వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘‌మీ అల్లుడికి టూర్లెక్కువ. నాకేమో బదిలీలు. మీ మనవడిప్పుడు తొమ్మిదిలోకొచ్చాడు. వైజాగులో మంచి స్కూల్సున్నాయి. మీ దగ్గరికి పంపేద్దామని అంటున్నారాయన’’ అదీ అమ్మాయి ఫోను. నేను కాలేజిలో ప్రొఫెసరుగా రిటైరై ఏడాదయింది. ప్రైవేట్‌ ‌కంపెనీలో అకౌంటెంటుగా పనిచేస్తున్న నా భార్య రాధకింకా మూడేళ్ల సర్వీసుంది. ఉన్నదిద్దరమే కాబట్టి- మనవణ్ణి దగ్గరుంచుకుంటే, మాకూ చేతిలో అందొచ్చిన కుర్రాడుంటాడు. కానీ ఓ సమస్యుంది- రెణ్ణెల్లుగా నాకూ రాధకీ మాటల్లేవు. ఆలుమగల కలహమే కదా అద్దం మీద ఆవగింజో, వడ్లగింజలో బియ్యపుగింజో అనుకుందుకు లేదు. వ్యవహారం విడాకులనుకునే దాకా వచ్చింది. ఇలాంటప్పుడు మా మధ్యకి మరో మనిషి.

దాంపత్యంలో ఏకాంతం మాధుర్యాన్నిస్తే, బంధుమిత్ర సమేతం అనుబంధాన్నివడం- మాకు స్వానుభవం. కాపురం మొదట్లోనే- మేమిద్దరం, మాకిద్దరు. ఆ ఇద్దరూ నా తమ్ముడూ, చెల్లెలూ! వాళ్లు వెళ్లేక మా బావమరిదో ఏడాదున్నాడు. మా ఇల్లు చదువుకి అచ్చొస్తుందంటూ రాధవైపు నుంచో, నావైపు నుంచో ఎప్పుడూ ఒకరోఇద్దరో కజిన్సు మాతో ఉండేవారు. ఇంకా పరీక్షలనీ, ఇంటర్వ్యూలనీ, వ్యాపారం పనులనీ- కొందరొచ్చేవారు. చుట్టపు చూపులు సరేసరి!

మాకిద్దరు పిల్లలు. వైద్యసదుపాయాలు బాగున్నాయని- అత్తమామల ఆధ్వర్యంలో రెండు పురుళ్లూ ఇక్కడే పోసుకుంది రాధ. పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యే దాకా- అమ్మ, పినతల్లి, అత్తగారు, పిన్నత్తగారు వారివారి వీలునుబట్టి మాకు సాయంగా ఉండేవారు. ఎవరొచ్చినా ఇంట్లో మనుషుల్లా కలిసిపోవడంవల్ల – మా ఇల్లొక ఆహ్లాద ప్రపంచంలా ఉండేది. ఆర్థికపరంగా అరమరికలు లేకపోవడం వల్ల- అవగాహనకూ లోపముండేది కాదు.

పిల్లల చదువులయ్యాయి. పెళ్లిళ్లయ్యాయి. ఉద్యోగరీత్యా వాళ్లు దూరప్రాంతాల కెళ్లారు. తర్వాత నాన్న ఊళ్లో పొలాల్ని కౌలుకిచ్చేసి మకాం మా దగ్గరికి మార్చేశాడు. నా రిటైర్మెంటుకి రెండేళ్లముందు అమ్మ, రెణ్ణెళ్లకిముందు నాన్న- మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్లిపోయారు. ఇన్నేళ్లకి మాయింట్లో మేమిద్దరమే మిగిలాం!

మాది ప్రేమపెళ్లి కాదు. పెళ్లయ్యేక ప్రేమించు కున్నాం. ప్రేమించుకుంటూనే ఉన్నాం- నేను రిటైరయ్యేదాకా!

పెళ్లయ్యేక హనీమూన్‌ ఆలోచనే లేదు మాకు. పెద్ద కుటుంబాల నుంచొచ్చామేమో- పడకగది ప్రత్యేకంగా ఉండడమే గొప్పనిపించేది. ఐనా ఇంట్లో మేమిద్దరమే ఉండే రోజులూ ఉండేవి. మా దాంపత్యానికది శుక్లపక్షం అనేది రాధ. మిగతాది కృష్ణపక్షం.

శుక్లపక్షంలో ‘జగతిని ఉన్నది మేమిద్దరమే’! కృష్ణపక్షంలో ‘చల్లని హృదయా లకు చక్కని ప్రతిబింబం’. అదీ మా భావన.

రానున్న అమావాస్యకోసం, రెండువారాల కృష్ణపక్షాన్ని అమితోత్సాహంగా గడిపి, దీపావళి వేడుక చేసుకునే సంస్కృతి మనది. ఇంట్లో నలుగురు మసలుతుంటే- ఆహ్లాదంగా అనిపించడం సహజమే! కానీ రాధ ఒకసారి, ‘ఎన్నో దాంపత్యాల్లో శుక్లపక్షం ఏళ్ల తరబడి ఉంటోంది. మనకది తీరనికోరిక’ అన్నప్పుడు, నా మనసులో మాటే చెప్పిందా అనిపించింది.

తీరా తీరని కోరిక తీరే సమయమొస్తే- అది దూరపు కొండైపోతుందని ఇద్దరం అనుకోలేదు.

నా రిటైర్మెంటు తొలిదినాల్లో, ‘‘ఆడవాళ్ల ప్రపంచం చాలా చిన్నది. పెళ్లికి ముందు పుట్టింటి వారు మాత్రమే ఉండే ఆ ప్రపంచంలో- పెళ్లయ్యేక భర్త, పిల్లలు చోటు చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలకి వాళ్ల ప్రపంచం వేరే ఏర్పడింది. ఇక మనం మనిద్దరమే ప్రపంచంగా ఉంటూ- ఇన్నేళ్ల తర్వాత లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం’’ అంది రాధ.

‘‘నీలో ఈ కోణముందని వయసులో ఉన్నప్పుడే తెలిస్తే బాగుండేది. రిటైర్మెం టు ముందు చెప్పావ్‌!’’ అన్నాను నవ్వి.

దానికి రాధ, ‘‘రిటైర్మెంటు ఉద్యోగానికి. రొమాన్సుకి కాదు’’ అంది చప్పున.

‘‘ఇప్పుడు కాదు, ఈ మాట నువ్వూ రిటైరయ్యేక అంటే ఇంకా సంతోషిస్తాను’’ అన్నాను చిలిపిగా.

రొమాంటిక్‌గా నవ్వింది రాధ. ఆ నవ్వు ఓ నెల్లాళ్లుందేమో! ఆ తర్వాత.

బయటికెళ్లేది రాధ ఒక్కతే కాబట్టి- ఆలస్యంగా నిద్ర లేస్తున్నాం. లేచేక తను చీర సింగారించు కుంటుంటే, నేను ఫలహారం సిద్ధం చెయ్యాలి. పనిమనిషిని చూసుకోవాలి. బట్టలు వాషింగ్‌ ‌మిషన్‌లో వెయ్యాలి. తనెళ్లేక వంట చేసి, మధ్యాహ్నం ఆఫీసుకి లంచి బాక్సు తీసుకెళ్లివ్వాలి. సాయంత్రం తనొచ్చేసరికి కాఫీ అందివ్వాలి.

ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడు తలోపనీ అందుకునే వాళ్లు కాబట్టి భారం తెలిసేది కాదు. అదీకాక ఇంటిపనుల విషయంలో చెప్పింది చెయ్యడమే తప్ప బుర్ర పెట్టలేదు. అందువల్ల వంటతోసహా, ఏ పనీ సక్రమంగా ఉండేది కాదు.

నా వంట నేనే తినలేక, బయట్నించి తెప్పిద్దామ న్నాను. రాధ ఒప్పుకోలేదు, ‘రోజూ తింటే బయటి తిండీ మొహం మొత్తేస్తుంది. సెలవురోజుల్లో తెప్పించు కుందాం. అప్పుడిద్దరికీ పనుండదు. సరదాగా గడపొచ్చు’’ అంది. అలా నెల్లాళ్లు గడిచేసరికి బయటి తిండి విసుగొచ్చి- నా వంటే బాగుందనిపించింది.

‘‘నాకూ అలాగే అనిపించింది. కానీ సెలవునాడూ మీకు వంటెందుకని ఆలోచిస్తున్నాను’’ అంది రాధ.

‘‘అంటే సెలవురోజూ వంట చెయ్యవా?’’ అన్నాను ఉక్రోషంగా. వెంటనే, ‘‘నేను హోంమేకరుగా ఉన్నప్పుడు- మీ సెలవు రోజులు గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీరు హోంమేకరు మరి!’’ అని కొంటెగా నవ్వింది రాధ.

ఉక్రోషం మరింత పెరిగిపోగా, ‘‘అంటే, పగ తీర్చుకుంటున్నావా?’’ అన్నాను.

‘‘మన మధ్య పగలకు ఆస్కారముందని మీకనిపిస్తే- ఏమో, అలాగే అను కోండి. నా విషయానికొస్తే- వంట్లో ఇదివరకటి ఓపిక లేదు. ఆపైన వంటిల్లు పేరు చెబితేనే యాక్‌ అనిపిస్తోంది’’ అంది రాధ గంభీరంగా.

అర్థమైంది. తను ఆఫీసుకెడుతూ ఇంటిపన్లు చెయ్యలేదిప్పుడు. నాకాఫీసు పని తప్పింది కాబట్టి ఇప్పుడు ఇంటిపని పూర్తిగా నాదే!

గుండెల్లో రాయిపడింది. తిండిపోతును కాదు కానీ, నాకు జిహ్వచాపల్య ముంది. పులుపూ కారం ఇష్టం. నేను తినే పుల్లట్లు, చల్లపుణుకులు బయట దొరకవు. బయట దొరికే మిర్చిబజ్జీ, పకోడీలూ నాకు నచ్చేలా ఉండవు.

అవన్నీ నాకోసం నేర్చుకుని నాకు నచ్చేలా చేసి పెట్టేది రాధ. అబద్ధమెం దుకూ- తన వంట నాకు చాలాచాలా ఇష్టం.

.‘‘నీకు వంటిల్లు ‘యాక్‌’ అనిపిస్తే- నష్టం నీకే! జీవితమంతా నా వంటే తినాలి’’ అన్నాను.

‘‘మీరు నాకోసం వండిపెట్టాలి కానీ- ఈ జీవితమేమిటి? ఇంకో జన్మెత్తడానికీ సిద్ధం నేను’’ అంది రాధ.

నన్నేడిపించడానికలా అందనుకున్నాను కానీ- రోజులు, వారాలు, నెలలు- గడిచినా రాధకు నా వంటంటే విసుగు పుట్టలేదు. వాటం చూస్తే జీవితమంతా ఇలాగే గడపడానికి సిద్ధమైనట్లుంది.

ఏంచెయ్యాలో తెలియక ఎదురుదాడి మొదలెట్టాను. నాకొచ్చే పెన్షను తనకొచ్చే జీతంకంటే తక్కువ కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తోందని సెంటిమెంటు మీద కొట్టాను.

‘‘చిన్నచూపు సంగతి తెలీదు కానీ, మీరిప్పుడు నాలుగేళ్ల మన బాబుని గుర్తు తెస్తున్నారు’’ అని నవ్వేసింది రాధ.

ఆ పరిణతికి చేరిన రాధని ఎలా దారికి తేవాలో తెలియక, మిత్రుడు రాంకుమార్‌కు ఫోన్‌ ‌చేశాను. వాడూ నాతోత•టే రిటైరయ్యాడు. వాడి పెళ్లాం కూడా ఇంకా ఉద్యోగం చేస్తోంది.

నా కథ విని, ‘‘కర్ణుడికి కవచకుండలాల్లా, మగాడికి పురుషాహంకారాన్ని సహజం చేసిన సంస్కృతి మనది.అర్ధాంగి అంటూనే, తెలిసో తెలియకో- అలవోకగా భార్యల మనసు నొప్పించే స్తుంటాం. ఆ నొప్పెలాగుంటుందో తెలుసు కుందుకు- నాకొచ్చినట్లే నీకూ అవకాశమొచ్చిందన్న మాట!’’ అన్నాడు కుమార్‌.

అవతల కుమార్‌కు బదులు రాధే మాట్లాడిందా అనిపించింది, ‘‘అలాకాదు. ఇంకో మాట చెప్పు’’ అన్నాను.

‘‘పెళ్లికి ముందే రాధకి ఇంటిపనులన్నీ వచ్చని నేననుకోను. కాపురానికొచ్చి అన్నీ నేర్చుకుని, వంకలెన్నలేనంత ప్రావీణ్యం సాధించింది. అదీ ఆడవాళ్ల అంకిత భావం. అదే అంకితభావం నీకూ ఉంటే-ఈపాటికి నీకూ ఆ పనుల్లో అంతటి ప్రావీణ్యం ఉండేది. మరో మాట! నీ భార్య నీకిష్టమైన వన్నీ అడిగి తెలుసుకుని, నిన్ను మెప్పించే వంటలు నేర్చుకుంది. నువ్వెప్పుడైనా ఆమెకిష్టమైనవి వండి పెట్టాలని మాటవరసకైనా అనుకున్నావా?’’ అన్నాడు కుమార్‌.

ఎక్కడో తగిలింది నాకు. తమాయించుకుని, ‘‘నా వంటెలా ఏడ్చిందో నాకు తెలుసు. అలాంటి తిండి తింటున్నందుకైనా నామీద జాలిపడుతుందను కున్నాను’’ అని మాట మార్చాను.

‘‘నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు కానీ, నువ్వొండిందేగా తనూ తింటోంది. తన వంట పాడైతే నీ స్పందన ఎంత భీకరంగా ఉండేదో గుర్తు చేసుకో. తను నీ వంటని ఒక్కరోజైనా వేలెత్తి చూపిందను కోను. అదీ ప్రేమ! ఆ ప్రేమని ఆస్వా దించాలి కానీ జాలికోసం తాపత్రయపడకూడదు’’ అన్నాడు కుమార్‌.

‘‘‌వాటం చూస్తే- రిటైరయ్యేక నిన్ను స్త్రీవాదం పూనినట్లుంది. ఉపన్యాసాలాపి, తనని మార్చే ఉపాయమొకటి చెప్పు’’

‘‘ఆడదానికి తగిన గుర్తింపు, గౌరవం ఇమ్మనే వాళ్లను స్త్రీవాదులనే పురుషాహంకారంనుంచి బయటపడ్డమే, ఈ సమస్యకు పరిష్కారం. అది నీవల్లకాదంటావూ- విడాకుల పేరుతో బెదిరించు. నేనింకా వాడలేదు కానీ, మన ఆడాళ్లు విడాకుల అస్త్రానికి లొంగితీరుతారని నా నమ్మకం. ప్రయోగించి చూడు. ఫలిస్తే నాకూ ఉపయోగం’’ అన్నాడు కుమార్‌!

‌కుమార్‌కు తన భార్యను లొంగదీసుకోవాల నుందనీ, ధైర్యం చెయ్యలేక సర్దుకుపోతున్నాడనీ అర్థమైంది నాకు. నాకోసం కాకుండా, విడాకుల అస్త్రాన్ని వాడికోసం వాడాలన్న భ్రమని కల్పించుకుని, నాలోని అపరాధభావాన్ని తొలగిం చాను. ఒకరోజు- ‘‘నువ్వు రిటైరవడానికింకా మూడేళ్లుంది. అంత వరకూ మనం విడాకులు తీసుకుందాం’’ అన్నాను రాధతో.

రాధ చలించలేదు, ‘‘విడాకులంటే ఇన్సూరెన్సు పాలసీ అనుకున్నారా- ఇన్నేళ్లకని తీసుకుందుకు’’ అంది చిరాగ్గా.

‘‘ఆడదానికి పెళ్లి ఇన్సూరెన్సులాంటిదే మరి’’ విసిరాను.

‘‘అలాంటభిప్రాయం మీకున్నప్పుడు- మూడేళ్లకే ఎందుకు- శాశ్వతంగానే విడాకులు తీసుకుందాం. మిమ్మల్ని మనోవర్తి కూడా అడగను. కావాలంటే మీకే మనోవర్తి ఇస్తాను’’ కసిరింది రాధ.

‘‘ఇదిగో- ఈ పొగరే- ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను రిటైరయ్యేననే కదా- ఈ అలుసు’’ అన్నాను.

‘‘రిటైరయ్యేకనే ఈ కాంప్లెక్సు మీలో మొదలైంది. నేనింకా సర్వీసులో ఉన్నాన నేగా మీ అక్కసు’’ అంది రాధ. ‘‘ఇలా మాటకి మాట- ఇదివరకెప్పుడైనా చెప్పేవా?’’

‘‘చెప్పి ఉండాల్సింది. విడాకులు ఎప్పుడో తీసుకునేవాళ్లమేమో’’

పౌరుషమొచ్చింది నాకు, ‘‘సరే! రేపు వెళ్లి లాయర్ని కలుద్దాం’’ అన్నాను.

‘‘లాయర్ని కలిసేముందు – విడాకుల నియమాలూ నిబంధనలూ తెలుసు కోవద్దూ! దరఖాస్తు పెట్టేసరికి ఓ ఏడాదైనా మనమిద్దరం విడిగా ఉండాలిట’’ అంది రాధ.

గతుక్కుమన్నాను. అంటే రాధ నాకంటే ముందే విడాకులకి సిద్ధపడిందా?

‘‘సరే- ఐతే వేరే వెళ్లి ఉండు! కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడికెడతావు? మీ కంపెనీ క్వార్టర్సు ఇస్తుందేమో అడుగు. అంతవరకూ టైమిస్తాను’’ అన్నాను బింకంగా.

‘‘నేనెందుకూ వెళ్లడం! ఇల్లు నా పేరునుంది. రిటైరైన మీకు క్వార్టర్సుండవు. అద్దెకొంప వెతుక్కో వాలి. ఆ ఇచ్చే అద్దేదో నాకే ఇస్తే, మీకే ఓ వాటా ఇస్తాను’’ అందామె.

అదేమిటో, రిటైరైనప్పట్నించీ మాటల్లో రాధదే పైచేయి. ఇల్లు రాధ పేరున ఉన్నమాట నిజమే కానీ- డబ్బు ఇద్దరం సమంగా పెట్టాం. పిల్లలొస్తే ఉండ డానికి వీలని- ఏ భాగానికా భాగంలో అన్ని సదుపాయాలూ ఉండేలా ఇంటిని మూడు వాటాలు చేశాం. ఆ రోజుల్లో డబ్బైనా, ఇల్లైనా- నేను, నాది అనేది తెలియదు. అన్నీ మనవి, మావి. కానీ ఇప్పుడిది ఊహించని పరిస్థితి. ‘‘సరే, అద్దె ఎంతో చెప్పు. నా వాటా చూపిస్తే, అందులోకి మారిపోతాను’’ అన్నాను. ‘‘అద్దెదేముంది? విడాకులొచ్చేదాకా, నాకొండిపెట్టండి చాలు’’ అంది రాధ.

తనకిదంతా వేళాకోళంగా ఉన్నదని అర్థమైంది, ‘‘నీకు వంట చెయ్యడమా? ఈ రోజు నుంచి మనమధ్య మాటలే ఉండవు’’ అన్నాను కోపంగా. అని రెణ్ణెల్లయింది- మామధ్య ఇంకా మాటల్లేవు. ఇప్పుడు అమ్మాయి మనవణ్ణి పంపిస్తున్నట్లు రాధకి ఫోన్‌ ‌చేసింది. రాధ ఆ విషయం నాకు మెసేజ్‌ ‌చేసింది. ఏంచెయ్యాలి?

ళి       ళి       ళి

 ‘‘సారీరా! ఇప్పుడు రాలేను. ఇంకో పది నిమిషాల్లో ఎయిర్‌ ‌పోర్ట్టుకి వెడుతున్నా’’ అన్నాను ఫోన్లో గట్టిగా.

నిజానికి నాకు ఫోనేం రాలేదు. రాధతో మాటల్లేవుగా- ఆమెకు విషయం చెప్పడానికి అదో చిట్కా! కానీ రాధ అప్పటికే సిద్ధంగా ఉంది.

క్యాబ్‌ ‌బుక్‌ ‌చేశాను. ఇద్దరం వెనక సీట్లలో ఒకరికొకరు తగలకుండా పక్క పక్కనే కూర్చున్నాం.

విమానం టైముకే వచ్చింది. అల్లుడి స్నేహితుడు – మా మనవడు కృష్ణని మాకప్పగించి వెళ్లాడు.

కృష్ణని చూసి ఏడాదయింది. బాగా పొడు గయ్యాడు. మమ్మల్ని చూస్తూనే పరుగున వచ్చి హత్తుకున్నాడు.

ఈసారి క్యాబులో వెనకసీట్లో మేమిద్దరం- మా మధ్య కృష్ణ.

కృష్ణ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వాడికి మాతో గడపాలని ఎన్నాళ్ల నుంచో మనసుట. ‘‘డాడీ, మమ్మీ- ఎప్పుడూ ఫైటింగులే! చిరాకొచ్చేస్తోంది. చదువు పేరుతో మీదగ్గరుండాలని పట్టుబట్టి వచ్చేశాను’’ అన్నాడు.

తడబడ్డాను. మామధ్య గొడవలే ఉండవని బంధువర్గమంతా పెద్ద ఎత్తున ప్రచారముంది. కానీ కృష్ణ ఇక్కడికి రావడానికి అదే కారణమంటే- ఇబ్బందిగా అనిపించింది. తమాయించుకుని, ‘‘థాంక్సురా! ఐతే ఈ క్షణంనుంచీ, అమ్మమ్మా నేనూ ఒకరితో ఒకరు మాట్లాడుకోం. ఇద్దరం నీతో మాత్రమే మాట్లాడతాం’’ అన్నాను, నా పంతం సడలదని రాధకి సూచిస్తూ.

రాధ కిసుక్కున నవ్వి, ‘‘అవున్రా! తాతయ్యకీ నాకూ మాట్లాడుకోవడాల్లేవ్‌. ఇద్దరికీ నీతోనే మాటలు!’’ అంది. తన పంతం తనది.

కృష్ణకిది కొత్తగా తమాషాగా అనిపించింది. చాలా సరదా పడ్డాడు.

ఇంటికెళ్లేసరికి రాత్రి ఎనిమిది. ‘‘జొమాటోకి ఆర్డరిస్తాను. ఏంకావాలో చెప్పు’’ అన్నాను.

‘‘ఏంకావలో చెప్పరా! మరి నీకిష్టమని పూరీ-కూర ప్లాన్‌ ‌చేశాను’’ రాధ ఇంకా ఏదో అనబో తుండగా, ‘‘కూరంటే టమేటాయే కదూ! అదే కావాలి’’ అన్నాడు కృష్ణ ఠక్కున.

ఏమంటుందోనని రాధని ఓరగా చూశాను.

తను ఆరోజు ఆఫీసుకెళ్లింది. సాయంత్రం ఎయిర్‌ ‌పోర్టుకొచ్చింది. రాత్రి ఎనిమిది దాటేక పూరీ-కూరచేస్తానంటోంది- అదీ ‘యాక్‌’ అనిపించే వంటింట్లోకెళ్లి.

‘‘నాకు పూరీ-కూర నచ్చదురా! రవ్వదోశ తెప్పించుకుంటాన్లే జోమాటో నుంచి’’ అన్నాను.

‘‘నీతో కలిసి తింటేనే నాకు మజా! నాకోసం పూరీ-కూర తినవా?’’ అన్నాడు కృష్ణ నాదగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుని. ఆ స్పర్శలో సమ్మోహనం. తెలియని పరవశం.

ఆ రోజు విచిత్రమే! నాకోసం అరగంటైనా వంటింట్లో గడపనన్న రాధ, మనవడి కోసం గంటన్నర శ్రమించి పూరీ-కూర చేసింది. ఎప్పుడైనా రాధ పూరీ చేయాల్సొస్తే- ఒక్కసారి కూడా నోటబెట్టని నేను- ఆ రాత్రి ఆరు పూరీలు తిన్నాను. అలా జరిగినందుకు అటు రాధకీ, ఇటు నాకూ కూడా అసంతృప్తి లేదు. ఎందుకంటే మాటల్లేకపోయినా- మేమిద్దరమూ మనవడు కృష్ణ పక్షమే! కృష్ణపక్షం అన్న భావనతో- నా మానసమందెదో తళుక్కుమన్నది. ‘ఇంట్లో మనమిద్దరమే ఉంటే శుక్లపక్షం. మనమధ్య ఇతరులుంటే- అది కృష్ణపక్షం’ అది రాధ ఒకప్పుడన్న మాట!.

ఇప్పుడింట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి- మాకిది శుక్లపక్షం. కానీ మాటల్లేక మాకిది శుష్కపక్షమైంది.

మా మధ్యకు మరోవ్యక్తి వచ్చాడు కాబట్టి మాకిది కృష్ణపక్షం. అ వచ్చిన వ్యక్తి మా ఇద్దర్నీ తన పక్షం చేసుకున్నాడు కాబట్టి మామధ్య శుష్కపక్షం తొలగి పోయింది. అంటే కృష్ణపక్షమే మాకు శుక్లపక్ష మయిందా?

దాంపత్యంలో ఏకాంతం మాధుర్యాన్నిస్తే, బంధు మిత్రసమేతం అనుబంధాన్ని స్తుంది. మాధుర్యానికి అనుబంధం జత కలిస్తేనే- దాంపత్యం అనశ్వరమై దేహమున్నంత కాలం మనగల్గుతుంది.

రోజులో వెలుగు శుక్లపక్షం. చీకటి కృష్ణపక్షం. చీకటిలో తనువుకీ మనసుకీ లభించే విశ్రాంతితో- తర్వాత వచ్చే వెలుగుని సద్వినియోగం చేసుకోగలడు మనిషి. చీకటి వెలుగుల్లో ఏది లోపించినా మనిషి మనుగడకే ప్రమాదం!

రిటైరయ్యేదాకా రసమయమైన మా దాంపత్యం, నేను రిటైరయేక రసహీనమై రసభంగానికి దారితియ్యడానికి కారణం తెలిసింది. దాంపత్యంలో చిన్న కుటుంబాలనే ఇష్టపడుతున్న కొత్త తరాల సమస్యలకూ అదే కారణమనీ నాకనిపించింది.

దాంపత్య సమస్యలకు పరిష్కారం ఉమ్మడి కుటుంబవ్యవస్థలోనే ఉంటుందని నొక్కిచెప్పలేం. కానీ సమస్యపట్ల అవగాహన ఏర్పడితే- పరిష్కారం సులభమవచ్చు.

ఇప్పుడు మాయింట్లో కృష్ణపక్షం నడుస్తోంది. అది శుక్లపక్షంలా మాధుర్యాన్నిస్తోంది.

ఇది అంతం కాదు, ఆరంభమే!

 -జొన్నలగడ్డ రామలక్ష్మి

About Author

By editor

Twitter
YOUTUBE