సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి కార్తిక శుద్ధ దశమి – 11 నవంబర్‌ 2024, ‌సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


కెనడా అచ్చంగా పులిస్వారీ చేస్తున్నది. బుజ్జగింపు రాజకీయాలతో ఖలిస్తానీ ఉగ్రవాదుల కొమ్ముకాస్తున్నది. ఇప్పుడున్న ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి నానా గడ్డీ కరుస్తున్నది. బ్రామ్‌టన్‌ ‌కేంద్రంగా దీపావళి తరువాత అక్కడ జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబర్‌ 3‌న బ్రామ్‌టన్‌లో ఉన్న హిందూ సభా మందిరం దగ్గర హిందువుల మీద ఖలిస్తానీ అనుకూలురు దాడికి దిగారు. ఇందుకు నిరసనగా మరునాడు, నవంబర్‌ 4‌న హిందువులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కెనడాలో హిందూ ప్రార్ధనా స్థలాల మీద తరుచు జరుగుతున్న దాడులకు నిరసన పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఖలిస్తానీ ఉగ్రవాదులనీ, వారి మద్దతుదారులనీ అంటకాగకుండా, దేశంలో శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించవలసిందని కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన సంఘాలు కెనడా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దాదాపు వేయి మంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నవంబర్‌ 3 ఆదివారం బ్రామ్‌టన్‌ ‌హిందూ సభా మందిరం, భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం మీద ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడి చేసి భగ్నం చేశారు. ఎలాంటి సిగ్గూ లజ్జా లేకుండా ఖలిస్తానీ జెండాలతోనే దుండగులు భక్తుల మీద దాడికి దిగారు. ఆ దాడి సిక్కు మతాన్నీ, అది చెప్పే మూల సూత్రాలనూ తీవ్రంగా అవమానించేదే. చిన్నారులూ, స్త్రీలు అని చూడకుండా హిందూ సభా మందిరానికి వచ్చిన వారి మీద, అంటే భక్తుల మీద, ఖలిస్తాన్‌ అనుకూలురు దాడి చేశారు. హిందూ కెనేడియన్‌ ‌ఫౌండేషన్‌ ‌విడుదల చేసిన వీడియోలో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడిని పలువురు ఖండించారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ‌ట్రూడో, ప్రతిపక్ష నేత పిరే పోలీవర్‌, ‌టొరెంటో ఎంపీ కెవిన్‌ ‌వాంగ్‌, ‌మరొక ఎంపీ చంద్ర ఆర్య ఖండించిన వారిలో ఉన్నారు. ‘హిందువులకు రక్షణ కల్పించడంలో మా దేశ నాయకులు విఫలమయ్యారు’ అని కెవిన్‌ ‌వాంగ్‌ ‌నిష్కర్షగానే చెప్పారు. ఖలిస్తానీలు అన్ని హద్దులను అతిక్రమించారని చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాదుల హత్యలకు భారత్‌ ‌కారణమంటూ ఇటీవల ఆ దేశ అధికార ప్రతినిధులు నోరు పారేసుకున్నారు. ఆ హత్యలతో భారత హోంమంత్రి అమిత్‌ ‌షాకు ప్రత్యక్ష సంబంధం ఉన్నదంటూ మంత్రుల స్థాయి వారు కూడా వ్యాఖ్యానించి, మరింత అభాసుపాలయ్యారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఇలాంటి ఆరోపణ చేయడం గుడ్దెద్దు చేలో పడిన చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 3‌న దుర్ఘటన జరిగింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ అంత తీవ్రంగా స్పందించవలసి వచ్చింది. ‘ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా దౌత్యవేత్తలను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఇలాంటి పిరికిపంద చర్యలను అపవలసిందిగా కూడా సూచిస్తున్నాను. ఇలాంటి దాడులు, చర్యలు హింసకు వ్యతిరేకంగా భారత్‌ అనుసరించే విధానాన్ని బలహీన పరచలేవు. న్యాయం చేయమని, శాంతిభద్రతలను పరిరక్షించమని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని ఎక్స్ ‌వేదికగా అన్నారు మోదీ. అంతకు ముందు మన విదేశ వ్యవహరాల శాఖ, ‘ఇలాంటి దురాగతాల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలి. శాంతి భద్రతలు నెలకొల్పాలి. ఇవి కెనడా చేయగలదని భావిస్తున్నాం’ అని మన విదేశాంగ శాఖ చురక వేసింది. ఇది అత్యంత తీవ్ర దుర్ఘటన అని విదేశాంగ మంత్రి ఎస్‌ ‌జైశంకర్‌ ‌వ్యాఖ్యానించారు.

ఆ దాడి ముమ్మాటికీ హిందువులను తీవ్రంగా కలవరపరిచేదే. ‘ఈ దాడితో మేమెంతో మనస్తాపం చెందాం. కెనడా పురోభివృద్ధిలో హిందువులు సేవ చాలా ఉంది. హిందూ సమాజం పురోగమన సమాజం. కెనడా ఆర్థిక పరిపుష్టికి ఎంతో చేసింది. మేం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం. అయినా కొంతమంది రాజకీయ నాయకులు, భద్రతా బలగాలు మా పట్ల ఇంత అవమానకరంగా ప్రవర్తించడం దారుణం’ అని నవంబర్‌ 4 ‌నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రిషభ్‌ ‌వ్యాఖ్యానించారు. గడచిన రెండు దశాబ్దాలుగా ఇవే దురాగతాలు సాగుతున్నాయని మరొక హిందువు గుర్తు చేశారు. మేం ఇక్కడ నిరసన చేపట్టినదే కెనడా పోలీస్‌ ‌మా పట్ల చూపిన వివక్ష ఎలాంటిదో లోకానికి తెలియచేయడానికని ఆయన అన్నారు. దాడికి గురైన వారు హిందువులే. జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోలు ఇందుకు సాక్ష్యం చెబుతున్నాయి. కానీ బాధిత హిందువులనే పోలీసులు లక్ష్యంగా చేసుకోవడం అక్కడి వికృతం. అసలు రక్షకులే భక్షకులుగా మారిపోవడం మరొక వాస్తవం. కెనడా పోలీసు ఉద్యోగులలోను ఖలిస్తానీలు చొరబడిన సంగతి స్పష్టమైంది. ఖలిస్తానీలకు అనుకూలంగా బ్రామ్‌టన్‌లోనే జరిగిన ప్రదర్శనలో పాల్గొన్నందుకు హరిందర్‌ ‌సోహి అనే పోలీసు ఉద్యోగిని సస్పెండ్‌ ‌చేయవలసి వచ్చింది. ఇతడు ఖలిస్తాన్‌ ‌జెండా పట్టుకుని, భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న సంగతి వీడియోలో నమోదైంది. పీల్‌ ‌ప్రాంతీయ పోలీసు విభాగంలో సోహి సార్జెంట్‌. ‌మరొక వాస్తవం కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ భారతీయ హిందువుల దేవాలయాలే కాదు, నేపాల్‌, ‌పాకిస్తాన్‌, ‌బాంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు నిర్మించినవీ ఉన్నాయి. వాటి జోలికి పోకుండా కేవలం భారతీయ హిందువుల ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి కెనడాలో సిక్కుల ప్రాబల్యం ఉంది. అక్కడి ప్రభుత్వంలో వారు మంత్రులు కూడా అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణ కూడా ఖల్సా ఏర్పాటులో భాగం. అది ఈ రోజున ఒక వర్గం సిక్కులు పూర్తిగా విస్మరిస్తున్నారు. అటు పాక్‌ను నెత్తికెక్కించుకుంటూ ఇటు భారత్‌ను ద్వేషించడం వీరి రుగ్మత. కెనడా ఉగ్రవాదం పాక్‌ ఉ‌గ్రవాదంతో చేరుతోంది. కాబట్టి ఈ పాపంలో కెనడాకూ భాగం సుస్పష్టం.

About Author

By editor

Twitter
YOUTUBE