వైద్య రంగ ప్రక్షాళనకు ఎన్డీఏ ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేస్తున్న మందుల ధరల అవినీతి వ్యవహారంపై ఆ శాఖ మంత్రి వై.సత్యకుమార్ విచారణ చేపట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది పనివేళలు పాటించకపోవడం, మందులు, వైద్యపరీక్షల పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం వంటివి ఆయన దృష్టికి రావడంతో వాటిని పరిష్కరించే పని చేపట్టారు. మౌలిక సదపాయాలు, బోధనాసుపత్రుల నిర్మాణం, ఖాళీల భర్తీ, ఆసుపత్రుల సమగ్ర నిర్వహణపై దృష్టిపెట్టారు. ఆగిపోయిన బోధనాసుపత్రుల నిర్మాణం పూర్తిచేసేందుకు ఢిల్లీ వెళ్లి నీతి ఆయోగ్‌ను కలసి అదనపు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వివిధ రకాల పరీక్షా పరికరాలు ఏడాదిలోగా సమకూర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాణాధార మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. ఆ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదించాలని సత్యకుమార్ ఆదేశించారు. రాష్ట్ర వైద్యసేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ ఐడీసీ) టెండర్ ద్వారా ఎంపికైన మందుల సరఫరా సంస్థ అత్యవసర మందులను ఆసుపత్రులకు బహిరంగ మార్కెట్లో కంటే నాలుగైదు రెట్లు అదనపు ధరలకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు మందుల అవసరాలకు కేటాయించే బడ్జెట్లో 80 శాతంమేర ఏపీఎంఎస్‌ఐడీసీకి మళ్లిస్తారు. ఈ నిధులతో ఏపీఎంఎస్‌ఐడీసీ తయారీదారుల వద్ద కొన్న మందులను ఆసుపత్రులకు పంపిణీ చేస్తోంది. మిగిలిన 20 శాతం నిధులతో అత్యవసర మందులను ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్థానికంగా కొనే విధానానికి 2022 జులైలో అప్పటి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. శ్రీకృష్ణ పార్మాస్యూటికల్స్ సంస్థ ఎంఆర్‌ఎలో 35.6 శాతం రాయితీతో మందులు పంపిణీ చేయాలన్న నిబంధనతో టెండరు దక్కించుకుంది. సరఫరా చేయాల్సిన 106 రకాల మందుల జాబితాలో జనరిక్, జనరల్ మందులు ఉన్నాయి. ఈ సంస్థ కోట్ చేసిన ధరకు… హోల్‌సేల్/రిటైల్ మార్కెట్లో ధరలతో పోల్చితే భారీ వ్యత్యాసం ఉంది. జనరిక్ మందుల దుకాణాలు హోల్‌సేల్‌లో 10 నుంచి 85 శాతం వరకు తగ్గిస్తున్నాయి. జనరల్ మందుల్లోనూ ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తమకు అందిన ఫిర్యాదుల మేరకు, మంత్రి సత్యకుమార్ కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖ బోధనాసుప త్రుల నుంచి వివరాలు తెప్పించగా.. ప్రాణాధార మందుల ధరలు బాగోతం బయట పడింది.
ఇమ్యూనోగ్లోబులిన్ (ఐవీ)ని శ్రీకృష్ణ సంస్థ ఆసుపత్రులకు రూ.12,469కు సరఫరా చేసింది. బయట మార్కెట్లో దీని ధర రూ. 6,300 నుంచి రూ.9,400 మధ్య ఉంది. ఇలాగే పలు మందులు ఆసుపత్రులకు ఇచ్చిన ధరల్లో దాదాపు సగానికే బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ ఐదు ఆస్పత్రుల్లోనే కృష్ణా ఫార్మాస్యూటికల్స్ రూ.46 కోట్ల మేర అధిక ధరలకు మందులు సరఫరా చేసిందం టున్నారు. డీఎంఈ పరిధిలో 30 ఆస్పత్రులు ఉండగా.. సెకండరీ గ్రేడ్ హెల్త్ (ఆంధప్రదేశ్ వైద్య విధాన పరిషత్) పరిధిలో 200 ఆస్పత్రులు నడుస్తున్నాయి. వీటన్నింటికీ 20 శాతం మేర కృష్ణా ఫార్మాస్యూటికల్స్ మందులు సరఫరా చేసింది. ఐదు ఆస్పత్రుల్లోనే రూ.46 కోట్లు తేడా వస్తే ఈ మొత్తం ఆస్పత్రులన్నింటికి సరఫరా చేసిన మందులలో భారీ ఎత్తును స్కాం జరిగిందన్న వాదనలు బలపడు తున్నాయి. అసలు పూర్వ విధానాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీనికి కారకులు ఎవరు? అధిక ధరలతో ఖజానాకు ఎంతమేర నష్టం వాటిల్లింది? నిరోధక చర్యలు, ఇతర వివరాలపై సమగ్రంగా విచారణ జరిపి, నివేదిక అందజేయాలి’ అని సత్యకుమార్ తమ శాఖ అధికారులను ఆదేశించారు. ఇకపై ఆసుపత్రులు కమిటీల ద్వారా స్థానికంగానే మందులను కొనాలని స్పష్టంచేశారు.
బోధనాసుపత్రుల నిర్మాణానికి ప్రాధాన్యత
రాష్ట్ల్రంలో బోధనాసుపత్రుల నిర్మాణం కుంటుపడిన నేపథ్యంలో వీటి నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. బోధనాసుపత్రులకు చెందిన కళాశాలల నిర్మాణం పూర్తిచేయకపోవడంతో 500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాలేదు. రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో 12 కొత్త వైద్య విద్యా కళాశాలలు నిర్మించాల్సి ఉండగా, అందులో పాడేరు, పిడుగురాళ్ల కళాశాలల నిర్మాణం కేంద్రం సాయంతో జరుగుతోంది. కొత్త వైద్య కళాశాలలను ఒక్కోదానిని దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కళాశాల నిర్వహణకు ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల ఖర్చవుతుందని అంచనా. మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును 2021లో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన నాటి ప్రభుత్వం, వాటి నిర్మాణంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని కూడా సరిగా విడుదల చేయకుండా కేంద్రంతో పాటు నాబార్డు ఇచ్చిన నిధుల్ని కూడా పెద్ద మొత్తంలో దారి మళ్లించడంతో ఈ కళాశాలల నిర్మాణంలో తీవ్ర ఆలస్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అన్య మార్గాల ద్వారా కొత్త కళాశాలల నిర్మాణాన్ని చేపట్టాలని సత్యకుమార్ భావించారు. సుదూర, జిల్లా స్థాయిలో ఈ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉన్నందున కేంద్రం నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఆయన నీతి అయోగ్‌తో చర్చించారు. జిల్లా ఆస్పత్రులలో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే సాయంపై కూడా చర్చించారు. ప్రమాదాలు, ట్రామా కేర్ కేసులు ఎక్కువ అవుతున్నందున ఈ సేవల్ని పటిష్టం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 15 యాస్పిరేషనల్ బ్లాకుల్లో వివిధ రంగాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా బ్లాకుల్లో వైద్య సేవల అభివృద్ధికి కేంద్రం సాయంపై కూడా మంత్రి చర్చించారు.ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని అదనపు బ్లాకులను యాస్పిరేషన్ బ్లాకులుగా గుర్తించాలని మంత్రి నీతి అయోగ్‌ను కోరారు.
వైద్య సదుపాయాలపై చర్యలు
రాష్ట్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల పర్యటనలో గంటల కొద్దీ రోగులు వేచి ఉండటాన్ని గమనించిన మంత్రి , వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్షించారు. అరగంట వ్యవధిలో అవుట్ పేషంట్ (ఓపీ)లకు సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. తాము పొందిన సేవలపై రోగుల నుంచి అభిప్రా యాలు కూడా సేకరించాలని నిర్ణయించారు. ఆసుపత్రుల నిర్వహణలో, వైద్య సిబ్బంది అవినీతి అక్రమాలు, తదితర అంశాలపై ప్రస్తుతం ఆడిటింగ్ జరిపిస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల పనితీరు మెరుగుకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళికను స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రాదిపదికన అమలు చేయాలని నిర్ణయించారు. అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడం, వైద్యాధికారులు, సిబ్బందికొరత నివారణకై ఖాళీపోస్టులను భర్తీచేయాలని భావించారు.
త్వరలో పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 వేల వైద్యాధికారులు అవసరం ఉండగా, ప్రస్తుతం 3,100 వైద్యాధికారుల కొరత ఉంది. ఆ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో అంతరాయం ఉండరాదని, ఆసుపత్రులకు బకాయిలు చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతలో రూ.162 కోట్లు, రెండోవిడతలో నేడు రూ.200 కోట్లు ఇచ్చారు. త్వరలో మరో రూ.300 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఆసుపత్రులు, వాటిల్లోని మరుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేస్తారు. ఓపీ వార్డులకు దగ్గరగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఫలితాలను మధ్యాహ్నం 2 గంటలకు రోగుల సెల్ఫోన్లకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం రోగులను చూసిన వైద్యులు.. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి. అరకుతో పాటు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విస్తరించిన సికెల్‌సెల్( రక్తహీనత) నివారణలో భాగంగా వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసి వైద్య సదుపాయం అందచేయాలని, బ్లడ్ బ్యాంక్‌ను తక్షణం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హాజరుపై పర్యవేక్షణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అత్యున్నత ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రులు వరకు వైద్యులు, సహాయక సిబ్బంది. హాజరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశిత సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు నిర్ణీత సమయానికి హాజరు కాకపోయినా, గైర్హాజరయినా ఒక రోజు వేతనం కోత విధిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో వైద్య సిబ్బంది హాజరు నమోదుకు రూపొందించిన యాప్‌ను, దానిద్వారా సెప్టెంబరులో నమోదైన హాజరును మంత్రి పరిశీలించారు. పనివేళల నిబంధనను ఉల్లంఘించే వారికి ఆటోమెటిక్ షోకాజ్ జారీ చేసేలా మార్పులు చేయాలని మంత్రి ఆదేశించారు.
వైద్యపరికరాలపై దృష్టి
ప్రభుత్వాసుపుత్రుల్లో ఏడాదిలోగా ఎక్స్‌రే యంత్రాలు, సీటీ స్కాన్లు, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ సిస్టమ్స్ వంటి పరికరాలు, యంత్రాలను సమకూర్చుకునేందుకు మంత్రి చర్యలు తీసుకుంటు న్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును అనుసరించి రేటింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అన్ని సర్వజన ఆసుపత్రుల్లో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో, ఎండోక్రై నాలజీ, క్యాన్సర్, రేడియేషన్ అంకాలజీ, ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్యులను అందుబాటులోకి తెస్తారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కొత్తగా ఏర్పాటైన సీటీస్కాన్ మెషీన్‌ను ప్రారంభించారు.
టైర్ -2 సెంటర్‌గా ఉన్న గుంటూరు జీజీహెచ్ కేన్సర్ కేంద్రానికి త్వరలో పెట్‌స్కాన్ ఇతర ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చి కేన్సర్ వైద్యంలో టైర్-1 సెంటర్‌గా మారుస్తారు. సీఎస్‌ఆర్ కింద నాట్కో ఫార్మా జీజీహెచ్‌లో రూ.45కోట్లతో అత్యాధునిక కేన్సర్ సెంటర్‌ను నిర్మించడం పట్ల మంత్రి సత్యకుమార్… నాట్కో వైస్ ప్రెసిడెంట్ (కార్పోరేట్ వ్యవహారాలు) నన్నపనేని సదాశివరావును అభినందించారు. నాట్కో బాటలో ఇతర కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చి జీజీహెచ్‌కి చేయూతనివ్వాలని కోరారు.
ఇటీవల కృష్ణానదికి, బుడమేరుకు, ఏలేరు వరద బాధితులకు ఆరోగ్య సమస్యల పరిష్కారంలో అత్యంత చాకచక్యంగా, సమర్ధంగా వ్యవహరించారు. వైద్య శిబిరాలు నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించారు. విజయవాడ పరిధిలోని 32 డివిజన్లలో 131కి పైగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. శిబిరాల్లో ఆల్లోపతి, ఆయుష్ విభాగాలకు చెందిన వైద్యులచే వైద్య పరీక్షలుచేసి బీపీ, షుగర్, జ్వరం, జలుబు, దగ్గు, మలేరియా తదితర సమస్యలకు మందులు అందచేశారు. 450 మంది ఎ.ఎన్. ఎం., ఆశా కార్యకర్తలు, వీఎంసీ సిబ్బంది ఇంటింటా వ్యాధులు సర్వేలో పాల్గొన్నారు. మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో ముందస్తు నివారణ చర్యలు తీసుకున్నారు. వార్డు సచివాలయ పరిధిలో ముగ్గురు మల్టీపర్సస్ హెల్త్ సహాయకులు, సూపర్‌వైజర్లు, శానిటేషన్ సిబ్బందిని సర్వేకు నియమించారు. ఏలేరు వరద ప్రభావ ప్రాంతంలో కూడా వైద్య శిబిరాలు నిర్వహించి బాధితులకు వైద్య సదుపాయం, మందులు అందచేశారు.
-తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్