– బి.ఎల్‌.గాయత్రి

‘‘నువ్వు ఎంత చెప్పినా సరే, నేను సమాధానపడలేకపోతున్నాను వల్లీ! సహజంగా మనిద్దరి మధ్యా జరిగే రొమాన్స్‌ బిడ్డగా పుట్టడం వేరు… ఇది వేరు. నువ్వు నెల తప్పిన మరుక్షణం నుంచీ మనిద్దరం పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకోవడం, ఆ పసిగుడ్డుని ప్రేమించడం… ఆ కలలూ, ఊహలూ, ప్రేమా ఎంత అద్భుతంగా ఉంటాయో కాస్త ఊహించు. నువ్వు చెప్పిన పద్ధతిలో అంతా యాంత్రికమే! ఏ జొమాటో లోనో ఆర్డరిచ్చి వచ్చిందాన్ని నోరు మూసుకు తినడం ఎలాగో ఇదీ అలాగే.’’

శరత్‌ మాట్లాడుతూ ఉండగానే, ‘‘అబ్బా శరత్‌..’’ అంటూ ప్రవల్లిక అడ్డు తగిలింది.

‘‘ఇప్పటికి లక్షసార్లు చెప్పాను… నేను కడుపుతో ఉండటం.. పొట్ట కోయించుకోవడం.. ఆ ప్రసక్తే లేదు! నాకు ఉద్యోగంలో ఎదుగుదల చాలా ముఖ్యం. కడుపుతో ఉండటమంటే నా కెరీర్‌ నుంచి విడి పోవడమే. అసలు పిల్లల్ని పెంచడానికే నేను సిద్ధంగా లేను. ఒకవైపు జనాభా పెరుగుదల ఇంత దారుణంగా ఉంటే మరోవైపు నీలాంటి చదువుకున్నవాళ్లు కూడా పిల్లలో పిల్లలో అని దేవులాడ్డం చూస్తే నాకు ఒళ్లు మండుతోంది! అయినా నీ మీద ప్రేమ కొద్దీ సరే అన్నాను. నీకు పిల్ల కావాలంటే నేను చెప్పినదానికి ఒప్పుకో! లేదంటే పిల్లల సంగతి వదిలేసి నన్ను హాయిగా బతకనీ!’’

గుక్క తిప్పుకోకుండా భార్య మాట్లాడిన దానికి జవాబు చెప్పే ఓపిక శరత్‌కి లేకపోయింది. ఇప్పటికే ఆమెతో వాదించీ వాదించీ అతడు మానసికంగా చాలా అలసిపోయి ఉన్నాడు. మాతృత్వం కోసం తపించే ఆడవాళ్లే తెలుసు గానీ ఇలా పిల్లలు వద్దు అనే ఆడదాన్ని అతను ఇప్పటి వరకు చూడలేదు. పెళ్లయి రెండేళ్లయిందని, పిల్లలు కావాలంటూ తను పట్టుబట్టినప్పుడు భార్య నోటి నుంచి ‘‘అయితే సరోగసికి వెళ్లు’’ అన్న మాట రాగానే అతనికి షాక్‌ తగిలినట్టయింది. అప్పటి నుంచీ ఆమెకి నచ్చ జెబుతూనే ఉన్నాడు. అయినా ఆమెలో కించిత్తూ మార్పు లేదు.

ఇంట్లో వంట చెయ్యకుండా బయటి నుంచి ఆహారాన్ని తెచ్చుకు తింటూ ఉంటే, క్రమేపీ కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుందని నలభయ్‌ ఏళ్ల కిందటే అమెరికన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినా ఎవరూ వినలేదు. కుటుంబం కోసం పాకులాడనూ లేదు. ఇప్పుడు ఆ సంస్కృతి భారతదేశంలోనూ వేళ్లూను కుంది. రకరకాల కారణాలతో డైవోర్సుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. ఇంక ఆడవాళ్లు పిల్లల్ని కనడం కూడా మానేస్తే… భవిష్యత్తు ఉహించడానికే భయం వేసింది శరత్‌కి.

* * * * * *

‘‘సరోగసీకి వెళదామన్నావుట?!’’ కూతుర్ని అడిగింది జానకి.

ఇంటర్మీడియట్‌ అవగానే పెళ్లి చేసేశారు జానకికి. భర్తనీ, అత్తమామల్నీ ఒప్పించి, నెమ్మదిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్‌ తీసుకుంది. బిజినెస్‌ స్కూల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా నూటికి నూరుపాళ్లూ సంప్రదాయ గృహిణిలా ప్రవర్తించే తల్లిని చూస్తే ప్రవల్లికకి కాస్త బెదురే. చెప్పా పెట్టకుండా తల్లి రావడంతో అనుమానం కూడా కలిగింది.

అనుకున్నట్టే తల్లి సరోగసీ గురించి అడుగు తోంది. ముందు కాస్త తడబడినా ధ్కెర్యం తెచ్చుకుంది ప్రవల్లిక.

‘‘అవును. నాకసలు పిల్లల్ని కనడం, పెంచడం రెండూ ఇష్టం లేదు!’’

‘‘ఎందువల్ల?!’’

శరత్‌కి చెప్పిన జవాబే తల్లికీ చెప్పింది.

కూతురు చెప్పిందంతా సావకాశంగా వింది జానకి. తర్వాత, ‘‘సరే, అయితే. సరొగేట్‌ మదర్‌గా నేనే ఉంటాను!’’ అంది మామూలుగా

ఈసారి షాక్‌ ప్రవల్లికకి తగిలింది. ‘‘నువ్వా’’ అంది దిగ్భ్రాంతితో

‘‘అవును. నేనే. ఏం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. వయసు కూడా తక్కువే.. నలభయ్‌ ఏడు. విదేశాల్లో ఎక్కడో బిడ్డల్ని కనలేని కూతురి కోసం తల్లి సరొగేట్‌గా వ్యవహరించిందని పేపర్లో చదవలేదా నువ్వు?!’’ జానకి మాటలు మామూలుగా ఉన్నాయి.

‘‘ఎక్కడో ఎవరో ఏదో చేశారని మనం కూడా అదే చేస్తామా…’’ కోపం దాచుకోలేకపోయింది ప్రవల్లిక

‘‘నువ్వు చేస్తున్నది అదేగా. నువ్వు కోరుకుంటున్న సరోగసీ భారతీయ సంస్కృతిలో లేదు. నలభయ్‌ ఏడేళ్ల కిందట అమెరికాలో పుట్టింది. భారతీయులు రక్తసంబంధానికిచ్చే విలువ మరి దేనికీ ఇవ్వరు. పిల్లలు పుట్టకపోతే ఏ అన్న దమ్ముడి సంతానాన్నో తెచ్చి పెంచుకుంటారు గాని, పరాయి బిడ్డని కూడా సాధ్యమైనంత వరకూ తెచ్చుకోరు. డబ్బులిచ్చి గర్భాన్ని అద్దెకు అసలు తీసుకోరు. పునర్జన్మని పూర్తిగా విశ్వసించే భారతీయులు, చచ్చిపోయిన పెద్దలే మళ్లీ తమ వంశంలో పుడతారని నమ్ముతారు. జీన్స్‌కి నూటికి నూరుపాళ్లూ విలువ ఇస్తారు. నువ్వు పిండాన్ని మరో గర్భంలో ప్రవేశపెట్టినంత మాత్రాన, ఆ మనిషి రక్తం కలవకుండా పోతుందా?! ఆ మనిషి పోలికలు, బుద్ధులు కొన్నయినా రాకుండా పోతాయా?!’’

‘‘అయితే…?! అందుకని అల్లుడి స్పెర్మ్‌ని నీలో పెట్టుకుంటానని చెప్పడానికి సిగ్గు లేదూ?!’’ ఉక్రోషంతో పూర్తిగా తెగించింది ప్రవల్లిక

జానకి నవ్వింది. ‘‘ఇలా అడుగుతున్నావంటే నీలో భారతీయత పూర్తిగా చచ్చిపోలేదన్నమాట. ఒక్క భారతీయులకే ఇటువంటి భావోద్వేగం ఉంటుంది. మిగతా ప్రపంచదేశాలన్నీ కేవలం పని జరగడం గురించే ఆలోచిస్తాయి.’’

తల్లి మాటకి ప్రవల్లిక జవాబు చెప్పలేక పోయింది.

‘‘చూడు, మనం చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన, ప్రకృతికి ఎదురు తిరిగేంత గొప్పవాళ్లం కానక్కర్లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళా పారిశ్రామికవేత్తలంతా నవమాసాలూ మోసి బిడ్డల్ని కని, మాతృత్వపు మాధుర్యాన్ని మనసారా అనుభవించిన వాళ్లే. కెరీర్‌ సాకుతో పిల్లల్ని కనడానికి వ్యతిరేకిస్తున్నది నిజానికి బాధ్యతల నుంచి పారి పోవడానికే. పొద్దున్నే నిద్ర లేచి వంట చేసి, పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగం చేసేంత ఓపిక నీకు లేదు. తీరిగ్గా ఏ ఎనిమిదికో లేచి, జొమాటోలో ఆర్డర్‌ చేసుకుని…ఈ రకమైన స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడ్డావు. మితి మీరిన స్వేచ్ఛ వ్యక్తినీ, సమాజాన్నీ ఒక్కలాగే దెబ్బతీస్తుంది. ఒక్కసారి కళ్లు తెరిచి నీ సహ్యోగుల్ని చూడు. వాళ్లలో ఎందరు పిల్లల్ని కని పెంచుకుంటూ ఉద్యోగం చేస్తున్నారో గమనించు.’’ అంటూ ఒక్కక్షణం ఆగింది జానకి.

‘‘అయినా ఇలాంటి మాటల వల్ల నీలో మార్పు రాదు. నీకు చెప్పీ చెప్పీ విసిగెత్తిపోయే శరత్‌ మా దగ్గరకి వచ్చాడు. ఇప్పుడు అసలు విషయం విను. శరత్‌ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు వారానికి నాలుగు రోజులు వంట చెయ్యకపోయినా, చదువు రాని పల్లెటూరి వాళ్లంటూ అతని తల్లి దండ్రుల్ని చిన్నచూపు చూసినా కూడా భరించాడు. కానీ, పిల్లల కోసం సహజ మార్గాన్ని వదిలేసి పక్కదారులు పట్టడం మాత్రం శరత్‌కి ససేమిరా ఇష్టం లేదు. అలాగే నిన్ను వదులుకోవడానికీ అతను సిద్ధంగా లేడు. అందుకే నీకు కొంత గడువి వ్వాలని నిశ్చయించుకున్నాడు. ఆ గడువు లోపల కూడా నీ నిర్ణయం మారకపోతే ఇంక విడాకులే గతి!’’

‘‘ఏమిటీ…’’ ప్రవల్లిక ఎగిరిపడిరది.

‘‘పిల్లల్ని కననంత మాత్రాన ప్రేమించి పెళ్లాడినదాన్ని వదిలేస్తాడా…అంత మూర్ఖుడన్న నీ అల్లుడు!’’

‘‘మూర్ఖత్వం అతనిదో నీదో నెమ్మదిగా నీకే తెలుస్తుంది. నీకే గనుక పిల్లలు పుట్టరు అని డాక్టర్‌ చెబితే, నిన్ను మరింత అపురూపంగా చూసుకుని ఉండేవాడు శరత్‌. కాని పిల్లలే వద్దు అంటున్న నీ మనస్తత్వాన్ని అతను భరించలేకపోతున్నాడు. ఏడాది వరకూ అతను ఇక్కడి ఆఫీసుకి రాడు. ఫోన్‌లో కూడా దొరకడు. ఇదిగో ఇది నీకివ్వమన్నాడు!’’ పర్సులోంచి చిన్న కాగితం తీసి ఇచ్చింది జానకి.

కోపంతోనూ బాధతోనూ కంపించిపోతూ కాగితం మడత విప్పింది ప్రవల్లిక. ‘‘ప్రేమించే హృదయం మాతృత్వాన్ని ఎప్పుడూ వద్దనుకోదు వల్లీ! పుట్టింట్లోనూ అత్తింట్లోనూ కూడా నీ వెనకపడేవాళ్ల వల్ల నీలో నియంతృత్వం పెరిగింది. ప్రేమించే వాళ్లకి తిరిగి ప్రేమను అందించడానికి బదులు, నిర్లక్ష్యాన్ని అందిస్తు న్నావు. కొన్నాళ్లపాటు ఒక్కర్తివీ ఉంటే ప్రేమ విలువ నీకే తెలుస్తుంది. నిన్ను అమ్మా అని పిలుస్తూ హత్తుకుపోయే పాపాయి కోసం నువ్వే పాకులాడ తావు! ఆ రోజు రావాలన్నదే నా కోరిక. నిన్ను శాశ్వతంగా దక్కించుకోవడం కోసమే తాత్కాలికంగా వదిలి వెళుతున్నాను. ఎప్పటికీ నీవాడిగానే ఉండాలను కునే… శరత్‌’’

ప్రవల్లికకి ఒక్కసారిగా రోషం, ఆవేశం ముంచు కొచ్చాయి. పొమ్మను… ఎవ్వరూ అక్కర్లేదు తనకి. తనొక్కర్తీ హేపీగా బతకగలదు!!

* * * * * *

 వారం రోజులు గడిచాయి. పిచ్చెక్కినట్టే ఉంది ప్రవల్లికకి. తన జీవితంలో శరత్‌ ఎంత గాఢంగా అల్లుకుపోయి ఉన్నాడో క్షణక్షణమూ తెలిసొస్తోంది. తనెప్పుడూ పొద్దున్నే లేవలేదు. ఆకలి వేసినప్పుడు తప్ప తనకసలు వంటిల్లే గుర్తు రాదు. పొద్దున్నే లేచి, ‘‘ఇవాళ ఫలానా వండుకుందాం పద’’ అంటూ తనని వంటింట్లోకి నడిపించి, తను పని చేస్తూ తన చేత కూడా చేయించేవాడు శరత్‌. క్షణాల మీద రుచికర మైన భోజనం తయారయేది. ఇద్దరూ హాయిగా తినేవారు. ఇప్పుడు కడుపులో ఆకలి దహించుకు పోతూ ఉంటే, వంట ప్రాముఖ్యత తెలిసొస్తోంది.

అపరిచితులతో కూడా స్నేహంగా మాట్లాడే మనిషి శరత్‌. ఆ స్నేహతత్త్వం అతని మొహంలో తెలిసేది కాబోలు..పసిపిల్లలంతా అతన్ని చూస్తూనే బోసి నవ్వులు నవ్వేవారు. చంటిపిల్లలు కనిపించడం ఆలస్యం, శరత్‌ చేతులు జాపి వాళ్లని ఎత్తుకుని ముద్దులాడేవాడు. తననీ ఎత్తుకోమనేవాడు. తను ఎప్పుడైనా చేతులు జాపినా..అదేం విచిత్రమో గాని ఆ పసివాళ్లు శరత్‌ని వదిలి తన దగ్గరకి వచ్చేవాళ్లు కాదు. బహుశా తన హృదయకాఠిన్యం వాళ్ల మనసులకి తెలిసేదేమో!

ప్రవల్లికకి నెమ్మదిగా తనలోని లోపాలు తెలిసి రాసాగాయి. తనకి చిన్నప్పటినుంచీ బద్ధకం ఎక్కువ. ఇంట్లో పని ఎప్పుడూ చెయ్యలేదు. తల్లి తనని దెబ్బలాడినా లొంగలేదు. ఇంట్లో తనొక్కర్తే. బాధ్యతలు లేవు. పెళ్లయ్యాక శరత్‌ తనని అమ్మలాగే ఆదరించాడు. అత్తగారు కూడా తనని ఎప్పుడూ ఏమీ అనలేదు. వచ్చినప్పుడల్లా రెండు పూటలా రుచి రుచిగా వండిపెట్టేది. ఇంతమంది తన చుట్టూ కోటగోడల్లా నిలబడి తనని సుఖపెడుతూ ఉంటే తనకి వాళ్ల విలువ తెలియలేదు. ఒక బిడ్డని కని, తను కూడా ఆ వంశాంకురాన్ని సాకి, ప్రేమ నందించాలన్న ఆలోచన రాలేదు. చదువులో ర్యాంకులు తెచ్చుకుని, లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయడం వల్ల తనంత గొప్పది లేదని మిడిసిపడిరది. నిజానికి తెల్లవారి లేస్తే ఏం చెయ్యాలో తనకి తెలీదు. మొద్దుపిల్ల అఆలు దిద్దుతున్నట్టు తడబడుతూ వంటింట్లోకి వెళ్లి, ఏం చేయాలా అని గంట ఆలోచించే సరికి ఆఫీసు వేళయిపోతోంది. ఈ పనులన్నీ తను క్రమేపీ నేర్చుకోవచ్చు గాక… కాని తనని ప్రేమించేదెవరు? ఎంత అలిసిపోయినా శరత్‌ సాన్నిధ్య్యం, అతని వెచ్చని కౌగిలి తనకు హాయినిచ్చేవి. ఇప్పుడు బతుకులో ఆ వెచ్చదనం ఏదీ?

గొప్పగొప్ప మహిళా పారిశ్రామికవేత్తలంతా తమ తమ పిల్లల గురించి గర్వంగా చెప్పుకుంటున్న మాటలన్నీ ఇన్నాళ్లూ తనెందుకు వినలేదో…ఇప్పుడు టీవీలోనూ పేపర్లలోనూ ఎక్కడ చూసినా అవే! ప్రపంచమంతా తల్లీపిల్లల అనుబంధాన్ని తనకి విశ్వరూపంలో ప్రదర్శిస్తున్నట్టుంది.

ఆ రోజు ప్రవల్లిక ఆఫీసుకి వెళ్లేసరికి ఆఫీసంతా రంగు రంగుల తోరణాల తోనూ, బెలూన్లతోనూ అలంకరించి ఉంది. ఆడా మగా అందరూ బాగా తయారై వచ్చారు. ఆశ్చర్యపోతూ చూసిన ప్రవల్లికకి ప్రతి ఉద్యోగి పక్కనా వాళ్ల పిల్లలు కనబడి, ఆ రోజు ఫన్‌ అండ్‌ ఫ్రాలిక్‌ డే కదా అని గుర్తొచ్చింది. ప్రవల్లిక పని చేస్తున్న కంపెనీ ఏడాదికోసారి ఆ వేడుక నిర్వహిస్తుంది. ఆ రోజు ఉద్యోగులంతా తమ పిల్లల్ని తీసుకొస్తారు. కంపెనీ పిల్లలందరికీ ఏవో చిన్న చిన్న బహుమతులిస్తుంది. ఆఫీసులో అల్లిబిల్లిగా తిరుగు తున్న చిన్నపిల్లల్ని, తల్లుల చంకల్లోంచి బోసినవ్వులు నవ్వుతున్న పసివాళ్లనీ కుతూహలంగా చూడటం ప్రారంభించింది ప్రవల్లిక.

ప్రతి వాళ్లూ తమ పిల్లల్ని సగర్వంగా చూపిస్తు న్నారు. ‘‘మా యువరాణి’’ ‘‘మా బాస్‌..’’ లాంటి మాటలతో ఆఫీసు మారుమోగుతోంది.

ఎప్పుడూ మొహం ముడుచుకుని ఉండే టీమ్‌ లీడ్‌ నలభయ్‌ ఏళ్ల భారతి, తన రెండేళ్ల కొడుకుని చంకనేసుకుని అందరికీ చూపిస్తూ, ‘‘మా పెళ్లయిన పన్నెండేళ్లకి పుట్టాడు వీడు. అప్పటిదాకా పిల్లల కోసం ఎన్ని పూజలు చేశామో ఇద్దరం. వీళ్ల నాన్నకి అపురూపాల బిడ్డ. వీడు కాస్త కుంయ్‌ అంటే చాలు… నన్ను తన్నడానికొస్తాడాయన’’ అని నవ్వుతూ చెబుతోంది. ‘‘నాకు వీణ్ణి వదిలేసి ఆఫీసుకి రావాలని పించదస్సలు. వచ్చిన దగ్గర్నించీ ఎంత తొందరగా వెళ్లిపోదామా అనే ఉంటుంది. అసలు ఉద్యోగం మానేద్దామా అనే ఆలోచిస్తున్నాను’’ అని ఆవిడ చెబుతూ ఉంటే, ‘‘అందుకే కాబోలు ఎప్పుడు చూసినా మొహం ముడుచుకుని ఉంటుంది’’ అనుకున్నారు అందరూ.

ప్రవల్లికతో చనువుగా ఉండే శైలజ తన ఎనిమిది నెలల పాపని తీసుకుని వచ్చింది. శైలజకి పెళ్లయి ఏడాదిన్నర అయిందంతే.

‘‘మా ఆయన ఇప్పటినుంచీ పిల్లలొద్దన్నారు. కానీ నేనే ఒప్పుకోలేదు. నాకు పిల్లలంటే ప్రాణం. అసలు నేను పెళ్లి చేసుకున్నదే పిల్లల కోసం’’ అంటోంది నవ్వుతూ.

ఆ మాట వినగానే ప్రవల్లికకి శరత్‌ మాటలు గుర్తొచ్చాయి.

‘‘మనింట్లో ఒక బుల్లి మొక్క ఉందనుకో. దాని చిగురాకుల మధ్య చిట్టి మొగ్గ కనిపిస్తే నీకు ఎంత ఆనందంగా ఉంటుంది?! ఎప్పుడెప్పుడు ఆ మొగ్గ వికసిస్తుందా అని ఆ మొక్క చుట్టే తిరుగుతావు. పువ్వు బాగా పెద్దదిగా అందంగా ఎదగాలని ఏవేవో ఎరువులు వేస్తావు. ఆ మొగ్గ పువ్వుగా వికసించిన రోజున నీకు కలిగే ఆనందానికి సాటి ఏదైనా ఉందా?! అదే బజారులో కొన్న పువ్వు అయితే ఈ ఆనందాలన్నీ ఉంటాయా…మన ఇంటి పొదరింటి పువ్వుకీ బజారు పువ్వుకీ అదీ తేడా!!’’

శైలజ కూతురు చాలా బావుంది. బొద్దుగా, ముద్దుగా ఉంది. నోరంతా తెరిచి నవ్వుతోంది. ఆ బోసినవ్వుకి అందరూ పరవశించిపోతూ ‘‘చాలా బావుంది పాప’’ అని పిల్లని ఎత్తుకుంటూ ఉంటే శైలజ గర్వానందాలతో పొంగిపోతోంది.

‘‘శరత్‌ ఇప్పుడిక్కడ ఉంటే తప్పకుండా ఈ పాపని ఎత్తుకుని ఉండేవాడు’’ అనుకుంది ప్రవల్లిక

శైలజ పాపని తీసుకుని ప్రవల్లిక దగ్గరకొస్తూ ‘‘మా రాణీగార్ని ఎత్తుకోవా నువ్వు?!’’ అంది

ప్రవల్లిక అప్రయత్నంగా చేతులు జాపింది. శైలజ బిడ్డని అందించింది.

 పిల్లల్ని ఎత్తుకోవడం సరిగ్గా రాని ప్రవల్లిక రెండు చేతులూ జాపి అడ్డంగా పొత్తిళ్లలో ఉన్నట్టుగా ఎత్తుకుని, పసిదాని మొహంలోకి చూసింది. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న పాపాయి, నవ్వడం మానేసి సీరియస్‌గా ప్రవల్లిక మొహంలోకి చూస్తోంది.

ప్రవల్లికకి చివుక్కుమంది. ‘‘నన్ను చూస్తే నీక్కూడా నవ్వు రాదా… ప్లీజ్‌, నవ్వు’’ అనుకుంది మనసులోనే

 ఆ మాట అర్థమైనట్టు పాపాయి నోరంతా విప్పి నవ్వింది. ప్రవల్లిక మనసు ఒక్కసారి గంతులేసింది. పరవశించిపోతూ అప్రయత్నంగా బిడ్డని గుండెలకి హత్తుకుంది. తన మొహానికి ప్రవల్లిక రొమ్ము తగలగానే పాపాయి అలవాటైన ధోరణిలో నోరు తెరిచి పాల కోసం తడుముకోవడం ప్రారంభించింది. పసిదాని చిట్టినోరు తన రొమ్ముకి తగిలేసరికి ప్రవల్లిక గుండె ఒక్కసారిగా జల్లుమంది.

ఏదో తెలియని ఆనందంతో శరీరమంతా ప్రకంపించింది. ఆ ఆనందంలో స్వచ్ఛత, ఏదో దివ్యత్వం మనసుకు స్ఫురించాయి. ఈ లోపల పాలు దొరక్కపోయే సరికి పాపాయి ఏడుపు మొదలు పెట్టింది. కూతురి ఏడుపు వింటూనే శైలజ ఒక్క ఉదుటున వచ్చి పాపని తీసుకుంది.

ప్రవల్లిక పాపని అందిస్తూ, ‘‘శైలజా! పిల్లలు లేకపోతే ఏమవుతుంది?!’’ అంటూ ప్రశ్నించింది.

శైలజ చాలా తేలిగ్గా జవాబిస్తూ, ‘‘జీవితంలో పరిపూర్ణత ఉండదు. కేవలం సెక్స్‌ కోసం ఎవరూ పెళ్లి చేసుకోరు గదా’’ అనేసి పాపని తీసుకుని వెళ్లిపోయింది.

ఒక్క ముక్కలో గీత బోధించినట్టయింది ప్రవల్లికకి. తన కర్తవ్యం కూడా తెలిసొచ్చింది. ఆఫీసులో సెలవుకి చెప్పేసి, సాయంత్రానికల్లా బస్సెక్కి అత్తవారి ఊరికి బయల్దేరింది.

ఏడాది తిరక్కుండా నెల రోజుల పసికందుని ఒళ్లో పెట్టుకుని బాలసార పీటల మీద కూర్చున్న ప్రవల్లిక మొహం, ఎన్నడూ లేనంత అందంగా, ఆనం దంగా మెరుపులీనుతూంటే, ఆ మెరుపుల్ని చూస్తూ మైమరచిపోయాడు శరత్‌!!

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE