28 అక్టోబర్‌ ‌నివేదిత జయంతి

మార్గరెట్‌ ఎలిజబెత్‌ ‌నోబెల్‌

ఈ ‌పేరు కొంతమందికే తెలుసు.

సిస్టర్‌ ‌నివేదిత అంటే తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు.

అక్టోబర్‌లో ఆమె జయంతి సందర్భంగా సభలూ, రచనలూ!

ఎక్కడో ఐర్లాండ్‌లో జననం. ఉపాధ్యాయినిగా జీవితం.

సర్వమత సమ్మేళానికి అమెరికా వెళ్లారు. భారతదేశాన్నీ చూడాలని తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఆగినపుడు…అప్పుడు వినవచ్చింది వివేకానంద వాణి.

ఆ ధీర గంభీర స్వరూపుని ప్రతీ మాటా ఆమె మీద ఎంతో ప్రభావం చూపింది. ఈ దేశంలోనే ఉంటూ, రామకృష్ణ ఆశ్రమం సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, కాలక్రమంలో ఆమె అయ్యారు ‘నివేదిత’.

సాక్షాత్తు వివేకానందుల వారి నుంచే అలా పిలిపించుకున్నారు. అప్పటి నుంచే జీవనయానం మలుపు తిరిగింది.

అది 1895వ సంవత్సరం. ఇది 2024. అంటే శతాబ్దం దాటి దరిదాపు మూడు దశాబ్దాలు. ఇప్పటికీ ‘సోదరి నివేదితా’ అని పిలుచుకుంటున్నాం. స్మరించుకుంటూ నమస్కరించుకుంటున్నాం.

డార్జిలింగ్‌. 1911 అక్టోబరు మూడోవారంలో ఆమె అస్తమించారు. అయినా ఈనాటికీ అక్కడి శిలాఫలకం మీద అక్షరాలు మెరుస్తునే ఉన్నాయి.

ఏమని?

భారత్‌కే నివేదిత తన సర్వస్వాన్నీ అర్పించారని!

 అందుకే ఆ మహనీయను తలచిన ప్రతిసారీ హృదయం ధన్యవాద సమర్పణ చేస్తుంటుంది. చేస్తూనే ఉంటుంది.

తాను ఇక్కడికి వచ్చారు. ఇక్కడే జీవించారు.

ఈ దేశాన్నే ప్రేమించారు. సేవను అందిస్తూ వచ్చారు.

సకలం, సర్వం భారతదేశమే అనుకున్నారు.

తల్లిదండ్రుల స్ఫూర్తి తొలినుంచే నివేదితపై ఉంది.

సేవా భావన గురించే చదువుకున్నారు. ఆ చిత్తశుద్ధితోనే ఇంగ్లండ్‌లో ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.

ఆడపిల్లలు చదువుకోవాలని, ఇంటికీ సమాజానికీ ఆమె వెలుగుదివ్వె అనీ నివేదితకు ప్రగాఢ నమ్మిక.

ఆ కారణంగానే పిల్లలకు చదువుచెప్పే పనిని ఎంచుకున్నారు. అనంతర పరిణామాల్లో భారత సందర్శన. అంతకుముందు ఆమెరికా దేశాన వివేకానంద ప్రసంగ శ్రవణ భాగ్యం. ప్రత్యక్ష దర్శనం.. అటు తర్వాత ఎంతగా ప్రభావితురాలు అయ్యారంటే, ఏకంగా ఒక పుస్తకాన్నే రాశారు ‘ది మాస్టర్‌ ‌యజ్‌ ఐ ‌సా హిమ్‌’ అని!

 భారతీయత ఘనత తెలుసుకున్నారు. ఆ ప్రతీకతను తన గురువులోనే చూసుకున్నారు.

సాహిత్యం, కళలు, సంగీతం ఆమె అభిమాన అంశాలు. భౌతిక శాస్త్రాన్ని అభ్యసించినా, హిందూ ధార్మిక శాస్త్రయతపైనే ప్రధాన అధ్యయనాలు చేశారు. పరిశీలనలు కొనసాగించారు.

వివేకానందులు ఆమెకు ఆధ్యాత్మిక గురువు. స్వామితో పరిచయ, ప్రభావశీలత ఎటువంటిదంటే…

లండన్‌లో అది మధ్యాహ్న వేళ. అక్కడి ఒక భవంతిలో ఒక గది. అక్కడే, అందులోనే వివేకానంద బోధ.

భారతీయ వేదాంత తత్వాన్ని విపులీకరిస్తున్నారు ఆయన.

‘భారతీయ ఆధ్యాత్మికతకు ప్రపంచమంతా రుణపడిఉంది. భారతీయత అనేది మహత్తరశక్తి. విశ్వమానవ సమాజంపైన ఆ ప్రభావశీలత బృహత్తరం. సామాజిక అభ్యుదయం, మానవతా వికాసం..అన్నీ భారతీయ ధార్మికతలోనే. వ్యాప్తి, వ్యక్తీకరణ అనంతం’ అన్న ఆయన మాటలు ఆమె ఆలోచనలను విస్తృతపరచాయి.

ఆ సంవత్సరం 1898. ఆ నగరం కలకత్తా. అది స్టార్‌ ‌థియేటర్‌.

అక్కడ సోదరి నివేదిత ప్రసంగం.

అంశం: ఇంగ్లండ్‌లో భారతీయ ఆధ్యాత్మిక భావనాశక్తి. ఆమెను సభకు పరిచయం చేసినవారు వివేకానందులవారే. ఆయనే నాటి కార్యక్రమానికి అధ్యక్షులు.

‘భారతీయ ఆధ్యాత్మిక భావనలనేకం ఆసియా దేశాల్లో మాత్రమే కాదు. మొత్తం ప్రపంచమంతటా విస్తరించి ఉంటున్నాయి. అపార విశ్వాసం భారతీయు లందరితో పాటు నాలోనూ ఉంది. ఇదే విశ్వసనీయత సర్వమానవ హృదయాల్లోనూ వెల్లి విరియాలి.’

ఈ మాటలు నివేదిత క్రియాశీలతను ఎంతగానో విస్తృత పరచాయి. వివేకానంద దార్శనికతను అన్నింటా అంతటా తేటతెల్లం చేశాయి.

సమాజంలోని అవ్యవస్థను రూపుమాపగలిగేది విద్య ఒక్కటే. అదీ మహిళా విద్య. అంశాల వారీగా గురువుకీ, శిష్యురాలికీ ఏకాభిప్రాయమే. చరిత్ర తాత్వికతకు సంబంధించి ఉభయులూ చర్చించుకునే వారు. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను సమీక్షిస్తుండేవారు.

 ‘ఇంగ్లాండ్‌ ‌భారత్‌కు పంపిన బహుమతి నివేదిత’ అని శ్లాఘించారు వివేకానంద. ఒక సందర్భంలో వివేకానందులవారే ‘మీరు ఇకనుంచి మార్గరెట్‌ ‌కాదు. నివేదిత. సోదరి నివేదిత’ అని ప్రకటించారు.

అనంతర క్రమంలో ఆమె తన గురువర్యులతో భారత్‌లోని అనేక ప్రాంతాలను సందర్శించారు. ప్రజల సంస్కృతిని తెలుసుకొనేందుకు అపార ఉత్సుకత కనబరిచారు. హిమాలయ సందర్శనం జరిపారు.

అల్మోరా ప్రాంతంలో విస్తృత పర్యటన సాగించారు. ఆమె ప్రథమంగా ధ్యానం అభ్యసించిన స్థలం అదే. అమరనథ్‌ ‌ప్రాంతానికీ వెళ్లి వచ్చారు.

వనితా విద్యను ప్రోత్సహించే నివేదిత దేశంలో విద్యాలయాన్ని ప్రారంభిం చారు. ప్రారంభకులు మరెవరో కాదు.. శారదామాత. దివ్య ఆశీస్సు లందించారు.

తన కృషిలో భాగంగా ఊరూరా ఇంటింటికీ వెళ్లారు నివేదిత.

ఎందరెందరో బాలికలను చేరదీసి చదివించారు.

కొందరు నిరుత్సాహపరిచినా వెనక్కి తగ్గలేదు. ‘చదువుతోనే ప్రగతి’ అంటూ చాటి చెప్పారామె.

ప్రాథమిక జీవనాంశాలెన్నింటినో నేర్పించారు. ఎన్నెన్నో రాశారు. ఎంతగానో పర్యటించారు. ప్రసంగాలెన్నో చేశారు.

దానగుణంలోనూ మిన్న. కలకత్తాలో వ్యాధి చుట్టుముట్టినపుడు, బాధితులకు అండదండగా నిలిచారు.

యువతను ఆహ్వానించి సేవలు నిర్వహింప చేశారు.

1906వ సంవత్సరంలో కవివర్యులు సుబ్రహ్మణ్యభారతితో సమావేశ మయ్యారు. స్త్రీ స్వాతంత్య్ర అంశాలను చర్చించారు.

ఆమె పాఠశాలలో ‘వందేమాతరం’ ప్రతిధ్వనిం చేది. మరికొన్ని పుస్తకాలతో తన ఆలోచనామృతాన్ని పంచిపెట్టారు.

భారత సంప్రదాయాలపై ‘ది వెబ్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌లైఫ్‌’ ‌పురాణగాథల ప్రస్తావనతో ‘క్రెడిల్‌ ‌డేల్స్ ఆఫ్‌ ‌హిందూయిజం’

అలాగే

‘నోట్స్ ఆఫ్‌ ‌సనువాండరింగ్స్ ‌విత్‌ ‌స్వామీ వివేకానంద’. అందులో నైనిటాల్‌ ‌పర్యటనాంశాన్ని విశదపరిచారు.

తాను రాసిన వ్యాసాలు అసంఖ్యాకం.

వాటిల్లో కొన్ని:

కాళీ ది మదర్‌

‌యాన్‌ ఇం‌డియన్‌ ‌స్టడా ఆఫ్‌ ‌లవ్‌ అం‌డ్‌ ‌డెత్‌.

ఆమె ఏమని అనేవారంటే ….

  1. మనసే ప్రధానం. విధానమంతా అందులోనే.
  2. అందులోనే మంచి; మంచి కానిది.
  3. వాటితో పాటు అంతులేని శక్తీ నిండి ఉంటుంది అందులో!
  4. అది ఏమిటి? ఎలా వినియోగించాలన్నదే జీవితంలో కీలకం.

ఇన్ని విశిష్టతల బోధకురాలు కాబట్టే : ఆమె స్వస్థలంలోని స్మారక ఫలకం ‘రైటర్‌ అం‌డ్‌ ఇం‌డియన్‌ ‌నేషనలిస్ట్’ అని కొనియాడుతోంది ఇవాళ్టికీ.

ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్స్ ‌రీసెర్చి ఏటా జాతీయస్థాయి ఫెలోషిప్‌ అం‌దిస్తోంది.

భారత ప్రభుత్వం నివేదిత శత జయంతిని (1967) పురస్కరించుకుని గౌరవసూచకంగా ప్రత్యేక తపాలా బిళ్ల వెలువరించింది.

కలకత్తా ప్రాంతంలోని హుగ్లీ నదిమీద వంతెనకు ఆమె పేరే పెట్టారు.

సేవకు అంకితం, సమర్పితం తన జీవితం.

స్వదేశీ ఉద్యమానికీ వెన్నుదన్నుగా నిలిచారు సోదరి. పరపాలనలోని వస్తువులను బహిష్కరించా లన్నారు. మనదేశంలో మనం చేసుకున్న వస్తువులనే వాడాలని పిలుపునిచ్చారు.

ఇక, అద్వైత ఆశ్రమం ఆమె రచనలన్నింటినీ ప్రచురించింది. ‘ఆధునిక భారత వనితల సోదరి’ అంటూ వివేకానంద ఇంటర్నేషనల్‌ ‌ఫౌండేషన్‌ ‌కీర్తించింది.

దేశీయ కళాచరిత్రకు ఆమె సహకారం అద్వితీయమని సంస్థలెన్నో శ్లాఘించాయి. చేతులు జోడించాయి.

ఆరోగ్యం క్షీణించినా ఆమెలో పట్టుదల సడల లేదు. అప్పట్లో అక్టోబరు మూడోవారం ప్రాంతంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దసరా సెలవుల సమయంలో విశ్రాంతి కోరుతూ డార్జిలింగ్‌ ‌సందర్శనకు వెళ్లారు. కొన్నాళ్లకే అనారోగ్య సమస్య ఎదురైంది. ఆ దశలోనూ ఆధ్యాత్మిక భావ సంచలనం ఆమెను ఆవహించే ఉంది. శారీరక అస్వస్థత కారణంగా తుదిశ్వాస విడిచిన సమయంలోనూ ఆమె నోటినుంచి ధార్మిక వాక్కులే వినవచ్చాయి. తుది వరకు వీడని తత్వచింతనం ఆమెది.

స్త్రీ విద్య, స్వతంత్రతా స్ఫూర్తి, భారతీయ విలువల పరివ్యాప్తి… ఈ మూడు ఆశయాల సమాచరణ రూపమే మార్గరెట్‌ ఎలిజబెత్‌ ‌నోబెల్‌. ‌మనందరికీ మార్గదర్శకురాలై నిలుస్తున్న మన సోదరి నివేదిత. చరిత్ర మరవదు ఆమె ఘనత!

– జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE