మహారాష్ట్ర, జార్ఖండ్‌శాసన సభల ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశాలు చాలా ఉన్నాయి. నవంబర్‌ 20న పోలింగ్‌ జరిగిన ఆ రెండు రాష్ట్రాలలో ప్రచారం భారత వ్యతిరేకత, భారతీయత అన్న శిబిరాలు మధ్య జరిగిన ప్రచారమన్నట్టు కనిపించింది. హిందువుల ఐక్యత అంశం, హిందూ జనాభా తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఈ ప్రచారంలో దూసుకు వచ్చినట్టు ఇంతకు ముందు ఏనాడూ నేరుగా రాలేదు. తాము అధికారంలోకి రావాలంటే బీజేపీని నిరోధించాలి కాబట్టి, అందుకు ముస్లింలను బుజ్జగించడం ఒక్కటే శరణ్యమన్న రీతిలో కాంగ్రెస్‌, దాని భాగస్వాములు వ్యవహరించాయి. ముస్లింలను ఇంకా బుజ్జగించడం అంటే మరొక దేశ విభజనకు బీజాలు వేయడమేనని బీజేపీ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చింది.

సెక్యులరిజం, కుహనా సెక్యులరిజం వాదోప వాదాలు, ఆరోపణలను మించిన నిశిత అంశం ఇందులో ఇమిడి ఉంది. విపక్ష శిబిరం నుంచి బుజ్జగింపు ధోరణే ఇక్కడ కూడా కేంద్ర బిందువే అయినా, హిందువులు ఓటు బ్యాంక్‌గా ఆవిర్భవించ వలసిన అవసరం గురించి ఎక్కువ మంది బీజేపీ నేతలు బాహాటంగా మాట్లాడవలసిన పరిస్థితి ఇప్పుడు కనిపించింది కూడా. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, రాముడిని తిట్టే ముస్లింను అభ్యర్థిగా నిలిబెట్టిన పార్టీ హిందువులు ఐక్యంగా ఉండాలన్న నినాదాన్ని తప్పు పట్టింది. అదే ఎన్‌సీపీ (అజిత్‌). ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హిందూ ఐక్యత గురించి శషభిషలు లేకుండా మాట్లాడారు. దీనికి ముక్తాయింపే ఎన్‌సీపీ చీలిక నేత అజిత్‌ పవార్‌కు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఇచ్చిన గట్టి సమాధానం. తమకు పొత్తు భాగస్వామి కంటే, హిందూత్వమే మిన్న అనే సంకేతం ఫడణవీస్‌ మాటలలో విశ్లేషకులు గమనించారు. ఫలితాల గురించి ఊహాగానాలు లేదా సర్వేలు ఏం చెబుతున్నా, తాము హిందుత్వ వైపు ఉండి తీరుతామని బీజేపీ స్పష్టం చేసినట్టే ఉంది. బీజేపీని నిరోధించడానికీ, ముస్లింలను బుజ్జగించడానికీ తేడా లేదని కాంగ్రెస్‌ భాగస్వాములు నమ్ముతున్నారు.

పదిహేను రోజులలో పదవికి రాజీనామా చేయకపోతే చంపుతాం అంటూ యోగికి పుణే నుంచి మెసేజ్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యోగిని చంపుతామని ఫోన్‌ సందేశం పంపించిన వ్యక్తి 24 ఏళ్ల ముస్లిం యువతి. అన్నట్టు ఈ యువతికి కూడా షరా మామూలే అన్నట్టు ‘‘మతి స్థిమితం లేదు’’. అయినా యోగి తనదైన శైలిని విడిచిపెట్టలేదు. బుల్‌డోజర్‌ న్యాయం చెల్లదంటూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా ఆయననేమీ వెనకడుగు వేయనీయలేదు. తనదైన వాగ్ధాటికి ఇంకాస్త పదును పెట్టారేమో కూడా. తమకు రాజకీయం ప్రధానం కాదని, ఎన్నికల పొత్తులు, అసలు ఎన్నికలు కూడా ప్రధానం కాదని, భారతీయత, హిందూత్వమే ప్రధానమని యోగి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా చెప్పడమే ఇక్కడ గమనించదగ్గ విషయం. మనం విడిపోతే ఊచకోతే మిగులుతుంది అంటూ మొదట యోగి ఆగ్రాలో నినాదం ఇచ్చారు. బాంగ్లాదేశ్‌లో హిందువుల హత్యాకాండ నేపథ్యంలో ఆయన ఆ మాట అన్నారు. సంఘ పరివార్‌ ఈ నినాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్లింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ డాక్టర్‌ మోహన్‌జీ భాగవత్‌, తరువాత నరేంద్ర మోదీ కూడా ఇదే తరహా నినాదాలు ఇచ్చారు. లేదా అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచారు. హిందువుల ఐక్యత గురించి మొత్తం సంఘ పరివార్‌ ముక్తకంఠంతో ఘోషించింది.

హిందువుల ఐక్యత గురించి మాట్లాడితే కాంగ్రెస్‌, జేఎంఎం (జార్ఖండ్‌ ముక్తి మోర్చా), ఎన్‌సీపీ (అజిత్‌) గంగవెర్రులెత్తిపోయాయి. అయితే కాంగ్రెస్‌ జార్ఖండ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ గులాం అహ్మద్‌ మిర్‌ ఇచ్చిన ఒక్క హామీ ఎంత ప్రమాదకరమైనదో వీళ్లెవరూ మాట్లాడడం లేదు. తమ ప్రభుత్వం ఏర్పడితే చొరబాటుదారులకు కూడా తగ్గింపు ధరలతో గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని అన్నారు.

మనం (హిందువులు) చీలిపోతే కూలిపోతాం అని చెబితే సెక్యులరిజానికి వ్యతిరేకమా? శివాజీ వంటి చరిత్ర పురుషుడు సహా ఎందరో ఈ విషయాన్ని చెప్పిన చారిత్రక సత్యాన్ని ఇప్పుడు గుర్తు చేయవలసి వస్తే ఎందుకు ఉలికిపాటు? ఇందులో ముస్లిం వ్యతిరేకత ఏముంది? అయోధ్య రామాలయం మీద దాడి చేస్తామని కెనడాలో కూర్చుని వదరే సిక్కు ఉగ్రవాది మాటల కంటే ఇది ప్రమాదకరమైనదా? వక్ఫ్‌ను వ్యతిరేకించడానికి తమ యువకులు వీధులలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం గడగడ లాడిపోతుంది జాగ్రత్త అన్న హెచ్చరిక కంటే తీవ్రమైనదా? జార్ఖండ్‌లోని సంథాల్‌ గిరిజన ప్రాంతాలలో 1970 వరకు 8 శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 28 శాతం ఎలా అయ్యారని ప్రశ్నించిన హిందువులు ఉన్మాదులుగా ఎందుకు ముద్ర వేయించుకోవలసి వస్తున్నది? నిజానికి ఈ ప్రశ్నలు పదునెక్కుతున్న కాలమే హిందువుల రక్షణ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి అనివార్యమైంది. సంఘ పరివార్‌ నేతల నోటి నుంచి వెలువడిన ఆ వాగ్బాణాలు నిజానికి హిందూ సమాజం ఆకాంక్షలే.

మనం విడిపోతే బలైపోతాం, కలసి ఉంటే బలంగా ఉంటాం అంటూ యోగి ఆదిత్యనాథ్‌ మహారాష్ట్రలో పిలుపునిచ్చారు. ఇదే తరహా నినాదం ఆయన స్వరాష్ట్ర ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఇచ్చారు. మహారాష్ట్రలోని వాశిం, అమరావతి, అకోలా అసెంబ్లీ నియోజకవర్గాలలో నవంబర్‌ మొదటివారంలో యోగి ప్రచారం చేశారు. బజ్రంగ్‌ బలిని ద్వేషించే వాళ్లంతా ఆయన ఉనికి లేనిచోటికి వెళ్లిపోతే బాగుంటుందని ఆయన నిర్మొహమాటంగానే చెప్పారు. ఇస్లాం ఉనికిలోకి రావడానికి చాలా ముందే ఈ దేశంలో బజ్రంగ్‌బలి ఆరాధన ఉంది. అలాంటిది రామనవమికి, హనుమత్‌ జయంతులకి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని యోగి సూటిగానే ప్రశ్నించారు. కులాల వారీగా హిందువులు విడిపోరాదనే యోగి నీళ్లు నమలకుండా చెప్పారు.

కానీ ఐక్యంగా ఉండమని చెబితేనే అది సమాజాన్ని విడదీయడమని చెప్పడమేనని బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్‌సీపీ (అజిత్‌) వర్గం తప్పు పట్టడం వికారంగా అనిపిస్తున్నది. మనం ఐక్యంగా ఉండి, ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా రూపొందాలని యోగి చెప్పారు. ఇందుకు అయోధ్యలో నిర్మించిన రామాలయం నాంది పలికిందని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. అది ఆరంభం, ఇంకా కాశీ, మధురల కోసం కూడా అదే విధంగా పని చేయాలని యోగి చెప్పారు. రాముడు, కృష్ణుడు ఉనికిని ప్రశ్నించే పార్టీ కాంగ్రెస్‌ అని, అయోధ్యలో రామమందిరం నిర్మించి నరేంద్ర మోదీ 140 కోట్ల మంది భారతీయుల స్వప్నం సాకారం చేశారని అన్నారు యోగి. అసలు కాంగ్రెస్‌ దేశం గురించి, భారత్‌ గురించి, భారతీయత గురించి ఏనాడైనా ఆలోచించిందా అని ఆయన సూటిగానే ప్రశ్నించారు.

ఇప్పుడు మాట్లాడే ఏ బీజేపీ నాయకుడు అయినా వక్ఫ్‌ నేపథ్యంతో తలెత్తిన సంక్షోభాన్ని గుర్తుకు వచ్చేటట్టు మాట్లాడకుండా ఉండడు. వక్ఫ్‌ బోర్డు కోరిందే తడవుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు భూములకు సంబంధించిన నోటీసలు జారీ చేస్తున్నాయి. భూ జిహాద్‌పై పోరాటంలో సంఘ పరివార్‌కు అనూ హ్యంగా క్రైస్తవ సమాజం నుంచి మద్దతు లభిస్తున్నది. అసలు మహారాష్ట్ర లవ్‌ జిహాద్‌కు, భూ జిహాద్‌కు కేంద్రంగా మారిపోతోందని యోగి ఈ ఎన్నికల ప్రచారంలోనే ఆరోపించారు. ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్రం కేంద్రం కాకుండా ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సభకు యోగి స్వరం పెంచారు. 1947 నాటి భారత విభజన పెద్ద గుణపాఠం నేర్పుతుంది. హిందువులు చీలికలు పేలికలుగా విడిపోయారు. దీని ఫలితమే దేశ విభజన. హిందువుల హత్యాకాండ కూడా దాని ఫలితమే. అందుకే చీలిపోవద్దు. ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటారు అని యోగి వ్యాఖ్యానించారు. ఐదు వందల ఏళ్ల పాటు మనం చీలికిపేలికలుగా ఉండిపోవడం వల్లనే రామాలయ నిర్మాణం సాధ్యం కాలేదని ఆయన గుర్తు చేశారు. మీరు అంటే హిందువులు ఇలా ముక్కలు చెక్కలుగా విడిపోతూ ఉంటే గణేశ్‌ ఉత్సవాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ప్రేమ, లవ్‌ జిహాద్‌ పేరుతో ఇక్కడి భూమి అంతా పరాధీనమయిపోతుంది అని చెప్పారాయన. అసలు మహిళ రక్షణే డోలాయమాన పరిస్థితులలో పడిపోతుందని తీవ్రంగానే హెచ్చరించారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదులను చంపరాదని వాదించే వారితో చెట్టపట్టాలేసుకు తిరిగే శిబిరానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టి హెచ్చరికే చేశారు. యోగి తరువాత ప్రధాని కూడా మహారాష్ట్రలో ప్రచారం చేశారు. యోగి నినాదాన్నే మోదీ మరింత స్పష్టంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నంచేశారు. మనం విడిపోతే బలి అవుతాం అన్న యోగి నినాదాన్ని బలపరుస్తూ, మోదీ, మనం ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటాం అని అన్నారు. కులాల మధ్య తంపులు పెట్టడమే కాంగ్రెస్‌ లక్ష్యమని పేర్కొంటూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు వృద్ధిలోకి రావడం కాంగ్రెస్‌కు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు.

నిజం చెప్పాలంటే నెహ్రూ యుగం నుంచి కూడా ఆ కుటుంబానికి రిజర్వేషన్‌ ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు ఆ కుటుంబంలో నాలుగో తరం యువరాజు (రాహుల్‌గాంధీ) కూడా కులం పేరుతో భారతదేశాన్ని విభజించాలని చూస్తున్నారని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనే విమర్శించారు. కశ్మీర్‌లో మళ్లీ 370 ఆర్టికల్‌ను తేవాలన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని నిరోధించిన బీజేపీ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని, కానీ అక్కడ అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలులో ఉందని మోదీ అన్నారు.

జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల అంశం చర్చకు వచ్చింది. ఇక్కడి ప్రచారం ఉమ్మడి పౌరస్మృతి కూడా ఒక అంశంగా నిలిచింది. నిజానికి రిపబ్లిక్‌ టీవీ ఇచ్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రకారం జార్ఖండ్‌లోని సంథాల్‌ గిరిజనులు నివాసం ఉండే ప్రాంతం అటు భూ జిహాద్‌, ఇటు లవ్‌ జిహాద్‌కు అంటే జమిలి జిహాద్‌కు కేంద్రంగా ఉంది. 1970 వరకు 8 శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం 28 శాతానికి ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు బీజేపీ వేస్తున్న ప్రశ్న. తమ వర్గం ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసుకుని భూములు లాక్కుంటున్నారని స్థానికులు గోడు వెళ్లబోసుకున్నారు. అంతకంటే ముందే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఈ అంశాన్ని ప్రచారంలో లేవనెత్తారు. ఇలా వాస్తవం చెప్పడం సమాజంలో చీలికలు తేవడానికేనని కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా భాష్యం చెబుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం చొరబాటుదారులకు ఎర్రతివాచీ వేసి ఆహ్వానం పలికింది. ఆ వర్గం తమకు గంపగుత్తగా ఓట్లు వేస్తారన్న ఆశతోనే అలా చేసింది అని శర్మ వ్యాఖ్యానించారు. ఆ వర్గం ఎవరో ఒక వ్యక్తి, అది కూడా తమ వర్గీయుడికే ఓటు వేస్తారు. హిందువులు అక్కడే విఫలమవుతున్నారని శర్మ హిందూ సమాజంలోని అసలు లోపం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి విషపూరిత ప్రచారం ద్వారా దేశంలో అంతర్యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా అస్సాం ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఇండీ కూటమి ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఒక వర్గం, అంటే ముస్లింలు అంతా కూడా చొరబాటుదారులేనన్నట్టు హిమంత మాట్లాడు తున్నారని కూడా ఇండీ ఫిర్యాదు చేసింది. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం బాంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు మద్దతు ఇస్తున్నదంటూ హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యపై కూడా ఇండీ నాయకులు ఎన్నిలక సంఘానికి ఫిర్యాదులు అందించారు. అయితే అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్పని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలని హిమంత కాంగ్రెస్‌, జేఎంఎంలకు సవాలు విసిరారు. భారత దేశంలోని హిందూ నాగరికతను రక్షించాలని మాత్రమే తాను అన్నానని, ముస్లిం అన్న పదం కూడా పలకలేదని హిమంత చెప్పారు.

హిమంత బిశ్వశర్మ చొరబాటుదారుల పేరు ఎత్తితేనే మండిపడిన కాంగ్రెస్‌, వారికి తగ్గింపు ధరలతో వంట గ్యాస్‌ సరఫరా చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది. బెర్మో అసెంబ్లీ స్థానం పరిధిలోని చంద్రపూర్‌ ఎన్నికల సభలో మిర్‌ ఇలాంటి హామీ ఇచ్చేశారు. డిసెంబర్‌ 1 నుంచి సిలిండర్‌ ధర రూ. 450కి తగ్గించి ఎస్‌సీ, ఎస్‌టీ, హిందువులు, ముస్లింలు, చొరబాటుదారులకి అందిస్తామని చెప్పాడు మిర్‌. అన్నట్టు ఇందులో ఎలాంటి వివక్షా ఉండదట. చొరబాటుదారులకు ఇక్కడి పౌరులతో సమస్థానం కల్పించడం కాంగ్రెస్‌, జేఎంఎం కూటమి లక్ష్యమని స్పష్టమయింది. దీని మీద ప్రధాని మోదీ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇది దేశ వ్యతిరేక ధోరణి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. బాంగ్లాదేశ్‌ నుంచి చొరబడిన వారికి వంట గ్యాస్‌ ఇస్తానని మిర్‌ చెప్పారంటే, కాంగ్రెస్‌ అసలు రూపం ఇదేనని తెలుసుకోవాలని జార్ఖండ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు జార్ఖండ్‌ ప్రజలకు దక్కాలి తప్ప, బాంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన చొరబాటుదారులకు కాదని యోగి ఆదిత్యనాథ్‌ కూడా తన ప్రచార సభలలో విమర్శించారు. ఇంత విమర్శించినా, దుయ్యబట్టినా తాము సంక్షేమ పథకాల విషయంలో వివక్షను పాటించబోమనే కాంగ్రెస్‌ వికృతవాదనలు వినిపించింది. ముస్లింలను దారుణంగా అవమా నించారంటూ నవంబర్‌ 8న సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే ఊరూపేరూ లేని సంస్థ మధ్యప్రదేశ్‌ ముఖ్య మంత్రి మోహన్‌ యాదవ్‌ మీద కేసు పెట్టింది. ఆయన జార్ఖండ్‌ ముస్లింలను బాంగ్లా చొరబాటుదారులు అని సంబోధించినందుకు ఈ కేసు పెట్టారు. ముస్లింలను గౌరవించవలసిన అవసరం లేదని వ్యాఖ్యా నించారంటూ బీజేపీ అభ్యర్థి సత్యేంద్ర తివారీపై కూడా ఇదే సంస్థ కేసు నమోదు చేసింది. ఇలాంటి సంస్థలనీ కాంగ్రెస్‌ ప్రయోగించే దొంగ సంస్థలేనని మరచిపోరాదు. మోహన్‌ యాదవ్‌ జైశ్రీరాం అంటూ ప్రచార సభలలో నినదించడం కూడా ఈ సంస్థకు నచ్చలేదట.

 ఇక్కడితో ఆగలేదు. జార్ఖండ్‌ ఆరోగ్యమంత్రి బన్నా గుప్తా ఇంకాస్త ముందుకు వెళ్లి, ముస్లింలను రక్షించుకుంటానని ఒక విడియో విడుదల చేశాడు.

విడిపోతే ఊచకోతే సుమా అంటూ యోగి ఇచ్చిన పిలుపు తరువాత బన్నా గుప్తా ఈ విడియో విడుదల చేశాడు. తాను హిందూ ఫండమెంటలిస్టులను ఎదుర్కొని తీరతానని, వీరు ముస్లింల మీద దాడి చేస్తే తాను అడ్డుకుంటానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఇతడు జంషెడ్‌పూర్‌ (వెస్ట్‌) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు.

కలసి ఉంటే బతుకుతాం లేకుంటే ఊచకోతే అన్న తీరులో యోగి ఆరంభించిన ప్రచారాన్ని ప్రధాని మోదీ ముందుకే తీసుకువెళ్లారు. ఐక్యత లేకపోతే విభజిస్తారు అంటూ ఆయన ఇచ్చిన నినాదం ఇప్పుడు దేశ వ్యాప్తమైంది. మహారాష్ట్ర లవ్‌ జిహాద్‌కు కేంద్రంగా మహారాష్ట్ర మారిపోయిందని చెప్పడం, మత మార్పిడు లకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని చెప్పడమంటే బీజేపీ తన వైఖరిని శషభిషలు లేకుండా ప్రకటించ డమే. దీనిని తప్పు పట్టిన తన మహాయుతి కూటమి భాగస్వామి ఎన్‌సీపీ (అజిత్‌)ని సైతం బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నది. యోగి అన్నదాంట్లో తప్పేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ తేల్చి చెప్పేశారు. యోగి వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాదు, అవి మతోన్మాదంతో చేసినవని ఈ దశలో అజిత్‌ పవార్‌ చెప్పడం బుజ్జగింపు ధోరణికి మోకరిల్లడమే అవుతుంది. ఈయన మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి. అజిత్‌పవార్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఉందని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకోవాలంటే అలాంటి వాళ్లకి సమయం పడుతుందని కూడా పడణవీస్‌ వ్యాఖ్యానించారు. అజిత్‌ సుదీర్ఘకాలం హిందూ వ్యతిరేక శక్తులతో కలసి ప్రయాణించారని, హిందూత్వను వ్యతిరేకించినవారితో దశాబ్దాల పాటు అజిత్‌ కలసి నడిచారని కూడా కాస్త ఘాటుగానే పడణవీస్‌ స్పందించారు.

కాంగ్రెస్‌ను వద్దని చెప్పండి అని మహారాష్ట్ర వాసులను కోరుతూ కొత్త నినాదం కూడా బీజేపీ ప్రచారం చివరి దశలో అందుకుంది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని మహా వికాస్‌ అగాడీకి ఎందుకు ఓటు వేయరాదో కారణాలు చూపింది. అందులో 26/11 ముంబై ఉగ్రదాడులు, 2003 వరస పేలుళ్లు,7/11 రైలు పేలుళ్లు, పాల్ఘార్‌లో సాధువుల ఊచకోత వంటి దుర్ఘటనలను బీజేపీ ఓటర్లకు గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ఈ ఘటనల సమయంలోనే ఒకసారి యూపీఏ కేంద్ర హోంమంత్రి హిందూ టెర్రరిస్టులు అన్న పదం ప్రయోగించారు.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Twitter
YOUTUBE