2024 ‌చివరి దశకి వచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రారంభంలో మొత్తం దేశం దృష్టిని ఆకర్షించినవి రెండు ఐ.పి.ఎల్‌లు – ఒకటి ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌, ‌మరొకటి ఇండియన్‌ ‌పొలిటికల్‌ ‌లీగ్‌ ! ఈ ఆర్టికల్‌లో నా అభిప్రాయాలను అందించడానికి సంబంధిత కీలకమైన అంశాలను  కనుగొన్నాను. ‘‘బాల వినోదం – వికసిత భారత్‌ ‘‘ అనే అంశానికి సంబంధించి నా అభిప్రాయాలను ఈ రెండు సంఘటనలు ప్రస్తావిస్తూ వివరించే ప్రయత్నం చేస్తాను.

ముందుగా ఇండియన్‌ ‌పొలిటికల్‌ ‌లీగ్‌తో ప్రారంభిద్దాం. అన్ని ప్రచారాలు, ఉపన్యాసాల్లో ‘‘2047 నాటికి వికసిత భారత్‌’’ అనే పదం అందరి దృష్టిని ఆకర్షించింది! అంతే కాదు ఒక ఆశ, ఆకాంక్షతో ప్రత్యేక ప్రచారాస్త్రమైంది. కోట్లమంది భారతీయులు ఎన్నో ఏళ్లనుండి కంటున్న కలకి ఒక చిరునామా అయ్యింది. ఇంతకీ ‘‘వికసిత భారత్‌’’ ఎలా ఉంటుంది? నిర్వచనం ఏంటి?.. నాకు అర్ధమైనంత వరకు చెప్పాలంటే – మెరుగైన జీవన ప్రమాణాలు, ఆర్థిక పురోగతి, సరళీకృత వ్యాపార విధానాలు, అందుబాటులో మౌలిక సదుపాయాలు- మానవ వనరులు, ఉద్యోగాలు, భద్రత! ఆహా! వినడానికి ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంది కదా!

సరే, ఇంక విషయంలోకి వద్దాం. దేశమంటే మట్టి కాదోయ్‌, ‌దేశమంటే మనుషులోయ్‌ అని మహానుభావుడు గురజాడ వారు చెప్పినట్టు, మనది 140 కోట్ల జనాభా కలిగి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం! ఇది అందరికీ తెలిసిందే! అయితే ఇందులో దాదాపు 40 కోట్ల మంది 15 ఏళ్లలోపు పిల్లలే ! నమ్మశక్యంగా ఉన్నా లేకపోయినా ఇది నిజం. దాదాపు మూడొంతుల జనాభా ముక్కుపచ్చలారని పిల్లలే !! ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న ‘‘వికసిత భారత్‌ 2047’’ ‌కి నిజమైన వారసులు, భాగస్వాములు ఈ పిల్లలే ! వీరంతా 2047 నాటికి నడి వయస్కులై వికసిత భారతావని గమ్య సారథులే ! మరి ఆ ఆకాంక్షలు నెరవేరాలంటే ఇప్పటి ఈ బాలబాలికలని ఎట్లా తీర్చిదిద్దాలి? వారికి కావలసిందేంటి ?? – సూక్ష్మంగా ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘అందమైన బాల్యం’’. ఆనందం, ఆహ్లాదం కలగలసిన సానుకూల బాల్యం ! వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సానుకూల దృక్పథాన్ని, సృజనాత్మకతని, మేధోభివృద్ధిని అందించేది ఏంటి? వినోదం !!! అవును, వినోదం పిల్లల జన్మహక్కు. ఈ డిజిటల్‌ ‌యుగంలో  ఆట పాటలతో వినోదా న్నందించడమే కాకుండా పిల్లల్లో స్ఫూర్తిని నింపుతూ, విజ్ఞానాన్ని పంచుతూ ఆనందింపచేసే పక్రియల్లో మొట్టమొదటిది అనిమేషన్‌! అద్భుతమైన కథలతో, బొమ్మలతో కళ్ల ముందు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించి పిల్లల్ని ఉర్రుతలూగించే అనిమేషన్‌, ‌కార్టూన్‌లే వికసిత భారత్‌ ‌లక్ష్య సాధనకి తోలి సోపానాలు.

దాదాపు 40 కోట్ల మంది పిల్లలున్న మన దేశం ఈ అనిమేషన్‌ ‌రంగానికి ఒక సామజిక బాధ్యత గానే కాకుండా ఆర్ధికంగా పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. ప్రపంచదేశాల్లో అనిమేషన్‌ ‌వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఆవిష్కరించింది. డిస్నీ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇంతటి అవకాశాలున్నా మనం అందిపుచ్చుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాం. దానికి ప్రధాన కారణం, గత 5 దశాబ్దాలుగా మనదేశంలో వస్తున్న కార్టూన్‌ ‌షోలన్నీ విదేశాల నుండి దిగుమతి అవుతున్నవే. అవి మంచివే అయినా సంసృతి, నేటివిటీ పరంగా మనకి దగ్గరగా ఉండవు, మన దేశంలో దాదాపు 100 బిలియన్‌ ‌డాలర్ల అనిమేషన్‌ ‌వ్యాపారం జరుగుతున్నా, ఎక్కువ స్టూడియోలు విదేశాలకి సంబంధించిన సర్వీస్‌ ‌చేసేవే. ఒకటి రెండు తప్ప మన దేశంలో సృష్టించిన కార్టూన్లు పెద్దగా లేవు. ఇది నిజానికి వికసిత భారత్‌కి ఒక పెద్ద విఘాతం! మనది వేదభూమి. మన దేశంలో కధలకు కొదవలేదు. పురాణేతిహాసాలు మొదలు కొని, జానపదాలు, సామాజిక కథలు ఎన్నో, ఎన్నెన్నో … ఆ కథల్ని ఇప్పటి తరానికి తగ్గట్టుగా కథనాన్ని జోడించి, మన సంస్క్తృతి సంప్రదాయాల నుండి దూరమైపోకుండా, శతాబ్దాల భావ దాస్యాన్ని వీడి అద్భుతమైన పాత్రల్ని సృష్టించి కేవలం వినోదాన్నే కాకుండా కాస్త విజ్ఞానాన్ని ఇస్తూ, స్ఫూర్తిని నింపే చిత్రాలని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఇదే వికసిత భారత్‌కి పునాది. ఈ విషయంలో మనం జపాన్‌ అనిమేషన్‌ ‌నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎన్నో ఏళ్లుగా వాళ్లకంటూ ఒక శైలిని, వినూత్న కథల్ని విభిన్నంగా ప్రదర్శిస్తూ జపాన్‌ అనిమేషన్‌ ఇం‌డస్ట్రీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.

నిజానికి ఒక రకంగా చెప్పాలంటే బాల వినోదాన్ని మనం పూర్తిగా విస్మరించాం. 40 కోట్ల మంది పిల్లలున్న దేశం. ఏడాదికి దాదాపు 1000 సినిమాలు అన్ని భాషల్లో విడుదల అవుతున్నాయి. అయితే పట్టుమని పది సినిమాలు కూడా బాలల చిత్రాలు ఉండట్లేదు. నిజానికి ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి. భావి వికసిత భారత భాగ్యవిధాతల్ని పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటు. ప్రభుత్వాలు, పెద్దలు అందరు దీనికి బాధ్యులే – పాఠశాలలు సరే సరి! పిల్లల్లో సృజనాత్మకత పెరగాలన్నా, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా, మంచి పౌరులుగా తయారవ్వాలన్నా వారి మానసికాభివృద్హి జరగాలి. ఒకప్పటి శివాజీకి జిజియాబాయి నుండి మొన్నటి తరం తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇటువంటి వినోదాత్మక కథల ద్వారానే స్ఫూర్తి నింపి చైతన్యవంతులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు నవీన డిజిటల్‌ ‌యుగంలో కుటుంబాలు చిన్నవి అవుతున్న నేపథ్యంలో కొత్త శాస్ర సాంకేతిక ఆవిష్కరణలతో వినోదం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించిన చానెళ్లు, ••లు, ఇక యుట్యూబ్‌ ‌సరే సరి. పిల్లలు అన్నం తినాలన్నా, ఏం చేయాలన్నా టీవీలో, ఫోన్లో ఉండాల్సిన పరిస్థితి. కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని అందిపుచ్చుకుని మన భవిష్యత్తుకి తగ్గట్టు తీర్చిదిద్దుకోడమే ఉన్న మార్గం. ఈ నవీన ఆవిష్కరణలు రెండువైపులా పదునుండే కత్తులు. జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ పిల్లలు ఎంటువండి ఉద్రేకాలకి లోనవుతున్నారో నిత్యం వార్తల్లో చూస్తున్నాం. వారి మానసిక శారీరక స్థితులపై దుష్ప్రభావం కచ్చితంగా చూపుతుంది ఈ విచ్చలవిడి సాంకేతికత. అయితే దీన్ని మనం సానుకూలంగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అనిమేషన్‌ ‌రూపంలో అద్భుతమైన కధలు, పాత్రలు సృష్టించి వాటిని కేవలం మనదేశంలోనే కాకుండా మన సనాతన విజ్ఞానాన్ని వినోదంతో జోడించి విశ్వవిపణిలో ఆవిష్కరించాల్సిన తరుణమాసన్నమైంది. దీని వల్ల రెండు ఉపయోగాలు – ఒకటి 40 కోట్ల భావి భారత పౌరుల్ని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడమే కాకుండా భారతీయ సినిమా అనిమేషన్‌ ‌రంగాలని ప్రపంచవేదిక వి•ద పరిచయం చేసి కొత్త వ్యాపార అవకాశాలని అందిపుచ్చుకోవచ్చు కూడా.

ఇక ఇప్పుడు రెండవ ఐపీఎల్‌ – ఇం‌డియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ ‌క్రికెట్‌ ‌కి వద్దాం. వినోదం లాగానే, మన దేశం క్రికెట్‌ ఆటని శ్వాసిస్తూ ఉంటుంది. బ్రిటీష్‌ ‌వాడు వదిలేసి వెళ్లిన ఆట అని కొంతమంది అన్నప్పటికీ, క్రికెట్‌ ‌మన దేశ దినచర్యలో ఒక భాగమైపోయింది. కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తి మస్తిష్కంలో అప్పటి వరకు ఉన్న ఆటని కాస్త మార్చి మరోవిధంగా ఆడితే ఎలా ఉంటుంది? ఆ ఊహ దశాబ్దాల క్రికెట్‌ ‌స్వరూపాన్నే మార్చేసింది. అంతవరకు ఎక్కడో ఇంగ్లాడులో పుట్టిన ఆట కాస్త మారి భారత్‌ ‌కేంద్రంగా ఒక కొత్త ఒరవడిని సంతరించుకొని కొత్త అవకాశాల్ని ఆనందాన్ని పంచుతూ ఉంది.

భారతీయ బాల వినోదం కూడా ఇలాంటిదే. దాదాపు 40 కోట్లమంది పిల్లలున్న దేశంలో రోజుకో కొత్త కథలు, పాత్రలు తయారుచేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరో విధంగా చెప్పాలంటే ‘‘మార్కెట్‌’’ ఉం‌ది. కేవలం ఆ దిశగా అలోచించి ముందడుగు పడాలి. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రణాళికలు రచిస్తే అతి తొందర్లో ప్రపంచం మొత్తం మన కథల్నే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధమేఘాలు అలుముకొని ఒక సందిగ్ధత ఉన్న తరుణంలో భారతీయ తత్త్వం మాత్రమే ప్రపంచానికి శాంతిని అందించగలదు. అది చిన్నప్ప్పుడే పిల్లల్లో ప్రవేశపెట్టగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచం శాంతి సౌభ్రాతృత్వాలతో మెలుగుతోంది.

చివరగా, బాలవినోదం వికసిత భారత్‌ ‌లక్ష్యానికి అత్యంత ప్రధాన సాధనం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత మనందరి పైనా ఉంది. దీనికి అనిమేషన్‌ ఒక అద్భుతమైన ఉత్ప్రేరకం. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుండి 15 ఏళ్ళు వచ్చేంతవరకు అనిమేషన్‌ ‌ద్వారా వాచీ వినోదాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు. ఇదే వయస్సులో మంచి చెడులపై అవగాహనా, భవిష్యత్తు పైన ఆశలు, ఆకాంక్షలు కలుగుతాయి. సృజనాత్మకత లేనిదే ఏమి సాధించలేం. ప్రతీ వారిలో ఆ సృజనాత్మ కత ఉంటుంది. వినోదంతో విజ్ఞానం, స్ఫూర్తి కలిగించడం ద్వారా ఆ సృజనాత్మకతకు సానబెట్టి భవిష్యత్తులో ఆదర్శవంతమైన పౌర సమాజాన్ని నిర్మించవచ్చు. అందుకే ఈ బాల వినోదం వికసిత భారత్‌ ‌లక్ష్యానికి అత్యంత ఆవశ్యకమైనది.

  • కొడవంటి భారవి, సీఈఓ, మరా క్రియేషన్స్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE