భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

‌శ్రీరామ్‌ ‌బస్తీ, బంజారాహిల్స్…
‌హైదరాబాద్‌ అన్ని కాలాలలో నివాస యోగ్యానికి అనుకూలం అనేది ఎంత నిజమో, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునే అమ్మ గుణం కూడా ఉంది ఈ నగరానికి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల వారు కలిసి ఉన్నట్టే, అన్ని ఆర్థికవర్గాల వారు కూడా పక్క పక్కనే ఉన్నారు అనే దానికి బంజారాహిల్స్, ‌దానికి ఆనుకుని ఉన్న శ్రీరామ్‌ ‌బస్తీ నిదర్శనం. నగరంలో ఎన్ని కాలనీలు, బస్తీలు ఉన్నా, శ్రీరామ్‌ ‌బస్తీలోని వారి గుర్తింపు ఒక లెవల్‌లో ఉంటుంది. ఒకరు సినిమా స్టార్‌ ‌దగ్గర పనిచేసే వారు అయితే, మరొకరు పెద్ద డాక్టర్‌ ‌దగ్గర పని చేసేవారు. వారి వారి యజమానులను బట్టి వీరి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఎప్పుడు అయినా అవసరానికి పనికి రాకపోతారా? అని బంజారాహిల్స్ ‌పెద్దలకు కావాల్సిన డ్రైవర్‌ ‌మేడ్‌లను శ్రీరామ్‌ ‌బస్తీ సరఫరా చేస్తుంది.
‘‘ఏందే మల్లవ్వ… శానా రందిగా వున్నవ్‌… ఏం అయ్యింది’’ రమ అడిగింది.
‘‘ఇందాకనే సిగ్నేచర్‌ ‌వచ్చి వెల్లిందే… దాని బిడ్డకు ఇంజనీరింగ్‌లో సీటు అచ్చిందట… పైసలు ఎట్లా అని ఏడ్చి ఏడ్చి పోయింది’’ మల్లవ్వ చెప్పింది.
మల్లవ్వకు అరవై పైననే ఉంటాయి. బస్తీ పెద్ద మనిషి. చిన్నప్పుడు నల్గొండ నుండి బస్తీకి వచ్చి చిన్నచిన్న పనులు చేసుకుంటూ పెరిగి, మంచితనంతో పెద్దపెద్ద సార్ల ఇళ్లలో పని చేసుకుంటూ బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్‌లో అందరికీ సుపరిచితురాలు అయ్యింది.
తనకంటూ ఎవ్వరూ లేరు.. అక్కడ ఇక్కడ పనిచేసి కాలనీ లాగానే శిథిలావస్థకు చేరింది. ఆసరా పథకం అచ్చినంక ఇంట్లనే ఉంటుంది. బస్తీ లోని అందరికి పని పెట్టించింది మల్లవ్వనే… బంజారాహిల్స్‌లో పని కుదరాలంటే, మల్లవ్వే గ్యారంటీ. ఎవరి ఇంటిలో వస్తువు పోయినా కాలనీలో శివమెత్తి ,సాయంత్రం వరకు ఆ వస్తువు వారి ఇంటిలో అప్పజెప్పుకుంటూ తన పెద్ద తనాన్ని నిలుపుకుంది. ఒకరు పనికి పోకుంటే, ఇంకొకరిని పంపి ఏ సార్‌కు ఇబ్బంది రానీయకుండా చూసు కుంటుంది. పనిచేసే వారి అందరికీ మల్లవ్వ ఇల్లే అందరికి అడ్డ. అలాగే అందరి బాధలను మల్లవ్వ దగ్గరే డిపాజిట్‌ ‌చేస్తరు.
‘‘ఎడ్చుడు ఎందుకే… పేదొల్లను ఫ్రీగనే ప్రభుత్వం సదివిత్తరు గదా’’ అంది రమ.
‘‘ర్యాంకు జరంత ఎక్కువ ఆచ్చిందట.. లేకుంటే నువ్వన్నట్లు ఫ్రీనే..’’
‘‘ఎంత గట్టాల్నే..’’
‘‘ఎనబై వేలంట’’
‘‘గన్ని పైసలా?’’
పేదవాళ్లు పైసల దగ్గర ఆగిపోయారు ,ఇప్పటికీ.వేలు లక్షలు అనే పదం తక్కువ వాడుతారు. బహుశా ఇంకా వారికి అందలేదో.
‘‘గందుకే దాని ఏడుపంత’’
‘‘ఇప్పుడు ఎట్లనే మల్లవ్వ’
‘‘ఏం జెద్దామే… బస్తీల మగ పోరగండ్లు సదువు లేక తిరిగి శెడవట్టే… ఆడ పోరికి సీటు ఆస్తే పైసలు లేకపాయె’’ మల్లవ్వ బాధగా అంది..
ఇంతలో మనెమ్మ పక్కనుండి వెళ్తుంది…
‘‘ఏమే ఆఫీసర్‌….‌మందలియ్యకుండ ఉరుకుతున్నవ్‌ …’’ ‌మల్లవ్వ గట్టిగా అంది.
బస్తీలోని ఆడవాళ్లు.. అక్కడక్కడ ఇండ్లలో పని చేస్తుంటారు. ఎవ్వరి ఇంటిలో పనిచేసే వాళ్లకు, వారి ఇంటిలో సార్లు తాగిన ఖాళీ సీసాలు తెచ్చుకుని అమ్ముకుంటారు. అలా వారి సార్లు తాగే సీసాల (బ్రాండ్‌) ‌పేరే వారి ఇంట్లో పని చేస్తున్న వాళ్లకు పెట్టింది మల్లవ్వ. ఆఫీసర్‌ (‌ఛాయిస్‌) ‌మనేమ్మ…మాన్సన్‌ (‌హౌజ్‌) ‌రమ… సిగ్నేచర్‌ ‌దనమ్మ…కింగ్‌ ‌ఫిషర్‌ ‌లక్ష్మి… బ్లూ లేబుల్‌ ‌వసంత… మల్లవ్వ పెద్ద మనిషి అవడం వల్ల, తన వల్లే పని కుదిరినందున…ఎవ్వరూ యేమి అనుకోరు… పైగా ఇది ఒక ఆటవిడుపు లాగా…మజాక్‌ ‌లాగా అయ్యింది.
అందరూ మనసు ఉన్నవాల్లే కనుక సీరియస్‌ ‌తీసుకోరు. బస్తీ లోనివాళ్లు కష్టాలు అవమానాలు పడిపడి ఉన్న వాళ్లు కనుక మల్లవ్వ ఎలా పిలిచిన, ఏమీ అన్న ఏం అనుకోరు.
కాలనీలో ఎవరికి కష్టం వచ్చినా, పెద్ద సార్ల నుండి కంప్లయింట్‌ ‌వచ్చినా మల్లవ్వ అందరినీ పిలిచి విచారిస్తది. మల్లవ్వ పిలిచినది అంటే ఏదో విషయం ఉండే ఉంటది అని అందరూ వస్తారు.
‘‘జర తొందర్ల ఉన్నానే మల్లవ్వ.. మా సార్లు ఊరికి పోతర్రు… అందుకే ఉరుకుతున్న… నిన్ను మందలియ్యకుంట పోతనా ఎంది’’ అంది (ఆఫీసర్‌) ‌మనెమ్మ.
‘‘సర్లే గాని .. పొద్దుగాల ఒకసారి వచ్చిపో… అందర్నీ పిల్చిన.. సిగ్నేచర్‌ ‌కు కష్టం వచ్చింది’’
‘‘అస్తలే.. అస్త…’’ అనుకుంట ఆఫీసర్‌ ‌మనెమ్మ వెళ్ళింది
‘‘ఏయ్‌ ‌మాన్సన్‌ ‌నువ్‌ ‌కూడా అందరికి చెప్పు… అసలు కింగ్‌ ‌ఫిషర్‌ ‌కనబడ్డదా.’’
‘‘ లేదు మల్లవ్వ కలిస్తే చెబుతా’’
‘‘కిం• •ఫిషర్‌ ‌లేకుంటే పని కాదు.. జర దొరక బట్టు’’
‘‘గట్లనే ‘‘ అంటూ వెళ్ళిపోయింది మనమ్మ.
బస్తీలో కింగ్‌ ‌ఫిషర్‌ ‌లక్ష్మి, ఆఫీసర్‌ ‌మనమ్మలదే హాల్‌ ‌చల్‌.
‌లక్ష్మి, శ్రీనగర్‌ ‌కాలనీలో పనిచేస్తుంది. అక్కడ ఎక్కువ బ్యాచిలర్స్ ఉం‌టారు… బీర్లు తాగుతారు. ఖాళీ బీరు సీసాకు మంచి డిమాండ్‌. ‌వచ్చిన డబ్బులను ఇంటరెస్ట్‌కు ఇచ్చి బాగానే వెనుక వేసింది.
మనెమ్మ పనిచేసే ఇంటిలో ఆఫీసర్‌ ‌ఛాయిస్‌ ‌తాగుతారు…. విస్కే లో చీప్‌ అయిన… ఖాళీ అయితే కింగ్‌. ‌ఖాళీ సీసాల్లో రూపాయి కలెక్షన్‌ ‌చేసేది ఆఫీసర్‌ ‌ఛాయిస్‌ ‌మాత్రమే.ఆఫీసర్‌ ‌ఛాయిస్‌ ‌ముందు బ్లూ లేబుల్‌ ‌కూడా నిలువదు. సీసాలు ఖాళీ అయితే.
మనిషి దగ్గర సంపద, సీసా లోపల మందు ఉన్నప్పుడే విలువ.
*     *     *

అందరూ ఉదయం 6 గంటలకే మల్లవ్వ ఇంటికి చేరుకున్నారు.. ఒక్క (కింగ్‌ ‌ఫిషర్‌) ‌లక్ష్మి తప్ప. పని మనుషులు ఏడు గంటలకల్లా పెద్ద సార్ల ఇంటికి పనికి వెళ్లాలి. అయ్యగారికి కాఫీ అమ్మ గారు ఇవ్వరు, పని మనిషే ఇస్తుంది. అమ్మగారికి తల నొప్పి వస్తే అయ్యగారు జండు బామ్‌ ‌రాయడు, పని మనిషే రాస్తుంది. ఒకసారి డబ్బులు వచ్చాక దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. అవసరాలు అన్నీ వేరే వారు తీరుస్తారు.
‘‘ఏమే మాన్సన్‌, ‌కింగ్‌ ‌ఫిషర్‌కు చెప్పలేదా…’’ మల్లవ్వ గట్టిగా అంది.
‘‘చెప్పా మల్లవ్వ’’ అంది మనమ్మ..
‘‘పది దాటితే ఒక్క కారు ఉండదు.. ఒక్క సారు ఉండరు… పదండి… అందర్నీ కలవాలే… ముందు సిగ్నేచర్‌ ‌వాళ్ల సార్‌తోనే మొదలు పెడదాం… రండి’’
అందరూ ధనమ్మ పనిచేసే ఇంటికి పోయారు, ముందే మాట్లాడి పెట్టుకున్న ఆటోలో…
*     *     *
ఆటో దనమ్మ పని చేసే బంగ్లా ముందు ఆగింది. దనమ్మ పని చేసే సార్‌ ‌పెద్ద బిజినెస్‌ ‌మ్యాన్‌. ఎన్ని కంపెనీలు ఉన్నాయో వేళ్లతో లెక్క పెట్టలేం. కొత్త కంపెనీ పెట్టినప్పుడల్లా ఒక కొత్త కార్‌ ‌కొనడం సార్‌ ‌గొప్పగా చెప్పుకునే డబ్బు జబ్బు. సగం కారులు ఇంటిలో, సగం కంపెనీ షెడ్‌లలో ఉంటాయి..ఈ రోజు ఏ కార్‌ ‌తీయాలని డ్క్రెవర్‌ అడిగితే సార్‌ ఆలోచించి చెప్పడం ఆ రోజు ఆ కార్‌సిగ్నేచర్‌లో వెళ్లడం సార్‌ ‌స్పెషాలిటీ అని డ్రైవర్లు చెప్పుకుంటారు. అమ్మవారికి, పిల్లలకు, చిన్న దొర కు….అర డజన్‌ ‌మంది కారు డ్రైవర్లు ఉన్నారు అంటే సార్‌ ‌సంపద చాలా ఉన్నట్టే కదా.
అందరూ సార్‌ ‌ముందు చేతులు కట్టుకుని నిలుచుండి ఉన్నారు. మల్లవ్వ కొంత ముందుకు వచ్చి…
‘‘నమస్కారం సార్‌… ‌ధనమ్మ బిడ్డకు ఇంజనీరింగ్‌లో సీట్‌ అచ్చింది… పైసలు లేక ఎడ్తంది… మిమ్మల్ని అడగడానికి ఎనకా ముందు అయితంది… అందుకే మేము వచ్చినం. మీరు పెద్ద మనసు చేసుకుని… సహాయం చేస్తరని’’ అంటూ దండం పెట్టింది మల్లవ్వ.
‘‘చందాలేసుకోవడానికి ఇదేమన్నా వినాయక చవితి అనుకున్నారా… నాల్గు సంవత్సరాలు చందాలతోనే చదివిస్తరా.? ఏమ్‌ ‌ధనమ్మా పనికి రమ్మంటే అందర్నీ ఎంట ఎసుకుని వచ్చినావు’’.
‘‘అయ్యా తప్పు అయ్యింది అయ్యా… ఎమనుకోకండి సార్‌…‌జర పేదవొళ్లం కదా…మీరు ఏమైనా సహాయం చేస్తారని బస్తీల వాళ్లు అంటే వచ్చినం సార్‌.. ‌మీరు కోపం చేసుకోకండి సార్‌.. ఏళ్తం సార్‌…. ‌పదండి పదండి’’ అంటూ దనమ్మ అందర్ని తోసుకుంటూ…. కళ్లను తుడుచుకుంటూ ముందుకు నడిచింది. మిగితా వారు దనమ్మ వెనకాల బయటికి వచ్చారు .
కొంచెం దూరం వచ్చాక … ‘‘ఏమే సిగ్నేచర్‌ ‌మీ సార్‌ ‌గురించి బాగా చెప్పినవ్‌… ‌గిప్పుడేమో గిట్ల మాట్లాడుతుండు..’’ అంది మల్లవ్వ
‘‘ఏమో నా గాశారం గిట్ల ఏడ్చింది…’’ అంది దనమ్మ .
‘‘ఏం కాదులే ఎంత మంది లేరు ! ఈ సారు ఒక్కడే ఉన్నడా… సహాయం జేయమంటే చందాగింద అంటాడు…’’ అంది మల్లవ్వ.
తరువాత రమ పనిచేసే ప్రొఫెసర్‌ ‌సార్‌ ఇం‌టికీ వెళ్లారు.
రమ ఇంటి పని చేసే సార్‌ ‌యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ‌సార్‌ ‌దగ్గర ఎప్పుడు పీహెచ్‌డీ 2 విద్యార్థులు ఉంటారు. ఇంగ్లీషులో, సార్‌ ‌చాలా పుస్తకాలు రాశాడు అని చెప్పుకుంటారు.
‘‘మ్యాన్సన్‌ ‌నువ్వే అడుగు… ఇయ్యాల నా దినాం గానట్లు ఉంది…’’ అంది మల్లవ్వ .
మొదటిసారే తేలికగా మాట్లాడే సరికి మల్లవ్వకు జర ఇబ్బంది అయ్యింది.
‘‘నమస్తే సార్‌… ‌మా దనెమ్మ బిడ్డకు ఇంజనీరింగ్‌లో సీట్‌ ఆచ్చింది సార్‌. ‌బాగా సదువుతది.. మంచి పిల్ల’’
‘‘అయితే నేనేం చెయ్యాలి’’ ప్రొఫెసర్‌ అన్నాడు.
‘‘డబ్బులు కొన్ని… ఇస్తే సదివిపిచ్చుకుంటం సార్‌…’’
‘‘ఇం‌జినీరింగ్‌ ‌చదువు అంటే ఏమను కుంటారు… ఇంగ్లీష్‌ ‌బాగా రావాలి.. ఉద్యోగం రావాలంటే స్కిల్స్ ఉం‌డాలి… సీట్‌ ‌వస్తే అయిపోయినట్లేనా’’
‘‘మాకు తెలియదు సార్‌… ‌మరి ఏమ్‌ ‌జేయ్యాలి సార్‌’’ ‌రమ అమాయకంగా భయంగా అడిగింది.
‘‘డిగ్రీ చేయించండి… ఫీజు గొడవ ఉండదు.. స్కాలర్‌షిప్‌ ‌కూడా వస్తుంది. తరువాత ఎదో చిన్న ఉద్యోగం వస్తది’’
‘‘మంచిది సార్‌’’ అం‌టూ అందరు కదిలారు..
‘‘ఎందే మ్యాన్సన్‌ ‌పెద్ద సార్‌ అన్నావు చిన్న ఉద్యోగం అని చిన్నగా చేసి మాట్లాడుతుండు… గిదెంది’’ మల్లవ్వ చిరాకు వేసింది..
‘‘ఈ పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్నోల్లకు చిన్న మనసులే ఉన్నట్లు ఉన్నయ్‌.. ఏమ్‌ ‌చేస్తాం..’’. అంది రమ .
మల్లవ్వ కూడా బాగా ఫీల్‌ అయ్యింది. తనకు బంజారాహిల్స్‌లో చాలా పతార ఉంది అని అందరూ చెప్పుకుంటారు. తాను వస్తే పని ఈజీగా అయి పోతదని ఆనుకుని వచ్చింది కాని ఇక్కడ సీన్‌ ‌వేరే లాగా వుంది.
‘‘నా బిడ్డ అదృష్టం బాగా లేనట్లు వుంది..’’ అంటూ దనమ్మ ఏడ్చింది..
వసంత దనమ్మ దగ్గరికి వచ్చి, ‘‘మా సార్‌ ‌పెద్ద క్లబ్‌ ‌ప్రెసిడెంట్‌. ‌సార్‌కు చాలా పతార ఉంది. ఎట్ల నన్న జేసీ పైసలు ఇస్తడు ..మా సార్‌ ‌దగ్గరికి పోదాం పద ‘‘అంది.
అందరు వసంత పని చేసే సార్‌ ‌బంగ్లాకి వెళ్ళారు.
సార్‌ ‌నగరంలోని పెద్ద క్లబ్‌కి ప్రెసిడెంట్‌. ఈ ‌క్లబ్‌ ‌మెంబర్‌ ‌కావాలంటే పార్లమెంటు మెంబర్‌కు కూడా అవకాశం రాదట. కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అని గొప్పగా చెప్పుకుంటారు.
సార్‌ ‌మొబైల్‌లో మాట్లాడుతున్నాడు. ఒక కాల్‌ అయిపోయేసరికి ఇంకో చేతిలోని మొబైల్‌ ‌రింగ్‌ అవుతుంది. మళ్లీ ఆ మొబైల్‌లో మాట్లాడుతున్నాడు, అటు ఇటు నడుస్తూ. ఒక్కోసారి రెండు మొబైళ్లలో అటు ఇటు మాట్లాడుతున్నాడు.
సార్‌ ‌దృష్టిలో పడి మాట్లాడుదామని వసంత కూడా అటు ఇటు తిరుగుతుంది. బస్తీ వాసులు సార్‌ ‌వైపు, వసంత వైపు చూసి చూసి సైగల్‌ ‌చేస్తున్నారు కాని వసంతకు సార్‌ ‌లైన్‌ ‌దొరకడం లేదు. చివరికి సార్‌ ‌మొబైల్‌ ‌మాట్లాడుతూనే ఏంటి అని వసంత వైపు మొబైల్‌లో వేలు పైకి చూపాడు .
‘‘చిన్న పని ఉంది సార్‌’’ అనుకుంటూ సార్‌ ‌దగ్గరికి వెళ్లింది. మిగితా వాళ్లు అబ్బ ఇక పని అయినట్లే అనుకున్నారు.
ఇంతలోనే సార్‌ ‌సడెన్‌గా లోపలికి వెళ్లాడు. మళ్లీ బయటికి వస్తాడు అని చూశారు. అరగంట గడిచింది అయినా సార్‌ ‌బయటికి రాలేదు.
మల్లవ్వ వసంతను వెనక్కి రమ్మని సైగ చేసింది. వసంత ఏడుపు ముఖంతో బస్తీ వాసుల దగ్గరికి వచ్చింది.
‘‘అర్థం అయ్యింది లేవే బ్లూలేబుల్‌….‌మీ సార్‌ ‌కూడా అంతే…’’ అంది మల్లవ్వ విచారంగా .
పని మనుషులకు, పెద్దసార్ల ఇంళ్లలో పని చేయడానికి వెళ్లడానికి వెనకాల ఒక డోర్‌ ఉం‌టుంది. అందులోనుంచి వెళ్లి ఇంటి పనులు చేసి మళ్లీ అదే డోర్‌ ‌నుండి బయటికి రావాలి. అంతేకాని తమ పని కోసం ముందు డోర్‌ ‌దగ్గరికి వెళ్లకూడదు. ముందు ద్వారాలు పెద్ద పెద్ద వారికే, పేద వారికి కాదు.
‘ఎప్పుడు అయినా పనికి రాక పోతారా ?’ అన్నది చిన్న వాళ్ళకి పెద్ద ఆశనే సుమీ .
‘‘ఎంతో అనుకున్న, ఎన్నిసార్లు సార్‌ ఇం‌టిలో పార్టీలు జరిగినా, విసుగు లేకుండా పని చేసిన. ఇయ్యాల సార్‌ ‌కనీసం ఏం పని అని ఒక్క నిమిషం కూడానాతో మాట్లాడ లేదు.’’ రమ ఏడ్చినంత పని చేసింది.
‘‘నా కోసం నా బిడ్డ చదువు కోసం మీరు అంతా సార్లతోని ఇబ్బంది పడుతున్నారు.. నా బతుకు గిట్ల అయ్యింది.. బిడ్డను సదువు పిచ్చుకోలేకపోతున్న .. దాని రాతలో కూడా పని మనిషి అని రాసి పెట్టి ఉందేమో’’ కళ్లు తుడుచుకుంటూ అంది దనమ్మ .
‘‘ఎడ్వకే మేం లేమా…. నేను 10 వేలు ఇస్తా.. ముసల్డాన్ని ఏం జేసుకుంట… మనిషి ఎంత ఇస్తరో చెప్పండి…’’ అంది మల్లవ్వ ఆటో లో కూర్చుని.
‘‘నేను ఐదు వేలు ఇస్తా’’ అంది వసంత.
‘‘నేను ఐదు ఇస్తా కానీ.. అందరం కలిపినా యాభయక కూడా కావు.. ఎట్ల మల్లవ్వ.’’ అంది ఆఫీసర్‌..
‘‘అం‌తల్నే ఏమయ్యిందే….కింగ్‌ ‌ఫిషర్‌ ‌లేదా… మిగిలినవి మిత్తికి అయినా ఇయ్యక పోతద …దనమ్మ బిడ్డను ఇంజనీరింగ్‌ ‌సదివిపిద్దాం ఎట్ల అయినా… కింగ్‌ ‌ఫిషర్‌ ఇం‌టికి వచ్చిందేమో సూద్దం పదండి..’’ అందరూ లక్ష్మీ ఇంటికి చేరుకున్నారు.
‘‘ లక్ష్మి… లక్ష్మీ’’ అని పిలిచింది… వసంత
లక్ష్మి రాలేదు…. ఎవ్వరూ పలకలేదు…
‘‘తప్పించుకుంటందా ఏంది…? కబురు పెట్టినా రాలేదు… ఇంటికీ వస్తె లేదు… ఏమే మాన్సన్‌… ‌నేను పిల్చిన అని చెప్పినావా లేదా’’ మల్లవ్వ సీరియస్‌ అయ్యింది..
‘‘పనికి పోవచ్చునే.. అది ఎప్పుడు ఖాళీగా ఉంటది చెప్పు..?’’ దనమ్మ మెల్లగా ఆంది…
‘‘ రేపు ఫీజు గట్టాలే గదనే… గిట్ల జేస్తే ఎట్ల… ఒక్కరి కష్టం అందరిదీ కదా….’’
ఇంతలో లక్ష్మి, భర్త ఇద్దరూ టీవీఎస్‌ ‌చాంప్‌ ‌మీద వచ్చారు…
మల్లవ్వ మొఖం మాడ్చింది…
‘‘నీ కోసమే సొత్తానం’’ అని అంది మనమ్మ.
‘‘మల్లవ్వ ఇంటికీ పోయి అత్తానం…అక్కడ లేక పోయేసరికి ఎతుక్కుంట అత్తున్నం..’’ అంటూ ఒక దస్తీలో నుంచి రెండు డబ్బు కట్టలు మల్లవ్వ చేతిలో పెట్టి’’ లక్ష రూపాయలే మల్లవ్వ… సంవత్సరము మొత్తం అయితయి…’’ అంది..
‘‘ఒక్కసారే ఎన్ని ఇస్తనవెందే… ఎక్కడివి..’’
‘‘గాజులు షేటు దగ్గర పెట్టినా… అందుకే లేట్‌ అయ్యింది’’
‘‘ఎంత మంచిదానివే… మిత్తి ధనమ్మను అడగకు… నేను ఇస్తా..’’ అంది మల్లవ్వ .
‘‘ఒ మల్లవ్వ ఇవి మిత్తికి కావు… నేనే సదివి పిత్తాన అనుకో… గంతే…’’ అంది లక్ష్మి.
‘‘నువ్వు.. నిజంగా కింగ్‌ ‌వే నే….
‘‘అది అందరి బిడ్డ…. బస్తీ బిడ్డ….అది సదువుకుంటే…బస్తీ అంతా బంగారం అయితది…’’ లక్ష్మి అందీ…
‘‘సదువు పట్ల నీకు ఎంత ప్రేమ ఉందే’’
‘‘ఆడపిల్ల సదువుకుంటే సమాజం బాగు పడతది అని ఎవరో పెద్ద సార్‌ ‌చెప్పలేదా’’ అంది లక్ష్మి.
‘‘అవును .పెద్ద సార్లు చాలా బాగా చెప్పారు’’ అంది మల్లవ్వ కొంత చిరాకుగా.
‘‘నువ్వు సల్లగా ఉండాల్నే … దనమ్మ బిడ్డ అదృష్టం బాగుంది…’’ అంటూ డబ్బులు దనమ్మ చేతిలొ పెట్టింది మల్లవ్వ
దనమ్మ అందరికి చేతులు జోడించింది..
‘‘ఇగ అందరూ పనికి పొండి. నేను, దనమ్మ కాలేజ్‌కి పోయి పైసలు కట్టి అస్తం’’ అంది మల్లవ్వ .
అందరూ సంతోషంగా వెళ్లి పోయారు.
లక్ష్మి భర్త తో కలిసి ఇంటికి వెళ్లింది. తన బిడ్డను బాగా చదివించుదామని కలలు కంది లక్ష్మి. బిడ్డలు కాకపోతే హాస్పిటల్‌ ‌చుట్టూ తిరుగుతుంది. కానీ పిల్లలు కావటం లేదు. ఇప్పుడు దనమ్మ బిడ్డ సంగతి తెలిసే సరికి… ఇక నేను హాస్పిటల్‌ ‌చుట్టూ తిరుగనని ఆ పైసలతో దనమ్మ బిడ్డ ను చదివిపిస్తానని .. భర్తను ఒప్పించి డబ్బులు ఇచ్చింది లక్ష్మి.
పేద వాళ్లు సహాయం చేయడంలో పెద్ద వాళ్ళు… ఇది బస్తీ బడాపన్‌. శ్రీ ‌రామ్‌ ‌బస్తీ మనసుల కోవెల.

‌-దాసరి మోహన్‌

About Author

By editor

Twitter
YOUTUBE