెందిన శ్రీశ్రీశ్రీ జ్ఞానంసరస్వతి ఆలయం వారు కూడా తమ స్టాల్‌ను ఏర్పాటు చేసి, తాము చేపడుతున్న కార్యక్రమా లను వివరించారు.

మార్గదర్శనానికి విచ్చేసిన ఆధ్యాత్మిక సంస్థలు

ప్రదర్శనలో చిన్న జీయర్‌ స్వామి నిర్మించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వారు తాము నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరిస్తూ, తమ సాహిత్యాన్ని ప్రదర్శనలో ఉంచారు. వీరితో పాటుగా మాతా అమృతానందమయి, శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, రామకృష్ణా మఠం, ఆశారాం బాపూ, సహజ యోగ, వివేకానంద కేంద్ర కన్యాకుమారి, అరబిందో సహా పలు ఆధ్యాత్మిక సంస్థలు తమ సాహిత్యాన్ని, కార్యకలాపాలను ప్రదర్శించారు. సహజయోగ, హిమాలయ ధ్యాన యోగ వంటి సంస్థలు సందర్శకులకు ధ్యానం చేయడాన్ని, దానివల్ల కలిగే లాభాలను సందర్శకులకు వివరించారు.

డి. అరుణ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE