తెలంగాణ రాష్ట్రంలో పాలన పక్కకు జరిగిందా? ప్రభుత్వాలు  తమ పంతం నెగ్గించుకోవడం, రాజకీయ ఆకాంక్షలే ప్రధానంగా ముందుకెళ్తున్నాయా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్‌ఎస్‌.. ఇప్పటి బీఆర్‌ఎస్‌ ఆ ఆలోచనతోనే దశాబ్దకాలం వెళ్లదీసిందా?  దాదాపు యేడాది క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా అదే బాటలో పయనిస్తోందా? ఈ ప్రశ్నలన్నీ తెలంగాణవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తే, ప్రభుత్వాల వైఖరి గమనిస్తే ఈ అంశాలు తేటతెల్లమవుతున్నాయంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు.. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్న విమర్శలు కూడా ప్రభుత్వాలు మూటగట్టుకుంటున్నాయి.

గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సర్వే పేరిట తమ స•మయాన్ని వృథా చేస్తూ, ఓ రకంగా తమ స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తున్నాయన్న ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2014లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆగమేఘాల మీద సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో వివరాలు సేకరించింది. రా•ష్ట్రం మొత్తం ఒకే రోజు.. ఆ సర్వే చేపట్టింది. డూప్లికేషన్‌ ‌లేకుండా, పొరపాట్లు దొర్లకుండా, తప్పులు చోటు చేసుకోకుండా.. ఒకేరోజు ఈ సర్వే చేపట్టినట్లు అప్పట్లో టీఆర్‌ఎస్‌ ‌సర్కారు ప్రకటనలు చేసింది. 2014 ఆగస్టు 19వ తేదీన యావత్‌ ‌తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ రోజు అత్యవసర సేవలు, మీడియా మినహా అన్ని సంస్థలకు ప్రభుత్వం బలవంతపు సెలవు ఇచ్చింది. దీంతో, ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సర్వేలో నమోదు కాకుంటే అసలు వాళ్లు తెలంగాణ ప్రజలే కాదని, వాళ్లకు సంబంధించిన ఆస్తుల వివరాలు చెప్ప కుంటే ఇకపై ఆ ఆస్తులన్నీ వాళ్లవి కావని అప్పటి ప్రభుత్వం అందరినీ భయపెట్టింది.

తెలంగాణలో ఉండేవాళ్లే కాదు..ఉన్నత విద్య కోసమో, ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, టూర్లకోసమో తెలంగాణ దాటి వెళ్లిన వాళ్లు, దేశ విదేశాల్లో నివసిస్తున్న వాళ్లు కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిన రోజు తప్పనిసరిగా తెలంగాణలోనే అందుబాటులో ఉండాలని, తమ సొంతింట్లో ఉండి అధికారులకు వివరాలు తెలియజేయాలని సర్కారు ఆదేశించింది. దీంతో, విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా 2014 ఆగస్టు 19వ తేదీన తెలంగాణకు వచ్చారు. కేవలం తమ వివరాలు అధికారులకు చెప్పడం కోసం మాత్రమే లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి వచ్చి స్వయంగా తమ వివరాలు వెల్లడించారు. మరి.. అప్పుడేమైంది? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సమగ్ర సర్వే వివరాలే ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదు. అట్టహాసంగా నిర్వహించిన ఆ సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటాలకు పోయింది. పదుల కోట్ల రూపాయలు వెచ్చించింది. ఆ కోట్లాది రూపాయలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. అసలు ఆరోజు నిర్వహించిన తెలంగాణ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే వివరాలు ఏ ప్రభుత్వ పథకానికీ పనికి రాలేదు. ఎవరికీ అవసరానికి అక్కరకు రాలేదు. ఎంతోమంది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వాళ్లు ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్లు అత్యవసరంగా బస్సులు, రైళ్లు, విమానాల్లో వచ్చి మరీ వివరాలు అందజేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిందన్న సంబరం, కొత్త ప్రభుత్వం ఏదో చేస్తున్న ఆశ అప్పుడు.. అందరినీ ఎంత ఖర్చయినా పర్వాలేదన్న ఆలోచన కలిగిం చింది. కానీ, వాళ్ల ఖర్చుకూడా వృథా అయ్యిందన్నది నిర్వివాదాంశం.

ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సమగ్ర కుటుంబసర్వేను తెరపైకి తెచ్చింది. అమలు కూడా మొదలెట్టింది. ‘తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే’ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సర్వేలో ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్‌పార్టీ హడావిడి కూడా కనిపిస్తోంది.

సర్కారు ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సర్వేకు రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌పార్టీ ఇన్వాల్వ్ అవడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో చేపడుతున్న సమగ్ర కుటుంబసర్వేను కాంగ్రెస్‌పార్టీ జాతీయస్థాయిలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు వినియోగించుకుంటోందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇక, సర్వేలో భాగంగా ఈసారి కూడా అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర ఇంటింటి కుటుంబసర్వే ఫారాలు రూపొందించింది. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఉన్న ఆస్తులెన్ని? అప్పులెన్ని? అనేవి లెక్కిస్తామని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెబుతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలేమైనా పొందారా? ఆ ఇంట్లోంచి ఎవరైనా విదేశాలకు వెళ్లారా? ఇప్పటివరకు ఆ కుటుంబంలోని వ్యక్తులెవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? వంటి ప్రధాన ప్రశ్నలను సమగ్ర కుటుంబసర్వే వివరాల్లో చేర్చారు. ఇలా.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీన మొదలయ్యింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తున్నారు ఎన్యూమరేటర్లు. వాటిలో కొన్నింటికి ఉప ప్రశ్నలు కూడా వేసి ప్రతి కుటుంబం నుంచి సమగ్రంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్‌ ‌నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలను కూడా సేకరిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా సర్వేలో నమోదు చేస్తున్నారు.

ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా? వంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా విదేశాలకు వెళ్తే కొన్ని దేశాలను గుర్తించి వాటికి ప్రత్యేక కోడ్‌ ‌కేటాయించారు. యూకే, అమెరికా, గల్ఫ్, ఆ‌స్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేక కోడ్‌ ‌నమోదు చేస్తున్నారు. ఇవి కాకుండా ఇతర దేశాలకు ఎవరైనా వెళ్లి ఉంటే ఇతర దేశం అనే కోడ్‌ ఎం‌చుకుం        టున్నారు. ఈ వివరాలు తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు? ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటిదాకా తెలంగాణలో ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతున్నారు. గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి ఆ రుణం పొందారు? అనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నారు. బ్యాంకులు, స్వయంసహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అప్పుల వివరాలు కూడా ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారు. ఇక, కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలన్నీ ఈ నివేదికల్లో చేర్చుతున్నారు. చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తున్నారు. వీటిలో బైకు, స్కూటర్‌, ‌సొంత అవసరాలకు వాడే కారు, కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా? ఇంట్లో వాషింగ్‌ ‌మిషన్‌, ‌ఫ్రిజ్‌, ఏసీ, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ ఇలా మొత్తం 18 రకాల చరాస్తుల వివరాలన్నీ సేకరిస్తున్నారు ఎన్యూమరేటర్లు. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? వాటి విలువ ఎంత అనేది కూడా నమోదు చేస్తున్నారు. ఇక, ఇంటి విషయానికి వస్తే.. ఇల్లు ఎన్ని గజాల్లో నిర్మించారు? ఆ ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది? ఇంటిలో ఉన్న మొత్తం గదులెన్ని? బాత్‌రూం, మరుగుదొడ్డి ఉన్నాయా? ఇలాంటి వివరాలన్నీ పరిశీలించడంతో పాటు.. కుటుంబసభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. వ్యవసాయ, వాణిజ్య భూమి ఏమైనా ఉందా? ఉంటే.. ఎంత భూమి, ఎన్ని ఎకరాల్లో ఉంది? అది పట్టా భూమా? లేక ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ‌భూమా? లేదంటే పట్టాలేని అటవీ భూమా? వంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇక, గడిచిన ఐదేళ్ల కాలంలో ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా? ఆ పథకాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అటు.. రాజకీయ సంబంధిత కుటుంబమా? అనేది తేల్చేందుకు కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? అనే వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని తప్ప మిగతా ఏ హోదాలో ప్రజాప్రతినిధిగా పనిచేసినా వివరాలు తమ ఫారాల్లో నింపుతున్నారు. వార్డు సభ్యుడి నుంచి కేంద్రమంత్రి, గవర్నర్‌, ‌సీఎం దాకా ఏ పదవి పొందినా సరే ఈ సర్వేలో వివరాలు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేయడానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరిట ఈ సర్వే చేపట్టింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటున్నారు. వీరిలో విద్యాశాఖ నుంచి 48వేల 229 మందిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రాథమిక పాఠశాలలను ఒంటిపూట నడుపుతున్నారు. మధ్యాహ్నం తరువాత టీచర్లు సర్వే చేస్తున్నారు. ఉపాధ్యాయులే కాకుండా ఇతర కేటగిరీల ఉద్యోగులను సైతం వీలును బట్టి సర్వేకు వినియోగిస్తున్నారు.

సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్‌ అతికిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌ 150 ఇళ్ల వరకూ సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఫారాల్లో నమోదు చేసిన వివరాలను వెంటనే కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. వీటికోసం ప్రణాళికశాఖ జిల్లా, మండలాల్లో అవసరమైన డేటాఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చింది. ప్రతిరోజూ ఎన్యూమరేటర్లు తీసుకువచ్చిన వివరాల్ని నమోదు చేస్తున్నారు. అయితే, సర్వే సమయంలో కుటుంబం నుంచి తీసుకున్న సమాచారం విషయంలో గోప్యత పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఆ డేటాను ఇతరులకు తెలియజేయకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారిన.. అప్పటి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా అనేకసార్లు విమర్శలు చేసింది. ఆ సర్వే వివరాలు ఏమయ్యాయని నిలదీసింది. అప్పటి ప్రభుత్వం వైఖరిపై ప్రతిపక్షంగా విమర్శలు గుప్పించింది. కానీ, బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ అంశాన్ని పూర్తిగా వదిలేసింది. మరి.. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ కూడా అదే కోవలో పయనిస్తోంది.

అప్పుడు బీఆర్‌ఎస్‌ను ఎండగట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు మళ్లీ అదే పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబసర్వే నిర్వహిస్తోంది. అయితే, రెంటికీ చిన్న తేడా మాత్రమే ఉంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ ‌సర్కారు ఒకేరోజు సర్వే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 25 రోజుల పాటు సర్వే చేస్తామని ప్రకటించింది. అయితే, ఈసారి కూడా సర్వే కోసం వందలకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి.. ఈసారైనా ఆసర్వే వివరాలు అటు ప్రభుత్వానికి గానీ, ఇటు ప్రజలకు గానీ ఉపయోగపడతాయా అన్నది ఇప్పటికైతే మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగానే చెప్పుకోవచ్చు.

-సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE