దేవీ నవరాత్రుల సందర్భంగా
అసురత్వం (రాక్షసత్వం)పై దైవత్వం, చెడు మీద మంచి సాధించిన రోజు విజయ దశమి. శ్రవణానక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ శుక్ల దశమినాడే క్షీరసాగర మధనంలో అమృతం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. దేవాసుర సమరంలో పరాజితులైన దేవతలు శరన్నరాత్రులలో ఇష్టదేవతలను అర్చించి దశమినాడు విజయులయ్యారట. పాండవుల అజ్ఞాతవాస ఆరంభం, ముగింపు ఈ రోజుననే అని మహాభారతం పేర్కొంటోంది. రాజులు జైత్రయాత్రలకు విజయదశమి సుమూహుర్తంగా ఉండేదట. దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు, బతుకమ్మ వేడులకు ఘనంగా కొనసాగుతున్నాయి.
భారతీయ సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. ఆ ఆదిశక్తే దుర్గాదేవి. ఆ తల్లిని తొమ్మిది రూపాలలో అర్చించడమే దేవీ నవరాత్రుల పరమార్థంగా చెబుతారు. లక్ష్మీ స్వరూపిణీగా సంపదను, సరస్వతిగా జ్ఞానాన్ని, పార్వతిగా శక్తిని ప్రసాదించే దుర్గమ్మను ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారు లమ్మ….’ అని పోతనామాత్యుడు శ్లాఘించారు. ఈ నవరాత్రులను పురస్కరించుకొని పార్వతీ, లక్ష్మి, సరస్వతులను మూడేసి రోజులు అర్చిస్తారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజిస్తారు. అసురులతో యుద్ధంలో పరాజితులైన సురలు శరన్నవరాత్రులలో తమ ఇష్టదేవతలను అర్చించి దశమి నాడు విజయం సాధించారని పురాణకథనం.
విజయదశమి రాక్షసశక్తిపై ధర్మవిజయ సాధనకు ముహూర్తం, కేవలం పర్వదినమే కాదు. ఇది సర్వకాలాలకు వర్తించే దివ్య సందేశాలను ఇస్తుంది. సమాజాభ్యున్నతికి సమైక్యత ఆవశ్యకతను చాటి చెబుతుంది. అందుకు మహిషాసురాది రాక్షసుల వధ ప్రథమోదాహరణ. వేదాలను దూషిస్తూ, యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తూ మహిషాసురుడు లోకాలను తల్లడిల్ల చేశాడు. ఆతనిని సంహరించే శక్తి ఏ ఒక్కరిలోనూ లేదని గ్రహించిన సాక్షాత్తు త్రిమూర్తులు, దేవతలు తమ అంతఃశక్తులను సమష్టిగా వెలువరించి విజేతలయ్యారు. సంఘటిత వ్యూహం, సమైక్యశక్తితోనే విజయాన్ని సులువుగా సాధించవచ్చని, సర్వేజనాః సుఖినోభవంతు’ ఆర్యోక్తి నిజం కావాలంటే సర్వజనులు ఐక్యంగా ఉండాలన్న సత్యాన్ని ఆ సంఘటన భావితరాలకు చాటుతోంది. ధర్మ పరిరక్షణలో, విజయఫలాల్లో అందరికి భాగస్వామ్యం కల్పించాలన్న భావన దేవతల సమష్టి వ్యూహంలో వ్యక్తమవుతుందని పెద్దలు విశ్లేషిస్తారు.
సమాజాన్ని సమాజంగా నిలబెట్టేదే ధర్మం. ధర్మం నశించే పరిస్థితి ఉత్పన్నమైతే ధర్మసంస్థాపన కోసం తనను తను సృష్టించుకుంటానని పేర్కొన్నాడు భగవానుడు. అమ్మవారి పరంగా అదే వర్తిస్తుంది. అసురుల విజృంభణతో ధర్మహాని కలిగినప్పుడు జగదాంబ వివిధ అవతారాలతో వారిని తుదముట్టించింది.
‘ఇత్థం యదాయదా బాధా
దానవోత్థా భవిష్యతి
తదాతదా వతార్యాహం
కరిష్యామి సంక్షయమ్’ (దుర్గాసప్తశతి-11:55) (ప్రపంచంలో దానవులు బాధలు కలిగించినప్పుడల్లా అవతారాలు ధరించి శత్రువులను సంహరిస్తాను) అని దేవీ భగవతి పేర్కొంది. శ్రీకృష్ణునిలో కనిపించే విజగీషు ప్రవృత్తే (గెలుపు సాధించి తీరుతాననే విశ్వాసం) జగన్మాత విషయంలోనూ సాక్షాత్కార మవుతుంది. ప్రత్యర్థులను ఎదుర్కొనడంలో అటుఇటు తేడాలు ఉన్నా ఓటమిని అంగీకరించే ప్రసక్తే ఉండదు.
విజయదశమి అన్ని సంప్రదాయాలవారు పాటించే పండుగ. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు వివిధ ప్రాంతాలవారు కొద్దిపాటి మార్పులతో దేవీపూజ నిర్వహిస్తారు. దుర్గా సప్తశతిని పఠిస్తారు. నవరాత్రులను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా నిర్వహిస్తారు. బెంగాల్ ప్రాంతాన్ని దుర్గాదేవి పుట్టినిల్లుగా చెబుతారు. అమ్మవారు పండుగ సందర్భంగా తొమ్మిది రోజులు పుట్టింటికి వెళ్లేలా పరమ శివుడు వివాహ సమయంలో అనుమతించినట్లు ఆ ప్రాంతీయుల విశ్వాసం. అందుకే, ఆ ప్రాంత మహిళలు పండుగ సమయంలో విధిగా పుట్టింటికి చేరే ఆచారం ఉంది. అక్కడ షష్ఠి నుంచి నాలుగు రోజులు మాత్రమే అమ్మవారికి పూజాదికాలు నిర్వహించి దశమినాడు దేవీ ప్రతిమ(ల)ను నిమజ్జనం చేస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ పండుగను ‘రామలీల’గా వ్యవహ రిస్తారు. రావణునితో యుద్ధంలో రాముడి విజయానికి చిహ్నంగా ‘రామ్‌లీలా’ పేరిట ఉత్తరాదిలో రావణదహన ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. రాముడిని అమ్మవారిగా పరిగణించి అర్చించడం కూడాఉంది. జానకీదేవి ‘స్త్రీయం పురుష విగ్రహః’ అని రాముని సంబోధించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతారు. అందుకే దేవీ నవ రాత్రులలో రామాయణ పారాయణం, శ్రీరామనవమి రోజుల్లో (వసంత నవరాత్రులు) దేవీ భాగవతం పారాయణం ఆచారంగా ఉంది. గుజరాత్‌లో శ్రీకృష్ణుని లీలలు, ఆదిపరాశక్తి గాథలను దాండియా నృత్యం ద్వారా ప్రదర్శించడం సంప్రదాయం. శ్రీకృష్ణుడి కోడలు ఉష (అనిరుద్ధుని భార్య) ఈ నాట్యాన్ని ప్రవేశ పెట్టిందని అక్కడి వారి విశ్వాసం.
కశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బిహార్ ప్రాంతాలలో దసరాను వ్యవసాయ పండుగగా (మనకు సంక్రాంతిలా) జరుపుకుంటారు. దేవీనవరాత్రుల ప్రారంభం రోజున గోధుమలు, బార్లీ వంటి ధాన్యాన్ని మట్టికుండలో పోసి, దసరా నాటికి మొలకెత్తిన వాటిని చెరువులు లేదా నదులలో నిమజ్జనం చేస్తారు.
దక్షిణ భారతదేశంలో పరాశక్తిని మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి అనే త్రివిధ ప్రధాన రూపాలలో అర్చిస్తారు.ఆధునిక భౌతిక విజ్ఞానంలో కాంతి,శబ్దం,ఉష్ణం అనే విభాగాలకు వరుసగా మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళిలను ప్రతీకలుగా చెబుతారు. శక్తి స్వరూపాలైన మిగతా సప్త (లలిత, చండిక, మహేశ్వరి, వారాహి, రాజరాజేశ్వరి, వైష్ణవి, భార్గవి) స్వరూపాలను ఈ పది రోజుల్లో ఆరాధించడం ఆచారం.
దక్షయజ్ఞం సందర్భంలో సతీదేవి కల్పించుకున్న యోగాగ్ని ఫలితంగా ఆమె శరీరభాగాలు పడిన ప్రాంతాలు అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధ మయ్యాయి. వాటిలో నాలుగు పీఠాలు తెలుగు రాష్ట్రాలలో… అలంపురం జోగులాంబ (తెలంగాణ), శ్రీశైలం భ్రమరాంబ, పీఠికాపురం పురహుతాదేవి, దాక్షారామం మాణిక్యాంబ (ఆంధ్రప్రదేశ్) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కృష్ణానదిలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. శ్రీశైలంలో భ్రమరాంబదేవికి, అలంపురం జోగులాంబదేవి, వరంగల్‌లోని భద్రకాళికాదేవి తదితర ఆలయాలలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
‘అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదమే
సకారో విజయోసామ సర్వ కామార్థ సాధకః’.. ఆశ్వీయజ శుక్ల దశమి నక్షత్రోదయ వేళను ‘విజయ ముహూర్తం’గా వ్యవహరిస్తారు. ఆ సమయాన్ని ‘సర్వకామార్థ సాధకం’అని చింతామణి కారుడు వ్యాఖ్యానించాడు. విద్యాభ్యాసం ఆరంభం సహా సకల శుభకార్యాలకు దీనిని శుభ సమయంగా భావిస్తారు.ఆ సమయంలో ప్రారంభించే పనులు జయప్రద మవుతాయని చెబుతారు. రాజుల జైత్రయాత్రలకు విజయదశమి సుమూహుర్తంగా ఉండేదట. ‘అపరాజిత’ను అర్చించి, ఆయుధ పూజ నిర్వహించి కదనానికి కదిలేవారు. వేదపండితులతో వేదపారాయణం చేయించేవారు. దీనినే ‘వేదసభ’ అంటారు.
రామచంద్రమూర్తి విజయదశమి నాడే రావణుని సంహరించినది, ధనుర్ధారి అర్జునుడు ఉత్తర గోగ్రహణ కదనంలో అతిరథ కురువీరులను కట్టడి చేసి గోవులను మళ్లించుకు వెళ్లిందీ ఈరోజునే అనే పౌరాణిక గాథ తెలిసిందే. హిందూధర్మంలోని శౌర్యపరాక్రమాలకు విజయదశమి ప్రతీక. ఆ రోజున ఆయుధపూజ చేసి పారువేటకు వెళ్లడం పరిపాటి. ఆనాడు శమీ (జమ్మి) వృక్ష పూజ మరో ప్రధాన ఘట్టం. ‘శమీ’ అంటే పాపాలను, శత్రువులను నశింపచేసేది. క్షీరసాగర మధనంలో ఉద్భవించిన శమీ వృక్షంలో అపరాజితదేవి కొలువై ఉంటుందని విశ్వాసం. ఆ చెట్టు కొమ్మ లేదా సమిధకు ప్రదక్షిణ చేయడం వల్ల తొమ్మిది రోజుల పూజలో లోపాలు ఉంటే పరిహారమవుతాయని, దశమి నాడు జమ్మిని పూజించడం వల్ల లక్షీదేవి ప్రసన్నమవుతుందని విశ్వాసం. అపరాజితా దేవిని అర్చించి ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ/అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ’ అని ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు తొలగిపోతాయని చెబుతారు. ‘బంగారం‘గా వ్యహరించే జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం, బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. ఈ ఆకులను ‘బంగారం’ అనీ వ్యవహరిస్తారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ సంప్రదాయం ఇప్పటికీ కనిపిస్తుంది. పాలపిట్ట దర్శనం దసరానాడు మరో ప్రత్యేకాంశం. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని వస్తుండగా పాలపిట్ట దర్శనమైందని, అప్పటి నుంచి విజయాలు వరించాయని జానపద గాథలు ఉన్నాయి. నాటి నుంచి ఈ పండుగనాడు ఆ పక్షి దర్శనాన్ని శుభసూచకంగా భావిస్తారు. తెలంగాణ సహా ఒడిశా, కర్ణాటక, బీహార్‌ల రాష్ట్రపక్షి పాలపిట్ట కావడం గమనార్హం.
సమాజ శ్రేయస్సు లక్ష్యం
ఉత్సవాలు, పండుగలు, నవరాత్రులంటే ఆడంబరం కోసం నిర్వహించేవి, పర్యావరణ, శబ్ద కాలుష్య కారకాలు కాదు… కారాదు. జనత చైతన్యశీలురై సామాజిక, ఆర్థిక, రాజకీయ, కళాసాంస్కృతిక రంగాలలో విజయ సాధనకు పునరంకితం కావాలని ఏటేటా వచ్చే పండుగలు సందేశమిస్తాయి. వీటి నిర్వహణలో చిత్తశుద్ధి, సమాజ ప్రయోజనం ప్రధానం తప్ప ఆర్భాటాలు కాదు. ఆ కోణంలో, స్వాతంత్య్ర సముపార్జనకు దుర్గామాత పూజ ఎంతో స్ఫూర్తినిచ్చింది. ప్రజలను సంఘటి తపరచి చైతన్యవంతం చేసేందుకు జాతీయ నాయకులు అమ్మవారి అర్చనను ఆలంబనగా చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో అమ్మవారి విగ్రహాలు నెలకొల్పి ఘనంగా పూజలు నిర్వ హించారు. ఆ రీతిగానే అశాంతి, అసహనం, అవినీతి, అవిద్య, అత్యాశ, అహంకారం వంటి వాటిని రూపుమాపి సమత, మమత పెంపుతో సమైక్యజీవనం సాగించేందుకు ఈ పండుగ స్ఫూర్తిదాయకమని పెద్దలు చెబుతారు.
– డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్