పాలనా నిర్వహణ కోసం కంటి ఎదుటి ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో, వినడమే కాని చూడడం తెలీని దేవుళ్ల ఆభరణాలు, ఆస్తుల భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆలయ మర్యాదలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు మసక బారుతున్నాయి. సంప్రదాయాల విషయంలో ‘సర్దుబాటు’ ధోరణి పెరిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రారంభించా మని ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆలయాల పాలనలో పారదర్శకతను ప్రదర్శించాలి. టీటీడీనే.. కాదు…అన్ని ఆలయాల పాలనను సువ్యస్థితం చేయ(లే)కపోతే ‘ఉన్నవా.. అసలు ఉన్నావా.. ఉంటే కళ్లు మూసుకున్నావా’ అని దేవుడినే నిలదీసే స్థితి దాపురించి, ఆయన అస్తిత్వంపైనే సందేహాలు ముసురుకోవచ్చు.

తిరుమలేశుడి లడ్డు సహా ఇతర ప్రసాదాలలో వినియోగించే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యతపై జాతీయ స్థాయిలో రేగిన దుమారం నేపథ్యంలో ఇంకా అనేకానేక అనుమానాలు భక్తకోటిని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా స్వామి వారి ఆభరణాల విషయంలో. శ్రీనివాసుడి కల్యాణం సందర్భంగా మామ, పినమామ గార్లు ఆకాశరాజు, తొండమాన్‌ చక్రవర్తి సహా విజయనగరం సామ్రాజ్యా ధీశుడు శ్రీకృష్ణదేవరాయలుతో పాటు నేటి వరకు ఎందరెందరో వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలు, సామాన్య భక్తులు విలువైన కానుకలు బహుకరిం చారని, బహూకరిస్తున్నారని మాధ్యమాలు, పుస్తకాల ద్వారానే తెలుసుకుంటుంటాం. దేవస్థానం పాలకమండలి, కార్యనిర్వహణాధికారులు వస్తూ పోతుం టారు తప్ప, తమతమ హయాంలో సాధించిన ఉన్నతి, ప్రవేశపెట్టిన సంస్కరణలు, వాటి ఫలితాలు తదితర అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు లేదు.

దేవదేవుడి ఆదాయం పప్పుబెల్లాలు కావడం భక్తులను కలచి వేస్తోంది. దేవస్థానానికి సంబంధంలేని పనులకు కూడా దాని నిధులు దారిమళ్లుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు ఆరు నెలల ముందు తిరుమల, తిరుపతిల్లో రూ. 1400 కోట్ల విలువైన పనులకు టెండర్ల పిలవడం తాజా ఉదాహరణ. ఆ టెండర్ల వెనుక దురుద్దేశాలుఉన్నట్లు అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారి పరకామణిని ఆలయం వెలుపలికి మార్చడం, మహాద్వార దర్శనాలపై కూడా విమర్శలు ఉన్నాయి. ఆనాటి హుండీ రాబడి లెక్కింపు పూర్తయిన తరువాత సొమ్మును ఇతరత్రా భద్రపరచినా, లెక్కింపు మాత్రం ఆలయం ప్రాంగణంలోనే నిర్వహించాలని, ఆ ప్రక్రియను ఆలయం వెలుపలకు మార్చడం సంప్రదాయ విరుద్ధమని ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచనకర్తలు అభిప్రాయపడుతున్నారు.

 అమూల్యమైన శ్రీవారి ఆభరణాలు సవ్యంగా ఉన్నాయో..లేదో అనే దానిని తక్షణం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. శ్రీవారికి దేశవ్యాప్తంగా కానుకలుగా అందిన భూముల రక్షణ విషయంపైనా దృష్టి సారించాలి. ఆలయాల పాలకమండళ్లు, టీవీ చానల్‌, ధార్మిక సంస్థ లాంటి అనుబంధ విభాగాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కావడం శోచనీయం. ప్రభుత్వాధినేతలు తమకు నచ్చిన వారిని ఆయా పదవుల్లో, హాదాల్లో నియమించుకోవడం కాదనలేనిది. అదే సమయంలో వారివారి యోగ్యతలు, ఆ హోదాలకు గల గౌరవం, ప్రాధాన్యత, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే లోపిస్తోందని వర్తమాన పరిణామాలు సూచిస్తున్నాయి. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ ఇతరులకు అదర్శంగా నిలవాల్సిన వారే కట్టుతప్పడం, పాలకమండలి పూర్వాధ్యక్షుడు లాంటి వారు, ఇతర ప్రముఖులు దానికి ఊతం ఇవ్వడం వింత పరిణామం.

