చరిత్రకు తరగని గని తెలంగాణ. ఆదిమమానవుని అడుగుజాడల నుంచి అసఫ్‌ ‌జాహీల కాలం దాకా చరిత్ర, వారసత్వాన్ని అదిమి పట్టుకొన్న ఎన్నో పురాతన స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, నాణేలు, కళాఖండాలు, తెలుగువారి లక్షన్నరేళ్ల ప్రయాణానికి మైలురాళ్లు గా నేటికీ నిలిచే ఉన్నాయి. వీటిలో పురామానవ నివాసాలైన గుహలు, శిలాయుగపు చిత్రకళా స్థావరాలు, ఇనుప యుగపు సమాధులు, చారిత్రక తొలి, మధ్యయుగానంతర కట్టడాలు, అయా కాలాల సౌందర్య దృష్టికి అద్దం పట్టే అపురూప కళాఖండాలు కోకొల్లలు. ఎల్లలు దాటిన వాటి కీర్తి కిరణాలు తెలుగువారి వెలుగుల ప్రస్థానాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తురిస్తున్నాయి.

ఇన్ని పురాతన స్థలాలు, కట్టడాలున్నా, ప్రభుత్వ రక్షణలో ఉన్నవి కొన్నే. మరికొన్ని ప్రైవేట్‌ ‌వ్యక్తుల అధీనంలో ఉండగా, ఎన్నో శిథిల కట్టడాలు రక్షణ కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ వారసత్వ శాఖ అధీనంలో దాదాపు 850 వరకూ, కేంద్ర పురావస్తు శాఖలో 8 వరకూ ఉన్నాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో 37, హైదరాబాదు జిల్లాలో 27, కరీంనగర్‌లో 42, ఖమ్మంలో 18, మహబూబ్‌ ‌నగర్‌లో 57, మెదక్‌లో 30, నల్గొండలో 59, నిజామాబాద్‌లో 20, రంగారెడ్డిలో 27, వరంగల్‌  ‌జిల్లాలో 50 వారసత్వ శాఖ అధీనంలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు అలనాపాలనా లేక, ఆదుకొనే వారు లేక, దాతలు ముందుకు రాక కునారిల్లు తున్నాయి. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే బదులు స్థానికులు, కార్పొరేట్‌ ‌సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినప్పుడే వారసత్వ స్థలాలు, కట్టడాలూ మనగలుగుతాయి.. భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయి.

అపురూప ఆలయాలు ఆదరణ లేక కునారిల్లు తున్నాయి. ఆకాశగోపురాలు నేలమట్టమవుతున్నాయి. బౌద్ధ, జైనమందిరాలు మట్టిగొట్టుకుపోతున్నాయి. తెలుగుజాతి గురుతులన్నీ చెరిగిపోతున్నాయి. పిచ్చిమొక్కలు, బండరాళ్లు, మట్టిదిబ్బలే మన వారసత్వ చిహ్నాలు కాబోతున్నాయి. కళ్లు తెరిచి కాపుగాయకుంటే,  కాలం పంచిన సంపదంతా కాలం చేసేస్తుంది. గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. చరిత్రను చిన్నచూపు చూసే వాడికి వర్తమానంలో విలువ దక్కదు.  మూలాలను గుర్తుపెట్టుకుని, అస్తిత్వ చిహ్నాలను నిలుపుకునే  జాతి కాలగమనంలో  నిలబడుతుంది. సమున్నతంగా ఎదుగుతుంది. ఇలా ఎదిగే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంటున్నారు తెలుగు వారు.

వారసత్వమంటే ముందు తరాలవారు అందించింది, ఇప్పటి తరం అందుకునేది, రేపటి తరం అందుకోబోయేది. ఇది కనిపించే వారసత్వం. కనిపించని వారసత్వం రెండు రకాలు. ప్రాకృతిక వనరులు, వాటి సౌందర్యం, కొండకోనలు, వాగులు వంకల నుంచి ఎడారుల వరకూ ‘కనిపించే’ వర్గంలోకి వస్తాయి. చారిత్రక స్థలాలు, కట్టడాలు, కళాఖండాలు కూడా ఈ కోవలోవే. ఇక కనిపించని వారసత్వమంటే పాడితేనే వినిపించే పాట, ఆడితేనే కనిపించే ఆట, ప్రదర్శిస్తేనే గానీ చూడలేని నాటకం, నృత్యం, ఇంద్రజాలం పండుగలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు లాంటివి.

యునెస్కో ప్రపంచ మానవులంతా ఒక్కటేనన్న భావనతో ప్రతి దేశం, ప్రతి ప్రాంతంలోని ఈ రెండు రకాల వారసత్వాలను పరిరక్షించుకోవడానికి 1972 నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంపదలుగా గుర్తించిన వారసత్వ ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రజలకు గుర్తుచేస్తోంది. ప్రాంతీయంగా చారిత్రక ప్రాధాన్యం స్థలాలు, కట్టడాలు, కళాఖండాలను రాష్ట్ర పురావస్తు శాఖ, జాతీయ స్థాయిలో ప్రాధాన్యతగల  వాటిని కేంద్ర పురావస్తు శాఖ, అంతర్జాతీయ స్థాయి గల వాటిని యునెస్కో ఆధ్వర్యంలోని ప్రపంచ వారసత్వ కేంద్రం పరిరక్షిస్తున్నాయి. గత కాలపు వారసత్వ వైభవ, ప్రాభవాలను ముందు తరాలకు అందిస్తున్నాయి. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రముఖమైన కట్టడాలను దత్తత తీసుకొని వారసత్వ పరిరక్షణలో పాలు పంచుకొంటున్నాయి.

సెప్టెంబర్‌ 2024 ‌నాటికి 170 దేశాల్లో 952 సాంస్కృతిక, 281 ప్రాకృతిక, రెండూ కలిపి మొత్తం 1223 వారసత్వ స్థలాలు, కట్టడాలను యునెస్కో గుర్తించింది. మన దేశం నుంచి ఈ జాబితాలో 28 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి రామప్ప దేవాలయం చోటు దక్కించుకుంది. కేంద్ర పురావప్తు శాఖ దేశంలో 8600 చారిత్రక స్థలాలు కట్టడాలను రక్షిత స్థలాలు, కట్టడాలుగా ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల అధ్వర్యంలో 135, 665 చారిత్రక స్థలాలు, కట్టడాలు ఉన్నాయి. ఇంకా హైదరాబాదు మహానగర పాలక  సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 200 వరకూ చారిత్రక ప్రాధాన్యత గల కట్టడాలు పరిరక్షణలో ఉన్నాయి.

రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో… శిలాయుగపు చిత్రాలున్న గుహలు, కొండ చెరియలు, కొత్త రాతియుగం, రాగి – రాతియుగం, ఇనుప యుగం, తొలి, మధ్య యుగాలకు చెందిన ఆనవాళ్లను భద్రపరచుకున్న ప్రదేశాలు ఉన్నాయి. బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతపరమైన గుహలు, కట్టడాలు, కోటలు, ఇస్లామిక్‌ ‌కట్టడాలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు, రహదారులు నిర్మించినప్పుడు ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాలు రూపం కోల్పోతున్నాయి, అయినా ప్రభుత్వం అంటీ ముట్టనట్లే ఉంటోంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే… నీటి ముంపు ప్రాంతాల్లోని కట్టడాలను ఎగువకు తరలించారు. చాలా సందర్భాల్లో అలానే వదిలేశారు. నాగార్జున సాగర్‌, ‌శ్రీశైలం మొదలైన జలాశయాల్లో ముంపునకు గురైన కట్టడాలను ఎగువకు తరలించి పునర్నిర్మించారు, ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని చారిత్రక స్థలాలు, కట్టడాలను గుర్తించారు గాని వాటి పరిరక్షణకు శ్రద్ద చూపించిన జాడల్లేవు. వరంగల్‌ ‌జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా భారీ సొరంగం తవ్వాలని గతంలో నిర్ణయించారు. దీనివల్ల ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర గల రామప్ప దేవాలయం కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం తలెత్తగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. ప్రజాసంఘాలు, స్థానికులు, పత్రికలు ఎలుగెత్తడంతో పాలకులు సొరం నిర్మాణాన్ని ఆపారు. ఇదీ వారసత్వ సంపదలకు దక్కుతున్న గౌరవం!

మరోవైపు, ఆక్రమణలు, గుప్తనిధుల కోసం తవ్వకాలు, గనుల గుత్తేదారుల స్వార్థం… ఎన్నో చారిత్రక అనవాళ్లకు చేటు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని గోల్కొండ తదితర ప్రసిద్ధ ప్రదేశాల్లో ఆక్రమణలకు కొదవే లేదు. ఉండ్రుగొండ, రాచకొండ కోటలు గుప్తనిధుల అన్వేషకుల గునపం దెబ్బలకు కూలిపోతున్నాయి. రక్షిత కట్టడాలను నాశనం చేసిన, ఆక్రమించుకున్న వారికి రెండేళ్ల కారాగార శిక్ష అని ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాల చట్టం (కేంద్రం) స్పష్టం చేస్తోంది. రాష్ట్ర పురావస్తు చట్టం ప్రకారం… అలాంటి వారికి మూడు నెలల శిక్ష ఖాయం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో చట్టం పేరు వారసత్వ తెలంగాణ అని మారిందే తప్ప ఈ చట్టాల కింద తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం.

రాష్ట్ర పురావస్తు శాఖాధికారుల మాటలను పట్టించుకుంటున్న వారే లేరు. రాష్ట్రంలోని ఇతర చారిత్రక కట్టడాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవ డానికి సిబ్బంది కొరత, నిధుల లేమి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు అంటున్నారు. అవి కుంటిసాకులు మాత్రమే. 12, 13  ఆర్థిక సంఘాల కింద దాదాపు రూ.140 కోట్లు  వచ్చాయి. వాటిని కట్టడాల పరిరక్షణకు పూర్తిస్థాయిలో వినియోగించు కోలేకపోయారు. ఉన్న స్థలాలు, కట్టడాలను ఆలనాపాలనా చూసే సత్తా లేని శాఖ, ఇటీవల మరికొన్ని కొత్త స్థలాలను, కట్టడాలను పరిరక్షించ డానికి జీవోలను తెప్పించి చేతులు దులుపుకుంది.

చారిత్రక ఆనవాళ్లంటే ప్రభుత్వ యంత్రాంగాలకు ఎంత ప్రేమో చెప్పడానికి ఒక ఉదాహరణ. హైదరా బాద్‌లో  ప్రసిద్ధ నవాబ్‌ ‌మకర్రబ్‌ ‌దేవిడీ ఉంది. ఇందులో పరిశ్రమల శాఖ కార్యాలయం నడుస్తోంది. అయితే, భవనం పాతదయిపోయిందని, పడగొట్టేయా లని ప్రభుత్వానికి లేఖ రాశారు పరిశ్రమల శాఖాధి కారులు. చారిత్రక స్మృతిని మట్టిపాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే చివరి నిమిషంలో పురావస్తు శాఖ జోక్యం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. రాజధాని నగరంలోనే ఉన్న కుతుబ్‌ ‌షాహీ సమాధులు, హయత్బక్షీ బేగం మసీదు ప్రాంతాల్లో ఆక్రమణలు హద్దులు దాటాయి. వీటిని తొలగించాలని హైదరాబాద్‌ ‌మహానగరపాలక సంస్థకు పురావస్తు శాఖ ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదు. మరోవైపు…. పేరుకు ఏటా వారసత్వ దినోత్సవాన్ని (ఏప్రిల్‌ 18) ‌నిర్వహిస్తున్నారు. కానీ దాని స్ఫూర్తిని మాత్రం అందిపుచ్చుకోవడం లేదు.

కొండను తొలిచి అద్భుతంగా మలచిన గాంధారి కోట, రోజుకొక గోడ చొప్పున పడిపోతున్న కాలాస్‌కోట, ఇప్పటికే కనిపించకుండా పోయిన డబీరురాలో విదేశీయుల సమాధులు, రూపు కోల్పోతున్న కనుమరుగైన హైదరాబాద్‌లోని మీరాలం చెరువు కింద ఇనుప యుగపు సమాధులు, నేడో రేపో పడిపోవటానికి సిద్ధంగా ఉన్న కరీంనగర్‌ ‌జిల్లా మంథనిలోని గౌతమేశ్వర దేవాలయం, సిరిసిల్ల దగ్గరి అనంతగిరి కోట, అనవాళ్లే లేకుండా పోయిన కోటిలింగాల కోట, మహబూబ్‌నగ•ర్‌ ‌జిల్లా జడ్చర్ల సమీపంలోని సాధారణ శకం 7-8 శతాబ్దాల నాటి ఇటుకరాతి జైన దేవాలయం… అన్నీ ప్రమాద పుటంచుల్లో ఉన్నవే, తక్షణ పరిరక్షణ చర్యలు చేపట్టపోతే విలువైన చారిత్రక సంపద చేజారిపోవడం తథ్యం.

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా పురాతన వస్తువు / శాసనం బయటపడితే ఎంతో అపురూపంగా చూసుకుంటారు. దానిపై వెంటనే పరిశోధన చేసి చరిత్రను తవ్వితీస్తారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మెదక్‌ ‌జిల్లాలోని మారేపల్లిలో కల్యాణీ చాళుక్యుల కాలం నాటిదని భావిస్తున్న శాసనమొకటి బయటపడింది. దాన్ని గుర్తించిన స్థానికులు, కలెక్టర్‌ ‌ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆరేళ్లకు గానీ, దానిపై క్షేత్రస్థాయి పరిశోధన జరగలేదు.

ఇదంతా ఒక ఎత్తైతే, చారిత్రక ప్రముఖులు, రచయితలు, వాగ్గేయకారులు, సంఘసంస్కర్తల గృహాలు కూడా పరిరక్షణకు నోచుకోకపోవటం తెలుగు జాతి దురదృష్టం. తెలుగు సంస్కృతిలో భాగమైన సంగీతం, సాహిత్య రంగాలకు జీవితాలను ధారపోసిన మహనీయుల నివాసాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించక పోవటమంటే వారసత్వ పరిరక్షణోద్యమానికి తూట్లు పొడవటమే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న (రామదాసు), ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలుగువారంతా గర్వపడేలా రాసిన దాశరథి గృహాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించడంలో పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ తరహా నిర్లక్ష్యమే జాతి ప్రభను మసకబారిస్తోంది. తెలుగు ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే సూచనలు కనపడట్లేదు. ఇప్పటికైనా మేలుకోవాలి. పరిరక్షణకు పూనుకోవాలి.

– ఈమని శివనాగిరెడ్డి 

About Author

By editor

Twitter
YOUTUBE