తమ అస్తిత్వాన్నీ కాదనుకున్నారు, చరిత్రను వక్రీకరించుకున్నారు. సుదీర్ఘ కాలగమనంలో చూస్తే నిన్నటి మొన్నటి వరకూ భారతదేశంలో భాగంగా ఉన్నవారు, ఒకే పూర్వీకులను కలిగినవారే కూడా. అలాంటి పాకిస్తానీలు మత ముసుగులో తమను తాము మోసం చేసుకుంటూ జీవించడం అలవాటు చేసుకున్నారన్నది స్పష్టం. స్వాతంత్య్ర సమరయోధుడు ‘భగత్‌సింగ్‌’‌ను కాదనుకోవడంతో, దూషించడంతో ఆ ధోరణి మరొక్కసారి స్పష్టమైంది. నాడు భారత్‌లో భాగం లాహోర్‌కు చెందిన భగత్‌సింగ్‌ ‌చేసిన మహోన్నత త్యాగాన్ని విస్మరించి, ఆయనను తీవ్రవాదిగా ముద్రవేయడానికి మతోన్మాదంతో ఊగిపోతున్న పాకిస్తానీయులు ప్రయత్నించడం గర్హనీయం.

నేటికి యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌. ఆయన శౌర్యసాహసాలు, ఆలోచనలు తరాలు గడిచినా యువతను ఆకర్షిస్తూనే ఉన్నాయి, ఉంటాయి. పరాయి పాలనలో తన మాతృభూమికి జరుగుతున్న అన్యాయాలను సహించలేకపోవడమే నేరం అయితే, స్వాతంత్య్ర సమరం జరిగిన ఏ దేశానికీ స్వేచ్ఛ లభించేది కాదు. భగత్‌సింగ్‌, ‌రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు ముగ్గురూ బ్రిటిష్‌ ‌పోలీసు అధికారిని హత్య చేశారన్న ఆరోపణలతో 1931లో షాద్‌మాన్‌ ‌చౌక్‌లో ఉరి తీశారు. దేశ విభజన తరువాత కూడా ఏళ్ల తరబడి భగత్‌సింగ్‌ ‌త్యాగనిరతి యువత మనసులను వెంటాడిందని తారేక్‌ ‌ఫతా వంటి రచయితలు పేర్కొన్నారు. ఆ క్రమంలోనే భగత్‌సింగ్‌ను తమవాడిగా భావించి ఫవారా చౌక్‌ ‌షాద్‌మాన్‌ ‌పేరును భగత్‌సింగ్‌ ‌చౌక్‌గా మార్చాలని నిర్ణయించారు. కానీ, ఒక సైనిక అధికారి బుర్రలో పురుగు తొలిచింది. రిటైర్డ్ ‌కమడోర్‌ ‌తారీక్‌ ‌మజీద్‌ ‌దీనికి అభ్యంతర పెట్టాడు. భగత్‌సింగ్‌ ‌విప్లవకారుడు కాదు, ఒక బ్రిటిషు పోలీసు అధికారిని చంపిన ‘నేరగాడు’, నేటి మా•ల్లో చెప్పాలంటే ‘తీవ్రవాది’ అంటూ మజీద్‌ అభ్యంతర పెట్టడంతో లాహోర్‌ ‌మెట్రొపాలిటన్‌ ‌కార్పొరేషన్‌ అదే విషయాన్ని లాహోర్‌ ‌హైకోర్టుకు నివేదించింది.

పేరు మార్చాలని ఎప్పుడో నిర్ణయం

లాహోర్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌కార్పొరేషన్‌ ‌డిసెంబర్‌ 5, 2012‌న జరిగిన దిల్‌కాష్‌ ‌లాహోర్‌ ‌కమిటీ సమావేశంలో నగరంలో ఉన్న ఫవారా చౌక్‌ ‌షాద్‌మాన్‌ ‌సహా రహదారులు, చౌక్‌లు, బ్రిడ్జిల పేర్లు మార్చాలని నిర్ణయించింది. ఆ సమయంలోనే షాద్‌మాన్‌ ‌చౌక్‌ ‌పేరును భగత్‌సింగ్‌ ‌చౌక్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రజల సూచనలను, అభ్యంతరాలను కోరుతూ పత్రికలలో ప్రకటన వెలువడింది. చౌక్‌ ‌పేరు మార్చాలన్న ప్రతిపాదనను అనేకమంది వ్యతిరేకించగా, భగత్‌సింగ్‌ ‌మెమోరియల్‌ ‌ఫౌండేషన్‌ అనే ఎన్జీవో లాహోర్‌ ‌హైకోర్టులో షాద్‌మాన్‌ ‌చౌక్‌ను భగత్‌సింగ్‌ ‌చౌక్‌గా మార్చాలంటూ కేసు దాఖలు చేసిందని, పాకిస్తానీ పత్రిక ‘డాన్‌’ ‌పేర్కొంది.

డాన్‌ ‌పత్రిక కథనం

ఆ పత్రిక కథనం ప్రకారం, కోర్టులో కేసు దాఖలైన నేపథ్యంలో సైన్యాధికారి తారీక్‌ ‌మజీద్‌, ‌భగత్‌సింగ్‌ ‌కథనమే పుక్కిటి పురాణమంటూ ప్రకటించి, ఒక ‘అవగాహనా పత్రాన్ని’ ప్రభుత్వానికి సమర్పించడమే కాదు, షాద్‌మాన్‌ ‌చౌక్‌ ‌పేరును భగత్‌సింగ్‌ ‌చౌక్‌గా మార్చడానికి వీలులేదని వాదించాడు. అంతటితో ఆగక ఆ మతోన్మాద సైన్యాధికారి, భగత్‌సింగ్‌ను ఒక విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చూపిస్తూ నకిలీ ప్రచారం చేయడం ద్వారా ఆ ఎన్జీవో కుట్ర పన్నుతోందని అభాండాలు మోపాడు. భారత ఉపమహాద్వీప స్వాతంత్య్ర సమరంలో భగత్‌సింగ్‌కు పాత్రే లేదని ప్రకటించేశాడు. భగత్‌సింగ్‌ ‌విప్లవకారుడు కాడని, అతడు ఒక బ్రిటిష్‌ ‌పోలీసు అధికారిని హత్య చేసిన నేరగాడని, అందుకే అతడినీ అతడి సహచరులనూ ఉరి తీశారంటూ ఉన్మాదంతో ఊగిపోతూ పేర్కొన్నాడు. వీటన్నింటినీ మించి, ఆ మతోన్మాద అధికారి భగత్‌సింగ్‌ ‌పాకిస్తాన్‌కు విదేశీయుడని, దేశ ఇస్లామిక్‌ ‌భావజాలానికి శత్రువని తన మనసులో ఉన్న అసలు విషాన్ని కక్కాడు. పేరు మార్పును డిమాండ్‌ ‌చేస్తున్న భగత్‌ ‌సింగ్‌ ‌ఫౌండేషన్‌ అన్నది పాకిస్తానీ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది కనుక దానిని నిషేధించాలని కూడా డిమాండ్‌ ‌చేశాడు. దీనిపై ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ఇం‌తియాజ్‌ ‌రషీద్‌ ‌ఖురేషీ నాటి పంజాబ్‌ ‌ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా కంటెంప్ట్ ‌పిటిషన్‌ను దాఖలు చేయగా, తన ఆరోపణలతో సైన్యాధికారి కోర్టుకు పత్రాలను సమర్పించాడు. కేసును కోర్టు జనవరి 17, 2025కు వాయిదా వేసింది.

విద్యార్ధుల డిమాండ్‌తోనే నాడు పేరు మార్చాలన్న నిర్ణయం

భగత్‌సింగ్‌ 91‌వ వర్ధంతి సందర్భంగా ‘భగత్‌సింగ్‌ అమర్‌రహే’ నినాదాలతో పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని షాద్‌మాన్‌ ‌చౌక్‌ ‌దద్దరిల్లింది. మార్చి 23, 1931లో అదే స్థలంలో భగత్‌సింగ్‌ను, అతడి సహచరులిద్దరినీ ఉరితీసిన ప్రదేశమది. అందుకే, భగత్‌సింగ్‌ ‌చౌక్‌ అని పేరు పెట్టాలని విద్యార్ధులు నాడు డిమాండ్‌ ‌చేశారు. ఆ చౌక్‌ ‌గతంలో లాహోర్‌ ‌సెంట్రల్‌ ‌జైల్లో భాగంగా ఉండేది.

పోగ్రెసివ్‌ ‌స్టూడెంట్స్ ‌కలెక్టివ్‌లో సభ్యులుగా ఉన్న విద్యార్ధులు దానికి షహీద్‌ ‌భగత్‌సింగ్‌ అని పేరు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. విప్లవకారులుగా వారు చేసిన త్యాగాలు ఉప ఖండంలో శాశ్వతంగా గుర్తు ఉంటాయంటూ భగత్‌సింగ్‌ ‌మెమోరియల్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ఇం‌తియాజ్‌ ‌రషీద్‌ ‌ఖురేషీ కూడా పేర్కొన్నాడు. అంతటితో ఆగక, ‘పాకిస్తాన్‌లో కూడా భగత్‌సింగ్‌ను స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తించాలని, చౌక్‌కు కూడా అతడి పేరు పెట్టాలని’ డిమాండ్‌ ‌చేశారు. పాకిస్తాన్‌ ‌ఖాయిద్‌•-ఎ-ఆజంగా పిలుచుకునే జిన్నా కూడా సెప్టెంబర్‌ 4, 1929‌న ఢిల్లీ అసెంబ్లీలో భగత్‌సింగ్‌ను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశాడు.

నేటి పాకిస్తాన్‌లోని ఫైస్లాబాద్‌ ‌గ్రామంలో జన్మించిన భగత్‌ ‌జ్ఞాపకాలపై పాకిస్తాన్‌కు కూడా హక్కు ఉందంటూ, జీవించిన అతి స్వల్ప, అర్థవంత మైన జీవితంలో అతడు లాహోర్‌లోనే ఎక్కువ గడిపాడని కూడా ఖురేషీ చెప్పటం గమనార్హం. స్వాతంత్య్ర పోరాటానికి చిహ్నంగా భగత్‌సింగ్‌ ఉన్నాడని, మా సుసంపన్నమైన వారసత్వాన్ని లాక్కొనే హక్కు ఎవరికీ లేదని కూడా స్పష్టం చేశాడు.

భగత్‌సింగ్‌ ‌భక్తుడిగా మారిన ఖురేషీ

ఏది ఏమైనా షాద్‌మాన్‌ ‌చౌక్‌ ‌పేరును మార్పించాలన్న పట్టుదలతో ఉన్న ఖురేషీ 2013లో భగత్‌సింగ్‌ అం‌తిమ కేసును తిరిగి తెరవవలసిందిగా లాహోర్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశాడు. అసిస్టెంట్‌ ‌సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ‌పోలీస్‌గా ఉన్న జేపీ శాండర్స్‌ను 1928లో హత్య చేసిన ఘటనలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈ నిర్ణయానికి రావచ్చని అతడు వాదించాడు. చౌక్‌ ‌పేరు మార్చవలసిందిగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు జిల్లా యంత్రాంగం సహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖురేషీ 2018లో కేసు నమోదు చేశాడు.

ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్‌ ‌పేరులేదా?

నాడు శాండర్స్‌ను హత్య చేసేందుకు పన్నిన లాహోర్‌ ‌కుట్ర కేసులో 23 ఏళ్ల భగత్‌సింగ్‌కు కూడా జోక్యముందంటూ బ్రిటిష్‌ ‌వారు విచారణ అనంతరం 1931లో ఉరి తీశారు. హత్యానంతరం ఈ కుట్రకు సంబంధించి 1928లో భగత్‌, అతడి సహచరులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీ కావాలని ఖురేషీ కోరాడు. పంజాబ్‌ ‌పోలీస్‌ ‌న్యాయ వ్యవహారాల కార్యాలయంలో 1895-1928 వరకూ రికార్డులు ఉన్నాయని, కానీ పోలీసులు మాత్రం 1928లో వారిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ‌కాపీని ఇవ్వలేదని ఖురేషీ ఆరోపించాడు. ఈ క్రమంలోనే లాహోరు హైకోర్టు ఈ కేసును విచారించేందుకు మరింత పెద్ద బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తికి పంపింది.

1928లో బ్రిటిష్‌ ‌పోలీసు అధికారి హత్య కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్‌ ‌పేరును కూడా ప్రస్తావించలేదని, కానీ ఉరిశిక్ష వేశారని లాహోర్‌ ‌పోలీసులు కనుగొనడం కొసమెరుపు. అందుకే, భగత్‌సింగ్‌ను ఉరి తీసి ఎనిమిది దశాబ్దాలు అవుతున్నా, కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఖురేషీ పేర్కొన్నారు. భగత్‌ను ప్రేమించే పాకిస్తాన్‌లోని సాధారణ పౌరులు, విద్యార్ధులు ఆయన జయంతి, వర్ధంతి రోజున ఆ యోధుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు.

భారత్‌ ‌మండిపాటు

పాకిస్తాన్‌ ‌మతోన్మాది చేసిన వ్యాఖ్యలకు పంజాబ్‌ ‌నుంచి ప్రతిస్పందన వెలువడింది. అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ‌భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు ఇద్దరూ భగత్‌సింగ్‌ ‌నేరగాడంటూ మాజీ సైన్యాధికారి చేసిన చౌకబారు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ ‌వివరణ కోరేందుకు భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవా లని, భవిష్యత్తులో అటు వంటి వ్యాఖ్యలు ప్రకటనలు వెలువడ కుండా, మజీద్‌ ‌వ్యాఖ్యలను రికార్డుల నుంచి లాహోర్‌ ‌హైకోర్టు తొలగించాలని, ఆప్‌ ‌విజ్ఞప్తి చేసింది. భగత్‌సింగ్‌ను అవమానిస్తే తాము సహించమంటూ ఆనంద్‌పూర్‌ ‌సాహిబ్‌ ఎం‌పీ, ఆప్‌ ‌నాయకుడు మాల్విందర్‌ ‌సింగ్‌ ‌కాంగ్‌ ‌హెచ్చరించారు. భగత్‌సింగ్‌, ‌డా।। అంబేడ్కర్‌ ‌సిద్ధాంతాలను తాము అనుసరిస్తామని, వారి ఆలోచనలే మన మౌలిక సూత్రాలంటూ కాంగ్‌ ‌స్పష్టం చేశారు. భగతసింగ్‌ ‌వారసత్వం సాహసమని, స్వతంత్ర భారతదేశంలో ఆయన దృష్టి ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని, ఆ వారసత్వాన్ని రద్దు చేసేందుకు పాక్‌ ‌చేస్తున్న యత్నాన్ని ఖండిస్తున్నామని కాంగ్‌ ‌ఘాటుగా పేర్కొన్నారు.

భగత్‌సింగ్‌ ‌ప్రతిఘటన చర్యలు బ్రిటిష్‌ ‌పాలకుల నుంచి భారత్‌ను విముక్తం చేయడానికే తప్ప తర్వాత వచ్చిన ప్రాంతీయ విభజనలకు వ్యతిరేకంగా కాదని పాకిస్తాన్‌కు ఆయన గుర్తు చేశారు. అంతేకాదు, భగత్‌సింగ్‌ ‌జైల్లో రాసుకున్న డైరీని ప్రస్తావిస్తూ, అతడు స్వతంత్రమైన, సామాజికంగా న్యాయమైన భారతం కోసం రాసుకున్న రాతలను గుర్తు చేశారు. ఎవరికీ హాని చేయడం భగత్‌సింగ్‌ ఉద్దేశం కాదని, బ్రిటిష్‌ ‌వారు భారతీయులపై చేస్తున్న అకృత్యాలను గుర్తు చేసే లక్ష్యంతోనే అతడి చర్యలు ఉన్నాయని అన్నారు.

భారతీయ జనతా పార్టీ మరింత ఘాటుగా స్పందిస్తూ, తీవ్రవాదులను పెంచి పోషించే దేశానికి ఒక హీరోను నేరగాడంటూ అవమానించడం వారి కప•త్వాన్ని బయటపెడుతోందని విమర్శించింది. అవిభజిత భారతదేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వీరుడిపై నిందలు వేయడం గర్హనీయమంటూ దాడి చేసింది. ఇది జాతీయ నాయకుడి వారసత్వం, భారత్‌ ఆత్మగౌరవంపై దాడిగా పార్టీ అభివర్ణించింది. పాకిస్తాన్‌ ఉనికిలోకి రాకముందే అఖండ భారతం కోసం భగత్‌ ‌సింగ్‌ ‌తన జీవితాన్ని త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. తన జీవితాన్ని స్వాతంత్రం కోసం తృణప్రాయంగా భావించిన భగత్‌ ‌సింగ్‌ ‌వంటి అమరవీరుడిని నేరగాడంటూ తీవ్రవాదులను పెంచి పోషించే దేశం పేర్కొనడం హేయంగా ఉందని బీజేపీ నాయకులు విమర్శించారు. ఒకవైపు తీవ్రవాదులను పెంచిపోషి స్తూనే, నిజమైన హీరోను అవమానించి నందుకు పాకిస్తాన్‌ ‌సిగ్గు పడాలని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE