అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను నవంబరు 11న అసెంబ్లీకి సమర్పించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు తన తొలి బడ్జెట్టులో పెద్దపీట వేసింది. ఇప్పటికే రెండు పథకాలు అమలుచేయగా, అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకాలకు కూడా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అభివృద్ధికి సముచిత స్థానం కల్పించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లనిర్మాణం సహా అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కడా తగ్గలేదు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లతో పద్దులు సరిపెట్టిన ప్రభుత్వం రెండు బడ్జెట్లకు కలిపి రూ.2.39 లక్షల కోట్లకు ఆమోదం తీసుకుంది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో పద్దును స్థిరీకరించారు. కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం అనంతరం, ఇ- ఆఫీస్ ద్వారా గవర్నర్‌కు పంపించారు. గవర్నర్ అందుబాటులో లేకపోవ డంతో ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకున్నారు.
రెండుసార్లూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లే..
ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు గత ప్రభుత్వం నాలుగు నెలలకుగాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. నేటి అసెంబ్లీలో వచ్చే 4 నెలలకు పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ నుంచి జులై వరకు మొదటి 4 నెలలకు రాష్ట్రంలో జీతాల చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి రూ.1,09,052.34 కోట్లకు ఆమోదం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2,86,389.27 కోట్లకు ప్రతిపాదించి 4 నెలల ఖర్చుకు ఆమోదం పొందారు.
సూపర్ సిక్స్‌కు నిధుల కేటాయింపు
ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థ్ధి• •మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయిస్తావని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తామని వివరిం చారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోలేదని, ఈ ప్రాజెక్టును ఏళ్ల తడబడి గాలికొదిలేసిందని మండి పడ్డారు. వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా చూస్తామని, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌ను రూపొందించి నట్లు తెలిపారు. పట్టణాల్లో 204, గ్రామీణ ప్రాంతాల్లో 158 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతి నిలవనుందని మంత్రి ప•్యవుల పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి..
ఈ ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ మరుసటి నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేయాల్సి వచ్చింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ద్వారా ఆర్డినెన్సు జారీ చేయించారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు ఇతర నిర్వహణ ఖర్చులకూ కలిపి రూ.1,29, 972.97 కోట్లకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 8 నెలల కాలానికి రూ.2,39,025.31 కోట్లకు అనుమతి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చింది.
రాష్ట్ర బడ్జెట్ స్వరూపం..
వ్యవసాయ బడ్జెట్ రూ.43,402.33 కోట్లు, రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా : రూ.32,712 కోట్లు, రెవెన్యూ లోటు : రూ.34,743 కోట్లు, ద్రవ్యలోటు : రూ.68,743 కోట్లు, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా : 4.19 శాతం., జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా : 2.12 శాతం.
వివిధ రంగాలకు కేటాయింపులు
మానవ వనరులకు రూ.16,705 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.39,007 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం రూ.18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లు, మైనార్టీలకు రూ.4,376 కోట్లు, మహిళ, శిశు సంక్షేమం కోసం రూ.4,285 కోట్లు, మానవ వనరుల అభివృద్ధికి రూ.1,215 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 29,909 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.4,012 కోట్లు కేటాయించారు. పరిశ్రమలు వాణిజ్య రంగానికి రూ. 3,127 కోట్లు, ఇంధన రంగానికి రూ.8,207 కోట్లు, ఆర్ అండ్ బీకి రూ. 9,554 కోట్లు, యువజన, పర్యాటక, సాంస్కృతిక విభాగాలకు రూ.322కోట్లు, పోలీస్ శాఖకు, రూ.8,495 కోట్లు, పర్యావరణ, అటవీ శాఖకు రూ. 687 కోట్లు ప్రత్యేకించారు.
రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసు కుంటున్నా’ అంటూ ప్రారంభించారు. ‘వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్య రమ పండి పులకింప సంశయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టువానికి భుక్తి లేదు..’’ అని ప్రముఖ కవి గుర్రం జాషువా రైతుపై రాసిన కవితను చదివి వినిపించారు. గత ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వెన్నెముక వంటి వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడిందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌లో పకృతి వ్యవసాయానికి, సాంకేతికతకు ప్రాధాన్యం కల్పించామని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ఉపయోగించి భూసార పరీక్షలు చేపట్టనున్నామని మంత్రి వివరించారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా రాయితీపై ఎరువుల పంపిణీ చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
కేటాయింపులు..
రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు, భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు, విత్తనాల పంపిణీకి రూ.240 కోట్లు, ఎరువుల సరఫరాకు రూ.40 కోట్లు, ‘పొలం పిలుస్తోంది’ కి రూ.11.31 కోట్లు, పీఎసీల ద్వారా ఎరువుల పంపిణీ డిజిటల్ వ్యవసాయానికి రూ.44.77 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద రూ.628 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు, రైతు సేవా కేంద్రాలకు రూ.26.92 కోట్లు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు రూ.44.03 కోట్లు, పంటల బీమాకు రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.8,564.37 కోట్లు, ఉద్యానశాఖ శాఖకు రూ.3,469.47 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.108.44 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.8 కోట్లు, సహకార శాఖకు రూ.308.26 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ.422.96 కోట్లు, ఎన్జీ రంగా యూనివర్సిటీ – రూ.507.3 కోట్లు, ఉద్యాన యూనివర్సిటీ – రూ.102.22 కోట్లు, వ్యవసాయ పశు విశ్వవిద్యాలయానికి రూ.171.72 కోట్లు, ఫిషరీస్ యూనివర్సి•కి రూ.38 కోట్లు, పశు సంవర్థక శాఖకు- రూ.1,095.71 కోట్లు, మత్స్యరంగం అభివృద్ధి కి రూ.521.34 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.7,241.3 కోట్లు, ఉపాధి హామీ అనుసంధానం కార్యక్రమానికి రూ.5,150 కోట్లు, ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు కేటాయించారు.
వైసీపీ పాలనలో బాధ్యతారాహిత్యం
ఈ పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరులో ప్రవేశపెట్టడం ఒకటైతే, బడ్జెట్ వేళ చర్చకు ప్రతిపక్షం లేకపోవడం శోచనీయం. 11 సభ్యులు కలిగిన వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కినుక వహిస్తూ చర్చకు హాజరు కాకపోవడం బాధ్యతారాహిత్యం. సమస్యల గురించి ప్రస్తావించేందుకు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలకు అసెంబ్లీ సమావేశాలు ఒక చక్కని అవకాశం. ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుంటే ఎవరు ప్రస్తావిస్తారు? సమస్యల పరిష్కారం ఎలా సాధ్యం అవుతుంది? జగన్ హాజరు కాకున్నా కనీసం మిగతా ఎమ్మెల్యేలను కూడా పంపక పోవడం పెద్ద తప్పుగా ప్రజలు ఆరోపిస్తున్నారు. జగన్ తీరు అసలుకే మోసం తెచ్చేలా ఉందని సొంత• పార్టీ నేతలే బాహటంగా అంటున్నారు. జనం ఇస్తేనే కదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేది ఆ పదవి ఇస్తేనే సభకు వెళ్తానని మారం చేయడం ఏంటని సొంత పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజుల క్రితం తాడేపల్లిలో తనను ఎదురు ప్రశ్నించని విలేకరులను ముందేసుకుని జగన్ మాట్లాడారు. సభలో మాట్లాడినట్లే మీడియాతో రోజూ గంటసేపు మాట్లాడతానని, ప్రజా సమస్యలు లేవనెత్తుతానని ప్రకటించడం హాస్యాస్పదం అయింది. జగన్ వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడ్డాయి. ఆయన చెప్పిందల్ల వింటేనే ప్రజాస్వామ్యమా? అని విరుచుకుపడ్డాయి.
తమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకు జనం శాసనసభ్యులుగా గెలిపించి పంపారని, ప్రతిపక్ష హోదా వస్తుందనో, ప్రతిపక్ష నేత పదవి వస్తుందనో కాదని.. జగన్ సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారపక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఇదే డిమాండ్‌ను అందుకున్నాయి. జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించాయి. సభలో పార్టీలు, సంఖ్యాబలం ప్రకారమే విపక్ష హోదా, విపక్ష నేత హోదా లభిస్తాయని తెలిసీ, నాటకాలు ఆడుతున్నారని ఆ పార్టీల నాయకులు చెప్పారు. గత ఐదేళ్ల దుష్పరిణామాలపై సభలో అధికారపక్షం నిలదీస్తే జవాబు ఇవ్వలేమని ముందే చేతులెత్తేసారని, దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్