వికారాబాద్‌ ‌జిల్లాలో ఏకంగా జిల్లా కలెక్టర్‌పై దాడి జరిగింది. ఆయన వెంట ఉన్న కొందరు అధికారులను పలువురు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఏదో అనుకోకుండా, క్షణికావేశంలో కాదు.. వెంటపడి మరీ.. ఓ రకంగా హత్యాయత్నమే జరిగింది. ఈ ఘటనలో ఓ ఉన్నతాధికారి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. అయితే, ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో… అది కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో… అంటే, తెలంగాణలో అసలేం జరుగుతోంది? ఏకంగా కలెక్టర్‌పైనా, ఆయన వెంట ఉన్న బృందంపైనా రాళ్లు, కర్రలతో దాడులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?  సీఎం ఇలాకాలోనే జరిగిన ఈ దాడిని ఎలా చూడాలి? అధికార కాంగ్రెస్‌పార్టీ వైఫల్యంగా చెప్పాలా? ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పక్కా ప్లాన్‌తో రెచ్చగొట్టిందని అనుకోవాలా? అని నవంబర్‌ 11 ‌నాటి దాడి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.

సాధారణంగా ఏదైనా ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు ఇష్టం లేకపోతే నిరసన తెలపొచ్చు. ఆందోళనలు నిర్వహించవచ్చు. మామూలుగా ప్రతిఘటించవచ్చు. కానీ, ఏకంగా జిల్లా ఉన్నతాధి కారులపైనే రాళ్లు, కర్రలతో దాడి చేయడం అంటే.. ఇది శాంతిభద్రతల సమస్యే అంటున్నారు విశ్లేషకులు. నిఘా వ్యవస్థ వైఫల్యంగా చెబుతున్నారు. పోలీసుల అప్రమత్తత కరవైందని ఆక్షేపిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. రాజధాని నగరంలో చిన్నపాటి నిరసన తెలిపితేనే, ఏదైనా సమస్యపై గొంతెత్తితేనే పోలీసులు ఎక్కడికక్కడ గొంతులు నొక్కేస్తారు. అరెస్టు చేసి లోపలేస్తారు. పదులు కాదు.. వందల మందినైనా అదుపులోకి తీసుకొని నిరసనలను అదుపు చేస్తారు. పరిస్థితులను చేజారకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారు.

 వికారాబాద్‌ ‌జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో కొంతకాలంగా రగడ నడుస్తోంది. స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఓసారి కాంగ్రెస్‌పార్టీ నాయకుడిపై భౌతిక దాడి జరిగింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధి కారులుగానీ, పోలీసులు గానీ, నిఘా విభాగం గానీ అప్రమత్తంగా ఉండకపోవడం, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్‌ ‌సహా.. ముఖ్య నాయకులందరూ వచ్చిన సభకు సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయడం, బలగాలను మోహరించడం ఎందుకు చేయలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రణాళిక ప్రకారమేనా…?

మరోవైపు.. సాధారణంగా ప్రభుత్వాధి కారులన్నా, పోలీసులన్నా ప్రజలు కాస్త భయంతో, గౌరవంతోనే ఉంటారు. మరీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉండదు. అసలు వీధి రౌడీల మాదిరిగా, గ్రామంలో గ్రూపు తగాదాల మాదిరిగా అధికారులపై ఏకంగా రాళ్లు, కర్రలతోనే దాడిచేసే పరిస్థితి ఉండదు. ముందుగా మానసికంగా సిద్ధమైతే తప్ప ఆ స్థాయిలో దాడి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకొని ఉండరని మానసిక నిపుణులు చెబుతున్నారు. పైగా.. వచ్చింది జిల్లా కలెక్టర్‌ అనీ, మిగతా వాళ్లంతా ఉన్నతాధికారులని గ్రామస్తులందరికీ తెలుసు. ఒక కలెక్టర్‌పైనా, ఉన్నతాధికారులపైనా ఈ స్థాయిలో దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ రోజుల్లో దాదాపు అందరికీ తెలుసు. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్‌ అయిన కలెక్టర్‌పైకే రాళ్లు, కర్రలతో వెళ్లారని, ఆయనతో వచ్చిన మరో అధికారిపై ఏకంగా హత్యాయత్నానికే పాల్పడ్డారని తెలిసి అందరూ విస్తుపోయారు. ఈ క్రమంలో లగచర్లలో అధికారులపై జరిగిన దాడి వెనుక ప్రతిపక్ష నేతల ప్రోత్సాహం ఉందని అధికార కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సొంత నియోజకవర్గంలో జరగడం చర్చనీయంగా మారింది.

కొడంగల్‌ ఏరియా అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ – కడా స్పెషల్‌ ఆఫీసర్‌ ‌వెంకట్‌ ‌రెడ్డిపై ప్రజలు విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌పైనా దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆయన వాహనం కూడా ధ్వంసమైంది. గ్రామస్థులు తమను మాట్లాడటానికే పిలిచారని, తీరా అక్కడికి వెళ్లాక కొందరు వారిని ప్రోత్సహించారని, దాంతో ఆ ఘటన జరిగిందని జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌జైన్‌ ‌చెప్పారు.

లగచర్లలో అసలేం జరిగింది? :

కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటుపై ఈనెల 11వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వెళ్లారు. ముందుగా దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఏర్పాట్లు చేశారు. వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌, అదనపు కలెక్టర్‌ ‌లింగానాయక్‌, ‌సబ్‌ ‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ‌ప్రసాద్‌, ‌కొడంగల్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ ‌వెంకట్‌ ‌రెడ్డి, దుద్యాల తహసీల్దారు విజయ్‌ ‌కుమార్‌ ‌కూడా ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వేదిక వద్దకు రైతులెవరూ రాలేదు. వారంతా దుద్యాల మండలంలోని లగచర్ల అనే గ్రామంలో ఉన్నట్లుగా బాధిత రైతుల తరఫున సురేశ్‌ అనే వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికే వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీంతో అధికారులు లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఒక్కసారిగా జనం అక్కడ గుంపుగా చేరారు. ‘కలెక్టర్‌ ‌గో బ్యాక్‌’ అం‌టూ నినాదాలు చేశారు. ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌, ఇతర అధికారులు ప్రయత్నించారు. అయితే, ప్రజలు ఎంతకీ వినకపోగా.. అధికారులపైనే దాడికి దిగారు. కలెక్టర్‌ను తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌పై ఒక మహిళ వెనక నుంచి చేయి చేసుకు న్నట్లుగా వీడియోలో రికార్డయ్యింది. ఈ పరిణామంతో కలెక్టర్‌, ఇతర అధికారులు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో జనం రాళ్లు, కర్రలతో అధికారులు, వారి వాహనాలపై దాడికి దిగారు. ఈ ఘటనలో కలెక్టర్‌ ‌వాహనం వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఇతర వాహనాల అద్దాలూ పగిలిపోయాయి. దుద్యాల తహసీల్దారు కారుపై ఆందోళనకారులు బండరాళ్లు విసరడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. మరికొందరు గ్రామస్థులు వాహనాలను తరుముతూ రాళ్లు విసిరారు.

ఫార్మా విలేజ్‌పై రగడ

 కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని పోలెపల్లి, హకీంపేట, లగచర్ల, దుద్యాల, ఈర్లపల్లి, పులిచెర్ల కుంట తండాలో పరిధిలో సుమారు 1,375 ఎకరాలు సేకరించి ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాకు పది లక్షల రూపాయల పరిహారం, ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమ భూములకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని కొందరు బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే హకీంపేటలో కొందరు రైతులు సెప్టెంబరు నెల నుంచి నిరాహార దీక్షలు చేయడమే కాకుండా వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ యేడాది అక్టోబరు 25న కూడా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా, రైతులు అడ్డుకున్నారు. రోటిబండ తండాలో కాంగ్రెస్‌ ‌పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు అవిటి శేఖర్‌పై దాడి చేయడంతో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. తాజాగా అధికారులు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సమయంలో అధికారులపై దాడి జరిగింది.

నిఘా వ్యవస్థల వైఫల్యం :

ప్రజాగ్రహాన్ని అంచనా వేయడంలో నిఘా వ్యవస్థల వైఫల్యం కారణంగా జిల్లా అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు వారి అతివిశ్వాసం కూడా దాడికి కారణమైంది. ఈ దాడి వెనుక నిఘా వ్యవస్థల తప్పిదాలు కనిపిస్తున్నాయి. పోలీసులకు ముందుచూపు కొరవటం కొట్టొచ్చినట్లు కనిపించింది. 200 మంది పోలీసులను మోహరించినా కలెక్టర్‌ ‌ప్రతీక్‌జైన్‌ ‌సహా ఉన్నతాధికారులపై జరిగిన దాడిని నిలువరించ లేకపోయారు. వందల సంఖ్యలో గ్రామస్తులు, రైతులు అధికారులను రాళ్లు, కర్రలతో తరుముతుంటే ఘటనా స్థలంలో ఒకరిద్దరు పోలీసులు, గన్‌మెన్లు తప్ప ఎవరూ లేకపోవటం నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఊరి బయట టెంటు వేశారు. అక్కడ ఉన్న జిల్లా అధికారులను మాట్లాడదామని గ్రామంలోకి పిలిచి.. వచ్చి రాగానే దాడికి పాల్పడ్డారు. రెండు మూడు నెలలుగా ఫార్మా చిచ్చు రావణ కాష్టంలా రగులుతూ ఉంది.. ఇది వరకే పరిస్థితి లాఠీ చార్జి వరకు వెళ్లింది.. ఇంత జరుగుతున్నా ముందుస్తు వ్యూహం లేకుండా అధికారులు గ్రామంలోకి వెళ్లడం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు.. పోలీసులెవరు అధికారుల వెంట లేకపోవడం దాడికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

లగచర్లలో బిక్కు బిక్కు :

లగచర్ల ఘటనలో పోలీసులు మినహా అందరూ రైతుల చేతిలో దాడికి గురైనవారే. కలెక్టర్‌, అడిషనల్‌ ‌కలెక్టర్‌, ‌వారి గన్‌మెన్లు, సీసీలు, ఇతర రెవెన్యూ యంత్రాంగంపై దాడి జరిగింది. పోలీసులు మాత్రం సేఫ్‌ ‌సైడ్‌గా ఉండిపోయారు. ఇటీవల ఫార్మాసిటీ భూ సేకరణ కోసం అధికారులు గ్రామానికి వెళ్లిన సమయంలో స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇది లాఠీ చార్జి వరకు దారి తీసింది. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉందని తెలిసి కూడా పోలీసులు అధికారులను రక్షణ కల్పించడంలో విఫలమయ్యారు.

గ్రామం వెలుపల రైతులతో మాట్లాడేందుకు వేసిన టెంటు వద్ద 200 మంది పోలీసులు ఉన్నా.. వారు అధికారులను వెంట గ్రామంలోకి వెళ్లలేదు. ఇప్పుడు దుద్యాల్‌ ‌మండలం లగచర్ల గ్రామం భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటోంది. దాడి అనంతరం వందల సంఖ్యలో పోలీసులు గ్రామానికి వెళ్లి పికెట్‌ ఏర్పాటు చేశారు. అధికారులపై నవంబర్‌ 11‌న దాడికి పాల్పడిన యువకులు గ్రామం వదిలి పారిపోయినట్లు సమాచారం. పోలీసులు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారో? ఏ కేసులు పెడతారో? అని బిక్కు బిక్కు మంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చివరకు ఈ అంశం ఎక్కడి వరకు దారి తీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

-సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE