సెక్యులరిజం అన్న మాట వినగానే సాధారణ ప్రజానీకం బూతుపదం విన్నట్టు ముఖం చిట్లించుకునేటట్టు చేసిన ఘనత భారత ప్రతిపక్షాలది. సెక్యులరిజం అంటే దగాకు పర్యాయపదంగా మార్చేసిన ఘనత కాంగ్రెస్, కమ్యూనిస్టులకు చెరిసగం దక్కుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను బుజ్జగించడానికి చాలా పార్టీలు మోగించే నాదస్వరమే ఇక్కడి సెక్యులరిజం. దేశాన్ని దోచుకున్నా, ఆర్థిక అవకతవకలతో ప్రజలు చీకొట్టినవారు, కుటుంబ పార్టీల వాళ్లు కూడా సెక్యులరిజం పేరుతో మళ్లీ గద్దెనెక్కడానికి ప్రయత్నించడం ఈ దేశ దౌర్భాగ్యం. సెక్యులరిజం అనే ఒకే ఒక్క భూతాన్ని చూపించి ఈ దేశ ప్రగతిని మూడు దశాబ్దాలు వెనక్కి నెట్టేసిన ఘనత విపక్షాలది. సెక్యులరిజం గురించి ప్రశ్నిస్తే, విభేదిస్తే, ఆఖరికి దాని మూలాలను చర్చించే ప్రయత్నం చేసినా రౌరవాది నరకాలు పట్టిపోతారన్నంతగా శాపనార్ధాలు వర్షిస్తాయి. ఇంతకీ సెక్యులరిజం అంటే విపక్ష శిబిరానికి తెలిసిన అర్థం ఏమిటి? దాని మూలాలు ఎక్కడివి? స్ఫూర్తి ఏమిటి? విపక్షాలకి తెలిసినది కేవలం హిందూత్వను తిట్టడమే. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, సంఘపరివార్ సంస్థలను దుమ్మెత్తి పోయడం. ఇందుకు తాజా ఉదాహరణ తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి దేశంలోని సెక్యులరిజానికి వ్యతిరేకంగా చేసిన ఒక వ్యాఖ్య, ఆ వెనుకే విపక్ష శిబిరం పెట్రేగిపోయిన తీరు.
సెక్యులరిజం ఐరోపా నుంచి వచ్చిన ఆలోచన. దానికి భారతదేశంలో స్థానం లేదు అంటూ తమిళనాడు గవర్నర్ రవి చేసిన వ్యాఖ్య పెద్ద దుమారమే లేపింది. రాజ్యాంగ పదవికి ఇలాంటి వ్యక్తిని ఎలా నియ మిస్తారు అంటూ వెంటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు సెక్యులరిజం భారత్‌కు అవసరం లేదంటున్న ఈ వ్యక్తి రేపు అసలు రాజ్యాంగమే అవసరం లేదని అన్నా ఆశ్చర్యపోనక్కర లేదని పలువురు విపక్ష నాయకులు వీరంగం వేశారు. కన్యాకుమారిలో సెప్టెంబర్ 24న జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్య చేశారు. గవర్నర్ వ్యాఖ్య పట్ల బీజేపీయేతర పక్షాలన్నీ కత్తులు దూశాయి. డీఎంకే ప్రభుత్వంతో గవర్నర్‌కు ఉన్న విభేదాలు ఈ వివాదానికి ఇంత ప్రచారం తెచ్చాయి తప్పితే, ఇది ఇంత దుమారం రేపవలసిన అంశం కానేకాదు.సెక్యులరిజం నిజరూపం, సెక్యులరిస్టుల ముసుగు గురించి ఈ దేశానికి ఎప్పుడో అర్ధమైంది. కాంగ్రెస్, స్వయం ప్రకటిత మేధావి వర్గం ఈ దేశ ప్రజల మీద అనేక అవాంఛనీయ పోకడలను రుద్దింది. అందులో ఒకటి వక్రభాష్యాలతో జుగుప్సాకరంగా తయారైన సెక్యులరిజం. అసలు అది మన దేశ అంశమే కాదు, ఐరోపావారిది అన్నారు గర్నవర్. ఐరోపాలో చర్చ్‌కీ, రాజ్యానికీ మధ్య మొదలైన అధిపత్య పోరు నుంచి సెక్యులరిజం జనించింది. భారత్ మౌలికధర్మంలోనే సెక్యులరిజం ఉంది. ఆ ధర్మం నుంచి ఈ నేల ఎందుకు దూరంగా జరుగుతుంది? అందుకే సెక్యులరిజం భారత్‌కు అవసరం లేదు అన్నారు గవర్నర్.
1950 ఆమోదించిన రాజ్యాంగంలో లేని సెక్యులరిజం పదాన్ని 1976లో దేశంలో అత్యవసర పరిస్థితి, వాక్ స్వాతంత్య్రం లేని కాలంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నాటి ప్రధాని ఇందిరా గాంధీ చొప్పించిన విషయాన్ని కూడా గవర్నర్ గుర్తు చేశారు. వెంటనే దాడి మొదలయింది. సెక్యులరిజం లేదా రాజకీయాల నుంచి మతాన్ని దూరంగా ఉంచడం అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగ మని సీపీఎం నాయకురాలు బృందా కారత్ సెలవిచ్చారు. నాకు తెలిసి గవర్నర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి చేపట్టారు. రేపు రాజ్యాంగం కూడా విదేశీ అనవచ్చు. ఆర్‌ఎస్‌ఎస్ అవగాహన ఇంతవరకే అని ఆమె అన్నారు. ఆయనొకసారి రాజ్యాంగం చదవాలి అని నిరక్షరకుక్షులైన డీఎంకే నాయకులు పాఠాలు మొదలెట్టేశారు.సెక్యులరిజం మౌలిక ధర్మం పరమత సహనం అనే లక్షణాన్ని గాలికి వదిలి హిందూ ధర్మాన్ని డెంగ్యూతో, కరోనాతో పోల్చిన పార్టీ ఇది. హత్యల మీద హత్యలు చేసినవాడు కూడా సెక్యులరిస్టును అని ప్రకటించుకుంటే అతడిని రాజ్యాంగ పరిరక్షకునిగా చూడాలన్నదే నేటి విపక్ష శిబిర ప్రధాన సూత్రం.
అయోధ్య ఉద్యమం ఈ దేశంలో సెక్యులరిజం అనే మేడిపండును తునాతునకలు చేసింది. దాని పొట్ట పగిలిన తరువాత బయటకొచ్చిన పురుగులు జనానికి రోత కలిగించాయి. అయినా ఇంకా ఆ పురుగులనే ప్రేమించి తీరాలని చెబుతున్నారు సెక్యులరిస్టులు.
సెక్యులరిజం లేదా లౌకికవాదం ప్రథమ ప్రధాని నెహ్రూ ‘జేబుబొమ్మ’ అని పలువురు వ్యంగ్యంగా చెబుతూ ఉండేవారు. ఈ భావనను దేశ ప్రజల మీద రుద్దినవారు ఆయనే. అయినా నాటి కాంగ్రెస్‌లో సెక్యులరిజం అనే భావన మీద కాని, అసలు నెహ్రూ ప్రవచించిన సెక్యులరిజం మీద ఏకాభిప్రాయం లేనేలేదు. ఒక ప్రశ్న మాత్రం ఎప్పటికీ వినిపిస్తుంది. రాజ్యాంగ నిర్మాతలు/జవాహర్‌లాల్ నెహ్రూ పరిహరించిన ‘సెక్యులరిజం’ అన్న పదాన్ని, ó రాజ్యాంగ రచన జరిగిన సరిగ్గా పాతకేళ్లకు ఇందిరాగాంధీ ఎందుకు జొప్పించారు? కొత్తగా స్వేచ్ఛను పొందిన భారత్ సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగంలో చేర్చుకోవడానికి నిరాకరించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆ పదానికి వ్యతిరేకి. కానీ అత్యవసర పరిస్థితి వంటి నియంతృత్వంలో దొడ్డిదారిని రాజ్యాంగంలోకి చొరబడిన సెక్యులర్ అన్న పదానికి ఎందుకీ రాచమర్యాద? నాడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన చర్చ ఆ పదాన్ని నిరాకరిస్తే, 1976 నాటి పచ్చి నియంతృత్వం జాతి నెత్తిన పెట్టింది. ఇది భారత చరిత్రలో కనిపించే పెద్ద వైరుధ్యం.
1961 మొదట్లో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు నీలం సంజీవరెడ్డి భావనగర్‌లో సెక్యులరిజం అనే అంశం గురించి వ్యక్తీకరించిన భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అవి నెహ్రూ జీవించి ఉన్న రోజులే కూడా. మన విజ్ఞానం ఆధ్యాత్మిక బీజాలు కలిగి ఉంటుంది. కానీ మన రాజ్యాంగం విమత పద్ధతిని అనుకరిస్తూ ఉంటుంది. ఇది ఆశ్చర్యం కలిగించే మాట నిజమే. కానీ ఇక్కడ సెక్యులరిజం అంటే విమత తత్త్వమని గాని, భౌతిక వాంఛలకు ప్రాధాన్యం ఇచ్చేదిగా గాని భావించడం సరికాదు. అది అన్ని మతాల పరమార్ధం ప్రకటించేది అని గమనించాలి. ఇలాంటి ఒక విశ్వమతాన్ని సాధించేందుకు భిన్న భిన్న మార్గాలు ఉంటాయని, చారిత్రకంగా మనమంతా వేర్వేరు మతాలకు చెందిన వారమే అయినా ఒకే భగవానుని కుటంబంలోని వారమని అనుకోవాలి. ఇదే రాజ్యాంగంలోని సెక్యులర్ భావనకు అర్ధం. ఇదే సంజీవరెడ్డి ఉపన్యాస సారాంశం. కాబట్టి వసుధైక కుటుంబకం అన్న భావనే మన సామాజిక చోదకశక్తిగా ఉండాలి. ఇది నాటి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానానికి పూర్తి భిన్నమైన దృక్పథం. స్థూలంగా చెప్పాలంటే గాంధీజీ కల్పన అయిన రామరాజ్య స్థాపనకు కూడా కాంగ్రెస్ కపోల కల్పిత సెక్యులరిజంలో చోటులేదు. నెహ్రూ ముద్రిత సెక్యులరిజం అంటే వట్టి రాజకీయ చింతన లేదా ఆర్థికాంశాలతో కూడినదే. దీని నుంచి కొంచెం బయటపడాలన్నదే సంజీవరెడ్డి భావనగా కనిపిస్తుంది.
భారతభూమిలో అనాదిగా రాజ్యానికీ, ఆధ్యాత్మిక చింతనకీ నడుమ ఉన్న బంధం ఎలాంటిది? అంటే రాజకీయాలకీ, అది సమాజం మీద చూపే ప్రభావానికీ మధ్య దూరం ఎంత? అది వసిష్ఠునికీ, రామచంద్రుడికీÑ కృష్ణార్జునులకీ, చాణక్య చంద్రగుప్తులకీ, విద్యారణ్య, బుక్కరాయలకీÑ సమర్ధ రామదాసు, శివాజీలకీ నడుమ ఉన్న బంధం మాత్రమే. మన స్వరాజ్యం రామరాజ్యంగా ఆవిర్భవించాలి. మానవ ప్రయత్నంతో సాధ్యంకాని పనులు ప్రార్థన చేత దైవం ప్రసాదిస్తాడని గాంధీజీ పలు సందర్భాలలో చెప్పడం నాటి కాంగ్రెస్ నేతల అనుభవంలోనిదే. మౌర్య చంద్రగుప్తుడు అంత్యదశలో జైనం స్వీకరించి, శ్రావణబెళగొలా చేరుకున్న సంగతి తెలిసినదే. ఆయన వంశానికే చెందిన అశోక చక్రవర్తి ఆనాడే మతాల మధ్య సామరస్యం గురించి ప్రస్తావించడం గొప్ప అంశం. అయితే ఆ పరిణా మాలు, వాటి పునాదులు విదేశీ చింతన ఆధారంగా ఏర్పడినవి కావు. ఆ అవకాశం నాడు లేదు, నిజమే. కానీ వాటి దృష్టికోణం నేడు చెబుతున్న సెక్యులరిజం కంటే విశాలమైనది. భారతీయత సర్వధర్మ సమభావన అనే సూత్రం మీద నిర్మించారు. ఇది విదేశీ సెక్యులరిజం అన్న భావనకు ఎంతో పూర్వం వచ్చింది. దీనినే గాంధీజీ ముందుకు తీసుకువచ్చారు. మధ్య యుగాలలో చర్చ్ స్వరూపం, రాజ్య పరిధి మధ్య గీత బాగా పలచనిది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, టర్కీ ఇవన్నీ కూడా మత ప్రమేయాన్ని, రాజ్యం స్వేచ్ఛనీ ఒక ప్రయోజనంతో, ఆధునిక దృష్టితో అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సెక్యులరిజం స్వరూపం ఇంకాస్త మారింది. ఇందుకు కారణం ఉదారవాదం. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వలసలు పెరిగాయి. వలస వచ్చినవారికి, లేదా దేశ ప్రజలు తెచ్చుకున్నవారికి హక్కులు వచ్చాయి. వీరి కోరికలు ఇప్పుడు వెర్రి తలలు వేసి ఉండవచ్చు. కానీ ఆ రోజున అంతా సామరస్యంగా జీవించడానికి వీలుగా సెక్యులరిజం పట్ల విశేషం నమ్మకం ప్రదర్శించారు. కానీ నేడు ఆ నమ్మకం పాశ్చాత్య దేశాలలో సడలిపోతున్నది. అందుకు వలస వచ్చిన దృక్పథంలో వచ్చిన మార్పు. మళ్లీ మతం, అది కూడా ఒక మతం వేరే రూపంలో ఆధిపత్యం చెలాయించడానికి రక్తపాతంతో కూడిన కుట్రలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే సెక్యులరిజం గురించి పునరాలోచనకు ఆస్కారం ఏర్పరిచింది. ఈ పరిణామాన్ని అంచనా వేయడం దగ్గర భారత సెక్యులరిస్టులు, ఉదార వాదులు దారుణంగా విఫలమయ్యారు.
అశోకుడి శిలాశాసనాలు కొన్ని గుర్తించారు. మన ఎర్రగుడిలో కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. అశోకుని పన్నెండవ శిలాశాసనంలోని ఒక ప్రస్తావన ఆధునిక సెక్యులరిస్టులకు కనువిప్పు. ‘అందరు మతస్థులను, ఆ మతంలోని సన్యాసులను, గృహస్థులను దానాలతో గౌరవించాలి. అన్ని మతాల వారి ఆధ్యాత్మిక శక్తి వృద్ధికావడం అత్యంత అవసరం. నీ వాక్కును నీవు పరిరక్షించుకో. నీ మతాన్ని నీవు శ్లాఘించుకో. కానీ అన్య మతాలను దూషించకు. అవసరమైనప్పుడు అన్య మతాలను, దాని అవలంబీకులను సముచిత రీతిన సత్కరించు. ఇందుకు భిన్నంగా వ్యవహరించి నట్టయితే నీ సొంత మతానికీ అన్య మతానికీ అపచారం చేసినట్టే. అన్ని మతాల పట్ల సమన్యాయ, సమత్వమే పూజనీయం’. ఇది ఆధునిక భారతీయ సెక్యులరిజంలో కనిపిస్తుందా? గుడ్డెద్దు చేలో పడినట్టు వ్యవహరించే ఇవాళ్టి సెక్యులరిస్టులకు అర్ధమవు తుందా? ఇది గొంతు తప్ప ఆత్మ లేని శుష్కవాదమనేది అందుకే. సెక్యులరిజం అన్ని మతాలను సమంగా గౌరవించేదిగా ఉండాలి. సెక్యులరిజం ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని తమ మతం వారికి (ఆశ్రయం ఇచ్చిన గడ్డ మీదనే) వేరే దేశం కావాలని కోరేందుకు దోహదపడేదిగా, వేర్పాటువాదానికి ఆయుధంగా ఎవరూ అర్ధం చేసుకునేదిగా ఉండరాదు. ఇలా ఎందుకు అర్ధం చేసుకుంటున్నారు? పెడార్థాలు తీస్తున్నారు? ఈ జాఢ్యం ఇప్పటిది కూడా కాదు. భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పతంజలిశాస్త్రి మే 17,1955న తిరువయ్యూర్ దేవస్థానం ఏర్పాటు చేసిన అఖిల కేరళ హిందూ మత సాంస్కృతిక మహాసభలలో చేసిన ప్రారంభోపన్యాసాన్ని ‘జాగృతి’ (మే 27,1955,పే.11) వ్యాసరూపంలో అందించింది. మన కుహనా సెక్యులరిస్టుల జాఢ్యానికి ఇందులో సమాధానం దొరుకుతుంది. అటు చారిత్రక జాడ, ఇటు రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తి మేళవిస్తూ ఆయన వెల్లడిరచిన అభిప్రాయాలు శిరోధార్యాలు.జస్టిస్ పతంజలిశాస్త్రి భారత రెండో (నవంబర్ 7,1951`జనవరి 4,1954) ప్రధాన న్యాయమూర్తి.
తమిళనాడు గవర్నర్ చెప్పినట్టు సెక్యులరిజం అన్న మాట రాజ్యాంగంలో చేరినది 1976లోనే. కానీ అప్పటికే నెహ్రూ పుణ్యమా అని ఈ అంశం మీద తీవ్ర వాదోపవాదాలు సాగాయి. వాటి సారాంశం దురదృష్టవశాత్తు మన దేశ చరిత్ర, దాని తాత్వికతలతో సంబంధం లేకుండా, పాశ్చాత్య భావనలకు దాస్యం చేసేవిగా రూపుదిద్దుకున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని, విధ్వంసాన్ని గుర్తించిన వారు పలువురు ఉన్నారు. తన పాలనాకాలంలో వ్యవస్థలకు భారతీయత అంటకుండా నెహ్రూ జాగ్రత్త పడిన మాటను కాదనలేం. సెక్యులరిజం కూడా అలాంటిదే. చాలా వ్యవస్థలు, ఆలోచనలు ఆయన తదనంతరం కొంత మారాయి. కానీ సెక్యులరిజం మరింత ప్రమాదకరంగా పరిణమించింది.
‘మన రాజ్యం సెక్యులర్ రాజ్యమని చెబు తున్నారు. చాలా అపార్థాలకు గురి అవుతున్న మాట ఇది. రాజ్యాంగంలో ఎక్కడా ఉపయోగించని మాట’ అన్నారు జస్టిస్ పతంజలిశాస్త్రి. అది ఆనాటికి రాజ్యాంగం లేదు కాబట్టి ఆ మాటనూ జోడిరచా రాయన. వారి అభిప్రాయాలు ఇలా సాగాయి:
సెక్యులర్ అంటే ‘మత ప్రమేయం లేని’ అని అర్ధం. రాజ్యానికి సంబంధించినంత వరకు ‘రాజ్యమతం లేని’ అని వ్యాఖ్యానించుకోవడం సమంజసం. అంటే, రాజ్యం ఒక మతాన్ని సమర్థించదు. ఎట్టి విచక్షణా లేకుండా అన్ని మతాలను సమానంగా పరిగణిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా, ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థలలో ఆధ్యాత్మిక విద్యను బోధించడం ఉండదు అని కూడా చెప్పాలి. మత బోధన తరగతులకు ఎవరినీ నిర్బంధంగా పంపరాదన్న సూత్రమూ ఉంది. విభిన్న మతాలు ఉన్న దేశాలలో ఇది అనివార్యం కావచ్చు. అయినా సెక్యులర్ అన్న పదాన్నీ, భావననీ పూర్తిగా అపార్థమే చేసుకున్నారు అని ఆయన చెప్పారు. కానీ శ్రేయోరాజ్యం అంటే ఆధ్యాత్మిక విలువలను నిర్మూలించి, భౌతికావసరాల మీద ఆధారపడిడే సాంఘిక సౌధం’ అని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదంటారాయన. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక విలువలకు విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉండే తత్త్వాన్ని రాజ్యాంగం సమర్ధిస్తు న్నదని నిర్ధారించుకుంటున్నారు. సెక్యులరిజాన్ని ఈ కోణం నుంచి అర్ధం చేసుకోవడమంటే మానవ సమాజాన్ని గురించి దాని శ్రేయస్సు గురించి సంకుచితంగా అర్థం చేసుకోవడమేనని తేల్చి చెప్పారు జస్టిస్ పతంజలిశాస్త్రి. ఆధునాతన వైజ్ఞానిక శాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రస్తుత కాలంలో మానవ జీవిత సౌకర్యానికి వాడుకోవాలనేది నిరాకరించలేని సత్యమే అయినా, చక్కని నైతిక, ఆధ్యాత్మిక ప్రణాళిక లేకుండానే మానవ సమాజ వైభవానికి ఇదే ఏకైక మార్గమని భావిస్తే పెద్ద పొరపాటేనని అంటారాయన. అలాంటి పొరపాటులో నుంచి పుట్టినవి ఆటం, హైడ్రోజన్ బాంబులు అన్నారాయన. అసలు ఆధ్యాత్మిక ప్రవృత్తిని నిర్లక్ష్యం చేసి భౌతికశాస్త్ర విజ్ఞానాన్ని పెంచుకోవడం, మానవాళిని ఈ గోళం నుంచి తుడిచివేయడమే అవుతుందన్న సత్యాన్ని ప్రపంచం గుర్తిస్తున్న మాటను ఆయన ప్రస్తావించారు. దీనికి చెంపలు వేసుకునే రీతిలోనే ఆధ్యాత్మిక తృష్ణ తీర్చుకోవడానికి ఇటీవల ప్రాగ్దిశ వైపు చూస్తున్నారని తెలుసుకోవాలని కూడా సూచించారు. ఆధ్యాత్మిక చింతన, దానితో వచ్చే నైతిక విలువలు స్వరాజ్యం వచ్చిన తరువాత పలచబడిన సంగతిని గుర్తించి, ఆందోళన చెందుతూ ఆవడి కాంగ్రెస్ తీర్మానం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. న్యాయం, సమానత్వం ప్రాతిపదికల మీద ఒక సజీవ సాంఘిక విధానాన్ని రూపొందించాలనే తీవ్ర వాంఛతో మన నేతలు ప్రజల సాంప్రదాయిక నైతిక ప్రణాళికను ఆధ్యాతిక విలువలను రద్దు చేసి వాటి స్థానంలో సెక్యులరిజం పేరుతో పాశ్చాత్య భౌతికవాదాన్ని నెలకొల్పడం సరికాదనే జస్టిస్ పతంజలిశాస్త్రి వ్యాఖ్యానించారు.
ఇంతకీ పాశ్చాత్యులు సెక్యులరిజం గురించి ఏమన్నారు? రకరకాల భాష్యాలతో సోషలిజం మౌలిక స్వరూపాన్ని కోల్పోయిందన్న విమర్శ ఉంది. అంతా ధరించడం వల్ల రూపు కోల్పోయిన టోపీలా సోషలిజం తయారైందన్న విమర్శ అదే. అలాంటి సోషలిజాన్నే భారత్ మీద రుద్దారు నెహ్రూ. సెక్యులరిజం కూడా అంతే. ఇది ప్రధానంగా పాశ్చాత్య భావనే అయినా, వారి చారిత్రక, సామాజిక పరిణామ ఫలితమే అయినా, అక్కడ అన్ని దేశాలు ఒకేలా సెక్యులరిజాన్ని వ్యాఖ్యానించలేదు. స్వీకరించలేదు కూడా. ఏది సెక్యులరిజం అన్న భావనలలో ఆంగ్ల రాజకీయ తత్త్వవేత్త జాన్ లాక్ అభిప్రాయం ఉత్తమంగా కనిపిస్తుందంటారు. మతానికి సంబంధించినంత వరకు వ్యక్తిగత మత విషయాలకీ, రాజ్యానికి చెందిన రాజకీయ అంశాలకీ విభజన ఉండాలన్నారాయన. కానీ మన సెక్యులరిస్టులు ఆది నుంచి మాట్లాడుతున్నది వేరు. సోమనాథ్ మందిర ప్రాణప్రతిష్ఠకు ప్రథమ రాష్ట్రపతి ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ వెళ్లాలి అనుకుంటే, అందుకు ప్రథమ ప్రధాని నెహ్రూ అడ్డుకోవాలని ప్రయత్నించడం మొదలు, ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ప్రాణప్రతిష్ఠకు హాజరు కావడం, ఈ వినాయక చవితికి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఇంట హారతి ఇవ్వడాన్ని విమర్శించడం వరకు వైరుధ్యంతో, కుట్రతో వ్యాఖ్యానించడమే కనిపిస్తుంది. రాజ్యాంగ పదవులను చేపట్టినవారు ఇక తమ విశ్వాసాలకు స్వస్తి పలకాలన్నదే వీరి ధోరణి. కానీ వీరే కొన్ని మతాలవారికి ప్రత్యేక హక్కులు ఉండాలని వాదిస్తారు. హజ్ యాత్రలకు రాయితీలు ఇవ్వడాన్ని సమర్ధిస్తారు.
భారతీయత ఆధారంగా, వాస్తవికత ఆధారంగా, చారిత్రక ఆధారాలే ప్రామాణికంగా సెక్యులరిజాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు.
సెక్యులరిజం అనే భావన వరకు భారత్‌లో జరిగిన మౌలిక తప్పిదం ఏమిటి అంటే, హిందూ ధర్మాన్నీ ఇస్లాంనీ, క్రైస్తవాన్నీ ఒకే గాట కట్టడం. ఇస్లాం గాని, క్రైస్తవం గాని స్వతంత్ర ఆలోచనకు బద్ధ వ్యతిరేకం. హేతుబద్ధతకి ఆమడ దూరం. కానీ హిందూత్వం స్వతంత్ర ఆలోచనలను గౌరవిస్తుంది. అందుకే హిందూత్వను సెక్యులరిజంతో బంధించే అవసరమే రాలేదు అంటారు కొయెన్రాడ్ ఎల్స్. క్రైస్తవం, ఇస్లాం అసలు రూపం ఏమిటి? క్రైస్తవం రెండు మార్గాల ద్వారా విస్తరించింది. ఒకటి మతాంతరీకరణలు. రెండు సెక్యులరైజేషన్. ఇది కూడా ఎల్స్ మాటే. ముస్లిం ప్రచారకులు సెక్యులరిజం అంటే ఇస్లాం పట్ల రాక్షస దగా అంటారు. వీళ్లూ సెక్యులరిస్టులమనే చెప్పుకుంటారు. కానీ నరేంద్ర మోదీ, ‘సెక్యులరిజం మన రాజ్యాంగంలోనే కాదు, మన రక్తంలోనూ ఉంది. మనం ప్రకృతిని తల్లిగా పూజిస్తాం. ప్రపంచాన్ని మన కుటుంబంగానే భావిస్తాం’ అన్నారు. ఇదే యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో ఇలా చెప్పారు. భారత్‌లో సెక్యులరిజానికి ఒక రూపు లేదు. అదొక వివాదాస్పద అంశమే. ఇండియా మార్కు సెక్యులరిజాన్ని సమర్ధించేవారు ఆ సిద్ధాంతం మైనారిటీలనీ, భిన్నత్వాన్ని గౌరవిస్తుంది అంటారు. అన్ని మతాలకు సమాన హక్కులు ఇవ్వాలని చెప్పే ఉమ్మడి పౌరస్మృతిని వీళ్లు హిందూ ఆధిక్యాన్ని రుద్దడం అంటారు. విమర్శకులు ఇదొక దొంగ సెక్యులరిజం అంటారు. షరియాను, మత చట్టాలను ఆమోదించడం చట్టం ముందు అంతా సమానమేనన్న సూత్రాన్ని ఉల్లంఘించడమేనని చెబుతారు అని వ్యంగ్యంగానే చెప్పారు యోగి. ఇదంతా పరిశీలించిన తరువాత రెండు ప్రశ్నలు వస్తాయి. మన మేధావులకు సెక్యులరిజం అంటే నిజంగానే అర్ధం తెలుసా? వారు అద్దెకు తెచ్చుకున్న పాశ్చాత్య సెక్యులరిజం భావనకూ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్న సెక్యులరిజానికీ పొంతలేదన్న వాస్తవం వారు గ్రహించడం లేదా? సెక్యులరిజానికి మొదటి మెట్టు అన్ని మతాలకు సమ గౌరవం. లేదా సమ ప్రాధాన్యం. కానీ ఇక్కడ హిందువులకు ఒక చట్టం, క్రైస్తవులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టం ఉన్నాయి. దీనిని నివారించే ప్రతి చర్య హిందూ ఆధిపత్యం కోసమే అంటారు సెక్యులరిస్టులు. నిజానికి భారత సెక్యులరిస్టులు ఒక వాస్తవాన్ని ఎంతో కష్టపడి దాస్తారు. అది`భారత్‌లో సెక్యులరిజం` అసలు అర్ధానికి, దానిని దిగుమతి చేసుకున్న పాశ్చాత్య సెక్యులరిజానికి మధ్య కూడా పొంతన లేదు. ద్వంద్వ ప్రమాణాలకు హేతుబద్ధతను అద్దడానికి ఒక దగా విన్యాసం మన సెక్యులరిస్టుల మాటలలో నిరంతరం కనిపిస్తుంది. ఎలా అంటే, కశ్మీర్ పండిత్‌ల ఊచకోతను ప్రస్తావిస్తే అది మత ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్య. అదే గోధ్రా హత్యల గురించి ప్రస్తావిస్తే సెక్యులరిస్టు స్పృహను కలిగించడం. కాబట్టి కాంగ్రెస్‌కీ, కమ్యూనిస్టులకి, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీకి, ఆప్‌కీ ఇంకా అమాంబాపతు పార్టీలకి సెక్యులరిజం ఒక రాజకీయ తమాషా. ఎన్నికల విన్యాసం.
పాశ్చాత్య దేశాలలో సెక్యులరిజం ఆవిర్భావం ఎలా జరిగింది? అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగానికి తొలి సవరణ రాజ్యాన్నీ, చర్చ్‌నీ వేరు చేయడం గురించే. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. అమెరికా రాజ్యాంగ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన థామస్ జఫర్సన్ జాన్ లాక్ ఆరాధకుడు. ‘మత వ్యవస్థకు సంబంధించి, పౌరులు మతాన్ని అనుసరించడాన్ని నిరోధించడం పైన కాంగ్రెస్ ఎలాంటి చట్టాలు చేయదు.’ దీని అర్ధం మతం గురించి నాయకులంతా మరచిపొమ్మని కానేకాదు. దీనిని అమెరికా అధ్యక్షులు ఆచరణలో చూపారు. కెన్నడీ, ఒబామా, బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం వారి కుటుంబ వారసత్వంగా వస్తున్న బైబిల్ మీద చేశారు. అయినా ‘చర్చ్‌కీ, రాజ్యానికీ మధ్య గోడ నిర్మాణం’గానే ఆ రాజ్యాంగ సూత్రాన్ని అభివర్ణించాడు జఫర్సన్. అక్కడ ఎక్కువ మంది బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. ఇంగ్లండ్‌లోనూ అంతే. సెక్యులరిస్టు దేశానికి నాయకత్వం వహిస్తున్నా, వ్యక్తిగత విశ్వాసాలను దాచుకోనవసరం లేదనే ఇక్కడ అర్ధం.
ఫ్రెంచ్ విప్లవానికి ముందు రాజ్యంలో మత గురువుల ప్రమేయం లేదా చర్చ్ చొరబాటు పరమ జుగుప్సాకరంగా, అమానుషంగా ఉందని ఎవరైనా అంగీకరిస్తారు. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవానికి బీజాలు వేసిన వాటిలో ఇదీ ఒక అంశమే. నాడు దీనిని ఫస్ట్ ఎస్టేట్ అనేవారు. ఇందులో 1,30,000 మంది సభ్యులు. వీళ్ల ప్రత్యేక హక్కులకు హద్దే లేదు. అంటే పాలకుల పక్కన స్థానం. దేశంలోని భూభాగంలో 10 శాతం చర్చ్ అధీనంలో ఉండేది. దీనికి పన్ను లేదు. వారి భూముల సాగు బాధ్యత పేదరైతులదే. పౌరులంతా చర్చ్ సుంకం కట్టాలి. ప్రతిదానికి పాపపరిహార పత్రాలు చర్చ్ నుంచి కొనుగోలు చేయాలి. ఇందుకు పెద్ద ఎత్తున ధనం వెచ్చించాలి. విప్లవకారులు దీనిని రద్దు చేశారు. విప్లవం తరువాత చక్రవర్తి అయిన నెపోలియన్ బోనాపార్టీ కూడా చర్చ్‌కీ, రాజ్యానికీ మధ్య బంధాన్ని తెగ్గొట్టాడు. చాలా చిత్రమైన అంశం, ఒకప్పుడు ఇస్లాంకు ప్రపంచ గురుపీఠం టర్కీలో 1923లో ముస్తాఫా కెమాల్ పాషా సెక్యులరిజాన్ని ప్రవేశపెట్టాడు. ఆయనకు స్ఫూర్తి ఫ్రాన్స్ పరిణామాలే. ఇస్లాంను రాజ్యమతం స్థానం నుంచి ముస్తాఫా నిర్దాక్షిణ్యంగా నెట్టేశాడు.
సెక్యులరిజం, ఉదారవాదం, ప్రజాస్వామ్యం` ఈ మూడిరటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ మూడు ఒకదానిని ఒకటి రక్షిస్తాయి. కానీ ఆ మూడిరటి సాయంతోనే, ఆ మూడిరటినీ మట్టు పెట్టడానికి ఈ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచమంతా ఒక బహిరంగ కుట్ర జరుగుతున్నది. ముస్లిం తీవ్రవాదం దీని వెనుక ఉన్నది. ఈ వాస్తవాన్ని ముస్లిం ఫండమెంటలిజం దాచుకోవడం లేదు. కానీ బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడిన రాజకీయ పార్టీలు, నాయకులు మాత్రం దీనిని గుర్తించేందుకు గుడ్డిగా నిరాకరిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత మేధా దివాలాకోరుతనం ఇదే కూడా. సెక్యులరిజం అనే ఒక వ్యర్థ వ్యవస్థ మీద విపక్షాల, కుహనా మేధావుల, ఉదారవాదుల చర్చతో ఈ దేశం దాదాపు 30 ఏళ్ల వర్తమానాన్ని కోల్పోయింది. అయినా ఎవరు వాస్తవంగా సెక్యులరిజానికి వ్యతిరేకులో, తాము వ్యతిరేకులమేనని బాహాటంగా చెప్పుకుంటున్నారో వారికి వాస్తవాలు వివరించే దమ్ము ఈ పిరికి, వెన్నెముక లేని విపక్షాలకు ఏనాడూ లేదు. ప్రపంచమంతటా సెక్యులర్, ఉదారవాద వ్యాధిగ్రస్థులది ఇదే సరళి. సెక్యులరిజం భూతంతో బీజేపీని ఎదుర్కొనడం సాధ్యం కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిరోధించడం అసలే వీలుకాదు.
- జాగృతి డెస్క్