తిరుమల కొండపై …మరీ ముఖ్యంగా ఆలయ మాడవీధులలో రాజకీయ వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయకూడ దన్న నిబంధన కొండెక్కుతోంది. శ్రీనివాసుడి దర్శనానికి అందరు అర్హులే. కాకపోతే, దర్శనం అపేక్ష గల అన్య మతస్థులు, ఆలయ నిబంధనల మేరకు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లు వాగ్మూలం (డిక్లరేషన్‌) ఇవ్వవలసి ఉంటుంది (నిన్నటికి నిన్న`సెప్టెంబరు 29న`సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో పాటు తిరుమలేశుని దర్శనానికి వచ్చిన హైందవేతర వ్యక్తి వాగ్మూలం సమర్పించడం హర్షణీయం). కానీ ప్రస్తుతం అదీ రాజకీయ అంశమైంది.

రంజాన్‌, క్రిస్మస్‌ తదితర మత వేడుకల్లో పాల్గొనేటప్పుడు, మసీదు, చర్చిలులాంటి ప్రార్థనాలయాల సందర్శన వేళ ఆయా మత సంప్రదాయాలు పాటించేవారు, తిరుమల విషయంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్న. ‘దేవదేవుడు తనను నమ్మిన వారిని కొంగు బంగారమై కాపాడతాడు తప్ప, అనిష్టులు దర్శనానికి రావాలని ఆశించడు.ఒకవేళ రావాలనుకునే వారు విధిగా ఆలయ మర్యాదలు పాటించాలి’ అనే ఆస్తికుల, విజ్ఞుల సూచనలు బధిర శంఖారావమే.

 ఎన్టీరామారావు ప్రభుత్వం (1983) మహాద్వార దర్శనంపై కొన్ని నియమ నిబంధనలు రూపొందించింది. అయితే ఆ మార్గంలో ఆలయ ప్రవేశానికి ఎవరెవరికి అర్హత, అనుమతులు ఉన్నాయన్నది సామాన్య భక్తలకు నేటికీ అంతగా అవగాహన ఉన్నట్లు లేదు (అక్కడికి సిబ్బందికే తెలుసో!లేదో!?). పరపతిపై రాజకీయులు, పలుకుబడి గలవారు లెక్కకు మిక్కిలిగా అనుయాయులు, అనుచరులతో దర్శనానికి వెళ్లడం మాధ్యమాలలో చూస్తున్నదే (జస్టిస్‌ చంద్రచూడ్‌కు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మహాద్వారం నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉన్నా సాధారణ భక్తునిలా క్యూలో వెళ్లడం గమనార్హం. కొందరికైనా కనువిప్పుకావాలి). దీనిపైనా పాలకమండలి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎవరెవరి వాహనాలకు టోల్‌ రుసుం నుంచి మినహాయింపు ఉంటుందో టోల్‌ గేట్ల సమీపంలోని బోర్డుల మాదిరిగానే, మహాద్వార దర్శనానికి అర్హత గల హోదాలను పేర్కొనడం సముచితంగా ఉంటుంది.

కొసమెరుపు ఏమిటంటే… తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో లోపాలు, ఆరోపణలు కొత్తకాదు. స్థాయీ భేదంతో కొనసాగుతూనే ఉన్నాయి. అరవై రెండేళ్ల క్రితం ‘జాగృతి’ జాతీయ వారపత్రిక ప్రచురించిన వార్తే (తిరుపతి దేవస్థానం నిర్వహణపై వాదోపవాదాలు /15.3.1963) అందుకు ఉదాహరణ. ‘తిరుపతి దేవస్థానంలో ‘ముసలం’బయలు దేరింది.

దేవస్థానం ఆదాయం దుర్వినియోగ మవుతున్నట్లు కొందరు ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు. అక్కడ అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని, సిమెంట్‌ , ఇనుము పోయినందు వలన అనుమానం మీద దేవస్థానంలో ఉన్న పేష్కార్‌పై చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామికి కానుకలు హుండీలో వేస్తూ ఉన్నా, దేవస్థానానికి అవి పూర్తి స్థాయిలో చేరడంలేదు’ అని నాటి మంత్రి టీఎస్‌ సదాలక్ష్మి చెప్పినట్లు వార్తా కథనం సారాంశం. ‘శ్రీవేంకటేశ్వర స్వామి మీద దేవస్థానం బోర్డు మీద మత రాజకీయాలు ప్రవేశపెట్టడం ఆయా మతాల వారికే కాక, ఆయా మతాల నాయకులకు కూడా శ్రేయస్కరం కాదు’ అని సున్నితంగా హెచ్చరించారు.

– స్వామి

About Author

By editor

Twitter
YOUTUBE