భాగ్యనగర వాయుకాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతున్నదన్న వార్త నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వాహనాల వినియోగం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయంగానే అనిపిస్తుంది. కానీ

ఇదే వేగం అన్ని విధానాలలోను కనిపించక పోవడమే విచారకరం. సంక్రాంతి నుంచి సన్నబియ్యం అందుకోవాలన్న ప్రజల మనోవాంఛ నెరవేరేటట్టు కనిపించక పోవడమే ఇందుకు నిదర్శనం.

ఎలక్ట్రానిక్‌ వాహనాల(ఈవీ)పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు పర్యావరణానికి, ఇటు వాహనదారులకు ప్రయోజనం కలిగించేలా ఉందని హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకానికి కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదలైన భారత కాలుష్యకారక నగరాల జాబితాలో రాజధాని ఢిల్లీ నగరం అత్యంత కాలుష్యకారక నగరంగా నమోదు కాగా.. హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచింది. అంటే.. ఈ విషయంలో హైదరాబాద్‌ కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉందన్నది దీని సారాంశం. ఈ నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీ వాహనాలకు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2026 దాకా అమలులో ఉంటుందని వెల్లడిరచింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు పూర్తిగా ఎత్తివేసింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఆశాజనకంగా మారింది. అటు.. పర్యావరణానికి కూడా మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు, పర్యావరణానికి రెండు రకాలుగా ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే, పథకం అమలులో అధికార వర్గాల నుంచి గానీ, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి గానీ ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్నది చూడాల్సి ఉంది.

ఓవైపు.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో బెంబేలెత్తి పోతున్న జనం.. మరోవైపు.. పర్యావరణ హితం గురించి కూడా కొంతకాలంగా ఆలోచిస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్‌ వాహనాల మైలేజీ అంశం ప్రధానంగా వెనుకడుగు వేయిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాటరీ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. ఈ సదుపాయం అన్నిరకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు అమలు చేస్తారు. గతంలో రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజుకు పరిమితులు ఉండేవి. ప్రతి యేడాది తొలి 2లక్షల బైక్‌లు, 8వేల కార్లు, 2వేల ఆటోలకు మాత్రమే ఈ మినహాయింపులు ఇచ్చేవారు. ఈ మినహాయింపులపై ఇప్పుడు ఎలాంటి పరిమితి లేదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ప్రస్తుతం రోడ్‌ ట్యాక్స్‌ రూపంలో చూసుకుంటే పదిలక్షలకు పైగా ధర ఉన్న కారుకు 17శాతం, బైక్‌లకు 12శాతం రోడ్‌ట్యాక్స్‌ విధిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో మరింత ఖర్చవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కొంటే ఈ ఖర్చులన్నీ తప్పించుకోవచ్చు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు తాళలేక ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నవారికి ప్రస్తుత వెసులుబాటు మరింత ప్రయోజనకరంగా మారింది. ఇటీవలే కొన్నవారికి, ఇకపై కొనాలనుకుంటున్న వారికి ఇది బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పుకోవచ్చు. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో 2026 డిసెంబర్‌ 31 దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ మోటారు వాహనాలకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజును మినహాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శబ్ద, వాయు కాలుష్యాన్ని నిరోధించే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులకు రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు రద్దయ్యాయి. రాష్ట్రంలో కొన్న ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ మేరకు జీవో నెంబర్‌ 41 కూడా జారీ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.7 లక్షల ఈవీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అదే విధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడువేల ఈవీసిటీ బస్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15ఏళ్లు దాటిన పాత వాహనాలకోసం స్క్రాప్‌ పాలసీ తీసుకువచ్చింది. త్వరలో రెండు స్క్రాప్‌ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

కార్ల ధర 10 లక్షల లోపు అయితే 14శాతం, ధర 10 లక్షలపైన అయితే 17శాతం రోడ్‌ ట్యాక్స్‌ మిగులుతుంది. ఒకవేళ కొనుగోలుదారు పేరిట అప్పటికే బైక్‌ గనక ఉంటే 2 శాతం అదనంగా ట్యాక్స్‌ పడుతుంది. అంటే మొత్తం 19 శాతం మిగులుతుంది. ఆ రకంగా ఈవీ కారు కొన్నవారికి రూ.1.40 లక్షల నుంచి రూ.1.90 లక్షల దాకా మిగులుతుంది. ద్విచక్రవాహనాలయితే కొన్న ధరలో 12శాతం రోడ్‌ ట్యాక్స్‌ మిగులుతుంది. బైక్‌లు, కార్లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1500-2వేల వరకు మిగలనుంది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిమిత ఎలక్ట్రిక్‌ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి రోజూ దాదాపు 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు కూడా ఉంటున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగు తుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్‌ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

…….

సన్నబియ్యంపై ఊరింపు ఇంకెన్నాళ్లు?

రాష్ట్రంలో కొన్ని పథకాలు విషయంలో వాటిని ప్రకటించడంలో ఉన్న ఉత్సాహం అమలులో కని పించడంలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రకటనలు కూడా అమల్లోకి రావడం లేదు. ముందూ వెనుకా చూసుకోకుండా, వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోకుండా ప్రకటనలు చేస్తున్నారు.  ప్రకటనలు చూసి మురిసిపోతున్న జనం సంతోషం.. మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు రేషన్‌ కార్డుదారులను ప్రభుత్వం చేసిన సన్నబియ్యం ప్రకటన ఊరిస్తోంది. జనవరి నుంచి అంటే సంక్రాంతి నుంచి రేషన్‌ కార్డుల మీద సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో రేషన్‌కార్డు దారులు సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రాక్టికల్‌గా చూస్తే.. సంక్రాంతికి ఈ హామీ అమలయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. దీంతో, ఈ హామీ కూడా ఊరించి. ఉసూరుమనిపించేలా తయారయ్యింది. ఈ పథకం ‘సంక్రాంతికి కాదు.. ఉగాది నుంచి’ అని అధికారులు అంటున్నారు. ఇప్పుడు రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని, మిల్లింగ్‌ చేస్తే.. అవి కొత్త బియ్యం కాబట్టి.. అన్నం ముద్దగా అవుతుందని చెబుతున్నారు. ఖరీఫ్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్‌ చేస్తే… బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని, నాణ్యత లోపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కనీసం మూడు నెలలపాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్న బియ్యాన్ని స్టేట్‌ పూల్‌ రిజర్వు గోడౌన్లలో నిల్వ చేసి, మూడు నెలల తర్వాత ఉగాది నుంచి రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తున్నా మంటున్నారు. ఆ బియ్యం వండుకునేందుకు అనువుగా అయ్యేందుకు కనీసం మూడు నెలలు ఆగాలంటే.. ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తారనే ప్రచారం మొదలైంది.

2025లో ఉగాది మార్చి 30న వచ్చింది. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి వరకూ బియ్యాన్ని నిల్వచేస్తే.. అవి పాతబియ్యంగా మారతాయి. అప్పుడు ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే.. రేషన్‌ కార్డుదారులకు నిరాశ తప్పదు. మరో 4 నెలలపాటూ ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ, సన్న బియ్యాన్ని సంక్రాంతి నుంచి ఇస్తారని ఎదురుచూస్తున్న ప్రజలు, అధికారుల ప్రకటనతో నిరాశ పాలవుతున్నారు. దీంతో, మంత్రులు ఇలా రేషన్‌ లబ్దిదారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.

మరోవైపు.. ప్రభుత్వం మరో సమస్యను తెరపైకి తెస్తోంది. రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం సంవత్సరం పాటూ ఇవ్వాలంటే.. ఈ పథకానికి నెలకు 2లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం అవసరం. అంటే.. 36 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం పెద్దగా రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 3 లక్షల టన్నులే వచ్చాయి. రైతులు బహిరంగ మార్కెట్లోనే సన్నాలను అమ్ముకుంటున్నారు.సన్నధాన్యం దిగుబడి అంచనాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కొనుగోలు కొనుగోలు కేంద్రాలకు 50 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని సీజన్‌ ప్రారంభంలో అంచనా వేసిన ప్రభుత్వం, ఆ తర్వాత 40 లక్షల టన్నులుగా, తాజాగా 35లక్షల టన్నులుగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పంపిణీకి సరిపోయేలా ధాన్యం వస్తుందా? లేదా? అనే సందేహాలున్నాయి. ఒకవేళ లక్ష్యానికి అనుగుణంగా సన్న ధాన్యం రాకపోతే సన్న బియ్యాన్ని మళ్లీ బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే… మళ్లీ టెండర్లు పిలవడం, రైస్‌మిల్లర్ల నుంచి ప్రొక్యూర్మెంట్‌ చేయటం వంటి పనులుంటాయి. ఐతే.. రబీలో కూడా వరిని పండిస్తారు. ఆ బియ్యాన్ని కూడా రేషన్‌ కార్డుదారులకు ఇవ్వొచ్చు, అది సమస్య కానే కాదు. ఖరీఫ్‌లో పండిరచినవి కాకుండా.. అంతకుముందు రబీలో పండిరచిన సన్న బియ్యాన్ని సంక్రాంతి నుంచి ఇవ్వొచ్చు కదా.. అని కొందరు అంటున్నారు. అయినా సర్కారు నుంచి స్పందన లేదు.

కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఇటీవలే ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది జనవరి 2025 నుంచి అంటే సంక్రాంతి పండుగ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ హామీ, ఆ ప్రకటన అమలులో కూడా మరింత జాప్యం జరుగుతోంది. అంటే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాతే సన్నబియ్యం ఇచ్చినట్లవుతుంది. మార్చి 30న సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించినా, బియ్యం ఏప్రిల్‌ 1 నుంచి ఇచ్చి, వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ ఖాతాలో వెయ్యాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై కచ్చితమైన స్పష్టత ఇవ్వడంలేదు. ఏదో ఒక మెలిక పెడుతూ ఉంటే.. ఇక పేదలకు సన్న బియ్యం దక్కేదెప్పుడు? అధికారులు.. దక్కేలా చెయ్యాలి గానీ.. పేదల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని నిపుణులు అంటున్నారు. అందువల్ల ప్రభుత్వం సంక్రాంతి నుంచి సన్న బియ్యం ఇస్తుందా, ఇవ్వదా అనేది సందేహంగా మారింది.

గత బీఆర్‌ఎస్‌ సర్కారు కూడా సన్నబియ్యం అంటూ ఊరించింది.అనేక సార్లు ప్రకటనలు చేసింది. ప్రజలు ఎదురుచూడటం తప్ప.. హామీలు, ప్రకటనలు అమల్లోకి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కూడా అలాగే కాలం గడిపేలా ఉంటాయా? ఆలస్యంగానైనా అమలవుతాయా? అనేది చూడాలి.

– సుజాత గోపగోని, సీనియర్‌ జర్నలిస్ట్‌, 6302164068

About Author

By editor

Twitter
YOUTUBE