అదేల మరల రామాయణంబు అన్న విశ్వనాథ వారి పద్యం గురించి వాళ్లకి తెలుసో లేదో కానీ, ‘రామాయణ్‌: ‌ది లెజెండ్‌ ఆఫ్‌ ‌ప్రిన్స్ ‌రామా’ యేనిమేషన్‌ ‌చిత్రరూపంలో భారతీయులందరి ముంగిటకి వస్తున్నది. 1993లో నిర్మించిన ఈ చిత్రం ఇంతకాలానికి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 450 మంది కళాకారులు కలసి యేనిమేషన్‌ ‌పద్ధతిలో రామకథని ఈ తరం వారికి అందిస్తున్నారు. భారతీయ పురాణానికి జపాన్‌ ‌శైలిలో యేనిమేషన్‌ ‌సృష్టి చేశారు. యూగో సాకో దర్శకత్వంలో కొయిచీ సాస్‌కో, రామమోహన్‌ ‌సహాయ దర్శకులుగా ఈ యానిమేషన్‌ ‌రామాయణం రూపుదిద్దుకున్నది. భారత-జపాన్‌ ‌కళా తాత్విక సంగమంగా ఈ చిత్రాన్ని  అభివర్ణిస్తున్నారు. భారతీయ పురాణం ఆధారంగా, జపాన్‌ ‌యానిమేషన్‌ ‌శైలితో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎన్నో ప్రత్యేకతలు కలిగిన జపనీస్‌ ‌యానిమేషన్‌ ‌శైలిలో ప్రపంచ ప్రేక్షకులు కోసం దీనిని రూపొందించారు. గ్రీక్‌ ‌పిక్చర్స్ ఇం‌డియా సంస్థ రామాయణ్‌ ‌ప్రచార కార్యక్రమం ఇటీవల ఢిల్లీలో ఆరంభించింది. ప్రీమియర్‌ ‌షో సందర్భంగా గ్రీక్‌ ‌పిక్చర్స్ ఇం‌డియా సీఈఓ మోక్షా మోద్గల్‌ ‌కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ ప్రదర్శన పట్ల అన్ని వయసుల వారు ఆసక్తి చూపించినందుకు మొదట ఆమె ధన్యవాదాలు తెలియచేశారు. వాల్మీకి రామాయణం ఆధారంగానే ఈ చిత్రం నిర్మించినట్టు ఆమె మాటలను బట్టి తెలుస్తున్నది. వాల్మీకి రాసిన ఈ మహాకావ్యం ద్వారా జపాన్‌-‌భారత్‌ల మధ్య సాంస్కృతిక వారధి నిర్మాణమే కాకుండా, కళాత్మక విలువల వినిమయం కూడా జగిందని భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. అక్టోబర్‌ 18‌న ఈ యేనిమేషన్‌ ‌రామాయణ్‌ ‌చిత్రం భారతదేశంలో విడుదల కానున్నది. ఇంగ్లిష్‌, ‌హిందీ, తమిళ, తెలుగు భాషలతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మొదట దీనిని ఇంగ్లిష్‌ ‌భాషలోనే నిర్మించారు. మొదట ఇంగ్లిష్‌లో నిర్మించారు.

ఇది 1993లో నిర్మించిన చిత్రం. ఆ సంవత్సరం జనవరి 10-20 మధ్య భారత్‌లో జరిగిన 24వ అంతర్జతీయ చలనచిత్రోత్సవంలో దీనిని ప్రదర్శించారు కూడా. కానీ అది అయోధ్య రామజన్మ భూమి విముక్తి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం కాబట్టి సాధారణ వీక్షకులకు అందుబాటులోకి వచ్చే విధంగా సినిమా హాళ్లలో విడుదల చేయలేదు. అప్పుడు అయోధ్య రాముడు, ఇప్పుడు యేనిమేషన్‌ ‌రాముడు కూడా వనవాసం చేయక తప్పలేదన్నమాట. నాలుగేళ్ల తరువాత, 1997లో  ఏవో కొన్ని భారతీయ సినిమా హాళ్లలో మాత్రమే సినిమాను ప్రదర్శించారు. 1997లో జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో  ప్రదర్శించారు. తరువాత టీవీ చానళ్లలో కార్టూన్‌ ‌నెట్‌వర్క్ ‌ద్వారా విడుదల చేశారు. పోగో చానెల్‌లో ఈ సినిమాను పలుసార్లు టెలికాస్ట్ ‌చేశారు. 2000 సంవత్సరంలో లూకాసాలో (ఇటలీ)లో అంతర్జాతీయ యేనిమేషన్‌ ‌చలన చిత్రోత్సవంలో రామాయణ్‌ను తొలిచిత్రంగా ప్రదర్శించి గౌరవించారు. ఆ సంవత్సరమే ఇంగ్లండ్‌లో జరిగిన కార్డిఫ్‌ ‌యేనిమేషన్‌ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. 1983 నుంచి 2023 వరకు ప్రపంచంలో ఎక్కడో అక్కడ (ముంబై సహా) యేనిమేషన్‌ ‌రామాయణ్‌ ‌తళుక్కుమంటూనే ఉండడం విశేషం. వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన ఈ యేనిమేషన్‌ ‌చిత్రానికి రాణి బుర్రా, రామ్‌మోహన్‌, ‌యోగో సాకో, నరేంద్ర శర్మ, హిరోషీ ఒనేగి రచనా సహకారం అందించారు. చిత్రానువాదం చేసినవారు ఒనేగియే. సతోషి మత్సుకో కళా దర్శకత్వం వహించారు.

జపాన్‌ ‌శైలిలో రూపొందిన  రామాయణ్‌ ‌యేనిమేషన్‌ ‌సినిమా చరిత్రలోనే మైలురాయి వంటిదని చెబుతున్నారు. నిఖిల్‌ ‌కపూర్‌ (‌రాముడు), రేయల్‌ ‌పదంసీ (సీత), ఉదయ్‌ ‌మథన్‌ (‌రావణ), మిషాల్‌ ‌వర్మ (లక్ష్మణ), నోయెల్‌ ‌గోడిన్‌ (‌హనుమ), రాహుల్‌ ‌బోస్‌ (‌భరత) వంటి ప్రముఖులు యేనిమేటెడ్‌ ‌హిందీ రామాయణ పాత్రలకు గాత్రదానం చేశారు. హిందీలో శత్రుఘన్‌ ‌సిన్హా వ్యాఖ్యానంతో చిత్రం సాగుతుంది. రామానందసాగర్‌ ‌రామాయణంలో రాముడి పాత్ర వేసిన అరుణ్‌ ‌గోవిల్‌ ‌చేతనే రాముడి పాత్రకు గాత్రదానం చేయించారు. ప్రముఖ విలన్‌ అ‌మ్రీశ్‌ ‌పురి రావణ పాత్రకు గాత్రదానం చేశారు.

దర్శకుడు యూగో సాకోకు భారతీయ సంస్కృతి అంటే అపారమైన గౌరవం. అదే ఆయనను ఈ మహా ప్రయత్నానికి పురిగొల్పింది. భారతదేశంలో జరిగిన పురావస్తు తవ్వకాల మీద ఆయన ఒక డాక్యుమెంటరీ నిర్మించడానికి వచ్చినప్పుడు మన పురాణాల మీద ఆసక్తి ఏర్పరుచుకున్నారు. అనేక పర్యాయాలు భారతదేశంలో పర్యటించిన తరువాత తన యేనిమేషన్‌ ‌చిత్రానికి రామయణ పురాణగాథను ఎంచుకున్నారు. ఇంతకీ రామాయణ కావ్యంలో ఆయనను అమితంగా ఆకర్షించిన అంశాలు ఏమిటి? ప్రేమ, స్నేహబంధం, విధేయత అనే విలువల గురించి రామాయణం చేసిన వ్యాఖ్యానం ప్రపంచం గ్రహించవలసిన అవసరం ఉందని ఆయన భావించారు. అంతేకాదు, ఈ అంశాలను ఆవిష్కరించడానికి సరైన మాధ్యమం యేనిమేషన్‌ ‌శైలేనని కూడా ఆయన విశ్వసించారు. ఈ చిత్రం కోసం 450 మంది కళాకారులు శ్రమించారు. చేతితో సెల్స్‌ను తయారు చేశారు. ఇది యూగో సాకో దర్శక ప్రతిభ. కంప్యూటర్‌ ‌ద్వారా చిత్రాలు గీయడం కాకుండా, చేతితో చేయించారు. ఈ చిత్రం కోసం పనిచేసిన కళాకారులు తరువాత పోకేమాన్‌, ‌డ్రాగన్‌బాల్‌ ‌జడ్‌, ‌డోరియామాన్‌ ‌వంటి విశ్వవిఖ్యాత యానిమేషన్‌ ‌చిత్రాలకు కూడా పనిచేశారు. సృజనాత్మకతకు పెట్టింది పేరైన జపాన్‌ ‌చిత్రలేఖనానికి భారతీయ సాంస్కృతిక వైభవం నేపథ్యంగా మలిచారు. ఇవే దీనికి ఎన్నో ప్రత్యేకతలను తెచ్చిపెట్టినాయి. పైగా దీనిని వీడియోలో విశేష స్పష్టతను ఇవ్వగల 4కె విధానంతో నిర్మించడం మరొక ఎత్తు. ఎన్నో విశిష్ట భారతీయ చిత్రాలకు, ధారావాహికలకు సంగీతం అందించిన వన్‌రాజ్‌ ‌భాటియా ఈ చిత్రానికి పనిచేశారు.  కవితా కృష్ణమూర్తి, సాధనా సర్గమ్‌, ఉదిత్‌నారాయణ్‌, ‌హరిహరన్‌, ‌చన్నీసింగ్‌ ‌వంటి లబ్ధప్రతిష్టులైన గాయనీగాయకులు పాటలు పాడారు.

యేనిమేషన్‌ ‌రామాయణానికి సహాయ దర్శకులలో ఒకరైన రామ్‌మోహన్‌ (1931-2019) ‌గురించి కొంచెం చెప్పుకోవాలి. భారతీయ యేనిమేషన్‌ ‌చిత్రకళకు పితామహునిగా ఆయనకు పేరుంది. ఆయన డిజైనర్‌, ‌డిజైన్‌ ఎడ్యుకేటర్‌. ‌పలు యేనిమేషన్‌ ‌చిత్రాలు తీసిన గ్రాఫిటీ మల్టీమీడియా సంస్థ స్థాపకుడు ఆయనే. పద్మశ్రీ పురస్కారం అందుకున్న రామ్‌మోహన్‌ను 2006 నాటి బొంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. యూగో సాకి (1928-2012) కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన జపనీస్‌ ‌దర్శకుడు. రామాయణ్‌ ‌ద్వారా ఆయన ఎంతో ఖ్యాతి గడించారు. బౌద్ధ గురువుల కుటుంబానికి చెందిన యూగోసాకో భారతీయ పురాణాల మీద, తత్త్వశాస్త్రం మీద ఆసక్తి పెంచుకున్నారు. మొదటిసారి 1970లో భారతదేశానికి వచ్చినప్పుడే ఆయనకు మమకారం ఏర్పడింది. తరువాత దాదాపు 40 సార్లు ఇక్కడకు వచ్చారు. మరొక విశిష్ట అంశం-ప్రఖ్యాత భారత పురావస్తు శాస్త్రవేత్త బీబీ లాల్‌ ‌తవ్వకాలు ఆయనను రామాయణం వైపు నడిపించాయి. వాటి ఆధారంగానే 1983లో కేవలం జపాన్‌వాసుల కోసం భారత ప్రభుత్వం అనుమతితో ఒక డాక్యుమెంటరీని నిర్మించారు. అంటే అయోధ్య రామ జన్మభూమి, అక్కడ ఆలయం ఉండేదని, దానిని కూల్చే మసీదు నిర్మించారన్న వాస్తవం మన కంటే ముందే జపాన్‌ ‌వాసులకు తెలిసిందన్నమాట.

డాక్టర్‌ ‌బీబీ లాల్‌ ‌పద్మవిభూషణ్‌ ‌గ్రహీత. భారత పురావస్తు శాఖ డైరెక్టర్‌ ‌జనరల్‌గా పనిచేశారు. అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో  తాను జరిపిన తవ్వకాలలో హిందూ ఆలయ స్తంభాలను పోలిన చెక్కడాలు దొరికాయని ఆయన 1970 ప్రాంతంలోనే వెల్లడించారు. 2021లో ఆయన కన్నుమూశారు. ఆధునిక భారతీయ పురావస్తు శాస్త్రానికి ఆయనను ఆద్యునిగా గౌరవిస్తారు.

ఇంతమంది మహామహుల కృషి ఇప్పుడు వస్తున్న యేనిమేషన్‌ ‌రామాయణ నిర్మాణం వెనుక ఉన్నది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE