కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో వ్యవహారశైలి కారణంగా మన దేశంతో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో సిక్కుల మద్దతు కోసం ప్రధాని ట్రూడో చేస్తున్న ఓటుబ్యాంకు రాజకీయం, ఆమెరికా సహా ప్రపంచంలోని ఏ దేశం కూడా స్నేహం వదులుకోవడానికి సాహసించని భారత్‌తో జగడానికి దారి  తీసింది. ఖలిస్తాన్‌ ‌పేరు అడ్డం పెట్టుకొని డ్రగ్‌ ‌మాఫియాను నడుపుతున్న కొందరి చేతుల్లో జస్టిన్‌ ‌ట్రూడో కీలుబొమ్మ కావడమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం.

అతి స్వల్ప సంఖ్యలో ఉన్న ఈ డ్రగ్‌ ‌మాఫియా, అధికార లిబరల్‌ ‌పార్టీకి నిధులు సమకూర్చే స్థాయికి చేరుకోవడంతో ట్రూడో వారిని కాదనలేని పరిస్థితి. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రాఫ్‌ ‌పడిపోతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చే ఆశలు అడుగంటుతుండటంతో సిక్కుల మద్దతు కోసం ట్రూడో ఏకంగా దిగ్గజ దేశం భారత్‌తోనే గొడవ పెట్టుకున్నాడు. విపక్షాలు, సొంత పార్టీ నాయకులు ఈ ధోరణి తగదని హితవు చెబుతున్నా మారని ట్రూడో వైఖరి ప్రస్తుతం పార్టీకే ఆత్మహత్యా సదృశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన లిబరల్‌ ‌పార్టీ అంతర్గత సమావేశంలో దాదాపు 20 నుంచి 24 మంది ఎంపీలు ట్రూడోను అక్టోబర్‌ 28‌లోగా రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేయడమే కాదు, ఒకవేళ అట్లా చేయకపోతే తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరించడం తాజా పరిణామం. ట్రూడో వ్యవహారశైలి వల్ల రాబోయే ఎన్నికల్లో తమకు పరాజయం తప్పదన్న భయం చాలామంది ఎంపీ•ల్లో వ్యక్తమవుతోంది.

మారుతున్న పరిణామాల నేపథ్యంలో, ట్రూడో ఎంతోకాలం లిబరల్‌ ‌పార్టీ నాయకుడిగా కొనసాగే పరిస్థితి కనిపించడంలేదు. పార్టీ ఎంపీల్లో చాలామంది ట్రూడో నాయకత్వం విషయంలో రహస్య ఓటింగ్‌ ‌నిర్వహించాలని కోరుతున్నారు.

కెనడా తెంపరితనం

ఉదారవాదం, వాక్‌స్వాతంత్య్రం ముసుగులో ‘తెలివిగా హెచ్చరికలు’ జారీచేయడం కెనడాకే చెల్లిందని విదేశాంగ మంత్రి ఎస్‌ ‌జైశంకర్‌ ‌చేసిన విమర్శ నూటికి నూరుపాళ్లు నిజం. మన దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులు కెనడా భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో చేస్తున్న హెచ్చరికలను బేఖాతరు చేయడమే కాకుండా, ‘వాక్‌స్వాతంత్య్రం’ పేరుతో వారిని సమర్థించడం ట్రూడో ప్రభుత్వ తెంపరితనానికి నిదర్శనం. ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల కెనడా అనుసరిస్తున్న ‘ఉదార’ వైఖరివల్ల మన దౌత్యవేత్తలకు అక్కడ భద్రత లేకుండా పోయింది. ఖలిస్తాన్‌ ‌వేర్పాటువాది హర్‌దీప్‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌హత్య కేసుకు సంబంధించి కెనడా మన దేశానికి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అతడి హత్యలో భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉన్నదంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్నవి ఆరోపణలు మాత్రమే! ఇవికూడా రాజకీయ ప్రేరేపితమైనవి! ఓటు బ్యాంకు రాజకీయం కోసం దేశ విశాల హితాన్నే పణంగా పెట్టిన ఘనతను ట్రూడో మూటకట్టుకున్నాడు.

ముఠాలకు స్వర్గధామం

భారత్‌లో గ్యాంగ్‌వార్‌లకు పాల్పడుతూ, అరెస్ట్‌ను తప్పించుకోవడానికి పారిపోయినవారికి కెనడా ఇప్పుడు స్వర్గధామంగా మారింది. భారత్‌ ఉ‌గ్ర వాదులుగా పేర్కొంటున్నవారిని, తమదేశ పౌరులుగా, దేశభక్తులుగా కీర్తించడం ఒక ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం తగనిపని. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ ‌నిజ్జర్‌ ‌హత్య విషయంలో కెనడా ప్రభుత్వ వైఖరి కారణంగా మన దేశంతో దౌత్యసంబంధాలు ప్రతిష్టంభనకు గురైన సంగతి తెలిసిందే. కెనడాలోని సిక్కులు రవాణారంగంలో బాగా స్థిరపడటంతో ధనవంతులుగా మారారు. వీరిలో ఖలిస్తాన్‌ ‌వాదులుగా చెప్పుకుంటున్న కొందరు ఈ ముసుగులో తమ అక్రమవ్యాపారాల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాదు భారత్‌ ‌నుంచి వచ్చిన విద్యార్థులను కూడా ప్రలోభాలతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారంటూ కెనడా నుంచి మనదేశం వెనక్కు పిలిచిన దౌత్యవేత్త సంజయ్‌ ‌వర్మ ఎన్‌.‌డి.టి.వి.కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరించిన వైనం, విద్యార్థుల తల్లిదండ్రులు పునరాలోచించుకోవాల్సిన సత్యాన్ని వెల్లడిస్తోంది. ముఖ్యంగా కెనడాలో ఉద్యోగావకాశాలు తక్కువ కావడంతో, భారతీయ విద్యార్థులకు డబ్బు, ఆహారం అందిస్తూ మనదేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ చివరకు వారు స్వదేశానికి వస్తే అరెస్టయ్యే పరిస్థితులు కల్పిస్తారని, తద్వారా అక్కడే శరణార్థులుగా దరఖాస్తులు చేయించి తమ చట్రంలో బిగించి, ఎటూ పోలేని స్థితిని కల్పించి వారికి ఇక భవిష్యత్తే లేకుండా చేస్తున్నారని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను హెచ్చరించారు. కెనడా వెళ్లి చదువుకోవాలని అత్యుత్సాహాన్ని ప్రదర్శించేవారు దీన్ని గుర్తించాలి.

ట్రూడో ప్రభుత్వం హైజాక్‌

 ‌కెనడా, అమెరికా, యు.కె.లో ఖలిస్తాన్‌వాదులు ఎందుకు కనిపిస్తున్నార నేది ప్రధాన ప్రశ్న. జస్టిన్‌ ‌ట్రూడో లిబర్‌ ‌పార్టీ, సిక్కుల పార్టీ న్యూడెమోక్రటిక్‌ ‌పార్టీలను ఖాలిస్తాన్‌ ‌పోరాటదారులు ఒకరకంగా హైజాక్‌ ‌చేశారనే చెప్పాలి. కెనడాలో ట్రక్కింగ్‌ ఇం‌డస్ట్రీలో లక్షన్నరమంది సిక్కులే వుంటారు. వీరికి అమెరికా, కెనడా హైవేలపై పూర్తి నియంత్రణ ఉంది. డ్రగ్‌ ‌మాఫియాను తమ అధీనంలో ఉంచుకున్న వీరు ఖలిస్తాన్‌ ‌ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి నకిలీ ఖలిస్తాన్‌వాదులపై మనదేశం పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, తెరవెనుక వీరు చేస్తున్న అక్రమ దందాలను ఎప్పటికప్పుడు ప్రపంచం ముందుంచుతూ వచ్చింది. ఇదీ వారి ఆగ్రహానికి ప్రధాన కారణం.

2005-21 మధ్యకాలంలో కెనడాలో జరిగిన గ్యాంగ్‌వార్‌లలో పాల్గొన్న వారిలో 30 శాతం సిక్కులే. సిక్కు యువకులకు ఆయుధాలిచ్చి శిక్షణ ఇవ్వడం తో ఈ కొట్లాటల్లో పాల్గొనేవారు. అదేమంటే భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్‌ ఉద్యమం నడుపుతున్నామని చెప్పేవారు. కెనడా పోలీసులు చూసీ చూడనట్టు పోయారు. నిజానికి కెనడాలో జరుగుతున్న గ్యాంగ్‌వార్‌ల విషయాన్ని ఎప్పటినుంచో భారత్‌ ఆదేశ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తోంది. వీరు చేస్తున్న డ్రగ్‌ ‌వ్యాపారాలు, అక్రమ వసూళ్లు, హత్యలు కెనడాలోని భారతీయ సమాజానికి మాత్రమే కాదు, పంజాబ్‌లో కూడా సమస్యలు సృష్టిస్తున్నాయి.

గ్యాంగ్‌వార్‌ ‌హత్యలు

సెప్టెంబర్‌ 21‌న సుఖ్‌ధూల్‌ ‌సింగ్‌ అలియాస్‌ ‌సుఖాదునెకె అనే పేరుమోసిన పంజాబ్‌ ‌గ్యాంగ్‌స్టర్‌ ‌కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన గ్యాంగ్‌వార్‌లో హతమయ్యాడు. ఇతను ఖలిస్తాన్‌ ‌సానుభూతిపరుడిగా చెప్పుకున్నప్పటికీ, బలవంతపు వసూళ్లు, సుపారీ హత్యలు ఇతని ప్రధాన వృత్తి. పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన ఇతను 2017లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడా వెళ్లినట్టు సమాచారం. గత ఏడాది మార్చిలో సందీప్‌ ‌సింగ్‌ ‌నంగల్‌ అనే కబడ్డీ ఆటగాడి హత్యలో ఇతని పాత్ర ఉన్నదన్న అభియోగాలున్నాయి. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ‌వాంటెడ్‌ ‌జాబితాలో ఉన్నాడు.

గత జులైలో కెనడాలోని కోకిట్లామ్‌ ‌పట్టణంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన కరన్‌వీర్‌ ‌సింగ్‌ ‌గచ్ఛా అనే గ్యాంగ్‌స్టర్‌ ‌మరణించాడు. అంతకుముందు మే నెలలో వాంకోవర్‌ ‌నగరంలో జరిగిన కాల్పులో అమర్‌‌ప్రీత్‌ ‌సమ్రా అనే మరో గ్యాంగ్‌స్టర్‌ ‌హత్యకు గురయ్యాడు. వాంకోవర్‌ ‌పోలీసు శాఖ విడుదల చేసిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌ల జాబితాలో ఇతడి పేరుంది. బ్రదర్స్ ‌కీపర్స్ ‌గ్యాంగ్‌ ఈ ‌హత్యకు కారణమని వార్తలు వచ్చాయి. ఇంకా సతీందర్‌జిత్‌ ‌సింగ్‌ ‌బ్రార్‌ అలియాస్‌ ‌గోల్డీ బ్రార్‌, అర్షదీప్‌ ‌దాలా, లక్బీర్‌సింగ్‌ ‌లండా వంటి ప్రమాదకరమైన గాంగ్‌స్టర్లకు కెనడా ఇప్పుడు స్వర్గధామం. వీరిలో లక్బీర్‌ ‌సింగ్‌ ‌లండా ఖలిస్తాన్‌, ‌బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలున్నాయని చెబుతారు. ఇటువంటి వారిపట్ల ఉదార వైఖరి ప్రదర్శిస్తూ, వారిని కీర్తిస్తూ ప్రజాస్వామ్య దేశమైన కెనడా ప్రస్తుతం మనకు మరో పాకిస్తాన్‌ ‌మాదిరిగా తయారైంది.

– విఠల్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE