వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
మెట్లెక్కి మా అపార్టుమెంటు ముందర నుంచుని తాళం తీయబోతూ, అలవాటుగా పక్కకి చూసాను.
మా పక్కఫ్లాటు తలుపు బార్లా తెరిచి ఉంది.
తెరిచిన ఇంటి ముందు ఓ సూట్ కేసు, రెండు బ్యాగులు లోపలికి లాగడానికి ఎదురు చూస్తున్న ట్లున్నాయి.
వెంటనే నాకు వచ్చిన మొదటి ఆలోచన… వాళ్లింటికి అతిథులో, చుట్టాలో వచ్చి ఉంటారని.
ఆశ్చర్యం, ఈ రోజుల్లో, ఈ యుగంలో, మనుషులు చుట్టాల ఇళ్లకి వస్తున్నారా?అది కూడా పెట్టే బేడాతో… ఓ నాలుగు రోజులో, వారమో, గడపడానికి వస్తున్నారు,
రెండో ఆలోచన, ఎలా సాధ్యం?
అంతలోనే పక్కింటి మధుమతి బయటికి వచ్చింది.
చిరునవ్వులు, పలకరింపులు అయ్యాక ఆవిడే సామాను తీసుకెళ్తూ…
‘‘ఇప్పుడే మేం తిరుపతి నుంచి వస్తున్నాం’’ అని అంది,
‘‘ఓ, అలాగా దర్శనం బాగా జరిగిందా?’’
‘‘ఆఁ, బాగా జరిగింది. మా చెల్లెలు కుటుంబం, మా వియ్యపురాలి కుటుంబం, అన్నయ్య కుటుంబం అందరం కలిసి ఓ పాతిక మంది వెళ్లాం. బాగా ఎంజాయ్ చేసాం.
మనం మన ఫ్రెండ్స్‌తో ఎన్నో చోట్లకి వెళ్లాం కాని అవన్ని స్పాన్స్‌ర్డ్ ప్రోగ్రాములు. మన చుట్టాలతో వెళ్లిన ఆనందమే వేరు. అవునా? అని ఆమె అంటుంటే అవును అన్నట్లుగా ఓవెర్రిగా నవ్వాను.
‘‘వస్తా, బోల్డు పనుంది.’’ అంటూసామాను తీసుకుని లోపలికి వెళ్లింది.
నేను మా ఫ్లాటు తాళం తీసి లోపలికి వెళ్లాను.
నా మనసు నిండా ఆమె మాటలే వెంటాడు తున్నాయి.
అందరం కలిసి వెళ్లాం అని అంది.
ఎందుకో కాస్త గిల్టీగా అనిపించింది.
మరి. నేను! జవాబు లేదు.
ఎప్పుడైనా అందరం కలిసి అలా వెళ్లామా?నేను మా చుట్టాలని ఎప్పుడైనా కలుసుకున్నానా? కలుసు కుంటే ఎప్పడు? తెలీదు. గుర్తు లేదు.
ఆ మధ్య మా కజిన్ పోయారని తెలిస్తే వెళ్లడానికి కుదరక సెల్ ఫోన్లో పరామర్శ చేసాను. అమ్మ బాగా తిట్టింది.
‘‘ రేపు నువ్వు పోతే నీకోసం ఎవరూ ఏడవరు. నిన్ను చూడ్డానికి కూడా ఎవరూ రారు. బంధాలకు విలువనివ్వు.’’
నాకు మాకజిన్ శత్రువు కాదు. మేం దెబ్బలాడు కోలేదు. మొహామొహాలు చూసుకోకపోవడం లాంటిది ఏం లేదు. అయినా వెళ్లలేదు. కారణం కుదర లేదు అంతే. కంపెనీ, మీటింగులు పని, ఇదే.
‘‘నీ ఉద్యోగం, నీ బిజీ జీవితం, అందులోని ఆధునికత మానసికంగా అందరితో విపరీతమైన దూరాన్ని పెంచేెస్తున్నాయి. భౌతికంగా తగ్గిన దూరం మానసికంగా పెరిగింది’’ అమ్మ అనింది.
కిందటి నెలలో ముంబై వెళ్లాను.ఎయర్ పోర్టు నుంచి తిన్నగా హోటల్‌కి వెళ్లి పోయాను. ముంబైలో దగ్గర బంధువలున్నారు, కాని వెళ్లలేదు.నా రాక వాళ్లకి సంతోషం కలిగిస్తుందని తెలుసు. బాత్రూమ్‌కి, పడుకోడానికి అన్నింటికి ఇబ్బందే. నా మూలంగా వాళ్లకు కూడా ఇబ్బంది.
ఇదే మాటని కలీగ్ధాత్రితో అన్నాను.
‘‘మనం బంధువులని వదిలేస్తున్నామా !’’
‘‘వదిలేయడం అన్నది సరైనది కాదు. మన ఉద్యోగాల మూలంగా వెళ్ల లేక పోతున్నాం. ఆరోజులు వేరు కోషీ..ఇప్పుడు మనకి బంధువుల ఇళ్లకి వెళ్లడానికి టైము లేదు. అక్కడ మన ఇంట్లో లాగా ఉండదు. ప్రైవసీ ఉండదు.
మనం కష్టపడి సంపాదించిన డబ్బుని కొత్త ప్రదేశం చూడ్డానికి, మరో దేశం వెళ్లడానికో, టూర్‌కో ఖర్చు పెడతున్నాం.
ఇంక వేసవి సెలవలకి తాతగారి ఊరుకి వెళ్లడం కుదరదు.పిల్లలని తీసుకెళ్తే మాథ్స్ క్లాసులు, స్విమింగ్ క్లాసులు, ఎక్స్‌ట్రా క్లాసులు, పై క్లాసులు అప్పుడే మొదలయ్యాయి.. మంచి మార్కులు రావాలంటే మనం ఇంట్లో ఉండడమే బెటర్.‘‘ అని అంది.
అది నిజమే అనిపించింది.
‘సుందరీ నీవంటి దివ్య స్వరూపం’.. ఫోన్ పిలుపు. రెండోసారి, మూడోసారి.
నా ఆలోచనలకి అంతరాయం. సెల్ తీసి చూసాను.
డిగ్రీలో నా క్లాస్మేట్ అవంతిక.
‘‘కోషీ, ఈ టైములోనువ్వు అలిసి పోయి ఉంటావని తెలుసు, నాలుగు రోజుల్నించి నీకు మెసేజ్‌లు పెడుతున్నాను, నువ్వు చూసుకోలేదా?’’
‘‘చూడలేదు, కుదరలేదు, తీరిక లేదు. ఇంతకీ దేనికీ ఫోన్ చేసావ్?’’
‘‘మన తెలుగు లెక్చరర్ నేత్రావతి గారు పోయారని తెలుసా?’’
‘‘అవునా, అయ్యో తెలీదే!, ఎప్పుడు?’’
‘‘వారం రోజులైంది. విదేశాల్లో ఉండే వాళ్ల పిల్లలు వచ్చాక కార్యక్రమాలన్నీ చేసారు.రేపు వాళ్లింట్లో కండొలెన్స్ మీటింగ్ ఉంది. ఆ తరువాత లంచ్ కూడా ఉంది. నీకు గుర్తుంటే రా’’
గుర్తుంటే రా అంది. నా బలహీనత దానికి కూడా అర్థం అయింది.
నిశ్శబ్దం.
నా మీద నాకే జాలి వేసింది.
‘‘ఏం జీవితం!’’
దగ్గర వాళ్లు పోతే కూడా మెసేజ్ చూసుకోడానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నాను.
వెంటనే మెసేజ్‌లు చూసాను. అక్కర్లేనివి, బంగారం ధర తగ్గిందని, వెండి కిలో ఎనభైవేలు, ఏవో పాటలు. ఊరి అవతల అమ్మకానికి ప్లాట్లు, ఏర్ టెల్ మెసేజ్‌లు, ఇంకా ఏవేవో చీరలు అమ్మకాని కున్నాయని, ఇలా ఎన్నోవీటి వెనకాల ఎక్కడో నేత్రావతిగారి మరణ వార్త సమాధి అయింది.
నేనెందుకు ఇలా అయ్యాను?
నా ఉద్యోగం నా జీవితాన్ని తినేెస్తోందా !
ఆఫీసు పనుల్లో సైబర్ కనుమల్లో తప్పి పోతున్నాను. అష్టావధానంగా మారిన జీవితం. ఏ పాత్రలోను జీవించని బహుపాత్రాభినయం. వర్షంలోను తడవలేని, గ్రీష్మంలోనూ, ఎండలేని సైబర్ జీవనం ఇది.నన్నుగా త్యజించి పరాయి దాన్నయి పోయాను.
బాధ పడకు, వీటికి నువ్వు బాధ్యురాలివి కావు. నీ ఉద్యోగం అలాంటిది,నువ్వు నిమిత్తమాత్రురాలివి అని ధైర్యం నాకు నేనే చెప్పుకుంటున్నాను.
అమ్మకి ఫోన్ చేసి చెప్పాను,.
‘‘మా నేత్రావతి మేడమ్ పోయారుట రేపు ప్రార్థనా సభ ఉందిట అవంతిక ఫోన్ చేసింది.’’
‘‘దీనికైనా వెళ్తావా లేదా!’’
నేను సమాధానం ఇచ్చే లోపునే తనే అంది.
‘‘చూడుకోషీ, నీ సమస్యలేంటో తెలీదు. రిమైండర్లతో సహా నాలుగుసార్లు మెసేజ్‌లు పెట్టినా నువ్వు చూసుకో లేదు.ఇప్పుడు నువ్వు అనుకుంటున్న సమస్యలు నిజంగా సీరియస్ వా?’’
అవి సమస్యలు అవునో కాదో నాకే తెలీదు.ఏమో నాకే తెలీదు.
‘‘మన జీవితాలు మెరిసే మెరుపుల్లాంటివి. అనంతమైన కాన్వాస్ లాంటి ప్రపంచంలో ఓ చిన్న చుక్క లాంటిది. అందుకని, ఏ క్షణాన ఆ చుక్క మాయమవు తుందో తెలీదు. అందుకే ఒంటిగా ఉండేకన్నా నలుగురిలో ఉంటే మంచిది. బంధువు లందరిని కలుసుకుంటే బావుంటుంది.’’
అమ్మ మాటల్లో గూడార్థం అర్థం అయింది.
‘‘నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, నీకు ఈ ఉద్యోగం ఒక్కటే కాదు, ఆ తరువాత కూడా జీవితం ఉంది. జీవితాన్ని యంత్రంగా చేసుకుంటున్న తరవాత నీకు మిగిలేది ఏమీ లేదు. ఆ మధ్య డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నానని అన్నావు. నలుగురిలో ఉంటే, పాటలు వింటే, పుస్తకాలు చదువుతూంటే ఈ డిప్రెషన్ లూ అవి ఎందుకొస్తాయి? నేను చెప్తే నీకు పనికి రాలేదు. సైకియాట్రిస్ట్ చెప్పాడని వాకింగ్‌కి వెళ్తున్నావు, యూ ట్యూబులో పాటలు వింటున్నావు, రోజులో గంట సేపు నీకోసం జీవించు. నలుగురితో కలువు, జాగ్రత్త.’’
మళ్లీ అదే మాట. నలుగురితో కలువు. పరోక్షంగా మేనల్లుడి పెళ్లికి వెళ్లాలని… అర్థం అయింది.
‘‘అంటే పెళ్లికి వెళ్లాలంటావు,’’
‘‘నీకు చెప్తున్నదే అది, మా అక్క చెల్లెళ్లందరూ, పిల్లలతో సహా వస్తున్నారు నేను వెళ్లాలి, ఏదో జూమ్‌లో మాట్లాడుకుంటున్నాం కాని, ఎదురెదురుగా కూచుని మాట్లాడుకుని చాలా రోజులయింది..’’
‘‘నాకు వాళ్లెవరూ తెలీదు. నేను రాను.’’
‘‘అందుకేఅంటున్నా రమ్మనమని. ఇప్పుడు కూడా రాకపోతే ఎప్పుడు చూస్తావు అందరిని. నువ్వు రాకపోతే నేను వెళ్తాను. చెయ్యి. టిక్కెట్టు బుక్ చెయ్యి. నాకు టిక్కెట్ బుక్ చేయడం రాదు. అదేదో నువ్వు చేస్తే నేనొక్కదాన్ని వెళ్లి పోతాను. నా బట్టలు కూడా సద్దేసుకున్నాను. ఎయిర్ పోర్టులో ఏం చెయ్యాలో నాకు తెలుసు,’’
‘‘పెళ్లి ఎప్పుడు?’’ అన్నాను
‘‘ఎల్లుండి రాత్రి పది గంటలకి. విమానం చూడు, అది దొరకకపోతే పోనీ, రేపు రాత్రి ఎనిమిది గంటలకి ఓ రైలుంది. రైలైనా పరవాలేదు. ఈ వయసులో ఆ ప్లాట్ ఫారం మీద నడవడం, ఓవర్ బ్రిడ్జి ఎక్కడం కష్టం అనుకో, అయినా పరవాలేదులే.’’
అమ్మ మాటల్లో వ్యంగ్యం గమనించాను. వారం రోజుల్నించి చెప్తోంది, నాకు గుర్తు లేదు. మర్చి పోయాను.
‘‘ఇంతకీ పెళ్లి ఎక్కడ?’’
‘‘ఏం మనిషివే, ఎక్కడికెళ్లాలో వందసార్లు చెప్పాను, పెళ్లి మెడ్రాస్‌లో అని. మెడ్రాస్‌కి బుక్ చెయ్యి.’’
‘‘చూడు కోషీ! జీవితంలో ప్రతీదానికి ఓ సూత్రం అంటూ ఏదీ ఉండదు. మనమే తయారు చేసుకోవాలి, అదే జీవితంలోని ఆర్టూ, సైన్సు కూడా. నలుగురిలో కలుస్తూ ఉంటే, డిప్రెషన్ లూ అవీ రావు,
డిప్రెషన్‌లోకి వెళ్తున్నావనిపించి, నువ్వు అదేదోఇన్నర్ ఇంజినీరింగ్ అంటూ అక్కడెక్కడో వెళ్లావు. ఓ జపాన్ వాడి పుస్తకం ఇకి గాయ్ తెచ్చుకుని చదివావు, ఈ చదవడాలు, ఎవరో నేర్పిస్తారని ఎక్కడికో వెళ్లడం కాదు. పాటలు, పుస్తకాలు చదవాలి. నలుగురిలో కలవాలి. బంధువులతో మాట్లాడు తూండాలి. ఇవన్నీ చేస్తే ఎక్కడికి వెళ్లక్కర్లేదు. డిప్రెషన్ అనేది ఉండదు ఇదే నీ జీవితానికి ఆర్టూ సైన్సూ. అదే ఆర్టాఫ్ లివింగ్.’’
ఇప్పుడు నా జీవితంలో ఆర్టూ సైన్సు లేవా.
గబగబా ఐ పాడ్‌లో ట్రావెల్ ఏజెంట్ల మెడ్రాస్‌కి టిక్కెట్టు కోసం ప్రయత్నించాను. సారీ అనే జవాబు.
మేక్ మై ట్రిప్‌కి ఫోన్ చేసాను.ఐదు టిక్కెట్లు చెన్నైకి ఎందులో ఉంటే అందులో బుక్ చెయ్యమని చెప్పాను.
రేపు నేత్రావతి గారింటికి వెళ్లాలి.
అక్కడ వాళ్లమ్మాయి కనిపిస్తుంది. ఆమెకి ఎంతో సంజాయిషీ ఇచ్చుకోవాలి.
అబద్దాలు ఆడాలి. దాని వెనక అందమైన కారణాలు సృష్టించాలి. అది కృతకంగా ఉంటుందని తెలుసు, కాని తప్పదు..
ఎంత సెల్ఫిష్‌గా అయిపోయాను! నాకేదో లాభం వచ్చిందనుకోడానికి లేదు. కాని నష్ట పోతున్నదే ఎక్కువ.
‘‘ఈ ఉద్యోగం నీ జీవితంలో ఓ భాగం మాత్రమే. అది నిన్ను శాసించే స్థితికి నువ్వు రావడం దురదృష్టం. అన్నిటి కన్నా విషాదం నిన్ను నువ్వు కోల్పోవడం.’’
అన్నీ బాగానే ఉన్నా ఏదో వెల్తి కాల్చేస్తోంది. నా చదువు, నా ఉద్యోగం తృప్తిగానే ఉన్నాయి. కాని జీవితం రొటీన్. మొనోటొనీ జీవితంలోని సహజత్వాన్ని సమూలంగా దెబ్బతీస్తోంది. ఏం కోల్పోతున్నానో నాకే తెలీడం లేదు. అన్నింటిని పోగొట్టుకుంటున్నానా.!
‘‘కాస్సేపు టీవి కట్టెయ్యి, సెల్‌ని ఓ మూల పడెయ్యి. పేపర్‌ని మడిచి ఓ పక్కన పెట్టు. పడక్కుర్చీలో కూచుని కళ్లు మూసుకుని పాటలు విను. అప్పుడు దొరికే మనశ్శాంతి నీకు మరెక్కడా దొరకదు. అది నీకోసం నువ్వు సృష్టించుకునే చిన్న ప్రపంచం. దాన్ని పోగొట్టుకోకు’’ అని అమ్మ అంటూంటుంది.
పిల్లలొచ్చాక చెప్పాను, చెన్నై వెళ్తున్నాం అని.
సంతోషంతో ఎగిరి గెంతేసారు.వాళ్ల కళ్లలో మెరుపు ఎప్పుడు చూసానో గుర్తు లేదు. ఇవేళ చూస్తున్నాను.
మొదటి సారి నేను, పిల్లలు మా దగ్గర బంధువు లని కలుసుకోబోతున్నాం. ఇన్నాళ్లూ జీవించడానికి సిద్ధపడ్డానే కాని, నిజంగా జీవించడం లేదు.
– గంటి భానుమతి