ఎన్నికల వేళ ముందూ వెనుకా చూసుకోకుండా ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించడం… అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం అధికారమే పరమావధిగా భావించే కుటుంబ పార్టీలకు అలవాటైన పని. ఆ జాబితాలో ముందు వరసలో ఉండే కాంగ్రెస్ అయితే అలవికాని హామీలిచ్చి ఓట్లు దండుకొని, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం వెన్నెతో పెట్టిన విద్య. ఎన్నికల వేళ గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి గత కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేక తలలు పట్టుకుంటున్నాయి. ‘గ్యారెంటీ’ ఫార్ములాతో ఇటీవలి హరియాణా ఎన్నికల్లోనూ గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. కారణం- తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు హరియాణపై ప్రభావం చూపాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తే హస్తం పార్టీకి సమాధానం లేకపోయింది. దీంతో హరియాణా ప్రజలు విశ్వసనీయత లేని కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మలేదు. ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలవికాని హామీలతో ముందుకు వెళ్తే తలబొప్పి కట్టడం ఖాయమని భయపడిన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి వాగ్దానాలు ఇవ్వాలని ఇప్పుడు హితోపదేశం చేస్తున్నారు.
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలే గుదిబండగా మారాయి. ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఎన్నికల వేళ కాంగ్రెస్ 6 గ్యారెంటీ లతో ఊదరగొట్టింది. ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా సాయంతో పెద్దఎత్తున ప్రచారం చేసింది. అంతకుముందు ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలంలా ఉన్న ప్రజలు ఈ గ్యారెంటీలపై నమ్మబలికిన కాంగ్రెస్‌కు ఓటేశారు. గద్దెనెక్కాక ఓట్లేసి గెలిపించిన ప్రజలను మరచి, ఇచ్చిన హామీలను విస్మరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ గ్యారెంటీ అమలుకు నోచుకోవడం లేదు. అది కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూనే మరోవైపు బస్సులను తగ్గించారు, ట్రిప్పులను కుదించారు. దీంతో ఆర్టీసీపైనే ఆధారపడే సామాన్యు డికి అవసరానికి బస్సులు రావడం లేదు. ఖరీదైన లగ్జరీ బస్సులు, ప్రైవేటు ట్యాక్సీలు, క్యాబ్ సర్వీసులపై ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తడంతో చేతి చమురు భారీగా వదిలించుకోవాల్సి వస్తోంది. ఉన్న అరకొర బస్సులు సైతం విపరీతమైన రద్దీతో కాలు మోపలేని పరిస్థితిలో ఉన్నాయి. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాల్సిన ఆర్టీసీ బస్సు ప్రయాణం నరకంగా మారింది.పురుషులే కాదు, మహిళలు సైతం నీరుగారుస్తున్న ఉచిత బస్సు ప్రయాణం హామీపై శివాలెత్తుతున్నారు.
మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఆర్థిక సాయం హామీ ఇంతవరకు లేదు. రూ.500కే గ్యాస్ సిలిండర్ కొంతమందికే అందుతోంది. ఉచిత విద్యుత్‌నూ కొందరికే వర్తింప చేసి చేతులు దులిపేసుకుంది. రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చి అది ఇవ్వకపోగా, ఇప్పటివరకు ఉన్న రూ.10,000 రైతుబంధు సాయానికీ బందు పెట్టింది. వ్యవసాయ కూలీలకు చేస్తానన్న రూ.12,000 ఆర్థిక సాయం అటకెక్కింది. వరికి రూ.500 బోనస్ అని ఇప్పుడు సన్నొడ్లకే అని మెలిక పెట్టింది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల సాయం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్య భరోసా కార్డు, నెలకు రూ.4000 పెన్షన్ వంటి హామీలేవీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
కర్ణాటక కాంగ్రెస్ సర్కారులోనూ ఇవే వైఫల్యాలు. అంతోఇంతో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘శక్తి’ పథకానికి కూడా బ్రేక్ వేసే యోచనలో ఆ ప్రభుత్వం ఉంది. ఈ పథకాన్ని సమీక్షిస్తామంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అన్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 10 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చింది.
కొందరు కొంత మందిని కొంత కాలం మోసం చేయగలుగుతారు. ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదు. ప్రజలకు అర్థమైన రోజు కర్రు కాల్చి వాత పెడుతారు. హరియాణాలో అదే జరిగింది. రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం అవుతుందని బెంగ పట్టుకుందో ఏమో మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగానే వాగ్దానాలు ఇవ్వాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీ హామీలు అమలు చేయడం లేదని ఖర్గే పరోక్షంగా అంగీకరించారు. ఖర్గే వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో చురకలంటించారు. అమలు చేయలేని వాగ్దానాలు ఇవ్వడం సులభమే కానీ వాటిని సక్రమంగా అమలు చేయడం కష్టమని లేదా అసాధ్యమని కాంగ్రెస్ గ్రహిస్తోందన్నారు. ఎన్నటికీ నెరవేర్చలేరని తెలిసీ వారు ప్రచారంలో హామీలు గుప్పిస్తూనే ఉంటారని, ఇప్పుడువారు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారని ఎండగట్టారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ఏ రాష్ట్రానైనా- హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ- పరిశీలించండి… అభివృద్ధి గమనం, ఆర్థిక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. వారు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజలకు భయంకరమైన మోసం. ఇలాంటి రాజకీయాల బాధితులు పేదలు, యువకులు, రైతులు, మహిళలే. వారికి ఈ వాగ్దానాల ప్రయోజనాలు అందకుండా చేయడమే కాదు, కొనసాగుతున్న పథకాలను కూడా నీరుగారుస్తున్నారు. కాంగ్రెస్ ప్రాయోజిత బూటకపు వాగ్దానాల సంస్కృతిపై దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి! హరియాణా ప్రజలు వారి అబద్ధాలను ఎలా తిప్పికొట్టారో… స్థిరమైన, అభివృద్ధి ఆధారిత, కార్యాచరణతో నడిచే ప్రభుత్వాన్ని ఎలా ఇష్టపడతారో ఇటీవల చూశాం. కాంగ్రెస్‌కు పడే ఓటు దుష్పరిపాలన, బలహీనమైన ఆర్థికం, అంతులేని దోపిడి కోసమే అని యావత్ భారతదేశం భావిస్తోంది. ఇప్పుడు భారతీయులు అభివృద్ధి, పురోగతిని కోరుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో తలమునకలై ఉంది. అభివృద్ధి ఆలోచన అనేదే లేకుండా దోపిడీకి పాల్పడుతోంది. అంతేకాదు, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను కూడా ఉపసంహరించుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గతంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలోనూ హామీ ఇచ్చిన అలవెన్సు లను ఐదేళ్లపాటు అమలు చేయలేదు. కాంగ్రెస్ పనితీరును చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.’’ అని ఎక్స్‌లో ట్వీట్‌లు పెట్టి హస్తం పార్టీ వైఖరిని ఎండ గట్టారు. ఈ ట్వీట్‌తో పాటు పెట్టిన హ్యాష్ ట్యాగ్ FakePromises Of Congress ట్రెండింగులోకి వచ్చిందంటే ప్రజలు ప్రధాని వ్యాఖ్యలను ఎంతలాసమర్థిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాని నగ్నంగా బయటపెట్టడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిస్పందనగా అబద్ధాలను వండి వారుస్తూ ట్వీట్ పెట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు కానీ తగ్గించిన బస్సులను, కుదించిన ట్రిప్పుల గురించి పేర్కొనలేదు. 22.22 లక్షల రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 38.63 లక్షలకు పైగా రైతులు రుణమాఫీకి అర్హులు. అంటే మరో 16-17 లక్షల రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని అంగీకరించినట్టే. అంతేకాదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక స్వయంగా రేవంత్ రెడ్డే రూ.40వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు రూ.18వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. రూ.22వేల కోట్ల మేరకు రైతులు నష్టపోయారనే భావించాల్సి ఉంటుంది. 50వేల ఉద్యోగాలిచ్చాం అన్నారు, కానీ అందులో చాలా వరకు నోటిఫికేషన్లు గత ప్రభుత్వంలో జారీ చేసినవే. వాటికి నియామక పత్రాలు అందించి తామే ఉద్యోగాలిచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి హామీలేవీ ప్రస్తావించలేదు. ఇలా అవాస్తవాలు, అర్ధసత్యాలతో తెలంగాణను కమ్ముకున్న చీకట్లను దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉదయించే సూర్యుడిలా వెలుగుతోందని చెప్పుకొచ్చారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడలేదని అనుకుం టుంది. రేవంత్ రెడ్డి ట్వీట్ కూడా అచ్చం అలానే ఉంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ గ్యారెంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేమని అంగీక రించడమేమల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల పరమార్థం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ 6 గ్యారెంటీలు.. డిక్లరేషన్ల పేరుతో రైతులు, మహిళలు, యువకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తనతో సహా సోనియా, రాహుల్, ప్రియాంకలు చేసినవన్నీ బూటకపు వాగ్దానాలేనని ఖర్గే పరోక్షంగా ఒప్పుకొన్నారు. తెలంగాణలో అధికారంలో కొనసాగే నైతికత కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదు. ఏరు దాటేదాక ఓడ మల్లన్న… ఏరు దాటాకబోడమల్లన్నఅన్నది కాంగ్రెస్ తీరు అని మరోసారి నిరూపితమైంది.
– భువన